వెలుగు చిమ్మిన అమ్మ అశ్రువు

(‘కాగడాగా వెలిగిన క్షణం’ పుస్తకానికి వీవీ రాసిన పరిచయం)

ఒక తల్లి చెక్కిలి మీంచి కన్నీటి చుక్కను తుడుచుకున్నపుడైనా, నొసట చెమట చుక్కను తుడుచుకున్నప్పుడైనా తన సంతానానికి కొంగులో దాచి ఒక మానవి అంతరంగాన్ని, ఒక కష్టజీవి అనుభవాన్ని అందిస్తున్నది. ఆ కన్నీటి చుక్క, ఆ చెమట చుక్క ఆమె నెత్తుటి అనుభవాల సారం నీరమైన రూపాలు. ఆ చుక్కలు కొన్ని ఆమె నిదురలోనో, కలతలోనో, కలలోనో నేల మీద రాలకుండా ఉండవు. అవి ఆమె స్నిగ్ధ, దగ్ధ శ్వాసలు కనుక విస్ఫోటనం చెందకుండానూ ఉండవు. కడుపులో చుమ్మలు చుట్టిన దుఃఖం ఒక ఆకృతి దాలిస్తే అది భూమి మీద కురిసిన మేఘం వలె నాగేటి చాళ్ళలో కుంకుమ పువ్వులు పూయిస్తుంది. (ఎం.ఎస్.ఆర్ పాదాలు మట్టిని స్పృశించగానే పాత సాహిత్య మిత్రులవలె ఆరుద్ర పురుగులు చుట్టుముడుతాయి.) మెత్తటి మట్టిలోని తడిగుండెల్లో విచ్చుకున్న కుంకుమపూల మృదుత్వం ఆచ్ఛాదనలు లేని ప్రపంచంలోని ఎండకూ, వానకూ, చలికీ ఏ ఆసరాలేని రుతువుల్లో కరుకుదేలి నిప్పుపువ్వవుతుంది. ముళ్ళతీగ పైన సున్నితంగా బచ్చలి తీగ పాకుతుంది. ఏ లేత తీగ సూర్యరశ్మి లోకి పాకాలన్నా ఒక కఠిన ఆధారమే కావాలి. కానీ ఆ ముళ్ళతీగ ఒక కంచెకు, ఒక కంటోన్మెంట్ కు, ఒక జైలుకు, ఒక కాన్సంట్రేషన్ క్యాంప్ కు, ఒక వ్యవస్థకు ప్రతీకగా ఉక్కు గోళ్ళు పెంచుకొని పూరెక్కలను రక్క చూసినపుడు

రాజ్యమైన దుర్మార్గాన్ని మెడలు వంచేందుకు
పసితనమూ క్రోధమై చెలరేగి పోవాల్సిందే…
జీవన లాలిత్యము కరుకుదేలి
అధికార మృగాన్ని పొడవాల్సిందే

(నిప్పుకోసం, నారాయణస్వామి)

ఎన్నో నవయవ్వనాలు నవలోకం కోసం తల్లులు కన్న పీడనా, దోపిడీ లేని స్వప్నాలకోసం మళ్ళీ ఆ తల్లుల కడుపుకోతగానే బలియైపోతున్న కఠోర వాస్తవికతకు శ్రీను ఒక ప్రతీక. పొద్దున్నే మెత్తని లే ఎండ వికసించి కాసేపట్లో చిటపటలాడినట్లు వేకువ పచ్చ గరిక మీద, పూల మీద పరుచుకున్న నీహారిక కాంతుల నీరెండ ఎండగా మారుతుండగానే కరిగి పోయినట్లు, ఈ భూమి పరిమళ మెక్కడిదని తొలకరి చినుకును తలుచుకుంటుండగానే సుడిగాలి వీచి మబ్బులు, వాన చెదిరిపోయినట్లు శ్రీనుల అంతర్థానాలు, అదృశ్యాలు, అమరత్వాలు ఇవ్వాల్టి దృశ్యం.

ఎంత ప్రేమను వర్షించేవి
ఆ మృదువైన రెండు కళ్ళు
గుర్తుకొచ్చి గుండె లో నెత్తురు గడ్డై అడ్డుపడుతోంది.
ఎన్ని మాటలు ఊరేవి.
ఆ చిన్ని రెండు పెదవులు
యాదికొస్తే గొంతులో శబ్దం బరువై పోతోంది
మెత్తనికలై, కన్నీటి సేద దీర్చిన
ఆ చిరునవ్వు చెరిగిపోయిందని
గాజుబుడగలా చిట్లిపోయే
అమ్మకు ఎలా చెప్పడం

(నిప్పుకోసం, నారాయణ స్వామి)

ఇప్పుడైతే పద్దెనిమిదేళ్ళకు ఈ దేశంలో ఒక మనిషి ఓటుకొచ్చిన బిడ్డ అవుతున్నాడు. శ్రీనుకు పద్దెనిమిదో ఏట ఇంటర్మీడియట్ అయిపోయి ఇంజనీరింగ్ లో సీట్ వచ్చింది. ఆయనకు జీవితం అప్పుడే మొదలైంది. మామూలుగా కాదు ఇంద్ర ధనస్సు వలె. ఇప్పుడు వెనక్కి తిరిగి చెప్పాలంటే వజ్రాయుధం వలె అని చెప్పాలి.

