‘ఇయ్యాలే ఇయ్యాలే’
‘మా సార్లకు నెలనెలా జీతమియ్యాలె’
జీతాలివ్వాలే ఇవ్వాలే’
మా సార్లకు జీతాలివ్వాలె’
‘బోధించి బక్కపడేది వాళ్ళు
కూచొని బలిసేది మీరా’
‘పస్తులతో వాళ్ళిపుడు
‘పంచ భక్ష్య పరమాన్నాలు
మీముందెప్పుడూనా’
‘చల్తానై చల్తానై’
యే హరామీ చల్తానై’
◆
‘హలో హలో’
‘హలో చెప్పు’
‘ ఎస్సైగారున్నరా సర్’
‘ ఏం, నేను సరిపోనా?ఏందో చెప్పు’
‘సర్ సర్,సారీ మీరు హెడ్డా’
‘ఆ. హెడ్డునే చెప్పు జెల్ది’
‘సార్ సార్.నమస్తే, నేను స్వామీ వివేకానంద విద్యాలయ్ స్కూల్ ప్రిన్సిపాల్ ను మాట్లాడ్తున్న’
‘ఆ సరే, చెప్పు. ఏంది సంగతి?’
‘సర్, లాక్ డౌన్ వల్ల స్కూళ్ళు, ఈ అకడ మిక్ ఇయర్ తెర్వలేదు. నడుస్తలేవు,
మీకు గుడ తెల్సుగద సార్’
‘ఆ ఐతే! విషయం సూటిగ చెప్పు, అవ్ తలింగో ఫోనొస్తుంది.’
‘మా బడి పూర్వ విద్యార్థులు, ఇపుడింటి కాడ, పని జేయకుండ కూసున్న మా స్కూల్ టీచర్లను కొందర్నెంట వెట్కోని బడిముందు బైఠాయించి, పంతుళ్ళకు జీతాలీ మంటని ధర్నా జేస్తాండ్రు, మస్తు లొల్లి లొల్లి జేస్తాండ్రు. ఇది రెండో రోజు.’
‘ఇయ్యాలె గద మరి.’
‘యాణ్ణుంచిస్తం సార్. బళ్ళే తెర్వలే.
పిల్లల్ రాలే.ఫీజులు వసూళ్ళే లేక పాయె. జెర ఈ లొల్లినాపండి సర్, మీ మేలు మరిచి పోం’
‘ఆట్లనా!ఔ నిజమే.ఐంతుండు, సార్ కు జెప్పి,కొందరు కానిస్టేబుల్స్ ను పంపుతం.’
◆
‘ ఏయ్ ఏందిరోయ్! మీ లొల్లి?
‘మా సార్లకు జీతాలిస్తలేరు మార్చ్ నెల నుంచి ఈ మేనేజ్ మెంట్!
‘వాళ్ళ బళ్ళే నడుస్తలేవ్. ఫీజుల్లేవ్. పంతుళ్ళతో పనులు కూడా జేపిస్తలేర్ గద, గియ్యన్నీ లేకుండా జీతాలెట్లిస్తర్? చెల్.’
ముందు పక్క వరుసల్లో చేతికందిన యువకులను, గుంజుతూ, లాఠీలన్ లేపుతుండగా…
‘మారో సాలోంకో,మార్’ ఏ ఎస్సై అరవగానే, కానిస్టేబుళ్ళ రెండుమూడు తేలిక దెబ్బలకే సుమారు సగం టెంట్ ఖాళీ. కాని ఓ పది పన్నెండు యువ పూర్వవిద్యార్థులు, ఇద్దరు టీచర్లు నిలబడి వాదులాటకు దిగిండ్రు.
అంతలో ఎస్సై,మరో ఇద్దరు పోలీసులతో వచ్చేసరికి, మరో ఇద్దరు ముగ్గురు టెంట్ నుంచి వెళ్ళిపోగా, ఏడుగురు మాత్రం నిలబడి, ‘మేం పోం. ఏం జేస్తరో జేయండి. మేం ఇట్లా ఉద్యోగాలు పొందో,మరే ఇతరంగా స్థిరపడ్డానికి మా ఆ టీచర్లే కారణం.’
‘అరె సద్వుకున్నమంటరు, ఉద్యోగాలు జేస్తున్నమంటరు. మీరేం మాట్లాడ్తాండ్రో మీకేమన్న అర్థమైతుందా, వాళ్ళకు పిల్లలు రాలే, ఫీజుల కలెక్షన్ లేదు, బళ్ళే బందాయె. యాణ్ణుంచిస్తర్ పంతుళ్ళకు జీతాలు, ఎందుకియ్యాలె?’ ఎస్సై.
