సనాతనధర్మంలో కానరాని సామాజిక న్యాయం

తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా సనాతన ధర్మం నిర్మూలన మహానాడు పేరిట రచయితల, కళాకారుల సదస్సును సెప్టెంబర్‌ 2న నిర్వహించింది. తమిళనాడు ముఖ్యమంత్రి కుమారుడు, ఆ రాష్ట్రమంత్రి ఉదయనిధి స్టాలిన్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఆయన ప్రసంగంలో అంటరానితనం, అసమానతలు, లింగవివక్షతను ప్రస్తావిస్తూ వాటికి నిలయమైన హిందూత్వ సనాతన ధర్మం కరోనా, డెంగ్యూ వైరస్‌ లాంటిదని, దానిని నిర్మూలించాల్సిందేనని అన్నారు. సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకం. కుల మతాల ప్రాతిపదికన ప్రజలను విభజించేది సనాతన వాదమని, అటువంటి వివక్ష ఏ మతంలో ఉన్నా నిర్మూలించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఈ విషయాన్ని నానా రచ్చ చేస్తూ బిజెపి, సంఘ్‌పరివార్‌ శక్తులు కత్తులు నూరడంతో అది దేశమంతా చర్చనీయాంశమై పోయింది.

సనాతన ధర్మాన్ని ఉద్దేశిస్తూ ఉదయనిధి స్టాలిన్‌ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదంగా మార్చడం ద్వారా రాజకీయ లబ్ధి పొందడానికి బిజెపి, సంఘ్‌పరివార్‌ తాపత్రయపడుతున్నాయి. మరోవైపు గోడీ మీడియా దీనిని అతిపెద్ద వివాదంగా ప్రచారం చేస్తున్నది. ఉదయనిధి తీరుపై బిజెపి లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆయన వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. హిందూవాద సంఘాలు కూడా ఉదయనిధిపై మండిపడుతున్నాయి. నా మాటలకు కట్టుబడి ఉన్నానని ఉదయనిధి తెగేసి చెప్పడం… కొడుకు చేసిన కామెంట్లలో తప్పేంలేదంటూ తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌ ప్రకటించడంతో బిజెపి లీడర్లు మరింత గుస్సా అవుతున్నారు. అయోధ్యకు చెందిన పరమహంస ఆచార్య స్వామిజీ కూడ రంగంలోకి ప్రవేశించి ఉదయనిధి తలనరికి తెస్తే పది కోట్లు ఇస్తానంటూ ప్రకటించడంతో సనాతన ధర్మంలో ఉన్న ధర్మమేమిటో అనే చర్చ విస్తృతంగా సాగుతోంది.

నిజానికి స్టాలిన్‌ అన్న మాటలు కొత్తవేమీ కాదు. గతంలో అనేక మంది తత్వవేత్తలు, సామాజిక ఉద్యమకారులు పదేపదే చెప్పిన విషయాల్ని ఆయన మళ్లీ చెప్పారు. దీనిపై బిజెపి సోషల్‌ మీడియా దాడి ప్రారంభించింది. రాజస్థాన్‌ ఎన్నికల ప్రచారంలో ఉన్న అమిత్‌ షా, జెపీ నడ్డా స్టాలిన్‌ మీద, ఆయన పార్టీ అయిన డిఎంకే మీద, దాని భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్‌ మీద, వీరందరూ కలిసి నిర్మిస్తున్న ఇండియా కూటమి మీద తీవ్రమైన ఆక్రోషం వెలిబుచ్చారు. ప్రధాని మోడీ ఇండియా కూటమికి సనాతన ధర్మ విధ్వంసమే దాని లక్ష్యమని మధ్యప్రదేశ్‌ ఎన్నికల సభలో ప్రసంగిస్తూ ఆరోపించాడు. ఇండియా కూటమిని ఎలా ఎదుర్కోవాలి అని మల్లగుల్లాలు పడుతున్న బిజెపి, దాని మాతృసంస్థ ఆర్‌ఎస్‌ఎస్‌ హిందూత్వశక్తులు ఈ అంశాన్ని త్వరలో జరుగనున్న ఎన్నికల్లో తమకు అనుకూలంగా వినియోగించుకోవాలని ఆరాటపడుతున్నాయి.

