విసర్జన

ఈ దేశం చాలా సులభమైపోయింది విసర్జనకు!
ఇక్కడి మనుషులు చాలా చవకైపోయారు క్షమాపణకు!!

ఇక్కడ అగ్ర తలకాయలకు వెర్రి లేస్తే దళితుల్ని నగ్నంగా ఊరేగిస్తారు
అగ్ర యవ్వనాలకు ఆకలేస్తే దళిత ఆడపిల్లల్ని ఇండ్లలోంచి లాక్కొచ్చి నడిబజార్లో సామూహిక అత్యాచారాలు చేస్తారు
అగ్ర కండలకు కావరాలొస్తే దళిత యువకుల్ని చెట్టుకు కట్టేసి కొడతారు
అగ్ర బలుపు శాంతించకపోతే దళితుల్ని చెప్పులతో కొడతారు సజీవ దహనాలు చేస్తారు
అగ్ర అహంకారంతో కళ్ళు మూసుకుపోతే దళితుల ముఖాన మూత్ర విసర్జన చేస్తారు!

ఇక గిరిజనులంటే ఆదివాసీలంటే సంపద సంచులు
అడవుల్లో జొరబడి పోడు వ్యవసాయాన్ని తొక్కేస్తారు
అడవి జంతువుల మీద పడి కాయుష్ గా చంపి తింటారు
అడవి లాంటి ఆడపిల్లల మీద పడి దొర్లి పోతారు
కలప స్మగ్లింగ్ చేస్తారు ఖనిజాలు తవ్వుకుంటారు
భూములపై కన్నేస్తారు గూడాలను బూడిద చేస్తారు
అడవి సర్వనాశనమయ్యేదాకా అగ్ర భాగాలు దోచుకుంటూనే ఉంటారు!

ఏది చేసినా చెల్లుతుంది
పోలీస్ కేసులు వీగిపోతాయి
న్యాయస్థాన తీర్పులు ఆగిపోతాయి
పైస పదవులు ఇస్తుంది
పలుకుబడి చప్పట్లనిస్తుంది
అధికారం అగ్ర ఇంటి తోరణమై దేశాన్ని స్మశానౕం చేస్తుంది
కీర్తి శిఖరాలు బాధితుల వీపులపై నిలబడి తాము సృష్టించిన మసిని నిక్కి నిక్కి చూస్తాయి!

అప్పుడప్పుడూ కామెడీ సినిమాలు
ఓట్లు లేదా ఏవైనా పాట్లు వస్తే
సృజనాత్మక క్షమాపణలు…
ఏడ్వొచ్చు విదేశాలకు పారిపోవచ్చు కాళ్ళు కడగొచ్చు
కాస్త సందు దొరికితే బెదిరించి ఉల్టా నేరం మోపొచ్చు
కాలం కండ్లు మూసి నిశ్శబ్దంగా చంపెయ్యొచ్చు
అన్యాయమని నిరసనలు చేస్తే లాఠీ చార్జీ చేయించొచ్చు
పీడితుల టికానా పీకేయించొచ్చు
మీడియా భుజాల మీద కూర్చోవచ్చు!

ఇంతకీ కోట్ల మంది ప్రజలేం చేస్తున్నారిక్కడ??
ఏడుస్తున్నారు
కళ్ళు తుడుచుకుంటున్నారు
అధికార ప్రభంజనాలకు భయపడుతున్నారు
అగ్ర పార్టీలకు దండాలు పెడుతున్నారు
శాపనార్థాలు పెట్టుకుంటూ చచ్చేదాకా ఎదురు చూస్తున్నారు…
తమ బతుకులను భక్షించినా భరిస్తున్నారు
తమపై విసర్జించినా ఊరుకుంటున్నారు
అగ్రుల్ని విసర్జించే రోజు కొరకు వేచి ఉంటున్నారు!

ఈ దేశం కుతకుతా ఉడుకుతోంది ప్రపంచ తలంపై!
ఇక్కడి మనుషులు సతమతమవుతున్నారు అగ్ర మత పడగ విముక్తికై !!

పుట్టింది జనగామ జిల్లా లింగాల ఘన్పూర్‌ మండలం నెల్లుట్ల. ప్రభుత్వ ఉపాధ్యాయురాలు. ఎం.ఎస్సీ., ఎం. ఏ. బి.ఎడ్. చదివారు. పిహెచ్‌డి చేస్తూనే (భౌతిక శాస్త్రం) స్కూల్ అసిస్టెంట్ గా పని చేస్తున్నారు. ఇరవయేళ్లుగా డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ లో పని చేస్తున్నారు. కవిత్వం చదవడం, రాయడం అభిరుచి. సమాజంలో ప్రగతిశీల భావజాల వ్యాప్తికి కృషి. పీడన లేని నూతన సమాజం ఆవిర్భవించాలని ఆకాంక్ష. బాలికలు, స్త్రీల సమస్యల పట్ల అవగాహకు కృషి చేస్తున్నారు. మానవీయత, స్నేహపూర్వకమైన మానవ సంబంధాలు నెలకొనాలనే అభిలాష.

Leave a Reply