విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape)- 2

ఆకాశంలో చందమామ కూడా లేడు.. ఎక్కడ తప్పిపోయాడో.. ముందే హృదయమంతా గాడాంధకారం.. చంద్రుడికీ దయలేదు తనమీద. అమ్మ దగ్గరికా.. చరణ్ దగ్గరికా.. అర్థం కావట్లేదు. మళ్లీ చరణ్ దగ్గరికేనా.. తలచుకోవడమే కష్టంగా ఉంది. ఫోన్లో అమ్మవి.. నాన్నవీ బోలెడు మిస్డ్ కాల్స్ ఉన్నాయి. మధ్యలో ఒకట్రెండు చరణ్ వి, ఒక పది దాకా వర్షవి, చెల్లి యామినివి కాల్స్ ఉన్నాయి. చరణ్ నుంచి అప్పుడే అత్తమ్మకి, సురేఖకు కబురు వెళ్ళిపోయింది. వాళ్ళవీ ఉన్నాయి కాల్స్.

తలుపు తీసిన కాత్యాయని మొఖంలో కూతుర్ని చూడగానే గొప్ప సాంత్వన భావం కనిపించింది. అలా తలుపు తీయడం.. మహిమ లోపలికి వచ్చాక తలుపు వేసేసి.. ‘ఏం చేస్తావో చేసుకో’ అన్నట్లు నిలబడే ‘కూతుర్ని నువ్వింతే కదా.. అన్నట్లు చూడడం ఆ చూపులు ఎప్పటి నుంచో అలవాటు ఉన్న వాటిలా డీ కొనటం.. కాత్యాయని అలవోకగా చూపులు పక్కకి తప్పిస్తూ.. “తిన్నావా యావన్నా?” అని అడగడం.. మహిమ తినలేదన్నట్లు తల ఊపడం.. కాత్యాయని “వడ్డిస్తున్నా ఫో.. ఫ్రెష్ అయిరా తిందువు” అంటం మామూలే. ఇప్పుడూ అదే జరిగింది. మహిమకు ఈసారి దుఃఖం ఆగలేదు. “అమ్మా” అంటూ కాత్యాయనిని పట్టుకుని అల్లుకుపోయి ఏడ్చేసింది… ఇంతలో అక్కడికి యామిని పరిగెత్తుకుంటూ వచ్చి ‘మహీ’ అంటూ మహిని కౌగిలించుకున్నది దిగులుగా. “కాత్యా.. మహి వచ్చిందా”.. అంటూ అక్కడికి వచ్చాడు మహిమ నాన్న సోమరాజు. మహిని అలా చూస్తూ వెళ్ళు మహీ.. ఫ్రెష్ అవ్వు అమ్మ ఇంకా తిననే లేదు.. అన్నాడు లాలనగా తన కంట తడి కనపడకుండా.. తర్వాత ‘మహి రీచ్ హెూం’ అని అందరికీ మెసేజీలు పెట్టడంలో మునిగిపోయాడు. “మహీ తిని పడుకో.. డోంట్ వర్రీ అబౌట్ ఎనీథింగ్ పొద్దున్న మాట్లాడుకుందాం” మహిమకు బుగ్గ మీద ముద్దు ఇచ్చి యామిని వెళ్ళిపోయింది.

తల్లి, బిడ్డలిద్దరు మౌనంగా తినసాగారు… కాత్యాయని ఏమీ జరగనట్టే ‘అది తిను’.. ‘సరిగా కలుపు’ అంటూ ఏదో కావాలని మాట్లాడుతూ ఉంది. ఈ సారి కాత్యాయని “పద పోదాం” అంటూ బయలుదేర దీయలేదు. వియ్యపురాలు వకుళతో జరిగిన సంభాషణ ఆమెకి చాలా కోపాన్ని తెప్పించింది. “మీ అమ్మాయికి బలిసింది.. రెండు తగలనిస్తే కానీ దారికి రాదు. మావాడంత ప్రేమతో అంత కాలీ సూటల్ బుక్ చేసి, డైమండ్ రింగ్ గిఫ్ట్ గా ఇచ్చి తనెంత ప్రేమిస్తున్నాడు చెవితే విసిరికొడుతుందా.. అంత కొవ్వేం.. దరిద్రపు ముండాని చెప్పుచ్చుకు కొడితే గానీ..” అని అరుస్తున్న వకుళతో “మాటలు మర్యాదగా రానియ్యండి వదినా బలుపు, ముండలు.. చెప్పుతో కొట్టడాలు అనే మాటలు వెనక్కి తీసుకోండి ముందు. సిగ్గుపడండి కోడల్ని అంత నీచంగా మాట్లాడుతున్నందుకు. నేను మీ అమ్మాయిని ఈ మాటలు అంటే ఊరుకుంటారా మీరు? నా బిడ్డని అలా మాట్లాడితే.. నేను ఊరుకుంటానని అనుకోబాకండి, జాగర్త” ఆగ్రహంతో కణతలు అదురుతుంటే ఏదో వాగుతున్న వకుళ మాటలు వినకుండా ఫోన్ టక్కున పెట్టేసింది కాత్యాయని. మహిమకి ఈ మాటలు చెప్పలేదు కాత్యాయని. “కూతురికి కొసరి కొసరి తినిపించింది ఎన్ని రోజులై ఉంటుందో బిడ్డ ఇలా కడుపునిండా తీరిగ్గా కూర్చుని తిని అన్న ఆలోచనతో నిండుకున్న కళ్ళను చీర కొంగుతో తుడుచుకుంది కాత్యాయని. “పో పోయి పడుకో వంటిల్లు సర్దుతా” అన్నది మహిమ తల్లి. చీర కొంగుతో తన చేయి తుడుచుకుని కాత్యాయనిని గాఢంగా కౌగలించుకుని బుగ్గపైన గట్టిగా ముద్దు పెట్టుకొని “అమ్ములూ.. ఐ లవ్ యూ” అంది. “ఊ.. సరే.. సరే.. పడుకో పో”.. అంటూ ఉబికొస్తున్న దుఃఖాన్ని గొంతులో దింపుకుంటూ వంటింట్లోకి నడిచింది కాత్యాయని.

బాల్కనీలో చలిలో నిలబడ్డా వేడిగా ఉంది మహిమకి. రెండుసార్లు కాత్యాయని వచ్చి మునివేళ్లతో తలుపు తట్టి ‘మహీ.. పడుకున్నావా’.. అంటూ మహిమ గొంతు విన్నాక వెళ్ళిపోయింది. ఆమె భయం ఆమెది. అంతకు ముందు కూతురు చేసిన ఆత్మహత్యా ప్రయత్నం ఆమెకి ప్రతి క్షణం గుర్తు కొస్తూ ఉంటుంది. తన గదిలో కిటికీ పక్కని మంచం మీద పడుకుంది మహిమ. విశాలమైన కిటికీ.. బయట ఉన్న చందమామ.. కురిపించే వెన్నెల ఒకప్పుడు ఎంత బాగుండేది? ఇప్పుడు చందమామ ఎందుకు పగలబడి నవ్వుతున్నాడు.. వెన్నెల ఎందుకింత వేడిగా ఉంది? ఈ కిటికీలోంచి తన గదిలోకి.. తన నుంచి వెళ్లిపోయిన జీవితం తిరిగి వచ్చి తనని గాఢంగా కౌగలించుకుని ఇక తిరిగి వెళ్లిపోక పోతే ఎంత బాగుంటుంది.. తనతోనే.. తనకు కావాల్సిన కోరుకున్న జీవితం.. శాశ్వతంగా ఉండిపోతే.. జీవితమా ఒక్కసారి వచ్చిపో ఇలా నా దగ్గరికి… చూడు నువ్వులేక నా ఇల్లు.. నా గది.. నా వీధి.. నా ఈ చిన్ని తోటలో ఎంత అంధకారం కమ్ముకుందో? నీతో చాలా పని వుంది.. నిన్నో.. నన్నో సరిదిద్దాల్సి ఉన్నది ఒక్కసారి తలుపు తట్టు.. ఒక్క క్షణంలో పరుగున వచ్చి తలుపు తీస్తాను. ఇద్దరం ఎదురెదురుగా కూర్చుందాం.. ప్రేమగా మాట్లాడుకుందాం.. మళ్లీ విడిపోలేనంతగా కౌగిలించుకుందాం.. నా జీవితమా.. నువ్వొస్తే .. ఈ రాత్రి, నా ఇంటి వీధి.. చిన్నబోయిన తోట ఎలా వెలిగిపోతాయో చూద్దువు గానీ. నా ఇంట్లోకి వీచే ఈ గాలి కూడా వెన్నెల చల్లదనాన్ని తీసుకువస్తుంది. నువ్వు వచ్చాక మళ్లీ నువ్వెళ్లకుండా తలుపులు మూసేసి గట్టిగా తాళం వేసేస్తాను.. ఆ తాళం గుత్తి ఎవరికీ దొరక్కుండా ఆ సముద్రంలో విసిరేస్తాను. నా జీవితమా ఒక్కసారి వచ్చిపోవూ.. ! మహిమ వెచ్చని కన్నీళ్ళతో తడిసిన చెంపలను దిండు గలీబుకి అద్దింది. కాత్యాయని మళ్లీ వచ్చి… మహిమకి దుప్పటి కప్పి వెళ్ళింది. పిచ్చి అమ్మ.. ఎంత తల్లడిల్లుతున్నదో.. దిండు చెంపకి చల్లగా తగిలింది. తెల్లారితే ఈ గలీబు కన్నీటి మరకలతో నిండి పోతుంది… ఈ కన్నీళ్ళలో ఏముందో మరకలు కలిగించే మాసిపోనివ్వని రసాయనం? ఈ మరకలు మనిషి బాధలకు… దుఃఖాలకు.. అవేదనలకు దృశ్య రూపాలా? ఈ గలీబులు.. తను కుళ్లి.. కుళ్లి.. కదిలి కదిలి ఏడ్చిన రాత్రుళ్ళను పీల్చుకున్నాయి.. తమలోకి ఇంకించుకున్నాయి హృదయం ఉన్నట్లే. అందుకే ఈ గలీబుల స్పర్శ ఎంత వోదార్పు నిస్తుందని.. ? అచ్చంగా అమ్మ స్పర్శలా.. మహిమ గలీబుని తీసుకుని చెంపలకి హృదయానికి హత్తుకుంది. తన జీవితాన్నే కథగానో.. నవల గానో రాయాలనుకున్న మహిమ లేచి తన డైరీ అందుకుంది. మహిమ రచయిత్రి కూడా… అనువాదాలు.. కథలు కవితలు ఈ మధ్య ఒక నాలుగేళ్ల నుంచే రాస్తున్నది. ప్రతీ ఒక్కటి బిపిన్ వినిపించేది అభిప్రాయం కోసం. అలాగే సాహిత్యం బాగా చదువుతుంది ముఖ్యంగా మహిమకి అనువాద సాహిత్యం అంటే చాలా ఇష్టం. తన జీవితంలో ప్రతి రోజూ జరిగే ముఖ్యమైన సంఘటనలను డైరీలో రాసుకుంటూ ఉంటుంది. ఇతరుల అనుభవాలను.. తన చుట్టూ ఉన్న సమాజంలో తన పరిశీలనలు కూడా ఎప్పటికప్పుడు ఎప్పటికప్పుడు డైరీలో రాసుకుంటూ వాటికి కథా రూపమో.. కవితా రూపమో ఇస్తూ ఉంటుంది.

