‘వెలుగు దారులలో’ నిరంతర ప్రయాణం

నంబూరి పరిపూర్ణగారి ఆత్మకథ చదివాక గొప్ప అనుభవాలగుండా ప్రయాణం చేసినట్లు అనిపిస్తుంది. అయితే ఆద్యంతమూ ఒక విషాదస్వరం మనవెంట ప్రయాణిస్తూ వుంటుంది. ఆ అక్షరాలు పలికే వినయ సంస్కారపు విజయాల వెనుక బ్యాగ్రౌండ్ మ్యూజిక్లాగా ఆమె పంటిబిగువున అణిచిన కోపమో, వగపో, తృణీకారమో చిరుసవ్వడి చేస్తూ వుంటాయి. దాన్ని ఎంతమంది వింటారో తెలియదు. ఆమె దాన్ని గురించి అస్సలు పట్టించుకోలేదు! అయితే ఒకచోట తనకు జరిగిన అన్యాయాన్ని గురించి అందరికీ ఆదర్శాలు వల్లించే కమ్యూనిస్టు నాయకత్వాలు అన్యాయం అనకపోవడం మీద ఒక చిన్న కామెంట్ చేసి వదిలేసిందంతే. కుటుంబం పట్ల పిసరంతైనా బాధ్యతలేని సోకాల్డ్ కమ్యూనిస్టు నాయకత్వాలు రాజ్యమేలే కాలంలో, ఆమె వినిపించిన అసమ్మతి కాలంలో కలిసిపోయింది.

ఈ పుస్తకంలో ఆమె తనవీ, తన సంతానానివీ ఎన్ని విజయాలు వివరించినా అవేవీ నాలోని పాఠకుడి ఆగ్రహాన్ని తీర్చలేకపోయాయి. ఆగ్రహం రగిలించడంకోసం పరిపూర్ణగారేమీ రాయలేదీ పుస్తకంలో. అయితే ఒకసారి రాసినా వందసార్లు రాసినట్లు, ఒకానొక అగ్రకుల అహంకారీ, పితృస్వామ్యం మూర్తీభవించిన వ్యక్తీ ఏ విమర్శా లేకుండా, ఎవరి నిలదీతా లేకుండా పరిపూర్ణగారిని తొక్కుకుంటూ బతికేసాడే!? అని ఒక నిస్సహాయ ఆగ్రహం వెంటాడుతుంది నాలాంటి పాఠకుడిని. ఏ రచనకైనా పొయెటిక్ జస్టిస్ జరగాలంటారు, పరిపూర్ణగారు కలలోనైనా ‘యన్.ఆర్. దాసరి’కి తీక్షణంగా బుద్ధి చెప్పి వుంటే అలాంటి ఒక న్యాయం అయి వుండేది.

1931లో జన్మించిన పరిపూర్ణగారు బెజవాడలో ఐదో తరగతి చదువుతున్నప్పుడు, రెండో ప్రపంచయుద్ధం జరుగుతోంది. బ్రిటిష్ ప్రభుత్వం కోరినట్లు స్కూలు టీచర్లు యుద్ధసహాయ నిధి కోసం పిల్లలచేత సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శన చేయించే క్రమంలో రామాయణంలోని పాదుకా పట్టాభిషేకం ఘట్టాన్ని ప్రదర్శిస్తారు. అందులో భరతుడిగా పరిపూర్ణ జీవించి నటిస్తే, దాన్ని చూసిన భక్తప్రహ్లాద సినిమా నిర్మాత మీర్జాపూర్ జమిందార్ రంగరాయిణగారు, పరిపూర్ణను ప్రహ్లాద పాత్రకు ఎంపిక చేసుకుంటాడు. అది పరిపూర్ణగారి జీవితంలో (1940) అత్యుత్తమ దశ. ఆ తర్వాత ఆమె బాంబేలో నిర్మాణమయ్యే యింకో సినిమాకు కూడా ఎంపికవుతుందిగానీ, అది కొనసాగదు. ఈ దశలో ఆమెలోని గాయక నైపుణ్యం రూపొందింది.