కుళ్ళి కంపు కొడుతున్న కుల వ్యవస్థ ప్రతినిధులు ఉదయనిధిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. 14 మంది మాజీ జడ్జీలు, 130 మంది ఉన్నతాధికారులు, 118 మంది మాజీ సైన్యాధికారులు సహా 262 మంది సీజేఐకు లేఖ రాశారు. “ఉదయనిధి వ్యాఖ్యలు దేశంలోని అత్యధిక జనాభాకు వ్యతిరేకంగా చేసిన విద్వేష ప్రసంగంతో సమానం. తక్షణం ఈ అంశాన్ని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలకు ఉపక్రమించాలి. రాష్ట్ర ప్రభుత్వ పాలనలో తీవ్ర జాప్యం ఒక రకంగా కోర్టు ధిక్కారమే. ఇది శాంతి భద్రతల అంశాన్ని అపహాస్యం చేయడమే అవుతుంది. శాంతిభద్రతల కోసం, విద్వేష ప్రసంగాలను అడ్డుకునేందుకు చర్యలు తీసుకొండి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు.

అయితే ఉదయనిధి తలనరికి తెస్తే 10 కోట్లు ఇస్తానన్న పరమహంస ఆచార్య అహాంకారంతో, ఉన్మాదంతో, హింసను ప్రోత్సహించే భాషను ఉపయోగించి చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి చర్యలకు పూనుకోగూడదా? 14 మంది రిటైర్డ్‌ జడ్జీలలో కనిపించే వివక్షకు మూలం సనాతన ధర్మంలో ఉందని మరోసారి స్పష్టం కావడం లేదా? ఆలోచించాలి. సనాతన ధర్మమంటే సమానత్వం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని స్పష్టమవుతుంది. ప్రజాస్వామిక న్యాయం ప్రకారం ఉదయనిధి స్టాలిన్‌పై చర్యలు తీసుకోవడానికి బదులు పరమహంస ఆచార్యపై హత్యానేరం మోపి వెంటనే అరెస్టు చేయాలి.

అగ్ర వర్ణాలకు మాత్రమే న్యాయం చేసే సనాతనధర్మం అన్యాయాలపుట్ట అని, మానవత్వాన్ని, సమానత్వాన్ని కాలరాసిందని వర్గచైతన్యం వెల్లివిరిసినప్పటి నుండీ మేధావులు ప్రశ్నిస్తున్నారు. మానవ సమాజం చేసిన తప్పు ఒప్పులు చరిత్ర చిహ్నాలుగా మిగిలిపోతాయి. మనిషి పురోగతి చెందాలంటే చరిత్రలో తప్పులు సమీక్షించుకుని వర్తమానంలో జాగ్రత్తలు పాటిస్తూ భవిష్యత్ కు బాటలు వేసుకుంటాడు. విజ్ఞతగల నాగరిక సమాజం చేస్తున్నది అదే. పూలే, నారాయణ గురు, పెరియార్‌, అంబేద్కర్‌ వంటి ఎందరో మహోన్నతులు సామాజికన్యాయం కోసమే పోరాడారు.

సనాతన ధర్మంలో కానరాని సామాజిక న్యాయం :

సనాతన ధర్మాన్ని పరిరక్షించాలనే అత్యల్ప జనసంఖ్య కలిగిన ఆర్య బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు తమ తోటి మనుషులను హీనంగా చూసే కుల వ్యవస్థను తమకు మాత్రమే సొంతమైన మనుస్మృతి ద్వారా సనాతన ధర్మాన్ని కొన్ని వేల సంవత్సరాల నుండి ఈ దేశంలో అమలయ్యేటట్లు చూస్తున్నారు. సనాతన ధర్మంలో ఉన్నది అగ్రవర్ణ స్వధర్మమే కాని సమతాధర్మం ఏమాత్రం కాదు. జనాభా సంఖ్య ఆధారంగా నిజమైన మైనార్టీలైన ఆర్య బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులు, ఒకే జాతి ఒకే రక్తానికి చెందిన మూలవాసులను ఆరు వేల కులాలకు పైగా విభజన చేసి ఈ దేశ కులం పేరుతో బానిసలుగా చేశారు. వైదిక ధర్మం, సనాతన ధర్మం పేరుతో ఈ దేశంలో కుల వ్యవస్థను స్థిరపరిచేలాగా మనుస్మృతిని అమలు చేస్తున్నారు. అందుకు బ్రాహ్మణ అర్చక, పూజారి వర్గం తోడ్పడుతోంది.