డైరీలో యాభైయ్యో పేజీ తీసి రాయడం మొదలు పెట్టింది.. తెల్లారే దాకా రాస్తూనే ఉంది అప్పటికే రాత్రి రెండయ్యింది. చాలా కాలం అయ్యింది నిన్ను చూసి… ఎక్కడ గడిపావు ఇన్నేళ్ళు? దుఃఖపు మొఖాన్ని దాచుకుంటూ.. దాచుకుంటూ.. అచ్చం.. నా లాగే… ఏ పగళ్ళలో.. నీ నీడ కూడా అలిసిపోయేంతగా.. దిక్కు లేకుండా తిరిగావు? ఏ రాత్రిళ్లలో.. చీకటికి కూడా చిక్కకుండా.. నిద్రపోని రహదారులను పట్టుకుని నువ్వూ ఏడిచావు?
చీకట్లను మింగుతూ తెల్లార నీయకుండా.. పగళ్ళలో కూడా రాత్రుళ్ళని మిగుల్చుకున్నావు? అచ్చం నాలాగే.. చూడు.. నువ్వు లేని నా జీవితాన్ని..! నిన్ను ఎడబాసిన అపరాధాన్ని మోస్తూ శిలనైనాను. నా.. నీకే నేను దూరంగా ఎలా ఉంటున్నాను? పోనీ నువ్వెలా ఉంటున్నావో చెప్పు! రా ఒక్కసారి.. వచ్చి జీవితాన్ని అందించు! అప్పటిదాకా నా ఆకాశంలో చందమామ లేడు.. సూర్యుడూ లేడు నాకు అసలు ఆకాశమే లేదు నా లోపల తోట ఎండిపోయింది వచ్చి నీ పెదవుల తడి అందించి వెళ్ళు తరువాత చూడు…. నా తోట పూలు.. నీహృదయంలో పరిమళ శ్వాసని నింపుతాయో.. లేదో.. !

                                                                        - 3 -

“ప్రశాంతంగా ఉండలేకపోతున్నా వరద గారూ.. రోజూ నరకంగా ఉంది.. వాలంటైన్స్ డే వింటర్ డేట్ రాత్రి తరువాత ఇంకా ఎక్కువ వేషాలు వేస్తున్నాడు. నానమ్మకి.. అమ్మ నాన్నలకి అత్తయ్య, సురేఖ, చరణ్.. ఫోన్లు చేసి చేసి వేధించారు. నేను లేనప్పుడు అత్తయ్య వచ్చి అమ్మతో బాగా గొడవపడి వెళ్ళింది మొన్న. నానమ్మ ఎప్పుడూ చరణ్ న్నే సపోర్ట్ చేస్తుంది.. నన్ను వెళ్ళిపొమ్మని అత్తయ్య లాగే వేధిస్తుంది. “నేను మీ అమ్మాయిని ఏమీ అనను.. అమ్మను.. అక్కని కూడా మహిమను ఏమీ అనకుండా చూసుకుంటాను.. మా చెల్లి పెళ్లి కావాలి కదా పంపియ్యండి ప్లీజ్” అని చరణ్ నాన్నకి మేసేజీల మీద మేసేజీలు పెడుతున్నాడు. “ఏం మీ యామిని పెళ్లి మాత్రం అవుతుందా మీ మహిమ కాపురానికి పొకపోతే ఆలోచించండి అయినా.. ప్రేమిస్తే కూడా తప్పేనటండి మీ మహిమకి. మరీ హద్దు దాటుతున్నది భరిస్తున్నాము కదాని”.. అంటూ అత్తయ్య ఒకటే నస.. బెదిరింపులు.. చెల్లి పెళ్లి కాదనే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేస్తున్నారు అమ్మనీ.. నాన్ననీ. నానమ్మని కూడా ఇలా మాట్లాడే లొంగదీసుకున్నారు. అమ్మమ్మ మాత్రం వాళ్లందరినీ అడ్డగించి నోర్లు మూసేసింది. “ససేమిరా వెళ్లదు ఇప్పుడే.. దానిష్టమైనప్పుడు.. తనకి భద్రతగా ఉంటుంది అనుకున్నప్పుడు మాత్రమే వెళు తుంది. రేపు దానికేవైనా అయితే మీరు బాధ్యత పడుతారా వదినా.. స్వంత నానమ్మై యుండి శత్రువులాగా మాట్లాడుతారేం? మీరు మహిని వెళ్ళమని బలవంతం చేయడానికి వీల్లేదంతే! వాళ్ళ పిల్ల పెళ్ళికోసవో లేదా మన యామిని పెళ్లి కాదనో.. బురదలో కలిసిపోయే రెండిళ్ల పరువూ.. లేని గౌరవమూ నిలపడం కోసవో.. మహి జీవితాన్ని బలి చేయాల్సిన అవసరం లేదు. మన బిడ్డ మీద మనకే గౌరవం లేకపోతే ఎట్టా.. సిగ్గుండఐర్లా”.. అంటూ నానమ్మ చేతిలో ఫోన్ లాక్కుని ‘ఇదిగోండి వకుళ గారూ మా మహి ఇంకా స్థిమిత పడ్డా.. అవును మా మహికి చెప్పకుండా ఆ వాలంటైన్స్ రోజో.. వల్లకాడో ఏదో ఒహాటి లెండి.. చెయ్యడం అక్కడ బలవంతాన ఉంగరం వేలట్టుకుని ఎక్కించెయ్యడం ఏవిటిటా.. మహికిష్టవా లేదా కనుక్కోకుండా.. అదీ ప్రేమికుల రోజుట.. వీళ్లేవైనా ప్రేమికులా ఏవిటీ.. శత్రువుల్లా కొట్టాడుకుంటుంటేనూ.. కనీసం స్నేహం అన్నా వుండి సచ్చిందా ఇద్దరి మధ్యా.. కొంచమైనా మా అమ్మాయి తేరుకోడానికి.. ఇంత టైం తీసుకోవద్దూ.. అంతా మీ ఇష్టవేనా… కత్తితో కసా బిసా పొడిచేసి.. గాయం పచ్చిగా వుండగానే నొప్పే లేనట్లు.. అవమానవే కానట్లు మీ అబ్బాయితో ఇకిలిస్తూ.. కులుకుతూ ఉంటం మా మహి వల్ల కాదంతే..” అంటూ “వదినా నువ్వంత కటువుగా మాట్టడకు ఉన్నది కాస్తా చెడుతుంది. దానికి అత్తారిల్లు లేకండా చేస్తావేమిటి.. చూడబోతే?” అంటున్న నానమ్మని “నువ్వురూకో వదినా ఆడ పుట్టుక పుట్టి, నువ్విట్టా మాట్లాడకూడదు” అని టక్కున ఫోన్ పెట్టేసి… “మహి నువ్వెళ్లకు నీకు నేనున్నాను.. నిన్ను నేను పెంచానే.. నువ్వేంటో నాకు తెలియకనా… నా రక్తవే నీలో ఉన్నది ఇదే ధైర్యంతో ఉండు” అంది నన్ను దగ్గరకు తీసుకుని. నేను అమ్మమ్మ మెత్తటి హృదయం మీద వాలిపోయాను భద్రంగా.

