వేసపోగు డేవిడ్ ప్రభాకర్

యూనివర్సిటీలో చేరి రెండు నెలలు కావొస్తున్నా ఇంకా కొత్తగానే ఉంది ప్రభాకర్ కి. విశ్వమంతా అక్కడే ఉందా అనేంత విశాలమైంది ఆ విశ్వవిద్యాలయం. రెండు వేల ఎకరాల పైగా ఉండే స్థలంలో వందల రకాల చెట్లు, ఎప్పుడూ చూడని రంగురంగుల పక్షులు, నెమళ్లు, లేళ్ళు, అడవి పందులు, కుందేళ్ళు, జింకలు, ఇరవై రకాల పాములు, పురుగులు, వందల రకాల పూలచెట్లతో ప్రతి కాలంలోనూ క్యాంపస్ అందానికి అంతుండదు. దేశం నలుమూలల నుంచే కాక విదేశాల నుంచి వచ్చే రమారమి నాలుగు వేలమంది విద్యార్ధులతో మరో లోకాన్ని తలపిస్తుందా క్యాంపస్. ఎంతోమంది అక్కడ చదవాలని, ప్రొఫెసర్లు కావాలని ఆరాటపడే క్యాంపస్.

అన్నట్టూ మన ప్రభాకర్ పూర్తి పేరు వేసపోగు డేవిడ్ ప్రభాకర్. సర్టిఫికేట్ లో మధ్యమావతి వినిపించదు. ఎంఫిల్ వరకూ స్టేట్ యూనివర్సిటీలో చదువుకుని, ఎంట్రన్స్ లో గట్టి పోటీనే ఎదురుకుని సెంట్రల్ యూనివర్సిటీకొచ్చాడు. తన కోసం ఎత్తిపెట్టిన ప్రత్యేక సీట్ ను దాటుకుని పేదా గొప్పా అందరూ కలిసి కూర్చునే సహపంక్తిలో చోటు సంపాదించుకున్నాడు. ఆ ప్రత్యేక సీట్ లో మరో ప్రభాకరో, కృపామణో ఆశీనులవుతారన్న చిన్న సంతృప్తి, ఆశ.

యూనివర్సిటీలో చూసిన, విన్న కథల ప్రకారం ప్రభాకర్ కి కలలు వస్తుంటాయి. స్కాలర్ గా మంచి పేరు తెచ్చుకొని ఏ గొడవల్లో ఇరుక్కోకుండా ఉంటూ ఒకరోజు అదే పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్ లో అసిస్టెంట్ ప్రొఫెసర్ అయిపోయినట్టు, వయసు మీద పడుతున్నా సంపాదన లేక, ఇటు పరిశోధన పూర్తి కాక అటు పెళ్ళీ కాక విద్యార్థిగానే తన ముప్పైలను భారంగా వెళ్లదీస్తున్నట్టు లేదా తన గైడ్ రిటైర్ అయిపోయి తనకో దారి చూపించకా, మిగతావారు ఇతనిని చేర్చుకోక క్యాంపస్లోనే ఎదురుచూసే యంత్రంగా మిగిలిపోయినట్టు కొన్ని పీడ కలలు కొన్ని మంచి కలలు కంటూ ఉంటాడు. సాధారణంగా మంచి కలలు మెలకువగా ఉన్నప్పుడే వస్తాయి ప్రభాకర్ కి. వాస్తవాలే పీడ కలలని ఆలస్యంగా తెలిసొస్తుంది.

***

గైడ్ చెప్పిన పుస్తకాల్లో మూడు దొరికాయి. రెండు ఇంకెవరో ఇష్యూ చేసుకున్నారు. ఇంటి మీద చాలా బెంగగా ఉంది ప్రభాకర్ కి. అమ్మను చూడడానికి ఇప్పట్లో వీలయ్యేలా లేదు. పరధ్యానంగా లైబ్రరీలోంచి బయటకు వస్తుంటే ఎవరో ‘అన్నా’ అని పిలిస్తే తిరిగి చూశాడు. మర్చిపోయిన తన సెల్ ఫోన్ ని తీసుకొస్తుందో అమ్మాయి.

“ఇది మీదే కదా”

“నాదే, థాంక్ యు”

“లైబ్రరి ఆఫీసులో ఇద్దామనుకున్నాను. నిజంగా మీదే కదా! నెంబర్ చెప్పగలరా?”

తన నెంబర్ చెప్పాడు ప్రభాకర్. ఆమె తన ఫోన్ లోంచి కాల్ చేసి నమ్మకం కుదుర్చుకుని ఫోన్ ఇచ్చింది.

“ఏ డిపార్ట్మెంట్ నువ్వు?”

“సోషియాలజీ అన్నయ్యా. మీరు?”

