యాభై ఏండ్ల విరసంతో ఒక ఆత్మీయ సంభాషణ – 2

మహమూద్: విరసం సృష్టిస్తున్న వేరు వేరు ప్రక్రియలు యూత్ లోకి వెళుతున్నాయని మీరనుకుంటున్నారా?

వరలక్ష్మి : అసలు సాహిత్యం ఎంత మంది చదువుతున్నారు? వాళ్లలో ఎంత మంది మీ వెంట వస్తున్నారు? అనే జనరల్ ప్రశ్న ఒకటి ఉంది. ఎప్పుడూ సమాజంలోని ఒక స్థితి గురించి ఘర్షణ పడుతున్న వాళ్ళు ఉంటారు. ఇది ఇట్లా ఉందేంటి, ఇట్లా అయిపోతుందేమిటి? అని ఉన్న స్థితితో రాజీపడనితత్వంతో ఆలోచిస్తుంటారు. అలాంటి వ్యక్తులు ప్రతి జనరేషన్లోను ఉంటారు. వాళ్లలో ఒక శక్తి ఉంటుంది. అది సమాజ మార్పుకు సంబంధించిన ఎలిమెంట్. మార్పు క్రమంలో చరిత్ర ఎంపిక చేసుకున్న కొంత మంది మనుషులు చరిత్ర నిర్మాణంలో కీలకమైన భాగస్వామ్యం వహిస్తారు. మార్క్స్ దగ్గరి నుంచి, ఇంకా అంతకు వెనుక నుండి చూస్తే చరిత్ర మలుపుల్లో, ఒక ప్రాసెస్ లో భాగంగా చరిత్ర వాళ్ళను ఎంపిక చేసుకుంటుంది. వీళ్లే సంఘటిత శక్తిగా మారుతారు. అన్ని రంగాల్లో కూడా. ఇలాంటి చోటి నుంచి సాహిత్యం వస్తూ ఉంటుంది. అది చరిత్ర క్రమం నుంచి వస్తుంది. దాన్ని ప్రభావితం చేస్తుంది. దీని చుట్టూ ఉండే వాళ్లు ఇలాంటి సాహిత్యాన్ని చదువుతూ ఉంటారు. పాఠకులు లేకపోతే మన సాహిత్యంలోకి ఇంత శక్తి వచ్చేది కాదు. మామూలు మనుషులకు సాహిత్యం సమాజ మార్పు క్రమాల గురించిన అవగాహన ఇస్తోంది. అందులో భాగం చేస్తోంది. ప్రత్యేకించి విప్లవ సాహిత్యానికి ఈ లక్షణం ఎక్కువ. ఇది ప్రతి తరం విప్లవ సాహిత్యంలో కనిపిస్తుంది. ప్రతి జనరేషన్ కూడా విప్లవ సాహిత్య ప్రభావంలోకి వస్తోంది. అంటే విరసం వివిధ ప్రక్రియల్లో సృష్టిస్తున్న సాహిత్యం ప్రజల్లోకి వెళుతోంది. విశాఖ విద్యార్థుల నుండి ఇప్పుడు జెఎన్‌యూ విద్యార్థుల దాకా కరడుగట్టిన పాత భావాలతో ఘర్షణ పడుతున్నవ్యక్తులు ఉన్నారు. సంఖ్యగా కొద్ది మందే కావచ్చు. వీళ్ళు చరిత్ర నిర్మాణానికి చాలా ముఖ్యం. అటువంటి వాళ్ళతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో విరసం ఎక్కడో కనెక్ట్ అవుతోంది. కాబట్టి సాహిత్యానికి ‘ఆకర్షణ’ అనే జనరల్ అవుట్ లుక్ తో కాకుండా మనం ఇట్లా అర్థం చేసుకోవాలి. విరసంలో 100 మంది సభ్యులు కూడా లేరు. బహుశా ఎప్పుడూ లేరనుకుంటాను. కానీ వీళ్లు సృష్టించే సాహిత్యం ప్రభావాన్ని పాఠకులు లేకుండా ఊహించలేం.

మహమూద్: విరసంలోకి వేర్వేరు నేపథ్యాలు ఉన్నవాళ్లు వస్తున్నారా? ఆ డైవర్సిటీ ఉందని అనుకుంటున్నారా?

