విప్లవ తాత్త్విక కవిగా వివి – కొన్ని అధ్యయన పద్ధతులు

‘పరుచుకున్న చీకటిని చీల్చే పలుగు కావాలి కవి
నూతిలో గొంతుల్ని పిలిచే వెలుగు కావాలి
… … … …

కవిత్వం మనిషి కళ్ళలోని ఆశ
మనిషి మనసులోని ఆర్తి కావాలి

కవిత్వం వేరు జీవితం వేరు అనుకోవడం కన్న
ఆత్మవంచన లేదు’

వరవరరావు కవిత్వాన్ని విశ్లేషించడం గానీ కవిగా వి వి ని అంచనా వేయడం గానీ యీ వ్యాసం వుద్దేశం కాదు. వి వి కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి అవసరమయ్యే కొన్ని పరికరాల్ని, పద్ధతుల్ని సమకూర్చుకోడానికి చేసే ప్రయత్నం మాత్రమే యిది. ఇప్పుడంటే వరవరరావు సాహిత్యం గురించి, దాని అధ్యయనం మాట్లాడుతున్నాం గానీ యింతకుముందు యిటువంటి ప్రయత్నాలు చాలా అరుదుగా జరిగాయి. అధ్యాపకుడిగా పరిశోధకుడిగా విద్యాత్మక రంగంలో వి వి గణనీయమైన, ప్రభావశీలమైన కృషి చేసినప్పటికీ ఆయన నమ్మిన రాజకీయాల కారణంగా అకడమిక్ మేధావులు ఆయన రచనల్ని దూరంగానే పెట్టారు. చాలా యిటీవలే వరంగల్లో వి వి పని జేసిన కాలేజీలో ఆయన సాహిత్య వ్యక్తిత్వాల గురించి వొక సెమినార్ జరిగింది. అనేక ప్రయత్నాల తర్వాత ఒకట్రెండు యూనివర్సిటీల్లో పాఠ్య పుస్తకాల్లో ఆయన కవిత్వం చోటు చేసుకుంది. అంబెద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎం. ఏ . రెండో సంవత్సరం విద్యార్థుల కోసం ‘సముద్రం’ పై సవివరమైన వ్యాఖ్యానం (వేణు) వచ్చింది. వి వి కవిత్వ వ్యక్తిత్వాలపై కాశీం, పాణి వంటి వారి రచనలు కూడా భీమ్ కొరేగావ్ ఘటన సాకుతో వి విని ఎరవాడ జైల్లో కుట్ర పూరితంగా నిర్బంధించిన తర్వాత వచ్చినవే (అంతకు ముందు దర్భశయనం, నాళేశ్వరం, అఫ్సర్ వంటివారిని మినహాయించి). పత్రికలు సైతం వి వి కవిత్వాన్ని యింటర్వ్యూల్ని అచ్చువేయడానికి యిచ్చిన ప్రాధాన్యాన్ని విప్లవోద్యమానికి ‘ఆయుధాగారం’ లాంటి ఆయన సాహిత్యంపై విశ్లేషణలకు యివ్వలేదు.

వెయ్యి పేజీలకు పైన, యాభై యేళ్లపాటు పదిహేను సంపుటాల కవిత్వం రాసినప్పటికీ, తెలుగు సాహిత్య లోకంలో తనదైన ముద్రతో కవిగా ప్రత్యేకమైన గుర్తింపు పొందినప్పటికీ కేవలం ఆయన నమ్మిన, ప్రచారం చేసిన, ఆచరించిన విప్లవ రాజకీయ భావజాలం కారణంగా – విప్లవోద్యమంలో ఒక శిబిరానికి ఆయన్ని పరిమితం చేయడం వల్ల అటు విప్లవోద్యమం యిటు తెలుగు సాహిత్యం యెంతగానో నష్టపోయింది. ఆయన కవిత్వాన్ని అంగీకరిస్తే ఆయన భావజాలాన్ని అంగీకరించినట్టుగా భావించడమవుతుందన్న భయంతోకూడా కొందరువిమర్శకులు ఆయన కవిత్వాన్ని దూరంగా ఉంచారేమో! ఆయన విప్లవ రాజకీయ భావాలను వ్యతిరేకించదలచినవాళ్లు ఆయనను కవిగా కూడ విస్మరించడం, కవిగా తిరస్కరించడం జరిగింది. అగ్రకులంలో పుట్టిన కారణంగా ఆయనకు కులాధిపత్య స్వభావాన్ని అంటగట్టి మరికొందరు వి వి కవిత్వంపై, వ్యక్తిత్వంపై దాడి చేశారు. విప్లవ రాజకీయ, సాహిత్య వుద్యమాలలో ఆయన సహచరులు కూడ నిన్న మొన్నటి దాకా వి వి కవిత్వ విశ్లేషణకు యెందుకు పూనుకోలేదు అన్నది పెద్ద ప్రశ్నే. ఇప్పటికైనా వి వి అభిమానులు విప్లవాచరణతో కూడిన ఆయన సాహిత్య వ్యక్తిత్వాన్ని అందులోని లోతుపాతుల్ని భవిష్యత్ తరాలకు అందించడానికి చిరు ప్రయత్నాలు చేయడం అభినందించాల్సిన విషయమే. పాలమూరు అధ్యయన వేదిక అందుకు పూనుకోవడం మరీ హర్షించదగిన అంశం. మాట్లాడాల్సినప్పుడు మాట్లాడకపోవడం – మౌనం యుద్ధ నేరమేమో గానీ – సాహిత్య ద్రోహం. కాలం కొలిమి మంటల్లో సమ్మెట పోటు కింద మలచుకున్న శబ్దమయ ప్రపంచాన్ని, చరిత్ర విత్తిన కవిత్వ బీజాక్షరాల్ని యేరుకోవాలంటే మౌనాల్ని పేల్చే శబ్దాలు కావాలి. అందుకే యీ నాలుగు మాటలూ. అంతేతప్ప వి వి కవిత్వం లోతుల్లోకి చూసే సామర్థ్యం , అర్హత వుండి మాత్రంకాదు.

2

‘కష్టజీవి చెమటచుక్క చెప్పని సత్యం
కష్టజీవి ఆకలిడొక్క చెప్పని సత్యం
కష్టజీవి కన్నీటిచుక్క చెప్పని సత్యం
కష్టజీవి పోరాడే రెక్క చెప్పని సత్యం
కవి కలం నుంచి చిందే సిరాచుక్క ఏం చెప్తుంది!’

‘చలినెగళ్లు’ నుంచి ‘బీజభూమి’వరకూ, ఆ తర్వాతా – వరవరరావుని ఆయన రాజకీయ భావజాలం నుంచీ ఆచరణ నుంచీ ప్రతిఘటన జీవితం నుంచీ వేరుచేసి చూడలేం. అంతమాత్రంచేత ఆయన్ని కేవలం రాజకీయ కవిగా ముద్రవేయడం కూడా సరికాదు. అలా చేయడం ద్వారా ఆయనలోని అనేక పార్శ్వాల్ని దర్శించకుండా పోయే ప్రమాదం వుంది. ఆయన్ని కేవలం కవిగానో, కవిత్వ అనువాదకుడిగానో చూడటం సైతం తప్పే. పత్రికా సంపాదకుడిగా, అధ్యాపకుడిగా, హక్కుల కార్యకర్తగా ,ప్రత్యామ్నాయ భావజాల నిర్మాతగా, పీడిత ప్రజాపక్షం వహించిన మేధావిగా, వక్తగా, రాజ్యం విధించిన నిత్య నిర్బంధాల మధ్య నిఘాల మధ్య దాని వ్యవస్థీకృత హింసకి గురైన పౌరుడిగా, ప్రభుత్వానికీ మావోయిస్టు పార్టీకీ మధ్య జరిగిన చర్చల్లో పార్టీ ప్రతినిధిగా … ఇలా భిన్న అస్తిత్వాల్లో రూపాల్లో అనేకానేక సంఘటనల పట్ల ఆయన స్పందనల్ని లోతుగా అవగాహన చేసుకోకుండా చేసే కవిత్వ విశ్లేషణలకు సమగ్రత ఉండదు. అదేసందర్భంలో కవిగా తోటి మనిషి పట్ల మొత్తం మానవ సమాజం పట్ల ఆయన సున్నితమైన ఆలోచనల్నీ సునిశితమైన పరిశీలననీ స్థూల దృష్ష్టితో గాక సూక్ష్మాతి సూక్ష్మ దృష్టితో గమనంలోకి తీసుకోవాలి. సామాజికంగా రాజకీయంగా ఆయన ఆచరణతో ముడివడి వున్న అనేక వుద్వేగాలు, వాటిని అంటిపెట్టుకొని వున్న వ్యక్తులూ సమూహాలు, వారి మధ్యనున్న మానవసంబంధాలు వీటన్నిటినీ ఆయన తన కవిత్వంలోకి తర్జుమా చేసుకున్న తీరూ పరిశీలించడానికి గతి తార్కిక చారిత్రిక దృక్పథం అవసరమవుతుంది. అప్పుడు సంఘటనలు కేవలం సంఘటనలు కావనీ వాటికి కారణమయ్యే ప్రత్యేక భౌతిక పరిస్థితుల నుంచి, విరుద్ధ సామాజిక శక్తుల సంఘర్షణ నుంచి రూపొందినవనీ అర్థమౌతాయి.

