విశ్వ విషవలయం

పదకొండు గంటల ఎండ అదరగొడుతున్నది. ఇల్లంతా రణగొణ ధ్వనితో చికాకుగా వుంది. మోహనక్కు ఆకలయితున్నది. ఆదివారమని టిఫిన్ సుత చెయ్యకుండా కూర్చున్నడు. ఇవ్వాళనే ఇల్లు సర్దుతున్నరు, ఇవ్వాళనే కూరగాయలకు పోతరు, అన్ని పన్లు ముందేసుకునుడు నిర్మలకు అలవాటు. అందుకని ముందే చెప్పిండు ఆదివారం చికెన్ వండమని. పదకొండయినా సడి సప్పుడు లేదు.

“వంటయ్యిందా… ఆదివారం అన్న పేరేగని… ఓ స్పెషల్ చెయ్యవు పాడు చెయ్యవు… నిన్ననే చెప్పిన చేస్తున్నవా ? గా టీవీ చూడకపోతే కొంపలంట్కపోతయా, వంటల అన్ని తగలబెట్టినవా లేదా ? అది చూడు ముందుగాల…” ఆక్రోశం, ఆగ్రహం అన్నీ కలిసి అసహనంగా చదువుతున్న పేపరణ మడతేసి విసురుగా కిందికి విసిరేసిండు మోహన్.

వంటింట్ల గాలిరాక ఉక్కపోతకు ఉక్కిరి బిక్కిరి అయితున్న నిర్మల ఒక్క నిమిషం ఉలిక్కి పడింది. ఎవర్నంటున్నడు ఈయన ! తననా ! కూతురు శ్రావ్యనా ? తనే వంట చేస్తోంది. కూతురేమో ఇల్లు సర్దుతూ టీవీ చూస్తున్నది.

“ఎవర్నిరా నువ్వంటున్నదీ ?” అక్కడే కూర్చోనున్న పార్వతమ్మ కొడుకుని చూసుకుంట అడిగింది.

“ఇంకెవర్నీ… నీ కోడల్ని… ఇవాళ చికెన్ వండమన్న. మసాలలు లేవంట… రేపు వండుతనంటే పొద్దున్న కోప్పడ్డ… ఇంతవార్దాకైతే వంట జాడలేదు.”

అతని మాటలకర్ధం తననే అని తెలిసినంక ఉక్కపోత ఇంకింత ఎక్కువై కోపంతోని వంటింట్ల నించి బైటికొచ్చింది. ఈలోపు హఠాత్తుగా టీవీలో బ్రేకింగ్ న్యూస్ అంటూ మ్యూజిక్ మొదలైంది.

“చైనా హాస్పిటల్స్ లో దగ్గు జలుబు జ్వరంతో వస్తున్న జనానికి వైద్యం చేస్తున్న డాక్టర్లలో అనారోగ్య లక్షణాలు…..”

అందులో విచిత్రం ఏవున్నది ? అదో బ్రేకింగ్ న్యూసా ? విసుక్కుంట తిరిగి పేపర్లు సర్దబోతున్న శ్రావ్య ప్రసారం అయితున్న టీవీ వార్తకు ఆశ్చర్యపోతూ నిలబడింది.

“సీనియర్ డాక్టర్ ఈ అనారోగ్య లక్షణాలు చూసి, ఇది వైరసకు సంబంధించిన రుగ్మత అంటున్నారు… అంటువ్యాధి లక్షణాలుగా నిర్ధారించుతున్నారు….”

“బాగుంది ఫ్లూని అంటువ్యాధనక ఇంకేమంటారు? కాసేపు రిమోటు ఇటియ్యి ఎంత సేపూ ఒక్కళ్ళే సూస్తే ఎట్ల ?”

కోపంగ గదిలోంచి బైటికొచ్చి అక్క చేతిలోని రిమోట్ లాక్కోబోయిండు సూర్య.

“నెలరోజుల క్రితమే ఈ వైరస్ గురించి హెచ్చరించిన డాక్కర్స్ ని నిర్బంధించిన ప్రభుత్వం. రోజురోజుకూ పెరుగుతున్న బాధితులు… పాఠశాలలు మూసివెయ్యాలని నిపుణుల సూచనకు అనుగుణంగా జనం రద్దీ ఎక్కువగా వుండే రైల్వేలూ, బడులూ, హోటళ్ళు, ప్రార్థనా స్థలాలూ లాంటివన్నీ మూసెయ్యాలని చైనా ప్రభుత్వం నిర్ణయించి అమలు పరుస్తోంది….”

వింటున్న అందరి కనుబొమ్మలు ముడిపడ్డాయి. తాము వింటున్న వార్తలు తమ జీవితాలకు తాళాలు వేస్తాయని ఆ క్షణం ఊహించి వుండరు.

“దీనికోసం బళ్ళు, గుళ్ళూ మూసెయ్యడం ఏంది? వైరస్ వల్ల రైల్వేల లాంటివి బందు పెడ్తరా!” సూర్య నోరెళ్ళబెట్టిండు.

“అగోగో చూడు డాక్టర్లు వైద్యం ఎట్ల చేస్తున్నరో! వాళ్ళ మాస్కులు చూడు…” పిల్లల అరుపులకు తన ఆవేశం తగ్గించుకుని టీవీకెళ్ళి చూసింది నిర్మల. నిజమే….