సనాతన ధర్మం శాశ్వత సత్యమని, చరిత్రకు అతీతమైందని చెప్పబడుతున్నది. సనాతన ధర్మం లక్ష్యం ఏమిటి? పునః జన్మ నుంచి విముక్తి, నీ కర్తవ్యాన్ని నువ్వు కిమ్మనకుండా నిర్వర్తించడం ద్వారా ఉత్తమ జన్మ ఎత్తుతావని, ఉత్తమ జన్మ ద్వారా మోక్షాన్ని పొందుతావన్న కర్మ సిద్ధాంతం ప్రచారం జరుగుతోంది. వర్ణాశ్రమ ధర్మం ఈ సనాతన ధర్మంలో భాగం. హిందూ మతానికి వర్ణాలు-కులాలే బలమని, కుల సంకరం కారణంగానే హిందూ మతం భ్రష్టు పట్టిందని కాలం చెల్లిన కుల వివక్షను నిలబెట్టేందుకు సాధుసంతుల పేర సామాన్యుల బుర్రలను విషతుల్యం చేస్తున్నారు. మరోవైపు కుల, మత అంతరాలతో సమాజంలో ఏర్పడిన విభజనలను ఉపయోగించుకుని విద్వేషాలను రెచ్చగొట్టి తమ అధికారాన్ని శాశ్వతం చేసుకునే దుస్సాహసం చేస్తున్నాయి ఆర్‌ఎస్‌ఎస్‌ శక్తులు. సనాతన ధర్మం పేరిట బ్రాహ్మణులు సంస్కారవంతులంటూ వర్ణ వ్యవస్థను కాపాడేందుకు, హిందూ మత ఆధిపత్యాన్ని ఏర్పాటు చేసేందుకు ఎందుకు తహతహలాడుతున్నారో ఈ దేశ ప్రజలకు సమాధానం చెప్పాలి.

సనాతన మనువాద కుల సంస్కృతినీ, సంప్రదాయాలను నిలబెట్టడమే ఆర్‌ఎస్‌ఎస్‌, బిజెపిల లక్ష్యం. భారతదేశాన్ని హిందురాష్ట్రంగా పునర్‌నిర్మించడమే హిందూత్వ అజెండా అని గోల్వాల్కర్‌ ప్రకటించాడు. మానవ సమాజ పరిణామ క్రమంలో విజ్ఞానశాస్త్రం, ఆర్థిక సమానత్వ, సామాజిక న్యాయ, స్వేచ్ఛా సమానత్వ ఆలోచనా విధానం రెక్కలు తొడిగింది. సనాతన విలువల స్థానే ప్రజాస్వామ్యం, లౌకికత, సామాజిక న్యాయం వంటి నూతన విలువలు ఆవిష్కృతమయ్యాయి. మానవుడు సృజనశీలి. కులాల కుళ్లు, మతాల సంకెళ్ల నుండి విడివడినప్పుడే మనిషి స్వేచ్ఛగా జీవించగలుగుతాడు.

మనుధర్మంలో స్త్రీలను పురుషుడి కోసం దేవుడు సృష్టించాడు అంటూ మహిళలను వివిధ సంప్రదాయాల ముసుగులో దారుణమైన చిత్రహింసలకు గురిచేసింది, స్త్రీలను శూద్రులను సనాతన ధర్మం అణిచివేసింది. స్త్రీలను బానిసలుగా చేసి పురుషులకు ఆధిపత్యాన్ని ఇచ్చింది. అసమానతలు, అణచివేతను, పురుష ఆధిపత్యాన్ని పెంచి పోషించే సనాతన ధర్మాన్ని కూకటివేళ్లతో పెళ్ళగించవద్దా?