కరీంనగర్ జిల్లా గోదావరి లోయ ప్రాంతంలో మధ్య తరగతి దళిత కుటుంబంలో ఇంటికి పెద్ద కొడుకు గా జన్మించాడు శ్రీను. 1969 జూన్ 22న నక్సల్బరీ, శ్రీకాకుళాల రెండు కళ్ళు అప్పటికే విచ్చుకొని ఈ సమాజానికి ఒక చూపునిచ్చినవి. పదహారేళ్ళ పాటు గోదావరిఖని ప్రాంతపు అన్ని చెరువుల్లో బావుల్లో “మనసంత మానేరు” అయిన గంగమ్మ హృదయంలో ఈదులాడాడు. తండ్రి రైల్వే గార్డు. శ్రీను సికింద్రాబాద్ లో ఇంటర్ చదివి పద్దెనిమిదో ఏట వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. మంచినీటికి చేపలా పాకే స్వభావం. నవనవోన్మేష ప్రతిభాశాలి! (అది అగ్రవర్ణాల స్వంత ఆస్తి అసుకునే అహంకారం సిగ్గుపడాలి). కొడుకును ఇంజనీరింగ్ లో చేర్చిన దగ్గర్నుంచి తండ్రి విదేశాలకు పంపాలనే మొదలు పెట్టాడు. (“నేను నేర్చుకున్న ప్రతి అక్షరానికి ఒక చెమట చుక్క వెచ్చించాడు”). మొదట శ్రీసు అందుకు ఉత్సాహ పడ్డాడు. కానీ పాబ్లో నెరూడా సుంచి అంతర్జాతీయ సినిమా పనోరమ దాకా పికాసో నుంచి ‘సంతూర్’ దాకా సాహిత్య, సినిమా, చిత్రకళ, సంగీతం ఆయన మెరిసే కళ్ళముందు పరుచుకునే వాతావరణంలోకి వచ్చిపడ్డాడు. వాసవీ ఇంజనీరింగ్ కాలేజీ చదువుల కన్నా ఆదివారాలు ఆబిడ్స్ లోని పాత పుస్తకాల ఫుట్ పాత్ లు ఆయనకు అధ్యయన మార్గాలయ్యాయి. (“ఎలక్ట్రానిక్ డివైసెస్ పరీక్షలోనూ ఇథియోపియా కరువు మీద కవిత రాసి వచ్చిన ప్రబుద్ధుడు…”)

ఇరవై రెండేళ్ళకే నూరేళ్ళు నిండిన వేగవంతమైన జీవితంలో సాల్వడార్ డాలీ నుండి సఫ్దర్ హష్మీ దగ్గరకు చేరుకోడానికైనా, చదువు నుంచి చేనేత కార్మికుల జీవితాలను చదవడానికి వెళ్ళిపోవడానికైనా సహజంగానే ఎక్కువకాలం తీసుకోలేదు.

పుస్తకాల వ్యసనం కడదాకా అట్లాగే వుంది. ఇంజనీరింగ్ మొదటి రెండు సంవత్సరాలు తండ్రి జేబుఖర్చుకైనా డాబు ఖర్చుకైనా ఇచ్చిన డబ్బంతా పుస్తకాలే కొన్నాడు. 92 జూన్ 22న ఒక అక్కకు రాసిన ఉత్తరంలో “కలిసే పరిస్థితి ఉంటే ఇవ్వాళ నీతో వెయ్యి కవిత్వ పుస్తకాలు కొనిపించుకునేవాణ్ణి” అంటాడు. “తమ్ముడు” అంటే జ్ఞాన దాహం. అందుకే ఆయన “పెదనాన్న”గా సంబోధించే ఒక పుస్తక వ్యసనపరుడి ఇంట్లో ఈ పసివాణ్ణి అందరూ “పెదనాన్న” అని హాస్యం చేసేవాళ్ళు. విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమానికి సన్నిహితమై ఇరవై ఏళ్ళ విరసం సభలో వాలంటీరై తలమునకలుగా పనిచేసినా, చీరాల వెళ్లినా, విశాఖ వెళ్లినా, పటాన్ చెరు పారిశ్రామిక వాడలో విప్లవకారుడిగా కార్మికోద్యమం నిర్మించినా ఈ విరసం సభ్యుని జ్ఞానదాహమంతా ఆ జ్ఞానాన్ని విప్లవాచరణ దారుల్లోకి మళ్ళించడమే.