వరవరరావు ‘వ్యక్తిత్వమే కవిత్వం’ అని పాణి చేసిన తీర్మానం ఆ వ్యక్తిత్వం దేశ కాలాలకు అతీతమైంది కాదనే స్పృహ నుంచి చేసిందే. వి వి వ్యక్తిత్వం అతను జీవించిన సమాజం నుంచి యేర్పడిందే. సామాజికంగా ఆర్థికంగా దోపిడీకి గురయ్యే పీడిత ప్రజల సామూహిక జీవితానుభవాల నుంచి, సంవేదనల నుంచి, ఆలోచనల నుంచి, ఆచరణ నుంచి రూపొందిందే. అందువల్ల వరవరరావు కవిత్వాన్ని అంచనా వేయాలంటే – గత ఐదారు దశాబ్దాల జాతీయ అంతర్జాతీయ ప్రాంతీయ స్థానిక చరిత్ర, రాజకీయార్థిక పరిణామాలు, సాంస్కృతిక సామాజిక చలానాలు, మార్పులు తెలిసి ఉండాలి. వాటి పట్ల నిర్దుష్టమైన అవగాహన ఉండాలి. ప్రతి సామాజిక చలనానికీ వున్న కార్యకారణ సంబంధమేమిటో వివేచించే దృక్పథ పటుత్వం వుండాలి. గ్రేట్ డిబేట్ దగ్గరనుంచి 90 ల్లో సోవియట్ పతనం , చైనా పరిణామాల మీదుగా యివాళ్టి గ్లోబలీకరణ, నయా సామ్రాజ్యవాదం వరకు అంతర్జాతీయ రాజకీయాల గురించి, అవి మన జాతీయ బూర్జువా పాలకులపై ,వారి విధానాలపై చూపిన ప్రభావాల గురించి సూక్ష్మ అవగాహన సైతం వుండాలి.

విప్లవోద్యమ పార్టీతో ఆయనకు తొలి నుంచి వున్న సాన్నిహిత్యం కారణంగా ఆయన లోపలి మనిషా బయటి వ్యక్తా అని వింగడించుకోలేనంతగా ఆలోచనల్లోనూ, ఆచరణ లోనూ మమేకమైపోవడం వల్ల పార్టీ వాయిస్ గా ముద్ర పడిన సందర్భాలున్నాయి. ఆ ముద్ర ఆయన కవిత్వంలో ప్రతిఫలించిన వైనాన్ని ప్రత్యేకంగా పరిశీలించాలి. అందుకు పార్టీ విధానాలు, వ్యూహాలు , సైద్ధాంతిక తీర్మానాలు తెలియపర్చే డాక్యుమెంట్లతో వివి కవిత్వాన్ని బేరీజు వేయవలసి ఉంటుంది. అంతేకాదు; సాహిత్య జీవిగా కవిత్వ మాధ్యమంగా వి వి చేసిన సూత్రీకరణలు ప్రతిపాదనలు పార్టీ నిర్ణయాలపై ప్రభావం చూపిన సందర్భాలేమైనా వున్నాయా అని సమీక్షించాలి.

ఆయన కవిత్వంలో కనిపించే భావచిత్రాల గురించో, పదచిత్రాల గురించో, ఆలకారిక శైలి గురించో, రూప ప్రయోగాల గురించో అకడమిక్ మూస పద్ధతుల్లో కవిగా ఆయన స్థానాన్ని అంచనా వేయడం సైతం తప్పే అవుతుంది. వి వి రాసిన ప్రతి కవితకూ సామాజిక నిర్దిష్టత తప్పనిసరిగా ఉంటుంది. ఆ నేపథ్యాన్ని అర్థం చేసుకుంటేనే కవితపై సరైన వెలుగు ప్రసరించి ప్రకాశమానమౌతుంది. అలాగే ఆయన జీవిత ప్రయాణంలో రాజకీయావరణం సాహిత్యావరణం యెక్కడ యేవిధంగా కలుస్తున్నాయో తెలుసుకోవాలి. ఆ యా సందర్భాల్లో యేది ప్రాథమ్యాన్ని సంతరించుకుంటుంది? రాజకీయాంశమే ప్రధానమైనప్పుడు వ్యక్తీకరణ పధ్ధతి యెలా వుంటుంది అని పరిశీలించాలి. ఎందుకంటే చరిత్రయినా సమాజమైనా రాజకీయమైనా వాటిని యథాతథంగానో ఆలంకారికంగానో వర్ణించినంత మాత్రాన అది కవిత్వం కాదు; నిజానికి అది సాహిత్యమే కాదు. నిర్దిష్టంగా వాటిలోని కదలికను గుర్తించాలి అందుకు కారణమైన చైతన్యాన్ని గుర్తిచాలి. ఆ చైతన్యాన్ని సజీవంగా వుంచడానికి దోహదంచేసే సృజనాత్మక వ్యాపారమే సాహిత్యం. దాన్ని నిరంతరం యేమరుపాటు లేకుండా సడలని నిబద్ధతతో రాజీలేని నిమగ్నతతో కొనసాగించడం వల్లే వి వి తన సమకాలీన కవుల్లో విశిష్టంగా కనిపిస్తారు.

స్వీయజీవితానుభవాన్ని సైతం సామూహికమైన యెరుకగా ఆవిష్కరించే వొక గొప్ప నైపుణ్యం వివి కవిత్వంలో కనిపించే విశిష్ట కోణం. అయితే ఆ అనుభవాల్ని నిర్దిష్ట సామాజిక రాజకీయ సందర్భాలకు అన్వయిచడంవలనే ఆయన వాటిని సాధారణీకరించ గల్గుతాడు. నిజానికి అటువంటి సాధారణీకరణ ద్వారానే యే కవయినా పాఠకులతో సంభాషించ గలుగుతాడు. ఈ సంభాషణని సూటిగానూ కవితాత్మకంగానూ తీర్చిదిద్దటానికి ఆయన అనుసరించిన కళా వ్యూహం యేమిటి అన్నది తెలుసుకోడానికి అవసరమైన పరికరాల్ని విమర్శకులు రూపొందించుకోవాలి. ‘సీరియస్ శాస్త్రీయ విమర్శ లోపం’ వల్లే వి వి కవిత్వంపై సరైన విశ్లేషణ జరగలేదని కాశిం వాపోతాడు. అదే నిజమైతే అంతకన్నా పెద్ద విషాదం మరొకటి లేదు. అది మార్కిస్టు సాహిత్య విమర్శకే పెను సవాలు. మార్క్సిస్టు సౌందర్య శాస్త్రం గీటురాయిగా వి వి కవిత్వాన్ని అంచనావేయగల విమర్శకులు యిప్పటికైనా మేలుకొని కెవిఆర్ టియెమ్మెస్ జెసి లాంటి వెనకటి తరం విమర్శకులు చూపిన బాటలో వొక్క వి వి కవిత్వాన్నే కాదు మొత్తం విప్లవోద్యమ సాహిత్యాన్నే మార్క్సిస్టు విమర్శ సూత్రాల్ని అన్వయిస్తూ మూల్యాంకనం చేయడానికి పూనుకోవాలి.

3

‘ప్రకృతి చేయని నేరం
ప్రజలు చేయనేరని నేరం
రచయితలే ఏం చేయగలరు !’

కవిత్వమే కాదు ఏ సాహిత్య రూపాన్నైనా రచయిత సామాజిక చైతన్యం నుంచి అస్తిత్వం నుంచి విడదీసి చూడరాదు. రచయిత జీవించిన కాలం నాటి సమాజంలో చోటుచేసున్న వుత్పత్తి సంబంధాల్లో వచ్చే మార్పులు వుత్పత్తి శక్తుల గుణాత్మక చలనం రచనమీద అనివార్యంగా ప్రభావం చూపుతాయి. రచనకీ రచయితకీ మధ్య, రచయితకీ సమాజానికీ మధ్య వున్న సంబంధాన్ని గతి తార్కికంగా అర్థం చేసుకున్నప్పుడే ఆ రచయితనీ రచననీ సరిగ్గా అంచనా కట్టగలం. మొత్తం తెలుగు సాహిత్య చరిత్రలో వి వి వొఖ్కడే రాజకీయ కవి అన్న మదింపు వ్యాఖ్యలు అలవోకగా చేసినట్టు కనిపిస్తాయి. ఫలానా కవికి ముందు అంతా చీకటి ఆ తర్వాత మళ్ళీ అంతా చీకటే వంటి రాతలు మార్క్సిస్టు విమర్శా సూత్రాలకు తగవు.

కవిగా వరవరరావు గత ఆరు దశాబ్దాలుగా తాను జీవిస్తున్న సమాజాన్నీ కాలాన్నీ వ్యాఖ్యానిస్తూ వస్తున్నాడు. వర్గ స్పృహ ఆయన కవిత్వానికి ఆయువుపట్టు. శ్రామిక వర్గ దృక్పథం నుంచి వేరుచేసి ఆయన రచనా వ్యాసంగాన్ని చూడలేం. శ్రీకాకుళం గిరిజన రైతాంగ వుద్యమం దగ్గరనుంచి యివాళ్టి దండకారణ్యంలో జల్ జమీన్ జంగిల్ కేంద్రంగా ఆదివాసీల స్వావలంబన సాధన లక్ష్యంగా నిర్మితమైన జనతన సర్కార్ వరకు నూతన ప్రజాతంత్ర విప్లవం, ఆర్ధిక రాజకీయ సాంస్కృతిక సామ్రాజ్యవాదం, యుద్ధం, దళితులపై , ఆదివాసులపై , ముస్లింలపై , స్త్రీలపై అమలయ్యే అణచివేత , కుల – మత – జెండర్ ఆధిపత్య రాజకీయాలు, రాజ్య హింస, నిర్బంధం, వ్యవసాయ సంక్షోభం , అడ్డగోలు పారిశ్రామికీ కరణ, ప్రాంతీయ ఉద్యమాలు, జాతుల సమస్య , పెచ్చుపెరిగి పోతున్న కార్పొరేట్ విద్యారంగం, ప్రపంచీకరణ , కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలు యిలా అనేక అంశాల పట్ల వి వి ఆలోచనల్ని , వాటిలో వచ్చిన గుణాత్మక పరిణామాల్ని ఆయన కవిత్వాన్నుంచి నుండి గ్రహించవచ్చు. వరవరరావు రచనలన్నిటినీ ఒకచోట చూస్తే కనీసం మూడుతరాల పాటు నేలతల్లి పడిన పురుటి నొప్పుల చప్పుడను వినగలం. స్థానికంగా రూపుదిద్దుకున్న వుద్యమ చరిత్రే కాదు మొత్తం అరవై యేళ్ళ మానవ సమాజ చరిత్రని ప్రజలపరంగా నిర్మించడానికి ఆయన రచనలు వనరుగా వుపయోగపడతాయి.

