వీరుడు-3

(గత సంచిక తరువాయి)

నిశ్బబ్ధంగా ఉన్న నీటిలో బండరాయి పడ్డట్టుగా ఒక్కసారిగా బొగ్గుగనుల్లో చలనం మొదలైంది.
అప్పటికి సింగరేణి బొగ్గు గనులు ఆరంభమై తొంబై సంవత్సరాలైంది. కాని కార్మికుల బ్రతుకుల్లో మాత్రం మార్పేమి రాలేదు. ఏండ్లకు ఏండ్లుగా ఇరుకు మురుకు గుడసెల్లో, మానవ కనీస అవసరాలు నోచుకోక, అపరిశుభ్రమైన వాతవరణంలో పెంటకుప్పల మధ్య పందులతో, దోమలతో, రోగాలతో సతమతమైపోతూ బ్రతుకుతున్నారు. గొంతు తడుపుకోను గుక్కెడు మంచినీళ్ళకోసం ఎప్పుడు వస్తుందో ఎప్పుడు రాదో తెలియని పంపులకాడ కుండలు పట్టుకొని నిత్యం తగువులాడుకునే స్త్రీల అరుపులు కేకలతో తెల్లారిపోతుంది.

భూమి పొరల్లో వందల అడుగుల లోతున, ఊపిరి సల్పని గర్మిఫేసుల్లో గుడ్కెడు గుక్కెడు నీళ్ళు తాగుతూ నిత్యం ప్రమాదాల మధ్య తమ రక్తాన్ని చెమటగా మార్చి బొగ్గు తవ్వి తీస్తే, ఆ బొగ్గు కరెంటుగా మారి లోకానికి వెలుగు పంచితే, కార్మికుల గుడిసెల్లో మాత్రం వెలుగు నివ్వలేకపోయింది.

నిజాం కాలం నాటి దొరతనం బొగ్గు బావుల్లో కొత్త రూపం ఎత్తింది. బాయి దొరలు ఏం చేసినా చెల్లుబాటు అయ్యే పరిస్థితి. దొరా అని పిలిస్తే తప్ప మాట్లాడని అహంబావాన్ని పెంచింది. అదిరించి బెదిరించి పనులు చేయించుకోవటం, ఇంటికాడ పని మనుషులుగా వాడుకోవటం యధేచ్ఛగా సాగింది. కాదన్న వాన్ని, ఎదురుతిరిగిన వాన్ని అధికారులు సాధించి వేధించి ఇంటికి పంపించే వాళ్ళు.

కాలరీ ప్రాంతంలో కార్మికులకు అధికారులకు మధ్య అసమానతలు కొట్ట వచ్చినట్టుగా కన్పించేవి. జీతాల్లో భారీ వ్యత్యాసం ఉండేది. ఒకవైపు మురికి కుపాల్లాంటి కార్మికుల గుడిసెలు ఉంటే, మరో వైపు అధికారులకు విశాలమైన భవంతులతో, వాటి మధ్య అందంగా పెంచిన పార్క్‌లతో అలరారేవి. దొరల క్లబ్‌ల్లో స్విమ్మింగ్‌ ఫూల్స్‌ వంటి సౌకర్యాలు ఉండేవి. పరస్పర విరుద్ధమైన రెండు రకాల జీవితాలు ప్రక్కప్రక్కనే కొట్ట వచ్చినట్టు కన్పించేవి.
బొగ్గు బావుల్లో రెక్కలు ముక్కలు చేసుకునే కార్మికులకు బయట మాత్రం ఏం సుఖం ఉంది.
కార్మికుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని ఊదరగొట్టే మేనేజుమెంట్‌ కార్మికుల సంక్షేమం గురించి ఎప్పడు పట్టించుకోలేదు. కార్మికుల కోసమే ఉన్నామంటూ కాలర్‌ ఎగరేసే యూనియన్‌ నాయకులు పట్టించుకోలే. కార్మికునికి స్వయంగా రావల్సింది రావాలన్నా, యూనియన్‌ నాయకులకు లంచాలు ఇవ్వకుండా ఏ పని జరిగేది కాదు. లంచాలతో అక్రమ సంపాదనలతో నాయకులు తెగబలిసిపోతే, కార్మికుల బ్రతుకులు మాత్రం రోజు రోజుకు దిగజారిపోయేవి.

ఘనత వహించిన ప్రజాస్వామిక దేశంలో అధికారం చెలాయించిన నాయకులు ఏనాడు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోలే… కాని ఒక్క విషయంలో మాత్రం చాలా ఉదారంగా వ్యవహరించారు.
వాడవాడకు లెక్కకు మించి ప్రభుత్వం సారాకొట్లు, బ్రాండీ షాపులు పెట్టింది. బాయి ప్రహరీ గోడలను ఆనుకొని మొదలయ్యే సారాకొట్లు, నాలుగు కూడల్ల మధ్య, కార్మిక వాడల్లో ఎల్లెడలా దర్శనం ఇచ్చి కార్మికులను ఆకర్షించేవి. బొగ్గు బాయిలో ఒళ్ళు హూనమై నీరసించిన దేహలను ఈడ్చుకొంటూ, ఇంకా మొఖమైన కడుక్కోకుండా అటు నుంచి అటే సారా కొట్టుకు నడిచి పాసినోటితోనే సవ్వో, దోసవ్వో సారా త్రాగి ఊక్కుంటూ ఊక్కుంటూ ఇంటిదారి పట్టే కార్మికులు ప్రతిచోట కనిపించే వాళ్ళు. సారా మత్తు ఎక్కువై ఏ రోడ్డు ప్రక్కనో సోయి సొక్కులేకుండా పడిపోయిన కార్మికులు తరుచు కనిపించేవాళ్ళు…