“పొలిటికల్ సైన్స్”

“మన డిపార్ట్మెంట్స్ పక్క పక్కనే అయినా మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదన్నయ్యా. మీ పేరు?”

“ప్రభాకర్. నీ పేరు?”

“శ్రావణి”

“సరే బై. మళ్ళీ కలుద్దాం”

అనుకున్నట్టే వాళ్లు మళ్లీ మళ్లీ కలుస్తూనే ఉన్నారు. డిపార్ట్మెంట్ లో లైబ్రరీలో గ్రౌండ్లో స్టూడెంట్స్ క్యాంటీన్లో అనుకున్న టైంకి ఎవరూ ఆలస్యం చేయరు. శ్రావణి సైకిల్ మీద తిరిగినా ప్రభాకర్ కాళ్ళెప్పుడూ అంతకంటే వేగంగానే ఉంటాయి. ఈ మధ్య చాలామంది విద్యార్ధులు సైకిళ్ళు మానేసి బండ్ల వైపు మొగ్గు చూపడంతో క్యాంపస్ వాతావరణంలో చాలా మార్పులు వచ్చాయి. ఇప్పుడు క్యాంపస్ లో కాలుష్యం వాహనాల వల్ల కూడా మొదలైంది.

***

“ఏం కూరలు మీ మెస్ లో”

“వంకాయ బీన్స్ అన్నయ్యా” కలిపి ముద్దలు తినిపిస్తూ అంది శ్రావణి.

ఇద్దరూ క్యాంపస్ గ్రౌండ్లో పచ్చగడ్డి మీద కూర్చుని తింటున్నారు. చీకటి. అక్కడక్కడా మరికొన్ని జంటలు. రెండు మూడు జంటలు ఒక్కొక్కరిగానే కనిపిస్తున్నారు. మిణుకు మిణుకుమంటున్న మిణుగురులు వారి ప్రేమకు సాక్ష్యాలుగా మత్తుగా వీస్తున్న మోహపు గాలిలో ఎగురుతున్నాయి. శ్రావణి ప్రభాకర్ లు రోజూ అక్కడ రాత్రి భోజనం చేసి క్యాంపస్ కబుర్లు, సబ్జెక్టు సంగతులు చెప్పుకొని ఎవరి హాస్టల్కి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇద్దరి హాస్టల్స్ కి మూడు కిలోమీటర్ల దూరం. మధ్యాహ్నం భోజనం మెస్ లోనే. వారి మాటలకు బ్రేక్ ఇచ్చేది ఎప్పుడూ ప్రభాకర్ తల్లే. ఎన్నిసార్లు ఈ టైంలో ఫోన్ చేయొద్దని చెప్పినా చెవికెక్కించుకోదు. రింగ్ అవుతున్న ఫోన్ ని అసహనంగా జేబులోంచి తీశాడు ప్రభాకర్. అంతకంటే ముందు శ్రావణి కట్టిన రాఖీని జాగ్రత్తగా తీసి ఆమె చేతికిచ్చి కాస్త దూరంగా వెళ్లి మాట్లాడొచ్చాడు.

“ఏంటన్నయ్యా రాఖీ కట్టి మూడు నెలలవుతుంది. ఇంకా జేబులో పెట్టుకొని తిరుగుతున్నావా?”

“అదెప్పుడూ నాతోనే ఉంటుంది.”

“మరి నేను?”

“నువ్వూ నాతోనే.”

ప్రతిసారీ అతని భుజం మీద వాలే శ్రావణి ఆ రాత్రి అతని ముఖం మీద మొదటి ముద్దై మెరిసింది. ఆత్మీయంగా నవ్వాడు ప్రభాకర్.

“నువ్వు లేకపోతే నేను తోడబుట్టినవాళ్ళు లేని ఒంటరిదానిలానే ఉండిపోయేదాన్ని అన్నయ్యా!”

“నాకో సొంత అక్క ఉన్నా నిజమైన ఎఫెక్షన్ అంటే ఏంటో నువ్వొచ్చాకే తెలిసింది రా!”

ఆ రాత్రి అర్ధాంతరంగా ముగిసింది.

***

“బుజ్జీ! నా రిజల్ట్స్ వచ్చాయి. Social stratification పేపర్లో నేనే టాపర్. క్లాస్ లో సెకండ్ వచ్చాను”

“సూపర్ రా” అంటూ శ్రావణిని ఎత్తుకొని ఉక్కిరిబిక్కిరి చేసాడు ప్రభాకర్.

“నాకు తెలుసు నీకు మంచి మార్కులు వస్తాయని!”

