విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 3

‘‘బిపిన్‍ చంద్ర నిన్ను అడిగాడు మొన్న’’ మహిమ కళ్ళల్లోకి ఏదో వెతుకుతున్నట్లు చూస్తూ వర్ష అన్నది. మహిమ గుండె ఒక్కసారి లయ తప్పినట్లై.. వేగంగా కొట్టు కోవడం మొదలైంది. బిపిన్‍ పేరు వినగానే మొఖంలో వెలిగిన వేయికాంతుల ప్రభలను దాచుకోలేక సతమతమవుతున్న మహిమను చూస్తూ వర్ష చిలిపిగా నవ్వుతూ.. పిచ్చి మహీ.. ‘‘బిపిన్‍ జ్ఞాపకాల ఆనందాన్ని కూడా దాచుకోవాలా.. స్వేచ్ఛగా అనుభవించు మహీ..’’ అంది లాలనగా మహిమ చేతులు పట్టుకుని. కన్నీళ్ళు చెంపల మీదకి ధారగా కారుతుంటే.. మౌనంగా రెండు క్షణాలున్నాక ‘‘ఏమన్నాడు.. నన్ను అడిగాడా బిపిన్‍?’’ పెకిలించుకుని మాట్లాడుతున్న గొంతులో ఆశ.. ఆత•త విన్న వర్ష చిన్నగా నవ్వి. ‘‘నీ గురించి తెలుసుకోవడానికేగా నాకు చేసేది.. అడిగాడు ఎక్కడుంది.. ఏమి చేస్తుంది. బాగుందా లేదా.. నువ్వు చూసుకుంటున్నావా లేదా.. అసలు మహి సంతోషంగా ఉందా.. చరణ్‍ బాగా చూసుకుంటున్నాడా లేదా మహిని? అని కూడా అడిగాడు. ‘‘ఏమన్నావు మరి’’? బలహీనమైన గొంతుతో అడిగింది ఒకింత భయం వినిపించింది మహిమ గొంతులో వర్షకి. ‘‘ఏమంటాను మహీ.. పరిస్థితి అస్సలు బాగోలేదని చెప్పాను. చరణ్‍కి నీకూ మధ్య బంధం ఎంత బలహీనంగా ఉందో కూడా చెప్పాను.’’ అంది వర్ష. ‘‘ఎందుకివ్వన్నీ చెప్పావు? బాగున్నా అని చెప్పక పోయావా? అసలెందుకు నా పర్సనల్‍ విషయాలు చెప్పాలి నువ్వు నన్నడగవా చెప్పేముందు?’’ మహిమ కోపంగా అరుస్తున్నట్లే అడిగింది.. కన్నీరు కారిపోతుంటే మహిమ పెదాలు వణుకుతున్నాయి.. కళ్ళు ఎర్రబడి మెరుస్తున్నాయి కన్నీళ్లు నిండి. వర్ష నిలకడగా మహిమ వైపు చూస్తూ ‘‘ఏం ఎందుకు చెప్పొద్దు.. నీ బాల్య స్నేహితురాలిని నాకు ఆ మాత్రం హక్కు లేదా.. నీ ప్రాణ స్నేహితుడు.. నీ ప్రేమికుడు బిపిన్‍కి కూడా ఆ హక్కు లేదా.. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? బాగా లేని జీవితాన్ని బాగుందన్న రంగెందుకు పూసి చెప్పాలి? ప్రతి క్షణం నువ్వనుభవించే నరక బాధని.. సంతోషం అని ఎందుకు చెప్పాలి? నా వల్ల కాదు.. అందుకే చెప్పాను. బాగుంది అనుకున్నంత వరకు బాగాలేని దాన్ని అంగీకరిస్తున్నట్లే కదా.. అవసరమా అది, అయినా నేనేమీ రోడ్లమీద పోయే అనామకులతో కాదు కదా చెప్పింది?’’ అంది వర్ష నిదానంగా. మహిమ మౌనంగా ఉండిపోయింది. ‘‘ఒక్కసారి చరణ్‍న్ని చేసుకుందామని నిర్ణయించుకున్నాక ఇక బిపిన్‍తో నా జీవితంలోకి రావద్దన్నా.. పూర్తిగా మర్చిపొమ్మన్నా. ఇంకా అతనొక తాళం తెరవలేని తలుపు తనకి. దుఖంలో ఉన్నప్పుడు మర్చిపోలేక తలుచు కుంటానేమో కానీ పిలవలేను.. వెళ్ళలేను. ఆ అర్హత కూడా నాకు లేదు. బిపిన్‍ హ•దయం విరిచేశాను. నా మీద, ప్రేమ మీద విశ్వాసం, నమ్మకం అన్నీ పోగొట్టాను. అతనికి నమ్మక ద్రోహం చేశాను. ‘‘నేను లేకుండా సంతోషంగా

ఉండగలవా మహీ’’ అని అతను ఎంతో ఆశగా అడిగితే.. ‘‘ఉండగలను’’ అని ఎంతో విశ్వాసంతో చెప్పాను. అలాంటిది ఈ రోజు ఇలా ఓడిపోయి జీవితపు చౌరస్తాలో అయోమయంగా కన్నీరు కారుస్తూ.. దారీ గమ్యం లేక నిలబడి