‘సార్, మీరేం మాట్లాడ్తాండ్రో మీరు తెల్సుకోవట్లేదు.మేం బాగ తెల్సే మాట్లాడ్తుండం. … ..’
ఏడుగుర్లో ఇద్దరు మాట్లాడ్తుంటే, ఎస్సైకి లోపలేదో ఆలోచన శురువైంది.
‘ఔ నేనూ చదివిన స్కూల్ లో కొందరు కాంట్రక్ట్ టీచర్లు రోడ్డున….’
స్కూల్ ముందు, పక్కన రోడ్డు మీద జనం. వినోదంగనో, ఏమైతుందో చూదమని.
అంతలో ఎక్కడి నుంచో రెండు మూడు రాళ్ళు, వేగంగా స్కూల్ బిల్డింగ్ పై అంతస్తు కిటికీ అద్దాలను తాకి, అద్దాల ముక్కలు పెళ పెళమని, కింద కూలినయ్.
‘వాళ్ళవరో పట్కరాండి’ అని పోలీసులనాజ్ఞాపించి, టెంట్ లో యువకులవైపు తిరిగాడు.
‘ఎవరు వాళ్ళు?ఈ విధ్వంసం ఏంది?’
‘మాకు దెల్ళదు. ఎవరో ఎదురుగా అన్యాయాన్ని ప్రశ్నించలేనోళ్ళ, చాటుమాటు పని కావచ్చు.’
‘ఈ స్కూల్ ముప్పై ఏండ్లనాటిది. అపుడిది చిన్న హై స్కూల్… ‘మరో యువకుడు ఎస్సైతో,’ ..ఇపుడు చూసిండ్రా, ఎంత పెద్ద బిల్డింగ్. మూడంతస్తులు, ఈ స్కూల్ కరెస్పాండెంట్ కు వేరే వ్యపారాలూ పెరిగినయ్.’
ఎస్సైకి ఏం తోస్తలేదు.అనేకానేక ఆలోచనలు. అంతలో డీ ఎస్పీనుంచి ఫోన్.
‘హలో హలో… ఆ, ఆ సర్. మంచిది సర్.
ఓకే సర్. అట్లే సర్.’ ఫోన్ పెట్టేసి తల విదిలించిండు. నౌకరి జేయాలె మరి అనుకున్నడు.
‘కాని స్టేబుల్స్, వీళ్ళను జీప్ ఎక్కించండి, స్టేషన్ కు తీస్కరాండి.’
చెప్పి, ఎన్ ఫీల్డ్ ఎక్కి ఎల్లి పోయిండు.
◆
‘ఏందయ్యా మీలొల్లి, మీ బాధా!
ఆడ చూడండి. వరంగల్ జిల్లాల ఏదో కథలాపూర్ అంట…’ సెషన్ కోర్టులో, పబ్లిక్ ప్రాసిక్యుటర్ ముద్దాయిలతో,’.. వరంగల్ జిల్లాల కథలాపూర్, అక్కడొక ప్రైవేట్ స్కూల్ పూర్వ విద్యార్థులు, చందాలు వేసుకుని, వాళ్ళ సార్ కు క్యాంటిన్ వెట్టించిండ్రు.’
‘మమ్మల్నట్ల చేయమంటే మాక్కుదరదు. ఎంత మందికి చేయగలం, మేనేజ్ మెంట్ ముప్పై ఏండ్లకు పైగా, వాళ్ళ శ్రమ, చెమట మీదనే చాలా సంపాదించింది. అనేక వ్యాపార రంగాలకు విస్తరించింది..’
‘ఏయ్ మిస్టర్, లెఫ్టిస్ట్ వా? మాటలట్లే ఉన్నయ్! అవన్నీ మీకనవసరం, ఇపుడు బళ్ళకు విద్యార్థులు వస్తలేరు, పని క్లాసులు జరగట్లేదు.’ వాళ్ళింకేదో మాట్లాడేలోపె మధ్యలో ఆపిండు పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఈ లోపు, టైమై పోయిందని కేసును వాయిదా వేసి లేచి వెళ్ళిపోయాడు న్యాయమూర్తి.
ఉద్యమ పూర్వవిద్యార్థులు మళ్ళీ జ్యూడిషియల్ కస్టడీకి.
అట్లా ఆ కేసు వాయిదాల మీద వాయిదాలు పడుతూ, సా.. ఆ.. గేమ్ తుంది.
బెయిల్ పిటిషన్ వేసినా, అదెప్పుడూ కోర్టు సమయం ముగిసే లోపు టేబుల్ మీదకు రావట్లేదు.