వరలక్ష్మి: తొలితరం విరసం సభ్యులను, ఈ తరం వాళ్ళని చూస్తే మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. యాభై ఏళ్ల కింద విరసం ఏర్పాటుకు కృషి చేసిన వాళ్ల, తొలి తరం సభ్యుల నేపథ్యాలకు ఉన్న పరిమితి మన సమాజానికి ఉన్నది. రెండో తరం నుంచే ఇది మారిపోయింది. ఇప్పుడు చాలా భిన్న సామాజిక నేపథ్యాల నుండి సంస్థలోకి వస్తున్నారు. నాయకత్వంలోకి కూడా వస్తున్నారు. సమాజ చలనాలు మారుతున్నాయి. ముఖ్యంగా విప్లవోద్యమ ప్రభావం ఆరంభం నుంచే వేర్వేరు పీడిత సమూహాల మీద ఉన్నది. వాళ్లు ఉ ద్యమంలోకి వచ్చారు. ఇంకా చాలా ప్రజాస్వామిక ఉద్యమాలు నడిచాయి. భిన్న సమూహాలు మేల్కొన్నాయి. అక్కడి నుంచి విరసంలోకి వచ్చారు. కాబట్టి విరసం సాహిత్యంలో కూడా ఆ డైవర్సిటీ ఉంది. వేర్వేరు నేపథ్యాల నుంచి విరసంలోకి రావడం వల్ల అనుభవంలో, అవగాహనలో కూడా డైవర్సీటీ ఉంది. కుల సమస్య నుండి పర్యావరణం దాకా మహిళలు, ఆదివాసీలు, ట్రాన్స్ జెండర్స్ దాకా విభిన్నఅంశాల మీద రచనలు చేస్తున్నవాళ్ళు విరసంలోకి వచ్చారు. అయినా వేరువేరు ప్రక్రియల ద్వారా యూత్ లోకి వెళ్ళడం గురించి ఇంకా చాలా ఆలోచించాలి. దీని మీద ఎప్పటికప్పుడు పనిచేయవలసింది చాలా ఉంటుంది. మెజారిటీ యూత్ ఏ ఆకర్షణల వెంట ఉన్నారో, ఎటువైపు ప్రభావితమవుతున్నారో మనం చూస్తున్నాం. యంగ్ సర్కిల్స్ లోకి ఆరెస్సెస్ చాల వేగంగా చొచ్చుకుని పోతోంది. మరోవైపు ఈ ప్రగతి నిరోధక భావాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న యువత కూడా ఉంది. వాళ్లు అత్యంత పీడిత సమూహాల నుంచి వస్తున్నారు. యూనివర్సిటీల్లో ఎంతో కొంత ఈ సంఘర్షణ ఉంది. ఇది నిర్దిష్టమైన కార్యాచరణ వైపు వెళ్ళవలసి ఉంది. దీనిని పట్టుకోవడం భావజాల రంగంలో పనిచేస్తున్న వాళ్ళకు చాలా అవసరం.