లేడీస్ హాస్టల్ బయటే అని కాబోలు ప్రభాకర్ రెండు ముద్దులతోనే సరిపెట్టుకున్నాడు. ఎవరూ చూడకుండా. చలి కాలం. అడవిలాంటి ప్రాంతం గనుక, ఊళ్ళో కంటే క్యాంపస్ లో చలి ఎక్కువ.
ఇద్దరూ కలిసి గ్రౌండ్ పక్కనున్న రోడ్లో నడుస్తున్నారు. ఆ దారంటే వీళ్ళకి చాలా ఇష్టం. పావుకిలోమీటర్ రోడ్డు. రెండు పక్కలా ఆకాశాన్ని తాకే ఎత్తైన కాడమల్లెల పూలచెట్లు. దారి మొత్తం తెల్లని మంచు కురిసినట్టు రాలిపడే కాడమల్లెలు, ఆ సువాసన… మాటల్లో చెప్పలేని అనుభూతి అక్కడ నడవడమంటే. వీళ్ళు ఆ దారికి స్విట్జర్ లాండ్ రోడ్డని ముద్దుపేరు పెట్టుకున్నారు. నడుం మీద భుజాల మీద ఒకరికొకరు చేతులేసుకుని నడుస్తున్నారు. శ్రావణి ముభావంగా ఉండడం పెద్దగా పట్టించుకున్నట్లు లేడు ప్రభాకర్.

“చెప్పు డిన్నర్ కి ఎక్కడికి వెళ్దాం?” అన్నాడు ఆమె బుగ్గ నిమురుతూ.

“ఎక్కడికీ వద్దు. ఇక్కడే ఉందాం,” అలసిన మల్లెతీగలా అల్లుకుపోయింది శ్రావణి.

“ఏమైంది రా?” శ్రావణి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని ముద్దు పెడుతూ అడిగాడు ప్రభాకర్.

“ఇంకో సెమిస్టర్ అయిపోతే నా కోర్స్ కూడా అయిపోతుంది,” దిగులుగా అంది శ్రావణి.

“ఇంకో నాలుగేళ్లు చేద్దామనుకుంటున్నావా ఏంటి?” చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రభాకర్.

చిరుకోపం కూడా శ్రావణి ముఖంపై అందంగా ఉంది.

“ఆ తర్వాత మనం ఎలా కలుస్తాం?” శ్రావణి అమాయకత్వం ప్రభాకర్ ని పిచ్చి ప్రేమలో పడేస్తుంది.

“ఇక్కడే ఎంఫిల్ కి చేరతావు. నీకు సీట్ రాకపోవడం ఏం ఉండదు కదా. ఎందుకు కంగారు?”

ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు గ్రౌండ్ లో. మంచుకి గడ్డి బాగా తడిసింది. శ్రావణి కాళ్లను తన ఒడిలో పెట్టుకొని పాదాలు నొక్కుతూ కబుర్లు చెప్తున్నాడు ప్రభాకర్.

“పట్టీలు చూశావా చీకట్లో కూడా ఎలా మెరిసిపోతున్నాయో. ఇంట్లో చెప్పావా?”

“అమ్మో! ఎక్కడివంటే ఏం చెప్పను? పోనీ నేనే సొంతంగా షాప్ కెళ్ళి వెండి పట్టీలు కొన్నానని చెప్తే ఇంకేమన్నా ఉందా?”

“మరి సెలవులకు వెళితే ఏం చెప్తావ్?”

“ప్రస్తుతానికి హాస్టల్లోనే పెట్టి వెళ్తాను?”

“ఎప్పుడొస్తావు?”

ప్రభాకర్ వళ్ళో ఉన్న తన కాళ్లను తీసి అతన్ని తన ఒడిలోకి తీసుకుంది శ్రావణి. ఆమెను అలాగే గట్టిగా పొదివి హత్తుకున్నాడు. మళ్ళీ శ్రావణిని సెలవులయ్యేంత వరకూ కలవకుండా ఎలా బతకాలని దుఃఖమూ ఆపుకోలేకపోయాడు, అతన్ని అతనూ నిగ్రహించుకోలేకపోయాడు. ఒకపక్క మొదలవుతున్న విరహం మరో పక్క ఆగలేని మోహం. అతని ప్రేమావేశంలో శ్రావణి కరిగి ప్రభాకర్ లో కలిసిపోయింది…

అది మొదలు తమ చుట్టూ ఉన్న స్నేహితులు కూడా వీళ్ళ కొత్త అనుబంధానికి అలవాటుపడడం మొదలుపెట్టారు. కొందరు చర్చలు పెట్టారు. కొందరు ఛీ కొట్టారు. ఇంకొందరు మానవ సహజం అని సరిపెట్టుకున్నారు. ఏ వరసలతో పిలుచుకున్నా చివరికి అక్కడికే చేరుకుంటారని చతుర్లు విసురుకున్నారు. ఎవరు ఎన్ననుకున్నా వీళ్ళిద్దరూ ఆనందంగా మార్పుని ఆహ్వానించారు. జీవితం మొత్తం అలాగే ఉంటుందని అప్పటికే భ్రమలో ఉన్నాడు పాపం ప్రభాకర్.

