సహదేవుడు ఆఖరివాడు కాదు

కా. రిక్కల సహదేవరెడ్డి అమరుడై ఈ నెల 28కి ముప్పై ఐదేళ్లు. హత్యకు గురయ్యేనాటికి  పాతికేళ్లు ఉండొచ్చు. అప్పటికి విప్లవోద్యమంలాగే ఆయన జీవితం కూడా తొలి దశలో ఉన్నది. కల్లోల కరీంనగర్‌లో విద్యార్థి నాయకుడిగా, సాంస్కృతిక కార్యకర్తగా ఆరంభమైన సహదేవరెడ్డి చాలా సహజంగానే కవిత్వం రాశాడు. విప్లవంలోకి రావడమంటేనే సృజన జీవిగా మారడం. మానవ కాల్పనికతను దిక్కుల నిండా ఎగరేయడం. రాజకీయ కర్తవ్యాలను, కఠోర ఆచరణను ఊహాత్మకంగా కూడా తరచి చూసుకోవడం. మానవులకే సాధ్యమయ్యే సృజనాత్మక ఆచరణను అటు విప్లవంలోకి, కవిత్వంలోకి అనువదించడం. విప్లవానికే వీలయ్యే విద్య ఇది. 

అందుకే సహదేవరెడ్డి కవిత్వం రాశాడు. పాటలు రాశాడు. పిడిఎస్‌యు ఉద్యమంలో, ప్రజా సాహిత్యోద్యమంలో భాగమయ్యాడు. భూస్వామ్య వ్యతిరేక విప్లవ పోరాటాలు ఆరంభమై అన్ని జీవన రంగాలను  స్పృశించి నూతన శక్తులను విడుదల చేస్తున్న కాలంలో సహదేవరెడ్డి  కవిగా, కార్యకర్తగా రూపాంతరం చెందాడు.  

విప్లవోద్యమం మనుషులతో ఎన్నో రకాల పనులు చేయిస్తుంది. సహదేవరెడ్డి లాంటి వేలాది, లక్షలాది మనుషుల ద్వారా విప్లవం తనలోని అన్ని అర్థాలను పలుకుతుంది. వాటిని సమగ్రత దిశగా  నడిపిస్తుంది. మనుషుల్లోని స్వప్నాలను, ఆసక్తులను, ఊహలను, సాహసాలను విప్లవమే గుర్తించి వాటికొక ఆకృతిని ఇస్తుంది. వ్యక్తీకరణను ఇస్తుంది. అందుకే చాలా మామూలు మనుషులు లెక్కలేనన్ని సాహసాలు చేస్తారు. అద్భుతమైన సృజన కార్యాలు చేస్తారు. తద్వారా స్థలకాల పరిమితులను, ప్రత్యేకతలను గుర్తెరిగి, వాటిని అధిగమిస్తూ విప్లవోద్యమాన్ని ప్రజలే ముందుకు నడిపిస్తారు. అట్లా యాభై ఐదేళ్ల విప్లవోద్యమంలో భాగమైన, అమరులైన లక్షలాది మందిని మనకు తెలిసిన కొందరు వ్యక్తులతో  పోల్చుకుంటాం. అట్లా  తనదే అయిన ప్రత్యేక వ్యక్తిత్వంతో ప్రతీకగా, పోలికగా నిలవగల విప్లవకారుడు, విప్లవ కవి రిక్కల సహదేవరెడ్డి. 

ఆయన అమరత్వం తర్వాత విప్లవ రచయితల సంఘం అచ్చేసిన ఈ పుస్తకం ఇప్పుడు మళ్లీ పునర్ముద్రణ పొందడం సంతోషంగా ఉన్నది. ఆయన చనిపోయాక ఈ ముప్పై ఐదేళ్లలో విప్లవోద్యమం అనేక అంచెలుగా, క్రమాలుగా విస్తరించింది. అనేక  ఆటుపోట్ల మధ్యనే  పురోగామిగా నిలిచింది. ఈ వ్యవస్థ మార్పు గురించి ఎవరెన్ని మాటలు చెప్పినా, అవన్నీ విలువైనవే అయినా, మార్పు తేగల తెగువ, సాహసం, దీర్ఘకాలిక వ్యూహం, దాన్ని నడపగల సిద్ధాంతం విప్లవోద్యమానికే ఉన్నాయని, వ్యవస్థకు లొంగిపోని, సర్దుకపోని శక్తి విప్లవోద్యమమే అని కూడా రుజువైన కాలం ఇది.

