సమూహంలో గీతం ఎండ్లూరి సుధాకర్

2022 జనవరి 28 ఉదయపు తొలివార్త ఎండ్లూరి సుధాకర్ మరణం.ఆ రోజు అలా తెల్లవారుతుందని అనుకోలేదు.  నమ్మనని మనసు మొరాయించింది . మనోజ్ఞ పెళ్లి చేసింది వారం క్రితమే కదా !? హైదరాబాద్ లో విందు చేసి నాలుగు రోజులే. ఆనాడు  సుధాకర్ గారిని చూసి మాట్లాడే అవకాశాన్ని వాడుకోనియ్యని ఒమైక్రాన్ వ్యాప్తి తీవ్రత ముందు నిస్సహాయంగా నిలబడి సుధాకర్ గారిని చివరి చూపు చూడటానికి , మానస మనోజ్ఞలను దగ్గరకు తీసుకొని ఓదార్చటానికి వెళ్లలేక పోతున్న దుఃఖం  నన్ను కుదిపేసింది. అయినవాళ్ల కోసం , నమ్మిన దానికోసం ఎప్పుడూ ఏ రకమైన హద్దులూ లేకుండా, సందేహాలు లేకుండా రెక్కలు కట్టుకు ఎగిరిపోయే నన్ను వెనక్కు లాగిన కాని కాలపు కర్కశత్వం ఎండ్లూరి మరణం కలిగించిన దుఃఖాన్ని  అనేకరెట్లు పెంచింది. దుఃఖ తీవ్రతను తట్టుకొని నిలబడటానికి ఆసరా జ్ఞాపకాలే కదా !? 

ఎండ్లూరితో నాకు ముప్ఫయి ఏళ్ల స్నేహం. అవి ఆయన రాజమండ్రిలో తెలుగు విశ్వవిద్యా లయం సాహిత్య పీఠంలో పని చేస్తున్న రోజులు.నేను  సెమినార్లలో పాల్గొనటానికో,  రిఫ్రెషర్ కోర్సు రిసోర్స్ పర్సన్ గానో తరచు తెలుగు యూనివర్సిటీకి వెళ్తున్నరోజులు. అక్కడ నాకు సుధాకర్ గారితో పరిచయం. కవిత్వం వ్రాస్తారని తెలుసు. కానీ  అంతకంటే ఎక్కువగా ఎండ్లూరి సుధాకర్,   బేతవోలు రామబ్రహ్మం,వూళ్ళో నుండి వచ్చిన సాహితీమిత్రులతో కలిసి   కూర్చొని చేసే సాహిత్య సంభాష ణల తోనే నాకు ఆయన సంప్రదాయ పాండిత్యం , ఆధునిక దృష్టికోణం తెలిసి వచ్చాయి. దళిత స్త్రీవాద సాహిత్యాలపై ఆయన పరిశీలనలు, వ్యాఖ్యానాలు,  ఆసక్తితో చేయిస్తున్న పరిశోధనలు  ఆయనపట్లఅభిమానం కలిగించాయి. 