పాణి : విరసంలో డైవర్సిటీకి, విప్లవ సాహిత్యంలో డైవర్సీటీకి-సాహిత్య పాఠకులకు మధ్య సంబంధం ఉంది. అసలు విప్లవాన్ని అర్థంచేసుకోవడంలో డైవర్సిటీ ఉందా లేదా? అనేది చాలా ముఖ్యం. విప్లవ సిద్ధాంతం నుంచి విప్లవ రాజకీయ కార్యక్రమం తయారవుతుంది. దాని ద్వారా వేర్వేరు నిర్మాణాలు ప్రజలను సమీకరిస్తుంటాయి. మానవ జీవితంలోని ఏ ఏ కోణాల్లో విప్లవం ఎలాంటి ప్రభావం వేస్తోందో, ఏ జీవన కోణంలోంచి విప్లవానుకూల వాతారణం రూపొందుతోందో విప్లవ సాహిత్యకారులు గుర్తిస్తారు. అట్లాగే వ్యవస్థ వల్ల కలుగుతున్న మార్పులు కూడా ఉంటాయి. ఒక్కోసారి అవి చాలా తీవ్రంగా ఉంటాయి. వీటన్నిటినీ అర్థం చేసుకొనే క్రమంలో డైవర్సీటీ వస్తుంది. చాలా మంది తాము విప్లవాన్ని మూసగా అర్థం చేసుకుంటూ విప్లవోద్యమంలో, విప్లవ సాహిత్యంలో డైవర్సిటీ లేదని ఆరోపిస్తుంటారు. విప్లవోద్యమం వేర్వేరు జీవన రంగాల్లో, వేర్వేరు ప్రత్యేకతలు ఉన్న ప్రజా సమూహాల్లో పని చేసే క్రమంలో ఆచరణాత్మకంగా వైవిధ్యాన్ని సంతరించుకుంటుంది. ఇది కేవలం వైవిధ్యం కోసం కాదు. విప్లవం కోసం. ఈ అనుభవం,జ్ఞానం, విజయాలు, ఆటుపోట్లు విలువైనవి. ఈ మొత్తాన్ని జీవితం, చైతన్యం వైపు నుంచి విప్లవ సాహిత్యకారులు పరిశీలించి రచన చేస్తారు. ఇంత పని జరుగుతున్నదంటే ఆ విప్లవోద్యమం ప్రజల్లో లేకుండా, విప్లవ సాహిత్యానికి పాఠకులు లేకుండా అయ్యేది కాదు. ఇక్కడ ఆకర్షణ అనేది కూడా చర్చకు వచ్చింది. ఇది ఒక పారామీటర్. అసలు విరసంలోని ఆకర్షణ ఏమిటి? అనేది చాలా ముఖ్యమైన విషయం. కొంత మంది మాజీ విరసం సభ్యులు, అభిమానులు కూడా ఒకప్పుడు విరసంలో ఉండే ఆకర్షణ ఇప్పుడు లేదని అంటూ ఉంటారు. అసలు ఆకర్షణను ఎలా చూస్తున్నారు? అనేదే ప్రశ్న. బహుశా తమ తమ నేపథ్యాల నుంచి ఆ రోజుల్లో ఆకర్షణకు లోనైన స్థితిని సాధారణీకరిస్తున్నారని అనుకుంటాను. అప్పటికీ ఇప్పటికీ విరసంలోని ఆకర్షణ దేనిమీదైనా తటాపటాయింపు లేకుండా మాట్లాడటం. మొహమాటం లేకుండా వైఖరులు తీసుకోవడం. ఇదే సరైందని అనిపించడం. ఈ మాట అంటే ఉద్యోగాలు ఎక్కడ పోతాయో, పోలీసువాడు ఎక్కడ వస్తాడో, వచ్చే అవార్డు రాకుండా పోతుందో అనే గుంజాటన లేకుండా మాట్లాడటం ఎప్పటికీ విరసంలో ఉండే ఆకర్షణ. మా అనుభవం ఏమంటే మూడో తరం విరసం సభ్యులంతా ఈ ఆకర్షణకు లోనైనవారే. విరసం చుట్టూ ఉండే అభిమానులు, మిత్రులు కూడా అలా ఆకర్షణకు లోనవుతున్నవారే. బహుశా ఎవరైనా లెక్క తీస్తే .. విప్లవ సాహిత్యానికే మిగతా అన్ని రకాల ప్రగతిశీల సాహిత్య స్రవంతుల కంటే ఎక్కువ మంది పాఠకులు ఉన్నారని తేలుతుంది. విప్లవ రచయితలకు మిగతా రచయితలకంటే పాఠకులే కాదు, శ్రోతలు కూడా చాలా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇదంతా ఆకర్షణ అనవచ్చా? డైవర్సిటీ అనవచ్చా? కన్సి స్టెన్సీ అనవచ్చా? బహుశా అన్నీ కావచ్చు.