***

అంతసేపటి నుంచి చర్చిలో కూర్చుని నీరసమొస్తుంది ప్రభాకర్ కు. ఇంకా ఆరాధనే పూర్తి కాలేదు. ఇక పాస్టర్ గారొచ్చి వాక్యం చెప్పి ముగించే సరికి సొమ్మసిల్లిపోయేలా ఉన్నాడు. ఎడతెరపి లేకుండా యౌవనస్తులు పాడే పాటలకి చప్పట్లు కొట్టి కొట్టి జబ్బలు నొప్పెడుతున్నాయి. మొన్న మొన్నటి వరకూ దేవుడంటే భయపడేవాడిగానే ఉండేవాడు ప్రభాకర్. చదువుకునే క్రమంలో కాలేజీల్లో యూనివర్సిటీల్లో కులమత ఆధ్యాత్మిక చర్చలు, పుస్తకాలు చదవడం మొదలుపెట్టాక వెంటాడిన ప్రశ్నలు, భౌతికమైన సమాధానాల కోసం చేసిన వెతుకులాట, స్నేహితులతో వాదోపవాదాలు కలిసి ఇష్టమున్నా లేకున్నా మారు మాట్లాడకుండా అమ్మ కోసం చర్చికెళ్ళి కూర్చోడం దగ్గరకి తీసుకొచ్చాయి.

పక్క వరసలో ఆడవాళ్లు. పెద్దవాళ్ళతో సహా అందరూ కిందే కూర్చున్నారు. ప్రభాకర్ తల్లి ఎమీలియమ్మ ప్రార్ధన చేస్తూ పాటలు పాడుతూ భక్తి పారవశ్యంలో మునిగిపోయింది.

‘యెహోవా నా మొరలాలించెను తన మహా దయను నను ల లా ల..’ అంటూ తనకు గుర్తున్నంతలో పాడుతున్నాడు ప్రభాకర్.

వాళ్ళ ఊరిలో అతను డేవిడ్. ముసలివాళ్ళకి దావీదు. మరీ ముద్దొస్తే ‘రేయ్ దావీదా.’

సంఘకాపరి ప్రేమయ్య ప్రసంగించాక శ్రీరాగంలో ముగింపు పాట ‘పంపుము దేవా దీవెనలతో…’ పాడుతూ ఉన్నారు సంఘమంతా. ఇద్దరు సంఘస్తులు జోలెలు పట్టుకుని కానుకలు స్వీకరిస్తున్నారు. అందరూ బిగించిన గుప్పిళ్ళలోంచి వీలైనంత డబ్బులు వేస్తున్నారు. ఏ చేతికీ పది నుంచి ముప్పైకంటే ఎక్కువ బిగుసుకోవు. అంత పేద చర్చి అది. ప్రభాకర్ గట్టిగా మూసిన కుడిచేతి పిడికిలిలో కానుక పట్టుకుని సిద్ధంగా ఉన్నాడు. మోచేతి దాకా జోలెలోకి పోనిచ్చి అప్పుడు వేశాడు. కాబట్టి డబ్బుతో పాటు దీనస్థితిలో ఉన్న ఆ రాఖీ జోలెలోకి ఎలా వచ్చిందన్నది ఎవరికీ తెలీదు. ఏదో భారం దింపుకున్నట్టు, నిర్ణయం ఆయనకే వదిలేసినట్టు సిలువ వంకే చూస్తూ లేచి చర్చి బయటకు వచ్చేశాడు ప్రభాకర్. చర్చి గోడ మీదున్న నీలం రంగు సిలువ నుంచి మరో పెచ్చు ఊడి పడింది. పైనున్న రేకుల కప్పు చిల్లులలోంచి ఎండ నేరుగా ఎమీలియమ్మ మీద పడుతుండేసరికి లేచి అందరికీ వందనాలు చెప్పుకుంటూ బయటకు వచ్చేసింది. ప్రభాకర్ చుట్టూ జనాలు చేరి మాట్లాడుతుంటే భలే ముచ్చట ఎమీలియమ్మకు. కొడుకు హైదరాబాదులో పెద్ద చదువు చదువుకుంటున్నాడు. పైగా వాళ్ళ పేటలో అంత చదువు చదివేవాడు లేడు. అందరికీ ప్రభాకర్ అంటే ఒక హీరో ఇప్పుడు. తోటి స్నేహితులు కూడా రారా పోరా అనడం మెల్లగా మానేశారు.

కాసేపు చూసి ఎమీలియమ్మ ప్రభాకర్ చెయ్యి పట్టుకుని కొంచెం పక్కకు తీసుకెళ్ళింది. “ఒరేయ్ దావీదా మన పాదిరిగారు గుర్తున్నారా?” అంటూ ప్రేమయ్య గారి కుటుంబాన్ని పరిచయం చేసింది.
“వందనాలయ్యగారు,” వినమ్రంగా పలకరించాడు ప్రభాకర్.