ఆ సమయంలో ఆయన ‘మల్లెమొగ్గలగొడుగు’ పుస్తకం వచ్చింది. రాజమండ్రిలో ఆ పుస్తక పరిచయ సభ ఏర్పాటు చేశారు. ఇలాంటి సభలు జరుగుతుంటే  ఆ సమయంలో యూనివర్సిటీకి అతిధులుగా వెళ్లిన మా వంటి వాళ్లకు ఆ సభలలో ఎదో ఒక పాత్ర ఇచ్చే సంప్రదాయాన్ని వాళ్ళు ఏర్పరచుకొని వున్నారు. ఆరకంగా అప్పుడు అక్కడ ఉన్న నాకు మల్లెమొగ్గల గొడుగు పుస్తకం ఇచ్చేసి మర్నాడు సభలో మాట్లాడాలి అన్నారు. చేతికి వచ్చింది మల్లెమొగ్గల గొడుగు. పేరు చాలా ఫాన్సీ గా, కవితాత్మకంగా ఉంది. లోపల ఏముందోనని కుతూహలంతో చదవటం మొదలుపెట్టాను. ఆ రాత్రి కొత్తప్రపంచంలోకి ప్రవహించాను.నన్ను స్నేహంగా చెయ్యి పట్టుకొని మాదిగ వాడలకు, వాడలలోని బంధుజన సమూహంలోకి తీసుకొనిపోయి ఒక వాస్తవిక ప్రపంచపు కాఠిన్యాన్ని, సౌందర్యాన్ని సాపేక్షసంబంధంలో నీవే తెలుసుకో అంటూ గిర్రున తిప్పి వదిలిన పుస్తకం అది. కారంచేడు , చుండూరు చూస్తూనే ఉన్నా ఆ తరువాత వస్తున్న భావోద్విగ్న కవిత్వ వాతావరణం చుట్టూ వ్యాపించే ఉన్నా అంతరంగాన్ని పట్టి కుదిపేసి నన్ను ప్రక్షాళితం చేసిన పుస్తకం అంటే అదే. మల్లెమొగ్గల గొడుగుతో ఎండ్లూరి సుధాకర్ నా హృదయంలోనూ, బుద్ధిలోనూ ఉన్నత స్థానం ఆక్రమించాడు.  మర్నాటి  సభలో ఇంకెవరెవరు ఉన్నారో , మాట్లాడారో ఇప్పుడు నాకు అంతగా గుర్తులేదు. కానీ మాట్లాడివచ్చాక నేనది వ్రాసి ‘వార్త’ ఆదివారం అనుబంధానికి  పంపకుండా ఉండలేకపోయాను. 2000 మే 21 సంచికలో అది ప్రచురించబడింది. 

ఎండ్లూరి సుధాకర్  ముందుగా కవి.1992 లో వేసిన కవితా సంపుటి  వర్తమానం మూడేళ్లు తిరిగేసరికి  రెండవ ముద్రణ కూడా వచ్చింది. అది వచ్చే నాటికి  దండోరా ఉద్యమం ఊపు అందుకొంటున్నది. వర్తమానంతో సంబంధంలోనే ఉన్నానా అని కవిలో మొదలైన  విచికిత్స 1995 మే చివరకు ‘కొత్తగబ్బిలం’ దీర్ఘ కావ్య రచనకు నాందీ పలికింది.  1998 సెప్టెంబర్ నాటికి పూర్తయి అచ్చయింది.  పరిశోధన కోసం జాషువాను ఎంత అధ్యయనం చేసాడో గానీ 40 ల నాటి గబ్బిలాన్ని అర్ధ శతాబ్ది తరువాతి వర్తమాన అవసరాలరీత్యా నవీకరించాడు. నడుస్తున్న మాదిగ దండోరా ఉద్యమానికి కొత్తగబ్బిలం తో మద్దతు పలికాడు. 