విప్లవ సాహిత్య ప్రభావాన్ని, కమ్యూనికేటివ్ సామర్థ్యాన్ని ఇంకా విశాలమైన ఫ్రేమ్ వర్క్ లో చూడొచ్చనుకుంటాను. ఇటీవలే ఒక ఫ్రెండ్ తన అనుభవం చెప్పాడు. నన్నది చాలా కొత్త ఆలోచనలకు పురికొల్పింది. 90 లలో ఒక పీడిత కులానికి చెందిన పిల్లవాడు .. తమ ఊళ్ళో దొర ఆ వీధిలోనుంచి పోతూవుంటే వీళ్ళ కుటుంబాలలోని పిల్లలు, వృద్ధులతో సహా లేచి నిలబడే స్థితిని చూశాడు. అనుభవించాడు. విప్లవకారులు వచ్చి ఆ దొర మెడలో కండువా వేసి ఇంట్లోంచి ఆయనను మాదిగ వీధిలోకి లాక్కొచ్చారు. అక్కడ జనం మధ్య కూర్చోబెట్టి ఒక విషయంలో పంచాయతీ చేశారు. ఆ రోజు అర్ధరాత్రి ఆ పిల్లవాడు ఆ దృశ్యాన్ని చూశాడు. అంతక ముందున్న అనుభవానికి పూర్తి భిన్నమైనది ఇది. మరుసటి రోజు నుంచి దొర ఆ దారి వెంట పోతావుంటే ఒక మాదిగ పిల్లవాడో, మాల పిల్లవాడో భుజాలు రాసుకుంటూ పోయేంత ధిక్కారం. ఆ తరువాత కొన్ని రోజులకు ఎక్కడో విరసం మీటింగ్ జరిగింది. ఇదేదో మనకు సంబంధించిందనుకొని వెళ్లాడు. అక్కడ విప్లవ రచయితల ప్రసంగం విన్నాడు. తిరిగి వచ్చేటపుడు ఒక పత్రికో, పుస్తకమో తెచ్చుకుని చదివాడు. అది మొత్తంగానే తన పర్సనాలిటీని మార్చేసిందని చెప్పుకొచ్చాడు. అంటే ఇది ఆయన రూపొందిన క్రమం. విప్లవోద్యమం, ప్రజా ఉద్యమాలు లేని చోట నేరుగా ఒక రచన లేకుంటే ఒక ఉపన్యాసం ప్రభావం వేస్తుంది. ఇప్పటికీ ఈ స్థితి ఉన్నది. విప్లవోద్యమంలోని ఆకర్షణకు విప్లవ సాహిత్యం సాంస్కృతిక ప్రాతినిధ్యం వహిస్తుంది. కేవలం విప్లవోద్యమ ఆకర్షణే కాదు. అన్ని రకాల ప్రజాస్వామిక, విముక్తి ఉద్యమాల ఆకర్షణ విప్లవ సాహిత్యంలో వ్యక్తమవుతోంది. విరసం కొనసాగింపు వెనుక ఇదొక ముఖ్యమైన అంశం. ఏదైనా ఆరంభంలో చాల బ్యూటీగా ఉంటుందని, ఆ తరువాత అది ఉండదు అని అనే వాళ్లూ ఉన్నారు. ఆరంభం నిస్సందేహంగా చాల బ్యూటీగా ఉంటుంది. ఇక్కడ ఏదయినా ఒక పని మనం ముగ్గురం కలిసి మొదలు పెట్టామంటే మనమే చాల ఉత్తేజం పొందుతాం. విరసంలో ఉండే ఆకర్షణ ఆరంభానికి సంబంధించిందే కాదు. యాభై ఏళ్ల కొనసాగింపు, క్రమమే దానిలోని ఒక ఆకర్షణ. ఇప్పటికీ ఆరంభకులు, తొలి తరం వాళ్లు దాంతో కొనసాగడం, దాంట్లోకి కొత్త వాళ్లు రావడం, కొత్త నాయకత్వాలు రావడం, ఆలోచనలు చాల విస్తరించడం, సమాజం నుంచి చాల నేర్చుకోవడం, సమాజానికి చాలా నేర్పించడం ఈ మొత్తం గతితర్కంలో యాభై ఏళ్ల కొనసాగింపు అన్నది అసలైన ఆకర్షణ. ఎందుకంటే అది ఒక చారిత్రకమైన అవసరంగా ముందుకు వచ్చి, ఆ చారిత్రిక అవసరాన్ని నెరవేర్చే ప్రాసెస్ లో ఉంది కాబట్టి ఆ ప్రాసెస్ చాల బ్యూటీ. ఆ ప్రాసెస్ చాల ఆకర్షణీయం. అది విప్లవోద్యమంతో ముడిపడి ఉన్నది. ఇంకా బాగా చెప్పాలంటే సమాజంలో ప్రజాస్వామిక విలువల కోసం జరుగుతున్న అనేక ప్రయత్నాలు, అనేక సాంస్కృతిక వ్యక్తీకరణలకు సంబంధించింది. కాబట్టి వాటన్నిటి నుంచి విరసానికి ఆ రకమైన బ్యూటీ ఉంటుంది. ఆకర్షణ ఉంటుంది.