1950 నాటికి పరిపూర్ణగారు రాజమండ్రిలో ఇంటర్మీడియట్ పూర్తిచేసారు. ఇంటర్లోనే ఆమె విద్యార్థి ఫెడరేషన్లో కార్యవర్గ సభ్యురాలు! జిల్లా మహాసభల కోసం రాజమండ్రి అంతా పాటలతో తిరిగి ఏడువందల రూపాయలు సేకరించింది. ఆ తర్వాత జరిగిన సభల్లో ముఖ్యమైన నాయకురాలిగా ఎదిగింది. అక్కడే దాసరి నాగభూషణరావు పరిచయమయిందీ, ఆమె వాక్చాతుర్యానికీ, ఉద్యమదీక్షకూ ముగ్ధుడై పెళ్లి చేసుకుంటానని ప్రతిపాదన చేసింది. ఆ సభల్లోనే అతను రాష్ట్ర విద్యార్థి ఫెడరేషన్ సెక్రటరీ అయ్యిందీ.

ఆ వేసవి సెలవుల్లో పరిపూర్ణగారు తమ వూరికి పోకుండా రాజమండ్రిలో కమ్యూనిస్టు మహిళా సంఘాల నిర్మాణంలో నిమగ్నులౌతారు. కామ్రేడ్ దాసరి నాగభూషణరావును వివాహం చేసుకున్నారు. 1953 వరకూ ఆమె కమ్యూనిస్టు పార్టీ క్రియాశీల కార్యకర్త. మరోవైపు తన సహచరుడు అజ్ఞాతంలో వుండటంవల్ల అతన్ని కాపాడుకునే బాధ్యత కూడా వహించింది. ఇద్దరు పిల్లల తల్లయింది. కమ్యూనిస్టుల మీదున్న నిర్బంధం కారణంగా గుంటూరు, తెనాలి, మద్రాసులాంటి చోట్ల రహస్యంగా వుండాల్సి వచ్చింది. 1952లో కమ్యూనిస్టు పార్టీ పార్లమెంటరీ పంథాలోకి వచ్చి అప్పుడు జరిగిన ఎన్నికల్లో పాల్గొనగానే పరిపూర్ణగారు, మద్రాసు, గూడవారు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, విజయవాడ, బందరు, ఏలూరు, భీమవరం, రాజమండ్రి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నాలలో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శనతో కమ్యూనిస్టు భావాలు ప్రచారం చేస్తూ, ఎన్నికల ప్రచారం చేసారు.

ఈ దశ ఆమెలోని కమ్యూనిస్టు వుద్యమ కార్యకర్త రూపొందిన దశ. ఈ దశలో ఆమెను కమ్యూనిస్టు పార్టీ బాగా వుపయోగించుకుంది.

మూడో దశ, పరిపూర్ణగారు కామ్రేడ్ దాసరిని 1949లో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి 1960లో డబ్బులు యివ్వనందుకు కొట్లాడి, నీ మొఖం చూడనని చెప్పి వెళ్లిపోయిందాకా నడిచింది. ఈ దశలో పరిపూర్ణగారు భర్తను భారతీయ సంస్కృతి (వ్యతిరేక) అర్థంలో నిజంగానే భరించింది. అతడి రహస్యాలు కాపాడింది. అజ్ఞాతంలో సైతం త్రికరణశుద్ధిగా అతనితో కలిసి జీవించింది. తత్పలితంగా ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చింది. వాళ్ల సంరక్షణ కోసం చిన్నవి, చితకవీ వుద్యోగాలు చేసింది. అంతో యింతో భద్రత కోసం గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించి కమ్యూనిస్టు నాయకుడైన భర్త వ్యతిరేకతను ఎదుర్కొంది. (అతని అజ్ఞాన ఉద్దేశ్యం ఏమిటంటే, కమ్యూనిస్టులు ప్రభుత్వ వ్యతిరేకంగా రాజకీయ కార్యాచరణ గలవారు కాబట్టి ప్రభుత్వంలో పనిచేయకూడదట, చివరకు వాళ్ల సహచరులు కూడా.)