ఆ రోజుల్లో కాలరీ ప్రాంతంలో గుండాయిజం కూడా విచ్చలవిడిగా ఉండేది. ప్రతి రాజకీయ నాయకునికి, ప్రతి యూనియన్‌ నాయకులకు స్వంత గుండాలుండేవారు. సారా కాంట్రాక్టర్ల గుండాయిజంకు అంతూ పొంతూ ఉండేది కాదు. శాంతి భద్రతల కోసం ప్రతి ఏరియాలో పోలీస్‌స్టేషన్లు ఉన్నప్పటికి రాజకీయ ఒత్తిళ్ళకు లొంగిపోయి నామమాత్రంగా ఉండిపోయ్యేవి. గుండా గ్రూపుల మధ్య తరచుగా కొట్లాటలు జరిగి ఎవరైనా హత్య చేయబడినప్పుడో, లేదా గుండాలు ఎవరి మీదనైనా దాడులు చేసినప్పుడో తప్పనిసరి పరిస్థితిలో గుండాలను అరెస్టు చేయాల్సి వచ్చి కేసులు పెట్టినా, నాల్గు రోజుల్లో బెయిలు పొంది గుండాలు మళ్ళీ రోడ్ల మీద దర్శనం ఇచ్చేవాళ్ళు. సాక్షులను బెదిరించేవాళ్ళు. దాంతో జనం గుండాలకు వ్యతిరేకంగా ముందుకు రావాలంటే భయపడేవాళ్ళు. దాంతో కాలరీ ప్రాంతంలో గుండాల గుండాయిజం ఎదురు సదురు లేకుండా పోయేది. వాళ్ళు ఆడిరది ఆట పాడిరది పాటగా ఉండేది. స్త్రీల మీద గుండాలు చేసిన అత్యచారాలు లెక్కలేవు. భర్తల ముందు భార్యలను చెరిచిన సంఘటనలున్నాయి. గుండాలకు భయపడి స్త్రీలు ఒంటరిగా వీధుల్లోకి రావాలంటే భయపడి పోయేవాళ్ళు.
దేనికైనా ఒక సమయం వస్తుంది. బ్రతకలేని పరిస్థితులే తిరుగుబాటు కారణం అవుతాయి. అటువంటి దుర్భర పరిస్థితిలో ఒక వెలుగురేఖ ప్రసరించింది. బొగ్గుగనుల్లో పనిచేసే కార్మికుల పిల్లలు హైద్రాబాద్‌, వరంగల్‌ వంటి పట్టణాల్లో చదివే పిల్లలు ఆ వెలుగు రేఖలు మోసికొనివచ్చిండ్లు, బాయి బాయికి బస్తీ బస్తీకి తిరుగుతూ వాళ్ళ రెక్కల్లో బొక్కల్లో మెదిలిండ్లు. గుండె గుండెను తట్టి మన బతుకులు ఎందుకు ఇట్లున్నది. బ్రతుకు మారాలంటే పోరాటం చెయ్యాలన్నారు.

కార్మికుల్లో ఆలోచనలు మొదలైనవి. అవి ఒక రూపం తీసుకోకముందే దేశంలో ఎమర్జెన్సీ వచ్చింది. దేశమే జైలుగా మారింది. తుపాకి రాజ్యం ఏలింది. అక్రమ అరెస్టులు జైల్లు, ఆలోచనల మీద నియంత్రణ దేశమంతా సాగినట్టే కోల్‌బెల్టులో కూడా సాగింది.

సింగరేణిలో గుర్తింపు సంఘాలుగా చెలామణి అయ్యే ఏఐటియుసి, ఐఎన్‌టియుసిలు రెండు కూడా ఎమర్జెన్సీని సమర్థించాయి. ఎమర్జెన్సీ సాకుగా చూపి కార్మికుల హక్కులు హరిస్తుంటే, కార్మిక సంఘాలేమో ‘ఇప్పుడు దేశంలో ఎమర్జెన్సీలో ఉంది. ఏం మాట్లాడలేం?’ అంటూ చేతులు ఎత్తేసిండ్లు. కార్మికుల పరిస్థితి పెనంలో నుండి పొయ్యిలో పడ్డట్టుగా మారింది.

జయప్రకాశ్‌ నారాయణ ఆధ్వర్యంలో దేశమంతా ప్రజలు ఎమర్జెన్సీని ఎత్తివేయాలని, ప్రజాస్వామిక హక్కులను పునరుద్ధరించాలని ఆందోళన మొదలైంది. దేశంలోని జైళ్ళ్న ఆందోళనకారులతో కిక్కిరిసిపోయినవి. వెల్లువెత్తిన ప్రజా అగ్రహంలో ఇందిరాగాంధీ కొట్టుకపోయింది. 1977లో జరిగిన జనరల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఓడిపోయి కేంద్రంలో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఎన్నికల వాగ్ధానం మేరకు దేశంలో ప్రజాస్వామ్యం పునరుద్ధరించబడిరది. అంతవరదాక కోల్‌ బెల్టులో చాపక్రింద నీరులా వ్యాపించిన చైతన్యం… ఎమర్జెన్సీ ఎత్తివేసిన తరువాత ఒక రూపం తీసుకున్నది.

ఎటుచూసిన నల్లటి దుమ్ము పేరుకపోయిన బావి వాతావరణంలో డ్యూటీ చేసి అలసిపోయిన మసిబారిన మొఖాలతో బావిమీద ఏ మ్యాన్‌వే కాడనో చెట్లక్రిందనో, క్యాంటీన్‌ వద్దనో, బంకర్‌ వద్దనున్న రాలె చెట్టుకాడనో నిలబడో, సెలుకుప్పల మీద కూచోనో, కార్మికులు ఆలోచనలు చేసేవారు. సమస్యలపై చర్చించేవారు. మన సమస్యలను మనమే పరిష్కరించుకోవాలని కంకణబద్దులయ్యేవారు.

