పుస్తకాలే నన్ను పోరాటం లోకి నడిపాయి: వేలుపిళ్లై ప్రభాకరన్

(జాఫ్నా నుండి వెలువడే తమిళ సాహిత్య పత్రిక “వెలిచ్చమ్” 1994 లో ప్రభాకరన్ ఇచ్చిన ఇంటర్వ్యూ కు కాత్యాయని గారి అనువాదం.)

మీరు చిన్నతనం నుండి పుస్తకాలు బాగా చదివేవారట కదా! మీలో తమిళ జాతీయ వాదాన్ని మేల్కొలిపిన పుస్తకాల గురించి చెప్తారా?

చిన్నప్పటి నుంచి పుస్తకాలంటే నాకు మహా ఇష్టం. పుస్తక పఠనం లోనే చాలా సమయం గడుపుతూ ఉండేవాణ్ణి. ముఖ్యంగా చారిత్రక నవలలన్నా, చరిత్రకు సంబంధించిన ఇతర పుస్తకాలన్నా, వీరుల జీవిత చరిత్రలన్నా చాలా ఆసక్తి. అమ్మానాన్నలు ఇచ్చే పాకెట్ మనీ అంతా పుస్తకాలు కొనటానికే ఖర్చు పెట్టే వాణ్ణి. మా ఊళ్ళో ఓ పుస్తకాల షాప్ ఉండేది. అక్కడికి వచ్చిన మంచి పుస్తకాలన్నీ తప్పకుండా కొనుక్కునే వాణ్ణి.

అలెగ్జాండర్, నెపోలియన్ వంటి యుధ్ధ వీరుల గురించి నా చిన్నతనంలో తెలిసింది పుస్తకాల ద్వారానే. భారత జాతీయోద్యమం తోనూ, సుభాస్ చంద్రబోస్, భగత్ సింగ్, బాలగంగాధర తిలక్ వంటి నాయకులతోనూ గాఢమైన మానసిక సాన్నిహిత్యాన్ని ఏర్పరచినవీ పుస్తకాలే. నేను విప్లవకారుడిగా మారటానికి పునాది వేసినవి పుస్తకాలే. భారత జాతీయోద్యమం నా అంతరాంతరాలను కదిలించి విదేశీ దోపిడీ మీదా, పెత్తనం మీదా తీవ్రమైన ఆగ్రహాన్ని రగిలించింది. 1958 లో శ్రీలంకలో చెలరేగిన జాతుల ఘర్షణలు, వాటి ఫలితంగా తమిళులు అనుభవించిన వేదనా నన్ను సాయుధ పోరాటం వైపుకు నడిపాయి. దినపత్రికల్లో వార్తలను చూస్తుంటే ఆగ్రహావేశాలు నా హృదయాన్ని తుపాను వలె చుట్టు ముట్టేవి. తమిళ రచయితలు కాశియన్ (పామినిప్ పావై), శాండిల్యన్ (కాదత్ పురా), కల్కి (పొన్నియన్ సెల్వన్) ల రచనలు చదివాక మన పూర్వీకులు ఎంత స్వతంత్రంతో, స్వయం నిర్ణయాధికారం తో పాలన సాగించారో అర్ధమైంది. మన జాతి ప్రజలు ఈ బానిసత్వం నుంచి విముక్తులై తమ స్వతంత్ర దేశంలో ఆత్మ గౌరవంతో, స్వేఛ్చతో జీవించే రోజులు మళ్ళీ రావాలన్న గాఢమైన కాంక్షను నాలో కలిగించాయి ఈ పుస్తకాలు.

“ఫలితాన్ని గురించి ఆలోచించక నీ ధర్మాన్ని నువ్వు ఆచరించు” అనే భగవద్గీతా ప్రబోధం కూడా నన్ను చాలా ఆకర్షించింది చిన్న వయసులో. క్రమశిక్షణ కలిగిన ఉత్తమ జీవితాన్ని గడపాలని, నా జాతి
ప్రయోజనాలకు కట్టుబడి పనిచేయాలని బాల్యం లోనే నిశ్చయించుకునేందుకు తోడ్పడినవి నేను చదివిన సందేశాత్మక గ్రంథాలే. సుభాస్ చంద్రబోస్ జీవితం నాకు దారి చూపిన వేగుచుక్క. క్రమశిక్షణా యుతమైన ఆయన జీవితమూ, దేశ స్వాతంత్ర్యం కొరకు ఆయన నిబద్ధత నన్ను తీవ్రంగా ప్రభావితం చేసి, మార్గ నిర్దేశం చేశాయి.