ఈ సమయంలో  ఈ రక్త చలన సంగీతాన్ని పునర్ముద్రించడం  కేవలం సహదేవరెడ్డిని ఈ తరానికి గుర్తు చేయడానికే కాదు. ఆ పని కూడా చేయవలసిందే. కానీ ఆయన మరణం తర్వాత ఈ ముప్పై ఐదేళ్ల విప్లవోద్యమ వికాస చరిత్రను ఆయన కూర్చిన ఈ అక్షరాల్లోని స్ఫూర్తితో  పోల్చుకోడానికి,  విశ్లేషించుకోడానికి ఇలాంటి అమరుల రచనల పునర్ముద్రణ సందర్భం కావాలి.  గత మూడు దశాబ్దాలకుపైగా సాగిన సామాజిక సంచలనాలను, సంక్షోభాలను ఈ కాలం పొడవునా ఎదిగిన విప్లవోద్యమ అవగాహనతో, ఆచరణతో అర్థం చేసుకోడానికి ఈ పునర్ముద్రణ ప్రేరేపించాలి. దేనికంటే విప్లవోద్యమంలో అమరులైన ఎవరిని తలచుకున్నా ఆ కాలమంతా కదిలి కళ్ల ముందుకు వస్తుంది. అది ఏ ఒక్కరితోనో ముడిపడినది కాకపోవచ్చు. కానీ  వాళ్ల పేరును గుర్తుకొస్తే చాలు,  ఆ గతమంతా వర్తమానంగా మారి మన ముందుకు వస్తుంది.  

దేనికంటే సహదేవరెడ్డి కవిత్వంలోని రక్త చలనం అప్పుడెప్పుడో మొదలై నేటికీ సాగుతున్నది. ఆ చలనం ఒక రూపంలోనో, ఒక తలంలోనో మొదలై, ఆదర్శవంతంగా ఆరంభమై, వాస్తవ రూపం ధరిస్తున్నది. రిక్కల సహదేవరెడ్డి లాంటి అమరులను ఆ స్థల కాలాల్లో కదిలించిందీ, తీర్చిదిద్దిందీ, వాళ్లకొక వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణను ఇచ్చింది వర్గపోరాటం.  సహదేవరెడ్డి కార్యకర్తగా చేసిన పనులు ఇప్పుడు మనకు తెలియకపోవచ్చుగాని, కవిగా ఆయన వ్యక్తీకరణల సంపుటి ఈ చిన్న పుస్తకం. మొత్తంగా విప్లవ కవిత్వంలో ఇది భాగం.  

యాభై ఏళ్లకు పైగా ఉద్వేగభరితంగా,  ధిక్కారయుతంగా  విస్తరిస్తున్న విప్లవోద్యమ కవిత్వ వ్యక్తీకరణ 1980లలో ఎలా ఉండేదో ఈ కవితల్లో చూడవచ్చు. ముఖ్యంగా ఒక మామూలు కార్యకర్త  తొలి రోజుల కవిత్వాన్ని  ఇందులో చదువుకోవచ్చు. కవిగా, వ్యక్తిగా కూడా సహదేవరెడ్డి అప్పుడప్పుడే వికసిస్తున్న పోరాట రుతువులో రాసిన కవిత్వం ఇది. ఈ సంపుటిలోని వివరాలనుబట్టి బహుశా 1987, 88 మధ్య కాలంలో ఈ కవితలు, పాటలు ఆయన రాసి ఉండవచ్చు. వ్యక్తిగా ఆయన జీవితకాలమే చిన్నది. అందులోనూ సృజనకారుడిగా  మరీ తక్కువ. కానీ అందులో అంతులేని ఆత్మవిశ్వాసం ఉన్నది. ఆశావాదం ఉన్నది. చారిత్రక దృష్టి ఉన్నది. విప్లవ విజయంపట్ల మొక్కవోని నమ్మకం ప్రతి కవితలో ఉన్నది. విప్లవమే చేయదల్చుకుంటే ఏముండాలో అవన్నీ ఆయనకు ఉన్నాయి. అవన్నీ ఈ   కవితల్లోకి ప్రసరించాయి.  కార్యకర్తగా రిక్కల సహదేవరెడ్డిలో రెక్క విప్పిన ఊహా ప్రపంచం ఇందులో కనిపిస్తుంది.  తీవ్రమైన ఉద్వేగంతో, కసితో, సున్నితత్వంతో, సాహసంతో తన యవ్వన కాలపు రక్త చలన సంగీతాన్ని వినిపించాడు. సారాంశంలో ఆనాటి యువ విప్లవకారుడి ముద్రను ధరించిన కవిత్వం ఇది. 