ఇప్పుడు ఆఫీసులు లేవు. వర్క్ ఫ్రం హోం అని చెప్పేసినయి ఆఫీసులన్నీ. ఇంటిల్లిపాదీ ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది లాక్ డౌన్ పేరుమీద ! –

టీవీలో గంట గంటకూ కరోనా వార్తలు! సెల్లులో కుప్పతెప్పలుగ కరోనా గురించిన వార్తలు. అవి నిజమైనవేనా, ఫేకా అన్నది అర్ధమైతలేదు.

చావులూ… పాజిటివ్… నెగెటివ్… లాక్ డౌన్… జనతా కర్ఫ్యూ …. రెడ్ జోన్… గ్రీన్ జోన్… అంటూ ప్రకటింపుల మధ్య బస్తీల్లో, ఊళ్ళలో ప్రయాణాలు కష్టతరమైంది. ఒకదానెన్క ఒకటి స్పీడ్ మార్పులు… ఇంట్లున్నోళ్ళు జరిగేది అర్థం చేసుకునే సరికే ఊరూ వాడా మూగపోయినయి.

అపార్ట్మెంట్ లిఫ్ట్లు, మాల్స్, సినిమా హాల్స్, చివరకు మందుల షాపులూ అన్నీ మూసిండ్రు. తర్వాత మందుల షాపులకు అనుమతిచ్చిండ్రు. మందులు గూడా పైరవీ చేసి తెచ్చుకోవాల్సి వస్తోంది. సూపర్ మార్కెట్లలో సామాన్ల, సరుకుల కొరత అన్న పుకార్ పుట్టుడు పాపం అయ్యింది. జనం ఒకర్ని మించి ఒకరు నెట్టుకుంటూ, తన్నుకుంటూ పోయి నిముషాల వ్యవధిలో సరుకు లూటీ చేసుడు టీవీలో చూపిస్తున్నరు. అదంత చూసిన నిర్మల వంటింట్ల డబ్బలల్ల ఏమేం పప్పులు ఉప్పులు ఉన్నయ్యోనని చెక్ చేసుకున్నది. అదివరకు అన్ని సరుకులు ఒక్కసారే తెప్పించుకోలేదు. వారం రోజులు బందు వుంటదేమోతీ… గంతలోకే లోకం మునిగేదేం లేదు గదా అని నిర్లక్ష్యం చేసింది. కానీ అమెరికాలో బంధువులతో మాట్లాడినప్పుడు వాళ్ళు కిరాణం సరుకులు దొరకక ఇబ్బందులు పడుతున్నారని తెలిసి ఆశ్చర్యపోయింది. ఇప్పుడేమో ఏ డబ్బాలో చూసినా కొద్ది కొద్ది సామానే కనిపిస్తోంటే ఆందోళన మొదలయ్యింది మనుసులో. తను అరవయ్యి ఏళ్ళకు దగ్గరగా వస్తోంది గానీ ఇటువంటి పరిస్థితి ఎన్నడూ చూడలేదు.

అందర్నీ ఇళ్ళనించి బైటికి రావద్దంటున్నారు. ఇంట్లోనైనా, బైటనైనా దూరం దూరం పాటించ మంటున్నరు. ఇరవయి వక్క రోజు గిట్ల ఇంట్ల కూర్చుంటే ఏం జరుగుతుంది? కంటికి కనపడని శత్రువును ఎరుర్కొనడానికి ఏ ఆయుధమో, మందో మాకో రెడీ చేసుకోవాలి గానీ మూసిన తలుపుల వెనుక సబ్బుతో చేతులు కుడుక్కుంటూ, ఒకళ్ళ కొకళ్ళు దూరం పాటిస్తూ ఎన్ని రోజులుండాలె ! ఏం చెయ్యాలి?

టీవీ చూస్తుంటే ప్రపంచ దేశాల్లో పిట్టల్లాగా రాలిపోతున్న ప్రజలు. కనిపించని ఈ శత్రువు దగ్గితే వస్తుందనీ, తుమ్మితే వస్తుందనీ, ముట్టుకుంటే వస్తుందనీ చెప్తు, జనమంతా ఇండ్లలో వుండి ఎవరికి వారు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నది ప్రభుత్వం.

అనుకోకుండా వచ్చిన ఈ విపత్తు అర్థం చేసుకునే లోపే లాక్ డౌన్ పెట్టిండ్రు. అందుకనే ఇంట్లకు సరిపడే సరుకు తెప్పియ్యలేదు. పాలు కూరగాయలూ గ్యాసూ కిరాణం మందులూ లాంటివన్నీ బైటికి పోకుండ ఎటొస్తయి ?

ఇంట్లో చూస్తే తన జీతమూ, భర్త జీతమూ సగం లోన్లకూ, ఈఎమ్మెలకూ పోంగ సంసారం జాగర్తగ నడుపుకుంటున్నరు. శ్రావ్య పాతిక వేల జీతానికి ఈ మధ్యనే ప్రవేటు నౌకర్లో చేరింది. కరోనా అయిపోయినంక శ్రావ్యని తిరిగి ఉద్యోగంలోకి తీసుకుంటరో లేదో డౌటే! అది ఆందోళన కలిగించే అంశం. కొడుకు సూర్య ఇంకా చదువులోనే వున్నాడు.

ఏడాదికో మాటు వచ్చి తమయింట్లో నాల్రోజులు, మరిది గారింట్ల నాల్రోజులు వుండి డాక్టర్ చెకప్ చేయించుకుని పోయే అత్తా మావగారు వచ్చిన రెండో రోజే ఇట్లాంటి పరిస్థితుల్లో చిక్కుబడి పోయిండ్రు. వాళ్ళ జీవితాలకు కూడా పెన్షన్ డబ్బులు వడ్డీలకు తిప్పుకుంటు ఎవ్వరిమీద ఆధారపడకుంట గడుపు కుంటున్నరు.

