‘సత్యం’ కథ నేపథ్యం – 2

ఇదేదో రాయకుండా ఉండలేని స్థితి. కానీ గిన్ని సంగతులల్ల ఏదని రాసేది?. జైల్ల బడ్డ పిలగాడు కాయం – వాడికి తండ్రి కావాలి – తల్లి కావాలి – అవుసుల నారాయణ, పున్నమ్మ కాయం…

ఇట్లా అనుకునే సరికే ఆ పాతకాలపు చీకటి నిండిన భయానకపు అనుభవాలు పోటెత్తాయి. కథ గంగల పోయింది. వెన్నంపల్లి – మక్కపెరండ్లు, మిరపతోటల మధ్య – ఔసుల నారాయణ పాత గడ్డి గుడిసె. కాళోజీ లాగా ఎత్తుకెత్తున్న తుపాకి లాంటి నారాయణ. వడ్లు దంచబోయి (అప్పుడు వడ్లగిర్ని ఊళ్లె లేదు) తెచ్చిన నూకలు వండిపెడితే తినెటోడు – లేపోతే ఉపాసం…

అప్పుడు గుర్తొచ్చింది – బొర్రాయక్క. మనిషి ఎత్తుకెత్తు ధీరోదాతంగా ఉండేది. అందంగా ఉండేది – కంచు కంఠం. ఎవరికి జెనుకని నడక – ఆమె చిన్న కొడుకు మా మామ పాలేరు. నా దోస్తు. ఎట్లా జరిగిందో? మా రామవ్వ గుసగుసలా సెవుల సెప్పింది. ఆమె మీద ధనిక రైతు కన్ను బడ్డదట. వాడు ఎంటపడితే గజ్జలల్ల తన్నిందట. గది వాడు మనసుల బెట్టుకొని పగ వట్టిండట. వానా కాలంల సూడి బర్రె సచ్చిందట- అప్పుడు నేను వాల్లింట్లనే ఉన్న – ఎడ్లకెడ్లున్న నలుగురు మనుషులచ్చిండ్లు – రాయక్కను పందిరి గుంజకు కట్టేసిండ్లు – ఒకటే లొల్లి. మంది కూడిండ్లు – “బొడ్డీ మంత్రాలతోని నా బర్రెను సంపినవ్ – నీ మంత్రాలను పారకుంట నీ పండ్లూడగొడ్త”నని రాయక్క మూతి మీద వాడు బండి కనెం తోని గుద్దిండు. పండ్లు, రక్తం వాని ముఖం మీదనే ఊంచింది.

హాహాకారాలు – నేను లాగుల ఉచ్చబోసుకున్నాను.

అప్పుడొచ్చిండు నారాయణ – సుత్తె, ఎడంచేతుల కొలిమిల నిప్పులు – వచ్చి రాయక్క కట్లు విప్పిండు.

“ఎవడన్న ముంగటికత్తె, ఇగో గీ సుత్తె తోని పుచ్చె పలుగ్గొడుత – ఇగో గీ నిప్పులతోని ఊరంత కాల బెడుత”

ఎవడు ముందుకు రాలేదు. పున్నమ్మ ఉరికచ్చి అందరి కాళ్లమీద బడి – మొగన్ని తీసుకొని గుడిసెలకు పోయింది…