ఉన్నాను అని బిపిన్‍కి తెలిస్తే.. నాకెలా ఉంటుంది..? వెక్కి వెక్కి ఏడుస్తూ మహిమ అంటూంటే.. ‘‘ఎందుకు అలా అనుకుంటున్నావు.. ఎందుకంత అభిమానం? నీ స్థితి చూసి నవ్వుతాడా నీ బిపిన్‍.. బాధ పడడని ఎందుకు అనుకోవు?’’ వర్ష అడిగింది. ‘‘బాధ పడ్డాడా ఏమన్నాడు’’? మహిమ అడుగుతుంటే.. ‘‘బాధ పడలేదు ఏడ్చాడు నిజం’’ అంది వర్ష. రెండు చేతుల్లో తన మొఖం దాచుకుని, మంచం మీద కూలబడిపోతూ మహిమ.. ‘‘నాకు తెలుసు నా బిపిన్‍ నేను బాధ పడితే తట్టుకో లేడు అందుకే అతని నా స్థితి తెలవద్దనేది’’ అంది కదిలి కదిలి ఏడుస్తూ. ‘‘ఇంత ప్రేమ ఉన్న దానివి. మీ నాన్న, నానమ్మ జాతకాలని, కులమని, ప్రాంతమని నీ ప్రేమని కాదంటే అలా వాళ్ళకి లోంగిపోయావు ఎందుకు? ఈ రోజుల్లో ఎంత సాహసాలు చేస్తున్నారు ప్రేమికులు చూడ్డం లేదా? బిపిన్‍ న్ని చేసేసుకుని ఉంటే.. వాళ్ళే మిమ్మల్ని కలుపుకొని ఉండేవాళ్ళు కొన్నాళ్ళు పోయాక. నీ చెల్లి యామిని పెళ్లి కాదని అన్నది కూడా ఒట్టిదే.. కులమే మీ నాన్నకు ముఖ్యం. ఈ రోజు ఏమైంది చూడు మరి? మీ పెద్దమ్మాయి కి ఏదో చెడిందటగా.. భర్తతోనే ఉంటుందా లేక విడిపోయిందటగా అన్నారా లేదా మీ చెల్లిని చూడ్డానికి వచ్చిన వాళ్ళు? వాళ్ళకెందుకు ఈ విషయాలు అని మనం అనుకుంటాము కానీ వాళ్ళకి ప్రతీది కావాలి ఎందుకంటే.. నీ జీవితాన్ని బట్టి కూడా యామిని కేరేక్టర్ని అంచనా వేస్తారు వాళ్ళు. నేనెంతగా చెప్పాను నీకు? అమ్మానాన్నల అభీష్టాలను ఒప్పుకోవాలి.. కానీ ఎంతవరకు కొన్ని విషయాల్లో మాత్రమే. కానీ జీవితంలో చాలా ముఖ్యమైన పెళ్లి, ప్రేమ, జీవిత సహచరుల ఎన్నిక దగ్గర మాత్రం రాజీ ఉండకూడదు. మీ నాన్న విషం తాగి చచ్చి పోతానని విషం సీసా చూపించి బెదిరిస్తే.. భయపడి పోయావు. అమ్మ, నాన్న దూరమైపోతారు అని వెనకడుగు వేసావు. చెల్లి పెళ్లి కాదేమో అని రాజీ పడిపోయావు. చాలా పెద్ద త్యాగం చేస్తున్నా అనుకున్నావు. కానీ ఏమైంది? ఎంత చెప్పా.. బిపిన్‍తో వెళ్ళిపో.. వాళ్ళింట్లో అంతా నిన్ను అంగీకరించి.. స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారు.. వెళ్ళిపో అని ఎంత పోరాను నిన్ను? బిపిన్‍ నీ కాళ్ళ మీద పడి వేడుకున్నాడు ఏడుస్తూ.. నేనెలా మర్చిపోతాను? ఎంత తల్లి దండ్రుల కోసమైనా ప్రాణంగా ప్రేమించిన వాణ్ణి వదులుకోవద్దు. నిన్ను నువ్వే కాదు.. బిపిన్‍ ని బాధ పెట్టడం.. మాట తప్పడం ఎంత పెద్ద నేరమో తెలుసా నీకు? ఇప్పుడు ఇంత బాధ పడి పోతున్నావు? ఇప్పుడు చరణ్‍తో ఉండలేనని.. త్వరలో విడిపోతానని ఇంత మొండి కేస్తున్నావు కదా..? ఇదే మొండితనం.. పట్టుదల బిపిన్‍తో పెళ్ళి విషయంలో చూపించి ఉంటే నీ జీవితం పూర్తిగా వేరేగా ఉండేది. ఎట్లా మహీ… ఎట్లా చెప్పు.. నీ బాధెట్లా పోగొట్టాలి.. చరణ్‍తో వెంటనే ఎందుకు విడిపోవు? ఇంకా కొన్ని నెలలు చూస్తా.. అనడం ఏమిటి? ఇంత నరకం అనుభవిస్తూ.. యామిని పెళ్లి అయ్యేదాక ఉంటావా చరణ్‍తో? ఇంకా త్యాగాలా.. ఎంతకాలం ఇలా’’ వర్ష కళ్ళల్లో నీళ్ళు నిండుకున్నాయి. మహిమ ఒక్కసారి లేచి కూర్చుని, కళ్ళు తుడుచుకుని దీర్ఘ శ్వాస తీసుకుంది. ‘‘చరణ్‍కి ఒక అవకాశం ఇవ్వడం ఒక ప్రయత్నం కావొచ్చు లేదా సాకు కూడా కావచ్చు. ఈ లోపల యామిని పెళ్లి కుదిరితే అద•ష్టమే. పెళ్ళైన మరుసటి రోజే విడిపోతా. యామిని కోసమే ఇదంతా.. కానీ నేను చరణ్‍ నుంచి విడిపోవాలనుకుంటే అది బిపిన్‍ కోసం మాత్రం కాదు. నా ఆత్మ గౌరవం కోసం మాత్రమే. బిపిన్‍ని నా కోసం ఎదురు చూడద్దు అని చెప్పు. పెళ్లి చేసుకోమని చెప్పు. ఈ సారి ఫోన్‍ చేస్తే నేను ఇంత బాధలో

ఉన్నానని మాత్రం చెప్పకు. నా జీవితాన్ని నేను రిపేర్‍ చేసుకుంటున్నాననీ.. మంచి ఆత్మ విశ్వాసంతో.. ధైర్యంతో ఉన్నానని చెప్పు వర్షా.. అతన్నింక బాధ పెట్టద్దు.’’ అంది మహిమ వేదనతో ఎరుపెక్కిన ముఖాన్ని వర్ష వైపు నుంచి పక్కకి తప్పిస్తూ. ‘‘ఒక్కసారి నువ్వైతే మాట్లాడు బిపిన్‍తో.. నంబర్‍ వాట్సప్‍ చేస్తాను. పోనీ నువ్వు బాగున్నావన్న విషయాన్ని అది అబద్ధం అయినా నువ్వే చెప్పు’’ అంది వర్ష. అలా అంటూనే మహిమకి బిపిన్‍ నంబర్‍ని వాట్సప్‍ చేసేసి.. బ్రతిమలాడి ఫోన్‍ ఓపెన్‍ చేయించి, నంబర్‍ సేవ్‍ చేసేసింది కూడా.. మహిమ మౌనంగా ఉండిపోయింది. ఈ మధ్య ప్రతీ క్షణం బిపిన్‍ బాగా గుర్తుకు వస్తున్నాడు. తన జీవితం ఇలా ధ్వంసమైంది అని తెలిస్తే.. అతనికి మొఖం ఎలా చూపిస్తుంది?తన మూర్ఖత్వం వల్ల నాశనం అయిన అతని జీవితాన్ని ఎలా చూస్తుంది?

***

తాగుతున్న చాయ్‍ కప్‍ని మెల్లిగా టీపాయ్‍ మీద పెడుతూ దీర్ఘంగా నిట్టూర్చింది ఏగ్నెస్‍. అక్కడ ఉన్న తనలాంటి స్త్రీల వైపు ప్రేమగా.. పలకరింపుగా చూసింది. తరువాత మెల్లిగా చెప్పసాగింది.