‘‘నొప్పులు వచ్చిన ఆడదాని తీరుగా రూఫ్‌ చిటపటలాడుతుంది. ఎప్పుడు పడ్తదో తెలియకుండా ఉంది. రక్షణ ఏర్పాటు చెయ్యకుండా ఎట్లా పనిచేస్తామో, టబ్బుల సప్లయి సరిగా ఉంటలేదు…. టబ్బుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సివస్తుంది. గాలి సప్లయి సరిగ్గా లేక ఊపిరి సలుపుతలేదు.. అటువంటి కాడ లేబరోడు ఎట్లా పని చెయ్యాలి… వాడు మనిషా పశురమా?’’ అంటూ ఆలోచన చేసేవాళ్ళు.
‘‘అరే పసురం అటువంటిదానికి తిండి తిప్పలు చూస్తం. లేబరోని బ్రతుకు అంతకంటే అధ్వాన్నం అయింది’’
‘‘దొరలు తెల్లబట్టలేసుకుని పంఖాల క్రింద కూసొని వేలకు వేలు జీతాలు తీసుకుంటూ మనమీద పెత్తనం చెయ్యటానికా? బాయిల ఏమున్నది! ఏంలేదని చూసుకోవద్ధా!’’ అంటూ రుసరుసలాడేవాళ్ళు.
‘‘కార్మికుల సౌలత్‌ సంగతి ప్రక్కనపెట్టు, ఉత్పత్తి అవసరమైన పనిముట్లు కూడా ఇవ్వకుంటే వీళ్ళెమీ పీకటానికున్నరు’’ అంటూ కోపంతో ఉడిగిపోయ్యేవాళ్ళు.

గతంలోనైతే కార్మికులు ఏదైన సమస్య వస్తే యూనియన్‌ నాయకుల దగ్గరకు పరుగులు పెట్టే వాళ్ళు. కాని ఇప్పుడట్లా లేదు. కార్మికులు తమ సమస్యలపై తామే ముందు నిలబడి నిలదీస్తున్నారు. వినకుంటే సమ్మెలు చేస్తున్నారు. తాడోపేడో తేల్చుకోవటానికి సిద్ధమౌతున్నారు.
బాయి మీద దొరలకు కాళ్ళ క్రింద దుమ్ము కంట్లో పడ్డట్టుగా మింగుడు పడటంలేదు. గట్టిగా గుడ్లెర్ర చేస్తే వణికిపోయే కార్మికులు, భయం జెంకు లేకుండా సూటిగా చూస్తు నిలదీస్తున్నారు.
‘‘ఇక గిట్లయితే బావులేమి నడుస్తయి’’ అంటూ మేనేజర్లు గునుక్కుంటూ కార్పోరేటు ఆపీసుకు తమ నిస్సహాయతను వ్యక్తపరిచే వాళ్ళు….
‘‘ ఏ కార్మికునికి యూనియన్‌ అంటే భయం భక్తి లేకుంటాపోయింది. మేం ఎంత పోరాడినం, ఎన్ని హక్కులు సాధించి పెట్టినం, మూడు అణాల కూలిని మూడు వందలు చేసినం… కాని ఇమానం లేకుంటా పోయింది. కొత్త పోరగాండ్లు బాయిల పనికి వచ్చిన తరువాత కన్ను మిన్ను కానుతలేరు. వందలకు వందలు పైసలు కన్పించే సరికి పెద్దంతరం చిన్నంతరం లేకుండా పోయింది. ఎగురుతాండ్లు ఎందాక ఎగురుతరో ఎగరినియ్‌… అయ్య అవ్వలకు తిండిపెట్టని పోరగాండ్లు మాయమాటలు చెప్పే వాళ్ళ వెంటపడి పోతాండ్లు…’’ అంటూ యూనియన్‌ నాయకులు రుసరుసలాడుతాండ్లు.

‘‘ఇట్లా ఇల్లీగల్‌ సమ్మెలు జరిగితే టార్గెట్‌ ఏమిస్తది?, బావులేమి నడుస్తయి? కంపెనీని మూసేసుకోవాల్సిందే’’ అంటూ మెనేజ్‌మెంటు తలలు పట్టుకున్నది.
‘‘ఈ పరిస్థితి ఇట్లా కొనసాగితే మేనేజ్‌మెంటుకే కాదు మీకు ప్రమాదమే’’ అంటూ మేనేజ్‌మెంట్‌, యూనియన్‌ నాయకులతో మంతనాలు జరిపింది. అటు కార్పొరేటు ఆఫీసులోను, హైద్రాబాద్‌లో చర్చలు సాగినవి….
1981ల జనవరిలో తమ యూనియన్ల కార్మికుల సమస్యలపై చట్టబద్ధంగా పోరాడుతాయి. ఇల్లీగల్‌ సమ్మెలకు తాము వ్యతిరేకం. కార్మికులు చేసే ఇల్లీగల్‌ సమ్మెలపై మేనేజ్‌మెంటు ఎటువంటి క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా తాము సహకరిస్తాం’’ అంటూ జాతీయ కార్మిక సంఘాలు ఒక ఒప్పందం చేసుకున్నవి.

జాతీయ కార్మిక సంఘాలను కట్టడి చేసి, పోరాడే కార్మికులను ఒంటరివాళ్ళను చేసిన మేనేజ్‌మెంటు ఇల్లీగల్‌ సమ్మెలను అణచటానికి సరికొత్త ఎత్తులు ఎత్తింది.
ఎప్పడిదో బ్రిటీష్‌ కాలం నాటి మస్టర్ల కోత చట్టం దుమ్ము దులిపి కార్మికుల మీద అమలు జరిపింది.