   బహుశా అప్పుడప్పుడే విప్లవ విద్యార్థి ఉద్యమంలోకి వస్తూ వస్తూ ఆయన కవిత్వాన్ని వెంటేసుకొని వచ్చి ఉంటాడు. పాటతో ఉద్యమంలోకి ప్రవేశించి ఉంటాడు.  అప్పటికి విరసంలోకి, విప్లవోద్యమంలోకి వచ్చిన రెండో తరం  విప్లవ కవిత్వాన్ని చాలా ముందుకు తీసికెళ్లింది. విప్లవోద్యమ విస్తరణలాగే విప్లవ కవిత్వం వస్తు శిల్పాల్లో అపారమైన వైవిధ్యాన్ని సంతరించుకుంది. విప్లవోద్యమ ఆచరణే విప్లవాన్ని అర్థం చేసుకోవాల్సిన దృక్పథంగా  విస్తరించింది. కొత్త తరం విప్లవకారులు, కొత్త పోరాట క్షేత్రాలు, కొత్త పోరాట రూపాల్లాగే కొత్త తరం సాహిత్యకారులు  ముందుకు వచ్చారు. కేవలం వయసు రీత్యా కాదు. సహదేవరెడ్డిలాంటి ప్రత్యేకంగా లిఖిత సాహిత్య నేపథ్యం లేని వాళ్లు సాహిత్యకారులయ్యే అద్భుత క్రమాన్ని విప్లవోద్యమం అప్పటికే సాధించింది. అప్పటికి విప్లవోద్యమంలో లోపలా, బైటా సాహిత్యం రాస్తున్న ప్రముఖులు ఎందరో ఉన్నారు. కాకపోతే వాళ్లకు ఎక్కడో ఒకచోట సాహిత్య, మేధో నేపథ్యం ఉన్నది. కానీ 1980ల ఆరంభం నుంచే భిన్న సామాజిక, సాంస్కృతిక, కుటుంబ నేపథ్యాల నుంచి సాహిత్యకారులు రూపొందే క్రమం ఆరంభమైంది. చాలా పరిమిత ప్రాంతంలో, వర్గపోరాటం ప్రాథమిక దశలో ఉన్న ఆ రోజుల్లోనే ఇలాంటి సృజనాత్మక క్రమాన్ని విప్లవోద్యమం సాధించింది. అది ఈ యాభై ఐదేళ్లలో అనేక దశలను అధిగమించింది. అనేక సంక్లిష్ట క్రమాల్లో కొనసాగుతున్నది. సహదేవుడులాంటి వాళ్లు వేల మంది మామూలు ప్రజలు, కార్యకర్తలు, అనేక భాషల్లో,  లిఖిత, మౌఖిక, దృశ్య కళా సాహిత్య ప్రక్రియల్లోకి వచ్చారు. 

1980లలో ఊపందుకున్న ఈ క్రమంలో  సహదేవరెడ్డి భాగం. అతి చిన్న వయసులోనే ఆయనను రాజ్యం హత్య చేసింది. ఆయన ఊపిరి నిలిచిపోయింది. కవిత్వమూ ఆగిపోయింది. కానీ ఆయనలాంటి వాళ్ల కార్యకర్తృత్వ కవిత్వ రచన దేశవ్యాప్తంగా ఎంత ఎత్తుకు ఎదిగిందో ఆశ్చర్యం కలుగుతుంది. ఆయన జీవించి ఉంటే  ఇంకెంత సాంద్ర కవిత్వం రాసి ఉండేవాడు? తనలోని సృజనాత్మకతకు ఎంత పదును పెట్టుకొని ఉండేవాడు? ఆయన కవిత్వం ఎన్ని దశలను అధిగమించి ఉండేది? అని  ఇందులోని ప్రతి కవితా అలాంటి ఆశ కల్పిస్తుంది.  