“అవును.. అందుకే నీలాగే మొగుడితో కాపురం చేయకుండా.. మాటి మాటికి నీలాగా మొగుడితో పోట్టాడుతూ.. అత్తింటి నుంచి పారిపోతూ పుట్టింట్లో పడి చేరుతోంది.. ఎన్నెన్ని పంచాయితీలు అయినాయో నీ కాపురంలో నాకు.. లోకానికి తెలీదనుకున్నావా.. ఇప్పుడు మహి కూడా నీలాగా కావాలన్నమాట.. నీ పుట్టింటి కంట ఎంతలా కన్నీరు నింపావో నీకెన్నడన్నా తట్టింది.. పరువు గురించేవన్నా వుందిట..? అయినా వదినా నువ్వు నా ఇంటి వ్యవహారాల్లో ఎందుకు తలదూరుస్తున్నావూ… మహి నా కొడుకు కూతురు.. నీకన్నా నాకే ఎక్కువ అధికారం ఉంది మహి ఏం చెయ్యాలో చేయకూడదో నేను.. మహా అయితే దాని తండ్రి అంటే నా కొడుకు చెప్పాలి కానీ నువ్వు కాదు.. నా ముందు నీ కూతురే మాట్టాట్టం లేదు.. నువ్వేంటి నిర్ణయాలు కూడా తీసేసు కుంటున్నావు.. కొంచెం దూరాన్న ఉంటే మంచిది” అంది నానమ్మ ఇంత గొంతేసుకుని. తన చేతుల్లోంచి ఫోన్ లాక్కుని మహి రాదని మ అత్తయ్యకి తన నిర్ణయంగా చెప్పేయడం నానమ్మకు చాలా కోపం తెప్పించింది. ‘అవునొదినా… నీలా మొగుడు తన్నినా.. మరొకతితో పోయి రోగాలు అంటించి.. వరుసగా గర్భస్రావాలు అయ్యేలా చేసినా కిక్కురుమనకుండా కాపురం చేసిందానివి.. నీకు నాలా.. పోనీ నీ మనుమరాలు మహిలా.. అంత ఆత్మ గౌరవం ఉంటుందా ఏవిటీ… నీ మనుమరాలైతే నీలా రాజీ పడిపోయి మొగుడు అంటించిన రోగాలకి.. దెబ్బలకి ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉండేది ఈ పాటికి… నా మనుమరాలు కాబట్టే ఇంత పౌరుషంతో ఉంది… ఆ రకంగా నాకే ఎక్కువ అధికారం ఉంది నీకంటే.. ఏవే మహీ చెప్పు.. పోతావటే అలాంటి మొగుడి దగ్గరికీ..?” అంటూ నన్ను గడ్డం పట్టుకుని మరీ అడిగింది. “పోను అమ్మమ్మా…” అన్నాను నేను. అమ్మమ్మ గర్వంగా నానమ్మ వైపు చూసింది. అప్పటికే ఆగ్రహంతో రగిలిపోతున్న నానమ్మకి.. అమ్మమ్మ మొఖంలో వెక్కిరింత లాంటిది కనిపించిందేమో… “చావండి.. వోరే సోమరాజు నీ కూతురి జీవితాన్ని నాశనం చేయనిస్తా వేంటిరా ఒక్క మాట మాట్టాడవేంట్రా.. ఒసే కాత్యాయనీ నీకేవైందే.. నీ కూతురి జీవితం నాశనం అయిపోతుందే.. చావండే చావండి.. వోసే యామినీ నువ్వూ మీ అమ్మమ్మని.. అక్కనీ.. ఆదర్శంగా తీసేసుకుని మొగుణ్ణి వదిలి పెట్టేయవే.. ట్రైనింగు అయిపోవే ఇప్పుడే.. అయినా మీ అక్క మూలాన్న నీకు పెళ్ళవ్వాలి కదా ముందైతే….. మీ చావు మీరు చావండి.. మా అత్తారింటి వాళ్లు… నా కూతురి అత్తారింటివాల్లంతా.. మహి కాపురం గురించి వైన వైనాలుగా చెప్పుకుంటుంటే నా కూతురూ నేనూ సిగ్గుతో చచ్చిపోతున్నాము. నా అల్లుడు కూడా “ఏంటీ న్యూసెన్స్.. బుద్దిగా అత్తారింట్లో ఉంటం రాదా మీ మనవరాలికి.. ఏం పెంపకం ఇది..” అంటూ కోప్పడుతున్నాడు. నా కూతురు నలిగిపోతోంది మధ్యలో. మీ అత్త గురించి.. పోనీ దాని పిల్లలకి కావలసిన పెళ్లిళ్ల గురించైనా ఆలోచించవే మహీ.. యామిని మీద నీకెట్టాగూ ప్రేమ లేదు. మీ అమ్మమ్మ మొగుడితో ఎట్టా కొట్టాడాలో.. హక్కులూ.. మన్నూ దుమ్మూ అంటూ చెడిపోయే జీవిత సూక్తులు విని నాశనం అయిపోకు.. ఇదిగో చూడు మహీ నువ్వు నీ అత్తారింటికి వెళ్ళేదాకా నేను పచ్చి గంగ ముట్టను యావనుకుంటున్నావో” చూపుడు వేలితో నన్ను బెదిరిస్తూ తన గదిలోకి వెళ్ళి తలుపేసుకుంది.

అమ్మా.. నాన్న దిగులుగా అయిపోయి కూర్చున్నారు. అమ్మమ్మ నన్ను మరింత దగ్గరికి హత్తుకుంది. యామిని “డోంట్ వర్రీ అక్కా నానమ్మ మాటలు పట్టించుకోక నీ నిర్ణయం నువ్వు తీసుకో. నువ్వు హాపీగా ఉండాలి అంతే. నానమ్మ జీవితం అయిపోయింది అన్నిటికీ తలవంచి బతికేసింది.. అమ్మమ్మ సరిగానే చెప్పింది అయితే.. నాన్నమ్మ.. అమ్మమ్మ కాదు నువ్వేమనుకుంటున్నావో అదే ముఖ్యం. నా పెళ్లి ఎందుకు కాదూ ఖచ్చితంగా అవుతుంది. అయినా నీ లైఫ్ సెటిల్ కానిదే నేను పెళ్లి చేసుకోను.. ఆ మాత్రం బాధ్యత లేని దాన్ని కాను. ఇక నానమ్మ అంటావా.. ఇంకో గంటలో నానమ్మ ఆకలికి ఆగలేక బయటకొస్తుంది చూడూ.. ఎన్నిసార్లు అమ్మ మీద అలిగి ఇలాగే తలుపేసుకొని అర్థరాత్రిళ్లు దొంగతనంగా వంటింట్లో దూరిపోయి తినలేదూ.. ఒకసారి దొంగ అనుకుని అమ్మ కర్రేసుకుని పోలే?… అయినా నానమ్మ గదిలో ఎప్పుడూ బోలెడన్ని జంతికలు.. లడ్డూలు ఉంటాయి నానమ్మ పస్తులన్నీ ఉత్తుత్తివే.. చిన్నప్పటినుంచీ చూస్తూనే ఉన్నాము కదా” అంది నవ్వుతూ. కానీ ఆ మరునాడే యామినికి వచ్చిన సంబంధం పోయింది. బాగా నచ్చింది అన్న వాళ్లు ఏవో ఎంక్వైరీలు చేసుకొని మీ పెద్దమ్మాయికి ఏవో ఇష్యూస్ ఉన్నాయట కదా.. ఆత్మహత్యకి ప్రయత్నించిందిట కదా అంటూ ఏవో మాట్లాడి వద్దనుకున్నారు.. వాళ్ళు మా ఆడబిడ్డ భర్త ఫ్రెండ్స్ అట. నానమ్మకి శివాలెత్తి పోయింది.

అమ్మమ్మ ఊర్లో లేదు పొద్దున్నే వెళ్ళిపోయింది నాకు అమ్మకి ధైర్యం చెప్పి. అమ్మ దొంగ చాటుగా కళ్ళు తుడుచుకోవడం చూసాను.. నాన్న మాటలే రాని శిలలా బిగుసుకుపోవడం చూసాను. వాళ్ళు అమ్మకి ఫోన్ చేశారు. “మా అమ్మాయికి ఏమీ కాలేదు” అని అమ్మ అంటూనే ఉంది.. యామిని అమ్మ చేతిలో ఫోన్ లాక్కుని “మా అక్కకి ఏమీ ఇష్యూస్ లేవు.. మీకు ఇలా అడిగే హక్కు కూడా లేదు నాకే మీ సంబంధం నచ్చలేదు గుడ్ బై” అని ఫోన్ పెట్టేసింది. నేను మౌనంగా నా గదిలోకి వెళ్ళిపోయాను. యామిని ఖంగారుగా నా వెనకే వచ్చింది. ఆ మాటా.. ఈ మాటా అంటూ నా చుట్టే తిరుగుతున్నది. అమ్మ కూడా ఖంగారు పడుతూ గదిలోకి ఏదో పని ఉన్నట్లే వస్తూ.. పోతూంది. “చెప్పుడు మాటలు వినేవాడు నాకు నచ్చలేదు మహీ.. నేనే రిజెక్ట్ చేశాను వాడిని నువ్వు బాధపడకు” అంటున్నది నాతో.. అపుడే టీతో వచ్చిన అమ్మ కూడా అవునన్నట్ల తల పంకించింది.. మొఖంలో భావాలు కనపడకుండా చిరుగా నవ్వుతూ.. అమ్మెలాగూ ఈ కళలో దిట్ట.. దుఃఖపు మొఖాన్ని దాచుకోవడంలో అమ్మే ముందు నాకంటే.. నాన్నదెప్పుడూ అపరాధ భావనతో నిండిన నిశబ్దమే… వెళ్ళోద్దని చెప్పడు.. వెళ్ళమని చెప్పడు. యామిని ఔన్నత్యం ముందు నేను తన కోసం ఎంత త్యాగం చేసినా తక్కువే అనిపించింది.

రెండు రోజులు ఆగి యామిని బయటకు వెళ్ళినప్పుడు అమ్మతో నేనే చెప్పా.. అత్తారింటికి వెళ్లి చూస్తానని అమ్మ ఆందోళనగా చూసింది.. “వాళ్లసలే చాలా కోపం మీద ఉన్నారు.. ఎలా వెళతావు వద్దు” అంటూనే ఉంది నానమ్మ తన గదిలోంచి పరిగెత్తినట్లే వచ్చింది. “ఇదిగో మీ అత్తారి ఫోన్ మాట్లాడు” అంది.. చిన్నా డబిడ్డకి ఏదో సంబంధం వచ్చిందిట.. ఆమెనిప్పుడు నేను యామిని అనే అనుకోవాలిట ఉన్నపళంగా రావాలిట.. కోడలు ఇంట్లో లేకపోతే లక్ష అనుమానాలు వస్తాయిట ఇదీ ఆమె మాటల సారాంశం.. అమ్మతో చెప్పి “అమ్మా వెళతాను.. ఏదైనా సరే ఫేస్ చేస్తాను. నువ్వు ధైర్యంగా ఉండు.. ఏమైనా తేడాగా అనిపిస్తే వచ్చేస్తాగా..” అంటూ నానమ్మ వైపు తిరిగి “కళ్ళల్లోకి సూటిగా చూస్తూ..” నానమ్మా నువ్వు చెప్పావని కాదు.. మా అత్తయ్య పిలిచింది అని కాదు.. యామిని కోసం వెళు తున్నా..” అన్నా నానమ్మతో.. నాన్నకి మందులు వేళకి వేసుకొమ్మని చెప్పి బయలుదేరా.. “నువ్వేమీ గొప్ప పని.. లేదా కాని పని చేయట్లేదు. నీ మొగుడితో కాపురం చేసుకోడానికి వెళ్తున్నావు త్వరగా పద మళ్లీ యామిని వచ్చిందంటే నిన్ను పోనివ్వదు” అంటున్న నానమ్మ దయలేని మాటల మధ్య, కళ్ళు తుడుచుకుంటున్న అమ్మని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకుని, ‘ఇక్కడే వుండు బయటకు రాకు. నేను పోలేను నిన్ను చూస్తే’ అని, ఆ ఇంటి గడప దాటాను.