వివి కవిత్వాన్ని అంచనా వేయడానికి ప్రధానంగా ఉపయోగపడే పరికరాలు రెండు :

  1. ఆయన జీవించిన సమాజం – కాలం
  2. ఆయన రాజకీయ దృక్పథం – ఆచరణ

ఈ రెండు అంశాల్నీ గమనంలోకి తీసుకుని వరవరరావు కవిత్వాన్ని వస్తు – రూప పరిణామం దృష్ట్యా, సామాజిక – రాజకీయ పరిణామాల దృష్ట్యా స్థూలంగా ఐదు – ఆరు దశలుగా విభజించుకోవచ్చు.

తొలి దశ : శ్రీకాకుళం పోరాటం ముందు – పోరాట కాలం – విరసానికి ముందు – చలినెగళ్లు, జీవనాడి)

వరవరరావు కవిగా తొలిదశలో రాసిన యీ కవిత్వాన్ని విడిగా పరిశీలించాలి. ఆ మధ్య మావోయిస్టు పార్టీ నుంచి బయటికి వచ్చిన వొకాయన వివి ని విప్లవద్రోహిగా మార్క్సిస్టు వ్యతిరేకిగా చిత్రిస్తూ నెహ్రూ మరణం సందర్భంగా ఆయన రాసిన కవితని ఉదాహరించాడు. కాలిక స్పృహ లేకుండా చేసే యిటువంటి ఆరోపణల్ని శాస్త్రీయంగా విశ్లేషించడానికి చారిత్రిక దృక్పథం వుండాలి. లేకుంటే సోషలిస్టు చంద్రుడు లాంటి కవితల్ని నెపం చేసుకొని ఆయన రష్యా సోషలిస్టు సామ్రాజ్యవాదాన్ని గుర్తించలేదు కాబట్టి రివిజనిజాన్ని సమర్థించాడు అని వాదించే ప్రమాదం లేకపోలేదు. చంద్ర మండలం మీద కాలు మోపడం నూతనత్వం కాదు తనువూ తనువూ మనిషీ ప్రకృతీ శ్రమా ఋతువూ కలిసి పెనవేసుకుని చెట్టాపట్టాల్లా అడుగేయడమే నూతనత్వం అన్న ‘బీజభూమి’ మాటల్ని కావాలనే విస్మరించే వాళ్ళు చారిత్రిక దృష్టి మాంద్యంతో బాధపడుతున్నారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందుకే ప్రతిఘటన రాజకీయాచరణలో, ప్రత్యామ్నాయ రాజకీయ భావజాల ప్రచారంలో వి వి చేసిన ప్రస్థానంలో ప్రధానమైన మలుపుల్నీ, అవి కవిత్వంలో ప్రతిఫలించిన తీరునీ సరైన దృక్పథంతో చూడటానికి మార్క్సిస్టు విమర్శ సూత్రాల్ని నిర్దుష్టంగా అన్వయించుకోవాల్సిన అవసరం వుంది.

నెహ్రూ మార్కు సోషలిజం పట్ల ఆశలు పెంచుకొని కవిత్వం చెప్పడం కంఠశోషలిజం తప్ప మరేమీ కాదు అని తెలుసుకోడానికి, చెదిరిన కలల్ని ప్రోదిచేసుకొని కొత్తదృక్పథాన్ని అందిపుచ్చుకోడానికి ఆయనకు యెక్కువ సమయం పట్టలేదని ‘జీవనాడి’ కవిత్వం రుజువు చేస్తుంది. అప్పటికే శ్రీకాకుకుళం సెగ వివి లాంటి యువకవుల్ని తాకింది. విరసం ఆవిర్భావానికి అవసరమైన పూర్వరంగం అప్పటికే సిద్ధమైంది. సివి (సివిజయలక్ష్మి అనే వరాహాల్రావు) లాంటి వారి కవిత్వంలో బలమైన విప్లవ భావాల వ్యక్తీకరణ అప్పటికే కనిపిస్తుంది. విరసం ఆవిర్భావం కాకముందే సాహిత్యానికి రాజకీయాలకూ రాజకీయ చుట్టరికం బలపడుతున్న రోజుల్లో 1965 – 69 ల మధ్య రాసిన ‘జీవనాడి’ ని సంయమనంతో కూడిన భావోద్వేగ కవిత్వం గా విమర్శకులు భావించారు. ఇటువంటి సూత్రీకరణల్ని హేతుబద్ధంగా సోదాహరణంగా విశ్లేషించి చూడాలి.

రెండవ దశ (1970 – 80) : విరసం ఆవిర్భావం నుంచి పీపుల్స్ వార్ ఆవిర్భావం వరకు : ఊరేగింపు, స్వేచ్ఛ

ప్రజల్ని సాయుధంచేసే చేసే రివల్యూషనరీ కవి అని విశ్వసించి దాన్ని ఆచరించిన యీ కాలంలో కవుల నిబద్ధత నిమగ్నతల గురించి కొత్త ప్రశ్నలు వెల్లువెత్తాయి. విప్లవోద్యమంలో భిన్న పంథాలు బహిర్గతమయ్యాయి. పార్లమెంటరీ ప్రజాస్వామ్యం సైతం జైలు పాలైన ఎమర్జెన్సీ కాలంలో రాజ్యం ప్రజాయుద్ధ పంథాపై ఉక్కుపాదం మోపింది. శ్రీకాకుళం కొండల్లో రగిలిన నిప్పు ఉత్తర తెలంగాణాకు పాకి జగిత్యాల వీధుల్లో జైత్రయాత్రగా వ్యాపించి రైతాంగాన్ని సాయుధం పోరు వైపు నడిపించిన దందహ్యమాన దశాబ్దం యిది. పాలకుల దృష్టిలో కల్లోల కాలం. ఇంతకుముందులా సుదూర ఉద్యమ విషయాల్ని కవిత్వంలోకి ఆవాహన చేసుకోవడం గాక స్వయంగా తాను నివసించే నేలమీద ప్రత్యక్షంగా పోరాడే ప్రజలతో మమేకమై వి వి కవిత్వం కట్టిన కాలం యిది. రచయితలపై కుట్రకేసులు అమలైన కాలం. ఈ కాలంలోనే వివి రెండుసార్లు జైలు జీవితం అనుభవించాడు.

‘ఊరేగింపు’ని కె.జి. సత్యమూర్తికి అంకితమివ్వడంలోనే ఆ కవిత్వ స్వభావం అర్థమౌతుంది. చారు మజుందార్ దారిని అనుసరిస్తూ వర్గకసితో రాసిన కవితలు అందులో దర్శనమిస్తాయి. ప్రజల్ని సాయుధం చేయడానికి పాట సాధనం అన్న స్పృహ పాణిగ్రాహి నుంచి అందిపుచ్చుకున్న ‘శివుడు’ నరుడో భాస్కరుడా అంటూ శ్రీ శ్రీ తో సహా విరసం కవుల్ని అందర్నీ మెస్మైరైజ్ చేశాడు. వి వి అందుకు మినహాయింపు కాదు. ఆ ఉద్ధృత ప్రవాహంలో తానూ వొక బలమైన పాయ అయ్యాడు. ప్రజా రాజకీయ ఆచరణలో తానెక్కడ నిలబడాలో నిర్ధారించుకున్నాడు .

‘స్వేచ్ఛ’ నాటికి వి వి లోని రాజకీయభావాలు మరింత పదునెక్కాయి. ఆ పదును కవిత్వంలోకి ఎగబాకింది. గొంతు బిరుసెక్కింది. వ్యక్తీకరణ రాటుతేలింది. మాట తుపాకీ తూటాలా పేలింది. వర్గ పోరాట రూపంలో యెత్తుగడల్లో పార్టీ విధి విధానాల్లో ప్రజా సంఘాల నిర్మాణ ఆవశ్యకతని గుర్తించడంలో యేర్పడ్డ పరిణామాలు ఆయన ఆలోచనలకు స్పష్టతనిచ్చాయి. అదే కవిత్వంలో వెలుతురు నింపింది. కవిత్వాన్ని రాజకీయ తాత్విక నినాదం స్థాయికి తీసుకెళ్లిన రచనలు ‘స్వేచ్ఛ’లోఎన్నో కనపడతాయి. ‘ఊరేగింపు’లో యెగజిమ్మిన నిప్పు రవ్వల్నినిలువెత్తు మంటగా జ్వాజ్వాల్యమానంగా ప్రకాశింపజేసే నైపుణ్యం అలవడింది. జైలు నిర్బంధ జీవితం అందుకు దోహదపడింది.

కవిత్వాన్ని వుదాహరించడం యీ వ్యాస పరిధిలోకి రానప్పటికీ కవిత్వాన్ని రాజకీయ నినాదంగా మలచుకునే సందర్భాల్లో సైతం కవితా విలువలతో రాజీ పడని వైఖరికి సాక్ష్యంగా వుపకరించే వొక కవిత చూద్దాం. వి వి రాజకీయ కవిత్వ ప్రస్థానంలో ప్రధానమైన మలుపుని అర్థం చేసుకోడానికి యిది తోడ్పడుతుంది.

‘ప్రజా విప్లవాలకు బాసటగా వున్నామని
మేం చెప్తూనే వున్నాం
గాలి వీస్తుందని కత్తి కోస్తుందని
నిప్పు మండుతుందని నిజం రుజువవుతుందని
ప్రజలకు మేం చెప్పాల్నా!
పోరాటాల ఊపిరితో మా ఊహలు
వెలుగుతున్నయ్
విప్లవ అరుణోదయాలు మా భావాలను పండిస్తున్నయ్
మృతవీరుల క్రొన్నెత్తుర్లు మా శ్వాసల్ని
మండిస్తున్నయ్
మా నరనరాల్లో నక్సల్బరి శ్రీకాకుళాలు
ప్రవహిస్తున్నయ్
మార్క్సిజమ్ మా వెన్నెముక
……..
విప్లవాన్ని కలలుగనడమే కాదు
కలాలను పనిముట్లుగా పదనుపెట్టి
శత్రువుపై తలపడుతున్నవాళ్లం
…….
విప్లవ స్వభావానికి రహస్యం లేదు
ప్రజల నరాలు పలుకుతున్న జీవిత సంగీతం
కుట్రకాదు’
( ‘ స్వేచ్ఛ’ 1974)

మూడో దశ (1981 – 1990) : నిత్య నిర్బంధాల కాలం జైలు జీవితం : సముద్రం, భవిష్యత్ చిత్రపటం, ముక్తకంఠం

ఉత్తర తెలంగాణ రైతాంగ పోరాటం ఆదిలాబాద్ గిరిజన సమూహాల్లోకి సింగరేణి కార్మిక వాడల్లోకి వ్యాపించింది. ఇంద్రవెల్లి మారణ కాండ, జాతీయ ట్రేడ్ యూనియన్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా సికాస వుద్యమ నిర్మాణం జరిగిన రోజులు. ప్రజా పోరాటాలపై అణచివేత ప్రతిఘటన తారాస్థాయినందుకున్నాయి.