సనాతన ధర్మంపై అనాదిగా జరుగుతున్న పోరు :

సనాతన ధర్మం అన్నది బ్రాహ్మణాధిపత్యవాదులు రాసిన ధర్మశాస్త్రాల్లో ఉంది. వాటన్నింటిలోకి మనుధర్మశాస్త్రం ప్రధానమైనది. వర్ణ ఆధిపత్యం, పురుషస్వామ్యం, కులవివక్షను మనుధర్మశాస్త్రం సమర్థించింది. దుర్నితికి, వివక్షతకు, ఆధిపత్యానికి తొలి రూపమైన బ్రాహ్మణ, వైదిక మతాలపైన గౌతమ బుద్ధుడు 2500 సంవత్సరాల క్రితమే ఈ పోరాటం ప్రారంభించాడు. బ్రాహ్మణ మత సిద్ధాంతాన్ని చార్వాకులు, లోకాయతులు, సాంఖ్యులు ఇటువంటి అనేకమంది తాత్వికులు తీవ్రంగా వ్యతిరేకించారు. వీరందరినీ భౌతికంగా అణిచివేస్తూ వారి అమూల్యమైన సాహిత్యాన్ని ధ్వంసం చేస్తున్న క్రమంలో హిందూ మతం అనేది స్థిరపడింది. హిందూమతానికి కుల వ్యవస్థకు విడదీయరాని సంబంధం ఉంది. డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ బౌద్ధంపై బ్రాహ్మణాధిక్యతను ప్రేరేపించే హిందూ మతం సాగించిన ప్రతీఘాత విప్లవం నుండే పురాతన సమాజాన్ని అర్థం చేసుకోవచ్చని పేర్కొన్నాడు. భారతం, భగవద్గీత, రామాయణం వంటి పురాణాల రచనలు సనాతన ధర్మాన్ని రక్షించడానికే. అందుకే జ్యోతీరావు పూలే ‘భారత రామాయణాల్లో ఒక్క నీతిని ‘ చూపండి అని ప్రశ్నించాడు. ఈ వాదనలతో ప్రముఖ చరిత్రకారులు రొమిల్లా థాపర్‌, డిఎస్‌ ఝా. జైస్వాల్‌ వంటి వారు ఏకీభవిస్తున్నారు.

క్రీస్తు శకం 14వ శతాబ్దం నుండి ఈ బ్రాహ్మణాధిక్య సమాజం సృష్టిస్తున్న మతాధిక్యవాదంపై తెలుగు రాష్ట్రాల్లో యోగివేమన, పోతులూరి వీరబ్రహ్మం, కర్ణాటకలో బసవన్న, రవిదాసు, పంజాబ్‌ ప్రాంతంలో గురునానక్‌ వంటివారు ఆ తరువాత కేరళలో నారాయణ గురు, మహారాష్ట్రలో జ్యోతీరావ్‌ పూలే, తమిళనాడులో పెరియార్‌ వంటి వారు కులవ్యవస్థ మీద, దానికి అండగా నిలిచే హిందూ మత భావజాలం పైన పోరాడారు. 19,20 శతాబ్ధాలలో బ్రిటిష్‌ పరిపాలనా కాలంలో కెరటంలా సాంఘిక ఉద్యమాలు వెల్లువెత్తాయి. ఆంధ్ర రాష్ట్రంలో త్రిపురనేని రామస్వామి చౌదరి వంటి అనేకమంది కుల వ్యవస్థ పైన, అందుకు ప్రతిరూపంగా ఉన్న బ్రాహ్మణాధిక్యతపైన బలమైన ఉద్యమాలు నడిపారు. కేరళలో సామాజిక సంస్కర్త అయ్యంకాళి, దేశవ్యాప్తంగా చూసినప్పుడు డాక్టర్‌ బి.ఆర్‌. అంబేద్కర్‌ లాంటి వాళ్లు కుల వ్యవస్థను నిర్మూలించడానికి పోరాడిన వారే. వీరందరి పోరాటంలో మనకి కనపడేది సనాతన ధర్మాన్ని వ్యతిరేకించటమే.

అంటరానితనానికి ఆలవాలమైన హిందూ మతాన్ని ధిక్కరిస్తున్నానని చెప్పడానికే బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ మనుస్మృతిని అగ్నికి ఆహుతిచ్చాడు. మతం పునాదుల మీద ఒక జాతినీ, ఒక నీతినీ నిర్మించలేరు అని అంబేద్కర్‌ చేసిన హెచ్చరిక ఏ సనాతన ధర్మం గురించో, అదే సనాతన ధర్మాన్ని శతాబ్దాలకు ముందే బుద్దుడూ నిరాకరించాడు. పెరియార్‌ చేసిన యుద్ధమంతా అదే. 1956 ఆగస్టు ఒకటో తేదీన శ్రీరాముని చిత్రపటాలను బహిరంగంగా తగలబెట్టమని పెరియార్‌ పిలుపునిచ్చిన కాలం ఒకటుంది. లక్షలాది జన సమూహం సాక్షిగా దగ్ధమైన రాముడి చిత్రపటాల చిటపటలు నిజం కాదని ఎవరు చెప్పగలరు? ఆర్య సంస్కృతి ఆధిపత్యం మీద సాగించిన మహోద్యమం, ఈ దేశం మొత్తం మీద సనాతన ధర్మానికి వ్యతిరేకంగా సాగే పోరాటాలకు గట్టి పునాది వేసింది.