నానమ్మ పరమానందంతో విజయ గర్వంతో క్యాబ్ దాకా రావడమే కాదు… నడుస్తూనే అమ్మమ్మకి ఫోన్ చేసి “ఏం వదినా మహి అత్తారింటికి బయలు దేరింది.. నీ మనవరాలన్నావుగా.. తెలిసిందా ఇప్పుడది ఎవరి మనవరాలో..?” అంటోంది గొంతు విజయగర్వంతో కఠినంగా మారుతుంటే.. నా కోపపు చూపులు పట్టించుకోకుండా. నానమ్మ మొఖంలో సాడిజంతో కూడిన సంతోషం కనిపించింది. తనలాగే ఇంకో మేక కసాయి వాడి దగ్గరికి వెళుతుంటే…. బాధ కాకుండా.. రక్షించాలన్న స్పృహ లేకుండా తనలాగే అది కూడా హింస అనుభవిస్తుంది అనే ఎరుకలోంచి వెల్లువెత్తిన ఒక ఆనందం.. లేక అందరు స్త్రీలు ఇలా హింసకు అలవాటు పడిపోయి దాన్ని సాధారణమైన విషయంగానే తీసుకుంటారా… ఎంత అంటే తమలా ఇంకొకళ్ళు బాధతో విలవిలలాడుతున్నా కానీ చలించలేనంతగా.. ఏ నొప్పి లేకుండా. ఆ మగాడి దుర్మార్గానికి మౌనంతో.. సహనంతో.. అలవాటైన తనంతో లైసెన్స్ ఇచ్చే సేంతగా.. నేరస్తుడికంటే కూడా పెద్ద నేరం చేసేంతగా.. సున్నితత్వం నుంచి.. హింసించే మగాడంత క్రూరంగా తాము కూడా ఒక భయంకరమైన మెటామార్ఫాసిస్ కి లోనై పోయి? అసలు నానమ్మ మొదటి నుంచీ ఇలా ఉండి ఉంటుందా లేక పెళ్లయ్యాక తాతయ్య పెట్టే హింసలు.. అవమానాలు భరించలేక ఇలా మారిపోయిందా.. అలా ఆలోచిస్తే నానమ్మ కూడా అమ్మమ్మ, అమ్మ, తన లాగే బాధితు రాలే మరి! అసలు ఈ వ్యవస్థ ఎలా మారుస్తుంది స్త్రీలని… భర్త హింసని భరించడమే న్యాయం అని నమ్మేసేంతగా.. తమని హింసించేవాడినే.. పెత్తనం చేసే వాడినే.. ప్రేమిస్తారా… లేక నిస్సహాయంగా.. బయటపడలేక లౌక్యంగా కొద్దిపాటి హింస తగ్గించుకునేందుకు కొన్ని రాజీలు భర్తతో, తమ ఆత్మగౌరవంతో చేసుకుంటారా.. నటిస్తుంటారా.. అసలు ఏం జరుగుతుంది? కొట్టి.. తిట్టి.. దౌర్జన్యం చేసి లైంగికంగా అనుభవించే వాడినే.. తమ రక్షకుడిగా భావిస్తారా…? ఎలా సాధ్యం ఇది? మళ్ళా అదే అమ్మమ్మ ఇలా లేదు.. అమ్మమ్మ ఒక సింహం… మళ్ళా అదే అమ్మమ్మకి పుట్టిన అమ్మ.. అన్నీ భరిస్తుంది నానమ్మలాగ. కానీ అమ్మలో నానమ్మకున్న గయ్యాళితనం.. కుట్ర.. కల్మషాలు లేవు.. నన్ను ఉత్సాహంగా అత్తారింటికి సాగ నంపుతున్న నానమ్మను చూస్తుంటే నవ్వు కూడా వచ్చింది.

నానమ్మ నేను చరణ్ దగ్గరికి వెళ్ళడం తన మధ్యవర్తితనం వల్ల అని మురిసిపోతున్నది. పోబోతున్న క్యాబ్ విండోలోకి కొంగలా తల దూర్చి.. డ్రైవర్ వినకూడదన్నట్లు అత్యంత రహస్యపు మంతన మేదో మళ్ళీ చెప్తున్నట్లు “శాంతంగా ఉంటం నేర్చుకో అన్నీ అవే సర్దుకుంటాయి.. మెల్లిగా అలవాటుపడి పోతావులే.. ఏం”.. అంటోంది అత్యుత్సాహంగా.. నేనేదో అన్నిటికీ సిద్ధ పడిపోయి వెళ్ళిపోతున్నట్లు.. “ఏం అలవాటవుతాయే నానమ్మా.. ముందు నువ్వు లోపలికి వెళ్ళు” అని కసిరాను. డ్రైవర్ ఉన్నాడు కాబట్టి నానమ్మ బతికి పోయింది. లేకపోతే ఆమె ఏం అలవాటు చేసుకొని కాపురం నిలబెట్టుకుంది నిలదీసి అడిగో.. చెప్పో కడిగి పడే సేదాన్ని. అమ్మని దిగులు కళ్ళతో. కన్నీళ్ళతో చూడలేక లోపలే ఉండమన్నాను.. క్యాబ్ బయలుదేరగానే.. అమ్మమ్మకి ఫోన్ చేసి జరిగింది చెప్పాను. నేనా నిర్ణయం ఎందుకు తీసుకున్నానో కూడా చెప్పాను.. అమ్మమ్మ ఏడ్చేసింది “అయ్యో నా మహీ.. నా బంగారూ… ఏవైనా అయితే ఒక్క క్షణం ఉండబాకు వెంటనే నా దగ్గరికి వచ్చేసేయి…” అంటూ.. “ధైర్యంగా ఉండు అమ్మమ్మా… నువ్వే ఇలా అయితే ఎలా అమ్మని నాన్నని, చెల్లిని నువ్వే చూసుకోవాలిగా?” అమ్మమ్మకి ధైర్యం చెప్పాను.

ఇక ఇంటికెళ్లినా వరద గారూ… ఇంటికెల్లిన నన్ను.. యుగాలుగా మాటేసి పొంచి, పొంచి నిరీక్షించిన తరువాత ఎదుటికి వచ్చి నిలుచున్న కుందేలుని.. తినబోయే ముందరి ఆహారాన్ని ఇష్టంగా చూస్తున్నట్లు పరమానందంగా చూసాడు చరణ్. నువ్విటు రాక ఇంకెటుపోతావులే అన్నట్లు ఉంది అతగాడి చూపు. ఆ చూపులో కోడిపిల్లను ఎత్తుకు పోయే ముందరి గద్ద చూపులోని ప్రేమ ఉంది. చాలా విచిత్రంగా “తిన్నావా మహీ ఏమైనా తెప్పించనా అని అడిగాడు చరణ్. “వద్దు తినే వచ్చాను.. రేపేనా మీ చెల్లి పెళ్లి చూపులు”.. అని అడుగుతూనే నా గది వైపు నడిచాను. “అవును అమ్మాలింట్లోనే మనం వెళ్ళాలి పొద్దున్నే” అంటూన్న చరణ్ నా గది బయటే ఆగిపోయాడు. నేను తలుపేసేసుకున్నాను.

ఆ రాత్రి గది తట్టలేదు.. బూతులూ తిట్టలేదు చరణ్. ఏంటో ఈ మార్పు.. అర్థం కాలేదు. యామిని ఎలా ఉందో నేను ఇంట్లో లేకపోతే ఎలా రియాక్ట్ అయి ఉంటుందో అనే ఆలోచనలతో నిద్ర పట్టటం లేదు. రాత్రి పదకొండింటికి యామిని ఫోన్.. “హాల్లో మహీ.. హాల్లో.. ఎందుకెళ్ళావ్.. వద్దన్నానా.. వచ్చెయ్యి కమ్ బాక్” అంటూ ఏడుస్తున్నది. యామినికి నచ్చ చెప్పేసరికి అర్థ రాత్రి గడిచిపోయింది. తెల్లారింది.. చరణ్ మామూలుగానే ఉన్నాడు. అమ్మమ్మ, అమ్మా, యామిని ఫోన్స్ చేసి “ఏమాత్రం బాగాలేక పోయినా వచ్చేసేయి” అని చెప్పారు.. నేను వాళ్ళకి నచ్చ చెప్పాను. కొంచెం అయ్యాక చరణ్ వాళ్ళమ్మా వాళ్ళింటికి వెళ్ళాము నేనూ.. చరణ్. కొనబోయేముందు సంతలో బర్రెనో.. కార్ షాపులో కారునో చూడబోయే ముందరి ఆశబోతు కళ్ళేసుకుని కూర్చుని ఉన్నారు మొగపెళ్ళివాళ్లు. పెళ్లి చూపులు అయ్యాయి చరణ్ చెల్లి శరణ్యని బుట్ట బొమ్మలా అలంకరించి కూర్చో బెట్టారు “బయట ఎక్కడన్నా కేసువల్ గా కలవక పోయావా.. అంగట్లో సరుకులాగా అతని ముందు కూర్చోడం ఏంటి?” నేను అసహనంతో అడిగాను.

నేను మొండితనం చేసి చరణ్ న్ని ఒక పార్క్ లో కలిసా. “మన చేతుల్లో ఏముంది వదినా.. నాకసలు పెళ్లి ఇప్పుడే వద్దు పీజీ చేసి, పీ.హెచ్.డీ అయ్యాక చేసుకుంటా అన్నా ఎవరూ వినట్లేదు వదినా. పైగా నీ పెళ్లి.. అన్నయ్య నీతో అలా మొరటుగా చేశాక నాకు పెళ్లి అంటేనే.. సెక్స్ అంటేనే భయం పట్టుకుంది.. వీళ్ళను చూడు ఏమంటున్నారో.. పెళ్ళి చేసుకున్నాక కూడా చదువుకోవచ్చుట.. అన్నీ వీళ్ళే నిర్ణయించేస్తున్నారు. వీలవుతుందా అప్పుడు.. వీళ్లకెవరు చెప్పాలి? ఇతగాడికి నేను నచ్చాననుకో.. ఇక చేసేస్తారు. నాకు నచ్చాడా లేదా కూడా కనుక్కోరు. అయినా మొన్నో ఫంక్షన్ లో చూసాట్ట నన్ను, నేను తెగ నచ్చేసానట.. అడ్రస్ కనుక్కుని వెతికి పట్టుకున్నారు. నాకు నచ్చలేదు ఇతను.. కానీ అదెవరికి కావాలి? నన్ను త్వరగా వదిలించుకోవడమే వీళ్ళ లక్ష్యం ఇప్పుడు” శరణ్య బాధగా అన్నది. “మరి చెప్పెయ్ నచ్చలేదని. నేను మీ అన్న నచ్చకపోయినా పేరెంట్స్ కోసం మీ అన్నని పెళ్లి చేసుకుని ఎంత నరకం అనుభవిస్తున్నా చూస్తూనే ఉన్నావు కదా రేపు నీ జీవితం కూడా ఇట్లానే ఉంటుంది.. సరైన నిర్ణయం తీసుకో.. వద్దని చెప్పెయ్. యామిని కూడా ఇట్లాంటి నచ్చని రెండు సంబంధాలు వెనక్కి పంపింది” నేను శరణ్య రెండు చేతులూ పట్టుకుని చెప్పాను. ఈ లోపల అక్కడికి అత్తయ్య వచ్చింది. “పద.. వాళ్ళు ఎదురు చూస్తున్నారు’.. అంటూ “అమ్మా ఈ పెళ్లి వద్దు నాకిష్టం లేదు. నన్ను చదువుకోనివ్వు.. అబ్బాయి కూడా నచ్చలేదు నాకు. మొన్న అన్నయ్యతో వచ్చినప్పుడు చూసాను” శరణ్య తల్లిని కన్నీళ్ళతో బతిమిలాడుతూ అడిగింది..

