విరసం నాకో చూపునిచ్చింది.

విరసం కొన్ని దశాబ్దాలుగా ఆటుపోట్లను, నిర్బంధాలను, అణిచివేతల్ని, కుట్ర కేసుల్ని ఇలా అనేక రకాలుగా రాజ్యపు దమన నీతిని ఎదుర్కొంటూనే ఉన్నది. అయినా సాహిత్య, రాజకీయ, సాంస్కృతిక రంగాల్లో తన కృషిని ఆపకుండా ఎప్పటికప్పుడు పీడిత, తాడిత ప్రజల సమస్యలపై, రాజ్యపు క్రూరత్వంపై, పాలకుల ప్రజా వ్యతిరేక విధానాలపై స్పందిస్తూనే ఉన్నది. ఇప్పుడు విరసం తన ఐదు పదుల (ఐదు దశాబ్దాల) వసంతాల ధిక్కార పతాకను తెలుగు నేలపై ఎగరేస్తున్నది. ఈ యాభై ఏండ్లలో విరసం ఎన్నో ఒడిదుడుకుల మధ్య కూడా మూడు తరాల వారధిగా నిటారుగా నిలబడింది. తన రాజకీయాలను ఒక కాగడాగై యావత్ భారత దేశానికే నిప్పును జ్వలించింది. విరసం ఎందరో కవుల్ని, మేధావుల్ని, నాయకుల్ని, తెలుగు నేలకు, భారత దేశానికి అందించింది. విశాఖ విద్యార్థులు వేసిన ప్రశ్నను ‘రచయితలారా మీరెటు వైపు?’ అన్న ఆ ప్రశ్నను ఇప్పటికీ విరసం పీడిత ప్రజలవైపే నిలబడుతామంటూ సగర్వంగా చెపుతున్నది. జల్, జంగల్, జమీన్ లకై సాగుతున్న వర్గపోరాటాన్ని ఎత్తిపడుతున్నది. సుబ్బారావు పాణిగ్రాహి, చెరబండరాజు, అలిశెట్టి ప్రభాకర్, ఎందరో అమర వీరుల త్యాగాల్ని, వారి వారసత్వాన్ని కొనసాగిస్తున్నది. నక్సల్బరీ, శ్రీకాకుళ రైతాంగ పోరాటాలు, సిరిసిల్ల జగిత్యాల జైత్రయాత్రలు ఇలా ఎన్నో పోరాటాలను సాహిత్య రంగ కృషితో ప్రజలకు అనుగుణంగా చరిత్రను లిఖించి ముందు తరాలకు అందించింది విరసం. తన ఈ యాభై ఏండ్ల ప్రయాణంలో ఎందరో యువ కవులందరికి ఒక దిక్సూచిగా నిలబడ్డది విరసం.

