రాజకీయ ప్రకటనగా సత్యజిత్ రే సినిమా – ‘ఇద్దరు’

“మీరు పెరిగి పెద్దయ్యాక ఈ సినిమాలని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. ఈ సృజనాత్మక కళా సృష్టిలో మానవత్వపు విజయాన్ని మీరు చూస్తారు.”

సత్యజిత్ రే సినిమాలలో ఎక్కువగా నటించిన సౌమిత్ర ఛటోపాధ్యాయ ఒక చిన్నారి అభిమానికోసం రాసిన మాటలివి. సత్యజిత్ రే పిల్లల కోసం తీసిన ‘హీరక్ దేశేర్ రాజా’ గురించి చెప్పినవి. ఈ మాటలు, అంతకు పదహారు సంవత్సరాల ముందు, 1964లో సత్యజిత్ రే తీసిన 12 నిమిషాల లఘు చిత్రం – ‘ఇద్దరు’ (ది టు) కి కూడా వర్తిస్తాయి. ఇది మాటలు లేని మూకీ చిత్రం. పిల్లలకోసం తీసినట్లు కనిపించినా, పెద్దల కోసం ఖచ్చితమైన రాజకీయ ప్రకటన కూడా ఇందులో నర్మగర్భంగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఒక అమెరికా టెలివిజన్ సంస్థ (పి బి ఎస్), బెంగాలీ నేపథ్యంతో ఇంగ్లీషులో తమకోసం ఒక సినిమా తీసిపెట్టమని సత్యజిత్ రే ను అడిగింది. అయితే, సత్యజిత్ రే మాత్రం మాటలు లేని మూకీ చిత్రాన్ని ఎంచుకున్నాడు.

ఈ సినిమా ఒక మేడలో ఉన్న ధనవంతుడైన పిల్లవాడికీ, పక్కన గుడిసెలో ఉన్న పేద పిల్లవాడికీ మధ్య ఆటబొమ్మల పోటీలా కనిపిస్తుంది. విశాలమైన భవంతిలో ఒక పిల్లవాడు మిద్దెపైన నిలబడి కారులో వెళ్ళే కుటుంబసభ్యులకు వీడ్కోలు పలకడంతో కథ మొదలవుతుంది. వాడు సీసాలో శీతల పానీయాన్ని తాగుతూ, బంతిని కాలితో తంతూ గదిలోకి వచ్చి సోఫాలో పడుకుంటాడు. ఏమీ తోచక అగ్గిపుల్ల వెలిగించి, గాలి నిండిన బెలూన్లని పేలుస్తాడు. గదిలో నిండా వున్న బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు.

అంతలో ఒక పిల్లనగ్రోవి పాట వినిపిస్తుంది వాడికి. కుతూహలంతో కిటికీలోంచి బయటకు చూస్తే, పక్కన గుడిసెలోని ఒక పేద పిల్లవాడు ఆ పిల్లనగ్రోవి పాట పాడటం కనిపిస్తుంది. మేడలోని పిల్లవాడు వెంటనే పోటీగా తన దగ్గర ఉన్న ఒక బాకాను బయటికి తీసి, అంతకంటే బిగ్గరగా శబ్దాన్ని చేస్తాడు. దీంతో బిత్తరపోయిన పేద పిల్లవాడు గుడిసెలోకి పోయి, డోలు బయటికి తెచ్చి, గంతులు వేస్తూ వాయించడం మొదలు పెడతాడు. మేడలోని పిల్లవాడు దానికి పోటీగా కోతిబొమ్మ వాయించే డోలుని తీసుకొచ్చి చూపిస్తాడు. ఆ బొమ్మ బ్యాటరీతో నడిచేది. చిన్నబుచ్చుకున్న గుడిసెలోని పిల్లవాడు మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాడు. ఈ సారి ముఖానికి ముసుగు, విల్లంబు, బాణంతో తిరిగివచ్చి నాట్యం చేస్తాడు. ప్రతిగా, మేడలోని పిల్లవాడు రెండు ముసుగులు, కౌబాయ్ టోపీలతో వచ్చి కత్తి, బల్లెం, పిస్తోలు, మర తుపాకీ బొమ్మ ఆయుధాలని చూపిస్తాడు. గుడిసెలోని పిల్లవాడు మళ్ళీ ఓడిపోయి, దిగులుగా వెనక్కి తిరుగుతాడు. ఒక సారి నిరాశగా మేడవైపు చూసి గుడిసె లోపలికి వెళ్ళిపోతాడు. గెలిచానన్న సంతృప్తితో మేడలోని పిల్లవాడు తన బొమ్మలను ఒకసారి గర్వంగా చూసుకుంటాడు. ఫ్రిజ్ లోనుంచి ఆపిల్ పండు తీసి తింటూ ఉంటాడు.