వి వి కవిత్వ గమనంలో అత్యున్నత దశగా యీ కాలాన్ని పరిగణించవచ్చు. ఆయనలోని విప్లవ కాల్పనికత విశ్వరూపం ధరించిన దశాబ్దం యిది. కవిగా విప్లవ సాంస్కృతికోద్యమం పట్ల ప్రజా రాజకీయాల పట్ల నిబద్ధత నిమగ్నతలు అనితరంగా వ్యక్తమైన పరీక్షా సమయం. 1983లో వచ్చిన ‘సముద్రం’ దీర్ఘ కవిత గొప్ప సంచలనం. ఈ కవితలో సముద్రం ఒక ప్రకృతి సిద్ధమైన అంశంగా ఉంటూనే ప్రజలకు, ప్రజా వుద్యమానికి, ప్రజా వుద్యమ నిర్మాణానికి ప్రతీకగా కూడ వ్యక్తీకరణ పొందింది. అనేక సందర్భాల్లో శివసాగర్ కవిత్వాన్ని వ్యాఖ్యానిస్తూ వి వి యే వాడిన ‘విప్లవ కాల్పనికవాదం విప్లవ ఆశావాదం’ అనే అమూర్త మౌలిక భావనలకు నిండైన నిర్దిష్ట రూపంగా సముద్రం భాసిస్తుంది. అప్పటికే నగ్నముని ‘కొయ్యగుర్రం’ ఆధునిక మహాకావ్యంగా గుర్తింపు పొందింది. పుంఖానుపుంఖాలుగా ప్రశంసలు చర్చలు వెలువడ్డాయి. వి వి ‘సముద్రం’ ఎన్ కె ‘లాల్ బనో గులామీ చోడో బోలో వందే మాతరం’ మీద రావాల్సినంత విమర్శ రాకపోడానికి కారణాల్ని అన్వేషించాలి.

‘భవిష్యత్ చిత్రపటం’ సంపుటి ఆ లోటు తీర్చింది. ఆసంపుటి 1986 సెప్టెంబర్ లో వెలువడింది. 1987 జనవరి 3 న అంటే నిండా మూడు నెలలు కూడ గడవకముందే, ఇంకా పాఠకులకు పూర్తిగా చేరకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్ని నిషేధించి గౌరవించింది. ఆ నిషేధాన్ని మరో మూడేళ్ళ తర్వాత 1990 మార్చ్ లో యెత్తివేసినప్పటికీ అణచివేత ప్రతిఘటనల మధ్య ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెసేతర ప్రాంతీయ పార్టీ అధికారంలోకి వచ్చిన తొలి మలి సందర్భంలో, రాష్ట్రంలో మరీ ముఖ్యంగా తెలంగాణలో పౌరహక్కుల వుద్యమం పై అమలైన హింస నేపథ్యంలో (1985 సెప్టెంబర్ 3 న డాక్టర్ రామనాథంహత్య ) వచ్చిన కవిత్వంగా అది చూపిన ప్రభావాన్ని అంచనా కట్టాల్సి ఉంటుంది. కవిగా వి వి లోని విప్లవ తాత్త్వికతకు పరాకాష్టగా ‘భవిష్యత్ చిత్రపటం’ నిలిచి పోయింది. ఈ సంపుటిలో వస్తు శిల్పాలు రెండూ దృక్పథబలంతో కొత్త పోకడలు పోయాయి.

ఆతర్వాత వివి వరంగల్లో వుండలేని పరిస్థితి. సుదీర్ఘ కాలం – దాదాపు మూడేళ్లు జైలు జీవితం. ఉద్యోగం వదిలి వూళ్ళు పట్టుకొని తిరగాల్సిన అగత్యం. కుటుంబానికీ భార్యా బిడ్డలకూ దూరమై అనుభవించిన ప్రవాస దు:ఖాన్నీ మిత్రుల, సహచరుల వియోగ వేదనననీ వాటిని సాధారణీకరించి విప్లవరాజకీయాలకు అన్వయించడం ‘ముక్తకంఠం’ లో చూడవచ్చు. నిషేధాలు నిర్బంధాలు కుట్రకేసుల మధ్య బాయనెట్ పడగ నీడల్లో స్వేచ్చ కోసం జీవించే హక్కు కోసం ఆయన పొందిన వైయక్తిక జీవితానుభవాల్ని సామూహిక వేదనగా మలచిన తీరుని సూక్ష్మదృష్టితో విశ్లేషించాల్సి వుంది.

‘ముక్త కంఠం’ నాటికి వి వి శివసాగర్ ప్రభావం నుంచి బయటపడ్డాడు. సైద్ధాంతికంగా మొదలైన యీ దూరం కవిత్వంలో కూడా ప్రతిఫలించింది. కవిత్వ రూపంలో కూడా నిర్మాణ పరమైన మార్పులు వచ్చాయి. ఆ క్రమంలో శుద్ధ వచనంలోకి తర్జుమా అయినట్టు కనిపిస్తుంది. విప్లవ కాల్పనికత నుంచి విప్లవ వాస్తవికత వైపు నడిచిన కాలం అది. దానివల్ల ఆయన వచనంలో తార్కికత చొరబడింది. ఉద్వేగ తీవ్రతని నియంత్రించుకునే ధోరణి కనిపిస్తుంది. కవిత్వం గంభీరతని సంతరించుకొంది. జైలు ఏకాంతం ఆయన్ని సమూహం నుంచి భౌతికంగా దూరం చేయడం వల్ల లిఖిత రూపానికి దగ్గరయ్యాడేమో పరిశీలించాలి. మానవ సంబంధాలపై వ్యాఖ్యానాలు రాజకీయ తాత్త్వికతని సంతరించుకోవడం గమనించాలి.

అదేకాలంలో కష్టజీవుల శ్రమజీవనంలోని ఔన్నత్యాన్ని గతితార్కికంగా విశ్లేషిస్తూ రాసిన ‘డాఝావూ’ కవితని ప్రత్యేకంగా పరిశీలించాలి. ఆ కవితా వచనానికి వి వి యెంచుకున్న తార్కిక శైలి వినూత్నం. ఆ కవిత శ్రమ జీవన సౌందర్యాన్ని ప్రస్తుతించదు. ఉత్పత్తి కులాల శ్రమ సమాజ గమనానికి యింధనంగా పనిచేసే వైనాన్ని అపూర్వంగా యెత్తిపట్టింది. మేధావులు డిక్లాస్ డికాస్ట్ కాకుండా ఆకాశ దంత సౌధాల్లో గడిపే భద్రజీవితాల్ని పట్టికుదిపిన ఆ కవిత వరవరరావు సాహిత్య జీవితంలో మరో పెద్ద మలుపు అని భావించవచ్చు. ఆతర్వాతి కాలంలో వచ్చిన వి వి కవిత్వాన్ని దాని వెలుగులోనే అధ్యయనం చేయాలి. ఆ కవితలో స్త్రీల ఆహార్యాన్ని కించపరిచే పురుషాధిక్య భావజాలం వుందని ఆ తర్వాత జెండర్ అస్తిత్వ స్పృహతో వొకరిద్దరు విమర్శలు పెట్టినా అవి నిలవలేదు.

నాలుగోదశ (1991 – 2004 మావోయిస్టు పార్టీ ఆవిర్భావం వరకు) : ఉన్నదేదో ఉన్నట్లు , ఆ రోజులు , దగ్ధమౌతున్న బాగ్దాద్, మౌనం ఒక యుద్ధనేరం

అంతర్జాతీయంగా సోవియట్ పతనం, చైనాలో పెట్టుబడుల ప్రవేశం, ఇరాక్ యుద్ధం, నయాసామ్రాజ్యవాదం – దేశంలో ప్రపంచీకరణ, సరళీకృత ఆర్ధిక విధానాలు, సామాజిక సంపదని వ్యక్తులపరం చేసే ప్రయివేటీకరణ ,అడ్డగోలు పారిశ్రామికీకరణ, అగ్రరాజ్యాలకు బానిసల్ని తయారుచేసే నూతన విద్యావిధానం – రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, పాలకుల అణచివేత విధానాల్లో మార్పులు లొంగుబాట్లు కోవర్టు చర్యలు హైటెక్ ఎన్ కౌంటర్లు … వీటికి తోడు సాంస్కృతిక రంగంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకోవడం, యిలా సామాజిక రాజకీయ చిత్రం సంక్లిష్టంగా తయారైంది. బాబరీ విధ్వంసం(1996) గుజరాత్ గాయం (2002) ఇరాక్ పై యుద్ధం (2003) జాతీయ అంతర్జాతీయ సమాజాల్ని బలంగా కుదిపాయి.