1989 లో పత్తి రైతుల ఆత్మహత్యల గురించి పేపర్లో ఎందరో చదివే ఉంటారు. కొందరు కవిత్వాలు, కథలు రాశారు కూడా. శ్రీను వాళ్ళ బాధలు ప్రత్యక్షంగా పరిశీలించడానికి చీరాల వెళ్లాడు. ఆ చేనేత కుటుంబాల్లో తానొకడయ్యాడు. “మా నరాలె కండెలుగా” వాళ్ళు బతుకు కలినేత వస్త్రాలనెలా నేసారో అతని డైరీ కన్నా నేనేమీ చెప్పలేను. ఆయన సీరియస్ రచన చేయటమూ 20వ ఏటనే ప్రారంభమయింది. విరసం సభ్యుడిగా సాంస్కృతిక సైనికుడిగా మాత్రమే విప్లవోద్యమానికి దోహదం చేయాలని మొదట అనుకున్నాడు. తల్లి మీద గల అమితమైన ప్రేమ కూడా ఆ నిర్ణయానికి కారణమైంది. ఆయన తల్లి నుంచి సమాజాన్ని చూసాడు. కులపరమైన అణచివేత, పితృస్వామ్య సమాజపు పీడన, తల్లి పడే బాధలు సున్నిత మనస్కుడైన శ్రీనును తల్లడిల్ల చేసేవి. ఆ మమకారం నుంచి సాగిన అన్వేషణ లో ఆయనకు వరంగల్ రైతు కూలీ సంఘపు మహాసభల్లో ఒక కామ్రేడ్ కలిసాడు. “నీ తల్లి పై గల ప్రేమ కారణంగానే నువ్వు తప్పక విప్లవకారుడివి కావాలి. బాధలు లేని, అణచివేత లేని ఉన్నతమైన సమాజం కోసం పోరాడకుండా నీ తల్లి పై, మొత్తం మహిళలపై అమలు జరుగుతున్న పీడనను నిర్మూలించలేవు” అని చైతన్య పర్చాడు. ఇంజనీరింగ్ రెండవ సంవత్సరంలో వదిలేసి పూర్తి కాలపు వృత్తి విప్లవకారుడయ్యాడు యంయస్ఆర్. తల్లి పై గల ప్రేమ మొత్తం పీడిత ప్రజానీకం పై ప్రేమగా రూపుదాల్చింది. ఆ అబేధ్యావసాయాన్నే ఆయనే నిద్రలో తల్లి పేగు కదిలి తట్టిలేపినట్లు రాసాడు.

“అమ్మ గుండె ఈ రోజంతా కన్నీళ్ళతో కాగి కాగి ఉంటుంది. ఈ ప్రపంచం లో నిజంగా నేను లేని తనాన్ని ప్రతి సెకండ్ బాధామయంగా అనుభవిస్తున్నది అమ్మ ఒక్కత్తే… అమ్మ కోసమే నేను ఇక్కడ ఉన్నాననుకుంటా. సమూహం లోని ప్రతి ఒక్కరిలోనూ అమ్మను చూస్తూ తృప్తి పడుతున్నాను… “రేపు నేను అమ్మను చేరుకోలేకపోయినా దేశమయితే అక్కున చేర్చుకొని ఓదారుస్తుంది.

“జూన్ 22, తన 22 వ పుట్టినరోజు పై వాక్యాలు హృదయపు అట్టడుగు పొరల్లోంచి రాసుకున్న శ్రీ ను రెండు వారాల్లో తేరుకొని జులై 8 న ‘ఒక అమ్మ కథ’ రాసాడు. ఆ అమ్మ పారిశ్రామిక వాడలో కుట్టు మిషన్ కుట్టి బతికే సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మ.

ఆ పారిశ్రామిక వాడలో
నా జీవితంలో మొట్టమొదటిసారి అది నా మొదటి ఇల్లు
అంబలి ఆ అమ్మ చేతిమీదుగానే అందుకున్నాను.

కాయకష్టంతో కాయలుగాసిన ఆ అమ్మ తన చేతులతో అతని చేతులు నిమిరి “చేతులింత మెత్తగున్నాయి. సుఖంగా బతికినట్టున్నావు కద బిడ్డా” అనేదట. “అవును, పాప ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నా” అని బదులిచ్చేవాడట.

ఈ పరివర్తన కోసం ఆయన కఠోర శ్రమ చేసాడు. విశాఖలో రెండు నెలలు కార్మికునిగా జీవించాడు. అప్పటికి అనుభవించిన సుఖమయ జీవితం నుంచి బయటపడి, శ్రమలో నుండి శ్రమజీపులను అర్థం చేసుకోవాలని ఒక వడ్రంగి దుకాణం లో హెల్పర్ గా పనిచేసాడు. హైదరాబాదు తిరిగి వచ్చి కార్మిక రంగంలో పని చేయడానికి ఎంచుకున్నాడు. “ఫ్యాక్టరీలలో కార్మికులపై అమలయ్యే దౌర్జన్యం, అణచివేత అర్థం చేసుకోవడానికి, తాను అమరుడైన బొల్లారంలోనే రష్మి డైకాస్టింగ్ లిమిటెడ్ ఫాక్టరీ లో రెండు నెలలు కార్మికుడుగా పని చేసాడు. ఆ రెండు నెలలు కార్మికుల స్వభావం, ఆలోచనలు, బాధలు అర్థం చేసుకొని, వారిని ఆర్గనైజ్ చేసే పద్ధతులు నేర్చుకోవడానికి తీవ్రంగా కృషి చేశాడు. ఆ రోజుల్లో యం యస్ ఆర్ ను కలవడానికి ఫ్యాక్టరీ వదిలే టైముకు వెళ్తే, ఖాకీ పాంటు, మాసిన చొక్కా, మసిబారిన చేతులతో టిఫిన్ బాక్స్ పట్టుకుని, ముఖాన చెరగని చిరునవ్వుతో ఎదురు వచ్చేవాడు. విప్లవ జీవితంలో ఎక్కడ రూం అద్దెకు తీసుకున్నా తన సున్నిత మనస్తత్వం వల్ల, ఆ ఇంట్లో మనిషిగా మారి, ఖాళీ చేసేప్పుడు కన్నీరు పెట్టించేవాడు. (పాణిగ్రాహి వారసులుగా పెన్ను, గన్ను పట్టి అమరులైన అజ్ఞాత విప్లవ కవులు యంయస్ఆర్, మంజీర- అరుణతార – సెప్టెంబర్ – అక్టోబర్ – 92)