“శరణ్యకి ఇష్టం లేదత్తయ్యా.. బలవంతం ఎందుకు చేస్తారు చదువుకోవాలని వుంది అంటుంది కదా”? నేను శరణ్య చుట్టూ చేతులు వేసి అన్నాను. “చాల్లే తా చెడ్డ కోతి వనమెల్ల చెరిచిందన్నట్లు… నీ బతుకుని గబ్బు చేసుకుంది చాలక దీన్ని పాడు చేయవచ్చావు.. నువ్వు పద ముందు మంచి సంబంధం పాడుచేయ మాక పద.. పద. అట్టా మాడు మొఖం పెట్టకు. కొంచెం ఆ కళ్ళు తుడుచుకో.. కొంచెం నవ్వి చావు.. లేకపోతే నీకిష్టం లేదనుకుంటారు” అని గద్దిస్తూ శరణ్య జబ్బ పట్టుకుని గుంజుకొని తీసుకుని వెళ్ళిపోయింది. వాళ్ళడిగిన ప్రతి ప్రశ్నకి పొడిపొడిగా సమాధానం చెప్పింది శరణ్య. ఆమె బాధ చూడలేక పోయాను వరదగారూ. చరణ్ ఇంకో నాలుగు రోజులు హుందాగనే ఉన్నాడు గబ్బు పనులేవీ చేయకుండా.. “వస్తాం.. దాని తాట వలుస్తాం శరణ్య పెళ్లి చూపులని వోపిక పట్టాం” అని తల్లి.. అక్క ఫోన్లు చేస్తున్నారు. “వద్దులే బాగానే ఉన్నాం.. ఎందుకు ఇప్పుడు.. ఆ వంట చేసుకుంటున్నాం, అబ్బా.. అవునే ఒకే రూంలో పడుకుంటున్నాము”. అని నాకు వినపడేలా చెబుతున్నాడు కావాలని.

నాలుగు రోజుల తరువాత కాఫీ తాగేటప్పుడు కిస్ చేయాలని గబుక్కున జిరాఫీలా మొఖం ముందుకు చాపడం.. వంట చేస్తుంటే.. వెనక నుంచి చింపాంజీలా వాటేసు కోవడం.. నడుము మీద చెయ్యి వేయడం మొదలెట్టాడు. ఆ రోజు గొడవేసుకున్నా నేను. నడుము మీద పడ్డ చేతిని విసిరి కొట్టి.. చూపుడు వేలితో బెదిరించి…” “దూరం.. దూరంగా ఉండు తిరిగి వచ్చానని రెచ్చిపోకు.. నీకోసమో.. నా కాపురం నిలబెట్టుకుందామనో రాలేదు.. నా చెల్లెలు యామిని కోసం వచ్చాను.. ఇలా మళ్లీ వెకిలి వేషాలు వేసావనుకో.. మరుక్షణం వెళ్ళిపోతాను” అన్నా రౌద్రంగా కంపించిపోతూ.. “అదేంటి మహీ.. మెల్లిగా దగ్గరవుదామని ప్రయత్నిస్తున్నా.. నా స్పర్శ నీకు అలవాటు చేద్దామని చూస్తున్నా మొన్న ఆ మేరేజి కౌన్సిలర్ ఇదే చెప్పాడు అయినా మనకి వేరే ఆప్షన్ వేరే ఏమయినా ఉందా..?” చరణ్ కోపంగా అంటుంటే. “ఆ మేరేజి కౌన్సిలర్ ని కూడా నాలుగు తన్ని వస్తాను. అయినా అయినా నువ్వు నన్నేం చేసావో ఆయనకు చెప్పి ఉండవు.. ఒకవేళ చెప్పినా అతను కూడా మగవాడే కదా అందుకే అలా అని ఉంటాడు. నీ లిమిట్ లో నువ్వు ఉండు.. నువ్వు నన్ను ముట్టుకోడం నాకిష్టం ఉందా లేదా అని కనుక్కోవా.. నేను నో అంటే నో అంతే” అని బెదిరించాను.. అక్కడే ఉన్న స్టూలు కాలితో తంతూ “ఛీ నా బతుకు” అని స్కూటర్ కీస్ తీసుకుని తలుపు తీసి ధడాలుమని వేసి వెళ్ళిపోయాడు. తాగి వస్తాడు.. ఇక మనిషిగా ఉండడు ఆ రాత్రికి. అసలు అతని స్పర్శ నాకిష్టమో లేదో తెలుసుకోమని ఈ మగ సెక్సాలజిస్ట్ లేదా కౌన్సిలర్ కూడా చెప్పి ఉండడు ఇతగాడికి. చాలా చిరాగ్గా ఉంది.. ఇతను మారడు”… మహిమ చెప్పడం ఆపి అలసటగా కుర్చీ వెనక్కి వాలింది.

“అసలు ఇదంతా ఎలా మొదలైంది” అని అడుగుతున్న వరద వైపు చూసి నీరసంగా నవ్వుతూ “చెప్తాను వరదగారూ.. ఇక్కడ కాదు టాంక్ బండ్ కి వెళదాము మీకు పనేమీ లేకపోతే.. నేనే మీ చివరి క్లైంట్ ని కదా” అంది మహిమ. వరద నవ్వి “పద వెళదాము” అంటూ ఎవరికో కాల్ చేసి “డియర్.. ఈ రోజు వద్దులే.. ముఖ్యమైన అప్పాయింట్ మెంట్ ఉంది బై.. గుడ్ నైట్” అంటూ.. మహిమ వైపు చూస్తూ ‘పద’ అంది. ఆమె ఎవరికి ఫోన్ చేసిందో కానీ ఆమెకి చాలా ప్రియమైన వ్యక్తి అనిపించింది. భర్తో.. ప్రేమికుడో అయ్యి ఉంటాడు. ఇద్దరూ కలిసి టాంక్ బండ్ కి బయలు దేరారు. ఈ రోజు నిన్నో కొత్త.. అద్భుతమైన చోటుకి తీస్కెళుతున్నా… వరద అన్నది మహిమతో.

“నా పేరు పరిమళ.. గాయాల్ని మళ్ళీ కెలుక్కోవడం చాలా నొప్పిగా ఉంటుందని తెలుసు. కానీ పంచుకోవడం వల్ల బలం పెరిగి ఆత్మ విశ్వాసం కలుగుతుంది.. ఒక స్పష్టతా వస్తుంది. అందుకే చెప్పాలనుకుంటున్నా. నా పెళ్లి రోజు నుంచి మొదలు పెడతాను. పెళ్లి రోజు రాత్రి బాగా అలిసిపోయాను. వొళ్ళంతా బాగా నొప్పులు. భారీ పెళ్లి పట్టు చీర కింద చాలా ఉక్కగా అనిపించింది. పొద్దుటి నుంచి చెమట బాగా పోయి నీరసం ఎక్కువైంది. పెళ్లంటే ఉన్న ఖంగారు వల్ల మూడు రోజుల నుంచి సరిగా తిననే లేదు. కన్యత్వం లేదా వర్జినిటీ అనే మాటలు ఇక్కడ వాడొచ్చో లేదో నాకు తెలీదు. కానీ తొలి రాత్రి భర్తతో గడిపే దాంపత్య జీవితం పట్ల నాకు చాలా కలలు ఉన్నాయి. బహుశా నేను చదివిన పుస్తకాలు… సినిమాల వల్ల కావచ్చు. అమాయకత్వమూ కావచ్చు.. పెళ్లి కుదిరినప్పటి నుంచీ నేను నా భర్త ప్రేమలో పడిపోయాను. అతనికి నా అందమైన దేహాన్ని కానుకగా సమర్పించాలనుకున్నా. నా శరీరం కంటే ప్రత్యేకమైనది ఏముంటుంది? పూలు.. పుస్తకాలు.. పూల పరిమళాల అత్తరు సీసాలు.. బట్టలు… పాటల కేసెట్లు.. వాచ్.. సెల్ ఫోన్.. టై ఇలా చాలా ఆలోచించాను. కానీ అన్నిటికంటే ప్రత్యేకమైంది.. అద్భుతమైంది నా శరీరం తప్ప మరింకేం ఉంటుంది? అందుకే రోజంతా చెమటలతో నాని ఎండిపోయిన ఈ దేహపు చర్మాన్ని పరిమళాల సబ్బుతోనో.. గంధపు నలుగుతోనో స్నానం చేయించి, అలసట తీరిపోయేదాక నిద్రపోయి.. మనసు, దేహాన్ని తేలికగా నా భర్తతో సంగమానికి సిద్ధం చేసుకుని.. నాకిష్టమైన రోజా రంగు చీర జాస్మిన్ సెంటు.. తలంటుకుని వదులుగా అల్లి వదిలిన వాలు జడలో ఘుమాయించిపోయే జాజి మల్లెలు పెట్టుకుని.. అచ్చం మా పెరట్లోని జాజి తీగలా అతన్ని చేరుకుని అతను దగ్గర తీసుకుంటే అల్లుకు పోదామనుకున్నా, కన్నీటితో.. ప్రేమతో.. ఉప్పొంగే ఆనందంతో అతగాడి పాదాల మీద వాలిపోదామనుకున్నా.. కానీ అలసటతో, వొళ్ళు నొప్పులతో, చెమటతో, నలిగిపోయి మరకలు పడ్డ దుస్తులతో కాదు. ఇవన్నీ సినిమాల్లో చూసిన ఊహలే ఒప్పుకుంటాను.