‘‘నాకింకా నా పెళ్ళైన రోజు బాగా గుర్తు ఉంది. నాకు పద్దెనిమిది సంవత్సరాలకే పెళ్లయిపోయింది. మొదటి సారి నాభర్తను చూస్తే నాగుండె గుభేలుమంది. ఆరడుగుల పొడవుతో బలంగా ఉన్నాడు. అతన్ని చూస్తే ఇక జీవితాంతం ఇతనితో భద్రంగా.. సంతోషంగా ఉంటాను కదా అనుకున్నా. ఎంతసేపూ అమ్మని కొట్టే నాన్న.. వదినను హింసించే అన్న లాగా కాకుండా ప్రేమించి.. పసిపిల్లను లాలించినట్లు లాలించే భర్త కావాలని ఆ ఏసు ప్రభువుని ప్రార్థించా వందల సార్లు. నాకు పెళ్లి చేస్తాం అన్నప్పటి నుంచి అయితే.. ఆదివారం చర్చికి పోయినప్పుడల్లా ఇంకెక్కువసేపు ప్రార్థించే దాన్ని. భర్త అంటే రక్షకుడు.. రాక్షసుడు కాదు నా ద•ష్టిలో. అందుకే నాన్న అన్నా.. అన్న అన్నా నాకు చాలా కోపం. ఇద్దరూ వాళ్ళ భార్యలనే కాదు.. నన్ను కూడా కొట్టేవాళ్ళు. నా చిన్నప్పుడు నేను నా స్నేహితులతో బయటకు వెళ్ళినా.. సినిమాలు చూసినా.. వీధిలో నా మగ స్నేహితులతో ఆడుకుంటున్నా.. ఇప్పుడు అంటే పద్దెనిమిదేళ్ళ మేజర్‍ ని అయినా కానీ.. కాస్సేపు ఫోన్‍లో కాలక్షేపం చేసినా అంతే చెంపలు వాచిపోవాల్సిందే. ఇద్దరిలో ఎవరో ఒకరు కొట్టేవాళ్ళు. నా కెందుకో నా కాబోయే భర్త అందమైన మొఖం.. ప్రశాంతమైన ఆ కళ్ళు, మరీ ముఖ్యంగా ధ•డమైన ఆ శరీరం.. కండలు తిరిగిన వీరుడిలా ఉన్నాడు.. అచ్చం సినిమాల్లో చూస్తాం కదా అట్లా అన్నమాట. ఆ రెండు బలమైన చేతులతో నన్ను ఎవరైన ఏమీ చేయకుండా కాపాడు కుంటాడు. పైగా అతను చర్చ్లో పాస్టర్‍.. ఖచ్చితంగా దయాగుణం.. ప్రేమతత్వం ఉండే ఉంటుంది. నాకు ఆనందంతో హ•దయం ఎగిసి పడింది. సంతోషం కళ్లల్లో కన్నీరై పొంగింది. నాలాగా పెళ్ళయితే పుట్టింటి హింస నుంచి తప్పించుకోవచ్చు అని ఆనందపడే ఆడపిల్లలుంటారా.. ఏమో మరి తెలియదు. నా అంత అద•ష్టవంతులు ఎవరూ ఉండరు అని మురిసి పోయాను. అందమైన హనీ మూన్‍ ఊహించుకున్నా.. నా తొలి రాత్రిని కూడా అచ్చం సినిమాల్లో లాగే ఊహించుకున్నా.. ఊహల్లో తేలిపోయాను. నా స్నేహితురాళ్ళతో నా భర్త గురించి చాలా గొప్పలు చెప్పాను ఆయన గురించి ఏమీ తెలీకపోయినా.. నాకు నేనే ఊహించుకుని. వాళ్ల కళ్ళల్లో అసూయ చూసి అంతులేని ఆనందం అనుభవించాను. నేను కలలు కన్నట్లుగా నా పెళ్లి చాలా గొప్పగా జరిగింది. నేనెంతో సంతోషంగా ఉన్నాను ఆనందంతో తుళ్ళి.. తుళ్లి పడ్డాను. ఖరీదైన బట్టలు, నగలు, చేతినిండా గాజులు, గోరింటాకు, గొప్ప మేకప్‍. ఇక వీడియోలు.. రకరకాల ఫోజుల్లో ఫోటోలు. నేనొక మహారాణిలా మారిపోయాను. నేనూ నా భర్తా పెళ్లి తాలూకు ఉద్వేగంలో కొట్టుకుపోయాం. నా భర్త స్నేహితులు ఆయనతో ‘‘జాన్‍ నువ్వు నువ్వెంతో అద•ష్టవంతుడివి నీకు చాలా అందమైన భార్య దొరికింది.’’ అన్నారు. నా భర్త నా వైపు గర్వంగా చూసిన చూపు నన్ను మైకంలో ముంచింది. నేను గాల్లో తేలిపోయాను. ఆ ఆనందం, తన్మయత్వపు మత్తు పోకముందే నాకు ఒక భయానకమైన అనుభవం ఎదురైంది.