ఈ పరిస్థితి గురించి ఆలోచిస్తుంటే నిర్మలకు ఏం చెయ్యాలో అర్థం అయిత లేదు. ఈ యింట్ల ఇంత మందిమి ఎట్ల వుండాలే ! అసలు రోగం వస్తే ఎట్ల రియాక్టు కావాలె? ఎక్కడికి పోవాలె? భగవంతుడా ఇంట వక్క మనిషి మాయం అయితే సంసారం ఎంత తల్ల కిందులయ్యిచ్లో గదా ! వీళ్ళెవరికీ ఏ జబ్బూ రాకుంట ఏ మందూ మాకూ లేకుండ ఎట్ల నిభాయించుక రావాలె? ఆమె దిగులుకు అంతు లేకుంటున్నది.

ఇప్పుడు మోహన్ రోజూ తెల్లారి లేస్తూనే టీవీ ఆన్ చేస్తడు. ఇట్ల ఏం పనిపాట లేకుండ ఇంట్ల వుండటం అనేది గ్యాస్ ఛాంబర్లోకి నెట్టి తలుపు వేసినట్టుంది. ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నడు నాలుగు రోజులకే! ఇంక పదిహేను రోజులు ఈ ఇరుకు గదులలో లోకం చూడకుంట, బైటి గాలి పీల్చకుంట వుండాల్నంటే మాటలా !! అతనికి ఎవర్ని చూసినా చిరాకూ పరాకూ పెరిగి పోతున్నయి. అర్థం కాని ఉద్విగ్నతత అయోమయానికి గురి చేస్తోంది. బైట అందరు ఎట్లున్నరో! మాయదారి రోగం వస్తే ఎవరెవర్ని ఎక్కడెక్కడికి తీస్కపోతరో? టీవీలో పదే పదే కనిపిస్తున్న దృశ్యాలూ, వినిపిస్తున్న మాటలూ, క్వారంటైననీ, ఐసోలేషన్ వార్డులనీ చూస్తోంటే హృదయం కంపిస్తున్నది.

తమకు ఏదన్నా అయితే శ్రావ్య పెళ్ళి ఎట్ల చేస్తం? ఆడపిల్ల ఎవ్వరి అండలేక ఎట్ల బతుకుతుంది? సూర్య చదువు, జీవితం ఎవరు చూస్తరు? తన తల్లితండ్రుల పరిస్థితి ఏంటి?

ఏమీ జరగక పోయినా ఏదో జరిగి పోతుందన్న భావన అతన్ని అలజడికి గురి చేస్తోంది. ఎవరు మాట్లాడినా ఏదో ఒక తప్పు వెదికి, అరిచి తన భయాన్ని అదుర్గాని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నడు.

“కాస్త అల్లం వెల్లుల్లి వేసి పకోడి చేస్తవా? టీవీలో చెప్పున్నరు అల్లం తింటే కరోనాకు మంచిదట!”

టీవీ చూసీ, పేపర్ చదివీ బోర్ కొట్టి, పేపర్ మడతేస్తూ అడిగిండు మోహన్ నిర్మలని. అప్పుడే వంటిల్లు సర్దుకుని కాసేపు నడుం వాలుద్దామనుకుంది నిర్మల. పని మనుషులు రావడం లేదు, బైట ఎక్కడెక్కడి నుంచో రావాల్సి వుండటం వల్ల నిర్మలే వద్దంది. ఆటోలు సరిగా లేక పనామె రాక ఆలస్యం అయితున్నది. ఆమె వచ్చే వరకే ఇంట్ల సగం పని అయిపోతున్నది. అందుకనే ఇంటెడు పనిభారం కృంగదీస్తున్నది. కొత్తగా భర్త కోరిక విని విసుక్కుంది. చి. ఛీ. ఏం మనిషి’ అంటూ మనసులో ఏవగించుకున్నా పైకి మటుకు ప్రశాంతంగానే అడిగింది.

“అల్లం వెల్లుల్లి కరోనాకు మంచిదా! లేక మీకు మంచిదా?” అప్రయత్నంగానే పైకి అనింది.

ఆ ప్రశ్నలో ఏంటో వెక్కిరింపు ధ్వనించింది మోహన్ కు. శ్రావ్య కిసుక్కున నవ్వింది. సూర్య ఇద్దర్ని చూస్తున్నడు. తల్లీ తండ్రీ కూడ అక్కడే వున్నరు. నీళ్ళల్లో పడ్డ ఎలక లెక్క అయిపోయిండు మోహన్. అహం దెబ్బతిన్నది.

“ఏవయిన తల్కాయ వుండే మాట్లాడుతున్నవా? అంత తల బిరుసు దేనికీ?” అతని కంఠం లేచింది.

“నేనేమన్న” హఠాత్పరిణామానికి నిర్ఘాంత పోయింది నిర్మల.

“నోర్ముయ్యి… నోటికొచ్చినట్టు మాట్లాడడం. పైనుంచి నేనేం మాట్లాడినా అనుడు! పొగరు అంత పనికిరాదు… నేర్చుకో కాస్త.”

కాలు మీద కాలు వేసుకుని కూర్చుని టీవీలో మొహం పెట్టాడు క్రోధంతో.
సూర్య గదిలోకి వెళ్ళిపోయిండు అవమానపడుతున్న తల్లి మొహం చూళ్ళేక.
అత్తమామలు చెరో పేపర్ అందుకున్నరు వ్యవహారం ఎటుపోయి ఎటు వస్తుందోనని.