కొత్తగబ్బిలం ప్రచురణ కంటే కొన్నిరోజుల ముందు  డక్కలిపిల్ల కవిత వచ్చింది. మాదిగల ను ఆశ్రయించి బతికే సంచార భిక్షుక సమూహం అయిన డక్కలి వాళ్ళ బిడ్డ కవికి ఒక బాల్యపు జ్ఞాపకం. వర్తమాన దండోరా ఉద్యమం కోరుతున్న  వర్గీకరణలో ఆ పిల్లకు వాటా వుంది కదా అన్న స్పృహ కలిగిన కవి ఆదిశగా ఆ పిల్ల ప్రశ్నఆచరణ తనలో కలిగించే స్పందనను సంభావిస్తూ  “ నాలోని ‘కోమా’ తనం మీద /  కొత్త యుద్ధం ప్రకటిస్తున్నట్లే వుంది”  ఆ కవితను ముగించాడు.  అలాంటి అనామకులు, సమాజంలో కనబడకుండా అంచులకు నెట్టివేయబడ్డవాళ్లు హక్కులు అడగటం మొదలు పెడితే కోమాలో ఉన్నవాళ్లకు అంటే స్పృహలేనివాళ్లకు స్పృహ కలిగి తీరాల్సిందే అనటం అన్ని అవకాశాలు, ప్రయోజనాలు పొందుతున్న మాలల కు అభివృద్ధిలో మాదిగల వాటా  గురించిన స్పృహ ఎంత ఉండాలో  మాదిగలకు ఉపకులాలల  వాళ్ళ కు అభివృద్ధిలో అందవలసిన వాటా గురించిన స్పృహ అంతగానూ ఉండాలి. అది సూచించటమే కాదు , కోమా అనే మాటకు పాద సూచికలో కోస్తా మాల అన్న వివరణను ఇయ్యటంలో ఉన్నది ఆత్మవిమర్శ. సుధాకర్ తెలంగాణా వాడైనా ఉద్యోగరీత్యా అప్పుడు ఉంటున్నది రాజమండ్రిలో. ఆయన భార్య మాల. నెల్లూరు మహిళ. ఆ పరిస్థితులలో మాల  మాదిగ  ప్రయోజన వైరుధ్యాల నుండి పొడసూపిన దండోరా ఉద్యమం పట్ల తాను తీసుకోవలసిన వైఖరి సున్నితంగా పరిష్కరించుకోవలసినది. వంటబట్టిన కోస్తా మాల తనం వదిలించుకొంటూ   మాదిగ అస్తిత్వ స్పృహను తిరిగిపొందటం  అంటే అది తనలోని తన మీద తాను చేయవలసిన యుద్ధమే.   ఆ అవగాహన కలిగాక ఇక జరిగేది నిబద్ధతను ప్రకటించటమే.ఆ రకంగా  ఆయన వర్తమాన డిమాండ్లకు అనువుగా న్యాయమైనదాని వైపు నిలబడి వ్రాయటానికి సిద్ధమయ్యాడు కనుకనే ఎప్పటికీ  వర్తమానకవిగా మిగిలాడు. వర్తమానంలో నిలబడి కాలికింది భూమిపొరలలో భవిష్యత్తు కోసం జరుగుతున్న చలన చాలన  సవ్వడుల తరంగాల ఉధృతిని   శరీరంతో, మనస్సుతో బుద్ధితో కలిపి కొలుస్తాడు. ఆ ధ్వనిని, ఉధృతిని కవిత్వంగా చేసి వదులుతాడు. ఆచరణకు మానవీయ సంస్పందనా శక్తిని అద్దుతాడు.

 మాదిగ దండోరా ఉద్యమానికి మద్దతు కొత్తగబ్బిలం దీర్ఘ కవితలో ఒక భాగం మాత్రమే. ఆ దండోరా ఉద్యమాన్ని నినాదంగా వినిపించటం కాక జీవితంగా ప్రదర్శించాలంటే జనజీవన సంబంధాలు, సంఘర్షణలు ప్రధానమైన కథలు, నవలలు అవసరం అవుతాయి. సజీవ మానవ సంబంధాల నేపధ్యం , సందర్భం నుండి వచ్చే సాహిత్యం వల్ల ఉద్యమ సంబద్ధతను నిరూపిస్తూ , సామాజిక సానుకూలతను,  సమ్మతిని సమకూర్చే సాంస్కృతిక కర్తవ్యం నెరవేరుతుంది. అది తెలిసిన వాడు కనుకనే ఎండ్లూరి సుధాకర్   మల్లె మొగ్గల గొడుగు కింద ఒక సంఘటనను,  ఒక సన్నివేశాన్ని, ఒక సందర్భాన్ని ఆశ్రయించి భిన్న జీవిత శకలాలను ప్రదర్శిస్తాడు. వాటిల్లో తాను భాగంగా వుంటూనే  మూడో మనిషిలా వ్యాఖ్యానిస్తాడు. ఈ మల్లెమొగ్గల గొడుగు కథలు కులానికి కూటితోటి, మతంతోటి, చదువుతోటి, శౌర్యంతోటి, భూమితోటి, ఆర్థిక స్థితిగతులతోటి వుండే సంబంధ వైరుధ్యాలను చిత్రించటమే కాక కులానికి రాజకీయాలకు వుండే వైరుధ్యాలను కూడా విమర్శనాత్మకంగా మనముం దుంచాయి. భిన్న కథలైనా చినగురయ్య వంశాన్ని  , ఆ వంశ బంధువులు చిన్నమ్మలు, పెద్దమ్మలు చిన్నాయనలు , పెద్దయ్యలు. అక్కలుబావలు, అన్నలు వదినలు నాయనమ్మలు, అమ్మమ్మలు, తాతలు , మేనత్తలు , మేనమామలు, మేనత్త మేనమామ పిల్లలు అట్లా మూడుతరాల జీవితలను చుట్టుకొని ప్రవర్తించేవి కావటం వల్ల ,సుఖ దుఃఖాలు, సమస్యలు ఒకే రకం కావటం వల్ల,  మాదిగల జీవనవేదనను, జీవిత  మాధుర్యాన్ని ఏకకాలంలో చూపించే సామాన్యలక్షణం అంతఃసూత్రగా ఉంది కనుక మొత్తం కలిసి ఒక సమగ్ర జీవితాన్ని ప్రతిఫలించిన నవలను చదివిన అనుభూతి కలుగుతుంది.  22 ఏళ్ల తరువాత మళ్ళీ ఇప్పుడు ఆ కథలను చదివి ఎండ్లూరి సుధాకర్ ఆశించినది ఏ మేరకు సాధించబడిందో , ఆ కథలలో మనుషులు వేసిన ప్రశ్నలకు సమాధానాలు ఏ మేరకు దొరికాయో నిగ్గు తేల్చవలసే ఉంది. 