ప్రశ్న : ఈ యాభై ఏళ్లలో సాహిత్య రంగంలో విరసం తీసుకువచ్చిన మౌలికమైన మార్పు ఏమిటి? మీ అంచనా ఏమిటి?
పాణి : యాభై ఏళ్లలో విరసం తీసుకువచ్చిన మార్పు సాహిత్య రంగానికి సంబంధించింది మాత్రమే కాదు. ఇది సాంస్కృతిక, సామాజిక పరిధిలో ఆలోచించవలసిన చాల పెద్ద ప్రశ్న. చాల వైపుల నుంచి పరిశోధన చేసి నిగ్గుదేల్చవలసిన అంశం అది. దీనిని సంస్థలో ఉండే మాలాంటి వాళ్ళం ఓవర్ క్లెయిమ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అట్లాగే విప్లవ రాజకీయాల మీద వ్యతిరేకత, చిన్న చూపు ఉన్న వాళ్లు, ఆసక్తి లేనివాళ్ళు డిస్కార్డ్ చేయాల్సిన అవసరం లేదు. ఈ రెండూ కాకుండా వాస్తవికంగా అంచనా వేయాలి. కాబట్టి సాహిత్య, సాంస్కృతిక, సామాజిక రంగాల్లో విరసం సాధించిన మార్పులను అంచనా వేయడానికి సరైన ప్రాతిపదిక అవసరం. ఇక్కడ ఆ వివరాల్లోకి వెళ్లలేం కాని తెలుగు సాహిత్యంలో విరసం ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులు చాలా మౌలికమైనవి. బహుశా లిఖిత సాహిత్య చరిత్రలో అంత రాడికల్ ఛేంజెస్ అంతక ముందు లేవు. ఒక గొప్ప రచన కొన్ని మార్పులు తీసుకొని వచ్చి ఉండవచ్చు. ఒక రచయిత వల్లనే వచ్చిన మార్పులు ఉండొచ్చు. ఒకానొక సామాజిక సంఘర్షణా సందర్భానికి సాహిత్య ప్రతిఫలనం వల్ల వచ్చిన మార్పులు చాలా ముఖ్యమైనవే అయి ఉండవచ్చు.

కానీ విప్లవ సాహిత్యోద్యమం వల్ల సాహిత్య ఉత్పత్తి, సాహిత్య వివిమయం, పాత్ర, రచయితల-పాఠకుల చైతన్యవంతమైన క్రియాశీలత మొదలైన విషయాల్లోనే మార్పు మొదలైంది. ఇదంతా ఒకసారి జరిగి ఆగిపోయింది కాదు. ఇది మరో ముఖ్యమైన విషయం. ఆ మార్పు క్రమాలు ఇంకా అంతే తీవ్రంగా కొనసాగుతున్నాయి. తెలుగు సాహిత్య సాంస్కృతిక మేధో రంగాల్లో అయినవాళ్లు, కానివాళ్లు అందరూ విప్లవ సాహిత్యోద్యమంతో ఘర్షణ పడటాన్ని ఆకతాయి పనిగా చూడ్డానికి లేదు. వాళ్లంతా ఈ పని చాలా కాన్షియస్ గా చేస్తుంటారు. విప్లవకర మార్పు క్రమాలను విరసం ముందుకు తీసికెళుతున్నందు వల్లనే ఇది జరుగుతోంది.

ముఖ్యమైన మార్పులు ఒక రెండు మూడు చెప్పదలుచుకుంటే మొట్టమొదటిసారి సాహిత్యంలోకి అట్టడుగు ప్రజల జీవితాన్ని, ఆకాంక్షల్ని విరసం తీసుకువచ్చింది. సాహిత్యాన్ని సమాజాన్ని మార్చే పోరాటాలతో అనుసంధానం చేసింది. లేదా పోరాటాలలో కళా సాహిత్యాలను విరసం భాగం చేసింది. లేదా ఆ పోరాటాల నుండి సాహిత్యాన్ని సృష్టించే ఒక కొత్త పద్ధతిని విరసం తీసుకువచ్చింది. విరసం ఏర్పడటానికి ముందే పాణిగ్రాహి, సత్యం లాంటి వాళ్ళు విప్లవ సాహిత్య సృజన మొదలు పెట్టారు. ఆ తరువాత కొద్దికాలానికే విప్లవోద్యమం నుంచి శివసాగర్ లాంటి వాళ్ళు వచ్చారు. అంటే ఉద్యమమే సాహిత్యాన్ని ఉత్పత్తి చేసింది. సాహిత్యానికి ఉద్యమానికి మధ్య దగ్గరితనాన్ని పెంచడం కాదు, అందులో భాగం చేయడం, ఉద్యమమే సాహిత్యాన్ని ప్రొడ్యూస్ చేయడం, అసలు సాహిత్య రచనే ఒక ఉ ద్యమప్రాయం కావడం అనేవి విరసం వల్లనే సాధ్యమయ్యాయి. అందు వల్లనే అది విప్లవ సాహిత్యోద్యమంగా యాభై ఏళ్లుగా కొనసాగుతున్నది. ఈ ఒరవడి తెలుగులో వచ్చిన అనేక ప్రజా సంచలనాల మీద ఉంది. కానీ అవేవీ విప్లవ సాహిత్యోద్యమంలాంటి నిర్మాణాత్మక ఉద్యమాలు కాలేకపోవడం వాటి అంతర్గత పరిమితి కారణం. నిర్మాణాలు, ఉద్యమాలు కొత్త ఆలోచనలను వికసింపజేయడానికి, సృజనాత్మకత వెల్లివిరియడానికి దోహదం చేయలేకపోతే ఆగిపోతాయి. పైన చెప్పిన పరిమితిని గుర్తించాల్సింది ఇక్కడ. విప్లవ సాహిత్యోద్యమం దీనికి మినహాయింపు.