ఈ తాదాత్మ్యం అమ్మ భావన సారభూతమైన సర్వనామ సంబోధనలోనే కాకుండా చివరకు పోలికల్లోనూ వ్యక్తమయ్యేంత గాఢమయింది. శ్రీను ఇదివరకు “నా కన్న తల్లి కళ్ళే నాకూ వచ్చాయ”ని సంబర పడేవాడు. ఈ అమ్మ కూడా నన్ను “నా రెండో కొడుకు చూడు నా కళ్ళు నా కొడుకు కళ్ళు ఒకటే” అని మా అన్నతో అనేది (అమ్మకథ). ఈ వ్యవస్థలోని భీభత్స విషాదమేమంటే శ్రీనును పోలీసులు ‘ఎన్కౌంటర్’ చేసారన్న విషయం, ఆ వార్త, ఆ ఫోటో పత్రిక లో చూసిన అతని అమ్మకు తెలియదు. అమ్మకతడు శ్రీనుగా మాత్రమే తెలుసు. బహుశా సహాధ్యాయులకు, ఉపాధ్యాయులకు, మిత్రులకు శ్రీనివాసరావుగానో శ్రీనివాస్ గానో తెలుసునేమో. పోలీసులకతడు ప్రభాకర్, కరుణాకర్ గా మాత్రమే తెలుసు (పోలీస్ ఇంటెలిజెన్స్ కు ఇంత సున్నిత మనస్కుడు, ఆవేశోద్రేక ఉద్వేగ స్వభావి ఆయన శ్రీను, ఎం. శ్రీనివాసరావు, ఎంఎస్ఆర్ అని చచ్చేదాకా తెలియకపోవడం, ఆయనెక్కడ చదివాడో, తల్లిదండ్రులెవరో తెలియక పోవడం అతని విప్లవాచరణలోని క్రమశిక్షణకు గీటురాయి.)

అతడేవూళ్ళో పుట్టాడో మాకు తెలియదు. విప్లవోద్యమం లో పనిచేసిన రెండేళ్ళు పత్రికలకు పుంఖానుపుంఖాలుగా పంపించిన రచనలు తప్ప ఏ అనుభూతులు, అనుభవాలు, జ్ఞాపకాలు రాసుకున్నాడో తెలియదు. క్రమంగా ఎంఎస్ఆర్ ‘కరుణాకర్’ అనే కలం పేరుతో రాయాలని సంకల్పించాడని, కార్మికులతో కలిసి కథలు, పాటలు రాయాలని, చివరి రోజుల్లో చుట్టూ ముసురుకుంటున్న సాహిత్య సాంస్కృతిక దాడులను ప్రతిఘటించే జవాబులు రాయాలని అనుకున్నాడని కూడా అర్థమవుతుంది.

ఎంఎస్ఆర్ కవిత్వంలో విప్లవ కరుణాత్మకత స్పష్టంగా ప్రతిఫలిస్తుంది. అతని కవిత్వంలో ఆత్మను సరిగ్గా ఆవిష్కరించాడు మా మరో విరసం సభ్యుడు కామ్రేడ్ మంజీర. ఆయన వలెనే ఆయన కవితలన్నీ కరుణాత్మకత నుంచి అరుణాత్మకతలోకి ట్రాన్స్‌ఫ్యూజ్ అవుతుంటాయి. పరాయీకరణ గురించిన తపన రానురాను చివరి రోజుల్లోని కవితల్లో ఎక్కువగా చోటు చేసుకున్నది. అయితే పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక రంగంలో పని చేసినందువల్ల దీనికి మూలమైన సరుకుల మాయను సరిగానే కవిత్వీకరించాడు.

కార్మిక సమస్యలే కాకుండా ఈనాడు సమాజం ఎదుర్కొంటున్న అన్ని సమస్యలు ఎంఎస్ఆర్ కు కవితా వస్తువులే అయ్యాయి. వైవిధ్యం ఎంఎస్ఆర్ కవితల్లోని మరొక విలక్షణత్వం.

నాకు కవిత్వం చదవడం ఇష్టం. వాచకం రాయడం ఇష్టం అని చెప్పుకున్న ఎంఎస్ఆర్ సాహిత్యస్వభావం సద్యః ప్రతిక్రియ. అందువల్ల సైకిల్ పై పోతూ కూడా కవిత రాయవచ్చునని ఒక చోట చెప్పుకున్నట్లు ఒడుపు వల్లనే కవిత్వం ఎక్కువ రాసాడు. అందుకాయన సహజ ఉద్రేక, ఉద్వేగ స్వభావం కూడా దోహదం చేసింది. కాని ఆయన వచనం లో కవిత శిఖరాలు అందుకున్న దశకు ‘క్షమాపణలతో’ రచన ప్రత్యక్షర సాక్ష్యం.

