సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు

బెర్టోల్ట్ బ్రెహ్ట్, జర్మన్ కవి
అనువాదం: సుధా కిరణ్

ఈ రోజులలో అసత్యాలతో, అజ్ఞానంతో తలపడి, సత్యాన్ని రాయాలనుకునే వాళ్ళు కనీసం ఐదు ఇబ్బందులను అధిగమించాల్సి ఉంటుంది. సత్యం అన్ని చోట్లా అణచివేతకు గురౌతున్న సమయంలో, దాని గురించి రాయాలంటే సాహసం కావాలి. అన్నిచోట్లా మరుగునపడిపోయిన సత్యాన్ని గుర్తించే శ్రద్ధా, పట్టింపూ ఉండాలి. ఆ సత్యాన్ని ఒక ఆయుధంగా మలచగలిగే నేర్పరితనం ఉండాలి. ఎవరి చేతులలో ఆ సత్యం ఒక శక్తివంతమైన ఆయుధంగా మారుతుందో గుర్తించగలగాలి. అలాంటి మనుషుల మధ్య ఆ సత్యాన్ని వ్యాపింపజేసే యుక్తి ఉండాలి. ఫాసిజం పాలనలో మగ్గిపోతున్న రచయితలకు ఈ ఐదూ కఠినమైన ఇబ్బందులే. ఫాసిజం అణచివేతను తప్పించుకుని పారిపోయిన, ప్రవాసంలో ఉన్న రచయితలకు కూడా ఈ ఇబ్బందులు ఎదురవుతాయి. పౌరహక్కులు ఉన్న దేశాలలో రచయితలకు సైతం ఈ ఇబ్బందులు ఉంటాయి.

సత్యం రాయాలంటే సాహసం కావాలి

రాసే రచయితలు ఎవరైనా సత్యం రాయాలన్నది సుస్పష్టం. అంటే, సత్యాన్ని కప్పి పెట్టకూడదు, దానిని దాచిపెట్టకూడదు. ఉద్దేశ్యపూర్వకంగా సత్యం కానిదాన్ని రాయకూడదు. అయితే, బలవంతులు, శక్తివంతులైన వాళ్ళ ముందు భయపడకుండా ఉండడం చాలా కష్టం. బలహీనులను మోసం చేయడం చాలా లాభదాయకంగా ఉండే విషయం. ఆస్తిపరులని నొప్పించడమంటే నిరాస్తిపరులలో ఒకరిగా నిలబడడమే. రచనకి దక్కే సొమ్ములు వదులుకోవడమంటే ఆ రచనని వదులుకోవడమే. పెద్దలు దయతో అందించే కీర్తి, ప్రతిష్టలని కాలదన్నడమంటే, అసలు ఆ కీర్తి, ప్రతిష్టలని శాశ్వతంగా నిరాకరించడమే. ఈ పని చేయాలంటే ధైర్యం కావాలి.

తీవ్రమైన అణచివేత కొనసాగే కాలం, ఉదాత్తమైన, ఉన్నతమైన విషయాల గురించి ఎక్కువగా మాట్లాడే కాలం కూడా. త్యాగం గొప్పదనం గురించీ, ప్రాముఖ్యత గురించీ అందరూ తెగ మాట్లాడుతున్నప్పుడు తిండి, కార్మికులకి ఇళ్ళవంటి చిన్న, చిన్న అధమమైన విషయాల గురించి మాట్లాడాలంటే ధైర్యం కావాలి. రైతుల గురించి అందరూ గొప్పగా మాట్లాడుతుంటే, ఆ రైతుల ప్రయాసను తగ్గించే యంత్రాల గురించీ, తక్కువ ధరకు పశువుల మేత అందేలా చూడడం గురించీ మాట్లాడాలంటే ధైర్యం కావాలి. జ్ఞానమున్న మనిషి కంటే చదువు, జ్ఞానం లేని మనిషే మెరుగని రేడియో స్టేషన్లన్నీ ఊదరగొడుతున్నప్పుడు, అది ఎవరికీ మేలు, ఎవరికీ మెరుగని ప్రశ్నించాలంటే ధైర్యం కావాలి. ఉత్తమ జాతి, అధమ జాతి అని మాట్లాడుతుంటే, ఆకలీ, అజ్ఞానమూ, అవకరాలని సృష్టించడం లేదా అని అడిగే ధైర్యం ఉండాలి.

పరాజితులమైన మన గురించి మనం మాట్లాడుకోవాలన్నా ధైర్యం కావాలి. వేధింపులకి గురయ్యేవాళ్ళు చాలామంది తమలో లోపాలని గుర్తించలేరు. వేధింపులని ఎదుర్కోవడం వాళ్ళ దృష్టిలో గొప్ప అన్యాయం. వాళ్ళ దృష్టిలో, వేధించేవాళ్ళు దుర్మార్గులు. తమ మంచితనం కారణంగానే తాము వేధింపులకు గురవుతున్నారు. కానీ ఈ మంచితనం దెబ్బలు తిన్నది, ఓటమి పాలయ్యింది, అణచివేతకు గురయ్యింది. అంటే ఈ మంచితనం బలహీనమైనది, చెడ్డది. తనను తాను కాపాడుకోలేని మంచితనం ఇది. వర్షం కురిస్తే తడిసిపోతామన్నట్లు, మంచితనానికి బలహీనతను ఆపాదించడం మంచిది కాదు. మంచివాళ్ళు ఓడిపోయారనీ, ఆ ఓటమి మంచితనం వల్లగాక, బలహీనంగా ఉండడం వల్లనే ఓడిపోయారనీ చెప్పాలంటే ధైర్యం కావాలి.

అసత్యంతో చేసే యుద్ధంలో సత్యం గురించి రాయాలన్నది నిజం. అయితే, ఆ సత్యం ఒక సర్వసాధారణమైన విషయమో, ఉదాత్తమైన, అనిర్దిష్ఠ సత్యమో కాకూడదు. ఇలా సర్వసాధారణమైన, ఉదాత్తమైన, అనిర్దిష్టమైన విషయం గురించి మాట్లాడడంలో నిజాయితీలేదు. ఒక మనిషి సత్యం మాట్లాడాడని అంటే, అంతకంటే ముందు అనేకమంది, లేదా ఇంకొకరు దానికి విరుద్ధమైన విషయాన్ని అది ఒక అసత్యాన్నో, సర్వసాధారణమైన విషయాన్నో మాట్లాడి ఉండాలి. ఆ తర్వాత సత్యం మాట్లాడిన మనిషి, ఆచరణాత్మకమైన, వాస్తవమైన, తిరుగులేని, సరియైన విషయాన్ని మాట్లాడాడని దాని అర్ధం.

ఒక ఫిర్యాదునో, విమర్శనో ఇంకా అనుమతిస్తున్నచోట, ప్రపంచంలో అన్యాయాన్నో, దుష్టత్వం పైచేయి సాధించడాన్నో విమర్శించాలంటే కొంచెం ధైర్యం కావాలి. ఈ మాటలు పట్టుకుని కొంతమంది తమ మీదికి ఏ ఫిరంగులో ఎక్కుపెట్టివున్నట్లు నటిస్తూవుంటారు. వాస్తవంలో వాళ్ళపైకి విసిరేది ఏవో కళ్ళద్దాలని మాత్రమే. స్నేహితుల బృందంలోనో, నిరపాయకరమైన బృందంలోనో వాళ్ళు సార్వత్రిక న్యాయాన్ని కోరుతూ వుంటారు. ఆచరణలో చిటికెన వేలు సైతం కదల్చకుండానే సార్వత్రిక న్యాయాన్ని వాళ్ళు డిమాండు చేస్తారు. సార్వత్రిక స్వేచ్ఛని డిమాండ్ చేస్తారు. దోపిడీలో వాటా అనే సార్వత్రిక స్వేచ్ఛని వాళ్ళు చాలాకాలంగా అనుభవిస్తూనే వున్నారు. వినడానికి ఇంపైన మాటలలోనే సత్యం ఉంటుందని వాళ్ళు భావిస్తారు. గణాంకాలతో, వాస్తవాలతోనిండి, అనాకర్షణీయంగా వుండి, అధ్యయనమూ , కృషీ అవసరమైన విషయాలు వాళ్ళ దృష్టిలో సత్యం కాదు. అది వాళ్ళని ఆకర్షించదు. వాళ్ళు పైకి మాత్రమే సత్యం మాట్లాడేవాళ్ళలా కనిపిస్తారు. వాళ్ళతో సమస్య ఏమిటంటే, వాళ్లకు సత్యం తెలియనే తెలియదు.

సత్యాన్ని గుర్తించే నేర్పు ఉండాలి

అంతటా సత్యాన్ని దాచిపెడుతున్నప్పుడు, సత్యాన్ని గురించి రాయడం, రాయకపోవడం అన్నవి విశ్వాసాలకు సంబంధించిన విషయం అని చాలామంది అనుకుంటారు. ధైర్యం ఒక్కటి ఉంటె చాలునని భావిస్తుంటారు. సత్యాన్ని కనిపెట్టడం అనే రెండవ ఇబ్బంది గురించి వాళ్ళు మర్చిపోతారు. సత్యాన్ని కనిపెట్టడం అంత తేలికైన విషయం కాదు.