వెనక్కి వచ్చి కిటికీలోంచి చూసే సరికి, బయట గాలిపటం ఒకటి పైకి ఎగురుతూ కనిపిస్తుంది. మళ్ళీ గుడిసెలోని పిల్లవాడు. గాలిపటాన్ని ఎగరేసి ఆడుకుంటూ కనిపిస్తాడు. మేడలోని పిల్లవాడిలో అసహనం, అసూయ. ఉండేలు దెబ్బతో గాలిపటాన్ని కొట్టాలని ప్రయత్నించి, విఫలమౌతాడు. వాడి కళ్ళలో ఒక నిరుత్సాహం, ఓడిపోయిన కసి. అంతలో తన గదిలో ఎయిర్ గన్ వాడికి కనిపిస్తుంది. ఎయిర్ గన్ తో గురిచూసి గాలిపటం పైకి కాలుస్తాడు. గాలిపటం నిస్సహాయంగా నేలకూలిపోతుంది.

పేద పిల్లవాడు దెబ్బతిని, చినిగిపోయిన తన గాలిపటాన్ని మెల్లగా దగ్గరకు తీసుకుని దిగులుగా గుడిసెలోకి వెళ్ళిపోతాడు. మేడమీద పిల్లవాడు పేదవాడిని చూసి బెదిరిస్తూ, వెక్కిరిస్తాడు. వాడి కళ్ళలో గెలిచానన్న అహం, ధీమా, సంతృప్తి. మళ్ళీ గదిలోకి వచ్చి బొమ్మలతో ఆడుకుంటూ ఉంటాడు. బ్యాటరీతో నడిచే వాడి బొమ్మలు వాద్య సంగీతాన్ని వినిపిస్తుంటాయి. వాడు ఇంకొక మరబొమ్మను తీసి, దానికి కీ ఇస్తాడు. అది కీ ఇస్తే నడిచే రోబో. ఆ రోబో నడుస్తూ ఉంటుంది. అంతలో కిటికీలోంచి పిల్లనగ్రోవి పాట మళ్ళీ వినిపిస్తుంది. మేడలోని పిల్లవాడికి ఈ సారి ఏం చేయాలో పాలుపోదు. ఈ లోపు, రోబో నడుస్తూ, నడుస్తూ, వాడు బొమ్మలతో పేర్చిన కట్టడాన్ని తాకుతుంది. మేడమీద పిల్లవాడు బొమ్మలతో కట్టుకున్న మేడ కూలిపోతుంది.

పన్నెండు నిమిషాల నిడివి ఉన్న ఈ సత్యజిత్ రే సినిమాని ఇక్కడ చూడవచ్చు.