సనాతన ధర్మానికి కులమే పునాది. అనాదిగా భారతదేశంలో ఉన్న హిందూ పురాణాలు, హిందు ఉపనిషత్తులు, హిందూ ధర్మ శాస్త్రాల్లో తప్ప మరేఇతర సాహిత్యంలో కులవ్యవస్థ ప్రసక్తి కనపడదు. ఈ హిందూ శాస్త్రాలన్నింటా కులవ్యవస్థ ప్రస్తావన స్పష్టంగా ఉంటుంది. మనుస్మృతిలో అయితే అచ్చంగా కుల వ్యవస్థ గురించి ప్రస్తావన ఉంటుంది. హిందూత్వ సిద్ధాంతకారులు ఎవరూ మనుస్మృతిని వ్యతిరేకించరు, అడపాదడపా కుల వివక్ష గురించి, అంటరానితనం గురించి మాట్లాడినా మొత్తంగా చూసినప్పుడు వారికి మనుస్మృతితో విబేధాలు ఉండవు. మనుస్మృతిలో శూద్రుల గురించి, స్త్రీల గురించి ఎంత అమానుషంగా వివరణ ఉంటుందో చూస్తే మన పోరాటం ఎక్కడ మొదలెట్టాలి. ఎలా ఉండాలి అనేది అర్థమవుతుంది. ”నః శూద్రమతి దద్యత్‌” అంటే శూద్రులకు (శ్రామికులు) విద్య అందించకూడదు. ”స్త్రీ హి మూల దూషణం” అంటే అన్ని పాపాలకి స్త్రీయే కారణం. ”నః స్త్రీ స్వాతంత్య్ర మర్హతి” అంటే స్త్రీలకు స్వేచ్ఛ ఉండకూడదు. ఇటువంటివి మనుస్మృతిలో కోకోల్లలుగా కనపడతాయి.

భారతదేశ చరిత్ర పరిణామ క్రమంలో క్రీస్తుపూర్వమైనా, మధ్య యుగాలలోనైనా, ఆధునిక కాలంలోనైనా భారత తాత్విక చింతనలో ప్రధాన ఘర్షణ ఈ బ్రాహ్మణాధిక్య మనువాదానికి, నిమ్మజాతుల (శూద్రులు, అతిశూద్రులు) అభ్యున్నతి కోసం నిలబడ్డ తత్వవేత్తలు. సామాజిక ఉద్యమకారుల మధ్యే జరిగింది. మనువాద కుల దురహంకారులు నాడు నేడు కూడా తమ క్రూరత్వం కనపడకుండా ఉండటానికి ఈ సనాతన ధర్మమనే పదాన్ని చాకచక్యంగా వాడుకుంటూనే ఉన్నారు. అందువలన ఈ చర్చ కొత్తది కాదు, తేడా ఏమంటే మనువాద శక్తులు ఇప్పుడు కేంద్రంలో అధికారంలోకి వచ్చాయి. అనేక ప్రభుత్వ సంస్థలని, పరిపాలన వ్యవస్థలని ఆక్రమించుకుంటున్నాయి. ఈ స్థితి నుంచి వారు చేసే దాడి బలంగా, విస్తారంగా ఉంది. ప్రశ్నించే గొంతులను, ఉద్యమాలను, ఉద్యమకారులను తీవ్రంగా అణచివేస్తున్నారు.