మొదటగా, చెప్పాల్సిన సత్యాన్ని కనిపెట్టడం అంత తేలిక కాదు. ఉదాహరణకి, ఇప్పటికిప్పుడు ప్రపంచంలోని గొప్ప నాగరిక దేశాలు అన్నీ ఒక దాని తర్వాత మరొకటిగా దారుణమైన బర్బరత్వంలో మునిగిపోతున్నాయి. అత్యంత హింసాయుతంగా, దేశంలో అంతర్గతంగా కొనసాతున్న యుద్ధం, ఏ రోజైనా ఇతర దేశాలతో యుద్ధంగా మారనుందని ప్రతిఒక్కరికీ తెలుసు. అది ఈ ప్రపంచ దేశాలని విధ్వంసపు శిధిలాలుగా నాశనం చేస్తుందని తెలుసు. ఆ మాట ఒక సత్యం అనేది నిస్సందేహమైన విషయమే. అయితే, ఇంకా అనేక సత్యాలున్నాయి. ఉదాహరణకి చెప్పాలంటే, కుర్చీలు కూర్చోవడానికే వున్నాయి. వర్షం ఆకాశం నుండి కిందికే కురుస్తుంది. చాలామంది కవులు ఇలాటి సత్యాలని రాస్తారు. వీళ్ళు మునిగిపోయే నౌకలో నిశ్చలమైన ప్రకృతి దృశ్యాలను చిత్రించే చిత్రకారుల లాంటివాళ్లు. మొదట చెప్పుకున్న ఇబ్బంది వీళ్ళకి లేదు. వీళ్ళకి మనసులో ఎలాంటి అశాంతీ ఉండదు. అధికారంలో ఉన్నవాళ్లు వీళ్ళని లోబరుచుకోలేరు. పీడితుల ఆక్రందనలు వీళ్ళని కదిలించవు. తమ మానాన తాము బొమ్మలు గీసుకుంటూ ఉంటారు. తమ చర్యల అర్ధరాహిత్యం వీళ్ళకి ‘మహత్తరమైన’ నిరాశని కలిగిస్తుంది. వీళ్ళ బొమ్మలకి మంచి ధర పలుకుతుంది. ఈ మహా చిత్రకారుల చిత్రాలకి పలికే ధరలని చూస్తే, ఈ నిరాశ అందుకు తగిన విషయమేననిపిస్తుంది. అయితే, వీళ్ళ చిత్రాలలోని సత్యాలు, కుర్చీలు, వర్షం గురించి చెప్పుకున్న సత్యాల వంటివేనని గుర్తించడం కష్టం. అవి కొంచెం విభిన్నంగా, ముఖ్యమైన విషయాలకు సంబంధించిన సత్యాలుగా మనకు కనిపిస్తాయి. విషయాలకు ప్రాముఖ్యతని ఆపాదించడంలోనే కళాత్మక ప్రతిభ వుంది. కానీ కొంచెం పరిశీలించి చూస్తేగానీ మనకు విషయం అర్ధం కాదు. వాళ్ళు చెబుతున్నది – కుర్చీ, కుర్చీయే, పైనుంచి వర్షం కిందకు కురవకుండా ఎవరూ ఏమీ చేయలేరు.

రాయాల్సిన సత్యం వీళ్ళకి పట్టుబడలేదు. ఇంకొంతమంది ఉన్నారు. వీళ్ళు జరూరైన విషయాలనే పట్టించుకుంటారు. అధికారంలో వున్న వాళ్ళన్నా, బలవంతులన్నా వీళ్ళకి భయం లేదు. పేదరికంలో జీవించాల్సి వచ్చినా జంకులేదు. అయినా, వీళ్ళకి కూడా సత్యం పట్టుబడలేదు. వీళ్ళకి సత్యం తెలుసుకునే జ్ఞానం కొరవడింది. వీళ్ళవి పురాతనమైన మూఢ విశ్వాసాలు. గతమంటే ఎనలేని ప్రీతి. ప్రపంచం వీళ్ళకి ఎంతో సంక్లిష్టమైనది. వాస్తవాలు వీళ్ళకి తెలియవు, వాటి మధ్య సంబంధాలు అర్ధం కావు. మనకి విశ్వాసాలతో పాటు సత్యాన్ని కనిపెట్టే జ్ఞానం కావాలి. ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. సత్యాన్ని కనిపెట్టే పద్ధతిని మనం నేర్చుకోగలం. గొప్ప మార్పులు సంభవిస్తున్న ఈ సమయంలో, సంక్లిష్టమైన ఈ ప్రపంచంలో భౌతికవాద గతితర్కం గురించీ, అర్ధ శాస్త్రం గురించీ, చరిత్ర గురించీ రచయితలకు జ్ఞానం కావాలి. తగినంత శ్రద్ధ ఉంటే, పుస్తకాల నుంచీ, ఆచరణాత్మకమైన బోధనల నుంచీ ఈ జ్ఞానాన్ని సంపాదించవచ్చు. సాపేక్షంగా సరళమైన పద్ధతుల్లో మనం అనేక సత్యాలని కనిపెట్టవచ్చు. సత్యంలో కొన్ని భాగాలనీ, సత్యం వైపు మనలని నడిపించే ఆధారాలనీ తెలుసుకోవచ్చు. ఈ పరిశీలనలోనైనా పద్ధతిని అనుసరించడం మంచిది. కానీ, ఒక పద్ధతిని అనుసరించకుండానే, అన్వేషణ లేకుండానే సత్యాన్ని కనిపెట్టవచ్చు. కానీ, అస్తవ్యస్తమైన ఈ వైఖరితో సత్యాన్ని సరిగ్గా వెల్లడి చేయలేము. ఆ సత్యం ఆధారంగా ఏమి చేయాలో తేల్చుకోలేము. చిన్న, చిన్న వాస్తవాలని మాత్రమే రాసే రచయితలు, ప్రపంచాన్ని నియంత్రించే విధంగా సత్యాలని కూర్చలేరు. ప్రపంచాన్ని నియంత్రించేందుకు ఉపయోగపడడం తప్ప సత్యానికి మరో ప్రయోజనం లేనేలేదు. చిన్న చిన్న వాస్తవాలని రాసే రచయితలు ప్రపంచాన్ని నియంత్రించే సత్యాన్ని రాయలేరు.

సత్యాన్ని రాయడానికి సిద్ధపడి, దానిని కనిపెట్టగలిగే నేర్పు, శ్రద్ధ ఉన్న రచయితలకి సైతం ఇంకా మూడు ఇబ్బందులు ఎదురౌతాయి.

సత్యాన్ని ఆయుధంగా మలచగలిగే నేర్పు కావాలి

సత్యం మాట్లాడితే కార్యాచరణలో వచ్చే పర్యవసానాలని దృష్టిలో ఉంచుకుని సత్యం మాట్లాడాలి. నిరర్థకమైన పర్యవసానాలు, తప్పుడు పర్యవసానాలు ఎలా వుంటాయో చూడాలంటే అనాగరికమైన బర్బరత్వం మూలాన అనేక దేశాలలో ఘోరమైన పరిస్థితులు నెలకొన్నాయనే ప్రబలమైన అభిప్రాయాన్ని తీసుకోవచ్చు. ఈ అభిప్రాయం ప్రకారం, ఒక ప్రకృతి విపత్తులా, ముంచెత్తే వరదలాగా ఈ బర్బరత్వపు కెరటం దేశదేశాలని ముంచెత్తింది.

ఈ అభిప్రాయం ప్రకారం, పెట్టుబడిదారీ విధానం, సోషలిజం ఈ రెండింటి సరసన (వాటికి పై మెట్టున) నిలబడిన ఒక మూడవ శక్తియే ఫాసిజం. ఫాసిజమే లేకుంటే, సోషలిస్టు ఉద్యమమే కాదు, పెట్టుబడిదారీ విధానం కూడా మనగలిగేది. నిజానికి ఇది ఫాసిస్టుల మాట, ఫాసిజానికి లోబడిపోయిన మాట. ఫాసిజం, పెట్టుబడిదారీ విధానం అడుగుపెట్టిన ఒక చారిత్రక దశ. ఆ అర్ధంలో చూస్తే, ఇది నూతనమైనది, అదే సమయంలో పాతది కూడా. ఫాసిస్టు దేశాలలో పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుంది. అది ఫాసిజం రూపంలోనే కొనసాగుతుంది. ఫాసిజాన్ని పెట్టుబడిదారీ విధానంగానే ఎదుర్కోవాలి. పెట్టుబడిదారీ విధానపు అత్యంత నగ్నమైన, సిగ్గులేని, దారుణమైన, వంచనాత్మకమైన రూపంగానే ఫాసిజాన్ని మనం ఎదుర్కోగలుగుతాము.