శ్రావ్య లేచి “శనగపిండి ఎక్కడుందో చూపిద్దువు రామ్మా! పకోడీలు నేను చేస్తే.”
తల్లి భుజంపైన చెయ్యి వేసింది. ప్రభాకరరావు భార్యకు సైగ చేసాడు పేపర్ చాటునుండి, వెళ్ళి పకోడీ చెయ్యమని. ఆమె ఆ సైగను తిప్పి కొట్టింది నాకెందుకొచ్చిన గొడవ అన్నట్టు.

వంట గదిలో శనగ పిండి డబ్బాలో కొద్దిగనే వుంది. అది ఇంట్ల ఉన్న అందరికీ సరిపోదు. అయినా అందులో కాస్త బియ్యం పిండి కలిపి పకోడీ చేసింది శ్రావ్య. తాతకూ, తండ్రికి రెండు ప్లేట్లలో వేడిగ ఏసిచ్చింది. తనకేదన్నడు సూర్య వాసన పీలుస్తూ గదిలోంచి బైటికొచ్చి, అందరికీ సరిపడా పిండి లేదంది శ్రావ్య.

“తెల్లారి లేచిందగ్గర్నించీ వంటింట్లోనే ఏడుస్తది. ఇంట్ల ఏం వున్నయో లేవో చూసుకోవద్దా!! ముందు చూపు లేకపోతే ఇట్లనే తల్లబడ్డది. రోజూ బైటికి పోయి ఏదోటి తినే అలవాటు. గిప్పుడేమో బైటికి ఎల్లేటట్టు లేదు. పోయినా అన్ని బందేనాయే!”

కొడుకును చూస్తూ అన్నడు మోహన్. అదేదో ఛాలెంజింగ్ మాటల్లాగా అనిపించినయి సూర్యకు. వెంటనే “అమ్మా ఏవేం కావాల్నో లిస్ట్ రాయి నిముషంలో పొయ్యొస్త”. అన్నడు తండ్రి దగ్గర డబ్బులు తీసుకుంటు.

“ఒరేయ్ బైట తిరగటం ఎందుకురా! ఏదోకటి చేస్తనే వున్నం గద! అదే తినడం అలవాటు చేసుకోవాలె. టీవీలల్ల చూస్తలెవ్వా బండ్లమీద తిరిగేటోళ్ళని ఆపి మరీ కొట్టుడు, అంతేనా బండ్లు సీజ్ చేసి కేసులు పెడుతున్నరు. ఇప్పుడు పకోడీలు పుణుకులు అనుకుంట వంకలు పెట్టుకోని బైట తీరకపోతే సావంగదా! హాయిగ ఆన్లైన్ క్లాసులు చూసుకుంట వుండు. ఉన్నదేదో తిని కూసుంటే అందరం బతికుంటం!”

ఇంకేదో చెప్పబోతున్న తల్లిని అసహనంగ సూసిండు సూర్య. ఈ వంకతోనన్న రోడ్డు మీద కాసేపు తిరిగి రావొచ్చు అనుకున్నడు.

“సరుకులైపోతె ఏం చేస్తవు? చూస్తున్నవుగా ఇంత మందిమి ఏం తింటం? అమెరికా దేశంలోనే షాపులు లూటీ అయిపోయి తింటానికి ఏమీలేక అల్లాడి పోతున్నరు. అమ్మా మూర్ఖంగా అలోచించకు తొందరగా సామాన్ల లిస్టు రాయి. నాల్రోజులు పోతే పైసలు కూడ అయిపోతాయి. పరిస్థితి నీకు అర్థం కావడం లేదు.”

తొందర పెట్టాడు తల్లిని, ఎందుకంటే అవుతల వాసుగాన్ని రోడు మీదకు రమ్మన్నడు తనొస్తున్నట్టు చెప్పి.

“నానమ్మకు ఏవయిన పండ్లు కూడ తీస్కరావాలెరా!” ప్రభాకరారావు చిన్నంగ గొణిగిండు. తండ్రి చూడకుండ తాత భుజం గిల్లి, బొటన వేలు, చూపుడు వేలూ చూపి “డబ్బులు డబ్బులు” అన్నడు సూర్య ఆయన హాల్లోంచి లోపలికి పోయిండు. తాత వెనకే సూర్య కూడ వెళ్ళాడు.

లాక్డౌన్ సమయం కనుక ఎంత మొత్తుకున్నా అమ్మ పైసా ఇయ్యది. తండ్రిని అడిగితే లెక్కలు చెప్పమంటడు. పైగా ఎందుకూ, ఏవిటికని ఆరాలు తీస్తాడు. ఈ కష్ట సమయంల తాతే రక్ష! అనుకున్నదే తడవు-

“నాకో వెయ్యి రూపాయలివ్వు తాతా! వచ్చే నెల నాన్ననడిగి ఇస్త!” తాత సూటికేస్లో వున్న పైసలు చూసి అప్రయత్నంగ అడిగిండు సూర్య. కానీ అడిగినంక సిగ్గనిపించింది. ఆయనేం సమాధానం చెప్పలేదు. మనసులో మాత్రం అనుకున్నాడు. ఇంకా మేం మందులు తెచ్చుకోవాలి… మరి వీడేంటి ఎప్పుడూ లేంది ఇట్ల అడిగిండు! ఇయ్యక పోతే ఏందో… ఇస్తే అదేం ఇబ్బంది తెస్తడో!

