సముద్రంలో చేపలం కాలేమా?

ఎప్పటినుండో ఇండియాకు పోదామని అనుకున్నా అది అమలు చేయడానికి ఏడేండ్లు పట్టింది. ఎంతగానో ఎదురుచూస్తుందకు కావచ్చు ఈ సారి ఇండియా ట్రిప్ టికెట్స్ బుక్ చేయగానే ఏదో తెలియని కుతూహలం మొదలయ్యింది. వెంటనే ఇంటికి ఫోన్ చేసి “నాయన ఈ నెలాఖరికి ఇండియా వస్తున్నం” అని చెప్పగానె సంతోషపడుతూ “ఉంటరా ఓ రెండు నెల్లు?” అని అడిగి వెంటనే “వుంటె గా ఆధార్ కార్డ్ పని కూడ చేసుకోని పోవచ్చు. ఆ కార్డ్ లేక నీ పేరు మీద వున్న నాల్గెకరాల భూమికి కొత్త పాస్ పుస్తకాలు ఇస్తలేరు. పాస్ బుక్ లేకపోతె ఎట్ల. ఎమ్మార్వో తో మాట్లాడిన కూడ. మా పిల్లగాడు ఇక్కడ లేడు సార్, జర ఎట్లన్న చూసి ఇవ్వమని అడిగిన. అట్ల చెయ్యడానికి వీలుకాదని అంటుండు. ఆఫీసర్లు అట్లనే అంటరని మండల్ ఆఫీసుల ఓ పైరవికారుని కూడ అడిగిన. వాడు కూడ అట్ల చెయ్యనీక లేదు. పాస్ బుక్ కావాలంటె పట్టాదారుడు తప్పనిసరిగ ఉండాల్సిందె అంటుండు …” దీని కోసమైన నీను ఇండియా రావాలన్నట్లు నాయన చెప్పుకపోతనే వుండు. “సరేలే నాయన అక్కడికి వచ్చినాక చూద్దాం” అని చెప్పి వేరే విషయాలు మాట్లాడి ఫోన్ పెట్టేసిన.

చాలా కాలంగా ఆ నేలకు దూరంగా వున్నాను కాని అక్కడ జరిగే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా ఫాలో అవుతున్న. మిత్రులతో, కుటుంబసభ్యులతో నిరంతరంగా మాట్లాడుతున్న. అయినా ఇవేవి కూడ మనుషుల ప్రత్యక్ష స్పర్శతో, ఆ మట్టి వాసనతో పొందే అనుభూతిని కల్గించలేవు కదా. బహుశా ప్రవాసం మనిషికి ఎప్పుడూ ఒక తెలియని వెలితిని, వెతుకులాటను కల్గిస్తూనే వుంటది. భద్ర జీవితంలో ఉన్నా అభద్రత వెటాడుతుంటది. నేను నిలబడ్డ నేల నాది కాదన్నట్లు, నేను పీల్చే గాలి ఎప్పుడైనా ఆగిపోతుండొచ్చు అనే అభద్రత. భౌతిక జీవితం, మానసిక జీవితం అని విడదీసుకొని బతికే బతుకు. భౌతికంగా ఇక్కడున్నా, మానసికంగా ఉండేది అక్కడే. ఇండియా పోవడమంటే నా మనస్సును, మనిషిని కలపడం.

చూస్తుండగానే నెల రోజులు గడిచిపోయి హైద్రాబాద్ చేరిన.

ఎంతో ఉత్సాహంగ పోయిన కాని, పోయినదగ్గరి నుండే మనసుల ఏదో తెలియని రంధి పట్టుకుంది. నేను కాళ్ళకు బలపం కట్టుకోని తిరిగిన నేలంత గుర్తులు మార్చుకుంది. నా జ్ఞాపకాలన్నీ ఎవరో చెరిపేసినట్లుంది. నా పరాయితనమే నన్ను వెక్కిరిస్తుంది. నా ఆలోచనలు ఇంకా స్థిరం కాకముందే మా నాయన తన “ఆపరేషన్ ఆధార్” మొదలు పెట్టిండు. ఆయన ఒక పని అనుకున్నడంటె అది అయ్యేవరకు ఎవ్వరిని నిద్రపోనియ్యడు. పట్టుదల మంచిదే కాని అందరికి అంతే ఉత్సాహం ఉండదు కదా!

