- ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ప్రేమ అనుకుని, ప్రేమను అందుకుందామని
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
పిల్లలు తిరిగే లోకాలలో, శిశువులు నవ్వే కాలాలలో
పూలు తిరిగే, తిరిగి పూసే రంగుల క్షణాలలో
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అద్దాలలోంచి మన ముఖాల్ని లాగడానికీ
ముఖాల్లోంచి అద్దాలని తీసివేయడానికీ, మన హృదయాలని భక్షించి
తమ హృదయాలని శిక్షించుకుని, చిందరవందర అయ్యేందుకూ
ఉక్కిరిబిక్కిరి చేసేందుకూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
అరచేతులలో వీడ్కోలు అయ్యి, కళ్ళల్లో ఎదురు చూపులయ్యీ
దినానంతాన గుమ్మానికి అనుకుని నిన్ను స్మరించుకుంటూ
నిన్ను శపించుకుంటూ ఎందుకో కానీ
ఎందుకో ప్రేమిస్తారు స్త్రీలు
వానలు కురిసే వేళల్లో, ఎండలు చిట్లే కాలాల్లో
వొంటరిగా ఒక్కళ్ళే అనేకం అవుతూ, అనేకం అయ్యి వొక్కళ్ళుగా మిగులుతూ
దీపం వెలిగించిన చీకట్లో తమని తాము రాసుకుంటూ నిన్ను నీకు చెరిపివేస్తూ
ఎందుకో కానీ ప్రేమిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ మోహిస్తారు స్త్రీలు
ఎందుకో కానీ నీకు మృత్యువుని పరిచయం చేసి మృత్యుంజయులుగా
మిగిలిపోతారు స్త్రీలు, ఏమీ మిగుల్చుకోని స్త్రీలు
ఏమీ లేని ఏమీ కాని స్త్రీలు
ఎందుకో కానీ నిన్ను ప్రేమించే స్త్రీలు
***
2. ఒక అమ్మ
చినుకులు ముసిరిన చీకట్లలో
ఒక్కతే కూర్చుంటుంది ఒంటరిగా ఒక అమ్మ కొంత చీకటితో కొంత చిత్తడితో
ఇంకా ఇప్పుడే ఉన్నట్లు, ఇంకా ఇప్పుడే జరిగినట్లు
నువ్వు గుప్పిళ్ళతో చీకటిని వెన్నెలతో దూసి
తన ముఖాన్ని లేత రావి ఆకుల అరచేతులతో తడిమిన జ్ఞాపకం
నువ్వు పాకుతూ, పడుతూ లేస్తూ
నీటి నవ్వులతో పరిగెడుతూ
అటు తననీ ఇటు నిన్నూ
నింగికీ భూమికీ ముడివేసి
తన బొజ్జలో ముడుచుకుని ఒదిగి ఒదిగి పడుకున్న ఒక కలవరం
హోరున వీచే అవిసె చెట్లు
తిరిగి వచ్చే పక్షుల కలకలంతో జలదరించే ఉద్యానవనాలు
తల వంచుకున్న వీధి దీపాలపై
రాలే తొలి చినుకులూ, మూసుకుంటున్న ఏకాకి తలుపులు
ఇవన్నీ తనై, ఇవన్నీ తన తనువై
చీకట్లో ముసిరిన చినుకులలో
ఒంటరిగా కూర్చుంటుంది ఒక్కత్తే ఒక అమ్మ కొంత దిగులుతో కొంత దహనంతో
కన్నీళ్ళతో బరువైన కళ్ళే తనవి
ఎదురు చూపులతో చిట్లి కనుల కింద సాగిన నల్లని చారికల దారులే తనవి
నిన్ను అడగలేక, నిన్ను విడవలేక
ఎవరికీ చెప్పుకోలేక
నిన్ను హత్తుకుని నెత్తురోడిన చల్లటి చేతులే తనవి, పగిలిన అరిపాదాలే తనవి
గుమ్మానికి అనుకుని
తిరిగి ఇంటిలోకీ తిరిగి చీకటిలోకీ కదులుతూ, వీచే గాలిని మునివేళ్ళతో తాకిన
విలవిలలాడే పసి హృదయమే తనది
రాత్రిలోకి ఒక శిలయై, నీకై ఎదురు చూస్తూ కాలాన్ని చెక్కక మునుపు
తనకే తెలియదు, ఆ అమ్మకే తెలియదు
బాల్యంలో నిన్ను తను కొట్టినప్పుడు
ఇపుడు నువ్వు తనని చరచినప్పుడు
అపుడూ, ఇపుడూ
తనే ఎందుకు గుండె ఉగ్గపట్టుకుని ఏడ్చిందో
Excellent poems… Srikanth has a unique voice and amazing expression. The central theme of his poetry is women and he excels.
మాటలలో ఒదగదు . గుండె లో నే వుంటుంది ఈ కవిత.
సత్యవతి
రెండు కవితలు దేనికవే భిన్నమైనవి,
మొదటిది స్త్రీ యొక్క విశాలత్వాన్ని,రెండవది స్త్రీ యొక్క ఔన్నత్యాన్ని చాటేది.