కవిత్వానికి కొత్తవస్తువును, పదజాలాన్ని, ఉపమా ప్రపంచాన్నిమొత్తంగా కొత్త దృష్టిని ఇచ్చాడు ఎండ్లూరి సుధాకర్. నెత్తుటి ప్రశ్న (1985-92 )నుండి నీలిక ( 1996) మీదుగా నిమ్నలిపి  ( 2000) వరకు ఆయన చేసిన కవితా ప్రయాణం , పరిణామం అర్ధవంతమైనది. ‘నేనింకా నిషిద్ధ మానవుడ్నే’ అన్న స్వస్వరూప జ్ఞానం కలిగిన మనిషి కోరుకొనేది విముక్తినే. సంప్రదాయాలను ధిక్కరించటం, హద్దులను అధిగమించటం, బందిఖానాలను బద్దలు కొట్టటం అనివార్యంగా జరగవలసినవే. వాటికి రకరకాల వ్యక్తీకరణలు ఆయన కవితలు. విముక్తి కోరే మానవులు తమదైన సిద్ధాంతాన్ని, కార్యక్రమాన్ని నిర్మించుకోవాలి. ఆ దిశగా ఎండ్లూరి కవిత్వాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. 

సాంస్కృతిక రంగంలో ప్రత్యేకించి సాహిత్య రంగంలో కులీన కావ్యనాయికను తొలగ దోసి  ‘చండాల’ నాయికను ప్రతిష్టించటానికి సుధాకర్ చేసిన సున్నితమూ , సుందరమూ అయిన గొప్ప ప్రయత్నం నీలిక కవిత. మల్లెమొగ్గల గొడుగు తరువాత నాకు చాలా ఇష్టమైనది ఈ  కవిత. కావ్య లక్షణాలు ఏమిటి? కావ్యానికి కథ ఎక్కడినుండి తీసుకోవాలి? నాయికానాయకులు ఎవరు? వాళ్ళ లక్షణాలు ఏమిటి? అని చర్చించిన అలంకార శాస్త్ర గ్రంధాలు అనేకం. అవి నాయిక లక్షణాలను పురుషుడి అనుభవకోణం నుండే నిర్దేశించాయి. అవి స్త్రీలను స్వతంత్ర వ్యక్తులుగా చూసినవి కావు. స్త్రీలకు గౌరవకరమైనవీ కావు. ఎండ్లూరి సుధాకర్ దళిత శ్రామిక స్త్రీని కావ్యనాయికగా ప్రతిపాదించిన తీరు స్త్రీల ఆత్మగౌరవ పతాక ను ఎగరేసినట్లుగా ఉంది. శ్రమైక జీవన సౌందర్యం వల్ల ఆమె నల్ల కావ్యానికే కాదు ఏ రంగు కావ్యానికైనా నాయిక కాగలిగిన ఉదాత్తతను స్వాయత్తం చేసుకొన్నది.   స్త్రీల కోణంనుండి ప్రత్యేకించి సాహిత్య సాంస్కృతిక రంగాలలో ప్రత్యామ్నాయ కళా సూత్రాలను, ప్రజాస్వామిక భావజాలాన్ని సృష్టించటం , పరివ్యాప్తం చేయటం అనే పనిని సుధాకర్ కవిత్వం ఎలా నిర్వర్తించిందో ప్రత్యేకంగా అధ్యయనం చెయ్యాలి. సుధాకర్ కవిత్వంలోని ఉపమ, రూపకం మొదలైన అలంకారాలను ప్రత్యేకంగా పరిశీలిస్తే కొత్త జీవన అనుభవాలు , ఆ అనుభవాల నుండి చేసే పరిశీలనలు కలుపుకొంటూ పోతేనే అలంకరశాస్త్రాలు సమగ్రం అవుతాయని తెలిసివస్తుంది.   