అసలు కొడుకింట్లో ఇన్ని రోజులు తామెప్పుడూ లేరు. ఏడాదికోసారి వచ్చినా పెద్దీనింట్లో నాల్రోజులు, చిన్నోడింట్లో నాల్రోజులూ ఉండి, డాక్టరు దగ్గర పరీక్షలు చేయించుకుని పోవుడు జరిగేది. కానీ ఇప్పుడు కరోనా మూలంగా ఇక్కడిన్ని రోజులుగా ఉండవల్సి వచ్చిందని మనసులో బాధపడ్డాడు ప్రభాకరరావు.

మోహన్ పరిస్థితే కాదు తనకూ అలానే వుంది. ఎవరు మాట్లాడినా చిరాకు కోపం, ఈ ఇరుకు గదుల్లో ఇంత మందిమి సర్దుకుపోతూ, పరిమితికి లోబడి వుండటం ఆయన వల్ల కావడం లేదు. భార్య మీద అరువుడు, తగువు పడుడు లాంటివి కొడుకు కోడలు ముందు సాధ్యమయిత లేదు. ఇంట్ల ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడానికి గానీ, పెద్దగ మాట్లాడటానికి గానీ, ఇష్టమైన ఛానెల్ చూడటానికి గానీ లేదు. ఈ సమయంలో పేపర్ కూడ సరిగ రావడం లేదు. చిన్న కొడుకు దగ్గరికి పోదామన్న ఈ పరిస్థితులలో అసలే పోలేని పరిస్థితి.

ఇంట్ల పనిమనిషి రావడం లేదు. ఆమె ఎక్కడి నుంచో రావల్సి వుంది. ఈ లాక్ డౌన్ వేళలో పోలీసులు అడ్డుకోవడం, ఆటోలు లేకపోవడం మూలాన రావడం లేదు. అంట్లు తోమడం, బట్టలు ఉతకడం లాంటివి కోడలు చేసినా, ఇంత మందికి వంట చెయ్యడం పార్వతమ్మకు అలసటగా వుంది. పైగా తమ యిద్దరి బట్టలు తామే ఉతుక్కోవలసి వస్తున్నది.

“నానమ్మకు పండ్లతో పాటు ఈ మందులు కూడా తేవాలి నాయనా… నీక్కావాలంటే ఈ రెండొందలు వుంచురా….”

తాత ఇవ్వజూపుతున్న రెండొందల నోటు చూసి చటుక్కున చెయ్యి వెనక్కు తీసుకోని, మందుల పైసలు పట్కోని, శ్రావ్య రాసిన సరుకుల లిస్టుతో సహా క్రిందికి వచ్చాడు. చాలా రోజుల తరవాత రోడ్ల మీద తిరిగే వాహనాలూ, చల్లటి గాలీ చూసే సరికి ఒళ్ళుపై తెలవలేదు సూర్యకు. బైకు మీద రయ్యిన రోడ్డు మీదికి దూసుకొచ్చిండు. ఖాళీ రోడ్లు…. మనుషులు ఎక్కడో ఒకచోట కనిపిస్తున్నరు. అలాంటి దృశ్యం అబ్బుర పర్చిందతన్ని.

కొద్ది దూరం వెళ్ళాడో లేదో లారీ విజిల్స్ పోలీసులు ఎదురయ్యారు. ‘అబ్బ దొరికిపోయినరా’ అనుకున్నడు. ఇంకొద్ది దూరం పోతే తన దోస్త్ కలిసెటోడు గదా హ్… పోలీసోని బారిన పడ్డననుకున్నడు.

“ఏందిరా టీవీ చూస్తలేవా? బండేస్కోని రోడ్డు మీదకొచ్చినవ్? బత్కాలని లేదా?” పోలీసాయన లాఠీతోని బండిమీద కొట్టుకుంట ఆపు జేసిండు.

“సార్ మా తాతకు బాగలేదు. మందులు కావాల్నంటే వచ్చిన!”

“ఏదీ చిట్టీ?” చెయ్యి చాపాడాయన.

గబగబ జేబులు వెతికినట్టు యాక్షన్ చేసిండు కానీ లోలోపల ‘అరే ఈ చిన్న పని మర్చిపోయి వచ్చిన్నే’ అని భయపడ్డడు.

“మెడికల్ షాపుల వుంటది సార్. ఎప్పుడు అక్కడ్నే తెస్త!”

“చెప్పుర షాప్ పేరు చెప్పు! మందుల పేర్లు షాపోనికీ? “

లాఠీ మోటర్ సైకిల్ మీద కొట్టుకుంట నిశితంగ చూసిండు సూర్యను. ఆ చూపును తట్టుకోలేక తలొంచుకొని – “సార్ తప్పయ్యింది సార్… ఇగో నిజంగ ఈ సామాను తీసుకోవాలె… ఇంట్ల సరుకులు ఏం లెవ్వని పంపుతే వచ్చిన.” సామాను చిట్టీ తీసి చూయించిండు సూర్య.

“చూడూ ఇదేం ఆటగోలు వ్యవహారం కాదు… బైటెక్కడ కిరాణం షాపులు తెరిచి లెవ్వు…. తెరిచెటందుకు గూడ టైముంది… మరి ఈ టైంల ఎక్కడ తీసుకుంటవ్ సామాను?”

“నిజం సార్… సామానుకే వచ్చిన… ఇంట్ల సరుకులు లెవ్వు.” బండి దిగి చేతులు కట్టుకున్నడు. లోలోపల షివరింగు మొదలయ్యింది.