పైకి పిల్లల మధ్య ఆటబొమ్మల పోటీలా కనిపించే ఈ చిత్రాన్ని పొరలు, పొరలుగా చూడవచ్చు. ఇందులో సత్యజిత్ రే వర్గ వ్యత్యాసాలని బలంగా చిత్రించాడు. మరొక స్థాయిలో మూడవ ప్రపంచదేశాలకీ, సంపన్న సామ్రాజ్యవాద దేశాలకీ మధ్య సంఘర్షణని కూడా ఇందులో చూడవచ్చు. మేడమీద పిల్లవాడి చేతిలో కనిపించే శీతల పానీయపు సీసా సామ్రాజ్యవాద దేశాల అభివృద్ధికి సూచిక. ఈ పోటీలో, ప్రత్యర్థి శిబిరాల మధ్య ఆయుధ సంపత్తిలో, బలాబలాలలో అంతరాలను కూడా గమనించవచ్చు. గుడిసెలోని పేద పిల్లవాడు తీసుకొచ్చినవి మామూలు ఆయుధాలు – విల్లంబు, బాణం కాగా, మేడమీద పిల్లవాడు తీసుకొచ్చిన ఆయుధాలు – కత్తి, బల్లెం, పిస్తోలు, మరతుపాకీ. వాడు ధరించిన ముసుగులు, కౌబాయ్ టోపీ మొదలైనవాటిలో, మూడవ ప్రపంచదేశాల ప్రజలు ఎదుర్కొనే వివిధ శత్రువర్గాల కూటమి రూపాలను పోల్చుకోవచ్చు. మళ్ళీ వినిపించే పిల్లనగ్రోవి పాట, అంతరాల మధ్య కొనసాగే సంఘర్షణ ముగిసిపోలేదనీ, అది కొనసాగుతూనే ఉందనీ తెలిపే ప్రతీక. గుడిసెలోని పేద పిల్లవాడు ప్రతీసారీ ఓటమి పాలైనట్లు కనిపించినా, చివరికి ఆ పిల్లనగ్రోవి పాట మళ్ళీ వినిపిస్తుంది. దీనితో సంపన్న వర్గాలు, సామ్రాజ్యవాదులు ఎంత బలమైన వాళ్ళైనా, వర్గ పోరాటాన్ని అంతం చేయలేరనే అంశాన్ని నొక్కి చెప్పినట్లయింది. కీ ఇస్తే తిరిగే రోబో, బొమ్మల మేడని కూల్చివేయడంలో, అంతిమంగా సామ్రాజ్యవాదం పతనమౌతుందన్న ప్రతీకాత్మక వ్యక్తీకరణ ఇమిడి ఉంది. కొందరు విమర్శకులు, 1964లో కొనసాగుతున్న వియత్నాం యుద్ధ నేపథ్యంలో, ఈ సినిమాని సత్యజిత్ రే రాజకీయ ప్రకటనగా పరిగణిస్తారు. ఆ తర్వాత 1969 లో పిల్లల కోసం సత్యజిత్ రే తీసిన మరొక సినిమా ‘గోపీ గైన్, బాఘా బైన్’ చిత్రంలో కూడా సత్యజిత్ రే యుద్ధ వ్యతిరేకతని ప్రదర్శించాడని విమర్శకులు అంటారు. 1970 నాటి ప్రతిద్వంది సినిమాలో, ఈ ప్రకటన మరింత విస్పష్టమైన రూపాన్ని తీసుకుంది.

ప్రతిద్వంది సినిమాలో ఉద్యోగంకోసం ఇంటర్వ్యూలో ఒక ప్రశ్న అడుగుతారు. ‘గత దశాబ్దంలో నీ దృష్టిలో అత్యంత ముఖ్యమైన సంఘటన ఏది?’ అన్న ప్రశ్నకు ‘వియత్నాం యుద్ధం’ అని అభ్యర్థి సిద్దార్ద సమాధానం చెబుతాడు. చంద్రమండలంపై మనిషి కాలు మోపడం కంటే వియత్నాం యుద్ధం ముఖ్యమైనదా అన్న ప్రశ్నకు, అంతరిక్ష రంగంలో పరిశోధన అభివృద్ధి రీత్యా, చంద్ర మండలంపై మనిషి కాలు మోపడం అన్నది ఊహకు అందని విషయం కాదనీ, అది ఏదో ఒకరోజు జరుగుతుందని ఊహించవచ్చనీ అంటాడు. వియత్నాం యుద్ధం విషయానికి వస్తే, యుద్ధం పూర్తిగా ఊహించని విషయం కాకున్నా, వియత్నాం యుద్ధం మామూలు మనుషుల, రైతాంగం ధైర్యసాహసాలని వెల్లడి చేసిందనీ, ఎవరూ ఊహించని విధంగా వారి అసాధారణమైన ప్రతిఘటనా శక్తిని అది వెల్లడి చేసిందనీ అంటాడు. అది సాంకేతిక స్థాయికి సంబంధించిన విషయం కాదనీ, సామాన్యుల సాహసమనీ, ఆ సాహసమే మనల్ని ఆశ్చర్య చకితులని చేస్తుందనీ సమాధానం చెబుతాడు. నువ్వు కమ్యూనిస్టువా అన్న ప్రశ్నకి, వియత్నాంను అభినందించాలంటే, కమ్యూనిస్టు కావలసిన అవసరం లేదని సిద్దార్ధ సమాధానం చెబుతాడు. వియత్నాం యుద్ధంపై సత్యజిత్ రే రాజకీయ అవగాహన, దాని వ్యక్తీకరణలో పరిణామాన్ని ఈ మూడు సినిమాలలో మనం గమనించవచ్చు.