సాహిత్యానికి రాజకీయశక్తి రావడం వల్లే ఇవన్నీ సాధ్యమయ్యాయి. సాహిత్యాన్ని విప్లవోద్యమంతో సహా, మిగతా అన్ని ప్రజాస్వామిక ఉద్యమాలతో మమేకం చేసింది విరసం. ఉద్యమం నుంచి సాహిత్యం రావడం అనే ఒక కొత్త పరిణామం తీసుకురావడం వల్ల, సాహిత్యం ఉపదేశాలు చేసే, హితోక్తులు పలికే దశ నుంచి అది ఒక భౌతిక శక్తిగా మారింది. భావాలు ప్రజలకు పరిచయం అయితే అవి భౌతిక శక్తిగా మారుతాయని మార్క్స్ అంటాడు. కార్మిక వర్గానికి అట్లా కార్మికవర్గ చైతన్యం తీసుకువస్తే అది వ్యవస్థను మారుస్తుంది. కొత్త వ్యవస్థను నిర్మిస్తుంది. అట్లాంటి ఒక శక్తిని సాహిత్యం సంతరించుకుంది. అంతక ముందు సాహిత్యం భావాల ప్రచారంగానే ఉండేది. కానీ భావాల ప్రచారానికి ఒక భౌతిక శక్తి వచ్చి, భౌతిక ఆచరణలోకి విప్లవ సాహిత్యోద్యమం మళ్లించగలిగింది. ఇంతకముందు వరలక్ష్మి చెప్పినట్లుగా జన నాట్యమండలి పాటలు విని, విప్లవ రచయితల ప్రసంగాలు విని లేదా విప్లవ రచనలు చదివి మనుషుల వ్యక్తిత్వాలు రూపకల్పనై, వాళ్ళు ఒక కచ్చితమైన చైతన్యంతో కొన్ని పనులు ఎంచుకుని ఆచరణలోకి రావడం ఈ యాభై ఏళ్లుగా సాగుతోంది. ఇది సాహిత్యానికి వుండే భౌతిక రూపం. ఇది అంతకముందు లేదు. ఇది విప్లవ సాహిత్యోద్యమం మాత్రమే సాధించిన మార్పు. ఇది ఇప్పటికీ ప్రబలంగా ఉంది. కళా సాహిత్యాల వల్ల మనుషులు ఒక చైతన్యవంతమైన భౌతిక ఆచరణలోకి వెళతారా? లేదా? అనే గీటురాయిని తీసుకరావడం విరసం సాధించిన అన్నిటికంటే ముఖ్యమైన మార్పు.

అలాగే వస్తు శిల్పాలలో, సాహిత్య విమర్శలో, భాషలో మార్పు. అంతకముందు అభ్యుదయ సాహిత్యోద్యమ కాలంలో మాండలికాలు వచ్చాయి. దానికంటే ముందు అన్ని భాషల్లో లాగానే తెలుగులో కూడా దేశీ సాహిత్యంలో మాండలికాలు, జాన తెలుగు వాడారు. అయినప్పటికీ ఆధునిక యుగంలో ఆ సాహిత్యానికి సాహిత్య గౌరవం లేదు. ఉదాహరణకు వేమనను, వీరబ్రహ్మాన్ని, అలాంటి జాను తెలుగు, మాండలిక తెలుగు వాడిన కవులను, రచయితలను గుర్తించలేదు. విరసం వచ్చిన తరువాత అసలు ప్రజల సాహిత్యం అంటే ప్రజల భాషలోనే ఉండాలి అని చెప్పడం, రాయడం మాత్రమే కాకుండా ఇదే నిజమైన సాహిత్యం అని దేశీ సాహిత్యానికి గౌరవాన్ని తీసుకువచ్చింది. సొంతం చేసుకుంది. దాని ప్రభావం ఎట్లాంటిది అంటే ఈ యాభై ఏళ్లలో నిజంగానే ప్రజల పట్ల ప్రేమ, గౌరవం ఉ న్న సాహిత్యకారులు ఎవరైనా తాము ఏ ప్రాంతంలో జీవిస్తున్నారో, ఏ ప్రాంత ప్రజల జీవన ఇతివృత్తాన్ని తీసుకున్నారో ఆ భాషలో రాసే ప్రయత్నం చేస్తున్నారు. అంటే విరసం విప్లవ సాహిత్యోద్యమ ప్రతినిధి కాబట్టి తీవ్ర సంఘర్షణ క్రమంలో సమాజం ఆమోదించే విషయంగా ఒక భావనను ప్రవేశపెట్టి, ఆచరణలోకి తీసుకువచ్చి, ఒక భౌతిక శక్తిగా మార్చివేస్తుంది. దాని ప్రభావం ఎలాంటిదంటే అసలు విప్లవ రాజకీయాలతో అనేక పేచీలు, విభేదాలు ఉండేవాళ్ళు సహితం తాము ఎంచుకునే సాహిత్య ఇతివృత్తానికి మాండలికాన్ని ఉ పయోగిస్తారు. ఒక దశలో ‘మాండలికంలో రాస్తే తప్ప, పోరాటాల గురించి రాస్తే తప్ప సాహిత్యం కాని దుస్థితి ఏర్పడింద’ని అవతలివాళ్ళు ఏడ్చే పరిస్థితి వచ్చింది. అంతగా మాండలికాలకు గౌరవాన్ని తీసుకువచ్చింది.