ఇవన్నీ గుర్తొచ్చి – ఈ కథల రొచ్చులో ఎందుకు దిగాలనుకున్న – టైఫాయిడ్ వారం రోజులు-

అయినా నా ముందు తుపాకి కదలాడుతూనే ఉండేది…

జ్వరంలో అనేక విచారాలు – గతం తవ్వుకుంటే పెంకలు తప్ప ఏం దొరుకుతాయి?. కిందా మీద పడి, ఇప్పుడు ఒక్కలు కాదు, వందలు కాదు వేలు బజాట్ల కచ్చిండ్లు – గతంలో జరిగిన వాటి లెక్కలు తీశారు.
కూలిరేట్లు, పాలేర్ల జీతాలు పెంచుకున్నారు. అక్రమంగా ఆక్రమించిన భూములు సంఘం ఆధ్వర్యంలో దున్నుకుంటున్నారు. పనీపాటలోల్ల వెట్టి పనులు బందయినాయి – పెట్టువోతలు నికరమయ్యాయి. ఆడవాళ్లను ఏమన్నాఅంటే – ముక్కు భూమికి రాకిస్తున్నారు. అరె, తొరే, పోయింది – డబ్బు, దస్కంగలవాళ్లు పారిపోయిండ్లు. క్రూరులైన దొరలను కొందరిని ప్రజలు అడ్డంగ నరికిండ్లు – అడుగుబొడుగు వీలునోళ్లు పారిపోయి పట్నాలు బట్టిండ్లు – మిగిలినోళ్లను ఎట్లయిన జేసి పల్లెలల్ల నిలబెట్టాలని ప్రభుత్వం పల్లెలనిండా పోలీసు క్యాంపులు బెట్టారు… ఈ లాడయిలనే- కేసుల మధ్యనే – గడబిడల మధ్యనే – ఎత్తుకు పై ఎత్తు వేసి – ముందుకు పోవడానికి ‘కోటన్న’లాంటి రాజకీయాలు తెలిసిన యువకులు ‘పీపుల్స్ వార్’ పార్టీ పెట్టారు… రెండు జిల్లాల పోరాటం అన్ని జిల్లాలల్లకు పాకుతుంది. నేను బోలెడు కథలు రాసిన – “కొలిమంటుకున్నది” . “ఊరు” నవలలు రాసిన.

ఇగో గిక్కడ నుండి కథ మొదలు గావాలె – నారాయణ గురించి ముగింపులు- ”ముందడుగులు” నవలలో బోలెడు రాసిన, గాని ఆ నవల పోయింది. ఇప్పుడు నారాయణ, పున్నమ్మ, కృష్ణ తయారయ్యరు.

సరే. సంఘటనలు సమకాలీనమైనవి. వాటి మధ్య పూసల్లో దారం రైతాంగ పోరాటాల క్రమం. ఒక దశ నుండి మరో దశకు పరిణామం. తలెత్తుతున్న సమస్యలు – అనేక గ్రామాలల్లో చిత్ర విచిత్రమైన సమస్యలుండేవి – వాళ్లంతట వాళ్లు పరిష్కరించుకోజాలనివి. ముఖ్యంగా గ్రామం బయట ఉండే కోర్టులు, లాయర్లు, పోలీసులు, మిగతా యంత్రాంగం, ఇవన్నీ రైతు కూలీ సంఘాలకు- ముఖ్యంగా ఇలాంటి నిర్మాణాలు వాళ్లకు తెలియాలి. క్రోధంతోటి , అనివార్యంగా బద్దలైన పోరాటాలకు నిర్మాణాలు రూపొందుతున్న దశ. దానికి సంబంధించి వారి నాయకులు వారికి చెప్పుతూనే ఉంటారు. కరపత్రాలు, మీటింగులు, అది అన్నిస్థాయిల (ప్రజలకు గరిష్టస్థాయిలో అర్థం కావాలంటే కళాత్మక రూపంలో, ముఖ్యంగా నిజమైన ఘటనల ద్వారా చెప్పాలి. ఇట్లా ఆలోచిస్తున్న క్రమంలో మళ్లా కథంతా చిక్కువడింది)

నన్ను చూడడానికి వచ్చిన ఒక నాయకుడిని అడిగాను. “ముడేండ్లకే ముగీసిపోయిన తెలంగాణా సాయుధ పోరాటానికి – ఇప్పుడు మీరు నడుపుతున్న పోరాటానికి తేడా ఏమిటి” అని.

ఆయన కూల్ గా “సత్యం” అన్నాడు.

“సాధారణంగా సమస్యల మీద లేచిన పోరాటాలు ఉద్వేగంగా ఉంటాయి. అది చల్లారగానే దిగాలుపడుతాయి. మన రాజకీయాలల్లో ఉద్వేగం, కల్పన ఎక్కువ. వాస్తవాన్ని గుర్తించడం, ఒప్పుకోవడం చేస్తే, ముఖ్యంగా మన తప్పులు ఒప్పుకుంటే ముందుకు జరుగుతాయి. ఇన్నేండ్ల తరువాత కూడా కమ్యూనిస్టులు, ఆనాటి తప్పును ఒప్పుకోవడానికి మొహమాట పడుతారు. అయితే అతివాదం, లేపోతే మితవాదం ” అన్నాడు నాయకుడు.