“మేం పది రోజుల నించి మొత్తుకోని సస్తుంటే మీకు చెవిన పేను పారదులే! పెళ్ళాం పిల్లల్ని వదిలి, ఇంట్లున్న అమ్మ నాయనల్ని సూడకుంట ఇక్కడ మీ ప్రాణాల కొరకు కావలి కాస్తున్నం. ఎందుకనిరా! పేపర్లు చదువుత లేరా? టీవీలు చూస్త లేరా? ఎందుకు బతుకుతున్నరా మా ప్రాణాలు తియ్యనీకా? ” లాఠీ ఎత్తాడు కోపంగా.

“సార్ సార్ మా తాతకు బాగా లేకపోతనే వచ్చిన సార్!”

“మా నాన్న అస్థమా పేషంట్… ఆయన్ని చూసుకోవడానికి నాకు సమయం దొరకడం లేదు… పిల్లలు చిన్నవాళ్ళు… వాళ్ళు నాతో ఆడుకోవాలనీ, గడపాలనీ రోజూ బ్రతిమాలుతారు… పిల్లలు ఏడుస్తుంటారు… అయినా అవన్నీ పక్కన బెట్టి మేమంతా ఇలా ఎండలో తిండి తిప్పలు లేక అవస్థలు పడుతూ డ్యూటీ ఎందుకు చేస్తున్నం? మీకోసం కాదా! హాయిగా ఇంట్లో వుండండిరా అని చెబుతుంటే బండ్లేసుకోని బలాదూర్ తిరుగుతున్నరు ఆ…”

“లాక్ డౌన్ నుంచి ఎన్నడూ బైటికి రాలేసార్…” ఇంకేదో మాట్లాడబోతున్న సూర్య వీపు పగిలిపోయింది. వెనకనించి వచ్చి వేరే పోలీస్ అతను లాఠీకి పని చెప్పడంతో.

సూర్య ‘అమ్మా’ సార్ అంటూ బండిమీదికి వాలిపోయాడు.

“మీరు చచ్చింది కాక పదిమందిని లేపుక పోతార్ర!!” ఇంకోసారి గాల్లోకి లేచింది లాఠీ. పోనీయ్ పోనీయ్ ఎదురుగా వున్నతను కర్రతో బండిని చూపిస్తూ పొమ్మన్నట్టు సైగ చేసిండు. అది చాలు సూర్యకు నడుం మంట పుడుతున్నా ఎదురు సందులోకి పారిపోయిండు బండితో సహా!

ఉన్న పనులు చాలవన్నట్టు సూర్య నడుం నొప్పికి కాపడాలూ, ఆయింటుమెంట్ల పని తోడై నిర్మలకు తలనొప్పి తారస్థాయికి చేరుతోంది. అనుకోని ఈ వ్యవహారానికి మోహన్ కోపం నశాళానికి అంటుతోంది. ఇల్లు దాటి బైటికి పోవడానికి లేదు. కరోనా వార్తలతో మెదడు టెన్షన్ భయంతో గజిబిజిగా తయారైంది. ఇంట్లో అందరం కల్సి వుండేదే ఇల్లాంటప్పుడు. ఇప్పుడే చిరాకులూ, పరాకులూ, దెబ్బలు తిని వస్తే కాపడాలూ లాంటివి చెయ్యాల్సి వచ్చి చిరాకుపడుతున్నది నిర్మల.

వీళ్ళందర్నీ చూసి, తనే స్వయంగా వంటింట్లోకి పోయి కిరాణం ఏమేం వున్నయ్యో చెక్ చేసుకున్నడు మోహన్. ఏ డబ్బాలో చూసినా కొద్ది కొద్దిగనే వున్నయ్యి ఒక్క బియ్యం మటుకు బస్తా వుంది. తన ఫ్రెండ్ గోపాలి కి ఫోన్ చేసి కొడుకు పరిస్థితి చెప్పి, తను ఎప్పుడూ సామాను తీసుకునే షాపువాడికి చెప్పి సామాను పంపమన్నడు. గోపాల్ కోవిడ్ వాలంటీర్!

సాయంకాలానికల్లా సామాను వచ్చింది.

“ఇది మొదలే ఏడవచ్చుగా పిలగాడు దెబ్బలు తినకుండ వుండెటోడు. ఈ పనికి రాని కోపం వకటి మన ప్రాణాలు తియ్యనీకి.” అంది నిర్మల. అత్తగారు వినేలా శ్రావ్యతో. పార్వతమ్మకు కూడా మనసులో ఉద్విగ్నంగా వుంది కొడుకు కోడలి ప్రవర్తన. ఎప్పుడేం గొడవకు దిగుతారో అన్నట్టున్నరు. ఇంట్లో ఎవ్వరికీ ఒకరి పొడ ఒకరికి గిట్టుత లేదు. ఈ రోగమేందో ఎప్పుడు లక్డౌన్ తీస్తరో ఎప్పుడెల్లి ఊర్ల పడుతమో! అయినా ఇప్పుడున్న పరిస్థితుల్ల ఒత్తిడితోని ఇక్కడుండ లేము. ఒంటరిగా ప్రాణ భయంతో ఊళ్ళో కూడా యిద్దరం వుండలేము. ఏం పరీక్షరా భగవంతుడా! ఎవ్వరి మొహంలో చూసినా చావు భయం. నిర్వేదం, అంతలోనే అజాగ్రత్త, నిర్లక్ష్యం.