పొద్దున్నే లేవగానె “మన ఇంటిముందే ఆంధ్రబ్యాంక్ ఉంది, దాంట్లనే ఆధార్ కార్డ్ అప్ప్లికేషన్ తీసుకునే ఏజెంట్ ఉంటడు. తొందరగ తయ్యారయి పోతె, పొద్దుగాల పనయిపోతది. లేటుగ పోతె లైన్ పెద్దగయి ఇబ్బందయితది” అని కొంత తొందర పెడుతున్నట్లె చెప్పిండు. నీను కూడ సరే అనుకోని తొందరగ తయారయి ఆ బ్యాంక్ ఓపెన్ చెయ్యకముందే అక్కడికి పోయిన. అప్పటికే ఇంకో ఇద్దరు వచ్చి లైన్ కట్టిండ్రు.

బ్యాంక్ గేట్ ఓపెన్ చేసే సమయానికి నా వెనకాల దాదాపు ఇరవై మంది వచ్చి లైన్ల నిలబడ్డరు. అందరం బ్యాంక్ మెయిన్ గేట్ ఓపెన్ చేస్తే లోపలికి పోవాలని ఎదురుచూస్తున్నం. లోపలికి పోయినంక ఒక మూలకున్న అధార్ కార్డ్ ఏజెంట్ కౌంటర్ దగ్గర మళ్ళీ లైన్ కట్టాలి. బ్యాంక్ గేట్ సరిగ్గ టయానికే ఓపెన్ చేసిండ్రు. గేటు ఓపెనయ్యిందో లేదో లైన్ వరుస తప్పింది. తోపులాట మొదలయ్యింది. ఒకప్పుడు సినిమా థియెటర్ దగ్గర టికెట్ల కోసం మెయిన్ గేటు దగ్గర జరిగే సీన్ ఒక్కసారి కండ్ల ముందల ఫ్లాష్ మాదిరిగ కనబడింది. అప్పుడయితే నీను కూడా తోసుకోని పోతోన్ని. ఇప్పుడు తెలియని గంభీరం ఏదో కదలనిస్తలేదు. నీను కదలాల్సిన పని కూడా లేదు. అటూ ఇటూ వాడూ వీడూ తొయ్యంగ నా ప్రమేయం లేకుండానే గేటు దాటిన. పైగా “అరె అరె…” అని ఏదో పిచ్చి నియంత్రణ కేకలు వేస్తున్న కాని ఎవరు పట్టించుకుంటరు.

అయితే గేటు దాటగానే నాకు కూడ స్పృహ వచ్చింది “ఇండియాలో వున్నప్పుడు ఇండియన్ లాగానే వుండాలని.” వెంటనే ఆధార్ కౌంటర్ దగ్గరికి పరిగెత్తిన. ఈ సారి లైన్లో రెండో స్థానం సంపాదించిన. చెప్పాలంటె కొద్దిగ గర్వమే అనిపించింది. ఇక్కడ కూడ బతికేయొచ్చు అనే సగటు మనిషి గర్వం. కాసేపటికి వెనక్కి తిరిగి చూస్తే గుడులల్ల సుడులు, సుడులు తిరిగి వుండే లైన్ల మాదిరిగ మూడు, నాలుగు వరుసలు నిలబడివున్నరు. దాదాపు వంద మంది వరకు ఉంటరు. “మొదటి యాబై మందికే అప్ప్లికేషన్ మరియు టోకెన్ నెంబర్ ఇవ్వబడును” అని పెద్ద చేరాత అక్షరాలతో రాసి ఏజెంట్ కౌంటర్ దగ్గర గోడకు అతికించి వుంది. అయినా అంతమంది ఏ ఆశతో లైన్ల నిలబడ్డరో నాకు అర్థం కావట్లేదు.

