ఊరి నడుమన ఉండీ
ఊరితో మాటైనా కలవనట్టు
లోనంతా డొల్ల డొల్లగా
ఖాళీ చేయబడిన ఇల్లులా..
నాకు నేను అల్లుకున్న
విష పరిష్వంగంలో
చిక్కు చిక్కుల ఉండల్లో
ఇరుకునబడి స్పృహ తప్పినట్టు..
ఎప్పుడో ఒకప్పుడు నేనూ
నవ్వుల పువ్వుల చెరువునే
ఇప్పుడేమో రాతిబొమ్మనైతి
కళ్ళు కానకుండా ఉంటిని…
దూరాల నుండి నిర్జన వారధి
నేను కదిలితే చాలు.
ఎటైనా దాటించేయాలని
పాదాలు మోపగానే హత్తుకోవాలని..
చూపుకు ఊపు తగ్గిందేమో
మనసుకు మర్మం సోకిందేమో
అభావానికి ముభావం తోడై
రాని రాగాన్ని సాగదీస్తునట్టు..
అతుకులు పడిన అంగీలా
శూన్యపు అంచులకు జెండాలా
ఉరికొయ్యకు ఊగే ఉయ్యాల్లా
ఇప్పుడు ఏమీ కాని నేను
వినబడని పాటను!
ఉనికి లేని ఊటను!!
శూన్య పు అంచులకి జెండాలా