ఏ పుస్తకాన్ని అయినా పైపైన చదవటం నాకు అలవాటు లేదు. ఒక పుస్తకాన్ని చదువుతున్నానంటే అందులో పూర్తిగా మునిగిపోయి, ఆ పుస్తకంలో నేనూ ఒక భాగమై పోతాను. చదవటం పూర్తి చేశాక _ఎందుకు? దేనికోసం? ఇలా ఎందుకు జరిగింది? అనే ప్రశ్నలు నాలో తలెత్తుతాయి. నేను చదివిన కథనూ, అందులోని పాత్రాలనూ నా జీవితంతోనూ, నా చుట్టూ ఉన్న ప్రజల జీవితాలతోనూ అనుసంధానం చేసి చూడటానికి ప్రయత్నం చేస్తాను. అలాంటి సందర్భాల్లో నా మనసంతా ఆక్రమించే ఆలోచన నా ప్రజల విముక్తి కొరకు పోరాడాలన్నదొక్కటే. చరిత్ర గ్రంథాలు, నవలలే గాక సైన్స్ సంబంధిత పుస్తకాలూ, కలై కథిర్ వంటి పత్రికలూ కూడా నాకు ఇష్టమే. నా ప్రజలు శాస్త్రీయ పరిజ్ఞానం లోనూ, మేధా పరంగానూ అభివృద్ధి చెందాలని నా ఆకాంక్ష. పుస్తక పఠనం నా ఆలోచనా పరిథిని విస్తృతం చేసింది. నిరర్థకమైన ఊహలతో కాలం గడపటం నాకు నచ్చదు. ఆచరణ ద్వారానే ఏదయినా సాధించ గలమని నమ్ముతాను. ప్రజల భవిష్యత్ వారి ఆచరణతో ముడిపడి ఉందని నా అభిప్రాయం. జాతి విముక్తి పోరాటాలను గురించి నేను చదివిన అన్ని పుస్తకాలూ నాకు అందించిన అవగాహన ఒక్కటే, “స్వాతంత్రోద్యమ వీరుడనే వాడు నిజాయితీగా, నిస్వార్థంగా, ప్రాణాలకు వెనుదీయని వాడుగా ఉండాలి.” కాబట్టి నేను చదివిన పుస్తకాలే నన్ను ప్రజా విముక్తి పోరాటం లోకి నడిపించాయని చెబుతాను.

మీ చిన్ననాటి రోజులకు, ఇవాళ్టి తరానికీ ఎంతో తేడా ఉంది కదా! మీ బాల్యాన్ని గురించి కొన్ని విశేషాలు చెప్పండి?

మా ఇంట్లో అందరూ నన్ను చిన్నప్పుడు మహా అపురూపంగా చూసేవారు. నన్నెప్పుడూ గడప దాటి బయటికి కూడా వెళ్లనిచ్చే వాళ్ళు కాదు. పక్కింటి పిల్లలు మాత్రమే నా స్నేహితులు. నా ప్రపంచమంతా కలిపి మా ఇల్లూ, మా పొరుగిల్లూనూ! ఏకాంతంగా, నిశ్శబ్దంగా ఉండే మా ఇల్లనే చిన్న పరిధిలోనే నా బాల్యం గడిచింది. నేను ఎనిమిదవ తరగతి లో ఉండగా మా గ్రామం, వల్వెత్తితురై లో ‘వల్వై ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్’ ఆనే స్కూల్ ఏర్పడింది. ఉన్నత విద్యావంతులైన కొందరు యువకులు కలిసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలన్న లక్ష్యంతో దీన్ని ఏర్పాటు చేశారు. మా ఇంటి పక్కనే ఉన్న శివగురు విద్యా శాలై (అలాడి పాఠశాల అని కూడా అనేవారు) అనే బడిలో దీన్ని నడిపేవారు. రాత్రుళ్ళు చిన్న తరగతుల విద్యార్థులకు ఉచితంగా చదువు చెప్పేవారు. ఆ బడిలో మా గ్రామానికి చెందిన వేణు గోపాలన్ అనే టీచర్ తమిళం చెప్పేవారు. ఆయన ఫెడరల్ పార్టీ యువజన విభాగానికి గట్టి మద్దతుదారు. తర్వాతి కాలంలో ఆ పార్టీ విధానాలపై అసంతృప్తితో బయటకు వెళ్లి వి. నవరత్నం తో కలిసి ‘సూయాచ్చి కజం’ (స్వతంత్ర పార్టీ ) అనే సంస్థను స్థాపించాడు. ఆ టీచర్ తమిళ ప్రజల పరిస్థితిని మాకు వివరించి చెప్పేవారు. ఇక తమిళ ప్రజలు ఆయుధాలు పట్టక తప్పదని మాకు నూరిపోశారు. ఆ రోజుల్లో మా గ్రామంపై నిరంతరం సైనిక నిర్బంధం కొనసాగుతూ ఉండేది. వేణు గోపాలన్ గారి ప్రభావంతో నాకు సాయుధ పోరాట మార్గంపై తిరుగులేని విశ్వాసం ఏర్పడింది.