“బావున్నావా డేవిడ్ ఎప్పుడొచ్చావ్?” పాస్టర్ గారి ఆహార్యమే కాదు నవ్వూ ఆహ్లాదమే.

“నిన్ననే అయ్యగారు.”

క్యాంపస్ కి మూడొందల కిలోమీటర్ల దూరంలో ఉన్నా ధ్యాసంతా శ్రావణి మీదే. అయ్యగారి పక్కనున్న భార్య, కూతురు కనిపించడం లేదు. ఎప్పుడెప్పుడు ఇంటికెళ్ళి ఉన్న ఒకేఒక్క నవారు మంచం మీద వాలిపోయి శ్రావణికి మెసేజ్ పెడదామా అనుంది డేవిడ్ ప్రభాకర్ కి.

“ఇదిగో డేవిడ్ మీ ఆంటీ, మా పాప దీవెన. తన డిగ్రీ అయిపోవచ్చింది. నీ సబ్జెక్టే. హిస్టరీ ఎకనమిక్స్ పోలిటిక్స్” ఉత్సాహంగా చెప్పాడు పాస్టర్ ప్రేమయ్య. అంతా తెలిసిన వాళ్ళే. ఇప్పుడు మళ్ళీ ఈ పరిచయాలు విడ్డూరంగాను విసుగ్గాను ఉన్నాయి ప్రభాకర్ కి.

తప్పని నవ్వు మొహాలు పెట్టారు దీవెన ప్రభాకర్లు. దీవెన నుదుటి నుంచి పాదాల దాకా ఒకే నలుపులో ఉంటుంది. పల్చని జుట్టు, బక్కపలుచని ఆకృతి, నిర్మలమైన ముఖం. సిగ్గు పడటం తప్ప వేరే ఏ అనుభూతికీ అవకాశం ఇవ్వడం లేదు ఆ సందర్భం.

వచ్చిన పని అయిందనుకొని అందరూ ఇళ్ల బాట పట్టారు. ప్రభాకర్ ఇంటికి రాగానే ముందు అనుకున్న పనిలోనే పడ్డాడు. ఎమీలియమ్మ నాలుగడుగుల దూరంలో ఉన్న చర్చి నుంచి ఇంటికి రాగానే క్షేమంగా చేర్చినందుకు అలవాటుగా చిన్న ప్రార్థన చేసి పొద్దున్నే వండిన చేపల కూరను మురిపెంగా మూత తీసి చూసుకొని పొయ్యి మీద బియ్యం పెట్టింది. ఈ మధ్య ప్రభాకర్ కి వచ్చే స్కాలర్షిప్ తో రేకులు తీయించి స్లాబ్ వేయించింది. ఇంటి బయట ఒక చిన్న టాయిలెట్ కూడా కట్టించింది. అందుకు కూడా ప్రభాకర్ అంటే మర్యాద పెరిగింది పేటలో.

“వురే దావీదా ఆ పిల్లని సరింగా చూసావేట్రా?”

“సెలవులయ్యేదాకా ఇంకేం చూస్తానమా?”

“ఏటీ! ఇందాకడే కదరా చర్చి దగ్గర చూసావూ?”

ఫోన్లోంచి మొహమూ మెదడూ బయటకు తీశాడు ప్రభాకర్. “ఏ పిల్ల మా?”

“పాదిరి గారి అమ్మాయి రా దీవెనమ్మ!”

“ఆ చూశాలే అయితే ఏంటిప్పుడూ?”

“అదే నిన్నడుగుతున్నార్రా ఆ యమ్మాయికి?” సంబరంగా చెప్పింది ఎమీలియమ్మ.

“ఏంటీ నాకా?” అదిరిపడ్డాడు ప్రభాకర్.

“మరి నీక్కాపోతే నాకా” ఆశ్చర్యపోయి చూసింది.

“నాకా పిల్లనిచ్చేదేంటమా?”

“ఆ పిల్లంత సదువు సదివింది మనోళ్లలో ఎవరున్నార్రా దావీదా పైగా అయ్యగారి కూతురు. ఆ సదువైపోయాక టీసరు టైనింగ్ కి కూడా పోద్దంటా. ఎంతమంది ఆ పిల్ల కోసం మన పేటలో సూత్నారో తెలుసా? పెళ్లి కర్చులు కూడా ఆళ్లే ఎట్టుకుంటారంట. అక్క కూడా బలే సంతోశంగా ఉంది రా నానా!”

“మా! నా చదువే ఇంకా కాలేదు. డిగ్రీ కూడా పూర్తి కాని పిల్లని చేసుకోడం ఏంటి? నాకొద్దని చెప్పు.” అసలే శ్రావణి నుంచి రిప్లయ్ రాలేదని కంగారుగా ఉన్నాడు.

