‘సంతకం’తో సాహిత్య ప్రయాణం

‘సంతకం’ సాహిత్య వేదిక కవయిత్రి, చిత్రకారిణి కొండేపూడి నిర్మల, రచయిత్రి డా. అమృత లతల సంయుక్త సారథ్యంలో సాహితీ సదస్సు జరిగింది. ‘సంతకం’ టీం కవయిత్రి రేణుకా అయోల, రచయిత్రి నెల్లుట్ల రమాదేవిల సహకారంతో వార్షికోత్సవ సదస్సు మాలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. మా వేదిక నిజామాబాద్ జిల్లా, నిర్మల్ పట్టణానికి 20 కిమీ దూరంలో, మామిడి పల్లి ప్రకృతి ఒడిలో సాంత్వన అపురూప వేదికపై, నవంబర్ 30, డిసెంబర్ 1న వరుసగా రెండు రోజులపాటు సాగాయి. ఈ సదస్సుకు హైద్రాబాదు నుంచి కొండేపూడి నిర్మల, అరణ్య కృష్ణ, డా. చిల్లర భవానీ దేవి, ఒద్దిరాజు ప్రవీణ్, దేశరాజు లాంటివారు కాక వరంగల్ నుంచి నెల్లుట్ల రమాదేవి, రేణుకా అయోల , దేవులపల్లి వాణి, కిరణ్ బాల, బెంగుళూరు నుంచి, శ్రీనివాస వాసుదేవ్, అనంతపురం నుంచి నేను(రాధేయ), తూముచెర్ల రాజారామ్, చంద్రశేఖర శాస్త్రి, వరంగల్ నుంచి అన్వర్, కర్నూలు నుంచి జి. వెంకటకృష్ణ, ప్రొద్దుటూరు నుంచి సి.వి.సురేష్ గారు వచ్చారు. శనివారం ఉదయ౦ 7 గంటలకు మినీ బస్ లో మామిడి పల్లికి చేరుకున్నాం. ప్రారంభ సదస్సు కోసం మీటింగ్ హాల్ చేరుకున్నాం. కవి అరణ్య కృష్ణ సభకు స్వాగతం పలికారు.

కొండేపూడి నిర్మల గారు అధ్యక్షులు గా వ్యవహరిస్తూ.. “ నగర వాతావరణంలో నలుగురు మనుషులు కలవడమే అసాధ్యమైన నేపధ్యంలో కవిత్వానికి వేదిక సమకూర్చడం ఒక సవాలుగా మారిందని, ఇది మా బ్రెయిన్ చైల్డ్ మొదటి పుట్టిన రోజు అని తెలియజేశారు. గౌరవ అతిథిగా డా.అమృత లత గారు సభను ప్రారంభిస్తూ.. ఒక మంచి ఆలోచనాత్మక సదస్సుకు మా సాంత్వన వేదిక కావడం మా అదృష్టం అన్నారు. నెల్లుట్ల రమాదేవి తొలిపలుకుల్లో… కవిత్వంలో పునరాలోచన చాలా అవసరమనీ, మనకు మనమే దిశానిర్దేశం చేసుకోవాలన్నారు. రేణుకా అయోల మాట్లాడుతూ.. ఈ వేదిక ప్రారంభంలో నిర్మల ఇంట్లోను, పార్కులోను కూడా జరిగిందని తర్వాత సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చోటు దొరికిందని చెప్పారు. కవిత్వం మాత్రమే కాక చర్చలు అనువాదాలు నిర్మాణ పద్దతుల మీద సలహాలు తీసుకుంటూ నిర్మాణాత్మకంగా నడిచిందని ఇందులో నిర్మల చేసిన ఒక ప్రయోగం పేరు ఒక వస్తువు అనేక కోణాలు. సాధారణంగా కవి సమ్మేళనం అనగానే ప్రతి ఒక్కరూ తమ పుస్తకం పట్టుకుని ఏదో ఒక పాత కవితని చదివేసి వెళ్లిపోవడానికి భిన్నంగా ఒక సమకాలీన వస్తువు అనుకుని దానిమీద కొత్త కవిత రాయించడం వల్ల కాంట్రిబ్యూషన్ పెరుగుతుందని నిర్మల వివరించారు. అంతేకాదు నిరంతరం క్రియాశీలక ఆలోచనల్లో వుండటం సాధ్యమవుతుందని చెప్పారు . ఇది అనంతరం వీడియోలుగా కూడా ఇంకో ప్రయోగం చేశారు. దాని పేరే గ్రీన్ థాట్. అంటే ఆకుపచ్చని ఆలోచన. ఈ ఆలోచనను అందరూ అభినంది౦చారు.