ఫాసిజాన్ని పుట్టించే పెట్టుబడిదారీ విధానానికి వ్యతిరేకంగా మాట్లాడకుండా ఫాసిజం గురించి సత్యాన్ని ఎవరైనా ఎలా మాట్లాడగలుగుతారు? అలాంటి సత్యం మాట్లాడడంతో ఆచరణలో వచ్చే పర్యవసానాలు ఎలా ఉంటాయి?

పెట్టుబడిదారీ విధానాన్ని వ్యతిరేకించకుండా ఫాసిజాన్ని వ్యతిరేకించేవాళ్ళు, బర్బరత్వాన్ని కాకుండా అందులోనుండి వచ్చిన అనాగరిక ఆదిమత్వాన్ని నిందించేవాళ్ళు, జంతువుని చంపకుండా మాంసాహారం కావాలని కోరుకునే మనుషులలాంటి వాళ్ళు. వాళ్ళు మాంసం తినాలని కోరుకుంటారు. కానీ, రక్తం కనబడితే తట్టుకోలేరు. మాంసం తెచ్చి ఇచ్చేటప్పుడు కసాయికొట్టు మనిషి చేతులకి రక్తం లేకుండా శుభ్రంగా కడుక్కుంటే వాళ్ళకి చాలు. బర్బరత్వాన్ని పెంపొందించే ఆస్తి సంబంధాలని వాళ్ళు వ్యతిరేకించరు. దాని ఆదిమతత్వాన్నిమాత్రమే వ్యతిరేకిస్తారు. అదేవిధమైన ఆస్తి సంబంధాలు నెలకొని ఉన్న దేశాలలో ఉంటూనే వాళ్ళు బర్బరత్వాన్ని విమర్శిస్తూ మాట్లాడతారు. అయితే, ఆ దేశాలలో కసాయివాళ్ళు మాంసం చేతికి అందించే ముందు రక్తం కనబడకుండా చేతులు శుభ్రంగా కడుక్కుంటారు.

బర్బరత్వపు చర్యలని విమర్శిస్తూ గట్టిగా మాట్లాడే మాటలు కొద్దిసేపు పనిచేస్తాయి. తమ తమ దేశాలలో అలాంటి చర్యలకి పాల్పడబోరని శ్రోతలు నమ్మినంతసేపూ ఆ విమర్శలు పనిచేస్తాయి. ఇతర దేశాలతో పోలిస్తే, కొన్ని దేశాలు తక్కువ హింసాయుతమైన చర్యలతోనే తమ ఆస్తి సంబంధాలని కొనసాగించగలుగుతాయి. ఉత్పత్తి సాధనాలపైన యాజమాన్యాన్ని కొనసాగించేందుకు ప్రజాస్వామ్యం వాళ్లకి ఒక సాధనంగా పనిచేస్తుంది. ఆ మిగతా దేశాలలో వాళ్లకి హింస అవసరమౌతుంది. ఫ్యాక్టరీలు, గనులు, ఎస్టేట్ల పైన గుత్త పెట్టుబడి ఆధిపత్యం అన్ని చోట్లా బర్బరత్వపు పరిస్థితులనే సృష్టిస్తుంది. కానీ, కొన్ని చోట్ల అది తక్షణమే స్పష్టంగా కనిపించదు. ఆ గుత్తాధిపత్యాన్ని బహిరంగమైన హింస ద్వారా మాత్రమే కాపాడుకోవాల్సిన స్థితి ఏర్పడినప్పుడే ఆ బర్బరత్వం స్పష్టంగా మన కళ్ళ ముందుకొస్తుంది.

బర్బరత్వపు గుత్తాధిపత్యాన్ని కాపాడుకోవడం కోసం చట్టబద్ధమైన పాలనకి పూచీ, ఇంకా కళలు, తత్వశాస్త్రం, సాహిత్యం వగైరా లాంటి ప్రత్యేక సౌకర్యాలని కాలరాయాల్సిన అవసరం కొన్ని దేశాలలో ఇంకా రాలేదు. ఆశ్రయంకోరి తమ దగ్గరకి వచ్చిన అతిధులు తమ దేశాలలో అలాంటి సౌకర్యాలు లేనే లేవని ఆయా దేశాలని విమర్శిస్తుంటే, అతిధుల మాటలు వినాలని ఆ ఆతిధేయ దేశాలు ముచ్చటపడతాయి. భవిష్యత్తులో రాబోయే యుద్ధాలలో వాళ్ళకి ఈ మాటలు ఉపయోగపడతాయి. ఉదాహరణకి, ‘జర్మనీ మనకాలపు దుష్టశక్తి, దుర్భర నరకం, క్రీస్తు వ్యతిరేకుల ఆవాసం’ అంటూ జర్మనీకి వ్యతిరేకంగా అలుపులేని యుద్ధం కొనసాగించాలని బిగ్గరగా గొంతెత్తి నినదించే వాళ్ళు సత్యాన్ని గుర్తించినవాళ్ళేనని మనం అనుకోవాలా? మనం అటువంటి వాళ్ళని మూర్ఖులనీ, ప్రమాదకరమైన మనుషులనీ గుర్తించాలి. ఎందుకంటే, ఇలాంటి చెత్తమాటలతో మొత్తం జర్మనీ దేశం దేశమంతటినీ, ప్రజలందరినీ నిర్మూలించివేయాలనే నిర్ధారణకు రావలసి ఉంటుంది. అలా నిర్మూలించడానికి మనం విసిరే బాంబులూ, విషవాయువులూ ప్రత్యేకించి చెడ్డవాళ్ళని మాత్రమే వేరుచేసి నిర్మూలించేవి కావు.

సత్యాన్ని తెలుసుకోలేని తెలివిమాలిన మనిషి అనిర్దిష్టంగా, అస్పష్టంగా, గొప్ప గొప్ప మాటలు మాట్లాడుతూ ఉంటాడు. అతను జర్మన్లని నిందిస్తాడు, దుష్టత్వాన్ని విమర్శిస్తూ ఉంటాడు. అయితే, ఆ మాటలు వింటున్న వాళ్ళెవరికీ ఏం చేయాలనేది మాత్రం అర్ధం కాదు. తాను జర్మన్ కాకుండా ఉండాలా? తాను మంచివాడైతే, నరకమనేది లేకుండా పోతుందా? బర్బరత్వం నుండే పుట్టుకొచ్చే బర్బరత్వం గురించి సొల్లు మాటలు అన్నీ ఇదే కోవకు చెందుతాయి. బర్బరత్వానికి మూలం బర్బరత్వం. దానిని సంస్కృతితో ఎదుర్కోవాలి. ఆ సంస్కృతి విద్య ద్వారా వస్తుంది. ఇలాంటి మాటలు అన్నీ అనిర్దిష్ఠమైనవి. అవి కార్యాచరణకు దారిచూపేవికావు. అవి ప్రత్యేకించి ఎవరినీ ఉద్దేశించి చెప్పే మాటలు కావు.

అలాంటి అస్పష్టమైన మాటలు, గొలుసుకట్టుగా పనిచేసే కారణాలలో కొన్నిటిని మాత్రమే ఎత్తిచూపుతాయి. దానిని నడిపించే శక్తులని నియంత్రించసాధ్యంకాని శక్తులుగా చిత్రిస్తాయి. ఈ వివరణలు అన్నీ చాలా అస్పష్టంగా, వినాశాన్ని సృష్టించే శక్తులని మరుగుపరుస్తాయి. కొంచెం వెలుగు ప్రసరిస్తే, ఈ వినాశనానికి కారకులు మనుషులేననేది సూటిగా కనిపిస్తుంది. మనం మనుషుల భవితవ్యాన్ని మనుషులే నిర్ణయించే యుగంలో జీవిస్తున్నాము.

ఫాసిజం అనేది ఒక ప్రకృతి సహజమైన విపత్తుకాదు. అది ‘మానవ స్వభావం’ అనే వివరణతో సులభంగా అర్ధంచేసుకోగలిగేది కాదు. అయితే, ప్రకృతి విపత్తులని చిత్రించేటప్పుడు సైతం మనుషులుగా మనం వాటిని వివరించే పద్ధతులు వున్నాయి. అవి, వాటిని తట్టుకోగలిగే మనిషి పోరాటాన్ని చిత్రించుతాయి.

ఒక మహా భూకంపం యోకోహామా నగరాన్ని నాశనం చేసినప్పుడు, అమెరికన్ పత్రికలు అనేకం అక్కడ కూలిపోయిన శిధిలాల చిత్రాలని ప్రచురించాయి. వాటికింద ‘ఉక్కు నిలబడింది’ అనే శీర్షికని పెట్టారు. ముందు చూసేవాళ్ళందరికీ కూలిపోయిన శిధిలాలు కనిపిస్తాయి, కానీ, దృష్టిని ఆకర్షించే శీర్షికని చూశాక, కొన్నిఎత్తైన భవనాలు చెక్కుచెదరకుండా నిలబడ్డాయని పాఠకులు తెలుసుకుంటారు. భూకంపం గురించి వివరించాలంటే, నిర్మాణ రంగంలోని ఇంజనీర్లు తెలియజేసే వివరాలు అన్నిటికంటే కీలకమైనవి. భూమిపొరలలో వచ్చే మార్పులు, భూకంపం తీవ్రత, అది సృష్టించే వేడి మొదలైన వివరాలని గుర్తిస్తే, అవి భూకంపాలని తట్టుకుని నిలబడగలిగే భావి నిర్మాణాలకి అవి పునాదులు వేస్తాయి. ఫాసిజం, యుద్ధం ఇవి ప్రకృతి విపత్తులలాంటివి కావు. వాటిని ఎవరైనా వివరించాలంటే, వాటికి సంబంధించిన ఆచరణాత్మక సత్యాన్ని గుర్తించాలి. ఉత్పత్తిసాధనాలపై యాజమాన్యం లేని అసంఖ్యాకమైన శ్రామిక ప్రజలని కట్టడి చేయడంకోసం, ఆస్తిపర వర్గాలు సృష్టించిన విధ్వంసక విపత్తులే ఫాసిజం, యుద్ధం అని నిరూపించాలి.