అసలు నేను విరసంలోకి ఎలా వచ్చాను? విరసంలోకి రావడానికి గల ప్రేరణ ఏంటి? నా రాజకీయ నేపథ్యం ఏంటి? నాది సాధారణ మధ్యతరగతి కుటుంబం. పుట్టిపెరిగిన ఊరు మెతుకు సీమ జిల్లా సిద్దిపేటైనా గానీ కుద్దు (స్వంత ఊరు) సిరిసిల్లా తాలుకా మండపల్లి గ్రామం. నా బాల్యం రెండు మూడేండ్లు కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం రాఘవపూర్లో మా మేనత్త దగ్గర గడించింది. కొంత కాలానికి మళ్లీ నేను సిద్దిపేటలో చదువుకున్నాను. నా చదువులన్నీ సిద్దిపేట కేంద్రంగానే కొనసాగాయి. ఎమ్మెస్సీ(ఫిజిక్స్) చదివాను. ఈ చదువంతా అమ్మ చేసిన బీడీల పైసలతో, నాయినమ్మ ఫించన్ తో సాగింది. ఇంత చదివినా ఉద్యోగం చేయలేదా? అంటే, డిగ్రీలో కంప్యూటర్ సైన్స్ చేస్తున్న రోజుల్లో ఒక ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం వచ్చింది. కానీ, చెయ్యాలని ఆసక్తి లేదు. అందుకే వదిలేసాను. అసలు ఉద్యోగం వైపు ఆలోచనలు మళ్లీ రాకుండా పోయింది. ఎందుకంటే నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో విప్లవ విద్యార్థి రాజకీయాల్లోకి వచ్చాను. తాత నరసయ్య రజాకార్ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొని ప్రభుత్వ ఉద్యోగం చేసాడు. నాయినమ్మ తెలంగాణ కోసం నల్ల జెండా ఎగరేసి కమ్యూనిస్టు రాజకీయాల వైపు సాగింది. అలా వాళ్ళ ప్రభావం ఇంటిల్లిపాదిపై పడింది. అయినా నాన్న మొదట కాంగ్రెస్ వాది. నాన్న కొంత కాలానికే కాంగ్రెస్ నుండి కమ్యూనిస్టు రాజకీయల వైపు మళ్లాడు. 1984 సంవత్సరంలో నాన్నకు విప్లవ కమ్యూనిస్టు రాజకీయాల పరిచయాల వల్ల తాను విప్లవ రాజకీయాల వైపు రాగలిగాడు. అలా నాన్న వల్ల మా కుటుంబానికి విప్లవ రాజకీయాల పరిచయం. అప్పటి వరకు అమ్మకు విప్లవ రాజకీయాలతో ఏకీభావం లేదు. అయినా తాను ఎప్పుడూ నాన్నకు అడ్డు చెప్పేది కాదు. నాన్న సంఘం సంఘమంటూ మా చదువుల్ని, అమ్మ సుగుణమ్మ, నాయినమ్మ మైసమ్మ ఇద్దరే చూసుకునే వాళ్ళు. నాకు ఊహ తెలిసిన కాడి నుండి నిత్యం ఇంట్లో ఒక ఇరవైకి పైగా పొద్దు మాపు వచ్చే వాళ్ళు. తినే వాళ్ళు. ఒక రోజు ఇంట్లో బియ్యం లేకపోతె అమ్మ, నాయినమ్మ వాళ్ళు ఉన్న కాడికి వండి వచ్చిన వాళ్ళకు పెట్టి పంపారు. మాకు నూకలతో వండిపెట్టి వాళ్ళు పస్తులున్నారు. ఇలా చాలా సార్లు వాళ్ళు పస్తులున్నట్టు గుర్తు. అలా అమ్మ విప్లవ రాజకీయాలతో ఏకిభవించక పోయినా తొందర్లోనె ఆ రాజకీయాలవైపు నడిచింది. నా బాల్యం ఎన్నో కష్టాల మధ్య సాగింది. 1997-98లో రెండు సార్లు పోలీసులు మా ఇంట్లో సోదాచేసి నాన్నను అర్రెస్టు చేసారు. నాన్న ఎన్నో నిర్బంధాలను ఎదురుకున్నాడు. ఎన్నో ఒడిదుడుకులొచ్చాయి. అయినా నాన్న ఎప్పుడూ సంఘాన్ని వీడలేదు. అలా నాన్న ప్రభావం మా ఇంట్లో అందరిపై పడ్డది. నేను విప్లవ విద్యార్థి రాజకీయాల వైపు రావడానికి కారణం కూడా.

విప్లవ రాజకీయాలు సీపీఐ(ఎం.ఎల్)జనశక్తి పార్టీ ద్వారా మా గడప తట్టాయి. మా ఇల్లు ఎందరో విప్లవ కార్యకర్తలకు కేంద్రంగా ఉన్నది. గడపదొక్కిన వాళ్ళందరిని తమ బిడ్డలుగా భావించి కడుపునపెట్టుకొని సాదుకున్నారు. అలా కొంతకాలం గడిచింది. ఎందరికో పుట్టినిల్లుగా మారింది. అలా కొంత కాలం తరువాత రాజ్యపు చిత్రహింసల్లో భాగంగా ఇంటిపై రైడ్ జరిగింది. నాన్నను అరెస్టు చేశారు. నాన్న నాకు అప్పుడప్పుడు విప్లవ రాజకీయాల గూర్చి చెప్పేవాడు. అమరుల గూర్చి, అప్పటి పోరాటాల గూర్చి అలా నాన్న దగ్గర నుండి నాకు పాలమూరు వాళ్ళు వేసిన సెంట్రీ పుస్తకం అందింది. మాదిగ రిజర్వేషన్ పోరాటం కూర రాజన్న, చలపతన్న రాసినది అందింది.

నాన్న ద్వారా సాహిత్యం పరిచయమైనా, మిత్రుల ద్వారానే సాహిత్యంపై ఆసక్తి పెరిగింది. విద్యార్థి ఉద్యమ మిత్రులతో కలసి కృష్ణ క్యాంపెయిన్ వెళ్ళినప్పుడు మోహన్, నరేష్ ల ద్వార నేను మరింతగా సాహిత్యాన్నిఅధ్యయనం చేశాను. అప్పటివరకు నాకు అమర్ సాహిత్యంతోనే పరిచయం. తప్పుల తడకగా రాసే నా రాతల్ని అరుణోదయ మిత్రులు సరిచేసి సూచనలిచ్చారు. సాహిత్యాన్ని మరింతగా నేర్చుకోవాలనే తపనతో విరసం కార్యక్రమాలకు వెళ్ళే వాడిని. అలా విరసం కార్యక్రమాల ద్వారా ఎందరో మిత్రులు పరిచయమయ్యారు. ఇంకా లోతైన అధ్యయనం, ఆచరణ కోసం విరసంలో చేరాలనుకున్నాను. జనశక్తి రాజకీయాల్లో ఉన్న నేను 2016 పాలమూరు విరసం సభల్లో విరసం శాశ్వత సభ్యుణ్నయ్యాను.