“బేగా చెప్పేయ్యాలనేం లేదు గానీ నిదానంగా ఆలోసించు. ముందొచ్చి అన్నం తినరా!”

వేడి వేడి అన్నం, చేపల కూరేసి వడ్డించింది.

“ఏంటియ్యి కొరమీనా?” అన్నం కంటే ముందు చేపముక్క నోట్లో పెట్టుకుంటూ అడిగాడు.

“మట్టగిడసలు. పొద్దున్నే సువార్తమ్మొస్తే తీసుకున్నా.”

“ఆ ఎలా ఉంది వాళ్ళన్నకి గుండె జబ్బంట కదా!”

“రేపో మాపో అన్నట్టున్నాడు. ఇందాకడ చర్చిలో కనిపిస్తే ఒక వందిచ్చా!”

“బాగుంది. నువ్వే కాయగూరలమ్ముకునేదానివి. నువ్వెళ్ళి సువార్తమ్మకి వందిచొచ్చావా?”

“ఏదోలేరా… చూసి తిను ముల్లు గుచ్చుకుంటాయి.”

“లేవులే గానీ నువ్వెళ్ళి ఆయనకి చెప్పేసిరా మా. నాకిష్టం లేదని. ఎప్పుడూ లేనిది అమ్మగారిని ఆంటీ అని కూడా అనిపిస్తున్నాడు. ఇప్పుడే చెప్పకపోతే ఎదురుచూస్తానే ఉంటారు.”

“అలాగేలే. నువ్ ముందు తిను. సెలవలయ్యేదాక బోల్డంత టైముంది.”

***

శ్రావణి ప్రభాకర్లు సెలవులయ్యి క్యాంపస్ కి వచ్చిన తర్వాత ఎన్నిసార్లు ఏకమయ్యారో వారికే తెలీదు. కలవడం మాట్లాడుకోడానికి కూడా అన్న విషయమే మర్చిపోయారు. శ్రావణి నాన్న దగ్గర నుంచి ఫోన్ వచ్చినప్పుడల్లా ఇద్దరికీ ఒక కొత్త ఇబ్బంది ఏదో మొదలైంది. ఎప్పటికైనా ఈ విషయం వాళ్ళకు చెప్పే రోజు కోసం ప్రతిరోజూ సిద్ధపడుతూనే ఉన్నాడు ప్రభాకర్. శ్రావణి తన పీజీ పూర్తి చేసి ఇక్కడే ఎంఫిల్ సీట్ సంపాదిస్తే ఇద్దరూ కలిసే ఉండొచ్చని, దగ్గరలో ఒక రూమ్ తీసుకోవాలని, స్కూల్ పిల్లలకి ట్యూషన్ చెప్తే ఇంకో నాలుగు డబ్బులొస్తాయని ఆలోచిస్తున్నాడు. శ్రావణిని చేసుకుంటే పుట్టబోయే పిల్లలు కూడా మంచి వాతావరణంలో పెరుగుతారు. తనకు లేకపోయినా తన పిల్లలకి ఆస్తిపాస్తులు వస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా తనకు మర్యాదా గౌరవం పెరుగుతాయి. అది సెంట్రల్ యూనివర్సిటీలో స్కాలర్ గా ఉండడం కంటే, అక్కడే ప్రొఫెసర్ అవ్వడం కంటే అమితంగా వచ్చే గౌరవం. ఎమీలియమ్మ కొడుకుగా పోగొట్టుకున్నవి దక్కనివి శ్రావణి భర్తగా పొందబోతున్నందుకు లోలోపలే ఆనందపడుతున్నాడు. శ్రావణి కుటుంబం నుంచి అనిష్టత చీవాట్లు ఎదురౌతాయని తెలుసు. దానికి కూడా శ్రావణే అండగా నిలుస్తుందని నమ్మకంగా ఉన్నాడు వేసపోగు డేవిడ్ ప్రభాకర్. ఇక అతనికి ఉన్నది అమ్మ మాత్రమే. ఆమెను ఒప్పించనవసరం లేదు. ఎదిరించాల్సిన పని లేదు.

ఆ రోజు ప్రభాకర్ కి శ్రావణి కంగారుగా ఫోన్ చేసింది. అతను dissertation meeting లో ఉండడం వల్ల రెండు గంటల తర్వాత తిరిగి ఫోన్ చేశాడు. ఏది జరగదని కచ్చితంగా అనుకున్నారో అదే జరిగింది. డిపార్ట్మెంట్ నుంచే మెడికల్ షాప్ కెళ్ళి ప్రెగ్నెన్సీ కిట్ తెచ్చాడు.