విప్లవోద్యమంలో వ్యగ్రమైన కొద్దీ ఆయన వాసి లోనే కాదు రాశి లోనూ విస్తృతి సాధించాడు. “కొన్నాళ్ళకింద కవిత్వం రాయడమే మధ్య తరగతి చైతన్యానికి చిహ్నమని బందు పెట్టుకొని పనిలో పడ్డాను. మే 5 ‘సుప్రభాతం’ తరువాత మధ్య తరగతి ప్రజల్ని కవిత్వం ద్వారా రెగ్యులర్ గా చేరుకోవాలని తీర్మానం చేసుకున్నాను. అట్లాగే కథలు రాయడానికి సీరియస్ గా ప్రయత్నిస్తాను. I shall create time for literature. ‘రాజ్యం’ అన్నీ రంగాలలోనూ దాడి చేస్తది. తప్పదు- అని చేతులు ముడుచుకొని కూర్చోను. ఇక్కడ కవులం కళాకారులం తయారవుతాం.”

సరిగ్గా ఈ అవగాహన నుంచే ఇవ్వాళ విప్లవోద్యమం నుంచి, విప్లవోద్యమానికి రెండు అనివార్య శిబిరాలయిన రహస్య జీవితం, జైలు నిర్బంధం లోంచి బహిరంగ జీవితం నుంచి కన్నా ఎక్కువ సాహిత్యం వస్తున్నది. సాహిత్య జీవుల సమావేశాలు, సభల్లో, గోష్ఠుల్లో, చేతికి వచ్చే తీరిక సమయాల్లో, దృష్టికి వచ్చే పత్రికల్లో, తాము గా ఇంటికి నడిచివచ్చే పుస్తకాల్లో తప్ప సాహిత్యాన్ని పట్టించుకొని విశ్లేషించలేని విమర్శలకు ఈ సాహిత్యం దాదాపుగా చూపు కందడం లేదు. విప్లవ సాహిత్యోద్యమాన్ని అంచనా వేయడం లో వాళ్ళ అలవాటుపడ్డ సాహిత్య దైనందిన చర్యలో ‘అండర్ గ్రౌండ్ సాహిత్య ప్రతిఫలనాన్ని ప్రవేశ పెట్టడం ప్రయత్నపూర్వకంగా జరగాల్సిందే.

కామ్రేడ్ వెంపటాపు సత్యం, సుబ్బారావు పాణిగ్రాహితో ప్రారంభమైన ఈ వృత్తి విప్లవ ప్రవృత్తి సాహిత్యం ఎనభైలలో కొమ్మలు, రెమ్మలు వేసింది. యాదృచ్చికం కాదు. డెబ్బై నుండి ఎమర్జెన్సీ కాలం దాకా వచ్చిన విప్లవ సాహిత్యమంతా ఒక్క మాటలో చెప్పాలంటే రాజ్యం హింసను, రాజ్యాంగ యంత్రం కుట్రను బహిర్గతం చేసే బహిరంగ ప్రచార సాహిత్యం. త్యాగాల నుంచి బలిదానాల నుంచి ఉత్తేజాన్ని ప్రేరణ నిచ్చే సాహిత్యం. అందుకని దానిలో స్పష్టత, ఉరవడి, వేగం, ఉధృతి వున్నాయి.

ఎమర్జెన్సీ సాహిత్యమంతా ఎక్కువగా జైలు సాహిత్యం. చీకటి రోజుల్లో కూడా చీకట్లను చీల్చే చందాన్ని వివరించే సాహిత్యం ఉంటుందని, కటకటాలు వున్న చోట సందుల్లో కలాలు పుట్టిన కరాలు, నిగళాల స్వరాల వినిపించే గళాలు ఉంటాయని చెప్పే బ్రెహ్టోరియన్ ఒరవడి లో సాగిన సాహిత్యం. (విలోమ సాహిత్యం మాత్రం కాదు).

ఎమర్జెన్సీ నిర్బంధం తొలగి భ్రమాత్మక ప్రజాస్వామ్యం నెలకొని ముచ్చటగా మూడేళ్లు గడవకుండానే 80లలోనే ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ ‘ఎన్ కౌంటర్’ హత్యలు ప్రారంభమయ్యాయి. వరంగల్ నగరం నడిబొడ్డు దగ్గర అరెస్టు చేసి చంపారు. సూర్యాపేట కోర్టులో హాజరు పరచి చంపారు. కాలేజీ పిల్లల్ని క్యాంటీన్ లో పట్టుకొని జాతీయ రహదారిపై చంపారు. ఒక విప్లవ గ్రూపును ప్రత్యేకించి తుడిచి పెట్టే దుష్ట ప్రయత్నం చేసారు.