విప్లవోద్యమమానికి బలమైన వెన్నెముకగా పునాదిగా పనిచేసిన దళిత కవులూ రచయితలూ మేధావులూ కుల అస్తిత్వాన్ని సాహిత్య సామాజిక ఎజెండాగా స్వీకరించి కవిత్వానికి కొత్త వస్తువునీ వ్యక్తీకరణనీ డిక్షన్ నీ అందించిన నేపథ్యంలో ఆ వాడినీ వేగాన్నీ విరసం అందుకోలేకపోయిన కాలంలో కొత్త రచయితలకు స్ఫూర్తినివ్వాల్సిన బాధ్యతని యెత్తుకోవాల్సిన అవసరం వి వి వంటి సీనియర్స్ మీద పడింది. ఒకవైపు పాలకుల అణచివేతలకు వ్యతిరేకంగా ప్రతిఘటన నిర్మాణం, మరోవైపు దళాల రక్షణతో పాటు ఉద్యమ ప్రాంతాల విస్తరణ, గెరిల్లా జోన్ల యేర్పాటు వంటి విషయాలు పార్టీకి సవాలుగా పరిణమించాయి. విరసం తప్ప పీపుల్స్ వార్ పార్టీకి అనుబంధంగా వున్న ప్రజాసంఘాలపై క్రూరంగా నిషేధం అమలైంది. అదే కాలంలో ఆర్ధిక పోరాటాలతో పాటు సామాజిక సమానత్వం ప్రధానాంశంగా ముందుకొచ్చింది. స్త్రీ దళిత ముస్లిం మైనారిటీ అస్తిత్వ వుద్యమాలు వూపందుకున్నాయి. బ్రాహ్మణీయ పితృస్వామ్య భావజాలానికి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయ సాంస్కృతిక పోరాటాన్ని విరసం అందుకుంది. కుల – మత ఆధిపత్యాలపై నిరసన గళం వినిపించింది. ఈ దశలో వి వి కవిత్వంలో అనివార్యంగా చోటుచేసుకున్న వస్తు విస్తృతిని దృక్పథంలోవచ్చిన పరిణామాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంచనా కట్టాలి.

గుజరాత్ గాయం దరిమిలా హిందూ మతోన్మాదానికి మార్కెట్ శక్తులకూ ప్రపంచ ఆయుధ మాఫియాకీ సామ్రాజ్య వాద యుద్ధానికి వున్న ప్రచ్ఛన్న సంబంధాన్ని వివి బహిర్గత చేశాడు.

ఐదో దశ (2005 – 2014) : మావోయిస్టులతో చర్చలు , విరసంపై నిషేధం , ప్రత్యేక తెలంగాణా ఉద్యమం : అంతస్సూత్రం, తెలంగాణ వీరగాథ, పాలపిట్ట పాట, బీజభూమి

వి వి మరోసారి పాటకి దగ్గరైన కాలం. తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాట బలమైన సాహిత్య సాధనంగా, ఆయుధంగా మారిన సందర్భంలో తెలంగాణ వీరగాథని వివి పాటగా అందించాడు. విప్లవోద్యమంలో పనిచేసిన కవులు కళాకారులు అందరూ ప్రాంతీయ అస్తిత్వ చేతనకు తమ గళాల్ని అంకితం చేయడం వల్ల తెలంగాణలో ప్రత్యేక రాష్ట్రోద్యమం సఫలమైంది కానీ విప్లవ రాజకీయోద్యమం మాత్రం సెట్ బాక్ కి గురైంది. ఎంతోమంది కార్యకర్తల్ని కోల్పోయింది. మరోపక్క జల్ జమీన్ జంగిల్ పరిరక్షణ కోసం దేశవ్యాప్తంగా ముఖ్యంగా దండకారణ్యంలో ఆదివాసీ పోరాటాలు పెల్లుబికాయి. పాలకుల పాశవిక దమనకాండలో స్థానిక పోలీసులు పారామిలటరీ దళాలకు ప్రభుత్వమే తయారుచేసిన ప్రైవేటు సైన్యాలు తోడయ్యాయి. ఆపరేషన్ గ్రీన్ హంట్, సల్వాజుడుం ఆదివాసికి వ్యతిరేకంగా యుద్ధాన్ని ప్రకటించాయి. తమ కాలి కింది నేలనీ నేల లోపలి ఖనిజాన్ని కార్పొరేట్ కి వశం చేసే దుర్మార్గాన్ని ప్రతిఘటించి సమాంతరంగా జనతన సర్కార్ నడుపుతున్న ఆదివాసీల హక్కుల కోసం వి వి తన కాలాన్ని అంకితం చేశాడు. చర్చలలో మావోయిస్టుల ప్రతినిధిగా వ్యవహరించినందువల్ల రాజకీయ ప్రమేయాలు యెక్కువై వివి సాహిత్య వ్యాసంగం యీ కాలంలో కొంత బ్యాక్ సీట్ తీసుకున్నట్టు కూడా అనిపిస్తుంది.

ఆరో దశ (2014 నుంచి – వర్తమానంలోకి … ఎరవాడ జైలు వరకూ ) : కేంద్రంలో మరోసారి బిజెపి పాలన, గుజరాత్ ప్రయోగాన్ని దేశమంతటా అమలు చేసే ప్రణాళిక, భౌగోళిక తెలంగాణ యేర్పాటు, దొరలు గ్రామాలకు తిరుగు పయనం, ప్రజాస్వామిక హక్కుల నిరాకరణ నేపథ్యంలో చేసిన రచనలు

కేంద్రంలో ఫాసిస్టు పాలనలో చెలరేగిన మూకుమ్మడి క్రూర మతోన్మాద హింసనీ , సాంస్కృతిక జాతీయవాదం పేరుతో అమలవుతున్న కార్పొరేట్ అనుకూల దళారీ విధానాల్నీ సొంత రాష్ట్రం యేర్పడ్డ తర్వాత కూడా తెలంగాణలో కొనసాగుతున్న అప్రజాస్వామిక ఫ్యూడల్ పాలనా విధానాల్నివ్యతిరేకిస్తూ చేసిన రచనలు , తాను నిర్బంధం అనుభవిస్తూ కూడా తోటి ఉద్యమ కారుల పట్ల వారి ప్రాథమిక హక్కుల పరిరక్షణ పట్ల కన్సర్న్ తో రాసిన కవిత్వం వొక విప్లవ కవిగా వి వి వ్యక్తిత్వాన్ని చాటి చెబుతాయి. అసలు బ్రాహ్మణాధిపత్యానికి యెదురు నిలిచిన భీమ్ కోరేగావ్ వుద్యమానికి మద్దతు చెప్పి ఆ కారణంగా 79 ఏళ్ళ వయస్సులో జైలుకి వెళ్లడమే వి వి విప్లవాచరణ నిబద్ధతకి గీటురాయిగా నిలుస్తుంది. ఆయన విమర్శకులకు సమాధానమవుతుంది.

ఆరు దశాబ్దాల విప్లవ కవితా ప్రస్థానంలో కవిగా వరవరరావు సాధించిన వస్తు విస్తృతిన్నీ వైవిధ్యాన్నీ మరి యే యితర సమకాలీన కవుల్లోనూ చూడలేం. అయితే యే దశలోనూ ఆయన నేల విడిచి సాము చేయలేదు. సామాజిక క్షేత్రాన్ని విడవలేదు. చారిత్రిక కర్తవ్యాన్ని విస్మరించలేదు. శ్రామిక వర్గ స్పృహ వదులుకోలేదు. అందువల్ల సామాజిక శాస్త్రాల అధ్యయనం లేకుండా వి వి కవిత్వం లోతుల్లోకి వెళ్లలేం.

అస్తిత్వోద్యమ చేతనలో శకలాలుగా విడివడ్డ ప్రగతిశీల శక్తులన్నీ నూతన ప్రజాస్వామిక విప్లవ సాంస్కృతికోద్యమంలో భాగం అవుతాయని ఆయన విశ్వసిస్తూనే వున్నాడు. అంతిమంగా విప్లవం విజయవంతమవుతుందన్న ఆశతోనే తన కవితని సాయుధం చేస్తున్నాడు. అందుకు అవసరమైన వ్యూహాన్ని రచిస్తున్నాడు. సృజనాత్మక శైలినీ వ్యక్తీకరణ రీతుల్నీ రూపాల్నీ నిర్మాణ పద్ధతుల్నీ ఎప్పటికప్పుడు పునర్నిర్వచించుకుంటున్నాడు.

4

‘మట్టి చేతులు నిను మేధావిగా మలిస్తే
ఆ చేతులు కట్టిన రక్తగాయాలతో
నువ్వెవరిపై గేయాలు కట్టావని అడుగు’

కలం పట్టిన తొలిరోజుల్లో వరవరరావు కవిత్వ శైలిపై ఆయనకెంతో యిష్టులైన కాళోజీ పొట్లపల్లి రామారావు తిలక్ ల ప్రభావం మితంగానూ శ్రీ శ్రీ ప్రభావం బలంగానూ వున్నట్లు అనిపిస్తుంది. ‘ప్రజల నుంచి ప్రజలకు’ అన్న నినాదంతో విరసం జానపద బాణీలతో పాటని వుద్యమావసరాలకు అనువర్తించుకున్నప్పుడు వివి కట్టిన పాటల శైలి పాణిగ్రాహికీ, చెరబండరాజుకీ దగ్గరగా ఉండడం గమనిస్తాం. దాదాపు రెండు దశాబ్దాల పాటు వి వి పై అపరిమితమైన అనితరమైన ప్రభావం చూపిన కవి మాత్రం శివసాగరే . వి వి పాటల మీద కంటే కూడా వచన కవిత మీదే శివసాగర్ ప్రభావం యెక్కువ. అది యే యే రూపాల్లో యెక్కడ యే మేరకు వుందో లోతుగా అధ్యయనం చేయాల్సిన అంశం.

సముద్రం భవిష్యత్ చిత్రపటం వంటి దీర్ఘ కవిత్వ నిర్మాణంలో సాంద్రత కోసం నడకలో వేగం కోసం కడదాకా అనుభూతి ఐక్యత దెబ్బతినకుండా విప్లవోద్వేగాన్ని నిలిపి కొనసాగించడానికి మౌఖిక సంభాషణ శైలినో కథా కథన శైలినో ఆశ్రయించడం చూస్తాం.