నారింజరంగు వేషంలోని ద్వేషాన్ని కనిపెట్టి నిరసించిన కవిత ‘నిమ్నలిపి’. “ నువ్వు హిందూ సముద్రమంత హింసవు” అని హిందూత్వాను బోనులో నిలబెట్టాడు. ఈ కవిత  వ్రాసి ఇప్పటికి 22 ఏళ్ళు. ఆ హిందూత్వ హింస ఎన్ని రూపాలలో ఎంత నిరంకుశ శక్తిగా విస్తరిస్తున్నదో మనం చూస్తూనే ఉన్నాం.  వర్తమానం అర్ధం చేసుకొనటానికి పనికివచ్చే కవిత్వం వ్రాసిన సుధాకర్ ఎప్పటికప్పుడు మనం అధ్యయనం చేయవలసిన కవి.  

విశ్వవిద్యాలయం పనులమీద, సెమినార్ల వేళ  సుధాకర్ గారు, నేనూ  ఎక్కడ ఒకచోట కలుస్తూనే ఉండేవాళ్ళం. సంప్రదాయ సాహిత్యాన్ని దళితకోణం నుండి విమర్శకు పెట్టండి అని తరచు అడుగుతుండేదాన్ని. అవును మాడమ్ చెయ్యాలి అంటూనే మొదలు పెట్టలేదు. కానీ 2011లో గోసంగి అనే దళిత దీర్ఘ కావ్యం ప్రచురించాడు. ఆముక్తమాల్యదలోని మాలదాసరి కథగా ప్రసిద్ధమైన దానిని కొత్త దళిత అవగాహన తో వచన కావ్యంగా తిరిగి వ్రాసాడు. విష్ణు మాయ నుండి బయటపడి వాస్తవంలోకి వస్తే కలిగే స్వస్వరూపజ్ఞానం ప్రశ్నకు, తిరుగుబాటుకు కారణం అవుతుందని   వర్తమాన సామాజిక చైతన్యంతో నిరూపించిన కావ్యం ఇది. కొత్తచూపుతో  విమర్శకు కూడా ఎండ్లూరి కి  అనువైంది, అభిమానమైంది కవిత్వ సృజనకలాపమే అని నాకు అర్ధం అయింది. 

2010 నుండి పుట్ల హేమలత సుధాకర్ భార్యగా కాక ఒక రచయితగా ప్రజాస్వామిక రచయిత్రుల నిర్మాణంలో భాగస్వామిగా నాకు మంచి స్నేహితురాలు. కవిత్వం , కథలు వ్రాయటం, విహంగ ఆన్ లైన్ పత్రిక నడపటం, మా సంస్థ కార్యకలాపాలు , పుస్తకాల ప్రచురణలు, సదస్సులు , సమావేశాలు చాలా బాగుండేది.  కథలు వ్రాస్తూ సాహిత్య సంవాదాలలో ఆసక్తితో హేమలత కూతురు మానస  కూడా ప్రజాస్వామిక  రచయిత్రుల వేదిక లోకి రావటంతో సుధాకర్ గారి కుటుంబం తో నాకు మరింత సాన్నిహిత్యం ఏర్పడింది. 2019 లో హేమలత  హఠాత్తుగా మరణించింది. . ఆమె ,  ఆమె పనిచేసిన ప్రరవే, ఆమె రచనలు అన్నీ ప్రేమాస్పదమైనవే ఆయనకు. ఆమెను గురించి మాట్లాడుకొనటం ఈ మధ్య మాకు సామాన్యాంశమైంది. ఆమె వియోగంలో ఆయన స్మృతిగీతమై దుఃఖించని రోజు లేదు. హేమ ను వెతుక్కొంటూ వెళ్లారేమోగానీ మరీ తొందరగా మానస ను, మనోఙ్ఞను ఒంటరులను చేసి,  మనలాంటి  సాహితీబంధుబృందాన్ని , ఆత్మీయులను వదిలి వెళ్లిపోవటం ఏం న్యాయంగా ఉంది!?

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply