విరిగిన కొమ్మలు

అందమైన నీలం రంగు చీర మీద పొరపాటున నారింజ రంగు ఒలికిపోయినట్టుగా ఉంది ఆకాశం. ఆ ఆకాశంలోకి పచ్చగా పసిడి వర్ణంలో పై పైకి తోసుకొస్తున్న సూర్యుడిని కిటికీలో నుండి చూస్తూ వేడి వేడి కాఫీ తాగుతూ ఉంది వసుధ. అదే పనిగా కచేరీ పెట్టినట్టు రాగాలు తీస్తున్న రకరకాల పిట్టలు, వాటి పాటల కోసమే అన్నట్టు తాళం తప్పకుండా రోడ్లు ఊడుస్తున్న చీపుర్ల చప్పుడు, మినహాయించి అంతా నిశ్శబ్దంగా ఉంది. ఆ ప్రశాంతతను ఆస్వాదిస్తూ కూచుంది వసుధ.

కాఫీని మెల్లిగా సిప్ చేస్తూ కూచుంది వసుధ. ఇంతలో హాల్ లో మొబైల్ రింగ్ అయిన చప్పుడు రావడంతో, కాఫీ కప్ ను అలాగే కిటికీ పక్కన టీపాయ్ మీద వదిలేసి హాల్ లోకి వెళ్ళింది. మొబైల్ స్క్రీన్ మీద అలవోకగా నిలబడి చిరునవ్వుతో చూస్తున్న స్వప్న ఫొటో, పేరు కనిపించాయి. ఈ పిల్ల ఇప్పుడు ఫోన్ చేసిందంటే, మళ్ళీ ఫ్లాట్ కీస్ ఇంట్లోనే పెట్టి మరచిపోయి నైట్ షిఫ్ట్ కి వెళ్ళిందేమో అనుకుంటూ ఫోన్ తీసింది.

‘హలో అక్క, నీతో కొంచెం అర్జంట్ గా మాట్లాడాలి. ఎవరితో చెప్పాలో తెలీక నీకు కాల్ చేసాను’ వసుధ హలో కోసం ఎదురుచూడకుండానే అంది స్వప్న.

‘చెప్పు, ఏమైంది? అంతా ఓకే కదా..’ కొద్దిగా ఖంగారు పడుతూ అడిగింది. పక్క పక్క ఫ్లాట్స్ లో ఉండే వసుధ స్వప్నలకు అడపా దడపా కలవటం అలవాటే. అవి ఇవి ఉబుసు పోని కబుర్లు చెప్పుకోవడము అలవాటే. స్వప్న ఎక్కువగా తన ఇంటర్న్షిప్ గురించి, బాయ్ ఫ్రెండ్ గురించి, తన నర్స్ డ్యూటీ గురించి చెప్తూ ఉంటుంది. ఇది కూడా అలాంటిదే ఏదో అయ్యుంటుంది అనుకుంది వసుధ.

‘ఏమి లేదక్కా, నా ఫ్రెండ్ ప్రియ తెలుసు కదా…! ఈ రోజు హాస్పిటల్ కి వెళ్తే, తను ఇప్పుడు 7 మంత్స్ ప్రెగ్నెంట్ అని తెలిసింది. చాలా భయపడుతూ ఉంది. ఇంట్లో తెలిస్తే చంపేస్తారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు’ అని మెల్లిగా చెప్పింది.

నిండా ఇరవై రెండేళ్లు కూడా ఉండవు. ఈ కాలం పిల్లలు మోడరన్ గా ఉన్నట్టే ఉంటారు కానీ, మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు చేస్తారు. ఏం మాట్లాడాలో, తన నుండి ఏ రకమైన సహాయం లేదా సలహా ఎక్సపెక్ట్ చేస్తున్నారో, లేక ఊరికే ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఈ సంగతి తనతో చెప్పిందో అర్థం కాలేదు వసుధకు .

‘ఈ విషయం ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ కి తెలుసా? అతను ఏమంటున్నాడు?’ ఏదో ఒకటి మాట్లాడటానికి అడిగింది వసుధ.

‘తెలుసక్కా, అతనేమో అబార్షన్ చేయించుకొమ్మంటున్నాడు.’

‘ఏడో నెలలో అబార్షన్ ఏంటి? ఎంత ప్రమాదమో తెలుసా? అయినా ఇంత దాకా వచ్చే వరకు తను ప్రెగ్నెంట్ అన్న విషయం ఎలా తెలుసుకోలేకపోయింది ఆ అమ్మాయి? మెడికల్ ప్రొఫెషనే కదా మీరంతా…’ చిరాకు, కోపం, దిగమింగుకుంటూ అడిగింది వసుధ.