విరసంలోకి రాక మునుపు చాలా వరకు సాహిత్యం మిత్రుల ద్వార పరిచయమైనది. మా ఊరు ఉపసర్పంచ్ ఇచ్చిన వరవరరావు కవిత్వం భీజభూమి, కళ్యాణ రావు రాసిన అంటరాని వసంతం. సాగర్ ద్వారా వరవరరావు కవిత్వం చదివాను. నరేష్కుమార్ సూఫీ నాకు కెన్ సారో వివాను పరిచయం చేశాడు. లాల్ బనో గులామీ ఛోడో, కాశీం కవిత్వం, ధ్వంసమైన స్వప్నం, నేనే కవిత్వం భైరాగి మోహన్, ఏడు తరాలు పుస్తకాలు విమలక్క ద్వారా చదివాను. కథకాని కథ నాకు గోవర్ధనన్న పరిచయం చేసాడు. జనతన సర్కార్, నక్సల్భరీ వెలుగులో వరలక్ష్మి ద్వారా చదవగలిగాను. గుగివా తీయాంగో ని అరవింద్ పరిచయం చేసాడు. మరికొన్ని వావిలాల సాయికుమార్ నాకు పరిచయం చేసాడు. ఇలా వీటి ద్వార ఎక్కువ ప్రభావం వలన మరియు నాకు రచన రంగంపై ఉన్న ఆసక్తి వలన నేను విరసంలోకి రావడాని ప్రధాన కారణమైయింది.

నాపై చాలా ప్రభావం విరసం చూపింది. జనశక్తి రాజకీయాల్లో నాకు దొరికిన ప్రేమ, ఆప్యాయతలు విరసంలో కూడా దొరికాయి. నన్ను నన్నుగా నిలబెట్టిన వాటిలో జనశక్తి, విరసంలది ప్రధాన భూమిక. పాలకులు అమలు చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించినందుకు నాపై కుట్రకేసు బనాయించింది రాజ్యం. డెభ్బై ఐదు రోజులు జైల్లో బంధించింది. జైలు జీవితంలో కవిత్వమే నా ఆలోచనలకు పదును పెట్టింది. ధైర్యాన్ని నింపింది.

కోరి కష్టాలు తెచ్చుకుంటున్నవు బిడ్డా… అనేది అమ్మ. అమ్మ మాటలకు ఓదార్పుగా జైలు నుంచి కవిత్వం రాసిన. ఆ అక్షరాలకు ప్రేరణనిచ్చింది విరసం చూపే. నా ఆలోచనలను నిత్య నూతనం చేయడానికి విరసం, జనశక్తి రాజకీయాలే కారణం. జనశక్తి రాజకీయాల ద్వార వర్గ పరిశీలన నేర్చుకున్నాను. ఆ వర్గ పరిశీల రచనను విరసం ద్వారా అక్షర రూపంగా రాస్తున్నాను. విరసం నా రచనపై చాలా ప్రభావం చూపింది. మునుపు లాగా తప్పులతడకలా కాకుండ అల్లికను నేర్చుకోగలిగాను. ఒక అంశం పట్ల రాజకీయ కోణం చూడగలిగాను. నిబద్దత ఎంత ముఖ్యమో మన బాధ్యత అంతె అని గుర్తించగలిగాను. వ్యక్తిగతంగా విరసం నన్ను నన్నుగా నిలబెట్టింది. నా రాజకీయ ఆలోచనలకు పదునుపెట్టింది. ఎప్పటికప్పుడు సమాజంలో జరుగుతున్న అన్యాయాలపై స్పందించేలా కర్తవ్యాన్ని నేర్పింది. నాలాంటి వారికి విరసం ఒక త్యాగల పరంపర వారధి. నా లాంటి ఎందరో యువతకు ఉత్తేజాన్నందించి నడిపిస్తోంది విరసం.

పుట్టిన ఊరు సిద్ధిపేట, పూర్వపు మెదక్ జిల్లా.  కవి, రచయిత, విరసం సభ్యుడు. ఎమ్మెస్సీ(భౌతికశాస్త్రం) చదివారు.  విద్యార్థి ఉద్యమ నాయకుడిగా విద్యార్థి సమస్యలపై పోరాటం చేస్తున్నారు. వివిధ పత్రికల్లో కవిత్వం, వ్యాసాలు, పాటలు ప్రచురితమయ్యాయి. రచనలు: వసంత మేఘం(కవిత్వం)

 

 

 

Leave a Reply