దారుణమైన పరిస్థితుల గురించి సత్యాన్ని చక్కగా రాయాలంటే, నివారించుకోగలిగిన ఆ పరిస్థితులకి దారితీసిన కారణాలని గుర్తించే విధంగా రాయాలి. నివారించుకోగలిగిన ఆ పరిస్థితులని గుర్తించామంటే, ఆ దారుణమైన పరిస్థితులని ఎదిరించవచ్చు.

సత్యం ఎవరిచేతులలో బలమైన ఆయుధంగా మారుతుందో గుర్తించగలగాలి

వర్ణనాయుతమైన లిఖిత సాహిత్య వ్యవహారానికి శతాబ్దాల సంప్రదాయముంది. రచయితలకి తమ పాఠకుల గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదనే తప్పుడు అభిప్రాయం ఏర్పడిపోయింది. ఆస్థాన పోషకులు, యజమానులు తమ రచనలను అందరికీ చేరుస్తారని రచయితలూ నమ్ముతారు. నేను మాట్లాడితే, వినాలనుకున్న వాళ్ళందరూ వింటారని రచయిత భావిస్తాడు. నిజానికి, రచయితకి డబ్బులు చెల్లించగలిగినవాళ్ళే తన మాటలని వింటారు. ఆ రచయిత మాట్లాడినదాన్ని అందరూ వినలేదు. విన్నవాళ్ళు ఆ రచయిత చెప్పిన మాటలన్నిటినీ వినాలని అనుకోనూలేదు. ఈ విషయమగురించి ఇప్పటికే చాలా చాలా రాసివుంది. ఎంటరాసినా, అది తక్కువే. ఒక్క మాటని మాత్రం నేను నొక్కి చెప్పాలనుకుంటున్నాను. ‘ఎవరో ఒకరికోసం రాయడం’ అనే విషయం కేవలం ‘రాయడం’గా మారిపోయింది. వాస్తవం ఏమిటంటే, అలా వట్టిగా రాయడం సాధ్యం కాదు. నువ్వు ఎవరో ఒకరి కోసమే రాస్తావు, వాళ్ళు ఆ రచనని ఏదో ఒకదానికోసం ఉపయోగించుకుంటారు. సత్యాన్ని గుర్తించడం అనేది రచయితా, పాఠకుడూ కలిసి గుర్తించే క్రమం. ఏది మంచిదో చెప్పాలని అంటే, ముందు నువ్వు మంచి శ్రోతవు కావాలి. ఏది మంచిదో నువ్వు వినాలి. సత్యాన్ని నువ్వు నిక్కచ్చిగా చెప్పాలి, నిక్కచ్చియైన మాటలని నువ్వు వినాలి. రచయితలుగా మన మాటలను మనం ఎవరికి చెప్పాలి, ఎవరి మాటలని మనం వినాలి అన్నది మనకి కీలకమైనది.

దారుణమైన పరిస్థితులలో ఉన్నవాళ్లకు ఆ దారుణమైన పరిస్థితుల గురించి సత్యాన్ని మనం చెప్పాలి. ఆ పరిస్థితుల గురించి మనం వాళ్ళ దగ్గర తెలుసుకోవాలి. ఒక ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్న జనాలతోనే గాకుండా, తమ పరిస్థితుల రీత్యా అలాంటి అభిప్రాయాలనే పంచుకునే జనాలతో కూడా మనం మాట్లాడాలి. మీ శ్రోతలు నిరంతరం మారిపోతూ ఉంటారు. ఉరితీసినందుకు జీతం అందని పరిస్థితులలోనే, ఉరి తీయడం ప్రమాదకరంగా పరిణమించినప్పుడో మనం ఉరితీసే తలారితో సైతం మనం మాట్లాడగలుగుతాము. బవేరియా ప్రాంత రైతులు ఎలాంటి విప్లవానికైనా వ్యతిరేకం. కానీ, యుద్ధం సుదీర్ఘంగా కొనసాగి, ఆ రైతుల బిడ్డలు యుద్ధరంగం నుంచి ఇంటికి తిరిగి వచ్చేశాక, వ్యవసాయ క్షేత్రాలలో తమకి పనిలేని పరిస్థితులని ఎదుర్కొంటున్నప్పుడు, వాళ్ళని విప్లవం వైపు గెలుచుకోవడం వీలవుతుంది.

రచయితలుగా మనం సత్యాన్ని చెప్పేటప్పుడు, తగిన సరైన స్వరాన్ని ఎంచుకోవడం కూడా ముఖ్యమైనది. మృదువైన, విషాదపు మంద్ర ధ్వనితో, చీమకు సైతం హాని తలపెట్టరనిపించే మనుషుల స్వరాన్ని మనం వింటాము. దుర్భరమైన పరిస్థితులలో ఉన్న జనాలు ఆ స్వరాన్ని వింటే, అది మరింత దుర్భరంగా అనిపిస్తుంది. ఈ స్వరంతో మాట్లాడేవాళ్ళు మనకి శత్రువులు కాకపోవచ్చుగానీ, మనతో పోరాడే సహయోధులు మాత్రం కారు. సత్యం తీక్షణమైనది, యుద్ధం లాంటిది. అది అసత్యాలకి వ్యతిరేకంగానే కాదు, ఆ అసత్యాల్ని వ్యాప్తి చేసే వాళ్లకి వ్యతిరేకంగా కూడా పోరాడుతుంది.

సత్యాన్ని ఎక్కువమందిలో వ్యాపింపజేసే నేర్పు కావాలి

సత్యాన్ని మాట్లాడే ధైర్యం, తెగువ వున్నందుకు కొందరు గర్వపడతారు. సత్యాన్ని కనిపెట్టినందుకు సంతోషపడతారు. అయితే, ఆ సత్యాన్ని ఉపయోగకరమైన రీతిలో వ్యక్తీకరించేందుకు ప్రయాస పడలేక, ఎవరి ప్రయోజనాలని ఆ సత్యం కాపాడుతుందో వాళ్ళకు ఇంకా అర్ధం కాలేదన్న అసహనంతో చాలామంది ఆ సత్యాన్ని ఎక్కువమందిలోకి తీసుకుపోయే నేర్పరితనాన్ని గురించి పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తారు. దాంతో వాళ్ళ కృషి ఫలితమంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. సత్యాన్ని అణగదొక్కి, ముసుగులు వేసిన ప్రతీ కాలంలోనూ ఇలాంటి నేర్పరితనమే సత్యాన్ని వ్యాపింపజేసింది. చారిత్రిక సంఘటనలకు సంబంధించిన పాత దేశభక్తియుత క్యాలెండర్ ను కన్ఫ్యూషియస్ కొంచెం మార్చాడు. అందులో కొన్ని పదాలని మాత్రమే మార్చాడు. ‘తత్వవేత్త వాన్ మాట్లాడినందుకు పాలకుడైన కున్ తనని చంపివేశాడు’ అనే వాక్యంలో ‘చంపివేశాడు’ అనే పదం స్థానంలో ‘హత్య చేశాడు’ అనే పదాన్ని మార్చాడు. నిరంకుశుడైన ఒక రాజు హత్యకు గురై చనిపోతే, అతన్ని ‘శిక్షించారు’ అనే పదాన్ని మార్చాడు. తాను చేసిన ఈ మార్పులతో కన్ఫ్యూషియస్ చరిత్ర పట్ల ఒక నూతన అంచెనాకి దారులు వేశాడు.