చెప్పాగా నా తొలిరాత్రిని అత్యద్భుతంగా నా సమస్తమైన ఊహా శక్తితో రంగు.. రంగుల పూలతో ధూప పరిమళాల పరుపుల మధ్యలో ఊహించుకున్నా. కానీ.. అతను బాగా తాగి గదిలోకి వచ్చాడు. మత్తులో మూసుకుపోతున్న కళ్ళను బలవంతంగా తెరిచి నా వైపు చికిలిస్తూ చూసాడు. వెంటనే నన్ను బర బరా గుంజుకొచ్చి, మంచం మీద కూలేసాడు. నిర్ఘాంతపోయిన నేను తేరుకునేలోపే.. అతని బలమైన దేహపు వొత్తిడికి, దాడికి గిల గిల్లాడుతున్న.. ప్రతిఘటిస్తున్న నన్ను బూతులతో.. బలప్రయోగంతో రేప్‍ చేసేసాడు. అచ్చం సినిమాల్లో చేసినట్లుగా. నా తల దిమ్మ తిరిగింది. నేను షాక్‍లోకి వెళ్ళిపోయాను. ప్రేమ, లాలన, బాధ్యతలతో మొదలవ్వాల్సిన నా తొలిరాత్రి.. ఘోరమైన రేప్‍తో ముగిసింది. అతనో పాస్టర్‍ కూడా. అతనికి చాలా ఆరాధకులు ఉన్నారు. అతనిలా చేశాడంటే నమ్మబుద్ధి కాలేదు. ఆ రాత్రి ఎంత ఏడ్చానో నాకే తెలుసు. అతను నా మీద పడ్డ ప్రతీసారీ కొండంత బండ కింద కోడి పిల్లలా నా శరీరం చితికి పోయేది. ఊపిరాడక ఏ క్షణమైనా సచ్చిపోతానేమో అనిపించేది. రక్తం పోతున్నా.. రెండు కాళ్ళ మధ్య వాచిపోయి కత్తితో కోస్తున్నప్పటి నొప్పితో విల విల్లాడుతున్నా కానీ వద్దు వద్దు అని అతని పాదాల మీద పడిపోయి కన్నీళ్ళతో ప్రార్థించినా వినేవాడు కాదు. శ•ంగారానికి మరో పదం క్రూరమైన హింస అని అర్థం అయిపోయింది. చిన్నప్పుడు నా దోస్తులతో కలిసి ఆడుకునేదాన్ని, గెంతేదాన్ని పరిగెత్తేదాన్ని, ఈత కొట్టేదాన్ని, చెట్లెక్కే దాన్ని.. కలిసి ఆడుకోవటంలో ఒక గొప్ప ఆనందం అందరికీ కలిగేది. కానీ పడగ్గదిలో నా భర్త నాతో.. నన్ను కలుపుకుని చేస్తున్న ఈ విక•త క్రీడలో నాకు నొప్పి.. దుఖం అయితే అతనికి అంత సుఖం.. ఆనందం ఎందుకు.? అసలు ఇదేం ఆట.. ఏకపక్షంగా ఆడి.. బలవంతుడే గెలిచే దుర్మార్గపు.. దౌర్జన్యపు ఆట.. మహా అన్యాయపు ఆట..? శ•ంగారం అంటే ఇలానే ఉంటుందా.. ఉండాలా..? సినిమాల్లో హీరోయిన్‍ పూలమంచం మీద సిగ్గుపడుతూ భర్త సున్నితమైన స్పర్శకు అరమోడ్పు కన్నులతో మైమరచిపోతున్నట్లు చూపిస్తారే? నాకు చాలా విభ్రాంతీ.. ఆశ్చర్యమూ కలిగాయి. దానితో పాటు అమితమైన భయం కూడా. ఒక వేళ ఇదే శ•ంగారం అయితే.. నా అన్నీ రాత్రుళ్ళు ఇంతే భీభస్తంగా ఉండబోతున్నాయా అన్న ఆలోచన వచ్చి నా వెన్నులో నుంచి భయం.. వొణుకూ కరెంటు షాక్‍లా సర.. సర పాకింది. మధ్య తరగతి కుటుంబంలో అనేక కట్టుబాట్ల మధ్య పెరగడం వలన నా కంతగా ఏమీ తెలీదు. మా ఇంట్లో దైవ ప్రార్థనలు కూడా జరిగేవి. ఎక్కువగా టీవీలు.. సెల్‍ఫోన్లు వాడేవాళ్ళం కాదు. నాన్నా అన్నయ్యా లేనప్పుడు చూసేదాన్ని అమ్మని బ్రతిమలాడి. మా అన్నయ తన గది లోపలే ఫోన్‍ వాడేవాడు.. వదినా అంతే. నాన్న అంటే అంత భయం. ఎక్కువగా బయట బంధువులతో.. స్నేహితులతో తిరగలేదు. బాల్యపు ఆటలే గొప్ప అపురూపమైన జ్ఞాపకాలు. తరువాత ఇల్లే పెద్ద బందీఖానాగా మారిపోయింది. అత్తా వాళ్ళింటికి మాత్రం పంపేవాడు నాన్న. అత్త నన్ను స్వేచ్ఛగా తిప్పేది. బోలెడు సినిమాలకి.. ఎగ్జిబిషన్‍కి తీసుకెళ్లేది. పెళ్లి.. శ•ంగారం ఇవన్నీ ఆ సినిమాల్లో చూసినవే. అవే నాలో బోలెడన్ని భ్రమలు పెంచేవి. అలాంటివే సున్నితమైన ఊహలు ఉండేవి. ఇంట్లో నాన్న అమ్మని.. అన్నయ్య వదిన్ని కొట్టటం కూడా నాలో ఆ భ్రమల్ని పోగొట్టలేకపోయాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. బహిరంగంగా భార్యల్ని కొట్టేవాళ్ళు పడకగదిలో కూడా అంతే క్రూరంగా ఉంటారు కదా.. సున్నితంగా ఎలా ఉంటారు? బహుశా టీనేజిలో అందరూ అమ్మాయిలు ఇలానే.. నాలానే అవాస్తవికమైన ఊహాత్మక లోకంలో ఉంటారేమో..? పైగా అతగాణ్ణి నేను పెళ్లికి ముందు ఒక్కసారే కలిశాను. పెళ్లికి ముందు సెక్స్ గురించి అప్పటికే పెళ్ళై నెల రోజులైన మా పెదనాన్న కూతురు మెర్సీ ని అడిగాను. ఎలా ఉంటుంది తొలిరాత్రి సెక్స్ అనుభవం అని. మెర్సీ నీరసంగా నవ్వింది. ‘‘నొప్పిగా ఉంటుంది’’ అంది మెల్లిగా పక్క చూపులు చూస్తూ. ఆ నొప్పే నా దేహంలోకి ప్రవేశించింది. మా దేహాలు ఒకటే కావటం మూలాన్నా లేక.. బహుశా మా భర్తల బుద్ధి ఒకటే అవడం మూలాన్నేమో? ఈ ఆడవాళ్ళ దేహాలు మగవాడు పొడిచి, పొడిచి హింసించడానికి ఇంత అనువుగా ఎందుకు ఉన్నాయి అనిపించింది. మగవాళ్ళు అత్యాచారాలు చేసేటప్పుడు ఈ స్త్రీల శరీరాలు నొప్పి తెలియని, కటినమైన శిలల్లాగానో.. మరో కత్తి లాగానో.. ముళ్లపరుపు లాగానో మారిపోకుడదా.. రక్తం కారుతూ, నొప్పి మంటలతో వాళ్ళూ వద్దు వద్దంటూ విలవిల్లాడకూడదూ .. అవమానంతో క•ంగి క•శించి పోకూడదూ..? వాళ్ళకి ఎందుకలా ఉండదు.. వాళ్ళనలా చేసే పవర్‍ తమ ఆడవాళ్ళ చేతుల్లో ఎందుకు లేదు..? అని పిచ్చిగా ఆలోచించేదాన్ని. ఆ వారం ఇక్రా అని నా స్నేహితురాలి పెళ్లి అయ్యింది. పెళ్లికి ముందే ‘‘ఎలా ఉంటుంది ఎగ్నేస్‍.. రక్తం వస్తుందా. నొప్పిగా ఉంటుందా?’’ అని వొణుకుతున్న గొంతుతో అడిగింది ఫోన్లో. బాధగా మూలిగాను ఏం చెప్పను ఇక్రాకి.. భయపెట్టలేను. ‘‘అందరికీ అలా ఉండదు నువ్వు మాత్రం ప్రతిఘటించకు. అలా చేస్తే నొప్పిగా ఉంటుంది’’ అన్నాను. నరకప్రాయమైన నా తొలి.. మలి రాత్రుళ్లను తలుచుకుంటూ. ‘‘మరి ఎలా ఉండను ఏగ్నెస్‍’’ అడిగింది ఇక్రా. ‘‘బస్‍ లాష్‍కి తర్హా పడే రెహానా బిస్థర్‍ పే’’ అన్నా. (పరుపుపైన ఒక శవంలా పడి ఉండు చాలు) ‘‘క్యా బోల్రై తుమ్‍ ఏగ్నెస్‍ వైసా కైసా రైతే.. డరావ్‍ మత్‍. జిందా ఇన్సాన్‍ హై హమ్‍.. లాష్‍ కైసే బన్‍ శక్తే’’ అంది ఇక్రా వొణుకుతున్న గొంతుని అదిమి పెడుతూ. (ఏం మాట్లాడుతున్నావు ఏగ్నెస్‍ నువ్వు? అలా ఎలా ఉండగలను.. భయపెట్టకు ప్రాణాలతో ఉన్న మనిషిని నేను శవంలా ఎలా పడి ఉండను?) ఊ అవును మరి.. తొలి రాత్రి.. ఆ తరువాతి రాత్రిళ్ళు అన్నీ శవంగానే మార్చి పడేయవూ.. సున్నితమైన ఆడవాళ్ల దేహాలని? ఇక్రా నిఖా అయిపోయింది. వారం రోజుల తరువాత ఫోన్‍ చేసి తన భర్తతో గడిపిన రాత్రుళ్ళు కథలు కథలుగా చెప్తూ ఇక్రా వెక్కి వెక్కి ఏడవడం నా గుండెల్ని కోసివేసింది.

పగలంతా అతనికి పని చేసి పెట్టాలి. బట్టలు కూడా సాక్స్తో సహా ఇస్త్రీకి చాకలికి వేయకూడదు. నేనే చేయాలి. అతనికి ఇష్టమైన వంటలు రుచిలో ఏమాత్రమూ తేడా లేకుండా చేయాలి. రోజూ అతను తాగే విష్కీ, బీరులకి ఫలహారాలు చేసి ఇవ్వాలి. అతను ఇంటి శుభ్రతలో చాలా స్ట్రిక్టు బాత్రూంలు రోజూ కడగాలి. పగలు ఒక పని యంత్రాన్ని… రాత్రి అతనికి ఒక సెక్య్ టాయ్‍ని. నిద్ర అలసట, నొప్పి, పీరియడ్స్, జ్వరం ఏమీ అనకూడదు. నా భర్తతో నాకున్న సంబంధం ఇంతే. ఫుడ్‍-బెడ్‍ మాత్రమే. ఒక ప్రేమా, స్నేహం, దగ్గరితనం ఏవీ లేవు. రాత్రి నిద్రకు ముందు అతనికి సెక్స్ ఖచ్చితంగా కావాలి.. భోజనంలాగా ఒక్క రోజు కూడా తప్పకూడదు.