హాస్టల్ బయటే శ్రావణి కోసం, తన కబురు కోసం ఎదురు చూస్తున్నాడు ప్రభాకర్. వాట్సాప్ కి ఖరారైనట్టు ఫోటో పంపింది. నీరు గారిపోయాడు. ముచ్చెమటలు పోశాయి. శ్రావణిని త్వరగా బయటకు రమ్మని మెసేజ్ చేశాడు.

శ్రావణి నెమ్మదిగా వచ్చింది. ప్రభాకర్ చేతులు వణుకుతున్నాయి.

“ఏం చేద్దాం?” మెల్లగా అడిగింది.

ప్రభాకర్ నోట మాటలేదు. ఇద్దరూ ముందుకి నడిచారు. ఒకరి చేతులు ఒకరు గట్టిగా పట్టుకున్నారు.

“ఇళ్ళలో చెప్పేద్దామా?” సూటిగా అడిగాడు.

శ్రావణి ఏదీ ఆలోచించే పరిస్థితుల్లో లేదు. “కళ్ళు తిరుగుతున్నట్టున్నాయి.”

కూర్చోడానికి ఎక్కడా స్థలం లేదు దగ్గరలో. మళ్ళీ లేడీస్ హాస్టల్ కే వచ్చారు.

“ఈ రోజు ఏం ఆలోచించకు. రెస్ట్ తీసుకో. రేపు చూద్దాం” శ్రావణి చేతిని వదల్లేక వదిలాడు.

శ్రావణి ఏం మాట్లాడకుండానే నీరసంగా లోపలికెళ్ళిపోయింది.

***

“మనకి ఎక్కువ టైమ్ లేదురా బంగారం. ఇదే మంచి అవకాశం. ఇంట్లో ఇక అడ్డు చెప్పరు,” గంట నుంచి బతిమాలుతున్నాడు ప్రభాకర్.

చివరికి నోరు విప్పింది శ్రావణి. “మన విషయం ఇలా చెప్తావా ఇంట్లో? మా నాన్న బతకనిస్తాడనుకుంటున్నావా?” మొదటిసారి శ్రావణి నోట ఈ మాట వింటున్నాడు ప్రభాకర్.

“అంటే అసలు నా గురించి ఇంట్లో ఏం చెప్పలేదా?”

“అప్పుడే ఎలా చెప్తానురా బుజ్జీ. మగపిల్లలు ఫ్రెండ్స్ ఉన్నారని ఇంట్లో చెప్తారా?”

“నేను నీ గురించి మా అమ్మకి ఎప్పుడూ చెప్తూనే ఉంటాను.”

“టైమ్ వచ్చినప్పుడు నేనూ చెప్తాను.”

“ఇప్పుడొచ్చిందిగా?”

“నీకర్ధం కావట్లేదు. నువ్వు ఊహించినట్టు మా ఇంట్లో మన పెళ్ళికి ఒప్పుకోడం జరగదు. పైగా మన విషయం తెలిస్తే నిన్నేమన్నా చేస్తారని భయంగా కూడా ఉంది నాకు. అవన్నీ పక్కన పెట్టు. ముందు నన్ను ఏదన్నా హాస్పిటల్ కి తీసుకెళ్లు. ఎక్కువ ఆలస్యం చేయకూడదు.”

“అంటే పెళ్లి జరగదని నీకు ముందే తెలిసినప్పుడు ఇదంతా దేనికి?”

“పెళ్లి కోసమే మనిద్దరం పరిచయమయ్యామా? ఇప్పుడేం ఆలోచించకు. ముందు ఏ హాస్పిటల్ కి వెళ్లాలో చూడు.”

ప్రభాకర్ కి విషయం తేటతెల్లమై చచ్చి బతికిన ఊరట ఏదో గుండెల నిండా పాకుతోంది. తన తొలి అంశ అంతంతోనే తన జీవితానికే ముప్పురాదని తెలుస్తోంది. మరి తన ప్రేమ? శ్రావణితో జరగాల్సిన పెళ్లి? శ్రావణితో ఊహించుకున్న జీవితం? ఆమె లేకుండా ఉండగలడా? ముక్కలయ్యేది తమ బిడ్డతో పాటు తన గుండె కూడా అని అర్ధమయ్యే కొద్దీ కళ్ళు బైర్లు కమ్ముతున్నాయి. ఇక శ్రావణి తన మనిషిలా కనిపించడం లేదు. నడిచొచ్చే ముందస్తు హెచ్చరికలా నిలబడి ఉంది. తల తెగలేదని మెడ చుట్టూ చేత్తో తడుముకున్నాడు. పేగులు బయటకు రాలేదని ధైర్యంగా నడుం మీద చేతులేసుకున్నాడు. అంగం తెగిపడలేదని నిటారుగా నిలబడే ఉన్నాడు. బతికే ఉన్నానని బతకాల్సిన జీవితం ఇంకా ఉందని ముందుకి కదిలాడు…