కానీ నాకు అచ్చంగా అలాంటి భావనలే కలిగాయి. ఇప్పుడు తలుచుకుంటే నవ్వు వస్తుంది.. సిగ్గనిపిస్తుంది. అంటే అతనితో దాంపత్య జీవితాన్ని ఎంత సున్నితంగా ఊహించుకున్నానో మీకు చెప్పడమే నా ఉద్యేశం. కానీ హడావుడిగా మొఖం కడిగించి ఏదో వంగ పండు రంగు చీర చుట్టేసింది అమ్మ. “వద్దమ్మా.. ఈ రోజు వద్దు, బాగా అలిసిపోయాను.. తల కూడా నొప్పిగా ఉంది. పైగా భయంగా ఉంది. రెండు రోజులు ఆగి అతగాడితో మాట్లాడాక, కొంచెం బెరుకు పోయాక.. ప్లీజ్ అమ్మా” అంటూనే ఉన్నాను.. బ్రతిమిలాడాను. “లేదే ఈ రోజు రాత్రే మంచి ముహూర్తం ఉంది. మళ్లీ నాలుగు రోజులకి కాని లేదు. అట్టా భయపడిపోతే ఎట్టా.. మీ అత్తగారు ఈ రోజే కానిచ్చేయమంటున్నారు నాకు తెలీదు” అమ్మ వినట్లేదు. పోనీ అతన్నే అడుగుతాను రెండు రోజులు ఆగమని. కాదంటాడా.. తన్ని ఎంత ఇష్టంగా.. ప్రేమగా చూసాడనీ? నేను గదిలోకి పంపబడ్డాను. అయిష్టంగా.. భయంగా గదిలోకి అడుగు పెట్టాను. అతను వెంటనే గదిలోపలికి తీసుకువెళ్లాడు.

అతన్నించేదో వెగటు వాసన.. తాగాడా.. ఏమో? మంచం మీద పక్కనే కూర్చోబెట్టుకున్నాడు. “నాకు బాగా లేదు, కొద్దిగా జ్వరం, వొళ్ళు నొప్పులు. కడుపులో తిప్పుతోంది ఈ రోజు వద్దు” భయం భయంగా చెప్పేశా. అప్పటికే అతని చేతులు నా నడుముని చుట్టేసాయి. “ఏం కాదు ప్రతి ఒక్కరికీ తొలిరాత్రి ఇలా భయం ఉండడం మామూలే.. ఎందుకు అలా వణికిపోతున్నావు ఏమి కాదన్నానా”? అంటూ ఇంకా గట్టిగా అదుముతున్నాడు. ఏడుస్తూ లేవడానికి ప్రయత్నిస్తున్న నన్ను రెండు చేతులతో మంచానికి అదిమిపెడుతూ “నేను నీ భర్తను, నువ్వు నన్ను నమ్మాలి నీకు నా నుంచి ఏ హానీ ఉండదు” అంటున్నాడు. “ప్లీజ్.. నాకు బాగయ్యేంత వరకూ.. స్థిమిత పడేంతవరకూ ఆగుదాం. పోనీ రేపటి వరకన్నా” అన్నాను అతని చేతుల్ని పక్కకి జరిపే ప్రయత్నం చేస్తూ. “ఇప్పటిదాకా ఆగే ఉన్నాను ఇక నా వల్ల కాదు” అంటూ అతను నన్ను ఎత్తి ఒక్క ఉదుటున మంచం మీద కూలేసాడు. అసలేం జరుగుతున్నదో మొదట నాకు అర్థమే కాలేదు. నేను పెనుగులాడ్డమే గుర్తుంది. మరుక్షణం నాకర్థం అయ్యింది నా మీద అత్యాచారం జరిగిందని. నా కాళ్ల మధ్య కత్తి దిగినట్లు అనిపించింది. బాధతో గిలగిల్లాడాను, ముడుచుకుపోయాను ఏడుస్తూ. చీర రక్తంతో తడిసి పోయింది. అతను నా వైపు చూస్తూ ఏదో ఘనకార్యం చేసినట్లు గర్వంగా నవ్వాడు. ‘నువ్వు నీ వర్జినిటీని ఈ రోజు పోగొట్టుకున్నావు చాలా హ్యాపీగా ఉంది’ అన్నాడు. నేను నొప్పి, మంట తాళ లేక రెండు కాళ్ళు ఒకదానికొకటి అదిమి పెడుతూ.. ముడుచుకుపోయి దారుణంగా ఏడ్చాను. ఇంత కాలం ఈ రోజు కోసం ఎదురు చూసాను.. ఎన్నో కలలు కన్నాను. అంత దారుణంగా మొదలై.. అంతే దారుణంగా ఎలా ముగిసిందసలు?

ఏడుస్తున్న నన్ను చూసి అతనికి కోపం వచ్చింది. అతను నన్ను రెండు చేతులతో నా భుజాలు గట్టిగా పట్టుకొని నొప్పి పెట్టేలా నొక్కుతూ… చాలా కోపంగా కర్కశమైన గొంతుతో.. “నేనేం చేశానని.. గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి నువ్వు నా భార్యవి. నాతో సెక్స్ లో పాల్గొనాల్సిందే. నువ్వేం చెయ్యాలో ఎలా ఉండాలో నేను చెప్తాను.. నువ్వు కాదు. అసలు నువ్వు తెలుసుకోవాల్సింది చాలా ఉంది”.. అంటూ తన చేతులు వదులు చేసి మంచం పైన ఒక వస్తువును కూలేసినట్లు వదిలేశాడు నన్ను.

దగ్గర కూర్చుని నా దుఃఖ భారాన్ని తగ్గిస్తాడేమో.. ప్రేమగా మాట్లాడతాడేమో నొప్పి అంత ఎక్కువగా ఉందా.. అయ్యో ప్యాడ్స్ పెట్టుకో డాక్టర్ దగ్గరికి వెళదామా అని ఖంగారు పడుతూ అడుగుతాడేమో అని ఆశపడ్డా. సిగరెట్ ముట్టించి తానే చాలా అలిసిపోయినట్లు వొళ్ళు విరుచుకుంటూ కిటికీ దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఇక తన పని అయిపోయిందన్నట్లు ఇక చేయాల్సింది ఏమీ లేదన్నట్లు. నా కన్నీళ్ళతో.. నొప్పితో.. షాక్ తో తనకేమీ సంబంధం లేనట్లు కనీసం ఇంత రక్తం పోతుందే అన్న బాధ ఖంగారు ఏమీ లేవు. ఇదే ఈ దయలేని కఠినమైన మాటలే వాస్తవాలా ఇక నుంచి…? ‘లే.. లేచి ఫ్రెష్ అవ్వు.. వాష్ చేసుకో’ అన్నాడు.. యోని చీరుకుపోయి కారుతున్న రక్తం నీళ్లతో కడుక్కుంటే పోయేదా.. ఎంత కరుణ లేని మనిషి.. నాకు దుఃఖం ఇంకా ఎక్కువైంది. మెల్లిగా లేచి బాత్ రూంకి వెళ్ళాను. అమ్మీని ప్యాడ్స్ అడిగాను. ఆమెలో ఏ ఖంగారూ లేదు చాలా మామూలుగా “ఇలానే ఉంటుంది. తొలి రాత్రి రక్తం రావడం చాలా మంచిది తెలుసా.. నువ్వు కన్యవని నీ భర్త.. అత్తింటి వాళ్ళకి నీ మీద గౌరవం.. ప్రేమా కలుగుతాయి.. పిచ్చిదానిలా ఏడవకు ఎన్నిసార్లు కూరగాయలు కోస్తుంటే కట్ కాలేదు.. రక్తం రాలేదు ఇదిగో ఈ మందు వేసుకో తగ్గిపోతుంది” అంది. ‘కూరగాయలు కోసే కత్తితో వేలు తెగడం… నా భర్త మృగంలా నన్ను రేప్ చేస్తే నా దేహం గాయపడ్డం.. అదీ.. ఇదీ ఒకటే ఎట్లా అవుతుంది?’ అని నేను కోపంగా అరిచి ఆ రాత్రి అమ్మ దగ్గరే పడుకున్నా.

ఆ రాక్షసుడు మళ్లీ రాత్రి ఏమైనా చేస్తే?.. కానీ తరువాతి రెండు రోజులూ నేను ఆ రాక్షసుడి దగ్గరికి పంపబడ్డాను. మా నాన్న అతని కంటే మరీ కిరాతకుడు… వొద్దు వొద్దు అని భయంతో ఏడుస్తున్న నన్ను చెంప మీద కొట్టాడు.. ‘కాపురం ఎలా నిలబెట్టుకోవాలో తెలీదా?” అంటూ. అమ్మీ రెక్క పట్టుకుని గదిలోకి తీసుకెళ్ళి నన్ను ఆ రాక్షసుడి ముందు నిలబెట్టింది. మటన్ బిర్యానీ ప్లేట్ తినడానికి పెట్టినట్లు. అప్పుడు.. అతను నన్ను చూసి నవ్విన నవ్వు.. భయాన్ని నా వెన్నులో పాములా పాకించింది. ఆ రెండు రోజులూ అతను నా దేహంతో.. ఆడుకున్నాడు. నొప్పి.. నొప్పి అని ఏడ్చినా వదిలి పెట్టలేదు. నాలుగో రోజు అతను వెళ్లిపోతుంటే నాకు కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేను. నాలుగో రోజు అమ్మ నన్ను గైనకాలజిస్ట్ కి చూపించింది… “ఇంత బ్లీడింగ్ అవుతుంటే ఎలా అతని దగ్గరికి పంపారసలు మనుషులేనా కాళ్ళు ఎడం చేస్తే కానీ నడవలేకపోతున్న నన్ను చూస్తూ అని తిట్టింది డాక్టర్. అమ్మ తలవంచుకుంది. నాకు ఆమె దేవతలాగా కనిపించింది ఆ క్షణం. యోని లోపల ఒక చిన్న కుట్టు వేసి, మందులు రాసి.. “ఒక నెల రోజులు రెస్ట్ ఇవ్వండి భర్త దగ్గరికి పంపకండి” అని పంపించింది. కానీ… ఇరవై రోజులు అయ్యాక “నా కొడుకు ఉండలేక పోతున్నాడని” మా అత్త వచ్చి నన్ను తీసుకెళ్లింది. అమ్మ వైపు దీనంగా చూసాను.. కళ్ళనిండా కన్నీళ్లతో. ‘కాపురం నిలబెట్టుకోవాలి తల్లీ’ అంది తానూ ఏడుస్తూ… “జాగ్రత్త వదినా ఇంకా వేసిన కుట్టు ఆరనైనా లేదు” అమ్మ దీనంగా.