టుప్పా! ఇగ నేను రాసే తుపాకి కథ పేలిపోయింది. అయ్యన్ని వాళ్లకు తెలిసినవే. నేను చెప్పేటియి ఏమిటి? ఎప్పటి నుండో దొరలు తుపాకులతో రాజ్యం చేస్తున్నరు. ప్రజలు సాటుమాటుకు అవే తుపాకులు తయారు చేసుకొని పోరాడుతున్నారు.

ఇగో నేను ఇట్ల గింజుకునే కన్నా మూడేండ్ల ముందే అవుసులలోళ్ల పిల్లగాడు తుపాకి తయారుజేసి జైల్ల కూసున్నడు. వాడే అందరికన్నా ముందున్నడు. వాడి సమస్య, అవసరం ఏందో? అది నిజమే గాని అందరికి ఈ లోపటి వ్యవహారం తెలియదు గదా! ఎవల్ది వాళ్ళకి తెలుసు. అందరి అనుభవాలు కలబోసుకోవడం గదా! చిన్నగా ఆశ. మల్ల సత్యం గాడొకడు దాపురించిండు. ఇంకో పాత్ర – ఒక్క మాటన్నా మాట్లాడని పాత్ర – బహుశా సత్యంగాడే పార్టీ యేమో?

కథ రాసి పారేసిన!

పాత కొత్తల మధ్య, వ్యక్తుల మధ్య , కుటుంబం లోపల సంఘర్షణ – రైట్ – ఆ సంఘర్షణలో మౌనంగా లీనమైన పిల్లలలో ఏం జరుగ గలదు? దాన్ని ఎదుర్కోవడానికి, తెలుసుకోవడానికి ప్రయత్నం. కృష్ణ పరిశోధన – తుపాకి గురించా? నాన్న గురించా ? అమ్మ గురించా ?

అయినా నారాయణ తుఫాను గాలిలో ఒంటరి చెట్టుగా నిలబడలేడు. ఊగాలి. భాగం పంచుకోవాలి. తప్పదు.

కథ వైరుధ్యం, సంఘర్షణ కుటుంబం నుండి – వ్యక్తుల మధ్యనుండి మందిలోకి నడిచింది. అక్కడ స్వరూపం వేరు. రకరకాల సత్యశోధన. మావో అన్నట్టు ఒకే ఒక్క కారణముండదు. పదివేల కారణాలుండవచ్చు. ఉంటయి. అవన్నింటి కదలిక… కదలిక… వైరుధ్యాన్ని పరిష్కరించడానికి కదలాలి. సాంఘీక బహిష్కారానికి గుర్తైన దొర పనులు నడవకపోతే దోచిందీ, దాచిందీ తింటాడు. వానికేం ఫరక్ పడదు. కానీ కూలీలు బతుకు గడువాలంటే పని చెయ్యాలె. దొరల భూములు కాదు. తమకు ఉత్పత్తి వనరులు కావాలి. అనివార్యం. కదిలారు. వాళ్లకు రాజకీయాలున్నాయి. ప్రపంచ చరిత్ర తెలిసిన రాజకీయ పార్టీ ఉంది. మరి భూస్వాముల ప్రభుత్వం ఊకుంటుందా? ప్రజల తమ భూములు తాము తీసుకుంటే ప్రభుత్వం ఉంటుందా? ప్రజల సొమ్ముతో పెట్టుకున్న పోలీసులు, కోర్టులు అన్నీ కదులుతాయి. వాటి కదలికలు తెలుసుకోవాలి… దొర గుండాలతో ప్రజలమీద దాడి చేసిండు. సంఘం అధ్యక్షున్ని విడిపించడానికి నారాయణ పట్నం బోయిండు. నారాయణ ఒక సమిష్టి శక్తిగా ఎదుగుతున్నాడు. దొర పిలిసిండు – బెదిరించిండు. తుపాకి చేసిన నారాయణ చూపులు తుపాకి గుండ్లలా. గడిమీద దాడి. నారాయణ తుపాకి గుండ్లకు బలై పోయిండు…