రూప పరంగా వి వి కవిత్వాన్ని అంచనా కట్టేటప్పుడు వచన కవిగా పాట కవిగా ఆయన వాడిన శైలీ శిల్పాల్నీ భాషా ప్రయోగాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సి వుంటుంది. ఆ సందర్భంగా వి వి కవిత్వ శైలి గురించి శ్రీ శ్రీ చెప్పిన మాటలు గుర్తు చేసుకోవాలి.
‘‘వరవరరావు పేరు తలచుకొన్నప్పుడల్లా నాకు కొంపెల్ల జనార్దనరావు జ్ఞాపకం వస్తుంటాడు. ఒకవిధంగా జనార్దనరావు లేని లోటును తీరుస్తున్నది పెండ్యాల వరవరరావే. ఇంకో గొప్ప విశేషమేమిటంటే జనార్దనరావు కవిత్వంలో ఉన్న అన్వయకాఠిన్యం వరవరరావు కవిత్వంలో లేకపోవడం…. కవిత్వం ఎలా ఉంటే బాగుంటుందని నేననుకుంటున్నానో అలా ఉంటుంది వరవరరావు కవిత్వం”.

శ్రీశ్రీ యీ మాటలు కొంపెల్ల చనిపోయిన(1937) నాలుగు దశాబ్దాల తర్వాత(1977) అనడంలోని ఔచిత్యాన్ని విచారించాలి. వీటిని గుడ్డిగా స్వీకరించలేం. అలా అని పూర్తిగా తిరస్కరించలేం. భావజాల పరంగా కొంపెల్లకీ శ్రీశ్రీకే ఏ మాత్రం సంబంధంలేదు. సనాతనవాది అయిన కొంపెల్లతో వరవరరావుని అస్సలు పోల్చలేం. నలభైయేళ్ళ తర్వాత వచన కవిత రూపపరంగా యెంతో మార్పు పొందింది. అయినా కొంపెల్ల కవితాశైలితో వివి శైలి యే విధంగా సంవదిస్తుందో చూడటం ఆసక్తికరంగా వుంటుంది.

విప్లవ కవిత్వం నినాదప్రాయమై పోతోంది పోతోంది అని విమర్శకులు గొంతు చించుకొంటున్న కాలంలో వి వి యెటువంటి కవిత్వం రాశాడు – వాటిలోని శిల్ప రీతులు ఆ విమర్శను తిప్పికొట్టడానికి ఏ మేరకు ఉపయోగపడతాయి – శ్రీ శ్రీ పాణిగ్రాహి చెరబండరాజు శివసాగర్ వంటి కవుల కవిత్వ పంక్తులు గోడలమీద నినాదాలై మెరుస్తున్నప్పుడు వారి ప్రభావం వి వి పై యే మేరకు వుంది – వారి పక్కన అతని స్థానం యేమిటి? వంటి ప్రశ్నలను తులనాత్మకంగా లోతుగా పరిశీలిస్తే కొత్త కోణాలు ఆవిష్కారమౌతాయి.

ఐదూ ఖండాల నుంచి
నాల్గూ సంద్రాల మీంచి
ఉరికురికి వచ్చినాము
ఉదయించే సూర్యుడా
ఉప్పెనలా లేచినాము
ఉదయించే సూర్యుడా
ఉద్యమాలు తెచ్చినాము
ఉదయించే సూర్యుడా
ఉత్తేజం నీవె మాకు
ఉదయించే సూర్యుడా…. (స్వేచ్ఛ)

వంటి పాటలశైలి- పదాల వాక్యాల పునరావృత్తి – వచన కవితలోకి సైతం ప్రవహించడం గమనిస్తాం. ఆ యా సందర్భాల్లో మౌఖిక లిఖిత సంప్రదాయాలు కలగలిసి వచన కవితలకు లయాత్మకమైన మిశ్ర మౌఖిక శైలి రూపొందుతుంది. ఒక్క వి వి లోనే కాదు శివారెడ్డి వంటి వారి కవిత్వం లో కూడా యీ పద్ధతిని చూస్తాం.
శుద్ధ వచనం లాంటి కవిత్వంలో లయ బద్ధతని సాధిండానికి చేసిన ప్రయాణంలో మలుపుల్ని గుర్తించడం అవసరం. అయితే దాన్ని కేవలం రూప పరిణామంగా చూడకుండా ఆ రూపం అలా పరిణమించడానికి దోహదపడిన సామాజిక రాజకీయ అంశాల్ని (కొందరు వాటిని సాహిత్యేతర కారణాలుగా భావించవచ్చు) గమనంలోకి తీసుకోవాలి.
పాట కవిగా వి వి స్థానాన్ని బేరీజు వేసేటప్పుడు 70 ల్లో తొలిరోజుల్లో రాసిన పాటలకీ (ఓట్లు, పోలీసులొచ్చిన్రు , మాపటోళ్ళు మొ.) 80 ల్లో రాసిన పాటలకీ (ఇంద్రవెల్లి , కలల మీద కత్తి దూసి మొ.) ఆ తర్వాత చాలా కాలానికి కొత్త శతాబ్దంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలంలో కట్టిన పాటలకి మధ్య నిర్మాణ పరంగా భాషా పరంగా వున్న మార్పుని పరిగణనలోకి తీసుకోవాలి.

అదే విధంగా వివి కవిత్వం మొత్తంలో ప్రతిఫలించిన తెలంగాణా భాషా సంస్కృతుల గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు. అప్పుడు ఆయన పెరిగి వచ్చిన సామాజిక సాంస్కృతిక నేపథ్యం వంటి అంశాల్ని పరిగణన లోకి తీసుకోవాల్సి ఉంటుంది. భాష విషయికంగా వి వి తొలినాటి పాటల్లో మధ్యతరగతి వాసనలు వదిలించుకోలేక పోవడం గమనించవచ్చు. అది ఆయన పరిమితిగానే గ్రహించాలి. తర్వాతి కాలంలో దాన్ని ఆయన జానపద విశ్వాసాలను, మోటిఫ్ లను వాడుకోవడంద్వారా అధిగమించడానికి ప్రయత్నించాడు. మలిదశ తెలంగాణా ఉద్యమం నాటి ఆయన పాటల్లో తెలంగాణదనం ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ ఉద్యమంలో పాట వొక వెల్లువలా వచ్చింది. ఉసుళ్ళు పుట్టినట్టు వందలాది కవులు పుట్టారు. సాంస్కృతిక సైన్యం తయారైంది. గద్దర్, గూడ అంజయ్య, గోరెటి వెంకన్న, జయరాజ్, అందెశ్రీ వంటి వాగ్గేయకారుల కవిత్వానికీ వి వి కవిత్వానికీ రూప పరంగా భాషా విషయికంగా వ్యక్తీకరణ రీత్యా సంస్కృతి దృష్ట్యా వున్న పోలికల్ని తేడాల్ని ప్రత్యేకంగా అధ్యయనం చేయొచ్చు.

చాలా సందర్భాల్లో కవితని బలంగా ఆవిష్కరించడానికి వివి జన జీవితంలో బహుళ ప్రచారంలో వున్న హిందూ పురాణేతిహాస ప్రతీకల్ని వాడడం చూస్తాం. రానురానూ దీన్నుంచి ఆయన తనను తాను నియంత్రించుకునే ప్రయత్నం చేసినట్టు కూడా తోస్తుంది.

ఉద్యమంలో అమరులైన సహచరుల మీద వివి రాసిన కవితల్లో వినిపించే వేదన, ఆత్మీయుల మరణాంతరం రాసే వ్యాసాల్లో కనిపించే సామూహిక భావనలు విలక్షణమైనవి. ఆ యా వ్యక్తుల జీవితంలో చోటుచేసుకున్న ప్రధాన సంఘటనలు, చుట్టూ అల్లుకొని వున్న మానవ సంబంధాలు, వారితో తనకున్న సాన్నిహిత్యం వీటన్నిటినీ నెమరువేసుకుంటూ రాసిన రాతలన్నీ దు:ఖపు జీరతో కూడిన మోనోలాగ్ రూపాన్ని సంతరించుకుంటాయి. సైద్ధాంతికంగా యేకీభావం లేని, విభేదించిన మిత్రుల మరణాల సందర్భంలో కూడా రాయకుండా వుండలేని సున్నిత మనస్కుడాయన. ఆయన రాసిన స్మృతి కవిత, వ్యాసం ప్రత్యేక పరిశోధనకు అర్హమైనవే.

వివి కవిత్వాన్ని అధ్యయనం చేయడానికి ఆయన కవిత్వమే ప్రాథమిక ఆధారం, ఆకరమైనప్పటికీ కవిత్వం గురించి దాని ప్రయోజనం గురించి రాసిన కవితలు, శుద్ధ కళావాదులకు జవాబుగా రాసిన కవిత్వం, పోస్టు మాడర్నిస్ట్ ల అనిబద్ధతని తిరస్కరిస్తూ రాసిన కవిత్వం, కవిత్వ వ్యక్తీకరణ గురించి కవిత్వం ద్వారానే ప్రకటించిన అభిప్రాయాలు ప్రత్యేకంగా తోడ్పడతాయి. తన సమకాలీన కవుల, ఉద్యమ సహచర కవుల , కొత్త కవుల కవితా సంపుటులకు రాసిన ముందుమాటలు, లోతైన విశ్లేషణలతో కూడిన సమీక్షా వ్యాసాలు, అనర్గళ ధాటితో చేసిన వుపన్యాసాలు, విరసం సభల్లో చేసిన సైద్ధాంతిక ప్రతిపాదనలు, తీర్మానాలు, పార్టీ సాంస్కృతిక విధానాలని తెలియజేసే డాక్యుమెంట్ లు, కవులు రచయితలపై ప్రభుత్వ నిర్బంధాలకు, భావప్రకటన స్వేచ్ఛపై అమలయ్యే నిషేధాలకు వ్యతిరేకంగా సాంస్కృతికోద్యమాలకు దిశా నిర్దేశం చేస్తూ రాసిన కరపత్రాలు, ఖండన ప్రకటనలు … వంటివి ద్వితీయాకారాలుగా ఉపయోగపడతాయి.