అతన్ని కాదని ఆమె తన స్వశక్తితో ప్రభుత్వ ఉద్యోగాలు తెచ్చుకుంటుంది. ఆ జీతంలో పావుభాగం ఆ కమ్యూనిస్టు భర్తకు నెలనెలా యిస్తుంది. కలిగిన ముగ్గురు పిల్లలను భర్త అనేవాడు, వాళ్ల జన్మకు కారణమైనవాడు, కనీసంగా దగ్గరకు తియ్యకపోతే, ఒక్క మాట మాట్లాడించకపోతుంటే, కేవలం డబ్బుల కోసమే యింటికి వచ్చి పోతుంటే, ఆ సంబంధంలోని డొల్లతనం బద్దలు అవుతుంది ఈ దశలోనే. దానికి పరిపూర్ణగారు జీవితమంతా మూల్యం చెల్లించింది.

ఇక నాలుగో దశ ఆమె ప్రభుత్వ ఉద్యోగాలు, బాధ్యతలు నిర్వహించిన దశ. తన పిల్లలకు తానే సర్వస్వమై వాళ్లను ప్రయోజకులుగా చేసిన దశ. వాళ్ల విజయాలలో తన విజయాలను చూసుకొని ఏ పశ్చాత్తాపమూ లేకుండా జీవించిన దశ. ప్రభుత్వ ఉద్యోగినిగా కూడా తన స్వభావానికి చేరువైన పనిలోకే ఆమె చేరివున్నందున, మహిళలతో, వాళ్ల సంక్షేమ సంరక్షణలో పాలుపంచుకున్న దశ. తనలో నిబిడీకృతమై వున్న కమ్యూనిస్టు భావాల సారాన్ని ఆమె ప్రభుత్వ ఉద్యోగినిగా కూడా నిలుపుకోవడానికి, ఆచరణలో చూపడానికీ జీవితాంతం ప్రయత్నించిన దశ.

ఐదవది ఆమెలోని సృజనశీలి సాంస్కృతిక, సాహిత్యరంగాలలో ఆమెను నిలబెట్టిన దశ. ఈ దశ క్రోనలాజికల్గా ఆమె ఉద్యోగ బాధ్యతలను నిర్వర్తించే రోజుల్లో నుండి వ్యాసాలూ, కథలూ నవలలూ రాయడమొక్కటే కాకుండా, రేడియో ప్రసంగాలు చేయడమే కాకుండా, ఇంకా వెనక్కి వెళ్లి తన పదేళ్ల వయసు నుంచి స్కూల్లో సాంస్కృతిక ప్రదర్శనలు యిస్తున్నప్పటిది కూడా. ఈ దశ ఆమె జీవితంలో ఫలానా సంవత్సరాల మధ్య మాత్రమే వున్న దశ కాదు. ఆమె జీవితంలో ఒక నిరంతర ధారగా ప్రముఖ భాగమైన దశ. ఆమెలోని యీ స్థితే ఆమె ‘పరిపూర్ణ’గా తయారవడానికి కారణమైంది. ఆమె జీవితం యిలా వుండటానికి ఆమెలోని ‘సృజన శీలత్వమే’ కారణం! ఆమె ఎంతటి ప్రతిభాశాలో, ఎంతమంది (ఆ తర్వాత కాలంలో గొప్పవారిగా తయారైన) మన్ననలను పొందిందో, ఎన్ని అమూల్య అవకాశాలు ఆమెకు అందినట్టే అంది చేజారి వెళ్లిపోయాయో తలుచుకున్నప్పుడు, ఒక నిష్టూరమైన నిజం తెలిసివస్తుంది. అది యీ దేశంలో కింద, అణగారిన కులాల ప్రజలకు యే అందలమూ అందిరాదని. కులం కారణంగా పరిపూర్ణగారు యెన్నో అవమానాలు ఎదుర్కొన్నారు. తనలోని ప్రతిభ కారణంగా ఎందరితోనో అనాదరణకూ గురయ్యారు.