‘అదే అక్క, నాకూ అర్థం కావట్లేదు. ఈ పిల్ల నర్స్, ఆ బాయ్ ఫ్రెండ్ ఏమో డాక్టరు. ఎందుకో బాగా ఆకలేస్తుంది, అనుకుందట. ఎగ్జామ్స్ హడావిడి, లాబ్స్, ఇంటర్న్ అవర్స్ కూడా ఎక్కువ ఉన్నాయి లాస్ట్ త్రీ మంత్స్ నుండి. పైగా కాంట్రాసెప్షన్ కోసం హార్మోనల్ ఇంజెక్షన్స్ వేసుకుంటుందంట, దాని వల్ల పీరియడ్స్ ఎప్పుడూ ఇర్రెగ్గులరే. అందుకే పీరియడ్స్ మిస్ అయిన విషయం గమనించుకోలేదు అని బాధపడుతూ ఉంది. ఈవెనింగ్ డాక్టర్ దగ్గరికి మళ్ళీ వెళ్ళాలి.’ కథ మొత్తం వివరించింది స్వప్న.

‘హ్మ్.. సరిపోయింది. ముందు డాక్టర్ ఏమంటారో కనుక్కొమ్మను. తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. నన్నడిగితే ముందు వాళ్ళ పేరెంట్స్ కి చెప్పమను. మంచో, చెడో. వాళ్ళకు చెప్పటం మంచిది.’ తోచినంత ధైర్యం చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేసింది వసుధ.

గదిలో వదిలేసిన కాఫీ గుర్తొచ్చింది. వెళ్లి కప్పు చేతిలోకి తీసుకుంటే చల్లగా తగిలింది. దాన్ని తీసుకెళ్ళి ఒవెన్ లో పెట్టి 30 సెకండ్స్ కి టైమర్ సెట్ చేసింది. బీప్ అవగానే కప్పు తీసుకుని వెళ్ళి, లాప్ టాప్ ముందు కూలబడింది. ఇప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసే ఓపిక అస్సలు లేదు. మొబైల్ తీసుకుని స్విగ్గి ఆప్ లో పూరి ఆర్డర్ పెట్టింది. లాప్ టాప్ ఆన్ చేసి మెయిల్స్ తెరిచి చూస్తే, ఏవో చిన్న చిన్న టాస్క్స్ లిస్ట్ కనిపించింది. ఆఫీస్ కి వెళ్ళే వాళ్ళకు తొమ్మిది నుండి ఐదు దాకానే పని. వర్క్ ఫ్రొం హోమ్ అనే సరికి ఒక వీకెండ్ లేదు, హాలిడే లేదు.. ఇరవై నాలుగు గంటలూ అందుబాటులో ఉండాలని తన బాస్ అభిప్రాయం. పరధ్యానంగానే వాటిని పూర్తి చేయడానికి పూనుకుంది. కానీ మనసంతా ఇందాకటి ఫోన్ కాల్ మీదే ఉంది వసుధకు.

ఆడపిల్లలు ఇండిపెండెంట్ అయ్యారు, లివ్-ఇన్ రిలేషన్షిప్స్ ఈ మధ్య ఎక్కువయ్యాయి. కానీ, ఇలాంటి పొరపాట్లు జరిగితే మాత్రం బాధ్యత మొత్తం ఆడపిల్ల భుజాల మీదే పడుతుంది. తీయించేసుకోమ్మని చెప్పటం సులువే, కానీ అదొక పెద్ద వలయం. తనకు తెలుసు ఆ బాధ ఎలా ఉంటుందో. ఆ ట్రామా నుండి బయటపడటానికి ఈజీ గా ఆరు నెలల పైనే పడుతుంది. కాంట్రాసెప్షన్ పిల్స్ అమ్మాయిలు మాత్రమే వేసుకోవాల్సి రావడం చాలా దురదృష్టం. పిల్స్ అయినా, హార్మోన్ ఇంజెక్షన్స్ అయినా, 100% ఫూల్ ప్రూఫ్ కాదు. మూడ్ స్వింగ్స్, హార్మోనల్ ఇంబ్యాలన్సు, ఇర్రెగులర్ పీరియడ్స్, ఇలా ఒకటి కాదు.. లేని పోని కాంప్లికేషన్స్. అయినా ఈ మగ వెధవలు కండోమ్స్ వాడి చావొచ్చు కదా, ఒక్క యాభై సెకండ్లు తమాయించుకుని కండోమ్ తొడుక్కోవడానికి కూడా ఏడుపే! ప్చ్… పరి పరి విధాలుగా పోతున్న ఆలోచనల బరువు వసుధ మనసు తో పాటు, కళ్ళను కూడా బరువెక్కించడం తో, తెలీకుండా, అలాగే కుర్చీలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంది కాసేపు.