అశాస్త్రీయ భావజాలాన్ని.. ఆవు మూత్రంలో ఔషధాలు ఉన్నాయని, ఆవు పాలలో బంగారం ఉందని, ఇప్పుడు సైన్సు సాధిస్తున్న విజయాలన్నీ వేల సంవత్సరాల క్రితమే మన రుషులు సాధించేశారని.. ఇలాంటి కల్పితాలను బహిరంగంగానే చాటుతున్నారు. ఇంత పచ్చిగా కుల వ్యవస్థని, కులాధిపత్యాన్ని కుల దురహంకారాన్ని, అశాస్త్రీయతను మతతత్వ శక్తులు పెంచిపోషిస్తుంటే, వాటికి బిజెపి సర్కార్లు అండదండలిస్తుంటే, ఈ దాడిని తిప్పి కొట్టకపోతే భారతదేశ మనుగడకే ప్రమాదం ముంచుకొస్తుంది.

లౌకిక ప్రజాస్వామ్యానికి సనాతనధర్మం వ్యతిరేకం :

విషపూరితమైన, అభివృద్ధి నిరోధకమైన, అసమానతలకు పుట్టినిల్లు మనువాధ ఫాసిస్టు సిద్ధాంతాన్ని తిప్పికొట్టాలి. వేల సంవత్సరాల నుంచి పోల్చినప్పుడు ఇవాళ మనువాద ఫాసిస్టు తీవ్రత అనేక రెట్లు పెరిగింది. ఇప్పటికే మన దేశంలోని సాధారణ జనంలో అత్యధిక భాగం, అందులో ముఖ్యంగా హిందువులుగా చెప్పబడే వారిలో 50 శాతం పైగా లౌకికవాదులు. మత సామరస్యాన్ని కోరుకునేవారు. కుల వివక్షతను ద్వేషించేవారు బిజెపి ఆధిపత్యానికి ఒక అవరోధంగా ఉన్నారు. దీన్ని అధిగమించడానికి కుల వివక్షని, కుల అంతరాలని, కుల దురహంకారాన్ని ప్రస్తావించకుండా మనమందరం హిందువులం కాబట్టి మన ప్రధాన శత్రువు అయిన ముస్లింలు, క్రైస్తవులు తదితర మతస్తులను ఎదుర్కొందాం రండి అంటున్నది. ”హిందువుగా జీవించు – హిందువుగా గర్వించు” అన్న నినాదాన్ని అందుకే ముందుకు తెచ్చారు.

దేశంలో ప్రతిరోజు ఎక్కడో అక్కడ మైనారిటీల మీదే కాదు. దళితులు, గిరిజనులు, మహిళల మీద కూడా పైశాచిక దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడులు చేస్తున్న వారిని బిజెపి వారు వెనకేసుకు వస్తూనే ఉన్నారు. మణిపూర్‌లో మహిళలపై రాజ్యం చేస్తున్న హింస మనం చూస్తూనే ఉన్నాం. అందువలన హిందూత్వ సిద్ధాంతాన్ని హిందూ ముస్లింల మధ్య ఘర్షణ సిద్ధాంతంగా, ప్రచారం చేస్తున్నారు. అందుకు కార్పొరేటు మీడియా తోడ్పడుతోంది. ముస్లింలను, క్రైస్తవులను అణిచివేసి హిందూ రాజ్యస్థాపన చేయడమే వారి ఏకైక లక్ష్యంగా చూడరాదు. హిందూ రాజ్యమంటే పురాతన కాలంలో వాళ్లు గొప్పగా చెప్పే చాతుర్వర్థ వ్యవస్థ, దాన్ని బలపర్చే మనువాదం, దాన్ని నిలబెట్టే గుప్తవంశ రాచరిక తరహా పాలన దాని లక్ష్యం. నేటి కాలంలో ఏకవ్యక్తి నిరంకుశ పాలనకు నిదర్శనంగా ఉంటుంది. అందుకు వారి దాడి నేడు, ప్రత్యక్షంగా భారత లౌకిక రాజ్యాంగం పైన ఎక్కు పెట్టారు. అందువలన ఈ శక్తులకు వ్యతిరేకంగా సామాజిక, లౌకిక ప్రజాతంత్ర శక్తులు, సనాతన ధర్మ వివక్షకు గురయ్యే బాధితులంతా ఒక తాటి మీదకు రావాల్సిన చారిత్రక సందర్భం ఇది.