ప్రభుత్వం రంగప్రవేశం చేసింది. కల్లోలిత ప్రాంతాల చట్టం వచ్చింది. దొర గెలిచాడు… కానీ ఎవరి తయారి వారికున్నది. ప్రజలు సాయుధమయ్యే దశ. క్రిష్ణ తుపాకి తయారీ. దొర పున్నమ్మను చెర బెట్టిండు… క్రిష్ణ తుపాకి తయారు చేసి దొర మీద పేల్చిండు. దొర చనిపోతే కథ అయిపోయేది. కానీ కాలేదు. ఈ మొత్తంలో మౌనంగా చూస్తున్న, భాగమైన సత్యం అజ్ఞాతమయ్యాడు . అన్న జైల్లో ఉన్నాడు.

పున్నమ్మ పిచ్చిదై తన బిడ్డల కోసం వెతుకుతోంది. ఊరు మరింత కాకావికలమైయింది. అందరినీ ముందుకు తోసింది.

అంత విషాదం అనుభవించిన పున్నమ్మ నాకిప్పటికి కలలోకి వచ్చి – “మా సత్యం కనిపిచ్చిండా బిడ్డా” అని అడుగుతుంది.

పిచ్చితల్లి పున్నమ్మ. గజ్జెల గంగారాం, సరోజ తల్లి గజ్జెల లక్ష్మి ఔతుంది. మల్లోజుల మధురమ్మ ఔతుంది.

“బిడ్డా! మా సత్యం ఎక్కడన్న కనిపిచ్చిండా?”

“బిడ్డా! మా కొడుకు క్షేమంగా ఉన్నడా?”

ఏ విషాదాన్ని, ఒత్తిడినైతే కథ రాసి జయించాలునుకున్నానో, బయట పడాలనుకున్నానో, అది ఇప్పటికీ సాధ్యం కాలేదు. ముప్పై తొమ్మిది సంవత్సరాల కిందట ఇదే నెలలో తీవ్రమైన జ్వరంతో రాశాను. ముప్పయి వేల మంది సత్యాలు… వాళ్ళ తల్లిదండ్రులు… వాళ్ళు మాత్రమే ఇంత క్షోభ అనుభవించాలా? మనమంతా…?

సజల నయనాలతో…

యాభయేండ్ల ప్రజాయుద్ధ చరిత్ర మనలను అడుగుతోంది. ప్రపంచం యావత్తు తుపాకి పడగనీడలో… ఇబ్బడి ముబ్బడి చెత్త సరుకుల మురికిలో…

సత్యం తుపాకి కన్నా ప్రమాదకరమైనది… పురాతనమైనది…

(”సత్యం” కథ ‘సృజన’ మాసపత్రికలో అక్టోబర్ 1980లో ప్రచురితమైంది.)

‘సత్యం’ కథ కింద లింక్ క్లిక్ చేసి చదవండి. https://kolimi.org/%e0%b0%b8%e0%b0%a4%e0%b1%8d%e0%b0%af%e0%b0%82/

పుట్టింది గాజుల ప‌ల్లి, మంథ‌ని తాలూకా, క‌రీంన‌గ‌ర్ జిల్లా. న‌వ‌ల‌లు: 'కొలిమంటుకున్నది', 'ఊరు', 'అగ్నికణం', 'కొమురం భీమ్'(సాహుతో కలసి), 'వసంత గీతం', 'టైగర్ జోన్'. కథా సంపుటాలు : 'సృష్టికర్తలు', 'తల్లి చేప', 'అతడు'. 100కు పైగా క‌థ‌లు, కొన్ని క‌విత‌లు, పాట‌లు, వ్యాసాలు, అనువాదాలు, 4 నాట‌కాలు రాశారు. 1979 నుంచి విప్ల‌వ ర‌చ‌యిత‌ల సంఘంలో స‌భ్యుడిగా కొన‌సాగుతున్నారు.

Leave a Reply