అనంతరం ముఖ్య అతిథి డా. అమృతలత చేతులమీదుగా, కొండేపూడి నిర్మల చిత్రించిన కవుల భావచిత్రాలతో అపురూపంగా రూపొందిన చిత్రాలు కవులందరికి వార్షికోత్సవ బహుమతిగా ఇచ్చారు. నిర్వాహకులు ఆ చిత్రాలను సదస్సు రూమ్ అంతటా ప్రదర్శనగా వుంచారు. సెషన్ నంబర్ -2 లో ..మొదటి అంశమైన ‘భావ ప్రకటన స్వేచ్ఛమీద దాడి’ మీద పలువురు మాట్లాడారు. అరణ్య కృష్ణ అబ్జర్వర్ గా సాగిన ఈ సెషన్ లో దేశరాజు, ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్, మోడరేటర్స్ గా పాల్గొన్నారు.


చర్చలో డా.చిల్లర భవానీ దేవి, జి. వెంకట కృష్ణ, సివి సురేష్ పాల్గొని తమ అభిప్రాయాలను తెలియ జేశారు. భావ ప్రకటన స్వేచ్ఛపై ఆసక్తి కరమైన చర్చ జరిగింది.

“ఇవాళ పత్రికలు, టీవీలు, మన జీవితంలో భాగమైనా, కొన్ని పత్రికలు పార్టీలకు కట్టుబడి పనిచేస్తున్నాయి. అవి పార్టీ విధానాలను ప్రశ్నించలేకున్నాయి”…. – ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్. కవి, జర్నలిస్ట్.


“ ఒక పార్టీ పూర్తి మెజారిటీ తో అధికారం లోకి వచ్చినపుడు పత్రికల భావ ప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించే ప్రయత్నం చేస్తూనే ఉంటుంది…’’ – దేశరాజు, కవి, జర్నలిస్ట్-


“రచయితలమీద దాడి జరిగితే వ్యక్తులు గా ఎలా స్పందిస్తున్నాం- రాజ్యం వ్యక్తులుగా, సమూహాలు గా చీలి దాడికి పూనుకొంటోంది..’’ – జి. వెంకటకృష్ణ

‘కవులు ప్రతిపక్షమే కానీ ప్రభుత్వ వ్యతిరేకులు కాదు’ – అరణ్యకృష్ణ

“రాజకీయం రౌడీయిజం గా మారి భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకొంటోంది.’ – డా.చిల్లర భవానీదేవి

“నేనెందుకు రిస్క్ తీసుకోవాలి అని ఆలోచించే కవులున్నారు. ఒక తెగువ ఇవాళ చదువు కున్నవాళ్ళలో లోపిస్తూ ఉంది…” – నెల్లుట్ల రమాదేవి

“ భావ ప్రకటన స్వేచ్ఛకు ఇవాళ వేదిక కరువైంది . ఇవాళ మనం స్వేచ్ఛ లేని నాగరికులం.” -సివి సురేశ్

“ ఇవాళ కవి సెక్యూరిటీ జోన్ లో వుండాలనుకుంటున్నాడు , ఇది దురదృష్ణం ” – టి.రాజారామ్

రెండవ సెషన్ లో కవుల సెల్ఫ్ ప్రమోషన్ పై గూడ చర్చ జరిగింది. ఈ చర్చలో స్తబ్దత రద్దీ గురించి మాట్లాడుతూ.. సాహిత్యంలో ఒక వైపు స్తబ్దత , మరోవైపు రద్దీ పెరిగింది అనే వస్తువుపై ఆసక్తికరమైన చర్చ జరిగింది . “సీనియర్స్ లో స్తబ్దత, కనిపిస్తోంది. వారి ప్రాధాన్యతలు మారడం లాటి వ్యక్తిగత కారణాలు కాక , ప్రచురణ రంగం రాజకీయాలకు కొమ్ము కాయడం వల్ల తగ్గిన భావ స్వేచ్చ వల్ల రచనలు చెయ్యలేకపూతున్నామని కొందరు అన్నారు.