ఒకరోజు రాత్రి నాకు పీరియడ్‍ వచ్చేముందరి నొప్పి భరించలేనంతగా వచ్చింది. గమ్మున ముడుచుకొని పడుకోవాలని ఉంది. ఈ రాత్రి అతను ఇంటికే రావద్దు… లేదా స్ప•హ కోల్పోయేంతగా తాగి పడిపోవాలి అని జీసస్‍ను కోరుకున్నా. లేదా నేనైనా అతను వచ్చేముందే ఎటైనా పారిపోవాలి… దాక్కోవాలి చిన్నప్పుడు కొట్టే నాన్న నుంచి దాక్కున్నట్లు. కానీ నాకంటూ ఒక స్థలం లేదు స్నేహితులు లేరు… పుట్టిల్లు దూరాన ఉంది. ఈ రాత్రి ఎక్కడికి వెళ్ళాలి. బాత్రూంలో ఏదో నెపం మీద ఉండిపోతేనే… కానీ సాధ్యం కాదు. రెండు… మూడుసార్లు అతనే బాత్రూంకి వెళుతూ ఉంటాడు. కానీ అతను ఇంటికి వచ్చాడు పైగా పూర్తి స్ప•హలో ఉన్నాడు, తిన్నాడు… మళ్ళీ తాగాడు… ‘చాలా కడుపు నొప్పిగా ఉంది మందు తెప్పియ్యండి’ అన్నాను భయపడుతూనే. ‘షాపులుండవు ఈ రాత్రివేళ. అయినా ముందే చెప్పక పోయావా’ అన్నాడు నిర్లక్ష్యంగా. ఆ రాత్రి ‘నొప్పి ఎక్కువైంది సెక్స్ వద్దు ప్లీస్‍’ అని చెప్పాను. అతగాడి చేతులు తప్పిస్తూ… అంతే చెంపలు వాయగొట్టేస్తూ… కింద పడేసి కాళ్ళతో తన్ని, ఎత్తి మళ్ళీ మంచం మీద కూలేసి ‘‘దొంగలంజా భర్తని సుఖపెట్టలేని నీకు ఎలా బుద్ధి చెప్పాలో నాకు తెలుసు’’ అంటూ అక్కడే ఉన్న పొడవాటి టార్చిలైట్‍ను  ఉల్టా చేసి నా వెజైనాలోకి బలమంతా దూర్చి, అలానే గుచ్చుతూ పోయాడు.

ఆ క్షణం అతడు జింకను చంపి. దాన్ని కుమ్ముతూ మాంసం తింటున్న భల్లూకంలా కనపడ్డాడు. భయంతో బిక్కసచ్చిపోతూ… విపరీతమైన నొప్పితో నేను ఘోరంగా ఏడుస్తూనే అరుస్తూన్నా.. వేడుకుంటున్నా వదలమని… టార్చిలైట్‍ తీసెయ్యమని… కానీ అతనిది పశుబలం పైగా తాగి ఉన్నాడు. అతను ఆపలేదు. చాలా సేపు ప్రతిఘటిస్తున్న నా చేతుల్ని తన ఎడం చేత్తో ఆపుతూ చాలా సేపు అలా చేస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ… కేకలు వేస్తున్న నా నోటిలోకి తన బనీను

ఉండ చేసి గుచ్చాడు. నాకు భయంతో… నొప్పితో స్ప•హ తప్పిపోయింది. ఏగ్నెస్‍ ఆయాస పడ్తూ ఒక క్షణం ఆగిపోయింది. ఆమె కళ్ళు కన్నీటి చెలమలైపోయాయి. ముఖమంతా ఎర్రబడిపోయింది. బాధ ఆమె ముఖాన్నంతా చెమటతో తడిపేసింది బయటా… కన్నీరు ఆమె ముఖం మీద కలిసిపోయాయి. గాలి అక్కడి స్త్రీల కన్నీటితో చెమ్మ బారింది. ఏగ్నెస్‍ కథ రాస్తున్న మహిమ చేతులు ఒణికి కలం జారి నేలన పడిపోయింది. ఆమె కన్నీరు ఆమె రాస్తున్న ఏగ్నెస్‍ కథలోని అక్షరాల మీద పడి అవి కూడా ఏడ్చాయా అన్నట్లు చెదిరిపోయి మాయం అయ్యాయి. దుఃఖం గొంతులోంచి కడుపులోకి దించుకున్న ఏగ్నెస్‍ వరద ఇచ్చిన కర్చీఫ్‍తో తన ముఖం తుడుచుకుని మళ్ళీ చెప్పడం కొనసాగించింది. నాకు మర్నాడు ఉదయం మెలకువ వచ్చింది. వాడు నోట్లో కుక్కిన బనీను నా కాళ్ళ మధ్య పెట్టి ఉంది. స్ప•హ కోల్పోయిన నన్ను ఏ ఆందోళనా లేకుండా అలానే వదిలేసి… గుర్రుకొడుతూ పశువులా నిద్రపోతున్నాడు… నా పక్కనే రక్తపు మరకలతో తెల్లని పొడవైన టార్చిలైట్‍ నేలమీద పడి ఉంది. అతనికి కిరాతకానికి సాక్ష్యంగా… అసలు అది నా లోపలికి దూర్చి హింసించాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది! ఎక్కడ నేర్చుకున్నాడసలు? ఎప్పుడూ సెల్‍ఫోన్లో బూతు సినిమాలు చూస్తుంటాడు… చూసి నా మీద ప్రయోగించి ఉంటాడు. అతని మీద ఖాండ్రించి ఉమ్మెయాలన్న ఒక ఆవేశపు కాంక్షను బలవంతంగా అదుముకుంటూ గదిలోంచి బయటకు వచ్చాను. రేపు రావల్సిన నెలసరి వాడు చేసిన కిరాతకానికి మొదలైపోయింది వెంఠనే. రక్తం ఎంతలా పోయిందంటే పీరియడ్స్ పాడ్స్ పెట్టుకోవలసి వచ్చింది లోపల గాయం అయినట్లు విపరీతమైన నొప్పి మంట. పక్కనే ఉన్న స్నేహితురాలితో కలిసి పక్క వీధిలోని డా।। షబ్నం దగ్గరికి వెళ్ళాను. ఆమె పరీక్షించి ‘‘వెజైనా లోపల చీరిపోయి, చిరుగులు పడిపోయింది. నీ భర్త మనిషా… పశువా? ఎలా చేసాడు ఇట్లా… అంటూ రెండు కుట్లు వేయాలి..’’ అంది భయపడి పోతున్న నన్ను చూస్తూ అనునయంగా ‘‘కుట్లు వేయకపోతే రక్తస్రావం అవుతూనే ఉంటుంది. అయినా నువ్వెందుకు వూరుకుంటావు ఏగ్నెస్‍… నేను ఇవి నీ భర్త బలప్రయోగంతో ఒక వస్తువుని

