“సమూహ”పై సనాతన మూక ఉన్మాద దాడిని ఖండిద్దాం

“సమూహ” అనే సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో “లౌకిక విలువలు – సాహిత్యం” అనే అంశం మీద కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్ హాల్ లో 28 ఏప్రిల్,  2024న సభ నిర్వహించారు. ఆ సభకు తెలుగు రాష్ట్రాల నుండి అనేక మంది సాహిత్యకారులు హాజరయ్యారు. సభలో వక్తలు మాట్లాడుతుండగా ఓ తాగుబోతు ఉన్మాద మూక ప్రవేశించి వక్తల మీద, సభా నిర్వహకుల మీద దాడి చేసింది.

ఆ సభలో “సాహిత్య రాముడు-రాజకీయ రాముడు,”, “డీకోడింగ్ రామాయణ” అనే  అంశాల మీద కూడ ఉపన్యాసం, చర్చ ఉండటంతో “రాముడి గురించి మీకెందుకు?” అని బూతుపురాణం వల్లిస్తూ దాడిచేశారు. అనేక మందిని గాయపరిచారు.

“ప్రజాస్వామ్య పరిరక్షణ” అనే హామీనిచ్చిన ప్రభుత్వంలో పనిచేస్తున్న పోలీసులు ఎప్పటి మాదిరిగానే తమకు కళ్ళు, చెవులు అని చెప్పుకునే ఏవీబీపీ గుండాలకు తమ సహాయ సహకారం అందించారు. దాడిని ఆపుతున్నట్లు నటించారే తప్ప, ఆ పని చేయలేదు.  ప్రజాస్వామ్య పరిరక్షణ అంటే ఇదేనేమో!

ఈ దాడిని “కొలిమి” తీవ్రంగా ఖండిస్తోంది. ఈ దాడి అనేక విషయాలను మళ్ళీ మనముందుకు తెచ్చింది. ప్రధానంగా ప్రజాస్వామ్య, లౌకిక శక్తులు ఒక సమూహంగా మారుతున్నారంటేనే మతోన్మాద శక్తులకు భయం. ఎందుకంటే వాళ్ళు కొన్ని ప్రాథమిక ప్రశ్నలు వేస్తారు. వాటిని ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఒక వ్యాసమో, కవితో, పాటో రాస్తారు. రాముడి పేరు మీద దేశంలో జరుగుతున్న అన్ని దాడులను వ్యతిరేకిస్తారు. రాముడు కాషాయ దండు చేతిలో ఎట్లా ఆయుధంగా మారిండో చర్చకు పెడతారు. మతం మత్తులో మునిగిన మూకకు ఇవేవీ అర్థం కావు. అర్థం చేసుకునే ప్రయత్నం కూడా చెయ్యరు. అందుకే వాళ్ళు కొన్ని నినాదాలకు, కొంత పిడివాదనకు పరిమితమవుతారు. తమ వాదన గెలువదని తెలిసినప్పుడు భౌతిక దాడులకు దిగుతారు.

ముఖ్యంగా తాము అనుకున్నట్లు రామమందిరం ఓటు బ్యాంకుగా మారడం లేదని గుర్తించిన కాషాయ మూక ఇప్పుడు రాముడిని తమ భౌతిక దాడులకు ముడి సరుకుగా మార్చుకుంటున్నది. అందులో భాగమే హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మసీదులపై రామబాణం ఎక్కు పెట్టడం, సమూహపై మతోన్మాద గూండాలు దాడిచెయ్యడం. ఈ సనాతన శక్తుల హంతకభాష మనకు తెలిసిందే. దానిని ఎదుర్కోవడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిందే.

అయితే ఈ దాడి సందర్భంలో దాడికి ప్రత్యక్ష సంబంధం లేకపోయినా కొందరిని తప్పక ప్రశ్నించాల్సిందే. అందులో మొదటగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని. ప్రజాస్వామిక పరిరక్షణ అని ఎంతో ఊదర కొడుతున్నారు కదా!, ఆచరణలో అది ఎందుకు జరగడంలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వం కూడా మునుపటి ప్రభువుల మాదిరిగానే పౌరహక్కుల హామీ ఇచ్చి వాటిని ఆచరణలో తుంగలో తొక్కేస్తుందా అని అడగాల్సిందే. సమూహ మీద దాడి చేసిన మూకను గుర్తించి వారిని హత్యాయత్న నేరం కింద అరెస్ట్ చేసి విచారణ జరపాలి. పౌరహక్కుల పరిరక్షణకు హామీ పడాలి.

మాదిగ రిజర్వేషన్ అమలు కోసం మోడీని మళ్ళీ గెలిపించాలని కన్నీళ్ళు పెట్టుకున్న మందకృష్ణ మాదిగ తన వరంగల్ లోనే సమూహపై జరిగిన దాడిపై స్పందించాలి. ఇదే సందర్భంలో సమాజం సంఘీ శక్తుల ప్రమాదానికి గురవుతుంది దానిని ఎదుర్కొనడానికే కాంగ్రెస్ లో చేరుతున్న అని ప్రకటించిన వరంగల్ జిల్లాలో సీనియర్ నాయకుడు కడియం శ్రీహరి ఇప్పుడు “సమూహ” మీద దాడి చేసిన సంఘీ గుండాల మీద చర్య తీసుకోవడానికి బాధ్యత వహించాలి. ఆయనే కాదు, బీజేపీకి వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలబడివున్న అన్ని రాజకీయ పార్టీలు, సంస్థలు లౌకికవాదం మీద జరిగిన దాడిని ఖండించాలి.

త్వరలోనే ఈ దాడులు మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉన్నది. వాళ్లు ఓటమి భయంలో ఉన్నారు. అందుకే మనల్ని భయపెడుతారు. మనం భయపడితే వాళ్లు బలపడుతారు. వాళ్లకు ఆ అవకాశం ఇవ్వొద్దు. మన అక్షరాలకే వణికిపోయే కాగితం పులులు వాళ్లు. అందుకే అక్షరాలను పదును పెడదాం. సామూహికంగా సాహిత్యాన్ని సాన పడదాం. సమాజం కోసం హక్కుల గొంతుకవుదాం.

“సమూహ” లౌకిక, ప్రజాస్వామిక ఆకాంక్షలు వర్థిల్లాలి.

2 thoughts on ““సమూహ”పై సనాతన మూక ఉన్మాద దాడిని ఖండిద్దాం

  1. సమూహ మీద దాడి పిరికిపందల చర్య

Leave a Reply