మందమర్రిలోని కళ్యాణిఖని 2 ఇంక్యయిన్‌ బావిలో ప్రమాదం జరిగి కార్మికుని కాలు నుజు నుజ్జు అయి హస్పటల్‌ పాలైతే.. గాయం మానక ముందు… డాక్టర్‌ ఫిట్‌నెస్‌ లెటర్‌ చేతికిచ్చి పోయి డ్యూటీ చేసుకోమ్మని గెదిమాడు. అయ్యా నా గాయం మానలే… కాలు క్రింద పెట్టనిస్తలేదు… ఇటువంటి పరిస్థితిలో నేను బాయిలకు దిగి తట్టెట్ల మోస్తా అని ఆ కార్మికుడు నిలదీస్తే డాక్టర్‌ కోపానికి వచ్చి పోలీసులను పిలిపించి బయిటికి గెంటెయించిండు..
ఆ కార్మికుడు చేసేదేమిలేక బాయి మీదికి పోయి తన బాధంతా తోటి కార్మికులకు చెప్పుకున్నడు. మొకాలు వాసిపోయి, రుసరుసలాడుతున్న తన గాయాన్ని ఎత్తి చూయించిండు…
అది చూసిన తోటి కార్మికులు కోపంతో ఉడికి పోయిండ్లు… ‘‘ఇవ్వాళ ఈయనకు జరిగిందే రేపు మనకు జరుగుద్దీ’ అంటూ కోపానికి వచ్చిండ్లు..
బాయి బందుపెట్టి అందరికి అందరూ ఊరేగింపుగా పోయి డాక్టర్‌ను నిలదీసిండ్లు….
మరునాడు మేనేజుమెంటు ‘‘ముందు అనుమతి లేకుండా నిన్నటి రోజున కార్మికులందరు ఇల్లీగల్‌గా సమ్మె చేసిండ్లు కాబట్టి సమ్మె చేసిన కార్మికులందరి జీతాల్లో కోత విధిస్తూ ఎనిమిది మస్టర్ల కోత చట్టం అమలు చేస్తున్నట్టుగా బావి మీద నోటీసు వేసింది…

అదిగో అట్లా మొదలైంది మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా సమ్మె పోరాటం….
కెకె2లో సమ్మె మొదలై వారం రోజులైంది. కాని మేనేజుమెంటుకు కాని, యూనియన్‌ నాయకులకు కాని ఉలుకు పలుకు లేదు….
‘ఇష్టం వచ్చినట్టు సమ్మెలు చేస్తే మేనేజుమెంటు కోత చట్టం పెట్టకుంటే ముద్దు పెట్టుకుంటదా?’’ అంటూ యూనియన్‌ నాయకులు మేనేజుమెంటుకు వంతపాడిండ్లు…
కేకే2 బావి కాంపౌండ్‌లోని యూకలిప్టస్‌ చెట్లక్రింద కార్మికులు సమావేశమైండ్లు… వాళ్ళ మనసుల్లాగే మే నెల ఎండ మండిపోతాంది. సమ్మె మొదలై వారమైనా మేనేజుమెంటు చప్పుడు చేస్తలేదు… ఎన్ని రోజులు సమ్మె చేస్తరో చేసుకోండ్లీ అన్నట్టుగా ఉంటుంది..’’ అంటూ ఓ కార్మికుడు ఆవేశపడ్డాడు…
‘‘మేనేజుమెంటు ఎత్తుగడ చూస్తే… ఎక్కడోకాడ మస్టర్ల కోత చట్టం అమలు జరుపాలనే పట్టుదల కన్పిస్తుంది. ఆ తర్వాత ఆబూచి చూపి మిగతా బావి కార్మికులను భయపెట్టాలన్నది వాళ్ళ ప్లాన్‌.’’ అంటూ యువ కార్మికుడొకరు బొమ్మలు ముడివడగా ఆలోచన చేసిండు.
‘‘మరైతే ఏం చేద్దాం?’’
‘‘మేనేజుమెంటు మనల్ని ఒంటరి చేసి దెబ్బ కొట్టాలని చూస్తే మనం మరింత మంది కార్మికులను పోరాటంలో సమీకరించాలి.’’ అంటూ మరో కార్మికుడు సూచన చేసిండు….
‘‘ఇదేందన్న బాయి బందు అయ్యిందంటే ఆగమేఘాల మీద మొసపోసుకుంటూ ఉరికివచ్చే యూనియన్‌ నాయకులు ఎవ్వరు బాయి మీదికి వస్తలేరు’’ మరొకరు అనుమానపడ్డారు…
‘‘మన బాయి మీదికి వస్తలేరు కాని అన్ని బావుల మీదికి మనకంటే ముందే పోతాండ్లు. అది కేకే2 బాయి కార్మికుల సమస్య అంటా.. మీకుసంబంధం లేదంటూ.. వాళ్ళు మా మాట వినలేదు కాబట్టి మేనేజుమెంటు కోత చట్టం పెట్టింది అంటూ తప్పుడు ప్రచారం చేస్తాండ్లు…’’
‘‘అట్లెట్లయితది.. ఇవ్వాళ మన మీద కోత చట్టం అమలైతే, రేపు ఇంకో బాయి మీద ఇంకేదో కారణం చెప్పి మేనేజుమెంటు అమలు చెయ్యదా?’’
‘‘లీడర్లకు మైండ్‌ దొబ్బింది’’
అటువంటి సమయంలో ఒక రోజు మా బావిమీద మొదటి షిప్టు కార్మికులు మ్యాన్‌ ఆఫీసు ముందున్న ఆవరణలో గుమికూడిరడ్లు… వారిని ఉద్దేశించి ఏఐటియుసి పిట్‌ సెక్రటరీ ఏదో మాట్లాడుతున్నాడు కాని మ్యాన్‌వేలో ఉన్న నాకు ఆ మాటలేమి విన్పించటం లేదు. అంత గోల గోలగా అరుస్తున్నారు.