83 లో ఎన్టీఆర్ పాలన నాటికి రాజ్యహింస ‘జోహార్లు’ రూపంలో ‘రెడ్ శాల్యూట్’ రూపంలో ప్రవేశించింది. ‘దేశభక్తు’లెన నక్సలైట్లను ‘టాడా’ కేసులు పెట్టి ‘ఎన్కౌంటర్లు’ మాత్రమే కాదు ‘మిస్సింగు’లు చేయడంగా రాటు తేలింది. ‘ఆట, పాట, మాట బంద్’ అయిన ఆ తరుణంలో పాట అజ్ఞాతంలోకి వెళ్ళిపోయింది. బూర్జువా పత్రికల్లో మాజీ విప్లవ కవులు మొదలుకొని ఫెలో ట్రావెలర్స్ దాకా (శత్రువుల సంగతి సరే సరి) సాహిత్యంలో స్తబ్దత (wagging the tail అంటారో tongue అంటారో ఇంగ్లీషు నుడికారం తెలిసిన వాళ్ళు చెప్పాలి) నాలుకతో ఝాడించారు.

మరి వాస్తవం ఏమిటి? అంతకు పూర్వం పదిహేను ఏళ్ల పాటు రహస్య జీవితంలో ఉన్న వాళ్ళ నుంచి ఎక్కువగా పాటలే వచ్చేవి. ఒకరిద్దరు కథలు రాసారు. పాటలు మాత్రమే రాసే గద్దర్ ఈ అజ్ఞాత జీవితంలో వచన కవితలు రాసాడు. బహుశ ఇంతవరకు ఏ ప్రజా వాగ్గేయకారుడు చేయనంతగా జానపద, ప్రజాసాహిత్యాల జీవనాడి ని పట్టుకునే సిద్ధాంత విశ్లేషణ చేసాడు. ‘తరగని గని’ని కళాత్మకంగా తవ్వి తలకెత్తాడు. ప్రతి పాట వెనుక జీవిత వెతను కథను వివరించాడు. బాధల బాటల పల్లవిని, బాణీని వినిపించాడు. ‘సముద్రుడు’ మార్క్సిస్టు దృక్పథం నుంచి బైబిల్ పరిశీలన చేయడం మొదలుకొని ఈనాడు సాహిత్యంలో పుండవలసిన దేమిటని సాహిత్య ప్రయోజనాన్ని చెప్పే వ్యాసాల దాకా రాసాడు. కథలు, కవితల సంగతి చెప్పనవసరం లేదు. అజ్ఞాత జీవితంలో అంత విరివిగా కవితలు రాసి భూమి తల వెలకట్టమని సవాల్ చేసిన ఇంకొక కవి లేడు. పదిహేనేళ్ళ పాటు అజ్ఞాత జీవితంలో, జైల్లో, తిరిగి అజ్ఞాత జీవితంలో వివిధ ప్రక్రియల్లో సాహిత్య సాధన చేసిన విరసం సీనియర్ సభ్యుడు కామ్రేడ్ నూతన్. ఆఖరి రోజుల్లో గోండు భాష నేర్చుకొని ఆదివాసుల కోసం కళారూపాలు సృజించాడు. ప్రథమార్థంలో ఒక్కడిగా చెప్పుకున్న రిక్కల సహదేవ్ రెడ్డి 85-90 మధ్య నిర్బంధం లో పెక్కు రెక్కల విప్లవ సౌగంధికా పరిమళాలయినాడు.

సింగరేణి కార్మికోద్యమ నిర్మాణానికి, కార్మిక కథల నిర్మాణానికి కూడా ఆద్యులైన కథకుల్లో అమరుడు కామ్రేడ్ మూట శంకర్ కార్మికోద్యమ నిర్మాణానికి ఉపకరించే లక్ష్యంతోనే మూడే మూడు కథలు రాసాడు. భాషా పటాటోపం, శైలీ శిల్పాలు, జిమ్మిక్కులు లేని సాదాసీదా కథలు అల్లం రాజయ్య, రఘోత్తమ రెడ్డి, బి.ఎస్.రాములు వంటి సుప్రసిద్ధ విప్లవ కథకుల ప్రశంసలు పొందిన కథలు. అవే సింగరేణి బతుకులాగా పుస్తక రూపంలో వెలువడినై.

‘అమర జ్యోతి’ పేరుతో రాసిన రాము వరంగల్ రైతు కూలీ సభల తర్వాత అజ్ఞాతంలోకి వెళ్ళి అతి తక్కువ కాలంలో అమరుడయ్యాడు. ఆయన కథలు ‘తునికి చెట్టు’ కవితాసంకలనం ‘మాలోనే వుంది స్వేచ్ఛ’ రెండేళ్ళ సాహిత్య వ్యక్తిత్వ వికాసానికి అద్దంపట్టే అచ్చయిన రచనలు.

తొడలో మూడుసార్లు శత్రు తూటాలు దిగినా బతికి పోరాడి, జైలు పాలయి, విడుదలయి రహస్య జీవితం లోకి వెళ్లి చివరకు నాలుగోసారి శత్రు చేత చిక్కి అమరుడైన గోపాలరెడ్డి జైల్లో గానీ కలం పట్టడం నేర్వలేదు. పోరాటంలో తోటి కామ్రేడ్ పోరాడుతూ ఒరిగిపోతుంటే, విజయాలు సమకూరుతూ వుంటే, వైరుధ్యాల పరిష్కారం కోసం వెతుకుతూ వుంటే కవితలు, కథలు రాయాలని ఉంటుంది. కానీ యుద్ధ రంగంలో ఎలా సాధ్యం అని మధనపడిన గోపాల రెడ్డి వచన కవితలు, పాటలు రాస్తూనే అసువులు బాసాడు.