కొత్తతరం కవులు “ఇంస్టెంట్ గా రాస్తూ , ఫేస్ బుక్ లో ,ఇంటర్నెట్ లోఅరేస్తున్నారు. కొంతమంది నాణ్యమైన రచనలే చేస్తున్నారు కానీ కొందరు సామాజిక స్పృహ లేని రచనలు ఇబ్బడి ముబ్బడిగా చేస్తున్నారని దానివల్ల రద్దీ కనబడుతోందని అని ఒక వక్త అభిప్రాయపడ్డారు. దీనిపై భిన్నాభిప్రాయాలు కూడా వచ్చాయి. కొత్తతరం రచనలు తాజాగా కొత్త డిక్షన్ కనబరిస్తున్నాయని యువ కవులు అన్నారు . అయితే వస్తువు మళ్ళీ భావ కవిత్వం స్థాయిలోనే వుందని పలువురు అభిప్రాయపడ్డారు.
తర్వాత నెల్లుట్ల రమాదేవి గారి అధ్యక్షతన కవిసమ్మేళనం జరిగింది. నేను ( రాధేయ ) , టి.రాజారామ్ ముఖ్యతిథులుగా కవితా సభ జరిగింది. వర్తమాన కవితా రీతుల మీద ప్రసంగాలు నడిచాయి. ముందుగా స్థానిక కవులు తమ కవితలు వినిపించారు. అనంతరం సదస్సుకు హాజరైన ప్రముఖ కవులు, కవయిత్రులు తమ తమ కవితలను భావోద్వేగంగా వినిపించారు.


ఈ సదస్సులోమొత్తం 27 మంది కవులు, కవయిత్రులు కవితా గానం చేశారు. వైవిధ్యపూరితమైన కవిత్వంతో సభ ప్రేక్షకుల మన్ననలు అందుకుంది. మరుసటి రోజు ఉదయం 7.30 కి ఆర్మూర్ లోని డా.అమృతలత గారి ఇంటిలో అల్పాహారం పేరిట ఘనమైన ఆహారమే తీసుకుని మినీ బస్ లొనే అక్కడికి 60 కిమీ దూరంలో ఉన్న కొచ్చెర్ల జలపాత సందర్శనకు బయలు దేరాం. ఈ రెండురోజుల సదస్సుపై సమీక్షా చేసుకున్నాం. భవిష్యత్ కార్యక్రమాల నిర్వహణ పై వారి వారి అభిప్రాయాలు తెలియజేశారు . 4.30 కి మా మినీ బస్ లో హైదారాబాద్ కు తిరుగు ముఖం పెట్టాము . ప్రయాణంలో కవులు హుషారుగా పాడిన అంత్యాక్షరి, జానగీతాలతో బస్సు మార్మోగింది.


ఇక్కడ నాకు చాలా చాలా సంతోషం కలిగించిన విషయమేమంటే.. పదిమంది తెలుగు కవులు ఎక్కడ ఏ సదస్సులో పాల్గొన్నా వారిలో ముగ్గురు మా ఉమ్మడిశెట్టి అవార్డు గ్రహీత లుంటారు. ఈ సంతకం సదస్సులో కూడా కొండేపూడి నిర్మల , డా.చిల్లర భవానీ, అన్వర్ గారు .. ఒకనాటి మా అవార్డు విజేతలుగా నా మాటను బలపర్చారు. మళ్ళీ అందరం కలిసి తిరుగుపయాణంలో వస్తువు, వైవిధ్యం పై చర్చలు చేస్తూ హైద్రాబాద్ చేరుకున్నాం. మిత్రుడు చంద్రశేఖర శాస్త్రి, నేను కలిసి అదేరాత్రి 9.30 బస్సెక్కి , తెల్లారేసరికల్లా అనంతపురం చేరుకున్నాం. ఈ నిజామాబాద్ కవిత్వ సంతకం అలసట లేని ఆలోచనలను మాలో నింపగలిగింది…లాంగ్ లివ్ … సిగ్నేచర్.

స్వస్థలం: కడపజిల్లా ముద్దనూరు మండలం, యమవరం గ్రామం. కవి, విమర్శకుడు. తెలుగు సాహిత్యంలోె ఎం.ఏ., పీ హెచ్ డీ చేశారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు అధ్యాపకుడిగా పనిచేస్తూ 2013 లో పదవీ విరమణ చేశారు. రచనలు:  'మరోప్రపంచం కోసం'(1978),  'దివ్యదృష్టి', 'జ్వలనమ్', 'తుఫాను ముందటి ప్రశాంతి', 'ఈ కన్నీటికి తడిలేదు', 'క్షతగాత్రం', 'మగ్గం బతుకు', 'అవిశ్రాంతం' సంపుటాలు వచ్చాయి. విమర్శకుడిగా 8 పుస్తకాలు. 'కవిత్వం ఓ సామాజిక స్వప్నం'(మొదటి సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సంస్కారం'(రెండవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక సత్యం'(మూడవ సంపుటి), 'కవిత్వం ఓ సామాజిక చైతన్యం'(నాల్గవ సంపుటి. )అవగాహన-1 , మూడుపదులు ముప్పై కావ్యాలు, వివేచన- 2 త్వరలో రానున్నాయి. ''మగ్గం బతుకు'' దీర్ఘ కావ్యం ఆంగ్ల, హిందీ భాషల్లో కి అనువాదమైంది.

 

Leave a Reply