విశ్వాసాల ప్రకటన, వ్యక్తీకరణకు సంబంధించి సత్యజిత్ రే అభిప్రాయాలని గమనంలో ఉంచుకుంటే, వీటిని మరింత సరిగ్గా అర్ధం చేసుకోగలుగుతాము. “మన విమర్శకులు ఒక సినిమాని అంచనా వేసేటప్పుడు, అది ఒక విషయాన్ని ఎలా చెబుతున్నదనేదానికంటే, ఏమి చెబుతున్నదనే అంశాన్ని ఎక్కువగా చూసే ధోరణిని కూడా ప్రదర్శిస్తున్నారు. నేను సారాన్ని తక్కువ చేయడంలేదు. అయితే, అత్యంత ఉదాత్తమైన అంశాలపై అత్యంత చెత్త సినిమాలని తీశారని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఉద్దేశ్యపూర్వకంగా అస్పష్టంగా తీస్తేనో, తీసే తీరులో సరిగ్గా తీయలేకపోవడం వల్లనో తప్పితే, ఒక సినిమా ఏం చెబుతున్నదనే విషయం అందరికీ స్పష్టంగానే ఉంటుంది. అయితే, అది ఏమి చెబుతున్నదనే విషయం సినిమా దర్శకుని వ్యక్తిత్వానికి ఒక పాక్షిక వ్యక్తీకరణ మాత్రమే. ఎందుకంటే, అది చెప్పే పద్ధతి అతనిలోని కళాకారుడికి అద్దంపడుతుంది. ఉత్తమమైన శైలి, నైపుణ్యంతో విషయాన్ని వ్యక్తీకరిస్తే చాలు, ఏమి చెబుతున్నామో పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరంలేదనే దర్శకులు ఉన్నారు. వాళ్ళని పనిమంతులు అని పిలుస్తారు. జీవితం పట్లా, సమాజం పట్లా ఒక దృక్పథం లేకుండా, అది తమ కళా సృజనలో వ్యక్తం కాకుండా ఉండే కళాకారుల గురించి మనం ఊహించలేము. ఆ దృక్పథం వాళ్ళు ఎంచుకున్నవాటిలో అంతర్లీనంగా వ్యక్తమౌతూనే ఉంటుంది. అయితే దానిని సినిమా రూపంలో చిత్రించడంలో సఫలమయ్యారా అన్న ప్రశ్నకి జవాబు, వాళ్ళ భాషలో స్వచ్ఛత, బలం, అందులోని కొత్తదనం మీద ఆధారపడి ఉంటుంది.”

సత్యజిత్ రే సినిమాలలో రాజకీయాలు, రాజకీయ భావాల వ్యక్తీకరణ, కళాత్మక వ్యక్తీకరణ విషయంలో తన అభిప్రాయాలు చర్చించి అర్ధం చేసుకోవాల్సినవి. ఆ చర్చ తన సినిమాల ప్రత్యేకతని, గొప్పదనాన్ని ఎంతమాత్రమూ తగ్గించలేదు. తన సినిమాలలో సున్నితమైన, సునిశితమైన శైలిలో రాజకీయ స్పందననూ, విమర్శనూ చూడవచ్చు. హీరాక్ దేశేర్ రాజా సినిమాలో ఎమర్జన్సీ పాలన నాటి ఘటనలపై విమర్శ కనిపిస్తుంది. పేదల గుడిసెలని ఢిల్లీ నగరంలో కూల్చివేసిన ఘటనలపై వ్యంగ్య విమర్శ అందులో ఉందని సత్యజిత్ రే స్వయంగా అంటాడు. వర్తమాన సామాజిక నేపథ్యంలో ఈ వ్యక్తీకరణ మరింత ప్రాధాన్యతని సంతరించుకుంటుంది.

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

One thought on “రాజకీయ ప్రకటనగా సత్యజిత్ రే సినిమా – ‘ఇద్దరు’

Leave a Reply