విష వివక్షలు – పాయిదేర్ల పాపాలు

అయ్యా, సారూ…
రెక్కడితేనే బుక్కాడని బుడిగ జంగం టేకు లచ్చిమిని
కూలిగ్గూడ పిలువ నోసని గులాపును
ఆకలి గంపెత్తుకొని ఆకు పురుగునై
అలివైన అడివి పల్లెలు తిరుగుతూ
”సూదులు, పిన్నీసులు, పోడరి, కాటిక డబ్బీలమ్మో ”
అని నెత్తిన నోరుబెట్టుకొని అమ్మే
సంక జోలె దుకునం సంచారిని


మందేసి మదమెక్కి యెదకొచ్చిన ఎద్దుల కావురాలు
గద్దలోలె గావుబట్టి గత్తరి జేసి
నా మాన ప్రాణాల్ని మట్టి జేసినయి
మా అడుగు, బడుగు ఆడోల్ల హత్యలు, అత్యాచారాలు
గాలిల గర్క పోసలు, మన్ను మడ్తల్ల మౌనంగ మాసిపోతయి


గివి నిత్తెం జరిగే నిజాలని సత్తెంగ జెప్తున్న
వీటి మీద ఏ మీడియా కాగడ మినుకుమనది
ఏ వార్తా పేపరు పెన్నుజేయది
ఏ నాయకుని నజరంటది
ఏ నాయకురాలి నరాలు నానయి
ఏ మంత్రికి మాట రాదు
ఏ రాజకీయాలు రంగమెక్కి రచ్చజెయ్యయి
ఏ గలాటాల గబ్బిలాలు వాలయి, పేలయి
ఏ కండ్లు, కొలుముల కొవ్వొత్తులు గావు


మా సావులు, పుట్కలు పుట్టల సెదల్లు
పుడితేంది? గిడితేంది?
పుట్కల తలాలు, పుడితెల బలాలు వేరయినా
ఆడబిడ్డలమే గదా !
ఆకాశంల సగం సందమామలం గాకున్నా
బూతల్లి యెన్ను దన్నుకొని పుట్టిన బూమి బిడ్డలమే గదా !


ఎప్పుడన్న వొక్కసారి అందలాల ఆడామె
మాన ప్రాణాలు మసైతే…
మీడియా కోడి తెల్లారని కూతల కుతకుతలు
లోకమంతా సొమ్మసిల్లే శోకమైతది
భూమ్యాకాశాలు అశాంతులై, అల్లకల్లోలమై
తల్లకిందులై తల్లోలె తల్లడిల్లుతయి
నిద్రలేసిన నిప్పుల కుప్పయితయి తండ్రోలె
రోడ్ల రోదనలతో గల్లీలు ఢిల్లీలైతయి
బొబ్బలతో బోర్లబడే పార్లమెంటు
నిందితులను గంటల గాలిచ్చి బందీలను జేస్తరు
వారం దిగరుగక ముందే శిక్ష ఫాస్ట్ ఫాస్ట్
ఒక్క తూటాకు నాలుగు పేద పిట్టలు
ఖేల్ ఖతం
బగ్గుమనే అగ్గి గుండాలు సప్పున సల్లారే మంచుకొండలు
‘నిర్భయ’ చట్టం నీరైందని
‘దిశ’ చట్టాన్ని దింపి దింపుడుగల్లం ఆశ బెడ్తరు


మా హత్యాచారాల మీద ఏ న్యాయం నడిసిరాదు
ఏ వ్యవస్థ అవస్థ పడది – విష వివక్షలు పాయిదేర్ల పాపాలు
గవాయిలున్న సవాలక్షల కాసుల్లేని మా కేసులు
కోర్టు మూలల్ల మురిగిపోతుంటయి
ఆలిశమైన న్యాయాలు అక్కెరలేని సుట్టాలే
కంటికి కన్ను, పంటికి పన్ను పాబందా !
ఆడ జాతిని అణగ్గొట్టే మగ సెగలను ఎగదోసే
మందు, మాదకాల్ని, బూతు సినిమాల్ని
రోత సీరియల్లని, సెల్లు సెక్సుల్ని బందువెట్టి బొందబెట్టుండ్రి.

కవయిత్రి, కథా రచయిత్రి. పుట్టింది దామరంచె పల్లె, వరంగల్ జిల్లా. కాకతీయ యూనివర్సిటీ నుండి తెలుగు సాహిత్యంలో ఎం. ఏ, ఎం. ఫిల్ చేశారు. 'మట్టిపూల రచయిత్రుల వేదిక' వ్యవస్థాపక సభ్యురాలు. రచనలు: నల్లరేగటిసాల్లు (2006), సంగతి (తమిళ్‌ నుండి తెలుగు), కైతునకల దండెం (2008), అయ్యయ్యో దమ్మక్క (2009), చంద్రశ్రీ యాదిలో... (2013),
రాయక్క మాన్యం (2014). తెలంగాణా సెక్రటేరియట్ లో పని చేస్తున్నారు.

2 thoughts on “విష వివక్షలు – పాయిదేర్ల పాపాలు

  1. మనస్సు వెట్టి మస్తుగా రాసింది మా జూపాక సుభద్ర అక్క

Leave a Reply