కాస్త అందరు లైన్లో సెట్ కాగానే ఇక ఆ ఏజెంట్ కోసం ఎదురుచూపు మొదలయ్యింది. అట్లా చూస్తుండగానే అర్థ గంట అయిపోయింది. అనుమానం వచ్చి అక్కడ వున్న టైమింగ్ బోర్డ్ చూసిన. “పది గంటలకే కౌంటర్ ఓపెన్” అని రాసి వుంది. టైం అయిపోతుంది కాని ఆ ఏజెంట్ ఇంకా రావడం లేదు. లైన్లో వున్నోళ్ళ ఏ ఒక్కరి ముఖంలో అసహనం కనబడుత లేదు. అంతా ఓపిగ్గా నిలబడి వున్నరు. నాకేమో ఎక్కడలేని విసుగు, కోపం వస్తుంది. ఎంత కాదన్నా కొంత ఒంటబట్టిన పాశ్చాత్య పద్దతులు, విలువలు విసుగొచ్చినప్పుడు బయట పడుతుంటయి!

అప్పటికే గంట దాటింది ఇక నాకు కోపం ఎక్కువవుతుంది. చిన్నగా గునుగుడు మొదలుపెట్టిన. “ఈయన ఇంత లేటు చేస్తె ఎట్ల? పనులన్నీ ఆపుకోని ఎంతసేపని వుంటం” అని అనగానె, నా వెనుకాల వున్నాయినా “అవును, మరీ ఇంత లేటా? నీను పదకొండుకల్ల హయత్ నగర్ పోవాలి. కాని ఇక్కడే పదకొండు దాటింది” అన్నడు. వెంటనే ఆయన పక్కనున్నాయిన “మా పిల్లకు కార్డ్ అప్ప్లై చేసి మళ్ళ కాలేజ్ ల వదిలిపెట్టి పోవాలి. ఇంత లేటయితదనుకోలే” అని చాలా మర్యాదగ అంటుండు. అట్లనే ఒక్కరిద్దరు నిరసన స్టేటుమెంట్లు ఇచ్చి ఊరుకున్నరు.

అప్పటికి ఇంకా ఆ ఏజెంట్ రాలేదు. కౌంటర్లకు తొంగిచూస్తే అక్కడ ఏజెంట్ పేరు, ఆయన నెంబర్ రాసి వున్నయి. వెంటనే ఫోన్ చేసి కావాలనే స్పీకర్ ఆన్ చేసిన. అవతలి వ్యక్తి (ఏజంటే) మాట్లాడగానె “మీ కోసం దాదాపు వంద మంది ఎదురుచూస్తుంటె, మీరు ఇంకా రాకపోతె ఎట్లండి” అని అడుగుతుండగానే “దారిలో వున్న, ఇంకో ఐదు నిమిషాలలో అక్కడుంట” అని ఫోన్ కట్ చేసిండు. ఐదు పోయి పది నిమిషాలయినా ఇంకా రాలేదు. “ఇప్పుడే వస్తననే, ఇంకా జాడ పత్తా లేడేమయ్య” అని బయటికి వినపడేటట్లే అన్న. లైన్ల వెనుకాల వున్న ఒకతను “సార్, మీరు ఇల్లాంక చేసిన నెంబర్ కే మళ్ళోసారి కాల్ చేసి చూడండి” అని సలహా ఇచ్చిండు. సరే అని మళ్ళీ కాల్ చేసిన. ఈ సారి నా నెంబర్ చూసి కాల్ కట్ చేసిండు. “నా ఫొన్ ఎత్తుత లేడు. మీరెవరైనా చెయ్యండి” అని చెప్పిన. సగం మంది ఫోన్లల్ల లీనమై వున్నరు. విన్నోల్లు చాలా మంది పట్టించుకోనట్లె వున్నరు. ఒకరిద్దరు మాత్రం నెంబర్ కలిపి అతనితో మాట్లాడే ప్రయత్నం చేసిండ్రు.