చూస్తుండగానే లొల్లి పెద్దదైంది….. కాసేపటికి పిట్‌ సెక్రటరీ రాజం, ఆయన అనుచరులు పడుతు లేస్తూ పరుగులు పెట్టడం కన్పించింది.
ఆ దృశ్యం చూసి నాకు ఆశ్చర్యం కల్గింది. ఎందుకంటే నేను ఎరిగిన కానుంచి బావి మీద రాజం ఏఐటియుసి డెలిగేటుగా మకుటంలేని మహరాజు, బావి మేనేజర్‌ కూడా ఆయన మాట తీసివెయ్యడు. పేరుకు మైనింగ్‌ సర్ధార్‌ అయినా ఆయన ఎప్పడు బావిలోకి దిగి పని చేసింది లేదు. కాని మస్టర్ల మాత్రం బరాబరి….. బావుల మీద ఏదైనా సమస్య వచ్చి కార్మికులు పనులు బందు చేసే పరిస్థితి వస్తేమాత్రం ప్రత్యక్షమయ్యేవాడు… కార్మికులను సర్దుబాటు చేసి సమ్మెలు జరుగకుండా చూసేవాడు. మేనేజుమెంటుకు ఇటువంటి వాళ్ళ అవసరం ఉంటుంది కాబట్టి, ఆయన మస్టర్‌ పడి పనిచేసినా, చెయ్యకున్న మేనేజర్‌ పెద్దగా పట్టించుకోడు.. ఆయన పెద్దగా చదువుకున్నావాడు ఏం కాదు… ఏడో ఎనిమిదో చదువుకున్నాడు.. దాంతో ఆపై ప్రమోషన్‌కు సరిపోయే సర్టిఫికట్స్‌ లేకపోవటం వలన మైనింగ్‌ సర్దార్‌ వరకు వచ్చి ఆగిపోయిండు. లేకుంటే ఎప్పుడో హెడ్డ్‌ ఓవర్‌ మెన్‌ అయిపోయ్యేవాడు. స్థానిక యూనియన్‌ బ్రాంచి సెక్రటరీకి నమ్మిన బంటు.. బావి మీద ఏ కార్మికునికైనా ఏదైన పని బడితే బ్రాంచి సెక్రటరీ ద్వారా పనులు చేసి పెడతాడు. అందుకు తృణమో పణమో తీసుకుంటాడన్నది వేరే సంగతి.

యూనియన్‌ మీటింగ్‌లప్పుడు, ప్రతి మేడేలప్పుడో, ఎర్రటి చొక్క వేసుకొని ఆయన చేసే హడావిడీ అంత ఇంత ఉండదు.. కమ్యూనిజం గురించి ఆయనకు ఏం తెలుసో నాకైతే తెలియదు కాని ఎర్రజెండా యూనియన్‌ అంటే ఒక నమ్మకం మాత్రం ఉండేది. అంతో ఇంతో కార్మికులకు అందుబాటులో ఉండి ఆపద సమయంలో పనులు చేసిపెట్టే ఎర్రజెండా యూనియన్‌ అంటే కార్మికులకు కూడా నమ్మకం ఉండేది. ఏ చెట్టులేని కాడ ఆముద వృక్షమే మహావృక్షం అన్నట్టుగా, కార్మికుల ఆదరణ కూడా ఎర్రజెండా యూనియన్‌కే ఎక్కువగా ఉండేది. ఎందుకంటే మిగతా కార్మిక సంఘాల దగ్గరికి కార్మికుడు ఏదైనా పనిబడిపోతే, మార్కెటులో సరుకులకు ధరలు నిర్ణయించినట్టు క్వార్టర్‌ ఇప్పిస్తే ఇంత, ట్రాన్స్‌ఫర్‌ చేయిస్తే ఇంత అని రేట్లు నిర్ణయించి ముక్కు పిండి వసూలు చేసేవాళ్ళు.

అటువంటి ఎదురులేని నాయకుడు అలా పరుగులు పెట్టడం ఆశ్చర్యం అన్పించింది. కార్మికులు మస్టర్లు పడి కూడా బాయిలకు దిగకుండా రిటర్న్‌ పోవటం కన్పించింది. ఏం జరిగిందో తెలుసుకోవాలన్న ఆతృత కల్గింది. అంతవరదాక కార్మికులతో మాట్లాడుతూ కన్పించిన సమ్మిరెడ్డి, ఇటువైపు రావటం గమనించి పిలిచాను…
అతను తన సహజమైన చిర్నవ్వుతో నవ్వుకుంటూ ‘‘ఏం సార్‌’’ అంటూ దగ్గరికి వచ్చిండు..
‘‘ఏమైంది’’ అన్నాను
‘‘బాయి బందు’’ అన్నాడు ఉత్సాహంగా
‘‘ఎందుకు?’’
‘‘ఎందుకేమిటి సార్‌, కెకే2 కార్మికులు మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నరు కదా! వాళ్ళకు మద్ధతుగా మేం సమ్మె చేస్తున్నాం’’ అన్నాడు నింపాదిగా….
‘‘మరి పిట్‌ సెక్రటరీ ఎందుకు అలా పరిగెట్టిండు?’’ అన్నాను ఆసక్తిగా
‘‘అదా సార్‌’’ అంటూ కండ్లు మూతలు పడుతాంటే పెద్దగా నవ్వి చెప్పసాగిండు.
‘‘కేకే2 కార్మికుల సమ్మెతో మనకేం సంబంధం అది వాళ్ళ సమస్య. మన మీద అమలు జరిపినప్పుడు కదా మనం సమ్మె చెయ్యాల్సింది. అయినా వాళ్ళు మా మాట వినలేదు… మా మాట వింటే కంపెనోడికి కోత చట్టం పెట్టే ‘దమ్ముండేదా! యూనియన్‌ మాట వినలేదు కాబట్టి వాళ్ళ బాధ వాళ్ళు పడనియ్‌…. మనకెందుకు అంటూ ఏదో ఏదో చెప్పుకొచ్చిండు.’’
‘‘అందుకే గెదిమిండ్లా?’’ అన్నాను ఆశ్చర్యంగా
‘‘అదృష్టం బాగుండి పారిపోయిండు కాని లేకుంటే నాల్గు తన్నేవాళ్ళం’’ అన్నాడు ఆవేశంగా..

మస్టర్ల కోత చట్టంకు వ్యతిరేకంగా సమ్మె కేకే2 బావిలో మొదలై ఇతర ఏరియాలకు పాకి యాభై ఆరు రోజులు సాగింది. చివరికి మేనేజుమెంటు కోతచట్టంను ఉపసంహరించుకుంది.