***

సాయంకాలం వసుధ రన్నింగ్ షూ వేసుకుని, మొబైల్, ఇయర్ ఫోన్స్ ట్రాక్ ప్యాంటు పాకెట్ లో పెట్టుకుని, ఇంటికి తాళం వేసి, రోడ్డు మీదకొచ్చింది.

ఇంటికి ఒక అరకిలోమీటరు దూరంలో ఉన్న పార్క్ దగ్గరికి చేరాక మొబైల్ కు ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసి, పాటలు వింటూ బ్రిస్క్ వాక్ మొదలుపెట్టింది. రోజూ అదే సమయానికి అక్కడికి వచ్చే కొంతమందిని చూసి పలకరింపుగా నవ్వుతూ వాకింగ్ చేస్తూంది.

చల్లని సాయంత్రం. నగరంలో చోటు లేక పార్క్ లో ఉండటానికి గుంపుగా చేరి వచ్చినట్లున్న చెట్లు ఊసులాడుకుంటున్నాయా అన్నట్టు ఉండి ఉండి వచ్చే ఆకుల చప్పుడు. పార్కు అటు చివర విరిసిన పారిజాత పరిమళాన్ని బరువుగా మోస్తూ ఇటు వైపుగా వీచే గాలి.

ఇంతలో అక్కడ పని చేసే వాచ్ మాన్ కూతురు ఎనిమిదేళ్ళ ఖుషి పరిగెత్తుకుని వచ్చి పలకరించింది. నవ్వుతూ ప్యాంటు పాకెట్ లో నుండి చాక్లెట్ తీసి ఖుషికి ఇచ్చింది వసుధ. ఆ చిన్న పిల్ల వచ్చినంత వేగంగా తిరిగి వెళ్ళి వాళ్ళ రూమ్ ముందు మట్టిలో ఆడుకుంటున్న తన తమ్ముడికి ఆ చాక్లెట్ సగం ఇచ్చి, తను సగం తీసుకుంది.

ఆ చిన్నపాటి గదిలో ముగ్గురు పిల్లలతో వాచ్ మాన్ సుజిత్, అతని భార్య మనీషా ఉంటారు. ఆమె ఇప్పుడు మళ్ళీ గర్భవతి. రోజూ వస్తుండటం వల్ల, పైగా పిల్లలకు ఎప్పుడూ ఏదో ఒకటి కొనిపెడుతుండటం వల్ల అప్పుడప్పుడూ ఆమె వసుధతో మాటలు కలుపుతూ ఉంటుంది.

ఒకసారి చనువు తీసుకుని అడిగింది వసుధ, ‘ఇద్దరితో ఆపేయాల్సింది కదా!’ అని.

అందుకు ఆ అమ్మాయి ‘నాకు కూడా ఒక్కో సారి విసుగ్గా అనిపిస్తుంది, మేడం. కానీ ఆ మధ్య ఇల్లు పట్టించుకోకుండా వేరే ఎవరితోనో తిరుగుతూ ఉన్నాడు. మా అమ్మ చెప్పింది, ఇంకొకరిని కంటే ఏమైనా మారతాడేమో అని. అందుకే!’ అంది నీళ్లు నములుతూ.

‘ఇంతమందిని పోషించడం అతనికైనా కష్టమే కదా!’

‘దేవుడే ఇస్తున్నాడు. దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు, మేడం!’ అని నవ్వింది మనీషా.

ఇంక వాదించలేక ఊరుకుంది వసుధ. పిల్లలని కనడం తో పోలిస్తే వారికి సరైన తిండి పెట్టి, చదివించి, ఆలనా పాలనా చూడటం చాలా కష్టం. సానుకూల పరిస్థితులు లేకపోయినా పిల్లలను కనడం చాలా మామూలు విషయం మన దేశం లో. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా వాళ్ళ అవసరాలను తీర్చలేని పరిస్థితి ఉంటే, పిల్లల గురించి అస్సలు ఆలోచించకూడదు. మొక్కలను పెంచడానికి బరువు పడే వాళ్ళు కూడా ఎలాంటి ప్రణాళిక లేకుండా పిల్లల్ని కనేస్తారు. ఇక్కడ ప్రశ్న ఆర్ధిక భద్రత మాత్రమే కాదు, పిల్లలకు మానసిక భద్రత, వాళ్ళకు కేటాయించడానికి సమయం, ఓర్పు, ఏది ఇవ్వలేకపోయినా మనం కనే పిల్లలకు ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం!