ముగింపు:

సనాతన ధర్మం మీద పోరాటం అంటే వర్ణధర్మం మీద పోరాటమే. అంటే మనుస్మృతి ప్రకారం ఈ దేశంలో ఏ కులవ్యవస్థ అయితే అసమానతల పునాదుల మీద ఏర్పడిందో దానిమీద పోరాటం. కొన్ని వర్గాలకు ఆధిపత్య స్థానం, కొన్ని వర్గాలకు బానిసత్వ స్థానం నిర్దేశించినది వర్ణధర్మ వ్యవస్థ. దీన్ని శాసనబద్ధం చేసింది మనుస్మృతి. దీని వెనుక ఉన్నదే సనాతన ధర్మం. నిజానికి సనాతన ధర్మ నిర్మూలన అంటే మానవీయతను మేల్కోల్పడమే.

మనుస్మృతి చెబుతున్న సనాతన ధర్మాన్ని వ్యతిరేకించడం అంటే అగ్రవర్ణ ఆధిపత్యాన్ని వ్యతిరేకించి సమాజంలో సబ్బండ వర్గాల సమగ్ర అభివృద్ధిని కాంక్షించడం. అందుకు సమాజంలో వేళ్లూనుకున్న అసమానతలకు, అన్యాయాలకు, వివక్షకు మూలమైన అశాస్త్రీయ భావాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక తాత్విక పోరాటం చేయాలి. చరిత్ర నిర్మాతలైన ప్రజల్లో సరైన చైతన్యం రాకుండా, సమాజంలోని ఏ రంగంలోనూ గుణాత్మక మార్పు రాదు. ఎన్నికలలో తాత్కాలిక విజయాలతో ఈ పోరాటం అంతం కాదు. ఏవేవో స్వార్థాలతో, ఏవేవో కోరికలతో చేతులు కలిపి సింహాసనం ఎక్కినా ఆ కలయికలు ఎంతో కాలం నిలవవు. ఏలుబడిలో ఉన్న ఆధిపత్య విధ్వంస భావజాలానికి విరుగుడుగా కోటిరంగుల ఇంద్ర ధనుస్సుల కూటమి కావాలి. ఈ దేశంలో ప్రత్యామ్నాయ రాజకీయ ఆర్థిక, సాంస్కృతిక మార్పును సాధించుకున్నప్పుడే ప్రజలకు నిజమైన విజయం.

మనువాద ఫాసిస్టు శక్తుల దాడి తీవ్ర స్థాయిలో ఉన్నప్పుడు ప్రతిదాడి కూడా అన్ని పార్శ్వాలలో అంతకంటే తీవ్రంగా ఉండాలి. అందుకు కావలసినంత సాహిత్యం, సమాచారం, సాంకేతిక పరిజ్ఞానం మనకు తోడుగా ఉంది. సనాతన ధర్మం పేరుతో వస్తున్న అనేక వాదనలను, చరిత్ర వక్రీకరణలను అనేకమంది మేధావులు పూర్వపక్షం చేస్తున్నారు. అన్నింటినీ మించి కుల దురభిమానాన్ని భరించలేని జనం ఉన్నారు. అందువలన హిందూత్వ శక్తుల విషప్రచారాన్ని స్టాలిన్‌ వంటి వారే కాదు, ప్రతి భారతీయుడు నిలబడేటట్లు చేయాల్సిన బాధ్యత ప్రజస్వామ్య, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల మీద ఉంటుంది. దళిత బహుజనులు, ఆదివాసీలు, మైనారిటీలు ఏకమైతే మనువాద శక్తులు మట్టికరువక తప్పదు. చరిత్ర పురోగమిస్తుంది. చరిత్రలో ఏది మార్పు చెందకుండా యథాతథంగా కొనసాగలేదు. మనువాద ఫాసిస్టు భావజాలాన్ని ప్రతిఘటించడం సమాజం ముందున్న కర్తవ్యం. ఈ నేపథ్యంలో మనువాద ఫాసిస్టు శక్తులపై పోరాటం బలంగా సాగాలి. ఈ కర్తవ్యాన్ని స్వీకరించమని బుద్ధిజీవులను చరిత్ర ఆదేశిస్తుంది. భయానకమైన భవిష్యత్తు మనందరిని మనావాద ఫాసిజంతో పోరాడమని ఆదేశిస్తుంది.

క‌డ‌వెండి, జ‌న‌గామ జిల్లా. ఉపాధ్యాయ ఉద్య‌మ నాయ‌కుడు. సామాజిక‌, రాజ‌కీయార్థిక విశ్లేష‌కుడు.

Leave a Reply