సముద్రం దగ్గర
నా వేషాలేం చెప్పమంటారు
సముద్రం నాకు అమ్మలా కనిపించినప్పుడు
నేను నత్తలా పాకుతూ దగ్గర చేరతాను
ఏనాటి మనుషుల గుంపులో
చిటికెడు దేహంగా మారిపోయి
నా రాతి తొడుగులోంచి తొంగి చూస్తారు
అప్పుడు అమ్మ నురగపాలు తాపి
అలలన్నీ ఊయెలలే చేసి
ఆకాశం దగ్గర కొత్తగా నేర్చుకున్న
జోల పాట పాడి ఆడిస్తుంది
నేనొక గవ్వలా వస్తే
సముద్రం స్నేహితురాలై
నాకు రెక్కలు తొడిగి గువ్వను చేస్తుంది
తీరంలో ప్రాచీన కాలం నుంచి
పోగుచేసిన ప్రేమికుల నీడల్ని
తన అగాథాల్లోంచి తీసి కడలి వడుకుతుంది
ఆ అదృశ్య ప్రణయదారాల పట్టుపోగులతో
అల్లిన శాలువా నాపై కప్పుతుంది
ఎవరికి తెలుసు అది కప్పుకుని నేను తిరిగితే
నా ముందరి ఆకాశం
ఇంకా ముందు ముందుకు జరిగి
నన్ను ముచ్చటగా చూస్తుంది
మరోసారి నేను
కోట్లాది పాదాల యెండ్రకాయలా
తడి ఇసుక మీద
ఏ పాత రాతి కాలాల కవిత్వమో రాసుకుంటూ
లేత కిరణాల ఉలులతో
రేణువు రేణవునీ శిల్పాలుగా చెక్కుతూ
వేలాది నీటి తుంపర్ల తుంబుర నాదాలు చేస్తూ
బికారిలా తిరుగుతాను
అప్పుడు పక్షులు వింతగా ఆగి
నాకేదో భిక్ష వెయ్యాలని చూస్తాయి
నేను నడిచిన తీరమంతా మొలిచిన
బుల్లిబుల్లి రంగురంగుల గవ్వల్ని
తన పొడవాటి నీటి చేతులతో తుంపుకుని
అలల అరలన్నీ తెరిచి సముద్రం
వాటిని భద్రంగా దాచుకుంటుంది
నేను తాబేలులా నీట్లోంచి కాకుండా
భూమినంతా చుట్టి వస్తాను
యుధ్ధాలకు రాటు దేలి
శిలీభవించిన చర్మం లోపల
ఏన్నెన్నో కలల సాగరాల మథనం సాగుతుంది
అలా నేనో గర్భవంతుడినవుతాను
తీరం పొడవునా తీరుబడిగా గుడ్లు పొదుగుతాను
తిరిగి వెనక్కి నేల మీద పాకుతూ
మనిషిలా అదృశ్యమైపోతాను
నా కోటాను కోట్ల కలల గుడ్లను
తనలోకి నురగ వలలతో లాగేసుకుని
నెచ్చెలి నీరధి నాకు వీడ్కోలు చెప్తుంది
ఎన్నెన్ని జీవాల ఏనాటి ఆశల్నో
గుడ్డు గుడ్డు నుంచి శిశువులుగా తీసి
అంబరానికెత్తి నా ప్రాణాంబుధి
కొత్త లోకాలకు హారతిపడుతుంది
ఎవరికీ తెలియదు
నేనే కాదు,
అప్పుడప్పుడూ సముద్రం కూడా
నా దగ్గరకు వచ్చి నాతో సంగమిస్తుంది