తన మనసులో ఆలోచనల లాగే ఆకాశం లో కూడా చీకట్లు ముసురుకున్నాయి. అక్టోబర్ ఆఖరు వారం అవటం వల్ల గడియారం లో ఆరు అవకుండానే పార్క్ లో లైట్లు వేశారు. కాసేపటికి ఇంటికొచ్చేసింది వసుధ.

***

మరుసటి రోజు ఇల్లు లాక్ చేసి సూపర్ మార్కెట్ కి బయల్దేరింది వసుధ. పక్క ఫ్లాట్ బయట తాళాలు తెరుస్తూ కనిపించింది స్వప్న. తన పక్కనే ఇంకో అమ్మాయి ఉంది. సరిగ్గా అప్పుడే స్వప్న కూడా వసుధ ను చూసింది. పలకరింపుగా నవ్వి దగ్గరకు వచ్చింది.

‘ఎలా ఉన్నావ్? ఈ రోజు ఈవెనింగ్ షిఫ్ట్ ఆ?’ అని అడిగింది వసుధ.

‘కాదు, నైట్ షిఫ్ట్. కానీ నేను ఒక నాలుగు రోజులు లీవ్ పెట్టాను. తను నా ఫ్రెండ్ ప్రియ. నిన్న డాక్టర్ ని కలిసాం. అస్సలు కుదరదు అబార్షన్ ఇంత లేట్ గా అని అన్నారు.’ తన స్నేహితురాలిని పరిచయం చేస్తూ అంది స్వప్న.

కలిసిన పరిస్థితుల ప్రభావం వల్ల కాబోలు, ఆ అమ్మాయి కేసి చూసి చిన్నగా నవ్వినా, వసుధకు కాస్త ఇబ్బందిగా అనిపించింది. ఏం మాట్లాడాలో తోచలేదు తనకు. ఒక రెండు నిముషాలు చిత్రమైన నిశ్శబ్దం ఆ కారిడార్ లో.

‘ఎటో వెళ్తున్నట్టున్నారు?’ స్వప్న అడిగింది.

‘పక్కనే మార్కెట్ కి వెళ్తున్నా. మళ్ళీ కలుద్దాం’ అని చెప్పి అక్కడి నుండి లిఫ్ట్ వైపు నడిచింది. లిఫ్ట్ బటన్ నొక్కి వెనక్కి తిరిగి చూసింది వసుధ. ఇద్దరూ లోపలికెళ్ళి తలుపేసుకోవడం చూసి నిట్టూర్చింది. కొన్ని సార్లు మనం చేసే చిన్న చిన్న పొరపాట్లకు చాలా భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది.

***

శనివారం కావడంతో మధ్యాహ్నం కొద్దిగా విశ్రాంతిగా కూచుని ఎన్నో నెలలుగా తాను కొంచెం కొంచెంగా వేస్తున్న పెయింటింగ్ పూర్తి చేయడానికి పూనుకుంది.

పెళ్ళిలో భయంకరమైన నరకం చూసిన వసుధ, విడాకులు తీసుకున్న తరువాత ఆ జ్ఞాపకాల నుండి అబ్యూస్ తాలూకు గుర్తులు చెరిపేసి సంతోషకరమైన జ్ఞాపకాలను నింపుకోవడానికి ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. అందుకే ఎప్పుడూ ఏదో ఒక పని చేస్తూ బిజీగా ఉంటుంది. పుస్తకాలు చదువుతుంది. కొన్ని NGO సంస్థలకు వాలంటీర్ గా కూడా పనిచేస్తుంది.

ఇంతలో డోర్ బెల్ మోగింది. వెళ్ళి తలుపు తీస్తే ఎదురుగా స్వప్న, ప్రియలు కనిపించారు. వాళ్ళు వచ్చి హాల్ లో సోఫాలో కూచున్నారు. అంతకు ముందు స్వప్న ఇంట్లోకి చాలా సార్లు వచ్చినందు వల్ల అలవాటుగా పక్కనే ఉన్న డైనింగ్ రూమ్ లోని ఫ్రిడ్జ్ దగ్గరకు వెళ్ళి మంచి నీళ్ళు తాగి, వాటర్ బాటిల్ ప్రియాకు తెచ్చి ఇచ్చింది. ప్రియ ఇల్లంతా కలియజూస్తూ కూచుంది. ఇద్దరూ వసుధ వేస్తున్న పెయింటింగ్ చూసి కాసేపు వసుధని పొగిడారు.