జననాట్యమండలి సభ్యుడై ఒగ్గు కథలో గొల్లన్న వేషం వేసిన విశ్వనాథ్ 84 లో విరసం లో చేరి త్వరలోనే కార్మికోద్యమం లోకి వెళ్చిపోయి ఉద్యమ అవసరాల రీత్యా పాటలు రాయడం ప్రారంభించాడు. జైలు జీవితంలో ఆయన పాట పదునెక్కింది. విడుదలై బెంజిమిన్ గా నగర పారిశ్రామిక ప్రాంతంలో కార్మికోద్యమాన్ని నిర్మించిన విశ్వనాథ్ జైలు జవాన్ల పై, బాలకార్మికుల పై రాసిన పాటలు మరువరానివి.

అజ్ఞాతంలో వుండి అమరులైన కవులు రచయితలు వీళ్లు. ఇది వీళ్ళ సాహిత్య సమగ్ర పరిశీలన కూడా కాదు. 80 లలో, 90 లలో విరసం లోనూ, విప్లవ, ప్రజాసాహిత్య ఉద్యమాల్లోనూ వుండి రాస్తున్న రచయితల, కవుల విషయం కూడా ఇక్కడ ప్రస్తావించలేదు. చెప్పి వచ్చిందల్లా విప్లవోద్యమంలో నిర్బంధ నిషేధ కాలాల్లో వైవిధ్యం గల సాహిత్య ప్రక్రియలు ఎంతో శక్తివంతంగా అజ్ఞాతంలోంచి ఎక్కువగా సృజించబడ్తున్నాయని.

ఇవ్వాళ అజ్ఞాత జీవితంలోని ఈ అమరుల రచనలు మాత్రమే మనకు మిగిలాయి. అవి కూడా వాళ్ళు రచన చేసిన కాలం లో పోస్ట్ ద్వారా పత్రికలకు పంపిన సందర్భాల్లోనే. వాళ్లు రచయితలు కావాలనుకొని రాసినవి కావు. అందువల్ల కాపీలు రాయడం, ఒకచోట నోట్ బుక్ లో రాసుకోవడం, జాగ్రత్త పరచడం వాళ్లు చేయలేదు. అట్లా చేతికి రాకుండా పోయిన రచనల సంఖ్యాకం దాదాపు రెండు దశాబ్దాల పాటు రాసిన నూతన్ రచనల సంకలనం తేవడం అందువల్లనే దుస్తరమవుతున్నది. అజ్ఞాత కవుల గురించి కామ్రేడ్ మంజీర రాసిన మాటలు యధాతథంగా ఉటంకిస్తే కానీ ఈ అంశానికి కొంత న్యాయం చేసినట్టు కాదు.

“తీరిగ్గా కూర్చొని స్వంత బాధలనో, ప్రకృతి దృశ్యాలనో కళాత్మకంగా వర్ణించడం కాక, విప్లవ జీవితంలో ఉండే ఒత్తిడుల మధ్య శత్రువు తూటాలను క్షణక్షణం కాచుకుంటూ కూడా సముద్రుడి లాగానే ఎం.ఎస్.ఆర్, గోపాలరెడ్డి విలక్షణమైన విప్లవ కవిత్వాన్ని సృష్టించిన అజ్ఞాతకవులు. నిజం చెప్పాలంటే శత్రుపుకు తూటాతో జవాబు చెప్తూనే వాడు కురిపించిన తూటాలను ఒడిసిపట్టి కవిత్వంగా మార్చి తిరిగి వాని పైనే ప్రయోగించారు.

తీరిగ్గా కూర్చొని సరదాగా రాసే కవిత్వం మళ్ళీ అలాంటి వాళ్ళు చదువుకోవడానికి పనికి వస్తుంది. అటువంటి కవిత్వానికి పరవశించే విమర్శకులకు నిప్పులను చెరిగి కవిత్వాన్ని పేరుస్తున్న సముద్రుడు, ఎం.ఎస్.ఆర్., గోపాల రెడ్డి వంటి వాళ్ళ కవిత్వం కవిత్వంగా కనిపించదు. బహుశా వాటి వేడి ఆ విమర్శకులు భరించలేరు.

విప్లవోద్యమం నేడు అసంఖ్యాకంగా సృష్టించిన కవులంతా తామెన్నడూ కవులు కావాలని ఆశించిన వాళ్ళు కాదు. వాళ్ళు ఎదుర్కొంటున్న పరిస్థితులు వాళ్ళను కవులుగా మార్చాయి. చేతిలోని తుపాకీతో పాటు కవిత్వాన్ని శత్రువుపై ప్రయోగించే మరో ఆయుధంగా వాళ్ళెన్నుకున్నారు.

తన బాధను తీర్చుకోవడానికి ప్రతి రాజకీయ ఖైదీ కవిగా మారుతున్నాడు. తన ప్రజలకు విప్లవ సందేశాన్నందివ్వడానికి ప్రతి గెరిల్లా పాటలు కూరుస్తున్నాడు. తూర్పు గోదావరిలో అమరులైన దళనాయకులు నూకరాజు (శెట్టి ప్రసాద్) విజయ్ కుమార్ కూడా ఆ కోవలోని వారే. ఈనాడు ప్రజలే తమ అన్నల అమరత్వంపై ఎన్నో పాటలు కూరుస్తున్నారు.