కనపడని రోగంమ్మీద కదన రంగంలో చేతులు కడుక్కోవడమనే ఆయుధం. ఈ యుద్ధంలో ఎంత వరకు విజయం సాధిస్తారో! ఊహించని ప్రపంచం ఇది. అందరి భవిష్యత్తు తిరగ రాయబడుతున్నది. కాలం ఖడ్గంగా మారింది పాపాల్ని దనుమాడడానికని తలపోస్తోంది ఆమె.

కొడుకులో ఇంత కోపం, కోడలులో అంతులేని అసహనం, మనవడిలో చెప్పరాని నిర్లక్ష్యం, మనవరాలు ఏదీ మనసుకు తీసుకోని నిర్లిప్తత ప్రదర్శిస్తోంటే పార్వతమ్మకు లోలోపల భయం వేస్తోంది.

లాక్ డౌన్ మళ్ళీ పొడిగించారన్న వార్తలు వింటున్న వాడల్లా తండ్రితో ఏదో చెప్పడానికి తల తిప్పబోయాడు మోహన్! అప్పుడే టీ ఇవ్వడానికి వస్తున్న నిర్మల చేతిలోని టీ కప్పు అతని తలకు తగిలి కప్పు అతని తొడ మీద పడింది. ఆమె కావాలని టీ కప్పు ఒలికించిందన్న ఆలోచనతో ఒక్కసారిగా కోపం ఉవ్వెత్తున బుసకొట్టింది. లేచి నిర్మల చెంపలు పటపటా వాయించాడు.

“అయ్యో ఏంట్రా…” పార్వతమ్మ కేక పెట్టింది ఖంగారుగా.

దయ్యం పట్టిన వాడిలా ఊగిపోయిండు. కప్పు గోడకేసి విసిరి కొట్టి నిర్మల జుట్టు అందుకున్నడు. చప్పున తెప్పరిల్లిన నిర్మల మోహన్ని సోఫాలోకి నెట్టేసింది.

“ఎందుకు కొడుతున్నవు కారణం లేకుండ… నోరు పడిపోయిందా…. రోజు రోజుకూ నీ ఆగడాలు ఎక్కువయినయి. నేనేం కావాలని పోసానా? టీ ఇచ్చినా నువ్వు కావాలనే పట్టుకోలేదు. ఇంట్లో అందరి ముందు ఇంత వయసు వచ్చిన నన్ను కొడతావా?”

నిర్మల ఆవేశంతో దుఃఖంతో ఊగిపోయింది. పిల్లలు అవాక్కయ్యారు. నన్నే తిడతావా పొగరెక్కింది నీకు అంటూ ఇంకా నాలుగు కొట్టాడు. సూర్య వినురుగా తండ్రిని గదిలోకి లాక్కుపోయాడు. ఆ పిల్లాడెప్పుడూ తనింట్లో ఇలాంటి సంఘటన చూడలేదు.

కోడల్ని సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు తాగించి కళ్ళనీళ్ళు తుడుచుకుంది పార్వతమ్మ ప్రభాకర్రావు ఏదో మాట్లాడబోతే సైగ చేసింది పార్వతమ్మ ఇప్పుడే మాట్లాడ వద్దని.

ఇన్ని రోజులుగా సందడి సందడిగా వున్న ఇల్లు ఇప్పుడు మూగబోయింది. యధావిధిగా టీవీ కరోనా వార్తల్ని ప్రసారం చేస్తోంది. పడక గదిలో శ్రావ్య నిర్మలలు పడుకున్నా ఆమెలో కోపం అగ్నిపర్వతం సెగలు కక్కినట్టు కక్కుతోంది. మగవాళ్ళు హాల్లో జంపనా పరుచుకుని పడుకుండి పోయారు. ఇంట్ల కూడా కరోనాలాగా కనిపించని ఈ ఇగో గోలకు ఎక్కడికైనా పారిపోవాలని సూర్య తహతహలాడిపోతున్నడు. అంతకు ముందు పోలీసులతోని దెబ్బలు తిన్న వైనం అతను మర్చిపోలేదు. అయినా మనశ్శాంతి కోసం అవసరం లేకున్నా బండి తీసుకుని బైటికెళ్ళిపోయాడు. సాయంకాలానికి మొకం వేలాడేసుకుని వచ్చిండు. బండిని పోలీస్ స్టేషన్లో సీజ్ చేసాక దిక్కుతోచక వచ్చాడు. రెండ్రోజులు యుద్ధమే జరిగింది ఇంట్ల, మరో రెండ్రోజులు వరుసగ ఫ్రెండ్స్ చుట్టూ తిరిగిండు పైరవి చేయించడానికి, లాభం లేకపోయింది.

ఉన్నట్టుండి తలనొప్పి మొదలయ్యింది సూర్యకు “ఎండకు తిరగొద్దురా అంటే వినకుండ బండికోసం తెగ తిరుగుతుంటివి ఇంగో టీ తాగు. “

నిర్మల కొడుక్కు టీ కప్పు ఇచ్చింది. ఆ టీ తాగేసరికి వాంతి అయ్యింది. ట్యాబ్ లెట్ కోసం వెదికితే దొరకలేదు. ఇంట్లో మందులేవీ లేవు. ప్రభాకరరావులో ఖంగారు మొదలయ్యింది. అందుకు కారణం ఏంటంటే పెన్షనర్లకు పెన్షన్ డబ్బులు నగమే ఇస్తున్నరన్న వార్త!!

సగం డబ్బుల్తో బ్రతకడం ఎలా! ఇటువైపు చూస్తే మందులు దొరకడం లేదు. అందులో డయాబెటిక్ మందులు దొరకక పార్వతమ్మ ఇబ్బందులు పడుతున్నది. ఆమెను చూస్తే భర్తకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. షుగర్ ఎక్కువయి పని చెయ్యలేక పోవడంతో పనంతా నిర్మల శ్రావ్యల మీద పడుతోంది.