కాసేపటికి వసుధ లేచి వెళ్ళి ఉప్మా వండటం మొదలు పెట్టింది. హాల్ లో టి.వి. శబ్దం మొదలయింది. టామ్ అండ్ జెర్రీ చూస్తూ నవ్వుతున్న స్వప్న, ప్రియాల నవ్వులు వింటూ వసుధ ఎసట్లో రవ్వ వేసింది.

ఉప్మా రెడీ అయ్యాక హాల్ లో కి వెళ్ళగానే “ఉప్మా ఘుమ ఘుమలాడి పోతుంది, అక్క!’ చనువుగా అంది స్వప్న.

వసుధ నవ్వి, ‘మీ కోసమే చేసాను. రండి వడ్డిస్తాను.’ అంటూ డైనింగ్ రూమ్ లో కి దారి తీసింది వసుధ. ఆ వెనకే ప్రియ, స్వప్న వచ్చి కూచున్నారు. వాళ్ళకు ఉప్మా వడ్డించిన ప్లేట్స్ అందించి, తను ఒక ప్లేట్ తో వాళ్ళ ఎదురుగా కూచుంది.

“కరివేపాకు పొడి ఉంది, లేదంటే ఉసిరి తొక్కు, ఆవకాయ కూడా ఉన్నాయి. మీకేం కావాలంటే అవి వేసుకోండి.’ వాళ్ళ వైపు పొడి ఉన్న చిన్న సీసా తోస్తూ అంది వసుధ.

“రెండు మూడు రోజులు అస్సలు కనిపించలేదు.. ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళారా?’ ఉప్మా లోకి తనకు ఇష్టమైన ఆవకాయ నంజుకుంటూ అడిగింది వసుధ.

ఒక రెండు నిముషాలు ఏమీ మాట్లాడలేదు ఇద్దరూ. ఉప్మా తినడం లో నిమగ్నమైనట్టు కనిపించారు. కానీ అంతలోనే స్వప్న మాట్లాడటం మొదలు పెట్టింది.

‘లేదు అక్కా! ప్రియ బాయ్ ఫ్రెండ్ వాళ్ళ రూమ్ లో ఉన్నాం. అదే ప్రెగ్నన్సీ గురించి ఏం చేయాలో డిస్కస్ చేసుకుంటూ ఒక నిర్ణయానికి వచ్చాము. వరుణ్ కి అస్సలు ఇష్టం లేదు. ఎలాగైనా సరే తీయించేసుకొమ్మంటున్నాడు. మేము ముందు కలిసొచ్చిన డాక్టర్ ససేమిరా అబార్షన్ కి ఒప్పుకోలేదు. పేరెంట్స్ తో మాట్లాడతాను, బాయ్ ఫ్రెండ్ కి నచ్చచెప్తాను అని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేశారు. వరుణ్ ఒక హాస్పిటల్ రెఫర్ చేశాడు. అక్కడ ఏమి అడక్కుండా వాళ్ళు అడిగినంత డబ్బిస్తే అబార్షన్ చేస్తారంట. రేపు వెళ్ళి అడ్మిట్ అయితే, ఎల్లుండి కల్లా ఇంటికొచ్చేయొచ్చు.’ అసలు కథ వివరించింది స్వప్న.

వసుధ సాలోచన గా ప్రియ వైపు చూసింది. అందమైన మొహం. చూడటానికి కొద్దిగా బొద్దుగానే ఉంది. ప్రెగ్నన్సీ వల్ల వచ్చిన గ్లో కావొచ్చు.. నిండుగా ఉంది పిల్ల. ‘ఇంతకీ నీ మనసులో ఏముంది?’ అడిగింది వసుధ ప్రియ ను.