మన కాలంలో, ‘ప్రజలు లేదా జాతి’ అనే మాటకి బదులు ‘జనాలు’, ‘భూమి’ అనే మాటకి బదులు ‘ప్రైవేటు భూమి’ అనే పదాల్ని వాడే వాళ్ళు, తమ చర్యల ద్వారా అనేకానేక అసత్యాలకి తమ మద్దతుని నిరాకరించినవాళ్ళవుతారు. తమ చర్యతో వాళ్ళు ఆ పదాలకి కుళ్లిపోయిన, మార్మికమైన ముసుగుని తొలగించారు. ‘ప్రజలు’ అనే మాటలో కొన్ని ఉమ్మడి ప్రయోజనాలు, ఒక ఐక్యత ఉన్నాయనే అర్ధం స్ఫురిస్తుంది. అందుకని, అనేకమంది ప్రజలు ఉన్న సందర్భంలో మాత్రమే ‘ప్రజలు’ అనే మాటని ఉపయోగించాలి. అప్పుడే వాళ్ళ ఉమ్మడి ప్రయోజనాలు వెల్లడౌతాయి. కాగా, ఒక భూప్రాంతంలో ఉండే జనాలు, విభిన్నమైన, పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు కలిగి ఉండవచ్చు. ప్రజలు అనే మాట ఈ సత్యాన్నే దాచి పెడుతుంది. అలాగే, ‘భూమి’ అనే మాటని వాడేవాళ్లు, దున్నిన పొలాలనీ, నేల పరిమళాన్నీ, రంగునీ మనముందు నిలిపి, పాలకుల అసత్యాలని కాపాడుతున్నారు. ఈ నేలలో భూసారం, భూమిపై మనిషి మమకారం, చెమటోడ్చే మనిషి శ్రమా – వీటితో సమస్య లేదు. సమస్య, పండించిన పంటకు, చెమటోడ్చిన శ్రమకూ లభించే ధరలో ఉంది. నేలపై లాభ సంపాదించినవాళ్లు దానిని సాగుచేసి పండించిన మనుషులు కాదు. దున్నిన నేల పరిమళానికి అంగడిలో విలువలేదు. ఆ అంగడి వాసన పూర్తిగా వేరైనది. ప్రైవేటు భూమి అన్నది సరైన వ్యక్తీకరణ. అది అబద్ధపు వంచనకు తావు ఇవ్వదు. అణచివేత రాజ్యమేలుతున్న సమయంలో ‘క్రమశిక్షణ’ అనే మాటకి బదులు ‘విధేయత’ అనే పదాన్ని వాడాలి. ఎందుకంటే, పరిపాలించేవాళ్ళు లేకపోయినా, క్రమశిక్షణ ఉండవచ్చు. విధేయతతో పోల్చిచూస్తే, క్రమశిక్షణ కొంత ఉదాత్తమైన సుగుణం. అలాగే, ‘గౌరవం’ కంటే ‘మనిషి విలువ’ మెరుగైన మాట. ఈ మాటలో మనిషిని మనం తేలికగా పక్కన పెట్టలేము. ప్రజల గౌరవాన్ని కాపాడే పేరుమీద ఎలాంటి వెధవలు తోసుకుని ముందుకొస్తారో మనకి తెలుసు. తెగ బలిసిన వాళ్ళు, వాళ్ళ తిండికోసం ఆకలితో మాడే వాళ్ళతో గౌరవాన్ని ఎంతగా పంచుకుంటారో మనకి తెలుసు. కన్ఫ్యూషియస్ చతురతని మనం ఇప్పటికీ ఉపయోగించుకోవచ్చు.

జాతీయ సంఘటనలలో అన్యాయమైన వాటిని వివరించే పదాల స్థానంలో న్యాయమైన వాటిని ప్రవేశపెట్టాడు. థామస్ మూర్ తన రచన ఉటోపియా (ఊహాస్వర్గం)లో న్యాయమైన పరిస్థితులు నెలకొన్న ఒక దేశాన్ని వర్ణించాడు. అది తాను నివసించిన ఇంగ్లాండు దేశంకంటే ఎంతో భిన్నమైనది. కానీ, జీవన స్థితిగతుల్ని మినహాయిస్తే, అది ఇంగ్లండుకి అతి సమీపమైన పోలికలతో ఉంటుంది!

లెనిన్ సఖాలిన్ ద్వీపంలో దోపిడీ పీడనలను వివరించాలనుకున్నాడు. అయితే, జార్ ప్రభుత్వ పోలీసుల నిర్బంధం పట్ల తాను జాగ్రత్తగా ఉండాల్సి ఉంది. అందుకని, తన వర్ణనలో, రష్యాకి బదులు జపాన్ నీ, సఖాలిన్ ద్వీపానికి బదులు కొరియా దేశాన్నీ పేర్కొంటూ రాశాడు. జపాన్ బూర్జువా వర్గం అనుసరించే పద్ధతులను గురించి చదివే పాఠకులకు అది సఖాలిన్ ద్వీపంలో రష్యన్ బూర్జువా వర్గం అనుసరించే పద్ధతులను గుర్తుచేసింది. అయితే, రష్యా, జపాన్ లు శత్రు దేశాలు కావడంతో లెనిన్ రచన నిషేధానికి గురికాలేదు. జర్మనీ గురించి జర్మనీలో చెప్పలేని వాటిని ఆస్ట్రియా ప్రస్తావనలో చెప్పవచ్చు.

అనుమానంతో వేధించే రాజ్యాన్ని మభ్యపెట్టడానికి ఎన్నోరకాలైన ఉపాయాలున్నాయి.

చర్చి నమ్మే అద్భుతాల విశ్వాసానికి వ్యతిరేకంగా వోల్టేర్ పోరాడాడు. జోన్ ఆఫ్ ఆర్క్ పై ‘మెయిడ్ ఆఫ్ ఆర్లియన్స్’ అనే సాహసోపేతమైన పద్యాన్ని రాశాడు. మగ సైనికులు, కులీన వర్గాల న్యాయస్థానం, మతగురువుల బృందం ఇందరి మధ్య జోన్ ఆఫ్ ఆర్క్ కన్యగానే మిగలాలంటే అద్భుతం జరగాల్సిందేనని వోల్టేర్ రాశాడు.

సొగసైన తన శైలి, కులీన వర్గాల విలాస జీవితాలలోని శృంగారాన్ని వర్ణించడం ద్వారా ఆ విలాస స్వైర జీవితాన్ని కొనసాగించేందుకు అనుమతించిన మతంలోని కాపట్యాన్ని వోల్టేర్ ఎండగట్టాడు. దీనితో, తాను ఎవరిని ఉద్దేశించి రాశాడో, ఆ పాఠకులకు రహస్యంగా చేరేలా చూశాడు. ఉన్నత స్థానాలలో ఉన్న వోల్టేర్ పాఠకులు తన రచనలని ప్రోత్సహించారు. తన రచనల వ్యాప్తిని అడ్డుకోలేదు. దీనిద్వారా తమ సుఖభోగాలని కాపాడుతున్న పోలీసులను కూడా వాళ్ళు ఎండగట్టినట్లయింది. ఎపిక్యూరస్ నాస్తికవాదాన్నివ్యాపింపజేయడానికి తన కవితల సౌందర్యం ఎంతో దోహదం చేసిందని లుక్రీషస్ అంటాడు.

ఒక రచనలో ఉన్నత సాహిత్య ప్రమాణాలు దానికి కొంత రక్షణ కల్పించవచ్చు. అయితే, చాలా సందర్భాలలో అవి అనుమానాలను రేకెత్తిస్తాయి. అలాంటి సందర్భాలలో ఉద్దేశ్యపూర్వకంగానే ఆ ప్రమాణాలను కొంచెం తగ్గించాల్సి రావచ్చు. ఉదాహరణకు, అధమస్థాయి అని తిరస్కారానికి గురయ్యే డిటెక్టివ్ నవలలలో అక్కడక్కడా దారిద్య్రపు సాంఘిక పరిస్థితుల వర్ణనని చొప్పించవచ్చు. ఆ వర్ణనలు డిటెక్టివ్ నవలలకి అసందర్భం అనిపించకుండా నప్పుతాయి. అలాంటి కారణాలు లేకుండానే కొన్ని సందర్భాలలో షేక్స్పియర్ తన రచనా స్థాయిని కావాలని తగ్గించుకుని రాశాడు. తన విషాదాంత నాటకం కొరియోలెనస్ లో, తన సొంత నగరమైన రోమ్ పై దండెత్తవద్దని కొరియోలిన్స్ తల్లి తనని ఒప్పించే ఉపన్యాస సన్నివేశాన్ని షేక్స్పియర్ కావాలని పేలవంగా రాశాడు. తన తల్లి ఉపన్యాసంలో శక్తికి చలించిపోయి, కొరియోలెనస్ రోమ్ పై దాడిచేయకుండా ఆగినట్లు కాకుండా, తనకి అలవాటైన బద్ధకాన్ని అందుకు కారణంగా చిత్రించాలనుకున్నాడు. సత్యాన్ని వ్యాపింపజేసే చతురతకి షేక్స్పియర్ రచనలలో మరొక ఉదాహరణని మనం చూడవచ్చు. అది, సీజర్ శవం దగ్గర ఆంటోనీ ఉపన్యసించే సన్నివేశం.సీజర్ ని హత్య చేసిన బ్రూటస్ పెద్దమనిషియని పదేపదే తన ఉపన్యాసంలో అంటూనే, సీజర్ చేసిన పనుల గురించి ఆంటోనీ మాట్లాడతాడు. ఇందులో బ్రూటస్ ఆరోపణలకంటే సీజర్ చేసిన పనులగురించే ఆకట్టుకునే విధంగా మాట్లాడతాడు. ఇక్కడ ఆంటోనీ ఉపన్యాసంలో మాటలు ఆ ఉపన్యాసంలో పేర్కొనే వాస్తవాల ముందు ఓడిపోతాయి. ఇక్కడ ఉపన్యాసకుడి మాటలని సత్యం ఓడించే పద్ధతిని షేక్స్పియర్ ఎంచుకున్నాడు.