వి వి కవిత్వాన్ని కాలక్రమంలో గతితార్కిక చారిత్రిక దృష్టితో అధ్యయనం చేసేటప్పుడు ఆ యా కాలాల్లో ప్రాచుర్యంలో వున్నకవితా నిర్మాణ రీతులు, వ్యవస్థీకృత సాహిత్య విలువలు , వాటిపై తిరుగుబాటుగా వచ్చిన ధోరణులు, అందుకు దోహదంచేసిన స్థల కాల పరిస్థితులు వీటన్నిటినీ సమగ్రంగా అధ్యయనం చేయాలి. అక్కడ వి వి స్థానాన్ని, ప్రమేయాన్ని, పాత్రనీ కవిత్వ మాధ్యమంగా బేరీజు వేయాలి. ఆయన కార్యక్షేత్రం దేశం అంతటా వ్యాపించి వుంది. ఆయన కవిత్వం యితర భారతీయభాషల్లోకి అనువాదమైంది. ఈ కారణంగా యితర భాషా కవిత్వ రీతుల్ని కూడా స్థూలంగా తెలుసుకొని తులనాత్మకంగా పరిశీలించాలి. విస్తృత సాహిత్య అధ్యయనం (ప్రాచీన అర్వాచీన సమకాలీన) కారణంగా ఆయనపై యే యే కవుల ప్రభావాలు బలంగా వున్నాయో చూడడం దగ్గర ఆగిపోక ; సమకాలీన – తదనంతర కవులపై వి వి ప్రభావాన్ని సైతం అధ్యయనం చేయాలి. సముద్రుడు, అజ్ఞాత సూరీడు, కౌముది, మంజీరా, షహీదా వంటి కవులపై వి వి ప్రభావం అంచనా కట్టాలి. ఎప్పటికప్పుడు కొత్తతరం కవులతో, కవిత్వ డిక్షన్తో, కవి సమయాలతో, దృక్పథాలతో, వుద్యమావసరాలతో, ప్రజా సంబంధాలతో తనను తాను పునర్నవీకరించుకుంటూ పయనిస్తూ సానపట్టడం వల్లే వివి కవిత్వం పదునెక్కి పాలకులకు పక్కలో తుపాకీలా తయారైంది.

మార్క్సిస్టు కవులు విమర్శకులు వసువు మీద పెట్టిన శ్రద్ధ రూపం మీద పెట్టరు అన్న అపవాదు వుంది. అటువంటి వాదనల్ని పూర్వ పక్షం చేయ గలిగిన వుదాహరణాలెన్నో వి వి కవిత్వంలో కనిపిస్తాయి. నిర్మాణ పరంగా కొత్త ప్రయోగాలు సైతం ఆయనలో కనిపిస్తాయి. అయితే ప్రయోజన శూన్యమైన ప్రయోగాలకు మాత్రం ఆయన దూరంగానే వున్నాడు. శుద్ధ కళావాదులకు, అనిబద్ధ వాదులకు, ప్రయోగవాదులకు, జవాబుగా వస్తు శిల్ప దృక్పథాల మధ్య సమన్వయం సాధించడానికి కొత్త కవులు యెందరికో వి వి మార్గదర్శనం చేసాడు. కవి దృక్పథమే కవిత్వానికి జీవం అని నిరూపించాడు.

5

‘ఆస్తి
మనుష్య ప్రపంచాన్ని
కాపలాదారులుగా, నేరస్తులుగా విభజించింది
నేను అసలు దానినే రద్దు చేస్తానని ప్రకటిస్తే
ఆస్తి బోనులో ముద్దాయిని సరే
కామందు కళ్లకు నేను కమ్యూనిస్టును
అంతకన్నా పెద్ద నిందారోపణ లేనట్లు
అతడు నన్ను నక్సలైట్నంటాడు
అదే నిజమయ్యేలా నిరీక్షిద్దాం మనం
ప్రజల కోసం ʹరాజద్రోహంʹ చేద్దాం మనం.’

దాదాపు యాభై యేళ్లపాటు వరవరరావు ‘నిటారుగా నిలబడి వ్యవస్థను నిలదీసే కవిత్వం ఆధిపత్యాన్ని ప్రశ్నించే కవిత్వం రాజ్యాన్ని ధిక్కరించే కవిత్వం లోచూపు ముందుచూపు వున్న కవిత్వమే , వెన్నెముక వున్న కవిత్వమే ‘ రాశాడు. ఇంతకు ముందే చెప్పుకున్నట్టు ఆ చూపు మార్క్సిజమే. ఆ వెన్నెముక మార్క్సిజమే. పునాదిలో దాన్నుంచి పక్కకు తొలగకుండా కాలానుగుణంగా వుద్యమావసరాల రీత్యా కొత్త విప్లవ శక్తుల్ని కలుపుకుపోయే క్రమంలో వచ్చిన మార్పు తప్ప ఆయన మౌలిక దృక్పథంలో వ్యక్తిత్వంలో మార్పు రాలేదు. ఎక్కడా రాజీ పడలేదు. ఏ ప్రలోభాలకూ లొంగిపోలేదు. నిర్బంధాల్లో సడలిపోలేదు. పోరు మార్గాన్ని విడిచిపోలేదు. దృక్పథ పటుత్వం వల్లే అది సాధ్యమైంది.

సైద్ధాంతిక నిబద్ధత కళాత్మక విలువలకు ఆటంకమౌతుంది – నిర్మాణాల్లో కవీ కళాకారులూ స్వేచ్చని కోల్పోతారు అన్న వాదాల్ని పరాస్తం చెయ్యడానికి నిర్మాణాల్లో వుండి అద్భుతమైన కవిత్వం రాసిన వివి వంటి కవులెందరో తార్కాణంగా నిలుస్తారు. శివసాగర్ జీవితాంతం యేదో వొక నిర్మాణంలోనే వున్నాడు. తాను విశ్వసించిన భావజాలానికి కట్టుబడే వున్నాడు. నిజానికి నిర్మాణాలూ ప్రాపంచిక దృక్పథాలూ కవితాభివ్యక్తికి బలాన్నిస్తాయి, స్పష్టత చేకూరుస్తాయి. ప్రజా క్షేత్రంలో పనిచేసే కవులు రచయితలూ వుద్యమావసరాల రీత్యా జనహితం కోసం దృక్పథాల్లో మార్పుని స్వాగతిస్తారు. మార్పుని అంగీకరించక కట్టుగొయ్యలకు కట్టేసుకుని పిడివాదులతోనే గొడవ.

సృజన పత్రిక నిర్వహణలో కనిపించే భావజాల పరిణామం వి వి కవిత్వంలో సైతం చూడగలం. మార్క్సిజం లెనినిజం మావో ఆలోచనా విధానంతో నడిచిన రాజకీయ పార్టీ లోపలి వ్యక్తి అన్నంతగా ఆయన ఆ సిద్ధాంతాన్నీ భావజాలాన్నీ బయటి ప్రజా సంఘం ద్వారా ప్రచారం చేశాడు. ఒక్కోసారి పార్టీ స్పోక్స్ పెర్సన్ అన్నంతగా సంలీనుడై ప్రవర్తించడం గమనిస్తాం. విప్లవ రాజకీయోద్యమ పార్టీకి విరసం అనుబంధ ప్రజా సంఘంగా పనిచేస్తున్న సందర్భంలో పార్టీ రాజకీయాలతో విభేదించే అంశాల్ని శివసాగర్ లాగా ప్రతీకాత్మక కవిత్వ రూపంలో వ్యక్తం చేసిన దాఖలాలు కనిపించవు. ఒకవేళ పార్టీ విధానాలతో యెక్కడైనా విభేదించినప్పటికీ తన అభిప్రాయాన్ని ప్రజాస్వామికంగా చర్చకు పెట్టి సాధించుకుని వుండవచ్చేమో గానీ సంస్థాపరమైన క్రమశిక్షణని వుల్లంఘించలేదు .

వర్గ శత్రు నిర్మూలన దగ్గర్నుంచి రోహిత్ వేముల వెలివాడ కూల్చివేత నిరసన వరకూ వి వి కవిత్వంలో కనిపించే రాజకీయ ఆలోచనల మార్పు విప్లవాచరణ క్రమంలో రూపొందిందే. ఆచరణే గీటురాయిగా ఆయన ప్రతి అడుగూ నూతన ప్రజాస్వామిక విప్లవం వైపు అంతిమంగా నూతన మానవ ఆవిష్కరణ దిశగా నడవడం గమనిస్తాం.

విప్లవోద్యమంలో హింస ప్రతి హింసల గురించి, ప్రతిఘటన చర్యల గురించి, పోరాట రూపాల గురించి ఆయన ఆలోచనల్లో వచ్చిన మార్పును స్పష్టంగానే గమనిస్తాం. ‘వసంతోత్సవ వేళ – రంగు కాదు రక్తమే ఆడాలి. కాముణ్ణి చంపి వాని నెత్తురుతో వసంతాలు చల్లుకుందాం’ వంటి 1970 ల నాటి పంక్తులు తర్వాతి కాలంలో ఆయనకే ఆమోదం కాలేదు. అలా అని ఆయన వాటిని డిస్ వోన్ కూడా చేసుకోలేదు. వర్గ శత్రువు పట్ల అనుసరించాల్సిన వైఖరిలో ఆచరణలో వచ్చిన మార్పులకు గుర్తులుగా వాటిని చూడాలి.

సమాజంలో అమలయ్యే అన్ని రకాల ఆధిపత్యాలపై ధిక్కారం ఆయన కవిత్వానికి జీవగర్ర అయింది. హింసాహింసల్ని, ప్రతి హింసని తాత్వికంగా వ్యాఖ్యానించిన తీరు ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిన అంశం. సమాజంలో కుటుంబంలో అమలయ్యే హింసకు మూలాల్ని అన్వేషించడం, పరాయీకరణ (శ్రమ సంస్కృతి) రూపాల్ని విశ్లేషించడం, మార్కెట్ అమానవీయతని గర్హించడం, పాలకుల దళారి పాలన గుట్టు విప్పడం వంటి అనేకాంశాలు వి వి మార్క్సిస్టు దృక్పథాన్ని పట్టి యిస్తాయి. వాటిని విశ్లేషించడానికి అదే పరికరాన్ని వాడాలి.