ఆ అమ్మాయి నిజంగానే తక్కువగా మాట్లాడుతుందో లేక ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావం వల్ల నిశ్శబ్దంగా ఉందో తెలీదు కానీ, వారం క్రితం చూసినప్పటి నుండి ఇప్పటి దాకా మొదటి సారి ప్రియ అన్ని మాటలు మాట్లాడటం వింటోంది వసుధ. ‘ఇప్పుడింక అనుకునేది ఏముంటుందండీ? మొదట్లో భయమేసింది. ఒక వేళ వరుణ్ సపోర్ట్ చేస్తే ప్రెగ్నన్సీ కంటిన్యూ చేద్దామనే అనుకున్నా ఒక పాయింట్ లో. కానీ ఆ అబ్బాయి కి అస్సలు ఇష్టం లేదు. కన్విన్స్ చేస్తే ఇప్పటికి గిల్ట్ వల్ల ఒప్పుకున్నా, తరువాత ఇరుక్కుపోయినట్టు గా ఫీల్ అవొచ్చు. ఇదేమి రెండు మూడు రోజుల కథ కాదు కదా! జీవితాంతం భుజాల మీద మోయాల్సిన బాధ్యత. తీరా రేపు పాప పుట్టాక తనకు ఇవ్వాల్సినంత ప్రేమ ఇవ్వకపోతే అది నేను భరించలేను. పూర్తిగా ఆ పాపకు అన్నీ సమకూర్చగలము అనుకుంటేనే తనని ఈ ప్రపంచం లోకి తేవాలి. లేకపోతే అస్సలు తీసుకురాకూడదు. నాకు కూడా ఇంకో ఆరు నెలల్లో నర్సింగ్ బాచిలర్స్ అయిపోతుంది. IELTS రాసి UK వెల్దామనుకుంటున్నాను. ఈ మూమెంట్ లో నాకు నా కెరీర్ చాలా ఇంపార్టెంట్. అందుకే అబార్షన్ చేయించుకుందామనే నిర్ణయించుకున్నాను.’ నిదానంగా చెప్పినా.. చాలా గట్టి మాటే చెప్పింది.

వసుధకు సిద్ధార్థ్ తో పెళ్ళైన మొదట్లో ఆమె అత్తగారు పిల్లలని ప్లాన్ చేసుకొమ్మని ఒకటే పోరు పెట్టేది. సిద్ధార్థ్ కి పీకల్లోతు అనుమానం, జాబ్ స్టెబిలిటీ ఉండేది కాదు, అస్సలు బాధ్యత లేకుండా తిరిగే వాడు. ఏమైనా అడిగితే పోట్లాటలు, గొడవలు.. వసుధను కొట్టడం దాకా వచ్చింది చాలా సార్లు. అందుకే వసుధ పిల్లల్ని కనాలనే ఆలోచన పక్కన పెట్టేసింది. కానీ అత్తగారు మాత్రం పిల్లో, పిల్లాడో పుడితే అన్ని సర్దుకుంటాయని, సిద్ధార్థ్ బాధ్యత గా ఉంటాడని చెప్పుకొచ్చేది. అయినా అసలు అదేం లెక్కో అర్థం అయ్యేది కాదు వసుధకు. అలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఇంకొకరిని కనడం ఇష్టం లేక కుదరదని ఖచ్చితంగా చెప్పేసింది. సిద్ధార్థ్ తో విడిపోయాక ఒకరిద్దరు బంధుమిత్రులు కూడా అలాంటి సలహానే తన మొహాన పడేసారు… పిల్లలు పుడితే పెళ్ళి నిలబడేది అని. తిక్క రేగేది తనకు.

అసలు తనలోనే ఏదో లోపం ఉందని అనుకున్న వాళ్ళూ లేకపోలేదు. వాళ్ళందరి నోర్లు మూయించడానికైనా ఒక్క నలుసుని కనమని వసుధ తల్లి కూడా ఒకటి రెండు సార్లు బలవంత పెట్టింది. ఎవడికో ఏదో ప్రూవ్ చేయటానికి పిల్లల్ని కనడం మూర్ఖత్వం. వాళ్ళేమైన పోషిస్తారా? అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి లాజిక్స్ ఎవరు కనిపెడతారో! కనపడితే ఉప్పు పాతర వేసి ఊరేయాలి. పాడైపోతున్న పెళ్ళిళ్ళ ను రిపేర్ చేసే గ్లూ పిల్లల్ని కనడం అన్న ఆలోచన మారే దాకా ఇండియా లో జనాలు బాగుపడరు. తనని అడిగితే ఎవరితో అయినా కనీసం ఒక మూడేళ్ళు గడిపి, అన్నీ కుదిరాయి, అనుకుంటేనే పిల్లల్ని కనడం ఉత్తమం.

చిన్న వయసులో ప్రియ కున్న ముందు చూపు చూసి ముచ్చటేసింది వసుధకు. ‘ఇంతకీ మీ పేరెంట్స్ తో మాట్లాడావా? వాళ్ళతో ఒక మాట చెప్పాల్సింది. మొదట ఒక మాట కోప్పడినా, కనీసం ఈ టైంలో నీకు తోడుగా ఉంటారు కదా!’

అదోలా నవ్వింది ప్రియ, ‘వాళ్ళకు అంత తీరిక ఎక్కడిది? నన్ను ఇక్కడ కాలేజ్ లో చేర్పించాక ఒక్క సారి కూడా వచ్చి చూడలేదు. ఫోన్ లో మాట్లాడతారు రోజూ కానీ ఏదో ఎంక్వయిరీ చేయడానికి చేసినట్టుంటుంది వాళ్ళ ధోరణి. స్వప్న ఉంది కదా, పైగా ఒక్క రోజు పనే. ఐ విల్ బి ఫైన్.’ అంది.