నాలుగు వేల సంవత్సరాల క్రితం ఈజిప్తులో జీవించిన కవి ఒకరు కూడా ఇదే పద్ధతిని ఉపయోగించాడు. అది తీవ్రమైన వర్గపోరాటం కొనసాగుతున్న కాలం. అప్పటిదాకా పాలిస్తూ ఉండిన వర్గం, బలమైన ప్రత్యర్థి వర్గం నుండి తీవ్రమైన పోటీని ఎదుర్కొంటూ ఉంది. ప్రత్యర్థి వర్గం అప్పటిదాకా, పాలకవర్గానికి సేవచేస్తూ ఉండింది. కవితలో, ఒక జ్ఞాని రాజు ఆస్థానంలోకి వచ్చి, అంతర్గత శత్రువుకు వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరం గురించి హెచ్చరిస్తాడు. కింది వర్గాల తిరుగుబాటు మూలంగా తలెత్తిన అవ్యవస్థని సుదీర్ఘంగావర్ణించి చెబుతాడు. ఆ వర్ణన ఇలా ఉంది.

ధనవంతులందరూ గగ్గోలు పెడుతున్నారు, పేదవాళ్ళు ఆనందంలో మునిగివున్నారు.
బలవంతులనందరినీ తరిమేయాలని నగరాలన్నిటిలో తీర్మానాలు
కార్యాలయాల తాళాలు పగలగొట్టి దస్తావేజులని తీసిపారవేస్తున్నారు, బానిసలే యజమానులుగా మారిపోతున్నారు.
గొప్ప వాళ్ళ పిల్లలని ఇప్పుడెవరూ గుర్తుపట్టడంలేదు, ఉంపుడుగత్తె బిడ్డ బానిస కొడుకవుతున్నాడు.
పౌరుల మెడలకి గుదిబండలు కట్టారు, ఎండపొడనెరగని వాళ్ళు ఇప్పడు వీధులలోకి వచ్చేశారు
భోషాణాలని పగలగొడుతున్నారు. మంచాల తయారీ కోసం విలువైన జిట్రేగి చెట్లని నరికేస్తున్నారు
ఇదిగో, రాజప్రాసాదం పతనమైపోయింది
నిరుపేదలు ధనవంతులవుతున్నారు
మునుపు తినడానికి తిండిలేని మనిషి ఇప్పుడు ధాన్యపుకొట్టు యజమాని అయ్యాడు. ఇతరుల ధాన్యంతో అతని గరిసెలు నిండాయి.
ఇదిగో, ఇప్పుడు ఎవరి తిండి వారు తినడమే గొప్ప.
మునుపు తిండిగింజలు లేని మనిషికి ఇప్పుడు ధాన్యపు గరిసెలున్నాయి. మునుపు తిండికోసం బిచ్చమెత్తుకున్న మనిషి ఇప్పుడు దానాలు చేస్తున్నాడు.
మునుపు కాడెద్దులు లేని మనిషి, బరువులు లాగే బండెద్దులు లేని మనిషి ఇప్పుడు ఆవులమందకి అధిపతి అయ్యాడు.
మునుపు పూరిగుడిసె లేని మనిషి ఇప్పుడు బంగళాకి యజమాని అయ్యాడు.
మంత్రులు ధాన్యపు కోట్లలో తలదాచుకుంటున్నారు. మునుపు గోడకి ఆనుకుని కునుకు తీసినమనిషి ఇప్పుడు పట్టుపరుపులమీద నిద్రపోతున్నాడు.
మునుపు పడవ లేని మనిషి ఇప్పుడు ఓడలకి యజమాని అయ్యాడు. మునుపటి ఓడల యజమాని చేతిలో ఇప్పుడా ఓడలు లేవు.
మునుపు పట్టు వస్త్రాలు ధరించిన మనుషులు ఇప్పుడు చింకిపాతల్లో తిరుగుతున్నారు. మునుపు బట్టలు లేని మనిషూలు ఇప్పుడు మేలిరకం దుస్తులు ధరిస్తున్నారు.
ధనవంతులు దాహంతో అలమటిస్తుంటే, మునుపు పాత్రలలో మిగిలిన నీళ్లకోసం ప్రాధేయపడిన మనుషులు ఇప్పుడు మద్యం సేవిస్తున్నారు.
సంగీతం గురించి ఓనమాలు తెలియని మనిషి ఇప్పుడు సంగీత వాయిద్యాలకి యజమాని అయ్యాడు. ఎప్పుడూ పాటలు వినని మనిషి ఇప్పుడు సంగీతాన్ని ప్రశంసిస్తున్నాడు.
పేదరికంతో, పెళ్ళాడలేక ఒంటరిగా నిద్రించిన మనిషికి ఇప్పుడు భార్యలున్నారు. మునుపు నీటిలో నీడని చూసుకున్న మనిషి ఇప్పుడు అద్దానికి యజమాని అయ్యాడు.
మునుపు ఉన్నత స్థానాలలో పనిచేసిన వాళ్ళకి ఇప్పుడు ఉద్యోగాలు లేవు. పైనున్నవాళ్ళకి ఇప్పుడు నివేదికలు ఏవీ చేరడం లేదు. మునుపు వార్తలు చేరవేసిన మనిషి ఇప్పుడు వార్తలకోసం ఇతరులని పంపుతున్నాడు…
మునుపు యజమాని ఐదుగురు మనుషులని పంపించేవాడు. ఇప్పుడు వాళ్ళు మీరే వెళ్లి తెలుసుకోండి, ఇప్పుడు మాదే రాజ్యం అంటున్నారు..
.

అవ్యవస్థ నెలకొన్న పరిస్థితుల గురించిన ఈ వర్ణన మొత్తం అణగారిన ప్రజలు కోరుకునే విధంగా ఉందనేది స్పష్టంగా కనిపిస్తుంది. కానీ ఇందులో కవి ఉద్దేశ్యమేమిటో మనకి స్పష్టంగా కనిపించదు. అతని అభిప్రాయం ఇదీ ఇదమిద్ధంగా చెప్పలేము. ఈ పరిస్థితులని అతను ఖండిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ అది బలహీనమైన ఖండన..

పేదవాళ్ల పిల్లలని నరికివేసి, వాళ్ళ మాంస ఖండాలని అమ్మడం ద్వారా దేశాన్ని సంపద్వంతంగా చేయవచ్చని నవలా రచయితా జోనాథన్ స్విఫ్ట్ ఒక కరపత్రంలో రాశాడు. ఎంతెంత పొదుపు చేయగలరో, ఎంతెంత సాధించవచ్చో ఖచ్చితమైన లెక్కలు కూడా వేశాడు.

జోనాథన్ స్విఫ్ట్ అమాయకత్వాన్ని నటించాడు. తాను తీవ్రంగా ద్వేషించిన ఒక ఆలోచనా ధోరణిని సమర్ధిస్తున్నట్లు రాశాడు. సమగ్రమైన రీతిలో, ఉద్రేకపూరితంగా రాశాడు. అటువంటి ఆలోచనా ధోరణిలోని కుటిలత్వం అందరికీ స్పష్టంగా తెలిసేలా రాశాడు. స్విఫ్ట్ కంటే తెలివైన వాళ్ళు, కనీసం తనకంటే మానవత్వం వున్న వాళ్ళు, ప్రత్యేకించి ఈ ఆలోచనా ధోరణితో తలెత్తే తార్కిక పర్యవసానాలగురించి ఆలోచించకుండా అప్పటిదాకా వాటిని సమర్ధించేవాళ్ళు గుర్తించేలా రాశాడు.

ఏ రంగంలోనైనా ఆలోచలు రేకెత్తించే ప్రచారం, అణగారిన ప్రజలకి ఉపయోగపడుతుంది. ఇటువంటి ప్రచారం చాలా అవసరం. దోపిడీని బలపరిచే ప్రభుత్వాల పాలనలో ఆలోచనని అధమమైనదిగా పరిగణిస్తారు.

