ఈ పోలీసోల్లు అయినోళ్ళకు ఆకుల్లో కానోళ్ళకు కంచాల్లో వొడ్డించేదానికి తయారైనారు. ఈ సట్టాలు గూడా అయినోళ్ళకు సుట్టాలుగా మారి పొయినాయి. ఆ రోజు ఎప్పుడూ తెల్లారినట్టే తెల్లారింది, పొద్దు పుట్టింది. గాని ఆ రోజే మా పాలిటి శాపమై పోతిందని మేవు అనుకోను గూడా లేదు.
తెల్లార్తో లేసి ఎవురి పనల్లో వాల్లుండాము. తిన్నెల మింద కూసోని మాటాడుకొనే వోల్లు మాటాడుకుంటా ఉండాము. నీళ్లు తెచ్చుకొనే వోళ్ళు తెచ్చుకుంటా ఉండారు. కట్టు గూటాల కాడ నెమురేసుకొనే గొడ్డూ గోద నెమరేసుకుంటా ఉండాయి. పాలుదాగే లేగదూడలు పాలు తాగతా ఉండాయి. నిద్దర పోతా ఉండే పిల్లా జల్లా నిద్దర్లోనే ఉండారు.
ఏమయ్యిందో తెల్దు ఉన్నట్టుండి తుపాకీ కాలుపులు ఇనబడినాయి. ఎవురన్నా గువ్వలు కాలస్తా ఉండారేమో యామారినాము. దడిగోడు ఈదమ్మిటా పరిగెత్తుకుంటా పారిపోండి పారిపోండి ఊర్లో అందురూ పారిపోండని అరస్తా వచ్చినపుడు గదా తెల్సింది.
అదిని ఊరు వొక్కసారిగా ఉలిక్కి పడింది ఏం జరిగిందో ఏమోనని. నిద్రలో ఉండే పిల్లా జల్లా లేసి కూసున్నారు. పాలు తాగతా ఉండిన లేగ దూడలు పాలు తాగేది నిలిపేసినాయి. ఆవులు నెమురేసేది ఆపేసినాయి. మాట్లాడుకుంటా ఉండిన మా నోళ్ళూ పడిపొయినాయి. నీళ్ళు తెచ్చుకుంటా ఉండినోళ్ళు యాడోళ్ళాడ నిల్సుకొనేసి నారు.
నేను ఏమయ్యిందో ఏమో తెల్సుకుందామని వాణ్ణి నిలిపి “ఏమయ్యిందిరా? పారి పోండి పారి పోండని పరిగెత్తుకొస్తా ఉండావని” అడిగినాము. వాడు గసపోసుకుంటా వొచ్చినాడు. సూస్తే వాడి వొళ్ళంతా సెమట్లు పట్టి పదురు పుట్టి పొయ్యుండాది. కొంచిం గసార్సుకొన్నాక సెప్పినాడు “మావా! మావా! నేనూ ఎల్లారెడ్డి కండిక్కి పోయొద్దామని ఎలబారి పోతా ఉంటే, సుట్టు పక్కల ఊరోళ్ళంతా ఏకమై తాగి మనూరు మింద దాడిజేసే దానికి ఆ గుట్ట దిగబడి వొస్తా ఉండారు వాళ్ళీపొద్దు మనల్ని బతకనియ్యరు”. అని సెప్పేసి మల్లా ఈదిమింద పరిగెత్తి నాఢు. ఆమాటతో నా గుండెల్లో గుండు పడినట్టయి పొయ్యింది.
తిన్నెల మింద కూసొండే మేవంతా లేసి సూద్దామని గబగబా గెవిన్లోకి పొయ్యి సూస్తే, ఒకరా? ఇద్దురా? పదూళ్ళ జనం దుడ్డుకట్టెలు, బరిసెలు, తుపాకులు, సేతబట్టుకొని గుట్ట దిగబడి వొక యల్లావు మాదిరిగా వొస్తా ఉండారు. అంత జనాన్ని మా ఊరంతా నిలబడినా ఎదిరించేది కల్లని తేలి పోయ్యింది. అట్టాటప్పుడు చిక్కి బిక్కరించే దానికన్నా పారిపోయి ఎక్కించేది మేలని వొట్టి సేతల్తో కట్టు గుడ్డల్తో పిల్లాజల్ల నెత్తుకొని అడివికల్ల యలబారేసినాము.