తినడం అయ్యాక, ప్లేట్స్ సింక్ లో పెట్టేసి, చేతులు కడుక్కున్నారు. వెళ్ళి బాల్కనీలో కూచుని కాసేపు కొత్త కొత్త సినిమాల గురించి, వెబ్ సిరీస్ గురించి, పిచ్చాపాటి మాట్లాడుకున్న తరువాత వాళ్ళు ఫ్లాట్ కి వెళ్ళడానికి లేచారు.

‘రేపు ఏదైనా అవసరం ఉంటే, నాకు చెప్పండి. డోంట్ హెసిటేట్.’ అని చెప్పింది వసుధ.

సరేనంటూ తలాడించి వెళ్ళిపోయారు వాళ్ళు.

***

ఆదివారం సాయంత్రం ప్రియ అడ్మిట్ అయిన హాస్పిటల్ కి ఫ్రూట్స్ తీసుకుని వెళ్ళింది వసుధ. అదేదో భూత్ బంగ్లా లా ఉంది ఆ హాస్పిటల్. ఎక్కువ బెడ్స్ కూడా లేవు. నేరుగా ప్రియ ఉన్న రూమ్ కి వెళ్ళింది. అప్పటికే అబార్షన్ అయిపోయి, పడుకుని ఉంది ప్రియా. పక్కనే చిన్న ఇనుప బల్ల మీద ఆ రోజు వీక్లీ లో పదచదరంగం పూరిస్తూ కూచుంది స్వప్న. పక్కనే వెళ్ళి కూచుంది వసుధ.

‘ఎలా ఉంది తనకు?’ ప్రియ వైపు చూస్తూ అడిగింది వసుధ.

‘ఒక త్రీ అవర్స్ ముందే అయింది. రాత్రి అంతా అబ్సర్వేషన్ లో ఉంచి రేపు ఉదయం డిశ్చార్జ్ చేస్తారంట. ఆపరేషన్ థియేటర్ కి వెళ్ళేప్పుడు పాపం బాగా నెర్వస్ అయింది తను. కానీ ఎలాగో ధైర్యం తెచ్చుకుంది.’ చెప్పింది స్వప్న.

‘ఆ అబ్బాయి వచ్చాడా?’

‘లేదక్కా! ఏదో అర్జెంటు పని ఉందంట, వాళ్ళ ఊరెళ్తున్నానని చెప్పి వెళ్ళాడు.’

ఆశ్చర్యం వేసింది వసుధ కు. ఎంత చిత్రం కదా! ఇందులో అతనికి సమాన బాధ్యత ఉన్నా, ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో ప్రియ ని ఒంటరిగా వదిలేసి వెళ్లాడంటే, అతను ఎలాంటి వాడో ఊహించుకోగలదు తను. అయినా ఇలాంటి మగ వాళ్ళు మన చుట్టు పక్కల కోకొల్లలు.

‘పోన్లే! అంతా సవ్యంగానే అయింది కదా..’

‘హా.. పాప. ఎంత అందంగా ఉందో! చిన్ని చేతులు, గోర్లు కూడా ఫామ్ అయ్యాయి. ఇదిగో ఫోటో తీసా నేను.’ అంటూ తన మొబైల్ తీసి ఫోటోలు చూపించసాగింది స్వప్న.

ఎక్కువ సేపు ఆ ఫోటోల వైపు చూడలేకపోయింది వసుధ.

‘ఇక్కడ ఆయాలే తీసుకెళ్ళి బేబీ ని పూడ్చేస్తారంట.’ చెప్పింది స్వప్న.

కాసేపటికి ప్రియ మేలుకుంది. వసుధ వెళ్ళి తన పక్కన నిలబడింది. వసుధను చూడగానే వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ మెల్లిగా నవ్వింది ప్రియ. వెంటనే వసుధ ప్రియను గట్టిగా హత్తుకుంది. ఒక్క సారిగా గట్టిగా ఏడ్చేసింది ప్రియ. వసుధ ఏమి మాట్లాడకుండా అలాగే పట్టుకుని ఉంది. ఎన్ని మాటలు చెప్తే తీరుతుంది ఈ బాధ? ప్రియ ఏడుపు విని స్వప్న కూడా వచ్చి ప్రియ పక్కనే కూచుని ప్రియ చెయ్యి పట్టుకుంది.