ఉపయోగించి చేసిన గాయాలని, నీ మీద తీవ్రమైన లైంగిక దాడి చేసాడని సర్టిఫికెట్‍ ఇస్తాను. డొమెస్టిక్‍ వయెలెన్స్ ఏక్ట్ కింది అతని మీద కేస్‍ బుక్‍ చెయ్యి. జైల్లో వేసి నాలుగు తగిలిస్తే కానీ బుద్ధి రాదు. పోలీస్‍ స్టేషన్‍ కూడా నీ ఇంటికి నాలుగు అడుగుల దూరంలోనే ఉంది’’ అంది కోపంగా డా।। షబ్నం. నేను కుట్లు వేయించుకున్నాను. నా స్నేహితురాలు ఇంటికి తీసుకొచ్చింది. పిస్క్రిప్షన్‍లో ఏం జరిగిందో రాసి మరీ మందులు రాసింది డా।। షబ్నం. దాన్ని టేబుల్‍ మీద పెట్టి నొప్పికి ముడుచుకు పడుకున్నాను ఎప్పుడు లేచాడో… పరా పరా ఆ కాగితాన్ని ముక్కలు ముక్కలు చేసి నా ముఖాన విసిరి కొట్టి ‘‘నాటకాలేస్తే చంపేస్తాను ఏవనుకున్నావో’’ అంటూ ధడాలున తలుపేసి వెళ్ళిపోయాడు. అప్పుడొచ్చింది నాకు ఆగ్రహం… అలవిమాలిన అసహ్యం. డాక్టర్‍ అన్న మాటలు పదే పదే గుర్తుకు వస్తున్నాయి. అవును వీడి మీద కంప్లైంట్‍ ఇస్తే నిలువునా నరికేసి చంపేస్తాడు కాబోలు.. చంపనీ… ఈ నరకం నుంచి విముక్తి దొరుకుతుంది.

‘‘కానీ వీడికి బుద్ధి చెప్పాలి. రాత్రి అతను చేసిన భయంకరమై కిరాతకానికి నా దేహం రెండుగా ఛీలింది. రక్తం కన్నీటిలా పారింది. వీణ్ణెలా క్షమించాలి? వీడితో ఎలా బతకాలి? ఎలా కాపురం చేయాలి?’’ చెప్తూన్న ఏగ్నెస్‍ కన్నీళ్ళు ఆపుకోలేకపోయింది. తనతో పాటుగా ఏడుస్తున్న అక్కడున్న ఆడవాళ్ళను చూసింది. నిశ్శబ్దంగా కన్నీరు కారుస్తూ రాయలేక రాస్తూన్న మహిమని చూసింది.  వరద… ఏగ్నెస్‍ను ఓదార్చింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న మహిమతో ‘‘ఊరుకో ఇదంతా ధైర్యంగా వినాలి మహిమా… నువ్వూ… ఇక్కడున్న వాళ్ళు కళ్ళు తుడుచుకో… రాయి’’ అంటూ మహిమ వీపును ప్రేమగా నిమిరింది వరద.

‘‘నాకూ చాలా బాధగా… మానని నా గాయన్ని సూదితో మళ్ళీ మళ్ళీ నాకు నేనే పొడుచుకున్నంత నొప్పిగా ఉంది కానీ తప్పదు… చెప్పక తప్పదు’’ అంది ఏగ్నెస్‍ మహిమ వైపు చూస్తూ… తన చేతిని బలంగా… ఆప్యాయంగా నొక్కుతూ భరోసాని ఇస్తున్న వినయ చేతిని తానూ గట్టిగా పట్టుకుంటూ…

‘‘వాడు వెళ్ళిపోయాక నేను మెల్లగా లేచావు. నాకు నడవడం కూడా రావట్లేదు. కాళ్ళు ఎడం చేస్తూ నడిచి చిన్న చిన్న పనులు చేస్కున్నా. భరించలేని మంటతో మూత్రం పోస్కోలేక గావుకేకలు పెట్టాను. జ్వరం కూడా వచ్చేసింది. మాత్రలు వేస్కోకపోతే ఇన్ఫెక్షన్‍ అయ్యి సెప్టిక్‍ కూడా అవుతుందని డా।। షబ్నం చెప్పింది. పక్కింట్లో ఉండే నా స్నేహితురాలు దివ్య ఇడ్లీ… లంచ్‍ తీస్కొచ్చి ఇచ్చింది. తిని మందులు వేస్కున్నా.. స్కూల్‍ నుంచి పిల్లాడ్ని తెచ్చుకోవాలని దివ్య వెళ్ళిపోయింది. ‘రాత్రి ఏమైనా గొడవ అయితే మా ఇంటికి రా’ అని చెప్పింది… పోతూ… పోతూ… అమ్మకు ఫోన్‍ చేసా చెప్తూ.. చెప్తూ ఏడ్చేసా. ‘‘నేనుండలేను వచ్చేస్తా అమ్మా నాకీ సంసారం వద్దు, ‘నన్‍’గా మారిపోతా తీస్కొనిపో నన్ను’ అంటూ ‘‘తల్లీ ఇలానే ఉంటుంది సంసారం అంటే… సర్దుకుపోవాలి. నేను మీ నాన్నతో సర్దుకుపోబట్టే… కదా… మీరంతా బతికి బట్టకట్టారు’’ గొంతు రుద్ధం అవుతుంటే ‘‘మీ నాన్నేం మారలా అట్లే ఉన్నారు ఇప్పటికీ… మాత్రలేసుకుని తగ్గించుకో పోనీ నన్ను రమ్మంటావా… నువ్వొస్తావా కొన్ని రోజులు రెస్టు తీస్కుని మళ్ళీ పోదువు కానీ… రమ్మంటావా చెప్పు. నాన్నారినో అన్నయ్యనో పంపనా చెప్పు తల్లీ… ఏసు ప్రభువుకు ప్రార్థనలు చేస్తా నీ కోసం… తగ్గిపోతాయి నొప్పులు. అవునూ… ఇందాకే అల్లుడుగారు చెల్లికేదో సంబంధం తెస్తున్నట్లు చెప్పారట నాన్నాగారితో… నీతో చెప్పారా. కట్నం అదీ ఏమీ వద్దట…’’ అంటూ ఉంది అమ్మ. నేను మాట పడిపోయినట్లు అయిపోయాను. ‘‘అయ్యో ఏగ్నెస్‍… నా బంగారు తల్లీ… ఎంత కిరాతకంగా చేసాడు వచ్చెయ్యి… పోకింక ఆ రాక్షసుడి దగ్గరికి… నువ్వు మాకేం భారం కాదు…’’ అనటం లేదు. ఏడవడం లేదు, భయపడ్డమూ… ఆందోళన పడ్డమూ ఏవీ లేదు. యుగయుగాల చరిత్ర మళ్ళీ చాలా యాంత్రికంగా వింటున్నట్లే రోజూ బైబిల్‍ పొడి కళ్ళతో చదువుతున్నట్లే… ఆడది మగాడి పక్కటెముకలోంచి పుట్టింది. మగాడి శరీరంలో ఒక భాగం మాత్రమే ఆడది ఆమెకి ఏ ప్రత్యేకమైన ఉనికి లేదు. మగాడి కోసమే ఆడది’’ పాస్టర్‍ చెప్పే బైబిల్‍ పాఠాన్ని గాజు కళ్లతో… చెవిటి చెవులతో ఎన్ని వేల సార్లు విన్నదో? అలా తన భర్త ఐరన్‍ రాడ్‍ లాంటి టార్చిలైట్‍ వెనక భాగాన్ని తన వెజైనాలోకి గుచ్చి గుచ్చి ఛీల్చేసాడన్న ఘోరమైన హింసాత్మకమైన వాస్తవాన్ని… రోజూ విజయా పాలు కొంటామన్న సాధారణమైన విషయం వింటున్నట్లు… కొత్తేమి కానట్లు… ఎలాగూ జరగబోయేది ఇదే… తాను ఎన్నటికైనా వినాల్సిందే అన్నట్లు ఎంత యాంత్రికంగా విన్నదీ… మాట్లాడిందీ… అమ్మేనా… అమ్మేనా… అమ్మా… నువ్వేనా… చిన్నప్పుడు ఆటల్లో చిన్న గాయం అయినా కళ్ళనిండా నీళ్ళతో విలవిల్లాడే అమ్మేనా? ఇంతలా ఎలా మారిపోయావు? అమ్మలు కూడా మారిపోతారా? నేను నొప్పితో మరింతగా ముడుచుకుపోయాను. వెంఠనే ఫోన్‍ కట్‍ చేసాను. ఏసు ప్రభువుకి ప్రార్థనలు చేస్తుందట, ఆడదాన్ని మగాడి పక్కటెముకను చేసి, ఆడదానిపై అన్ని అధికారాలు మగాడికి ఇచ్చేసిన ఏసు ప్రభువుకి ప్రార్థన చేస్తే ఈ రాక్షసుడ్ని శిక్షిస్తాడా? హింసలేని రాత్రిళ్ళని ప్రసాదిస్తాడా? పైగా నేను బాధా.. భయంతో ఒణికిపోతుంటే అల్లుడుగారు… చెల్లికి సంబంధం అని ఎట్లా మాట్లాడింది? నాపై అతను చేసిన హింస అంత పలుచన కావడానికి కారణం కట్నం లేకుండా చెల్లి పెళ్ళి అనే తన అవసరమా? తనపై అఘాయిత్వం చేసిన రోజే వాడు నేనెక్కడ చెప్పేస్తానో అన్నట్లు ముందే చెప్పేసాడు. తల్లి బిడ్డల మధ్య కూడా అవసరం సంబంధాలేనా? హృదయం వేదనలో మునిగిపోయింది. దేహ బాధకంటే అమ్మ నిర్లిప్తత ఎక్కువ బాధించింది. ఇక్కడ… రక్షణ లేని స్థలంలో… ఎలా ఉండాలి?