కాని ఈ ముసిలీ ముతక సంగతెట్టని కొంచేపు సూసినాము అయితే వాళు ఊరొదిలి రామనేసినారు. అప్పిటికీ వాళ్ళను బతిమలాడినాము మాతో వచ్చేయండని కాని వాళ్ళు రాలేదు “మీరు పశోలంతా పొయ్యి పేణాలు కాపాడుకోండి మేము ఉణ్ణా వొకటే పొయినా వొకటే ఊపిరుంటే మల్లా మేము మిమ్మల్ని కండ్లజూస్తాం పోతే వొచ్చి మా కట్టి కడతేర్సేయండి”అనేసినారు. ఏం సేద్దుం ఎవురి పేణాలు వాళ్ళవి వాళను వొదిలేసి పారుపొయినాము గాని వాల్లు యట్టుండారో ఏమోనని భాదతో మనుస్సులో మనుస్సు లేదు.
అంతా పులిబోను గుట్టకాడికి పొయినాక మా గంగి, అలిమేలు, సుదేష్ణ, ఈళ్ళంతా యాడస్తా “మా గోడు వాళ్ళకు తగలా! వాళ్ళను తీసకపొయ్యి ఆ బండమిందబెట్టా! వాళ్ళ సేతల్లో పుండుబుట్టా! వాళ్ళ దూముతగలా! వాళ్ళ ముండమొయ్యా! వాళ్ళు తాళ్ళ తెంపనూ! ఆనా బట్టలు ఎగిరిపడి సావా! వాళ్ళు సచ్చినారని సిన్న సిన్న పిలకాయల్నంతా ఎత్తక రావాల్సి వచ్చిందే!” అని సాపించేదానికి పెట్టుకున్నారు. ఈళ్ళల్లో సిన్న బిడ్డ తల్లులు శానామంది ఉండారు. మా రంగనాదుడి కోడలయితే పురిట్లో బిడ్డిని ఎత్తుకొచింది.
నేను అందిరికీ వొకిటే జెప్పినాను.”అయ్యిందేదో అయ్యింది మనం ఈడుండేది డేంజరు, ఊరిదాకా వొచ్చినోళ్ళు ఈడిదాకా రారనే గేరంటీ లేదు. అడివిలో దాక్కోవాలంటే వొక్క మరుట్ల దొన కాడనే కొంచిం అనువుగా ఉంటాది. యట్టంటే ఆడికి రెయ్యే గాదు పొగులు గూడా ఎవురూ దయిర్నంజేసి రారు, ఈ మద్దెన ఆడ సిరత పులొకటి తిరగతా ఉందని పచారంలో ఉంది. ఆడ తాగే దానికి నీళ్ళుంటాయి. సుట్టూ పెద్ద పెద్ద తీంట్ర పొదలూ రెకరెకాల సెట్లుండాయి” అని సెప్పి వాల్లనంతా ఆడికి తీసకొని పూడిస్తిమి.
అప్పిటికే మద్దేనాళయిపొయింది తెల్లార్తో సద్దిగూడా తాగినోళం గాదు. సాకల్దాని కనం ఎక్కి దిగేకొద్దికి అలసిపోయినాము. మేం పెద్దోళ్ళం ఆకిలికి తట్టుకొంటాం. గాని పిలకాయల నేంజెయ్యాల? వాళ్ళు గార్ గూర్ మని ఏడ్సేదానికి పెట్టుకున్నారు. అక్కడ మా బాదలు అట్టుంటే ఊర్లో ఉండే ముసిలీ ముతకా యట్టుండారనే బాదొక పక్క. గొడ్డూ గోదా యేమయ్యిందనే బాద. ఇట్ట ఆలోచనజేసుకుంటా ఉండాము.
వాళ్ళకూ మాకు ఎన్నో సార్లు ఇరకతరకాలు వొచ్చినా వొకటి రోండు రోజులు మల్ల కల్సి మెల్సి పోతా ఉంటిమి. గాని ఈ మాదిరిగా ఎప్పుడూ జరగలేదు.