“చాల్లే వదినా నా కొడుకేదో రాక్షసుడు అన్నట్లు మాట్లాడుతున్నారు.. ఎంత ప్రేమగా చూసుకుంటాడో మమ్మల్ని.. నీ అమ్మాయిని కూడా అంతే ప్రేమగా చూసుకుంటాడు.. మీ అమ్మాయికే కన్నె పొర మరీ సున్నితంగా ఉన్నట్లున్నది ఇలా ఉంటే ఎట్టా.. ముందు ముందు పురుళ్ళూ.. కోతలూ అవీ ఉండవూ మరి” అన్నది. “రాక్షసుడు కాదా…. నాకు ఆశ్చర్యం వేసింది. మా అత్తయ్య మాటలతో నాకు వణుకు పుట్టింది.. పురుళ్లు సరే.. కోతలేంటి నాకేనా? నా అత్త గారింట్లో ఆ రాక్షసకాండ మళ్ళీ మొదలైంది. నా వైవాహిక జీవితంలో శృంగారం అలా మొదలైంది. నా హృదయం బద్దలైంది. నా హృదయంలో ఎన్నో ఆలోచనలు, ప్రశ్నలు వెల్లువై పోటెత్తాయి. అందరు భార్యలకు ఇలానే ఉంటుందా.? లేక నాకేనా? అయినా నేను నా తొలి రాత్రిని ఇంత నొప్పి.. అవమనాలతో ఎందుకు పాడు చేయించాను? తొలి రాత్రి నాది కూడా కదా.. నాకూ ప్రత్యేకమైంది కదా.. అంత భయంతో భయంకరంగా ఎందుకు గడిచింది? నేను ఎంతో ప్రేమించిన నా భర్త ముట్టుకున్న.. ఈ శరీరం ఇంతగా మైలినపడ్డట్లు ఎందుకు అనిపించింది.. అతను నన్ను ముట్టుకున్నాడా.. ఆ స్పర్శలో లాలిత్యం ఏదీ? నా శరీరం మీద ఒక కత్తి వేటు పడ్డట్లుగా ఎందుకు అనిపించింది? అతను నా మీద దాడి చేశాడు. అత్యాచారం చేశాడు. తాను వద్దు అని కాళ్లా.. వేళ్ళా పడ్డప్పటికీ… “ఎందుకు ఎప్పుడూ వద్దు వద్దంటూ విదిలించికుంటుంటావు.. ఏడుస్తావు? సెక్స్ చేసేటపుడు అస్సలు సంతోషంగా ఎందుకు ఉండవు” అంటూ సెక్స్ చేసేముందు ప్రతీసారీ అతను నన్ను కసురుకునేవాడు. “నీ ఏడుపుతో నీ దగ్గరికి ఆనందంగా రాలేకపోతున్నా.. నా కోరిక చచ్చిపోతున్నది. నేను కోరుకున్నట్లు మంచం మీద ఎందుకు ఉండవు? చాత కాదా నీకు.. ఎలా ఉండాలో నేను నీకు చెప్తున్నా నేర్చుకోవెందుకు..?” ఊపిరి ఆడనీయకుండా తన భారీ దేహాన్ని నా ఛాతీ మీద వొత్తుతూ.. వేడి ఆవిర్లను నా మొఖం మీద వదులుతూ అంటాడు లేదా.. ఎక్కడంటే అక్కడ ధాటిగా చేతులేస్తూ.. అంటాడు. నా ఉపిరాడనితనాన్ని లెక్క చేయనితనంతో. “సెక్స్ లో నువ్వు నాకు సహకరించకపోతే బాగుండదు.. నీలా ఏ భార్యా ఉండదు మంచి భార్యకుండాల్సిన ఒక్క లక్షణమూ లేదు నీకు,” చిరాగ్గా కోపం అదిమి పెడుతూ అంటాడు. మరి నిజంగానే నేను అందరి భార్యల్లా లేనా? లేకపోతే.. ఎందుకు లేను? అందరి భార్యల్లా.. మంచి లక్షణం అంటే నాలా పెనుగులాడకుండా లోంగిపోయే వాళ్లా.. తమ నొప్పిని భర్త సుఖం అనుకునే వాళ్ళా.. నేనలా లేను? ఎందుకింతలా ఓడిపోయాను? ప్రతీ రాత్రీ ఓడిపోతున్నా. అతన్నెందుకు పెళ్లి ముందరి ఊహల్లో ప్రేమించినట్లు.. పెళ్లికి తర్వాతి వాస్తవంలో ప్రేమించలేకపోతున్నా? అతన్ని తలుచుకున్నంత మాత్రాన్నే ఈ వెగటు భావన ఎందుకు కలుగుతోంది? అతని కింద నన్ను పరుపులా అదిమేసే అతని బలవంతపు స్పర్శ.. తనను సముద్రాలకవతలంతటి దూరాలకి విసిరేస్తుందెందుకు? ఒక క్షణపు సామీప్యత కూడా లేదెందుకు తమ మధ్య? ఒక్కసారి కాదు ఇలా చాలాసార్లు అనిపించేది.

ఎక్కడో ‘నాకు నీతో సెక్స్ వద్దు..’ అని తిరస్కరించడం మానేసానా అనిపించేది. అయినా నా తిరస్కారానికి ఒక విలువ.. గౌరవం ఉన్నాయా.. అనిపించేది. చాలా సార్లు ప్రతిఘటించిన ఫలితం లేక పోయేది. నా దుఃఖం, బాధ, ప్రతిఘటన అతనిలో అహాన్ని ఎక్కువ చేసేవి. బహుశా అతనికి నేనొక విచిత్రమైన భార్యను కాబోలు. నేనెందుకిట్లా ప్రతిఘటిస్తున్నానో అని ఆశ్చర్యపోతుండచ్చు అతని లెక్కల్లోకి నేను రాను. బహుశ అతను భార్యలు ఎలా ఉండాలో నాకు నేర్పిస్తూ నాకు తానొక ట్యూటర్ లాగా విర్ర వీగుతుండొచ్చు కూడా. అసలు ఈ లోకంలో అందరు భర్తలూ అంతేనేమో.. పెళ్ళైన మరుక్షణం నుంచీ భార్యలను తమకు కావలసిన విధంగా తయారు చేసుకొంటూ ఉంటారు కాబోలు. నాన్న, అన్నయ్య, బాబాయ్, మామయ్య, తమ్ముడు, పెదనాన్న రేపు తనకు కొడుకు పుడితే వాడూ… అంతేగా. ప్రతి రోజూ నాకు నా పడక గదిలోనుంచి.. ఆ ఇంటిలో నుంచే ఎక్కడికైనా వెళ్లిపోవాలి అనిపించేది. ఇంకెక్కడో నేనొక్కదాన్నే ఉండే స్థలంలో.. అది నీటి చుక్క కూడా దొరకని ఎడారి అయినా కానీ.. మాయమైపోవాలి. ఇలా ప్రతిరోజూ పెనుగులాటల, అణిచివేతల, లొంగుబాటుల ఓటమిలో కృంగి కృశించడం కంటే.. మరణంతో అంతమైనా అదృశ్యమైనా ఫరవాలేదు. ఈ ఇల్లు వద్దు.. అతను వద్దు. అతనికి ప్రతీ రోజూ సెక్స్ కావాలి. నేను సిద్ధంగా ఉండాలి. అతడు నా మీదకి ఎక్కి స్వారీ చేస్తున్నప్పుడల్లా ఒక యాజమాని తన బానిస గుర్రాన్నో.. మేకనో స్వారీ చేస్తూ తనకు కావాల్సిన దిశలో తోలుకెళ్తున్నాడనిపించేది. ఆ క్షణాల్లో నేను అతనితో ఉండేదాన్ని కాదు. అతన్నుంచి విడిగా ఎక్కడికో వెళ్లిపోయే దాన్ని. అక్కడ అతను ఉండడు. నేనొక్కదాన్నే నా సమస్తాన్నీ.. నా దేహాన్ని గౌరవంగా కాపాడుకుంటూ.. నేను.. నేను మాత్రమే ఉంటాను. కానీ అలా ఎప్పుడూ జరగలేదు. నాలోకి దిగబడ్డ కత్తిలా.. నాలోనే ఉన్నట్లు ఉంటాడు అతను. చాలా సార్లు కొన్ని విచిత్రమైన కలలు వచ్చేవి. నేను నా దేహాన్ని అతనికి దొరక్కుండా ప్రాణం ఉండగానే సమాధి చేసేస్తాను. అతను పిచ్చ కోపంతో.. గునపంతో సమాధిని పెళ్లగిస్తూ ఉంటాడు. కానీ ఎంతకీ నన్ను తవ్వి తీయలేడు.. ఇంకో కలలో మలినమై పోయిన నా దేహాన్ని టన్నుల కొద్దీ గులాబీ పూలతో కప్పేసుకుంటాను. గులాబీ కొమ్మలకున్న ముళ్ళు గుచ్చుకుని రక్తం కారుతున్నా బయటకు రాను.. ఆ నొప్పి హాయిగా ఉంటుంది. కానీ ఏమీ అలా జరగనే లేదు. కాలం ఇలానే గడిచిపోయింది. అతని అసంతృప్తి ఇలానే పెరుగుతూ పోయింది. మంచం మీద నేను అతనికి పూర్తి సంతృప్తిని ఇవ్వలేక పోతున్నా అని అతని నిట్టూర్పులు..

గడిచిపోయాయి. పిల్లలు పుట్టేసారు వరుసగా. అతను సున్నితంగా మారనే లేదు. మా మధ్య శృంగారం కూడా ఉన్నతంగా మారలేదు. ఇక ఎన్నటికీ మారదు కూడా. అంతా బలప్రయోగాలే.. నిశబ్ద లొంగుబాట్లే. అతనికి కావాల్సిన విధంగా అతన్ని సంతోషపెట్టడం ఎలానో నేను నేర్చుకొనే లేదు ఎందుకంటే అతన్ని సంతోష పెట్టటం అనేది నా దేహాన్ని.. జీవితాన్ని పూర్తిగా అగౌరవ పరచడమే కాబట్టి. అతని వికృతమైన కోరికలకు నా శరీరాన్ని కంచంలో పెట్టి ఇవ్వడం లాంటిది. అతను నా వంటి మీద చెయ్యేసిన ప్రతిసారీ నాకు నా తొలి రాత్రి నన్ను చేసిన రేప్ గుర్తుకు వస్తుంటుంది.