అందుకే  ముప్పై ఐదేళ్ల కింద మరణించిన కవి గురించి రాయడమంటే గతాన్ని తలపోసుకోవడం కాదు. గత వర్తమానాల మధ్య జరిగిన రాపిడిని అర్థం చేసుకోలేక వగచడం కాదు. విప్లవానికి, మార్పు క్రమాలకు ప్రేక్షకులుగా, పరిశీలకులుగా మారడం కాదు.  ఆనాటి  ఆయన ఊహల్లో, స్వప్నాల్లో, విశ్వాసాల్లో నిర్మాణమవుతున్న వర్తమానాన్ని తరచి చూడటం. విప్లవాన్ని దాని సకల స్థితుల మధ్య చూడటం. సహదేవరెడ్డి కవిత్వంలో ఉన్నది అప్పటి భావోద్వేగాలే కాదు. అప్పటి స్థితే కాదు. అదేదో గడచిపోయింది కాదు. తొలినాళ్ల సౌందర్యం కాదు. కేవల ఆకర్షణ కాదు. సహదేవరెడ్డి లాంటి అమరులు విప్లవాన్ని తమకు బైట చూసుకొని ఉండరు. విప్లవోద్యమంతో అభేదంగా అల్లుకొనిపోయి ఉంటారు. ఈ కవిత్వంలోని వస్తు శిల్పాల గురించి కూడా మాట్లాడవచ్చుగాని, ఇందులో ఏదైనా సౌందర్యం, ప్రభావశీలత ఉన్నదంటే అది కవికి విప్లవోద్యమంతో ఉన్న అభేద భావన. 

విప్లవంలో కొనసాగదల్చుకున్న వాళ్లకు ఉండాల్సిన తార్కిక దృష్టిని సహదేవరెడ్డి ఈ కవిత్వంలో ప్రదర్శించాడు. ఇందులోని రెండు మూడు  కవితల్లో ఒక రకమైన వాద పద్ధతి ఉంది.  ఈ ప్రపంచాన్ని, విప్లవాన్ని  అర్థం చేసుకోడానికి అది ఆయనకు దోహదం చేసి ఉంటుంది. అందుకే 1988 మే 25న అరెస్టయి పోలీసుల చేతిలో చిత్రహింసలు అనుభవించినా లొంగిపోలేదు. చివరికి 28న కాల్చేసి ఎన్‌కౌంటర్‌ అన్నారు. ఆయన శరీరంలోని రక్త చలనం అప్పటికి ఆగిపోయింది. కానీ ఆయన కవి, విప్లవకారుడు. అందువల్లే ఆ రక్త చలన సంగీతం మనకు ఇంకా వినిపిస్తూనే ఉంది. వేలాది మంది మృత వీరుల, అమర కళాకారుల శరీరాల్లోంచి చిందిన నెత్తుటి ధారలు  వినిపిస్తున్న  సంగీతం అది. ఈ తరం కూడా వినవలసిన  రక్త చలన సంగీతం ఇది. వినండి. చదవండి.

కవి, రచయిత, విమర్శకుడు, వక్త. విరసం కార్యవర్గ సభ్యుడు. గతంలో విరసం కార్యదర్శిగా పని చేశారు. రచనలు: 'కలిసి పాడాల్సిన గీతమొక్కటే' (కవిత్వం), 'అబుజ్మాడ్' (కవిత్వం), 'నేరేడు రంగు పిల్లవాడు' (కథలు), 'జనతన రాజ్యం', 'సృజనాత్మక ధిక్కారం'. రెండు దశాబ్దాలుగా మార్క్సిస్టు దృక్పథంతో విమర్శలో కృషి చేస్తున్నారు.

Leave a Reply