ఎలక్సన్లు వొచ్చేది కొత్తగాదు, పోయేది కొత్త గాదు. ఎప్పుడూ ఏదో వొక ఎలక్సన్ వొచ్చి పోతానే ఉంటాది. తాగి తిన మరిగినోళ్ళకిది పండగైతే, మా మాలా మాదిగలకిది ఎండగ. ఎప్పుడూ గుర్తుకు రాని మేము ఇట్టా ఎలక్సన్లప్పుడే గురుతుకొస్తాము. అది సేస్తాం ఇదిసేస్తామని మమ్మల్ని ఊరించి అరి సేతిలో వైకుంఠం సూపించి పోతారు. మల్ల మా కల్ల తిరిగి మల్లి సూడరు. చూడాలంటే మల్లా ఏదో వొక ఎలక్సన్ రావాల్సిందే.
ముందు మేమంతా ఈ పై కులపోళ సెప్పు సేతల్లో ఉండే వొళం. వాళ్లు సెప్పినట్టే ఇన్నాము. వాళ్ళు ఎవరికి వోటెయమంటే వాళ్లకేసినామ. కాని ఇప్పుడు కాలం మారింది. సిన్నోల్లుగా ఉండిన మా పిలకాయలంతా పెద్దోళయినారు. సదువుకుంటా ఉండారు. మంచీ సెడ్డా తెల్సుకుంటా ఉండారు. ఇప్పుడు గూడా అనిగిమణ్ణిగి ఉండమంటే ఉంటారా? వాళ్ళు సెప్పినోడికే వోటెయ్యమంటే యాస్తారా?
మా కుమారుగోడు వాడి జతకాపులు కొంతమంది ఎదురు తిరిగి నారు.”మీరు సెప్పినోళ్ళకు మేమెయ్యం, మా కిష్టమయినోళ్ళకు మేం ఏసుకుంటా “మనేసినారు. అప్పికీ నేను సెప్పతానే ఉండాను. “వాళ్ళతో ఎందుకు రచ్చ సరేననేస్తే పోలా మనం ఎవురికేసేదీ వాళ్ళొచ్చి సూడబోతారా” అని, ఇంటే గదా!
ఇది గ్రామున్సీపు జీర్ణం జేసుకోలేక పొయినాడు. ఎలక్షన్ నాడు మద్దేణం దాకా పోలీసోల్లను సేతిలేకి పెట్టుకొని మమ్మల్ని బూతులేకే రానియ్య కుండా జేసినాడు. మా పిలకాయలకి వోపిక నశించి పొయ్యింది. ఊరికా ఉంటారా తిరగబడినారు. వాళ్ళు పారిపోతే మా వోట్లు మేం ఏసుకొని వొచ్చేసినాము. ఊరికేనే మా వోళ్ళ మింద రాళ్ళేసినారని కేసుబెడితే జామీనిచ్చి పిల్సకొచ్చినాము.
రొండుమూడు దినాలకి రిజల్టు వచ్చేసింది. మేం వోటేసిన పార్టీ వోడిపోతే, వాళ్ళేసిన పార్టీ గెలిసింది. దాంతో వాళ్ళని పట్టేదానికి పగ్గాలేకుండా బొయినాయి. మనకింక ఎదురులేదని, ఏంజేసినా సెల్లిపోతిందని, ఎలక్సన్లో జరిగింది మనుసులో పెట్టుకొని, ఆ గ్రామున్సీపు సుట్టు పక్కల ఊర్లనంతా ఎగదోలుకోనొచ్చి ఇంతపనికి వొగదెగినాడు.
ఈడ వొకసోటే గాదు, పాదిరికుప్పం మింద ఇదే మాదిరిగా దొమ్మిజేసి ఇద్దుర్ని సంపేసినారని తెల్సింది. అంతేగాదు గుంటూరు దగ్గిర కారంచేడులో గూడ శానా మందిని సంపేసినారంట. మేమేమన్నా వాళ్ళ ఆస్తిపాస్తులకు అడ్డం పోతిమా? మా వోటు మాకు నచ్చినోళ్ళకు ఏసుకుంటానంటిమి, అంతేగదా! వాళ్ళ కన్నంతా మా కుమారుగోడు దడిగోడు వాళ్ళ జతకాపుల మిందనే, వాళ్ళేగాని దొరికుంటే సంపేసినోళ్ళే లేదు గాబట్టి బతికిపొయినారు.