ఆ సమ్మెను విఫలం చేయటానికి మేనేజుమెంటు చాలా ప్రయత్నాలు చేసింది. జాతీయ కార్మిక సంఘాలతో సమ్మెకు వ్యతిరేకంగా మీటింగులు పెట్టి ప్రచారం చేయించింది. ప్రభుత్వం పెద్ద సంఖ్యలో సాయుధ బలగాలను మోహరించింది. పోలీసులు రాత్రులకు రాత్రులు ఇండ్లమీద దాడులు చేస్తూ అందిన వారిని అందినట్టు సమ్మెకారులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టిండ్లు… అక్రమ కేసులు పెట్టి చాలామందిని నిజామాబాద్‌, వరంగల్‌ జైల్లకు పంపిండ్లు…

బాయి బందైన కాన్నుంచి సమ్మె ముగిసేంతవరకు ఆ సమ్మె కాలంలో సమ్మిరెడ్డి మళ్ళీ నాకు కన్పించలేదు… తరుచు పోలీసులు బావి మీదికి వచ్చి సమ్మిరెడ్డి కోసం ఇంక్వైరీ చేసి పోయేవాళ్ళు…
సమ్మె విజయవంతంగా ముగిసిన తరువాతే సమ్మిరెడ్డి మళ్ళీ బాయి మీద కన్పించిండు.

**
జూన్‌ 10, 11, 1982 సింగరేణి కార్మిక సమాఖ్య మొదటి మహసభ గోదావరిఖనిలో జరిగింది. ఆ మహాసభలో సికాస సెంట్రల్‌ బాడీలో సమ్మిరెడ్డి కోశాధికారిగా ఎన్నికైండు.
గతంలోనైతే కార్మికులను అదిరించో, బెదిరించో పనులు చేయించేవాళ్ళు, కార్మిక సంఘాల నాయకులు కూడా కార్మికుల సమస్యలు పట్టించుకునేవాళ్ళు కాదు. కాని సికాస ఏర్పడిన తరువాత పరిస్థితులు మారినవి. కార్మికుల్లో చైతన్యం వచ్చి సమస్యలపై మేనేజుమెంటు నిలదీస్తున్నారు… అట్లా కూడా వినకుంటే పనులు బందు పెట్టి సమ్మెలు చేస్తున్నరు…

ఆ విధంగా ఆ రోజుల్లో ప్రతిరోజు ఏదో ఒక బావి మీద సమ్మె జరుగని రోజంటూ ఉండేది కాదు అంటే అతిశయోక్తి కాదు. సమ్మిరెడ్డి సికాస బాధ్యతలోకిపోయిన తరువాత అతనికి క్షణం తీరిక లేకుండా పోయింది. ప్రతిరోజు ఏదో ఒక బావి మీదికి పోవటం కార్మికులతో కలిసి వారి సమస్యలపై మాట్లాడటం ఎక్కువైంది. దాంతో ఆయన డ్యూటీకి గైరాజర్లు ఎక్కువైనవి. నెలలో సగం రోజులు కూడా డ్యూటీ సక్రమంగా చేసేవాడు కాదు…

ఇదే విషయం ఒకసారి ఆయన్ని అడిగాను. ‘‘ఏందయ్య డ్యూటీలు సక్రమంగా చేసుకుంటేనే బ్రతకలేని రోజుల్లో నువ్వేంది నెలకు సగం మస్టర్లు కూడా చెయ్యటం లేదు’’ అని….
అతను చిన్నగా నవ్వి ‘‘అందరం మంచిగా బ్రతకాలనే మా ఆరాటం… సమ్మె చేయటం కార్మికులకు ఏమైనా సరదానా? జీతాలు నష్టపోతారని తెలియదా! మేనేజుమెంటు తన పని తాను సక్రమంగా రూల్‌ ప్రకారం చేస్తే చాలా సమ్మెలను నివారించవచ్చు… అట్లా జరుగటం లేదు కాబట్టి సమ్మెలు అనివార్యమౌతానయి’’ అన్నాడు.
‘‘ఎవ్వరు ఎట్లా పోతే నీకెందయ్యా? నీ పని నువ్వు చూసుకో’’ అన్నాను ఉండబట్టలేక
‘‘ఇంత వరదాక ఎవ్వరికి వాళ్ళం అట్లా అనుకోబట్టే మేనేజుమెంటు ఆటలన్ని సాగినవి. ఇక ముందు అలా జరుగదు’’ అన్నాడు ధృడంగా…
‘‘పిచ్చి బాగా ముదిరింది’ అనుకొని ఇంకేమి మాట్లాడలేకపోయాను.

అప్పటికి ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లోని బొగ్గు గనుల ప్రాంతంలో సికాస బలంగా వెళ్ళూనుక పోయింది. ఖమ్మం జిల్లాలోని కొత్తగూడెం ఏరియాలో సికాస ప్రాబల్యం అంతగా లేదు. ఎందుకంటే ఆ ప్రాంతంలో ఇంకా ఉభయ కమ్యూనిస్టు పార్టీల అనుబంధ సంఘాల ప్రాబల్యం ఎక్కువగా ఉంది.

సికాసను ఖమ్మం ప్రాంతంలో విస్తరించాలనే లక్ష్యంతో సికాస కొత్తగూడెం ఏరియాలో నవంబర్‌ 12, 13, 1983 తేదీలలో తన రెండవ మహసభను నిర్వహించింది. ఆ సభలోను సమ్మిరెడ్డి రెండవ సారి సికాస సెంట్రల్‌ బాడిలోకి ఎన్నుకోబడ్డాడు..
సింగరేణి కార్మికుల్లో ఎక్కువశాతం మంది నిరక్షరాస్యులు. కొద్దిమందికి రాత పూత తెలిసినా ట్రేడ్‌ యూనియన్‌ నడిపించే సమర్థత ఉండేది కాదు. కాని పోరాటాల్లో ముందుండే వాళ్ళు. సమ్మెలను సమర్థవంతంగా నడిపించేవాళ్ళు.