రాజ్య హింసని ఖండించే సమయాల్లో చాలా మంది కవులు ప్రతీకలు వెనకో , సంక్లిష్ట నిర్మాణ రీతుల వెనకో, అస్పష్ట శిల్పం మాటునో, అలంకారిక శైలి చాటునో దాక్కోవడం చూస్తాం. కానీ వివి ఎక్కడా దాపరికం లేకుండా స్పష్టంగా సూటిగా తన ఆగ్రహాన్ని బహిరంగంగా వ్యక్తం చేస్తాడు. రాజ్య స్వభావాన్ని విశ్లేషిస్తూ చేసిన కవితా వ్యాఖ్యానాలు ఆయన రాజకీయ తాత్త్వికతకి నిదర్శనంగా నిలుస్తాయి. ఉద్యమాన్ని అణచివేయడానికి ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి రాజ్యం వేసే యెత్తుగడల్ని పసిగట్టడంలో వాటిని అర్థం చేయించడంలో ఆయన గొప్ప సమయస్ఫూర్తిని చూపిస్తాడు. వాటిని కవిత్వంలోకి తర్జుమా చేయడంలో వుపయోగించే తార్కిక శైలి అపురూపం. శివసాగర్ కవిత్వంలో కూడా యీ ధోరణి కనిపిస్తుంది. అయితే శివసాగర్ శబ్దగతమైన వ్యంగ్యాన్ని ఆశ్రయిస్తాడు. వి వి కవిత్వంలోగానీ , వ్యాసాల్లోగానీ, వుపన్యాసాల్లోగానీ వ్యంగ్యం తక్కువ. తన మనోగతాన్ని, సైద్ధాంతిక అవగాహననీ సూటిగా వ్యక్తీకరించంచడమే ఆయన బలం.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యం బూటకమే కాదు అది కార్పొరేట్ శక్తులకు దళసరిగా బానిసగా వ్యవహరించే క్రమంలో యెంత క్రూరంగా, హింసాత్మకంగా, అమానవీయంగా ప్రవర్తిస్తుందో వి వి తన కవిత్వం ద్వారా తెలియజేస్తూ విప్లవ శ్రేణుల్ని అప్రమత్తం చేస్తున్నాడు. అభివృద్ధి పేరున మైనింగ్ మాఫియా, సెజ్ ల మాటున రియల్ ఎస్టేట్ దందా, ప్రాజెక్టుల నెపంతో విస్థాపన దళిత ఆదివాసీ జీవితాల్ని ధ్వంసం చేసున్న దుర్మార్గాన్ని యెండగట్టి వారి జీవించే హక్కుల కోసం పోరాడుతున్నాడు. న్యాయవ్యవస్థ దగ్గరనుంచి సమస్త రాజ్యాంగ వ్యవస్థల్నీ ఫాసిస్టు శక్తులు నిర్వీర్యం చేస్తున్న సందర్భంలో ప్రత్యామ్నాయ రాజకీయ పరిష్కారాల్ని వుద్బోధిస్తున్నాడు.

90 ల తర్వాత బలంగా ముందుకు వచ్చిన దళిత మహిళా మైనారిటీ ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంతో జరుగుతున్న పోరాటాలు విడి విడి శకలాలుగా కాకుండా మొత్తం నూతన ప్రజాతంత్ర పోరాటంలో యేకోన్ముఖంగా విప్లవీ కరణ చెందాల్సిన అవసరాన్ని అందుకు అనుగుణమైన సైద్ధాంతిక దృక్పథాన్ని వి వి తన కవిత్వంలో ప్రకటిస్తూనే వున్నాడు. వి వి కే కాదు విప్లవోద్యమంలో పనిచేసే సాంస్కృతిక కార్యకర్తలందరికీ యీ యెఱుక అవసరం. అందుకు అనుగుణమైన స్ఫూర్తిని ఆయన అందిస్తున్నాడు.

కారంచేడు చుండూరు దగ్గర్నుంచి వేంపల్లె మీదుగా నిన్నటి గరగపర్రు వరకు ఆ యా సందర్భాల్లో దళిత సమస్యల్ని వుద్యమాల్ని వర్గీకరణ యేకీకరణ వైరుధ్యాల్ని అర్థంచేసుకొని పార్టీ తీసుకున్న నిర్ణయాత్మక వైఖరే వివి కవిత్వంలో స్పష్టంగా కనిపిస్తుంది. అదే విధంగా ప్రత్యేక తెలంగాణ వుద్యమంలో ప్రజా తెలంగాణ విధానాన్ని అవసరాన్ని ఆయన అనేక సందర్భాల్లో బలంగా చెప్పాడు. తొలి మలి తెలంగాణా వుద్యమ కాలాల్లో ఆయన అభిప్రాయాల్ని దృక్పథాల్ని నిర్దుష్టంగా అంచనా కట్టాలి.

తన రాజకీయ దృక్పథాల్ని వొక పాఠం లా కాకుండా కళాత్మక సౌందర్యంతో భాసింపజేయడానికి వివి తీసుకున్న జాగ్రత్తలు ఆయన్ని యీ నాటి కవుల్లో మేటిగా నిలబెట్టాయి.

6

‘నేరమే అధికారమై
ప్రజల్ని నేరస్తుల్ని చేసి వేటాడుతుంటే
ఊరక కూర్చున్న
నోరున్న ప్రతివాడూ నేరస్తుడే”

దశాబ్దాల పూర్వం వి వి రాసిన వుత్తేజకరమైన యీ కవిత్వ పంక్తులు సోషల్ మీడియా గోడలపై యివాళ నినాదమై యెందరికో స్ఫూర్తినిస్తున్నాయి. ఫాసిస్టు పాలనపై ప్రతిఘటనకు పిలుపునిస్తున్నాయి. కొత్త తరానికి పోరు దారిలో కరదీపికలవుతున్నాయి. ప్రజా వుద్యమాలకు వూపిరి పోస్తున్నాయి.

రాజకీయ విశ్వాసాల కారణంగా విశ్వవిద్యాలయాల్లో ఆయన మీద పరిశోధనలు యెట్లాగూ జరగవు. ప్రగతిశీల సాహిత్య సంస్థలూ, స్వతంత్ర మేధావులూ, విమర్శకులూ, పరిశోధకులు మాత్రమే అందుకు పూనుకోవాలి. అలజడిని జీవితంగానూ, ఆందోళనని వూపిరిగానూ, తిరుగుబాటును వేదాంతంగానూ, ధిక్కారాన్ని దీముగానూ, నిషేధ నిర్బంధాలని యితోధిక నిబద్ధతకు స్ఫూర్తిగానూ, సాహిత్య రచనని వుద్యమ ఆచరణగానూ మల్చుకున్న విప్లవోద్యమ కవి వరవరరావు కవిత్వం పై యిప్పుడైనా – మనందరి ఆశయాల్ని ఆచరణలోకి పొదవుకుని మనందరి కలల్ని సాకారం చేసే పనిలో యెనభై యేళ్ల వయస్సులో చెరగని చిరునవ్వుతో జైలు బాధల్ని జయిస్తున్న సందర్భంలో – కొత్త వెలుగులు ప్రసరిస్తాయనీ శాస్త్రీయమైన అంచనాలు వెలువడతాయనీ ఆశంస. ‘భవిష్యత్తు మీద ఆశ ఈ సంకెళ్ళలో ధ్వనిస్తోంది’.

కంఠం స్వరమై
స్వరం స్వేచ్చాగీతమై
గీతం పోరాట సాధనమైనపుడు
కవికి శత్రువు భయపడతాడు
కటకటాల్లో పెడతాడు
కంఠానికి ఉరి బిగిస్తాడుఅప్పటికే కవి ప్రజల్లో
అతని సందేశంతో జీవిస్తూ వుంటాడు.

1985లో బెంజిమిన్ ఫ్రాంక్లిన్ మొలైసీ కోసం వి వి రాసిన యీ కవిత ఆయన సాహిత్య జీవితానిక్కూడా అతికినట్టు సరిపోతుంది. కవికి ప్రజల శత్రువు భయపడుతూనే వున్నాడు. కవి ప్రజల నాలుకపై జీవిసూనే వున్నాడు.

సాహిత్య విమర్శకుడు. తెలుగు కన్నడ రాష్ట్రాల్లో ముప్ఫై ఏదేళ్లపాటు సంస్కృతం – తెలుగు పాఠాలు చెప్పి రిటైర్ అయ్యారు. ‘తెలుగులో మాండలిక కథాసాహిత్యం’ పై పరిశోధన చేసి అదే పేరుతో ప్రచురించారు. స్త్రీ వాద కథలు, నిషేధ గీతాలు, డక్కలి జాంబ పురాణం, రెండు దశాబ్దాలు కథ , జానపద చారిత్రిక గేయగాథలు, బయ్యారం ఖ ‘నిజం’ ఎవరిది?, కన్నీటి సాగరాలొద్దురా మల్లన్నా, నోబెల్ కవిత్వం, అదే నేల (ముకుందరామారావు), తొవ్వ ముచ్చట్లు (జయధీర్ తిరుమల రావు ), యుద్దవచనం (జూలూరి గౌరి శంకర్), పాపినేని శివశంకర్ కథలు, తాడిగిరి పోతరాజు కథలు, రాయలసీమ : సమాజం సాహిత్యం (బండి నారాయణస్వామి), బహుళ - సాహిత్య విమర్శ : సిద్ధాంతాలు, ప్రమేయాలు, పరికరాలు (పర్స్పెక్టివ్స్), 50 యేళ్ల విరసం : పయనం - ప్రభావం … వంటి పుస్తకాలకి సంపాదకత్వ బాధ్యతలు వహించారు. ‘వేమన దారిలో’ పేరున ఎంపిక చేసిన వేమన పద్యాలకు వ్యాఖ్యానం చేసారు. ‘సమకాలీనం’ పేరుతో కథా విమర్శ పై వ్యాస సంపుటి వెలువరించారు. ప్రగతిశీల ఉద్యమ సాహిత్యాన్ని ప్రేమించే ప్రభాకర్ అస్తిత్వ ఉద్యమాలు శకలాలుగా కాకుండా ఏకోన్ముఖంగా సాగుతూ అంతిమంగా పీడిత జన విముక్తికి దారి తీయాలని కోరుకుంటున్నారు.

Leave a Reply