అణగారిన ప్రజలకి ఉపయోగపడేవాటన్నిటినీ నీచమైనవిగా పరిగణిస్తారు. పేదవాళ్ళు ఏపూటకాపూట తిండి ఎక్కడ దొరుకుతుందా అని మధన పడితే అది నీచపు ఆలోచన అంటారు. దేశంలో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే, ఆ దేశాన్ని రక్షించడం పేరిట ఇచ్చే పురస్కారాలని తిరస్కరిస్తే, అదీ నీచం అంటారు. దేశాన్ని వినాశనం వైపు నడిపిస్తున్న ఫ్యూరర్ (హిట్లర్) ని సందేహించడం తప్పు, నీచం. శ్రమజీవుల కడుపు నింపడానికి ఉపయోగపడని పని చేయ నిరాకరిస్తే, అది నీచమైన పని అంటారు. అర్థరహితమైన పనులని బలవంతంగా చేయించడాన్ని వ్యతిరేకిస్తే అది నీచమైనదని అంటారు. ఏం చేసినా పనికిరాని కుటుంబాన్ని పట్టించుకోకపోతే, అదీ నీచం. ఆకలితో అల్లాడితే వాళ్ళు దురాశాపరులు. కాపాడుకోవడానికి చేతిలో ఈ ఆయుధమూలేని నిరాయుధులు పిరికిపందలు. పీడకులని సందేహిస్తే, అది తమ స్వబలాన్ని సందేహించినట్లట. శ్రమకి వేతనాలడిగినవాళ్లు సోమరిపోతులట. ఇలాంటి రాజ్యంలో ఆలోచించడాన్ని నీచంగా, అమర్యాదగా పరిగణిస్తారు. ఆలోచించడాన్ని నేర్పించరు. ఆలోచన ఎక్కడ తలెత్తినా ఆలోచించేవాళ్లను వేధిస్తారు. అయినా వేధింపులు, శిక్ష భయం లేకుండా, ఆలోచనల గెలుపును చాటిచెప్పే అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. నియంతలకి ఆలోచన అవసరమైన రంగాలలో ఆ అవకాశాలు ఉంటాయి. మిలిటరీ విజ్ఞానం, సాంకేతిక రంగాలలో ఆలోచనల విజయాన్ని నిరూపించవచ్చు. సరైన నిర్వహణ ద్వారా ఉన్ని సరఫరాని పెంపొందించడం, ఉన్నికి ప్రత్యామ్నాయ వస్తువులని కనిపెట్టడం లాంటి విషయాలకు సైతం సృజనాత్మక ఆలోచన అవసరమౌతుంది. ఆహారపదార్ధాల కల్తీ, యువకులకు యుద్ధ శిక్షణ ఇవ్వడం లాంటి విషయాలలో కూడా సృజనాత్మక ఆలోచన అవసరం. అలాంటి ఆలోచనలను వాళ్ళు అనుమతిస్తారు. పర్యవసానాలు, లక్ష్యాలను గమనంలోకి తీసుకోకుండా యుద్ధాన్ని కీర్తించకుండా ఉండాలంటే యుక్తిపూర్వకమైన ఆలోచన అవసరం. యుద్ధాన్ని మెరుగైన రీతిలో నడిపించడం అనే ప్రశ్నపై చర్చ, అసలు ఈ యుద్ధం న్యాయమైనదేనా అనే ప్రశ్నకి దారితీసే ఆలోచన చేయవచ్చు. అర్థరహితమైన యుద్ధాన్ని ఎలా నివారించాలనే అనే మరో ప్రశ్నకి కూడా దారితీయవచ్చు.

అయితే, బహిరంగంగా ఈ ప్రశ్నని వేయడం కష్టం. అలాంటప్పుడు, మనం ప్రేరేపించే ఆలోచనలని ఉపయోగించుకోవడం సాధ్యం కాదా? అంటే, కార్యాచరణకు దారితీసే విధంగా ఆలోచనలని ప్రేరేపించలేమా? ఆ పని సాధ్యమే.

అత్యధిక ప్రజానీకాన్ని అతికొద్దిమంది దోచుకుని అణచివేస్తున్న మన కాలంలో, ఆ అణచివేత కొనసాగాలంటే, అందుకోసం జనాలలో ఒక ప్రత్యేకమైన దృక్పథం వ్యాప్తిలో ఉండాలి. ఆ దృక్పథం అన్ని రంగాలలో వ్యాపించి ఉండాలి. జంతుశాస్త్ర రంగంలో ఇంగ్లీషు శాస్త్రవేత్త ఛార్లెస్ డార్విన్ ఆవిష్కరణలాంటివి హఠాత్తుగా వాళ్ళ దోపిడీకి ముప్పు తెచ్చిపెట్టవచ్చు. అయితే, కొద్ది కాలం పాటు చర్చి మాత్రమే గాభరా పడింది. మిగతా ఎవరూ కంగారుపడలేదు. ఇటీవలి కాలంలో భౌతిక శాస్త్రవేత్తల పరిశోధనలు ఆలోచనా తర్కంపై ప్రభావాన్ని వేసాయి. అది, అణచివేతను కాపాడే పిడివాదాన్ని బద్దలుకొట్టవచ్చు. ప్రష్యన్ రాజ్యపు తత్వవేత్త హెగెల్, తర్కానికి సంబంధించి సంక్లిష్టమైన పరిశీలనలు చేసాడు. శ్రామికవర్గ విప్లవ సిద్ధాంతకర్తలైన మార్క్స్, లెనిన్ లకు వెలకట్టలేని విలువైన విశ్లేషణా పద్ధతులను హెగెల్ అందించాడు. విజ్ఞానశాస్త్రాల మధ్య వాటి అభివృద్ధిలో పరస్పర సంబంధం ఉంటుంది. అయితే ఆ అభివృద్ధి అన్నింటా ఏకకాలంలో జరిగేది కాదు. అందుకని, రాజ్యానికి అన్నింటిపైనా ఏకకాలంలో ఒక కన్నేసి ఉంచడం వీలుపడదు. సత్యంకోసం పోరాడే వాళ్ళు సాపేక్షంగా నిఘాఅంతగా లేని రంగాలని ఎంచుకుని పనిచేయవచ్చు. సరిగ్గా ఆలోచించే పద్ధతులని, సకల విషయాలనీ, క్రమాలనీ ప్రశించే ఆలోచనా ధోరణిని నేర్పడం మీద, తాత్కాలికమైన, మార్పులకు గురౌతున్న వాటి స్వభావాన్ని గుర్తించడం మీదనే అంతా ఆధారపడివుంది.

పెను మార్పులు మన పాలకులకి నచ్చవు. అన్నీ ఉన్నవి ఉన్నట్టుగా యథాతథంగా వుండాలని, అవకాశముంటే వేయి సంవత్సరాలు ఇలాగే కొనసాగాలని పాలకులు కోరుకుంటారు. సూర్య, చంద్ర గ్రహాలు తమ కక్ష్యలలో నిశ్చలంగా నిలిచిపోవాలని వాళ్ళ కోరిక. అప్పుడు ఎవరికీ ఆకలి కాదు, రాత్రి భోజనం కావాలని కోరుకోరు. పాలకులు కాల్పులు జరిపితే, ప్రత్యర్ధులు తిరిగి కాల్పులు జరిపే పరిస్థితి ఉండకూడదు. వాళ్లదే తుది విజయం కావాలని కోరుకుంటారు. మార్పులు సంభవించే క్రమాన్ని నొక్కిచెప్పే ఆలోచనా ధోరణి అణగారిన ప్రజలకి మేలు చేస్తుంది. ప్రతీ విషయంలోనూ, ప్రతీ వస్తువులోనూ వైరుధ్యాలు ఉంటాయనీ, అవి అభివృద్ధి చెందుతాయనీ చెప్పే వాస్తవాన్ని విజేతలని ఎదిరించేందుకు ఉపయోగించుకోవాలి. వివిధ పరిణామాలను పరిశీలించేటప్పుడు ఇలాంటి దృక్పథాన్ని (ప్రతీదీ మార్పుకు లోనవుతుందనే గతితార్కిక దృక్పథాన్ని) అనుసరించాలి. పాలకులు కొన్నిసార్లు దీనిని గుర్తించలేరు. ఉదాహరణకు, జీవశాస్త్రంలోనో, రసాయన శాస్త్రంలోనో ఈ దృక్పథాన్ని ఉపయోగించవచ్చు. ఒక కుటుంబపు గతిని వివరించడానికి సైతం ఈ దృక్పథాన్ని ఉపయోగించవచ్చు. పాలకులలో పెద్దగా అనుమానం రేకెత్తించని రీతిలో దీనిని ఉపయోగించవచ్చు. ప్రతీ వస్తువూ, అనేక ఇతర వస్తువులతో ముడిపడి ఉంటుందనీ, అవి నిరంతరం మారుతూ ఉంటాయనీ చెప్పే వాస్తవం నియంతృత్వ పాలనకు ప్రమాదకరమైన వాస్తవం. పోలీసులకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా ఈ వాస్తవాన్ని అనేక రూపాలలో వ్యక్తీకరించవచ్చు. ఒక సిగరెట్ దుకాణాన్ని ఏర్పాటు చేయాలంటే ఒక వ్యక్తి ఎదుర్కొనే సమస్యలు, క్రమాన్ని పూర్తిగా వివరిస్తే, అది నియంతృత్వ పాలనపై తీవ్ర విమర్శ కావచ్చు. ఈ విషయం గురించి ఎవరైనా కొంచెం ఆలోచించినా అర్ధమవుతుంది. ప్రజలని పేదరికంలోకి నెట్టే ప్రభుత్వప్రభుత్వాలు, ఆ పెదాలు ప్రభుత్వం గురించి ఆలోచించకుండా జాగ్రత్త పడాలి. ఆ ప్రభుత్వాలు ఎక్కువగా విధిలీల గురించి మాట్లాడతాయి. వాళ్ళ పేదరికానికి ప్రభుత్వం కాదు, విధియే కారణమని అనుకోవాలని వాటి ఆలోచన. పేదరికానికి కారణం తెలుసుకోవాలని ఆలోచించడం మొదలు పెట్టగానే, ప్రభుత్వం గురించి ఇంకా ఆలోచించక ముందే ప్రభుత్వం వాళ్ళని నిర్బంధిస్తుంది. కానీ, విధిలీల గురించిన మాటలని, భావాలని ఎదిరించి విమర్శించడం సాధ్యమే. మనుషుల భవితవ్యాన్ని నిర్ణయించేది మనుషులేనని నిరూపించడం సాధ్యమే.