ఈ నేపథ్యంలోనే సికాసను ఒక లీగల్‌ కార్మిక సంఘంగా సమర్థవంతంగా పని చెయ్యటానికి, అంకితభావం ఉండి కార్మిక చట్టాల పట్ల ఒక అవగాహన ఉండి, మేనేజుమెంటుతో సంప్రదింపులు జరిపే నైపుణ్యం కల్గి ఉండి, అవసరమైతే కన్సిలేషన్‌కు పోవటం వంటి చట్టపరమైన పోరాటాలు చేసే నైపుణ్యం కల్గిన వ్యక్తి సికాస అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టితే సమర్థవంతంగా పనిచేస్తుందని సభ భావించింది.
ఆ విధంగా ‘విమల్‌’ను సికాస అధ్యక్షుడిగా రెండవ మహాసభలో ఎన్నుకున్నారు. ఆయన ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి, న్యాయశాస్త్రం చదివినవాడు. లాయరుగా పని చేసిన అనుభవం ఉంది. గతంలో ఆయన రాడికల్‌ యువజన సంఘం అధ్యక్షుడుగా పనిచేసిన అనుభవం ఉంది. అంకితభావం ఉన్న ఉద్యమకారుడు. అయితే గతంలో ఆయనకు కార్మికరంగంలో పనిచేసిన అనుభవంలేదు. అయితేనేమి ఆచరణలో అన్ని నేర్చుకోవచ్చు అన్న ఆత్మ విశ్వాసం ఉన్న వ్యక్తి.

ఎర్రగా బక్కగా పొడుగ్గా గుండ్రటి మొఖంతో చురుకైన చూపులతో ఆత్మ విశ్వాసంతో చూడగానే చదువుకున్నవాడు అన్న గౌరవభావం కల్గేది. కొత్త పాత అన్న తేడా లేకుండా అందరితో ఇట్టే కలిసిపోయేవాడు. ఆయనతో మనకు ఒక్కసారి పరిచయం కల్గితే అంత తేలిగ్గా మరిచిపోలేము.

సికాస రెండవ మహసభ తరువాత ప్రభుత్వం సికాసపై అప్రకటిత నిషేధం అమలు జరిపింది. బావుల మీద కార్మికుల సమస్యలపై ముందు నిలబడి వారిని సికాసలో తిరుగుతున్నారని అనుమానం ఉన్నవారిని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టడం, దొంగ కేసులు పెట్టి జైలు పాలు చేయడం ఎక్కువైంది. ఇక సమ్మెల సందర్భంలోనైతే పోలీసులకు పట్ట పగ్గాలుండేవి కాదు. బావుల మీద క్యాంపులు వేసి తుపాకులు ఎక్కుపెట్టి, బావుల్లోకి దిగకుంటే కాల్చిపారేస్తాం అంటూ బెదిరించి బావులను నడిపించిన సందర్భాలున్నాయి. సికాస సభలకు సమావేశాలకు పర్మిషన్‌ ఇచ్చేవాళ్ళుకాదు… బావుల మీద కార్మికులను కలిసి మాట్లాడాలన్నా కష్టమయ్యేది. బావుల మీద పోలీసుల జోక్యం అంతగా పెరిగిపోయింది.

ఇంత నిర్భంధ పరిస్థితిలో కూడా విమల్‌ చంకలో కాగితల కట్ట, సంకకు ఒక సంచి వేసుకొని ఇటు గోలెటి నుండి అటు మణుగూర్‌ వరకు కలియ తిరిగే వాడు. ఎక్కడికి పోయిన కార్మికుల గుడిసెలే ఆయన నివాసం…. భయమన్నదే లేకుండా ఉన్నది ఉన్నట్టుగా ముక్కు సూటిగా చట్టబద్ధంగా మాట్లాడే అతనంటే పోలీసులకు కూడా భయమే. ఇక బావి మేనేజర్లు అయితే ఏదైన సమస్యపై ఆయన మాట్లాడటానికి వస్తాండు అంటే ఏదో పని చెప్పుకొని తప్పించుకు తిర్గేవారు… తప్పని సరి పరిస్థితిలో అతనితో మాట్లాడాల్సి వస్తే మాత్రం.. ‘సమస్యను కార్పొరేటు ఆఫీసుకు వ్రాసాం… అక్కడి నుంచి ఏదైనా సమాధానం వస్తే కాని మేం ఏమి చేయ్యలేం’ అంటూ మొఖం వ్రేలాడ వేసేవారు….

విమల్‌ ఎటుపోతే అటు పోలీసులు నీడల్లా వెంటాడేవాళ్ళు. అతని జోలికి పోకున్నా, అతని వెంట తిరిగేవారిని పట్టుకొని వేధించేవాళ్ళు, భయపెట్టేవాళ్ళు. అయినా అతను ఎక్కడికి పోతే అక్కడ కార్మికులు గుంపులు గుంపులుగా గుమికూడేవాళ్ళు.. అది చూసి పోలీసులకు పిచ్చెత్తి పోయేది.
ఇంత చేసిన సికాస నాయకత్వంలో అనేక సమ్మెలు జరిగినవి. పోలీసులు అక్రమంగా తమ కార్యకర్తలను అరెస్టు చేసినప్పుడు పత్రికా సమావేశమో, ప్రకటన ఇవ్వడానికో ఆయన తరచు నా దగ్గరికి వచ్చేవాడు…
‘‘సికాస కార్మికుల సమస్యలపై పోరాడే ఒక లీగల్‌ సంఘం. అది కార్మికులను కలుస్తుంది. వారితో మాట్లాడుతుంది. వారి కోసం వారి మధ్య పనిచేస్తుంది. సికాస ఏదీ చేసినా లీగల్‌గానే చేస్తుంది. మేం ఏమైనా చట్ట వ్యతిరేక పనులు చేస్తే అప్పుడు చర్యలు తీసుకోవచ్చు. కాని చట్ట ప్రకారం పోరాడుతున్న మా కార్యకర్తలను అప్రజాస్వామికంగా అక్రమంగా అరెస్టు చేయటం ఇదేం న్యాయం, ఇదేమి ప్రజాస్వామ్యం’’ అంటూ ప్రశ్నించేవాడు….