సైనిక పెత్తనంపై నిరసన, స్వాతంత్ర్య కాంక్ష నన్నూ, నా వయసులోనే ఉన్న మరికొందరు మిత్రులనూ వేణుగోపాల్ గారి మార్గంలోకి నడిపించాయి. నేనూ, మరొక ఏడుగురు స్కూలు విద్యార్థులూ కలిసి ఒక ఉద్యమాన్ని స్థాపించాలని నిశ్చయించుకున్నాం. అప్పుడు నా వయసు పద్నాలుగేళ్లు. సైన్యం తో యుధ్ధానికి తలపడి, విముక్తి సాధించటం మా లక్ష్యం. ఆ ఉద్యమానికి నేను నాయకుణ్ణి. ఎలాగయినా ఒక తుపాకి కొనాలనీ, బాంబు తయారు చెయ్యాలనీ మా ప్రయత్నం. పిల్లలందరూ ప్రతి వారమూ తలొక 25 సెంట్లు కూడబెట్టి నాకు ఇచ్చేవారు. ఈ పైసలన్నీ పోగేసి 40 రూపాయలు చేశాం. మా పక్క ఊళ్ళో ఉండే ఒక చండియన్ (బందిపోటు) దగ్గర ఒక రివాల్వర్ ఉన్నదనీ దాన్ని 150 రూపాయలకు అమ్మటానికి సిధ్ధంగా ఉన్నదనీ వార్త మా చెవిని పడింది. మా అక్కయ్య పెళ్ళిలో నాకు బహుమతిగా ఇచ్చిన ఉంగరాన్ని అమ్మేస్తే 70 రూపాయలు వచ్చాయి. మా దగ్గరున్న నలభైతో కలిపి నూట పది రూపాయలు వచ్చాయి. ఎంత ప్రయత్నించినా మిగతా డబ్బు సంపాదించడం మావల్ల కాలేదు. దాంతో రివాల్వర్ కొనలేక పోయాం. ఈ విధంగా పోరాటాన్ని, స్వేచ్చనూ కలగంటూ గడిచింది నా బాల్యం. జీవితమే ఒక పోరాటంగా బతుకుతూ, దానివల్ల అయిన లోతైన గాయాలను మోస్తూ, తమ పోరాటాల ఉత్తేజకర వారసత్వాన్ని అందిస్తున్న నా ప్రజల కొరకు ఏదయినా చేయాలన్న కాంక్ష నన్ను నిలువనీయ లేదు. ప్రజల మహోన్నతమైన స్వేచ్ఛా కాంక్షకు వ్యక్తీకరణను ఇవ్వగల కళలూ, సాహిత్యమూ ఉన్నత శిఖరాలను అందుకుంటాయని నా అభిప్రాయం. మానవ విలువలను బలపరచటమూ, మానవత్వాన్ని అభివృద్ధి పరచటమూ అనే లక్ష్యాలు కలిగినదే ఉన్నతమైన కళ. తమిళ ఈలం విముక్తి పోరాటంలో భాగంగా అటువంటి ఉత్కృష్టమైన కళా రూపాలు పడతాయని నాకు బలమైన నమ్మకం.

మన యువ పోరాట యోధులు సృజనాత్మక రచయితలుగా రూపొందటాన్ని చూస్తున్నాం. ఈ పరిణామం గురించి మీ అభిప్రాయం ఏమిటి?