అదే రోజు రాత్రి వాడేదో టూర్‍కి వెళ్ళిపోయాడు. వెళ్ళేముందు ఆ రక్తశిక్తమైన టార్చ్లైట్‍ను పది నిమిషాలు కడిగి తుడిచి వెళ్ళాడు. టేబుల్‍ పై పెట్టాడు దాన్ని. దాన్ని చూసినపుడల్లా నిలువెల్లా భయం వేసేది.. అది వాడి కత్తిలాంటి అంగంలా కనిపించేది. తీసేసి చెత్తబుట్టలో వేసి వచ్చాను. ఆ పది రోజులూ నాకు స్వర్గమే. రెండు సార్లు డాక్టర్‍ దగ్గరికి వెళ్ళా… నా స్నేహితురాళ్ళు వచ్చారు. పాత కబుర్లతో… మంచి భోజనంతో ముఖ్యంగా హింసా దౌర్జన్యాలు లేని.. బెదిరింపులు లేని ఆ క్షణాల్లో నేను సాంత్వన పొందాను. అమ్మ దగ్గరికి మాత్రం వెళ్ళాలన్పించలేదు. అమ్మ కొత్తగా… పరాయిదిగా… నాన్న, అన్న… నా భర్తలకంటే కూడా దుర్మార్గమైందిగా అనిపించింది. నాన్న మీద పోయినట్లుగా అమ్మ మీది విశ్వాసం, నమ్మకం పోవడం కూడా చాలా యాతన… వేదన, కలిగించింది. అవమానంగా అనిపించింది.

ఇక్కడ… ఇంత ప్రమాదం పొంచి ఉన్న… నాది కాని స్థలంలో కూడా ఉండాలని లేదు కానీ విచిత్రంగా ఇది తను చచ్చేదాకా ఉండాల్సిన ఇల్లు… వీడే చంపేస్తాడు.

స్నేహితురాళ్ళు వెళ్ళిపోతుంటే ఏడ్చేసాను. దివ్య కూడా వచ్చి వెళ్ళింది. కానీ వాళ్ళకి ఏమీ చెప్పొద్దన్నాను. నా మంచి రోజుల్ని వాడి గ్నాపకంలో నాశనం చేయదల్చుకోలేదు. వాడు అసలు ఎప్పటికీ రాకపోతే బాగుండు… వాడికేదో ఏక్సిడెంట్‍ అయ్యిందనో… చచ్చాడన్న కబురో వస్తే బాగుండు అలా ఊహించుకుని ఆనందపడ్డా కూడా. అవును మీకు కూడా ఆశ్చర్యం కలగడం లేదు కదా నేను నా భర్త చావును కోరుకొంటుంటే…? కానీ ఏ కబురూ రాలేదు నేరుగా వాడే వచ్చేసాడు. నా నరకపు దినాలు మళ్ళీ మొదలయ్యాయి. చెల్లికి సంబంధం కుదిర్చాను. ‘నాకో ఇక మీదట బుద్ధిగా ఉండటం నేర్చుకో’ అన్నాడు. ప్రతీ రాత్రి ఏదో ఒక కొత్త హింసాపద్ధతులు ఉండేవి. అతను ఫోర్న్ సైట్స్ చూస్తాడని చెప్పాగా. నన్ను కూడా చూడమని బలవంతం చేస్తూ… అందులో ఉన్నట్లు నన్ను చేయమనేవాడు. బలవంతం చేసేవాడు. నేను అతని భార్యను కాబట్టి ఏం చెబితే అదే చేసి తీరాలట. నిప్పుల్లో దూకమన్నా దూకాలట చేయకపోతే మొన్న చేసినట్లే టార్చ్లైట్‍ శిక్ష వేస్తాడట… అసహ్యంగా టార్చ్లైట్‍తో ఏం చేస్తాడో చేతో సైగలు చేస్తూ చెప్పేవాడు… నేను తిరస్కరిస్తే బూతులు తిడుతూ కొట్టేవాడు తొడపాశం పెట్టేవాడు. అతని వికారపు చేష్టలకి అసహ్యంతో ముడుచుకుపోయే నన్ను… ఆ నీచమంతా చేయలేక గదిలోంచి పారిపోవాలని చూసే నన్ను వెంటపడి జుట్టు పట్టి ఈడ్చుకు వచ్చి మంచంపైనో… కింద నేలమీదో పడేసేవాడు. ‘చూడు… చూడు… చూసి నేర్చుకో’ అంటూ తల పట్టి నా కనురెప్పలు తన వేళ్ళతో వెడల్పు చేసేవాడు. బూతు వీడియోలు చూడాల్సిందే.. వాడు కోరినవి చేయాల్సిందే. వాళ్ళమ్మకి చెబ్దామంటే ఆమె బాగా ముసలామే… పుట్టెడు చెవుడు. అర్థం కూడా కాదు.