ఈ మాటని అనేక రూపాలలో చెప్పవచ్చు. ఉదాహరణకి ఒక వ్యవసాయ క్షేత్రం, ఐస్ లాండ్ దేశంలోని ఒక వ్యవసాయ క్షేత్రపు చరిత్ర గురించి చెప్పవచ్చు. ఆ వ్యవసాయ క్షేత్రం శాపగ్రస్తమైనదని ఊరంతా మాట్లాడుతుంది. ఒక రైతు భార్య అందులోని బావిలో దూకి చనిపోయింది. రైతు యజమాని అందులో ఉరి పోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఒక రోజు ఆ రైతు కొడుకు పెళ్లి జరుగుతుంది. పెళ్లికూతురు కట్నంగా తీసుకొచ్చిన భూమి ఆ వ్యవసాయ క్షేత్రానికి కలిసింది. ఆ వ్యవసాయక్షేత్రానికి ఇప్పుడు మునుపటి శాపం తొలగిపోయింది. ఇప్పుడీ సంతోషకరమైన పరిణామం పట్ల గ్రామంలోని జనాలలో రకరకాల అభిప్రాయాలున్నాయి. కొంతమంది ఉల్లాసకరమైన ఆ యువరైతు స్వభావం కారణంగా శాపం తొలగిపోయింది భావిస్తున్నారు. మరికొందరు, పెళ్లికూతురు కట్నంగా తీసుకొచ్చి అదనంగా భూమిని జతచేయడంతో, పెద్దదైన భూకమతం వాళ్ళ సంతోషానికి కారణమని భావిస్తున్నారు.

ఒక ప్రకృతి దృశ్యాన్ని వర్ణించే కవిత ద్వారా కూడా ఏదో ఒకటి సాధించవచ్చు. మనుషులు సృష్టించిన వాటిని ఆ ప్రకృతి దృశ్యంలో భాగం చేయడంద్వారా దానిని మనం సాధించవచ్చు.

సత్యాన్ని మనం ఎక్కువమందిలోకి తీసుకుపోవాలంటే, అందుకవసరమైన యుక్తి, చతురత, నేర్పు మనదగ్గర ఉండాలి.

సారాంశం

మన దేశం, ఖండం బర్బరత్వానికి లొంగిపోతున్నది. ఉత్పత్తిసాధనాలపై వ్యక్తిగత యాజమాన్యం హింసపై ఆధారపడి కొనసాగుతున్నది. ఇదే మన కాలపు మహాసత్యం. ఈ సత్యాన్ని గుర్తిస్తే అది సరిపోదు. కానీ, ఈ సత్యాన్ని గుర్తించకుంటే, మరే ఇతర కీలక సత్యాన్నీ గుర్తించలేము. మనం ఈ పరిస్థితులలో ఎందుకున్నామో స్పష్టంగా చెప్పలేకపోతే, ఈ బర్బరత్వంలోకి కూరుకుపోతున్న పరిస్థితులగురించి సాహసోపేతంగా రాస్తే అది సాధించే ప్రయోజనం ఏమిటి (ఇది సత్యమే అయినా)? వ్యక్తిగత స్వామ్యపు ఆస్తి సంబంధాలని పరిరక్షించడం కోసమే చిత్రహింసలకు గురిచేస్తున్నారని విషయాన్ని మనం చెప్పగలగాలి. ఆ మాట మనం సూటిగా చెబితే, చిత్రహింసలని వ్యతిరేకిస్తున్న మిత్రులనేకమందిని మనం కోల్పోవచ్చు. ఎందుకంటే, చిత్రహింసల అవసరం లేకుండానే వ్యక్తిగత స్వామ్యాన్ని కాపాడవచ్చని వాళ్ళు నమ్ముతున్నారు (అది సత్యం కాదు).

మనం ఏం చేస్తే ఆ పరిస్థితులని తొలగించగలుగుతామో తెలియజేసేందుకు మన దేశంలోనెలకొన్న బర్బరత్వపు పరిస్థితుల గురించిన సత్యాన్ని చెప్పాలి. వ్యక్తిగత స్వామ్యపు ఆస్తి సంబంధాలను మార్చడం ద్వారా ఆ బర్బరత్వాన్ని మనం నిర్మూలించగలము.

ఇంకా, ఆ ఆస్తి సంబంధాల మూలంగా ఎవరైతే ఎక్కువ బాధపడుతున్నారో వాళ్లకి, అంటే కార్మికులకు మనం ఈ సత్యాన్ని చెప్పాలి. ఎందుకంటే, ఈ పరిస్థితులని మార్చిడంలో అందరికంటే ఎక్కువ ఆసక్తి వాళ్ళకే ఉంటుంది. ఇంకా కార్మికుల మిత్రులకి కూడా ఈ సత్యాన్ని చెప్పాలి. వాళ్లకి లాభాలలో వాటా దక్కినా, ఉత్పత్తి సాధనలపై యాజమాన్యంలో వాళ్లకి ఎలాంటి హక్కూ ఉండదు.

మనం ఈ పనిని యుక్తితో, నేర్పుతో, చతురతతో చేయాలి.

సత్యాన్ని రాయడంలో ఎదురయ్యే ఈ ఐదు సమస్యలనూ మనం ఏకకాలంలో పరిష్కరించాలి. ఎందుకంటే, బర్బరత్వపు పరిస్థిల మూలంగా ఎవరు బాధపడుతున్నారో వాళ్ళగురించి ఆలోచించకుండా, బర్బరత్వపు పరిస్థితుల గురించిన సత్యాన్ని పరిశీలించలేము, పిరికితనాన్ని వదిలించుకోకుండా మనం అడుగు ముందుకు వేయలేము, మనం పరిస్థితుల గురించి తెలియజేసే జ్ఞానాన్ని, సత్యాన్ని వాళ్ళ చేతుల్లో ఆయుధంగా మారే విధంగా అందించాలి, ఆ పనిని శత్రువు గుర్తించి, అడ్డుకొనే వీలు లేకుండా మనం యుక్తితో, చతురతతో, నేర్పుతో చేయాలి.

ఒక రచయిత సత్యాన్ని రాయాలని అంటే, ఇవన్నీ అవసరమైనవే.

(బెర్తోల్ట్ బ్రెహ్ట్ (1898-1956) ప్రసిద్ధ జర్మన్ నాటక రచయితా, కవీ. 1934 డిసెంబరులో రాసిన ఈ వ్యాసాన్ని ముందు ‘కవులు నిజం మాట్లాడాలి’ అనే శీర్షికతో ప్రచురించారు. దీనిలో మార్పులు చేర్పులు చేసాక, అన్సెరీ జైట్ (మన యుగం) అనే ఫాసిస్టు వ్యతిరేక పత్రిక 1935 ఏప్రిల్ సంచికలో ప్రచురించారు. ఈ పత్రిక పారిస్, బాసెల్, ప్రాగ్ నగరాలనుంచి వెలువడింది. ‘ప్రధమ చికిత్స చిట్కాలు’ అనే శీర్షికతో దీన్ని ఒక కరపత్రంగా ప్రచురించి నాజీ జర్మనీ లో రహస్యంగా పంపిణీ చేశారు. ఇందులోని వ్యంగ్యం, శైలి జర్మన్ భాషకి కొత్త అని విమర్శకులు అంటారు. సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు బ్రెహ్ట్ రచనలలో ముఖ్యమైనదిగా పరిగణిస్తారు.)

పుట్టి పెరిగింది ఖమ్మం జిల్లాలో. ఇంజనీరింగ్ చదువూ, ప్రస్తుత ఉద్యోగమూ హైదరాబాద్ లో. అప్పుడప్పుడూ రాసే కవిత్వంతో పాటు, సాహిత్యం, రాజకీయాలు, ఆర్థిక అంశాలు, టెక్నాలజీ ధోరణుల పైన విశ్లేషణ వ్యాసాలు, తెలుగు, ఇంగ్లీషు అనువాదాలు వివిధ పత్రికలలోనూ, పుస్తకాలలోనూ అచ్చయ్యాయి.

One thought on “సత్యం రాయాలంటే ఎదుర్కోవాల్సిన ఐదు సమస్యలు

  1. సత్యం అనేది ఏదో ఓ సాధారణ ప్రకటన కాదని, అది ఎంతో నైపుణ్యం, చిత్తశుద్ధి, విశ్లేషణ, ధైర్యం, సాహసాల కార్యాచరణ లొ పుటం వేసాక తేలే మేలిమి అని తెలిసింది.. దేవేంద్ర ఖమ్మం

Leave a Reply