***

శ్రావణి తన కోర్స్ పూర్తి చేసుకుని వెళ్లేంత వరకూ ప్రభాకర్ ను కలవలేదు. ఆమె తన స్నేహితులెవ్వరి దగ్గరా ఏ విషయం పంచుకోలేదు. ఎవరికీ ఏదీ చెప్పలేదు. శ్రావణి దగ్గరైనప్పుటి నుంచే ప్రభాకర్ ప్రతిదీ అందరికీ తెలిసేలానే ఉంటూ వచ్చాడు. ఇప్పుడూ అంతే. కొన్నాళ్ళు క్యాంపస్ వదిలి ఊరెళ్ళి వచ్చాడు. అక్కడంతా దీవెనతో పెళ్లి తప్ప ఎవరూ మరో మాట మాట్లాడడం లేదు. ప్రభాకర్ బాధితుడిగా ఉన్నాడో, రక్షింపబడినవాడిగా ఉన్నాడో గానీ బైరాగిలా మాత్రం కాలేదు. అప్పుడప్పుడూ స్విట్జర్ లాండ్ రోడ్డులో నిశానీలా తిరిగినా ‘అట్టడుగు వర్గాల స్త్రీల హక్కులు – సామాజిక ఎదుగుదల’ అనే అంశంపై తన పరిశోధన కొనసాగిస్తూనే ఉన్నాడు.

ఏదీ మార్చలేని అతని మనసుని తల్లి అనారోగ్యం మార్చింది. బహుశా పిల్లల విషయాల్లో తల్లిదండ్రుల అనారోగ్యం ఎప్పుడూ ఫెయిల్ అవ్వదు. బలవంతంగానో మొహమాటానికో ఇష్టంతోనో వేరే దారిలేకో దీవెనని పెళ్లి చేసుకున్నాడు. పాత గుండెని కరిగించి నూతనంగా ఆమెను ఆహ్వానించాడు. ఈ చేతిని వదిలేది లేదని తన మనస్సాక్షికే మాటిచ్చాడు.

దీవెన అదే యూనివర్సిటీలో పీజీ ఎంట్రన్స్ రాసి సీటు తెచ్చుకుంది. ఇప్పుడు ఇద్దరూ ఒకే డిపార్ట్మెంట్ కూడా. తను ఆశ పడిన పెళ్లి జరిగుంటే తనొక్కడే పైకెళ్ళేవాడు. పైకెళ్ళే క్రమంలో కింద ఎన్ని వదిలేసి వెళ్లాల్సివచ్చేదో అని ఊహించుకుని ఊపిరి పీల్చుకున్నాడు ప్రభాకర్. తను కనని కలేదో నిజం చేయడానికే దీవెన వచ్చినట్టుగా అనిపిస్తోంది ప్రభాకర్ కి. బహుశా ఇప్పుడు తనతో పాటు దీవెన, పిల్లలు, తమ తల్లిదండ్రులు, ఇద్దరి కుటుంబాలు, తోటి వారు కూడా ఒక్కో మెట్టూ ఎక్కుతారు. కొత్త తరం అవకాశాల ఆశల నింగిని అందుకుంటారు.

తల్లి దండ్రులు : పుట్ల హేమలత, ఎండ్లూరి సుధాకర్; పుట్టి పెరిగిన ప్రాంతం : పుట్టిన ఊరు నెల్లూరు, పెరిగినది రాజమండ్రి; విద్యారహతలు : MA, Linguistics, HCU. కేంద్ర సాహిత్య అకాడెమీ వారు 2016 లో త్రిపురలో, 2018లో అస్సాం లో నిర్వహించిన All India Young writers fests కి స్వీయ రచనా పఠణంకి తెలుగు నుండి ఏకైక రచయిత్రిగా ఆహ్వానం అందుకున్నారు. 2018 లో తన 22 కథలతో మిళింద అనే కథా సంపుటి తెచ్చారు. 2017 లో స్మైల్ స్మారక పురస్కారం, వెంకట సబ్బు స్మారక పురస్కారం. 2021 లో మాడభూషి పురస్కారం. పుట్ల హేమలత స్థాపించిన మొట్టమొదటి మహిళా అంతర్జాల సాహిత్య పత్రిక ' విహంగ ' కు సంపాదకులు గా ఉన్నారు. 2015 లో వచ్చిన మరాఠీ నవల 'ఓ' ని, 2021 లో 'ఊరికి దక్షిణాన' గా ఇంగ్లీష్ లోంచి తెలుగు లోకి అనువదించారు. భారత దేశంలో వచ్చిన మొట్ట మొదటి దళిత ఆత్మకథ 'బలూత' ను ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి త్వరలో అనువదించనున్నారు.

Leave a Reply