గదిని శుభ్రం చేస్తున్నప్పుడు…

గదిని శుభ్రం చేస్తున్నప్పుడు
ఎప్పటివో
మనసుమూలల్లోని జ్ఞాపకాలు
మౌనంగా మూలిగిన చప్పుడు

పాత పుస్తకాల మధ్య దొరికిన
తొలి ప్రేమలేఖా
ఇనప్పెట్టె అడుగున
భద్రంగా అమ్మ దాచిన
నా బొడ్డుపోగూ
దాచుకోవడానికి ఖాళీ లేవని పారేస్తుంటే
ఎందుకో
సంవత్సరమంతా చదివి
ఆఖరి పరీక్షల్లో తప్పిన పిల్లాడిలా
దుఃఖమాగడం లేదు!

ఎన్ని దారితప్పిన కొమ్మల్ని
దారికి తెచ్చిందో
నాన్న వాడిన అర్ధచంద్రాకారపు కత్తి
ఇప్పుడు మొండిదైపోయింది
ఒళ్ళంతా నల్లనల్లగా తుప్పుపట్టి
‘వదిలించుకోవాల్సిన’ వస్తువైపోయింది
అవసరమే కదా కొలమానం
మనిషికైనా వస్తువుకైనా

అమ్మ పాత చీరను చూసినప్పుడల్లా
నా మనసు వాకిట్లో ఎన్ని తడిముగ్గులో
కడుపారా తిన్నాక
ఆ చీరచెంగుతో తుడుచుకోకపోతే
అసలు ఆకలి తీరేదా?
బడికి పంపేముందు
ఆ చీర కొసతో సరిచేయకపోతే
అసలు ముఖం కళకళలాడేదా?
అమ్మ ముసిముసిగా నవ్వుతూ
నుదుటిమీద చిరుచెమటను
ఆ చీరకొంగుతో అద్దకపోతే
చేసిన కాసింత కష్టానికి
ఆ మాత్రం గుర్తింపైనా దక్కేదా?
ఇప్పుడా చీర
నా గుండెలమీంచి కదలనంటోంది!
చిన్నప్పుడు
నన్ను బంగారుకొండను చేసిన
ఉయ్యాల చీర
ఇప్పుడు నా కళ్ళలో
సముద్రాన్ని తవ్వుతోంది!

చిన్నవైపోయిన పిల్లల బట్టలన్నీ
వాళ్ళెదిగిన క్రమాన్ని
కళ్ళ ముందు రీళ్ళుగా తిప్పుతుంటే
గుండె ఆకాశం కరిగి
కన్నీరై జారుతోంది

ఎన్ని ఎర్రెర్రని గీతాల్ని రాసిన
విప్లవకవికైనా
జ్ఞాపకాల్ని ఎత్తి అవతల పారేయడం
ఆత్మహత్యా సదృశ్యమే

ఆఖరికెలాగో
గదైతే శుభ్రమయింది కానీ
నేనే
ముక్కలు ముక్కలుగా
గదంతా పోగుపడ్డాను!

తీరమిప్పుడు…

చిన్నప్పటి నుండీ చూస్తున్న
తీరమే ఐనా
ఇప్పుడెందుకో
శోకద్వీపంలా కనబడుతోంది
అల్లరి కెరటాల తీరమిప్పుడు
అనాథలా దుఃఖిస్తోంది
అలల పాటలు పాడి
సేదదీర్చే తీరమిప్పుడు
చెంపలకు చేతులానించి
బరువెక్కిన హృదయంతో
దిగాలుపడి కూర్చుంది

తీరమిప్పుడు
ఛిద్రమైన బతుకుల్లోని
కన్నీటినంతా తనలోకి ఒంపుకుని
ఉప్పుసంద్రమైపోయింది

తీరమిప్పుడు
ఎక్కడెక్కడో తలదాచుకున్న
తన బిడ్డల్ని తలుచుకుని
కన్నీరు మున్నీరవుతోంది

తీరం
ఇక్కడెవరికీ అందమైన జ్ఞాపకం కాదు
ఎర్రచారల ఆకాశాన్ని కప్పుకుని
దట్టమైన చలిలో
వణుకుతూ పడుకున్న
ముసలి దేహం

ఉబికుబికి వస్తున్న కన్నీటితో
ఏదో చెప్పాలన్న ఆరాటం
గొంతుకడ్డం పడి
ఏదీ చెప్పలేక
బేలచూపులు చూస్తున్న పసిపాప ముఖం

ఇక్కడో
స్వర్గం ఉండేది
ఇప్పుడది చెల్లాచెదురైపోయింది
ఇక్కడో
కేరింతల లోకం ఉండేది
ఇప్పుడది వలసపిట్టయి ఎగిరిపోయింది
ఒకప్పుడు తీరంలో
సజీవ జీవన దృశ్యాలుండేవి
ఇప్పుడిక్కడ
అంతకంతకూ విస్తరిస్తూ
తెల్లని శ్మశానం వుంది!

జననం: ఒంకులూరు, శ్రీకాకుళం జిల్లా. కవి, రచయిత, ఉపాధ్యాయుడు.  వివిధ పత్రికల్లో కవితలు, అభినయ గేయాలు, వ్యాసాలు ప్రచురితమయ్యాయి.

Leave a Reply