సికాస మందమర్రి డివిజన్‌లో ఇల్లు కిరాయికి తీసుకొని అందులో యూనియన్‌ ఆఫీసు పెట్టాలని చూసింది. కాని ఈలోపు ఆ విషయం తెలిసి పోలీసులు ఇంటాయన్ని పిలిచి బెదిరించే సరికి, ఆయన ఇల్లు కిరాయికి ఇవ్వటానికి నిరాకరించిండు.. ఇక ఇట్లయితే లాభంలేదని, శ్రీరాంపూర్‌లో కంపెనీకి చెందిన ఖాళీ స్థలంలో ఒక గుడిసె వేసి ఆఫీసు తెరిచిండ్లు.. ఆఫీసు మీద పోలీసులు దాడి చేసి ఆఫీసులో ఉన్న సామాన్లన్నీ ఎత్తుక పోయిండ్లు. ఆఫీసులో ఉన్న యువకున్ని కూడా పట్టుక పోయిండ్లు.

కొత్తగూడెం ఏరియాలోని మణుగూర్‌లో ఏర్పాటు చేసిన సికాస ఆఫీసు మాత్రం కొన్ని నెలల వరకు బాగానే పనిచేసింది. అటు తరువాత నిర్బంధం మరింత తీవ్రం కావడంతో చివరికి అక్కడ కూడా ఆఫీసు నడువలేదు.

తీవ్ర నిర్భంధాల మధ్య అరెస్టుల మధ్య సికాస అనేక సమ్మె పోరాటాలు నిర్వహించింది. వీటన్నింటిలోకి ప్రధానమైంది. 1984లో మేనేజుమెంటు మరోసారి మస్టర్ల కోత చట్టం అమలు జరుపాలని చూసింది. దానికి వ్యతిరేకంగా సికాస ఇచ్చిన సమ్మె పోరాటంలో అనివార్యంగానైనా మిగతా జాతీయ కార్మిక సంఘాలు కలిసిరాక తప్పలేదు. లేకుంటే కార్మికుల్లో తాము మరింత పలుచనైపోతమని బావించి సమ్మెలో కలిసి వచ్చిండ్లు. సమ్మె సింగరేణి వ్యాపితంగా జరిగింది. దాంతో మేనేజుమెంటు మస్టర్‌ కోత చట్టంను మరోసారి ఉపసంహరించుకోక తప్పలేదు..

సికాస రెండవ మహాసభలో సమ్మిరెడ్డి సెంట్రల్‌ కమిటీలో ఎన్నుకోబడి ఆదిలాబాద్‌ జిల్లా బొగ్గుగనుల బాధ్యతలు తీసుకున్నారు. బెల్లంపల్లి నుండి ఇటు శ్రీరాంపూర్‌లోని బొగ్గు గనులు తిరుగుతూ బాధ్యతలు నిర్వహించేవాడు. దాంతో ఆయన డ్యూటీలకు గైర్హాజర్‌ పెరిగింది. వారానికి ఒకటి రెండు మస్టర్లు కూడా చేసేవాడు కాదు… తరచు ఆయన కోసం పోలీసులు వచ్చి అడిగిపోయేవాళ్ళు. రాను రాను ఆయన డ్యూటికి రావటమే బందై పోయింది. ఏమైపోయిండో అని తెలుసుకోవాలని ఆసక్తితో ఒకరోజు ఆయన మిత్రుడైన ఒక కార్మికున్ని అడిగాను. సమ్మిరెడ్డి చాలా రోజుల నుండి డ్యూటీలకు రావటం లేదు ఏమైంది’’ అని…
ఆయన భారంగా నిట్టూర్చి ‘‘పూర్తిగా అందులోనే మునిగిపోయిండు’’ అన్నాడు.
‘‘అందులో అంటే?’’
‘‘సికాసలో పూర్తికాలం పని చేస్తాండు’’
‘‘పెండ్లాం పిల్లలు లేరా’?’
‘‘భార్య సునంద ఒక కూతురు ఒక కొడుకున్నడు’’
‘‘మరి వారి పరిస్థితేంది?’’
‘‘ఏముంటది సార్‌, మొన్నటిదాక మళ్ళీ తిరిగి వస్తాడేమోనని చూసింది కాని ఏం లాభం ఆయన చావో రేవో ఉద్యమమే అని నిండా మునిగి పోయిండు… అక్క చూసి చూసి మొన్ననే ఇక్కడి నుంచి వెళ్ళిపోయి వాళ్ళ ఊళ్ళనే కూలో నాలో చేసుకొని బ్రతుకుతాంది’’ అన్నాడు.
నా కండ్లు చెమర్చాయి.

(మిగతా భాగం వచ్చే సంచికలో…)

రచయిత. తెలుగు సాహిత్యంలో పి.చందు గా సుపరిచితుడు. అసలు పేరు ఊరుగొండ యాదగిరి. వరంగల్ ఉర్సులో 1954 సెప్టెంబరు 24 న వీరమ్మ, మల్లయ్య దంపతులకు జన్మించారు. ఎల్.బి. కాలేజీలో బి.కాం చదివారు. సింగరేణిలో ఉద్యోగ విరమణ చేశారు. "శేషగిరి", "నల్లమల", "భూదేవి", "నెత్తుటిధార", "శృతి", "బొగ్గులు" తదితర పదిహేను నవలలు రాశారు. సుమారు వంద కథలు రాసి "భూ నిర్వాసితులు", "జులుం", "గుమ్మన్ ఎగ్లాస్ పూర్ గ్రామస్థుడు", "సమ్మె కథలు" కథా సంపుటాలు ప్రచురించారు.

2 thoughts on “వీరుడు-3

Leave a Reply