విను

అంటరాని మనిషివనో
ఆవు మాంసం తిన్నావనో
మంత్రాలు పెట్టావనో
పిల్లల్ని ఎత్తుకు పోయావనో
పంటను దొంగిలించావనో
ప్రేమించనీకి ఊర్లోకి పోయావనో
పప్పూ పెరుగన్నం తిన్నావనో
పెళ్లి గుర్రమెక్కావనో

వాడ దేవరని ఊళ్ళో ఊరేగించావనో
అసలు దేవుడే లేడని అంటున్నావనో
వేరు మత ప్రచారం చేశావనో
విద్వేషాలు రెచ్చగొట్టావనో
అర్బన్ నక్సలైటువనో
అభ్యంతరకరమైన అక్షరాలున్నాయనో

త్రివర్ణాలను మొయ్యవనో
తిలకాలు దిద్దవనో
మానవ అక్రమ రవాణాదారువనో
పౌరసత్వమే లేని మనిషివనో
యుద్దమూ శాంతిని చదువుతున్నవనో
ప్రభుత్వాన్ని కూల్చే కుట్రదారువనో

ప్రశ్నల్ని లేపావనో
పిడికిళ్లను బిగబట్టావనో
రాతల్ని చెరిపావనో
హేతువుని లేపావనో
కల్లోలం చేశావనో
కాలాన్ని ముట్టించావనో

ఏ చెట్టుకైనా వేలాడవచ్చు
ఏ మంట లోనైనా మాడవచ్చు
ఏ ఉచ్చు లోనైనా ఇరుక్కోవచ్చు
ఏ యాక్సిడెంటుకైనా బలి కావొచ్చు
ఏ ఘంటికైనా మోగవచ్చు
పిలుపు ఎప్పుడైనా రావొచ్చు

***

శరణార్ధినే

బాణాల శూలాల గుంపొకటి
మా వెంట పడింది
పాకిస్తాన్ కో ఖబరస్తాన్ కో వెళ్ళమని
నా దోస్తుని అదిరిస్తోంది!
గూడేనికో శిబిరానికో పొమ్మని
నన్ను బెదిరిస్తోంది!

ఊళ్ళోకి పోయినపుడల్లా ఈ పరిసరాలు
నా సొంతవి కావని కేక పెట్టాలనిపించేది
మనసు బాధతో రోదించేది
ఇపుడీ దేశమే నాది కాదని భయమేస్తోంది

ఇన్నాళ్లూ నాకు ఊరే లేదని అనుకున్నా
ఇప్పుడు నాకు దేశమే లేదని అనిపిస్తోంది
గుడ్డు దెరిసిన గడ్డ మీదే
నేను నిషేధిత నివాసిని!
నిన్నటి దాకా నాకు ఊరున్నా,
ఊరికి కాని వాణ్ణే!
ఊరికి అంటరాని వాణ్ణే!
ఇప్పటి దాకా నాకు దేశమున్నా,
ఇపుడు దేశానికి పరాయి వాణ్ణే!

శిబిరవాస శిక్ష నాకు కొత్తది కాదు!
వాడ నాకు శరణార్ధుల శిబిరమే!
ఈ ఊరూ, దేశం నా కెప్పటి నుంచో శిబిరమే!
ప్రభుత్వ రాజ్యాంగం నాకు స్వేచ్ఛ నిచ్చినా,
మనువు రాజ్యాంగం
వాడ శిబిరం లోనే నన్ను బందీని చేసింది!

ఇప్పుడు ఈ దేశంలో
నేను అనుమానితుణ్ణి!
ఆంక్షల వీసా ముగిసిన పరదేశిని!
అక్రమ చొరబాటుదారుని!
ప్రాణం తప్ప ఏ గౌరవమూ లేని శరణార్ధిని!

ఇంకొంచెం ఆగితే
వారి దృష్టిలో నేను టెర్రరిస్టును కావొచ్చు!
తీవ్రవాదినీ కావొచ్చు!
దేశ ద్రోహినీ లేదా రాజద్రోహినీ కావొచ్చు!

మట్టి బిడ్డలారా!
స్నేహితులారా!
బంధువులారా!
చౌరస్తా కాడికి రాండొహో!

మనం స్వదేశీనో విదేశీనో
పౌరులమో శరణార్థులమో తేల్చుకుందాం
జాంబవ దేశాన్ని నిలబెట్టు కుందాం

***

మట్టి భాష

నేను నా యజమాని భాష దగ్గరే ఆగిపోయాను
యజమానికిి యజమానియైన వాడి భాష దగ్గరకు పోలేక పోయాను
ఇంతలో నా అసలు భాష మరిచిపోయాను

యిప్పుడు ప్రకృతిలో నిలబడి అరవడమే
నా స్వాభావిక భాషగా మారిపోయింది
నా పర్యావరణం ఒక సాంఘిక జైలు

తొందరలోనే
నా యజమాని రాతనీ
వాడి యజమాని రాతనీ తిరగ రాస్తాను

నా గూటాన్నే ఘంటంగా మార్చేస్తాను
మంత్రాన్నీ, యంత్రాన్నీ శాసించే కొత్త భాష పుట్టిస్తాను
దుఃఖానికి తావులేని బేగంపురా నగరాన్ని ప్రతిష్టిస్తాను

నాది చర్మకార భాష
చెప్పుల భాష
సృష్టి భాష నాది మట్టి భాష

కవి, రచయిత. జర్నలిస్ట్, సామాజికోద్యమాల కార్యకర్త. ట్రెయినర్, అకడమిక్ కౌన్సిలర్, సామాజిక తత్వవేత్త.

One thought on “విను

  1. My Dear Brother,
    I am very proud to hear good poetry from you , unfortunately we don’t live any more in that age and culture that we grew-up. It is reference only to shaping our future yet to live. Espoused culture is totally different from living experiences.Need big picture thinking for the change we can impact current culture.This new generation has no ability to consider old traditional views for better living in information age. They don’t wants to know more about traditional culture that we lived.We need shift for some the cultural challenges.
    Best Regards
    Ravi

Leave a Reply