విరామ చిహ్నం

నీకు నాకు మధ్య గుప్పెడే దూరం 

భూమ్యాకాశాల మధ్య క్షితిజరేఖకు మల్లే.

నీకు నాకు మధ్య పలుచని తెర   

నిశికి ప్రత్యూషానికి మధ్య మంచల్లే 

నిన్ను చూసిన  తొలిక్షణంలోనే 

శ్రావణమేఘమల్లే కమ్ముకున్న సంతోషపుదిగులు 

మీరంతా అది ఈస్ట్రోజెన్ ప్రకోపం అని సూత్రీకరించవచ్చు 

కానీ నాకు మాత్రం అది నేను నిజంగా జీవించిన క్షణం. 

సిగ్గు విడిచి నా ప్రేమను నీకు వ్యక్తపరిచినప్పుడు

నీవెంత సిగ్గుగా సంబరపడ్డావో గుర్తుందా?

నేను సంకోచపుమడతల క్రింద దాచిపెట్టిన  ఊసులన్నిటినీ 

నీ ఓరెగామి చూపులతో పిట్టల్ని చేసి ఎగరేసావు గుర్తుందా? 

మల్లెలు విచ్చుకుంటున్న  నిశ్శబ్దాన్ని చెవులు రిక్కించి వింటున్న పూదోటలో 

ఆషాఢమాసపు వెన్నెలరాత్రి నాఅరచేత ఉదయించిన సూర్యుణ్ణి 

విస్మయంగా ముద్దిడిన నీ పెదవుల వెచ్చదనం ఎప్పటికీ నిత్యనూతనమే.

నీకు నాకు మధ్య మాటలక్కరలేని మౌనఆత్మనివేదన 

నదికి రహస్యంగా సంగీతాన్ని ధారపోస్తున్న తేమగాలి మల్లే

నీకు నాకు మధ్య ఊపిరిసలుపని సాన్నిహిత్యం 

గాఢంగా చెట్టునల్లుకున్న మాధవీలత మల్లే 

నీకు నాకు మధ్య బేషరతు ఒప్పందం 

ఇకపై నువ్వు నేను కాదు… మనమని.

కానీ 

నీకు నాకు మధ్య  ఉండాల్సింది ఓ చిటికెడు మౌనం 

గుసగుసల రహస్యానికి ఉద్వేగపు గుండెచప్పుడుకీ మధ్య విరామమల్లే.

నీకు  నాకు మధ్య ఉండాల్సింది కొద్దిపాటి పర్సనల్ స్పేస్

సుదీర్ఘ  ఏకవాక్య కవిత మధ్య విరామచిహ్నమల్లే.

జననం: రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ .  కవి , విశ్రాంత ఉపాధ్యాయుడు. కవిత్వంలో ఫోటోగ్రఫీ, ఫొటోగ్రఫీ లో కవిత్వం వెతుక్కోవడం హాబీలు.

One thought on “విరామ చిహ్నం

Leave a Reply