ఒక ఐదు నిముషాల తరువాత నెమ్మదించింది ప్రియ. డిశ్చార్జ్ అయ్యాక నేరుగా తన దగ్గరికే వచ్చి ఒక వారం రోజులు రెస్ట్ తీసుకొమ్మని చెప్పింది వసుధ. ముందు కాదన్నా, వసుధ బలవంతం మీద ఒప్పుకుంది ప్రియ.

శరీరం కట్టుకోవడం సులువే కానీ, మనసు కట్టుకోవడానికే సమయం పడుతుంది. వసుధకు తన అబార్షన్ గుర్తొచ్చింది. తన తల్లి వొద్దని ఎంత చెప్పినా వినకుండా ఒక్కతే వెళ్ళి అబార్షన్ చేయించుకుని వచ్చింది. ఆ తరువాత ఎన్ని నిద్ర లేని రాత్రులో, ఎన్ని కన్నీళ్ళో! ముక్కలుగా విరిగిపోయిన మనసు థెరపిస్ట్ దగ్గరికి ఆరు నెలలు వెళ్తే తప్ప కోలుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ఈ క్షణం అడిగినా తను తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోదు.

అలసిపోయింది కాబోలు, కాసేపటికి మళ్ళీ మగత నిద్రలోకి జారుకుంది ప్రియ. తన నుదుటి మీద ముద్దు పెట్టి, స్వప్నకు బై చెప్పి అక్కడి నుండి బయల్దేరింది వసుధ. పర్లేదు.. అస్తమయాల్లోంచే కదా ఉదయాలు పుడతాయి! విరిగిన కొమ్మలకు కూడా చిగుర్లు పూస్తాయి.

బైక్ స్టార్ట్ చేసి చూస్తే ముందు టైర్ పంక్చర్ అయ్యి ఉంది. చిరాకు పడుతూ చుట్టూ చూస్తే, హాస్పిటల్ పక్కనే ఉన్న మెకానిక్ షాప్ కనిపించింది. హమ్మయ్య అనుకుని తోసుకుంటూ వెళ్ళింది అక్కడికి. ఒక పన్నెండేళ్ళ అబ్బాయి బైక్ రిపేర్ చేస్తూ కనిపించాడు. వసుధని చూసి, ఆ అబ్బాయి లేచి, చేతులు మాసిన చొక్కాకి తుడుచుకుంటూ వచ్చాడు.. ‘క్యా హువా మేడం?’

‘పంక్చర్ అనుకుంటా!’

‘దస్ మినిట్ బైఠో, మై బనా దేతు’ అంటూ లోపలి నుండి ఒక చిన్న స్టూల్ తెచ్చి ఒక పక్కగా వేసాడు.

‘ఛాయ్ పీతే క్యా, మేడం?’ అడిగాడు మెకానిక్ అబ్బాయి. తలాడించింది వసుధ.

‘చిచ్చా, ఏక్ ప్యాలి అద్రక్ వాలీ, ఖలీల్ కే హాథ్ జరా ఇధర్ భేజో!’ పని చేస్తూనే కేకేసాడు ఆ అబ్బాయి.

రెండు నిమిషాల్లో ఛాయ్ తెచ్చిచ్చాడు ఖలీల్. మురికిగా ఉన్నా, ముద్దుగా ఉన్నాడు.

ఛాయ్ తాగుతూ లోపలి నుండి ఎఫ్ ఎం లో మాసూమ్ సినిమా లోని ‘తుజ్ సే నారాజ్ నహీ జిందగీ, హైరాన్ హూ మై’ పాట వింటూ కూచుంది.

పుట్టింది కడప. గత పదిహేడేళ్ళుగా హైదరాబాద్ లో ఉంటున్నారు. పుస్తక ప్రేమి. కవయిత్రి. కథా రచయిత్రి. మీర్కట్ ప్రెస్, పెంగ్విన్ రాండమ్ హౌస్ లాంటి అనేక పబ్లిషింగ్ సంస్థలకు www.theclippednightingale.com అనే బ్లాగ్ లో పుస్తక సమీక్షలు రాస్తారు. ఈ మధ్యే కవితలు, కథానికలు రాస్తున్నారు. వృత్తి రీత్యా ఒక IT కంపెనీకి రిక్రూటింగ్ మేనేజర్ గా పనిచేస్తున్నారు.

One thought on “విరిగిన కొమ్మలు

  1. అస్తమయాల్లోంచే కదా ఉదయాలు పుడతాయి! విరిగిన కొమ్మలకు కూడా చిగుర్లు పూస్తాయి.

    ఎంత బాగా రాసారండీ 👌👌

Leave a Reply