మన పోరాటాన్ని వర్ణించే సాహిత్యం ఈలం పోరాటంలో భాగంగా వెలువడుతున్నది. మన యువ మిలిటెంట్లు చాలా మంది సృజనాత్మక సాహిత్యంపై మక్కువ చూపుతున్నారు. వీరు చేస్తున్న ఎన్నో రచనలు ఉత్తమ స్థాయి సాహిత్యం గా రూపు దిద్దుకుంటున్నాయి. ఇదొక మంచి పరిణామం. రాబోయే కాలంలో మన యోధులు మరింత అనుభవంతో, పరిణతితో అత్యద్భుతమైన కళా రూపాలను సృష్టించగలరని నాకు నమ్మకముంది. పోరాటం ఎందుకొరకు?యుధ్ధ రంగంలో జీవితానుభవాలు ఎలా ఉంటాయి? అనే విషయాలపై మన కార్యకర్తలకు మరింత లోతైన అవగాహన కలిగి, వారి జీవన దృక్పథం మరింత తీక్షణమైనప్పుడు వాళ్ళు అద్భుతమైన కళాకారులుగా కూడా తయారవుతారు. అందుకే మన ఉద్యమం లోని కొత్త రచయితలను, కళాకారులను, కళాభిమానులను నేను ప్రత్యేకంగా గుర్తించి ప్రోత్సహిస్తూ ఉంటాను.

యుధ్ధ పరిణామాలలో కుటుంబాలను కోల్పోయిన చిన్న పిల్లల సంక్షేమం గురించి మీరు ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ఉన్నారు. పిల్లల భవిష్యత్ పై ఉద్యమాలు చూపాల్సిన శ్రద్ధ ఎలా ఉండాలంటారు?

జాతి నిర్మాణ కార్యక్రమంలో నేనొక సమిధను. అది నేను ఎన్నుకున్న జీవిత లక్ష్యం. మనం నిర్మించాలని అనుకుంటున్న జాతికి పునాది భవిష్యత్ తరమే. ఆ నూతన తరాన్ని గొప్ప వ్యక్తిత్వంతో, ఆశయాలతో తీర్చిదిద్దటం అతి కీలకమైన కర్తవ్యమని భావిస్తాను. అందుకే పిల్లల భవిష్యత్ గురించి మనం శ్రద్ధ తీసుకుంటున్నాం. మన దేశ భవిష్యత్తుకు రూపకర్తలుగా ఈ నూతన తరాన్ని మలచుకోవాలన్నది నా ఆశ.
ఈ కొత్త తరం శాస్త్రీయ అవగాహన కల వాళ్ళుగా, దేశ భక్తులుగా, నిజాయతీ పరులుగా, సంస్కారవంతులుగా, సాహసవంతులుగా, ఆత్మాభిమానమూ ఆత్మ విశ్వాసమూ కలిగిన వ్యక్తులుగా ఎదగాలి. యుద్ధ బాధితులయిన చిన్నారి బాలలను మనమంతా ప్రేమగా ఆలింగనం చేసుకుని రక్షణ కల్పించాలి. వాళ్ళను నిరాశ్రయులుగా, అనాథలుగా నేను పరిగణించను. వారు మన మాతృభూమి లో పుట్టిన బిడ్డలు. మన నేలలో వికసించిన కుసుమాలు. మనం మన భాషనూ, నేలనూ తల్లిగా భావిస్తున్నాం. ఆ తల్లి సంతానమే ఈ పిల్లలు. వీరిని విద్యావంతులను చేసి జాతి భవిష్యత్ నిర్మాతలుగా తీర్చి దిద్దటం మనపై ఉన్న అత్యున్నతమైన కర్తవ్యంగా నేను భావిస్తున్నాను.

నెల్లూరు జిల్లాలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం హైదరాబాద్ లో నివాసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో తెలుగు సాహిత్యంలో పిఎచ్.డి చేశారు. సాహిత్యం, సామాజిక శాస్త్రాల అధ్యయనంలో, ముఖ్యంగా సాహిత్య విమర్శలో ఆసక్తి. మిత్రులతో కలిసి "చూపు" పత్రికను కొంతకాలం నిర్వహించారు. సాహిత్య, సాహిత్యేతర గ్రంథాల అనువాదం, రచన వంటి అంశాల్లో కృషి చేస్తున్నారు.

Leave a Reply