అయితే అన్ని అడ్డంకులనూ, అనాదరణలనూ అధిగమించి ఆమె విజయవంతంగా నిలబడడానికి ఆమెలోని సృజనశీల ప్రతిభే కారణమైంది. దొరికిన దానితో సంతృప్తి చెంది, నిరాడంబరంగా, సమాజం పట్ల వినయశీలంగా, చేతనైనంత సమాజానికి తిరిగి యివ్వడమనే గుణంతో బతకడానికి ఆమెలోని సృజనశీలత్వమే కారణమైంది.

ఒక మహిళగా పరిపూర్ణ జీవితాన్ని పరిశీలించవచ్చు. ఒకానొక కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తగా చూడొచ్చు.
ఒకానొక సంప్రదాయ కమ్యూనిస్టు నాయకుడి కారణంగా జీవితంలో భర్త ప్రేమానురాగాలు కోల్పోయిన స్త్రీగా ఆమెను చూడొచ్చు. ఒంటి చేత్తో ముగ్గురు పిల్లలను పెంచీ పెద్దచేసీ, ప్రయోజకుల్ని చేసిన తల్లిగా చూడొచ్చు.

పిల్లలతో స్పూర్తి పొంది తనలోని సృజనకు మెరుగులు దిద్దుకొని రచయిత్రిగా మారిన సృజనశీలిని చూడొచ్చు. బాల్యంలోనే గొప్ప అవకాశాలు అందినట్టే అంది, కులమో, పేదరికమో కారణంగా వాటిని చేజార్చుకున్న వ్యక్తిగా చూడొచ్చు.

ఆమెను తెలుగు రాజకీయ సామాజిక సాంస్కృతిక చరిత్రలో కీలకమైన కాలాల్లో, కింది స్థాయిలో వున్న సాక్ష్యంగా, వనరుగా అధ్యయనం చేయొచ్చు.

ఒకానొక ఆధిపత్య కులపురుషుడిని నిలదియ్యకుండా, తనను వుపయోగించుకున్న కమ్యూనిస్టు పార్టీ నాయకత్వాన్ని తనకు అన్యాయం జరిపిన వాడిని నిర్విమర్శగా అందలం ఎక్కించిన పార్టీనీ ప్రశ్నించకుండా, నిర్లిప్తంగా నిలిచిపోయిన స్త్రీగానూ చూడొచ్చు.

వెరసి నంబూరి పరిపూర్ణ కమ్యూనిస్టు నాయకత్వాల (వాళ్లన్ని ఆదర్శాలు వల్లించినా) దృష్టిలో దళిత స్త్రీగానే పరిగణింపబడిందని చెప్పొచ్చు. అందువల్ల ఈ ఆత్మకథ, గొప్ప అవకాశాలు అందుకునే శక్తి వుండీ కిందనే మిగిలి పోయిన దళిత స్త్రీ ఆత్మకథగానే పరిగణిస్తాను. ఈ భవతి శతమానం ప్రశాంతంగా జీవించాలని ఆకాంక్షిస్తాను.

జననం: కర్నూలు జిల్లా. కవి, రచయిత, కథకుడు, విమర్శకుడు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సహకార శాఖ లో డిప్యూటీ రిజిస్ట్రార్.  ఇప్పటి వరకు నాలుగు కవితా సంపుటాలు, రెండు దీర్ఘ కవితలు, మూడు కథా సంపుటాలు, సాహితీ విమర్శ వ్యాసాలు ప్రచురించారు. కథలోనైనా, కవిత్వం అయినా రాయలసీమ గ్రామీణ ప్రాంత జీవితాన్ని బలంగా చిత్రించడానికే ప్రాధాన్యత యిస్తారు. అభ్యుదయ, బహుజన వాద మేలుకలయికగా సాహిత్య సృజన చేస్తున్నారు.

కవితా సంపుటాలు: 1. లోగొంతుక (2000), 2. దున్నేకొద్దీ దుఖ్ఖం (2005), 3. కొన్ని రంగులూ ఒక పద్యం (2010), 4. చినుకు దీవి (2016). దీర్ఘ కవితలు: 1. నదీ వరదా మనిషి (2009), 2. హంద్రీ గానం (2015). కథాసంపుటాలు:  1. గరుడ స్థంభం (2005), 2. చిలకలు వాలిన చెట్టు (2010), 3. దేవరగట్టు (2017).

Leave a Reply