ఇక అతను రాడని అక్కడే వున్న ఒక తెల్ల పేపర్ తీసుకొని “నీ కౌంటర్ ఓపెన్ చెయ్యడానికి వస్తే పది గంటలకు రా, లేదంటె కౌంటర్ మూసుకో” అని రాసి కౌంటర్ మీద పెట్టిన. అది కాస్త చలనం కలిగించింది. “ఏదో రాసి పెట్టిండు చూద్దాం” అన్నట్లు ముగ్గురు నలుగురు ముందుకు వచ్చి చదివి “నిజమే కదా. ఆయన టైం కి రాకపోతె ఇక్కడ ఇంత మంది పని చెడుతది” అని సంఘీభావ ప్రకటనలు చేసి మళ్ళీ లైన్ల నిలబడ్డరు.

నీను ఇంకాస్త స్వరం పెంచి “ఇంకో ఐదు నిమిషాలు చూస్త, ఈయన రాకపోతె ఆ చైర్ (ఏజెంట్ దే) తీసి బయటేసి పోత. అప్పుడైన బుద్దొస్తది” అనగానె నా వెనకాల వున్నాయన “నేను ఆ టేబుల్ అవతలేసి పోత” అని గొంతు కలిపిండు. ఆయన వాక్యం పూర్తికాక ముందే అప్పటిదాకా ఫోన్లో మునిగిపోయివున్న మరొకతను (ఇరవై ఏండ్లు వుండొచ్చు) ఆవేశంగా తలెత్తి “నేను ఆ కంప్యూటర్ పట్టుకపోత” అని అనేసిండు. అప్పుడు కొంత కదలిక మొదలయ్యి తలా ఒక మాట అనడం మొదలు పెట్టిండ్రు. అట్లా మాట్లాడుతుండగానే “ఇంక వాడు రాడు” అనుకుంటు నీను బయటకు కదిలిన. అంతే మరో నిమిషంలో అందరు ఆ కౌంటర్ దగ్గరి నుండి వెళ్ళి పోయిండ్రు.

నేను ఇంటికి వెళ్ళి పోయిన కాని అంత మంది మందలా కదిలి వెళ్ళిపోయిన దృశ్యమే మనసులో మెదులుతావుంది. మరో గంట అయిన తర్వాత బయటకు పోతూ మళ్ళోసారి బ్యాంక్ లోకి పోయి ఆ కౌంటర్ వైపు చూసిన. అందరు వెళ్ళిపోయిండ్రు కాని ఒక్కతను (సుమారుగా ఎరవై ఐదు ఏండ్ల వరకు ఉండొచ్చు) మాత్రం అక్కడే నిలబడి వున్నడు. నాకు చాలా ఆసక్తిగా అనిపించి దగ్గరికి పోయి “ఏమయ్యా అతను రాడని అందరు వెళ్లిపోయిండ్రు. నువ్వు మాత్రమే ఇంకా లైన్లో నిలబడే వున్నవ్. ఎందుకని?” అని అడిగిన.

ఆయన వెంటనే “అతను ఈ రోజు రాను అని బోర్డ్ పెట్టలేదు కదా సార్” అని ఎంతో ప్రశాంతంగా చెప్పిండు. నాకు ఒక్కసారి మతిపోయినంత పనయ్యింది. “నీ అమాయకత్వం కాని, ఇప్పటికే లంచ్ టైం అవుతుంటె ఇంకా వస్తడని ఆశెందుకయ్య. ఈ రోజు మొత్తమున్నా రాడు. పొయ్యి వేరే పనేదైయిన వుంటె చూసుకోపో” అని చెప్తె “అంతే అంటవా సార్?” అని నిరాశగా అన్నడు. “అంతే కాదు, బాండ్ పేపర్ మీద రాశియ్యమంటె రాశిస్త పో” అని వెటకారంగ అనేసరికి అక్కడి నుండి ఏదో కోల్పోయినట్లు కాళ్ళు ఈడ్చుకుంటు కదిలిండు.