ఇంతలో చెల్లి పెళ్ళి బ్రహ్మాండంగా చేసారు. అమ్మా నాన్న అన్నయ్యా అంతా నా భర్తని దేవుణ్ణి చూసినట్లు చూసారు. నేను పూర్తిగా పరాయిదాన్ని వాళ్ళకిప్పుడు. అతని అహంకారం ఇంకా పెరిగిపోయింది. నన్నింతగా అవమానించే హింసించే అతనికి ఇన్ని రాచమర్యాదలా? నాకు దుఃఖం వచ్చేది.

రోజు రోజుకీ అతని వికార చేష్టలు ఎక్కువ కాసాగాయి. నా ఓపిక… సహనం నశించిపోతున్నాయి. ఒక రోజు చాలా అసహ్యం కలిగించే పని చేయమన్నాడు. నేరుగా నా నోట్లో మూత్రం పోస్తా.. తాగమన్నాడు… నేను చేయనని గట్టిగా అరిచి అతన్ని తోసేసి గదిలోంచి పారిపోబోయాను. లేకపోతే అతను అన్నంత పనీ చేస్తాడు. నా కాళ్ళు చేతులు కట్టేసి మరీ చేస్తాడు. అంతే అతను కోపంతో ఊగిపోతూ గది మూలలో ఉన్న క్రికెట్‍ బాట్‍తో నన్ను భయంకరంగా కొట్టడం మొదలుపెట్టాడు. దెబ్బలు తాళలేక నేను భయంతో స్ప•హ తప్పాను. మెలకువ వచ్చాక నా బట్టలు… తల మూత్రంతో… గాయాలు రక్తంతో తడిసిపోయి ఉన్నాయి. వాడు నా మీద మూత్రం పోసాడు. వాసనకి అక్కడికక్కడే వాంతులు చేస్కున్నాను. గాయాలు విపరీతంగా నొప్పెడుతున్నాయి. చిటికెన వేలు చితికింది. కాళ్ళూ తొడలూ కమిలిపోయాయి. పెదవి చిట్లి ముందరి పన్ను సగం విరిగిపోయింది. చెవుల్లోంచి రక్తం వస్తున్నది. నాలో ఆగ్రహం లావాలా పొంగింది. వెంఠనే పోలీస్‍ స్టేషన్‍కి వెళ్ళాను. కంప్లైంట్‍ రాసిచ్చి నా ఒంటిమీది గాయాలు చూపించాను. అంత పేరున్న పాస్టరు అలా చేస్తాడంటే వాళ్ళు నమ్మలేదు. ‘‘అయినా ఇదేం పనమ్మా ఏగ్నెస్‍… నీ భర్త మగవాడు అతను కావాలనుకుంటే వేశ్యల దగ్గరికి కూడా వెళ్ళగలడు. కానీ అతను నీ దగ్గరకే కదా వస్తున్నాడు? ఫో… పోయి నీ భర్తకు కావలసినట్లు ఆనందపరచు… నువ్వు నీ భర్త నీ దగ్గరకే వస్తున్నందుకు సదా కృతజ్ఞురాలివై ఉండాలి. సమాజంలో ఆయన పరువు తీయకు’’ అని నా భర్త భక్తుడైన ఎస్సై చెప్పి నన్ను వెళ్ళగొట్టాడు.

నేను తిన్నగా డాక్టర్‍ షబ్నం దగ్గరికి వెళ్ళాను. జరిగింది చెప్పాను. ఆమె నన్ను వెంఠనే హాస్పిటల్‍ల్లో అడ్మిట్‍ చేస్కుంది. ఫోటోలు తీసాక ఆయమ్మ స్నానం చేయించింది. శుభ్రమైన బట్టలు వేసింది. పోలీసులు వచ్చారు. స్టేట్మెంట్‍ తీస్కున్నారు. నా భర్త అరెస్ట్ అయ్యాడు… విడుదల కూడా అయ్యాడు. నేను విడాకులకు దరకాస్తు చేసాను. ఆ మూడేళ్ళ నరకం నుంచి విముక్తి కోసం. డాక్టర్‍ షబ్నం నాకు ట్రైనింగ్‍ ఇచ్చి నర్సుగా మార్చింది. నా కాళ్ళ మీద నేను నిలబడ్డాను. ఆ డాక్టరమ్మ దేవత అంది ఏగ్నెస్‍. తన కథ చెప్తున్నప్పుడు ఆమె అనుభవించిన యాతన వేదన వల్ల ముడుచుకుపోయిన ఆమె ముఖంలోని కండరాలు, డాక్టర్‍ ష•్నంను తలుచుకోగానే సంతోషంతో వికసించాయి. డాక్టర్‍ షబ్నం స్నేహితురాలే ఈ వరదా మేడం అంటూ వరదను చూస్తూ… ‘‘మేడం మన దేశంలో భర్త చేసే రేప్‍కు శిక్ష లేదా.. ఎప్పుడు వస్తుంది చట్టం..?’’ ఏగ్నెస్‍ అడిగింది. ‘‘పోరాటాలు జరుగుతున్నాయి త్వరలో వస్తుంది మనమంతా కలిస్తే ఎందుకు రాదు…’’ అంది వరద చిరునవ్వుతో… ఏగ్నెస్‍ కథ విని విషాదంలో చిన్నబోయిన అక్కడి స్త్రీల మొఖాలు చూస్తూ.

కోర్టులో నా భర్త అసలు నేనెప్పుడూ అతనితో సెక్స్కి ఒప్పుకోలేదని… ప్రతీసారి వద్దని మొండికేసేదని… దాని వలన తనలో ఫస్ట్రేషన్‍ పెరిగిపోయిందని దీనిలో తన తప్పు లేదని… కోరికలు తీరని ఏ భర్తైనా ఏం చేయగలడని’’ నాటకాలు ఆడాడు.

నార్మల్‍ సెక్స్కి తను ఏనాడూ ‘నో’ చెప్పలేదని… అసహజమైన వికృతమైన సెక్స్కే తను ‘నో’ చెప్పానని నేను కూడా చాలా గట్టిగా చెప్పాను. అతని వికృత చేష్టలన్నీ చెప్పాను. డాక్టర్‍ షబ్నం అందుకు తన సాక్షి అని రిపోర్టస్తో సహా చెప్పింది. టార్చిలైట్‍తో అతను నాపై చేసిన దారుణాన్ని వివరించి బ్లీడింగ్‍ తగ్గడానికి లోపల కుట్లు వేయాల్సి వచ్చిందనీ డిశ్చార్చి కాగితాలు చూపించింది. ఈ డా।। షబ్నం మేడమ్‍ లేకపోతే నేనేమైపోయేదాన్నో జీవితాంతం రుణపడి ఉంటాను’’ అంటూ ఏగ్నెస్‍ అక్కడే ఉన్న డా।। షబ్నం రెండు చేతులూ కన్నీటితో పట్టుకుని తన నుదుటికి తాకించుకుంది.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

2 thoughts on “విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape) – 3

  1. చాలా బాధాకరంగా ఉంది. నిజమే అలాంటి దుర్మార్గులని భారత దేశం లోని న్యాయ వ్యవస్థ ఏమి చేయదు.

  2. Very very pathetic . Such husbands should be seriously punished. Tears rolled out while reading.

Leave a Reply