“సరే.. ఆఖరికి ఏమైందంటే.. అతను తనకు కావలసి వెతుక్కున్నాడు. అతడు నా నుంచి వెళ్ళిపోయాడు. చాలా దూరాలకు.. దాంపత్యపు కత్తి మొన మీద నేను రక్తాలు కారుతున్నా అలానే నిలబడి అతనికి ప్రేమని, గౌరవాన్ని నిబద్ధతతో ఇవ్వగలిగాను. అసాధారణ శృంగారం తప్ప అతనికి భార్యగా అన్ని సేవలూ చేశాను.. నా నుంచి అతను సమస్తాన్ని అనుభవించాడు. లాక్కున్నాడు… బదులుగా నాకు ఏమీ ఇవ్వలేకపోయాడు. ఇప్పుడు ఈ వయసులో ఆలోచిస్తుంటే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంటుంది. సెక్స్ కి వద్దు అంటే వద్దు అనే అర్థమే వస్తుందని.. వద్దన్నాక కూడా చేసేది భర్త అయినా అది రేప్ మాత్రమే అన్న ఒక కనీస అవగాహన నాకెందుకు ఇంతాలస్యంగా కలిగింది? నా భర్త నన్ను ప్రతీ రాత్రి రేప్ చేస్తున్నాడని అమ్మకో.. నాన్నకో పోనీ పక్కింటి ఆంటీకో చెప్పినా నమ్ముతారా వాళ్ళు..? అది పక్కన పెడితే నా భర్తకే నువ్వు నాతో చేస్తుంది శృంగారం కాదు.. రేప్ చేస్తున్నావు అంటే వొప్పుకుంటాడా.. ఊరుకుంటాడా? అమ్మా.. పిన్ని.. పెద్దమ్మ.. మా అత్తయ్య ఎవరికి చెప్పినా పిచ్చెక్కి వాగుతున్నావంటారు కదా.. భర్త రేప్ చేయడమే సంసారం అనుకునే పిచ్చి తల్లులేమో వాళ్ళు… పైగా నేను నా భర్తకి, అత్తవారింటికి చెడ్డ పేరు తేవడానికి, అప్రదిష్టపాలు చేయడం కోసం బరితెగించింది అనరూ… మా నాన్న అయితే… ఇంత వయసు వచ్చినా అడ్డంగా నరికేస్తాడు. నాకేమనిపిస్తుందంటే.. భర్త అనే నేరసుణ్ణి ఈ రేపిస్టుల జాబితాలో తీసుకు రాకుండా ఉండడానికి కుటుంబంలో ఉండే అందరూ ప్రాణ త్యాగాలు చేసైనా ప్రయత్నం చేస్తుంటారు. అమ్మ నుంచి నాన్న.. ఆడబిడ్డల నుంచి అత్తల దాకా భర్తలు రేపులు చేయడానికి అనుమతులు.. అవకాశాలు ఇచ్చేస్తుంటారేమో కదా. ఈ దాచేయటాల్లోనే అసలు రేపన్నది ఎంత హింసాత్మకమైనది అన్న విషయం మరుగున పడిపోతుంది అనిపిస్తుంది.. మీకూ అదే అనిపిస్తుంది కదా నాకు తెలుసు. కానీ ఒక వాస్తవం ఏమిటంటే.. నేను కూడా ఎప్పటికీ నా భర్తతో “నీతో ఏ వికారాలు.. మోహం.. కోరికా లేకండా శృంగారం చేయగలను.. ఇష్టమే” అని చెప్పలేను గాక చెప్పలేను.

ఎందుకంటే నేను కూడా ఏవో కనిపించని సంకెళ్లతో బంధించబడి ఉన్నాను. బహుశా.. నా పిల్లలు.. అమ్మా, నాన్నా పరువు లాంటివి కావచ్చు. నా భర్తతో శృంగారంలో అంటేనే ఒక చేదు మాత్ర మింగటం లాంటిది. ఇక ‘నో’ అని చెప్తూనే భరిస్తూ వచ్చింది ఏంటి మరి ఇన్నాళ్లూ..? రేప్ కాదా అది? రేప్ అని కాకండా ఇంకేమిటి అంటారు దాన్ని? ఇప్పుడు నా పిల్లలు పెద్దగైపోయారు. ఇప్పుడు నా భర్తకు, నాకూ ఏ సంబంధమూ లేదు. ఆయన రెండో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆమె దగ్గరే ఉంటాడు. అందుకే నేను సురక్షితంగా ఉన్నాను. ఆమెతో అతనెట్లా ఉంటాడు.. నాతో ఉన్నట్లే ఉంటాడా.. ఏమో తెలీదు. ఇప్పుడు నేను స్వేచ్చగా ఉన్నాను. నాకు అసలు వద్దంటే వొద్దు అని నేను బలంగా కోరుకున్నది నా భర్తతో సెక్స్ ఒక్కటే. అది నాకు అతనే విడిపోవడం వల్లనో.. నేనే వొద్దనుకోవడం వల్లనో మొత్తానికి దొరికింది. అదే చాలు నాకు. నా భర్త నా విడాకులకు చెప్పిన కారణం ఒక్కటే. “దీనికి మొగుణ్ణి సుఖ పెట్టడం రాదు.. ఒట్టి ఏడుపు మొఖంది, సెక్స్ కి పనికి రాదు” అని. కానీ నిజంగానే ఇప్పుడు నేను నిజంగా సుఖపడుతున్న సంగతి అతనికెవరు చెప్పాలి? నిత్యం రేప్ జరగని మంచం మీద సుఖంగా పడుకుంటున్నానని అతనికి ఎవరు చెప్పాలి.. నా కలల్లో ఇప్పుడు గులాబీలు.. మైదానాలు తప్ప గుచ్చే ముళ్ళు రావని ఎవరు చెప్పాలి.. నా దేహంలో అతను గుచ్చి పెట్టిన కత్తిని నేనే పెకిలించి అవతల పడేసానని ఎవరు చెప్పాలి?

పరిమళ ఆగిపోయింది. ఒక ప్రవాహం ఆగిపోయింది. పరిమళ చెప్తున్నదంతా రాసుకుంటూ ఉన్న మహిమకి అంతా కొత్తగా ఉంది. తన బాధలు, అనుభూతులూ.. కష్టాలు అన్నీ నవలగా రాయాలి అనుకుంది మహిమ. డైరీలో రాస్కోడం తప్ప ఇలా పది మంది ముందు ధైర్యంగా ఏనాడూ మాట్లాడలేదు. చరణ్ ముందు, అత్తింటి వారందరి ముందు.. అమ్మ నాన్నలు.. నానమ్మతో శివంగిలా నిలబడి మరీ ప్రతిఘటించింది కానీ.. ఇప్పుడు ఇదొక కొత్త అనుభవం. ఇక్కడ తనలాంటి బాధితురాళ్ళ మధ్యన ఉండి వినడం ఏదో మమేకతా భావనను ఉద్వేగాన్ని కలిగిస్తున్నది. సంవేదన.. సహా అనుభూతి కలిసి కురిసిన కన్నీరు ఆమె చెంపలను వెచ్చ పరుస్తున్నవి. ఎక్కడో గాయం మానుకుంటున్నట్లు.. శిలలా మారిన హృదయం ద్రవించిపోయి కరుగుతున్న అనుభూతి. ‘స్ట్రాంగ్ వుమెన్ ఫైట్స్’ (ఎస్.డబ్ల్యూ. ఎఫ్) సంస్థ అది. కేవలం పెళ్లి అయిన స్త్రీలు భర్తలు చేసే లైంగిక అత్యాచారాలు.. హింసలను ఎదురుకొంటూ ఎలా బయటపడాలో.. పడ్డారో చర్చించుకునే తావు అది. అక్కడ వరదే లాయర్.. ఇంకా కొందరు హక్కుల, మహిళా సంఘం సభ్యులు ఉన్నారు. వాళ్ళూ బాధితులే. అక్కడ డా. సబిత గైనకాలజిస్ట్ తన దగ్గరికి భర్తల వల్ల లైగింక అత్యాచారాలు ఎదుర్కొంటూ వచ్చే స్త్రీలకు ఎస్.డబ్ల్యూ. ఎఫ్ సంస్థ అడ్రెస్ ఇస్తుంది. భర్తలు పెట్టే లైంగిక హింసను భరించాల్సిన అవసరం లేదని చెప్తుంది. ఆ భర్తలను పిలిపించి బాగా బుద్ది చెప్పడమే కాదు ఆ బాధిత స్త్రీలకు కౌన్సెలింగ్ చేసి భరోసా ఇస్తుంది. మహిమ ఆమెను పరిచయం చేసుకుంది. ఇదో కొత్త ప్రపంచం.

అంతా పరిమళ చుట్టూ చేరి మాట్లాడుతున్నారు. “మహిమా ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చానో తెలుసా నీకు.. నువ్వొక దానివే ఇలాంటి సమస్యలతో లేవని.. నీకంటే దారుణమైన జీవితాలతో ఘర్షణ పడుతున్నవాళ్లు.. ఆ సవాళ్లని గెలిచి నిలిచిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారని.. నీకు తెలియడం కోసం. నువ్వొక స్థిరమైన నిర్ణయం తీసుకోవాలి.. అది నీ ఆత్మ గౌరవాన్ని పెంచేదిగా ఉండాలి. పైగా నువ్వొక రచయిత్రివి. నీ ఆత్మ కథనే నవలగా రాయాలని అనుకుంటన్న దానివి. వీళ్ళందరి అనుభవాలు నీ ఆలోచనలను.. విశ్లేషణా సామర్థ్యాన్ని విస్తృత పరుస్తాయి.. సరి అయిన నిర్ణయం తీసుకోగలుగుతావు.. వీరందరి కథలు రాస్తే అది ఈ సమాజానికి ఒక గొప్ప కాంట్రిబ్యూషన్ అవుతుంది. ఇటువంటి వస్తువులతో సాహిత్యం చాలా తక్కువగా వచ్చింది.. నువ్వు రాయాలి అన్నది వరద. మహిమ సాలోచనగా తల ఊపుతూ వరద వైపు కృతజ్ఞతగా చూసింది. పరిమళను చూస్తుంటే తనను చూస్తున్నట్లే అనిపిస్తుంది. కానీ తాను పరిమళ భరించినంతగా భరించదు.

(ఇంకా వుంది…)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

One thought on “విత్ యువర్ పర్మిషన్ (Marriage is not an excuse to Rape)- 2

Leave a Reply