‘చూసే కళ్ళకు మనసుంటే’ అన్నట్టు ఇదొక గొప్ప ప్రవాహం. రోజురోజు కు కొత్త నీరు చేరి పరవళ్లు తొక్కుతున్న ప్రవాహం. అందులో తేలి ఆడాల్సిందే కాని, ఒడిసిపట్టడం కష్టం.

అటువంటి వాళ్ళలో అమరులైన ఈ కవులకు ఎర్ర దండాలు చెపుదాం. వాళ్ళ ఆశయ సాధనకు పిడికిలి బిగిద్దాం.”

***

పసిపిల్లల డాక్టర్ రామనాథం గారిని హత్యచేసిన ఏడేళ్లకు అదే సెప్టెంబర్ 3న అదే పోలీస్ రాజ్యం పసిబాలుడైన శ్రీనును ‘ఎన్ కౌంటర్’ చేసింది. మెదక్ జిల్లాలోని బొల్లారం పారిశ్రామిక ప్రాంతంలో (హైదరాబాదు నగర శివార్లలో) మరొక కామ్రేడ్ తో పాటు పట్టుకొని చిత్రహింసలు పెట్టి కాల్చిచంపారు. విప్లవోద్యమం లో అతని పేర్లేమిటో తలిదండ్రులకు తెలియదు. అతని అసలు పేరు, ఊరు, తల్లిదండ్రులెవరో పోలీసులకు తెలియదు. తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. పోస్ట్ మార్టమ్ చేసింది లేనిది తెలియదు. ఫోటో పోల్చుకుని ఎవరైనా వచ్చి తమ బిడ్డడని అడగడానికి మార్చురీలో ఉంచిందీ లేనిదీ తెలియదు. తలిదండ్రులకు మాత్రం తన కొడుకు ‘ఎన్ కౌంటర్’ అయ్యాడని ఇప్పటికీ తెలియదు. ప్రజలకు తెలుసు. కానీ అతని వాళ్ళయిన రక్తబంధువులు గానీ, వర్గ బంధువులు గానీ, పరిచయస్తులు గానీ, స్నేహితులు గానీ ఎవరూ ఆయన మృతదేహాన్ని చూడలేదు. పోలీసులు మాత్రమే చూసారు. పోస్ట్ మార్టమ్ చేసి ఉంటే వాళ్ళు చెప్పినట్లు రిపోర్టు రాయడానికి ఒప్పుకున్న డాక్టర్లు చూసి ఉంటారు. నేను శ్రీనును ఆఖరి సారిగా అతని పుట్టిన రోజు జూన్ 22, 90 న చూసాను. ఇరవయ్యో ఏట. అతడు పుట్టిన రోజు, కేరింతలు పెట్టినరోజు, ఆడిపాడి బడికెళ్ళి ఎదిగిన రోజులు మాత్రమే కాకుండా స్వప్నంలోనూ, గర్భంలోనూ చూసుకున్న తల్లి మాత్రం అతణ్ణింక చూడలేదు. అతడు కొన్ని క్షణాలు మాత్రమే జీవించాడు. మనిషిగా, ప్రేమ, స్నేహాభావాల ప్రతీకగా, కవిత్వంగా, విప్లవంగా. ఈ రెండు కళ్ళలోని వెలుగుగా ఆయనను మనలో బతికించుకుందాం.

-వీవీ

హైదరాబాదు, 12-11-1992

జననం: వరంగల్లు జిల్లా లోని చిన్నపెండ్యాల. ఉద్యోగరీత్యా వరంగల్లు లోని సీ.కే.ఎం. కళాశాలలో (1968-98) తెలుగు సాహిత్య ఉపన్యాసకుడిగా పనిచేసాడు. నవంబర్ 1966 లో, సాహితీ మిత్రులు (Friends of Literature) స్థాపించి, సృజన అనే ఆధునిక తెలుగు సాహితీ వేదికను ప్రారంభించాడు. విరసం కార్యనిర్వాహక సభ్యుడుగా ఉన్నాడు. 1984 నుండి 1986 వరకు కార్యదర్శిగా పనిచేశాడు. 1983లో స్థాపించిన All India League for Revolutionary Culture (AILRC) కి వ్యవస్థాపక కార్యనిర్వాహక సభ్యుడుగా, 1993 వరకు ప్రధాన కార్యదర్శిగా ఉన్నాడు. రచనలు: చలినెగళ్లు (1968), జీవనది (1970), ఊరేగింపు (1973), స్వేచ్ఛ (1977), స్వేచ్ఛ (1977), భవిష్యత్ చిత్రపటం (1986), ముక్త కంఠం (1990), ఆ రోజులు (1998), ఉన్నదేదో ఉన్నట్లు (2000), ఉన్నదేదో ఉన్నట్లు (2000), బాగ్దాద్ చంద్రవంక (మార్చి 2003), మౌనం యుద్ధ నేరం (ఏప్రిల్ 2003).

Leave a Reply