ఎప్పుడైనా ఒక ఉద్యమం, అందులో ఉండే కొద్ది మంది వ్యక్తులు ఆ పని చేస్తే దానికి పరిపూర్ణమైన అర్థం రాదు. అది సమాజం ఆమోదించే విషయంగా మారాలి. ఇలా విరసం చాలా అంశాలను సమాజంతో, సాహిత్య ప్రపంచంతో ఆమోదింపజేసింది. ఇప్పుడు నిజంగానే ప్రోగ్రెసివ్ అనబడే రచయితలెవరైనా సమాజంతో సంబంధం లేకుండా లేరు. ప్రజా జీవితంతోటి, ప్రజలకు ఉండే కష్టాలు, పాలకవర్గాల వైపు నుండి ఉండే సంక్షోభాలు, రాజకీయ పరమైన సమస్యలు ఇతివృత్తంగా తీసుకుంటున్నారు. అలా సాహిత్యానికి తిరుగులేని సామాజిక చైతన్యాన్ని ఇచ్చింది విప్లవ సాహిత్యం . ఈ ప్రభావంతోనూ, ఇంకా అనేక సామజిక పరిణామాలు, సాంఘిక ఉద్యమాల వల్ల కూడా కొత్త వ్యక్తీకరణలు వచ్చాయి. అవన్నీ కూడా ఈ విలువను స్వీకరించాయి, మరింత ఎస్టాబ్లిష్ చేశాయి. సాహిత్య రంగంలో ప్రజానుకూల శిబిరాన్ని శక్తివంతం చేశాయి. సామాజిక చైతన్యం లేకుండా, సామాజిక స్పృహ లేకుండా, సమాజం ప్రమేయం లేకుండా పాలడబ్బాల కథలు, అమ్మాయి అబ్బాయి ప్రేమ కథలు, సూడో సైన్స్ ఫిక్షన్ కథలు, దయ్యాల కథలు రాసేసి సాహిత్యం అని దబాయించలేని ఒక అద్భుతమైన పరిణామాన్ని తీసుకువచ్చింది.

వరలక్ష్మి: ఇప్పుడు సాహిత్యానికి మొట్టమొదటి గీటురాయి ఇదే. రచయితలకు ఇది పరీక్షే. అందుకే ప్రజానుకూలమా కాదా అనే ప్రశ్న దగ్గరే ఏదైనా అరంభమవుతుంది. తరువాతే మిగతా విషయాలు మాట్లాడతారు. అంతక ముందు సాహిత్యమంటే ఏమిటనే ప్రశ్న వేసుకొని చాల ప్రమాణాలతో బయలుదేరేవాళ్ళు, చాల పారామీటర్స్ ఉండేవి. ఇప్పుడు రచయిత ఏ వైఖరి తీసుకుంటున్నారు? అనే దగ్గర బయలుదేరి మిగతా అంశాలు చర్చలోకి వస్తున్నాయి.

మహమూద్ : ఇది గొప్ప పరిణామం కదా! బహుశా సాహిత్య స్వభావమే మారిపోయింది. సాహిత్య చరిత్రను ఈ కోణంలో చూడొచ్చనుకుంటాను.