పార్వతమ్మ దగ్గర కూర్చుని ఏమీ కాదు… మందులు లేకపోయినా జాగ్రత్తగా వుంటే నాల్రోజుల్లో అవే వస్తాయి మందులు, నీకేం కాదు అని ఓదార్చే స్థితిలో ఎవ్వరూ లేరు. ఎవరి కోపతాపాలు అసహనాలు వారివి. పార్వతమ్మకు పొడి దగ్గు, కొద్దిగా జ్వరం వస్తున్నాయి.

“నాయనమ్మను ఎటన్నా తీసుకుపోయి పరీక్ష చేయించరా ఏం రోగమో… ఏమో… నా చావు దగ్గరికొస్తున్నది ఇంత మందికి చెయ్యలేక.”

నిర్మల నిస్త్రాణకు గురైతున్నది. సూర్యకు కూడా భయంగానే వుంది. మందుల కోసం ఫోన్ చేస్తే స్టాక్ లేదనీ నాల్రోజులు ఆగాలని చెప్పారు.

“బండ్లమీద అనవసరంగా తిరిగితే చూడిప్పుడు ఏం గతి పట్టిందో! బైటికి పోవడానికి ఉన్నాక్క సౌకర్యం పోయింది.” శ్రావ్య అరిచింది.

ఎందుకైనా మంచిదని నూటా నాలుక్కు ఫోన్ చేసి వివరాలు చెప్పాడు సూర్య. అరగంటలో డాక్టరూ, నర్సు, అంబులెన్సు రావడం చూసి ఒణికిపోయారు చుట్టుప్రక్కల అపార్ట్మెంట్స్ వారు. తెరుచుకున్న తలుపులు, కిటికీలు టపటపా మూసుకు పోవడం గమనించాడు సూర్య. మిగతా అందర్నీ క్వారంటైన్ కి వెళ్ళాలని సూచిస్తూ నర్సుతో వివరాలు చెప్పి, పార్వతమ్మని పరీక్షలు చేయించి అవి పూర్తి అయ్యాక రిజల్బు చెప్తామని తీసుకుపోతుంటే నిలువు గుడ్లేసుకుని చూడ్డం తప్ప ఏం చెయ్యలేక పోయారు.

విశ్వ విషవలయమైంది. దీన్ని ఛేదించడానికి మనకు కావల్సింది ఆయుధాలు కాదు ఆలోచన. మన సహనం సంయమనం ఒక తరాన్ని కాపాడుతుంది గదా! ఎంత పొరపాటున ప్రవర్తించినం! ఒకర్ని ఒకరు కౌగిలించుకుని భోరుమని ఏడ్చినా… ఎవరికి వారు లోలోపల ఆత్మ విమర్శకు దిగారు.

బండికోసం తను బైటికి రావడం మూలాన నాయనమ్మకు వైరస్ గానీ వచ్చిందా ఏం అని సూర్య తన కోపం తగ్గించుకుని, ఎదుటి వాళ్ళ శ్రమను గౌరవించి ప్రవర్తిస్తే ఈ పరిస్థితి రాకపోవును గదా అని మోహన్.

అత్తగారి పట్ల కాస్త ఓర్పును చూపి వుంటే ఆమెకీ యాంజైటీ రాకుండా వుండేదని నిర్మల. వచ్చిన వాళ్ళం వచ్చినట్టుగా ఊరికి వెంటనే వెళ్తే అందరం హాయిగా వుండేవాళ్ళం ఇప్పుడే విధంగా మారిపోయెనా… ఏందిరా దేవుడా మా జీవితాలు అని ప్రభాకరరావూ కుప్పకూలిపోయాడు.

భూమి తనలోని అంకురాన్నెప్పుడూ మొలకెత్తనీయకుండా అన్యాయం చెయ్యదు. అలాగే మా జీవితాలని తిరిగి చిగురింప చెయ్యి ప్రకృతి మాతా అని మనసులోనే దండం పెట్టుకుంది శ్రావ్య.

అతీతమైనదెప్పుడూ వర్తమానం కాదు !

కనపడని రోగ మహమ్మారెప్పుడూ జీవితాంతం వుండదు. వృక్షం నీడ వృక్షాన్ని అంటి పెట్టుకొని వుంటుందే తప్ప బాటసారి వెంట పోదు. మా ధైర్యం ఎప్పుడూ మమ్మల్ని రక్షించుతుందే గానీ రోగ భయంతో కుదేలు కానివ్వదు అనుకున్నారంతా ఇంటికి తాళం వేస్తూ, మళ్ళీ వస్తామన్న ఆశతో !!

మహబూబాబాద్ జిల్లాకు చెందిన తొర్రూరులో నివాసం. ప్రధానంగా వ్యవసాయ కుటుంబం. 2007 నుండి కవితలూ, కథలూ రాస్తున్నారు. 2007లో 'మనో నేత్రం' కవితా సంపుటినీ, 2008లో మరో కవితా సంపుటి 'నేల కంటి రెప్పల కదలిక' ని ప్రచురించారు. వందకు పైగా కథలు వివిధ పత్రికలలో వచ్చాయి. 2010లో 'బతుకు గోస' కథా సంపుటినీ, 2019లో 'మాతృవందనం' కథా సంపుటిని ప్రచురించారు. పదిహేను కథలకు బహుమతులు పొందారు.

Leave a Reply