విపత్తు ప్రాంతం

ఉద్వేగం లేని గొంతులో
కవితా పాదాలు చకచకా కదలాడవు
బండబారిపోయిన గుండె మేరల్లో
పదునైన పదాలు ఎంతకీ చిగురించవు
చీలిపోయిన నాలుక అంచుల పైన
నిజాలు సూటిగా ధ్వనించవు

పొట్టిపొట్టి చూపుల్లోంచి
పొడిపొడి దృశ్యాలే రాలిపడతాయి
పిరికిగుండెలు ఎంతగా బీరాలు పలికినా
మాటలు మేసగానే మెలితిరుగుతాయి
కలం కళ్లకు రాగద్వేషాల కలక అంటుకుంటే
సర్వసాక్షి కోణం రెప్పలు వాలిపోతాయి

విధ్వంస కాలాలను విరోధించే స్థలాలలో
నిరసన జెండాలయి పాతుకోనిదే
అక్షరాలకు ఊపిరి సలపదు
సంక్షోభ సమయాలను
ధిక్కరించే సందర్భాలకు
బిగి పిడికిళ్లవ్వనిదే
స్వరాలకు ప్రాణం నిలవదు

ఆహా ఓహోల్లో
ఎంత కవిత్వం పండించినా
చరిత్ర నోటికి రుచించదు
పెత్తనం కుర్చీ కాళ్ళకింద పొగిలే
కన్నీటి చేతులకు చేయందించనిదే
ఎంత నిడివివున్న రాతలకయినా
ఆయుష్షుండదు

పద్యం కళ్ళెదుట అరాచక మూకలు
బోరచాపి నిలబడుతుంటే
నంగినంగిగా వినబడతావేం?
పద! పదబంధమా! ప్రాణాలకన్నా
న్యాయానికి విలువెక్కువ
పద! పద్యమా! పలుకు ధిక్కార గీతం
నీ గది ఎప్పటికీ ఒక విపత్తు ప్రాంతం

కవి, రచయిత. పుట్టింది శ్రీకాకుళం జిల్లాలో బడగాం అనే మారుమూల పల్లె వ్యవసాయ కుటుంబంలో. చదువు: M.A.(English), M.A.(Telugu), B.Sc., B.Ed. వృత్తి: ఉపాధ్యాయ వృత్తి. రచనలు: 1) వలస పక్షుల విడిది - తేలినీలాపురం (2005) 2) కొంగా! నా గోరు మీద పువ్వెయ్యవా...(నానీ సంపుటి) (2010). ఇంకా వివిధ పత్రికల్లో వందకు పైగా వచన కవితలు, కొన్ని సాహితీ వ్యాసాలు, సమీక్షా వ్యాసాలు ప్రచురించబడ్డాయి. గత రెండు దశాబ్దాలుగా సాహిత్యంతో అనుబంధం.

Leave a Reply