ఈ సంఘటన జరిగి దాదపు ఒక సంవత్సరం అయ్యింది, కాని ఎన్నో సార్లు గుర్తుకొచ్చింది. ఇది ఒక్క చిన్న సంఘటనే కావచ్చు కాని దేశం మొత్తం ఇలాగే ఎన్నిసార్లు లైన్లలో నిలబడిందో. ఆధార్ కార్డ్ కోసం, పాన్ కార్డ్ కోసం, నోట్ల రద్దు సందర్భంలో, ఓట్ల కోసం… ఇలా ఎన్నిసార్లో.

ఈ సంఘటనలో కూడా మా కోపం వ్యవస్థలో భాగమైన ఒక చిన్న ఏజెంట్ వరకే పరిమితమయ్యింది కాని, ఆ వ్యవస్థను నిర్మాణం చేసిన పాలకవర్గాల వైపు వెళ్ళలేదు. దోపిడీ వ్యవస్థ మూలాలను ప్రశ్నించే ఉద్యమాలు బలంగా వుండి వుంటే అసలు ఈ అధార్ కార్డ్ దేని కోసం? దానితో ప్రజలకు వచ్చేది ఏంటీ? దోపిడీ వర్గాల ప్రయోజనం ఏంటీ? మొత్తంగా అందులో దాగివున్న కుట్ర ఏంటీ? అది సమజాన్ని ఎలా నియంత్రించే సాధనంగా మారిందో మాట్లాడే అవకాశం వుంది.

కాని ఎందుకు, ఏంటీ అనే ప్రశ్నలు లేకుండపోయినయి. ఎవరి ప్రయోజనాల కోసం, ఏ నియంత్రణ కోసం రాజ్యం ఈ ప్రయత్నాలు చేస్తుందో ఆలోచించే సమాజం కృశించుకుపోతుంది. ఎంత బుద్దిగా రాజ్యం మాట వింటే అంత దేశభక్తి అనే స్థితి వచ్చింది. దానికి మద్దతుగా మాటల గారడితో ప్రజలను మభ్యపెట్టే మీడియా, పాలక వర్గాల మోచేతినీళ్ళ కోసం ఆశపడుతూ బతికే జ్ఞాన బ్రోకర్లు (knowledge brokers) ప్రతి నిత్యం ప్రజల మెదళ్ళ మీద రాజ్య ఆమోద ముద్ర వేస్తూనే వున్నరు. ప్రతి దోపిడీ, అణిచివేత సాధనాలకు, ప్రయత్నాలకు సమ్మతి కూడగట్టే ప్రయత్నం చేస్తున్నరు. కాని నాకు అర్థమయిన తెలంగాణ సమాజానిది అగ్గిపుల్ల స్వభావం. కొద్దిగా రాపిడైతే భగ్గున మండే సహజత్వం. ఆ సహజత్వానికి జడత్వం ఎందుకు వస్తుందో లోతుగా అన్వేషించాల్సిన ప్రశ్న.

సమాజ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఉప్పెనలా ఎగిసిపడే ప్రజా చైతన్యం మాత్రమే కాదు, నిత్య జీవిత వెతలు, కథలు కూడా చాలా అవసరం అవుతయి. వాటిని దగ్గరగా పరిశీలిస్తెనో, తమ అనుభవంలో భాగం చేసుకుంటేనో కాని వాటి సారం అర్థం కాదు. బహుశా దీనికి వేరే అడ్డదారి ఏదీ ఉండదేమో, మళ్ళీ మళ్ళీ ప్రజల దగ్గరకు పోవడం తప్ప. ఎప్పుడూ సముద్రంలో అలల్లా ఎగిసి పడటం కాకుండా, చేపలై లోతైన పరిశీలన చేయాలేమో!

పుట్టింది చారకొండ (పాలమూరు). పెరిగింది అజ్మాపూర్ (నల్లగొండ). సామాజిక శాస్త్ర విద్యార్థి, ప్రజా ఉద్యమాల మిత్రుడు. అమెరికాలో అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా పనిచేస్తున్నాడు.

Leave a Reply