వరలక్ష్మి: సాహిత్యంలో కొందరికి విరసంతో పేచి ఉండవచ్చు. మాక్కూడా కొన్ని విషయాల్లో ఇతర సాహిత్య ధోరణులతో పేచీ ఉండవచ్చు.కానీ మౌలికంగా ప్రజా అనుకూలం అవునా కాదా అనే గీటురాయి దగ్గరికి వస్తే తెలుగులో ప్రజా వ్యతిరేకమైన సాహిత్యం చాలా తక్కువ. దృక్పథ పరంగా విరసం కోరుకునే ప్రమాణాలు ఈ మొత్తంలో ఉండకపోవచ్చు. కానీ ప్రజా వ్యతిరేకంగా, అంటరానితనాన్ని కీర్తిస్తూ, ఆడవాళ్ళ మీద పెత్తనాన్ని కీర్తిస్తూ, లేక పాలక రాజకీయాలను గానం చేస్తూ రచనలు చేసేవాళ్ళు చాలా చాలా కొద్దిమందే ఉ న్నారు. అట్లాగే ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం జరిగింది తెలుగు కళారంగానికి సంబంధించి. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ఈ భావజాల ప్రభావాన్ని అంగీకరించని, సాహిత్య దృక్పథాన్ని తీసుకోలేని బూర్జవా క్లాస్ మొత్తంగా సినిమా రంగంలో సెటిలైయింది. దానివల్ల ఆ రంగం ఎంత దిగజారిందంటే తెలుగు సినిమా రంగం మిగతా ఏ భాషతో పోల్చుకోలేనంత ప్రతీఘాతుకంగా తయారైంది.అది ఒక ఎక్స్ ట్రీమ్ కు వెళ్ళిపోయింది. తెలుగులో సామాజితకు విచిత్రంగా సాహిత్యం ఇటు చివర ఉంటే సినిమా రంగం అటు చివర ఉంటుంది. సినిమా ఒక అద్భుతమైన కళారూపం. కానీ ఏ మాత్రం ప్రజానుకూల వైఖరి దానికి లేదు. మొత్తంగా మాఫియా, బ్లాక్ మనీ, లంపెన్ బూర్జువా సెక్షన్ అక్కడ సెటిలైపోయి మినిమం కళకు సంబంధించిన ఎలిమెంట్స్ కూడా లేకుండా చేశాయి. ఇది కూడా ఒక పరిణామమే. ఒక వైపు తెలుగు సమాజంలో ఇంత రాడికల్ చర్చ ఉంది, సాహిత్యంలో ఇంత డైనమిజం ఉంది, ఉద్యమాలతో సంబంధం ఉంది. సినిమా రంగం ఎందుకంత పతనమైంది?

మహమూద్ : ఇరాన్ లాంటి చాల సంక్షోభంలో ఉండే సామ్రాజ్యవాద పీడిత దేశాల నుండి, బాగా వెనకబడిన సమాజాలనబడే వాటి నుంచి చాల మంచి సినిమాలు వస్తున్నాయి కదా?

వరలక్ష్మి : భారతీయ భాషల్లో కూడా సాహిత్యంలోని ప్రోగ్రెసివ్ శక్తులకు, సినిమాలోని ప్రోగ్రెసివ్ శక్తులకు ఒక రకమైన అనుబంధం ఉంది. ఆ భాషల్లోని సినిమా రంగంలో ఇంకా ప్రోగ్రెసివ్ శక్తులు మిగిలి ఉన్నాయి.
కానీ తెలుగు సినిమా అంత పతనావస్థకు వెళ్లిపోవడం గురించి ఆలోచించాల్సిందే. బహుశా సాహిత్య రంగాన్ని, ప్రజా కళారూపాలనూ ప్రగతిశీల శక్తులు కాప్చర్ చేసిన తరువాత బూర్జువా ఫోర్సెస్, ఫ్యూడల్ ఫోర్సెస్ సినిమా రంగానికి పరిమితం అయ్యాయి.

పాణి : కావచ్చు. ముఖ్యంగా సినిమా పెట్టుబడికి సంబంధించింది. సంపన్న వర్గాలు, కార్పొరేట్ వర్గాలు తెలుగు సినిమాను భారీ బడ్జెట్ తో కూడుకున్నదిగా మార్చేశారు.

వరలక్ష్మి : ఈ మార్పు వస్తున్నపుడు సినిమా వాళ్ళు వ్యాపార నవలలు తీసుకున్నారు. ప్రేమ కథలు తీసుకుని సినిమాలు తీసారు. తరువాత దయ్యాలు, భూతాల సినిమాలు వచ్చాయి. అసలు ఇతివృత్తానికి దూరంగా కథ లేకుండా కూడా తీశారు.

(ఇంకా ఉంది)

కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. 1998 నుంచి కవిత్వం, కథలు రాస్తున్నారు. ఇప్పటి వరకూ 100 కు పైగా కవితలూ 12 కథలూ, అడపా దడపా వ్యాసాలు రాశారు.

Leave a Reply