మేము సీగటి పడే దాక అడివిలో ఉండి, ముందు ఇద్దుర్ని అంపిచ్చినాము, ఊర్లో పరిచ్చితి ఎట్టుందో సూసక రమ్మని. వాళ్ళు ఊర్లోకి పోయ్యి తిరిగొచ్చి” మనమింక బయపడాల్సిన పనిలేదు. పోలీసోళ్ళు మనకు కాపలా ఉండారని సెప్పితే తిరిగొచ్చినాము.
మేం ఊర్లోకొచ్చి సూస్తే ఊరు సొశానానికంటే ఘోరంగా ఉండాది. పూరిండ్లన్నటికీ అగ్గబెట్టి కాల్సేసినారు. ఇండ్లల్లో సట్లూ కుండలంతా పగలకొట్టేసినారు, వొండి తినే దానిక్కూడా లేకుండా. ముసిలీ ముతకను కొట్టి పండబెట్టేసినారు వాళ్ళకంతా గూడా దెబ్బలు. అప్పుడు ఎవురుండారు ఎవుర్లేదని సూస్తే ఊరి మింద దాడి జరిగితిందని ముందే ఎచ్చరించి మమ్మల్ని కాపాడిన దడిగోడు కనబడలేదు మాతోనూ రాలేదు. ఎతకంగా ఎతకంతా శవమై దొరికినాడు. వాణ్ణట్టా సూసే కొద్దికి మాకంతా దఃఖం ఆగలేదు ఏడ్సేసినాము. అందరికీ జాగర్తజెప్పి వాడు జాగర్తగా ఉండలేక పొయినాడని.
కంచే సేను మేసిందని, పోలీసోళ్ళను నమ్మి ఊర్లేకొచ్చి నందుకు మాకు తగిన శాస్తే జరిగింది. వాళ్ళు మామింద దాడి సేసినోళ్ళనొదిలేసి, మమ్మల్ని పట్టక పొయి టేసన్లో ఏసినారు. వాళ్ళ సేత దెబ్బలు తినింది మేము, ఊరొదిలి పిల్లా పాపల్తో పారిపొయింది మేము, అన్నీ పోగొట్టుకునింది మేము, ఇంటికొకర్ని తీసకపొయ్యి పోలీసుటేసన్లో ఏసింది మమ్మల్ని, మేమే వాళ్ళ మింద దాడి సేసినామని. కేసులుబెట్టి కోరుట్లు సుట్టూ మూడేండ్లు తిప్పించుకొనిందీ మమ్మల్నే.
అదీ ఒక కోర్టా? దినానికొక కోర్టు. వొకనాటికి పుత్తూరు, ఇంగొకనాటికి సిత్తూరు, మల్లొక నాటికి సత్తేడు, కాలాస్త్రీ, ఇట్ట జిల్లాలో ఎన్ని కోరుట్లుంటే అన్ని కోరట్లకూ తిప్పించి నారు.
మేం మాత్రం పనిపాట వొదిలేసి ఎన్ని రోజులని తిరగతాము కూలికి పోకపోతే మాకు పూట గడవదు. అందుకని జరిగిందాంట్లో వాళ్ళది ఈసమెత్తుగూడా తప్పు లేదు, అంతా మాదే తప్పని వొప్పున్నాక వాళ్ళు రాజీ పొయేదానికి వొప్పుకున్నారు.
ముల్లు మింద ఆకుబడినా, ఆకుమింద ముల్లుబడినా, సివరకు ఆకుకే బొక్కైనట్టు. మేము వాళ్ళ మిందబడినా, వాళ్ళొచ్చి మా మింద బడినా, మాదే తప్పని వొప్పుకోవాల్సి వొచ్చింది. ఏంజేద్దు వాళ్ళు సట్టానికి సుట్టాలు.