విత్తులు

ఎన్నుకున్నందుకు యేకంగా దేశాన్నే వాళ్ళ చేతుల్లో పెట్టేశామని అనుకున్నారు నాయకులు!

వాళ్ళు అలవాటుగా గోతులు తవ్వారు! గోతులంటే పాలన అని, అభివృద్ధి అని పర్యాయపదాలు వుపదేశించారు!

గోతులు తవ్వేదెందుకూరా అంటే పైకి వచ్చేటందుకురా- అని కూడా సెలవిచ్చారు!

‘దేశమా?, యిది యేమన్నానా…’ అంటే ‘మా జాగీరు, మేం గోతులు తవ్వితీరుతాం’ అన్నారు! ‘మీ గొయ్యి కూడా మీరు తవ్వుకోండి’ అని అన్నారు! ‘మీ కోసమే మేం గోతులు తవ్వుతున్నాం’ అని కూడా అన్నారు! అంతా కలిసి రావాలని పిలుపునిచ్చారు!

‘గోతిలో పడితే మళ్ళీ మేం పైకి యెలా వస్తాం?’ అని అడిగితే, ‘చూశారా… మీకప్పుడే పైకి రావడం అనే ఆలోచన వచ్చింది… గొయ్యి తవ్వడం వల్లే పైకి రావడం సాధ్యం’ అని ఛాతీ వుప్పొంగించారు!

‘మీ గోతుల్లో మీరు స్వేఛ్చగా తిరగండి’ అన్నారు! ‘మీ గోతుల్లో మీరు స్వతంత్రంగా బతకండి’ అన్నారు! ‘మేం కప్పెడతాం’ అన్నారు! కాదనడానికి లేదన్నారు! సంస్కరణ అన్నారు! చట్టం కూడా తెచ్చారు!

లెక్క చెయ్యకపోవడంతో లెక్క తేల్చాలనీ అనుకున్నారు!

తిరస్కరణకు దేశ బహిష్కరణ అన్నంత బాధ పడ్డారు!

దాంతో వేగుల్ని వదిలారు!

వెన్నువంచి మన్నుని వెన్న చెయ్యడం చూశారు వేగులు! ఆ వెన్నెముక దేశ జెండాకర్రకు దీటుగా నిటారుగా నిలబడి వుండడం రాజ్యద్రోహంగా గుర్తించారు! గోసి గుడ్డని జెండాకు పోటీగా యెగురవేస్తున్నారని అది దేశభక్తి రహితమని భావించి నిఘా పెంచారు!

మన్నుకీ మిన్నుకీ సంబంధం కలపడాన్ని కూడా కనిపెట్టారు! తమ అధీనంలో లేకపోవడానికి అదీ వొక కారణం అయివుండొచ్చు అని నమోదు చేసుకున్నారు!

మట్టిలో తడిసిన చెమట పచ్చదనం పరుచుకోవడం చూశారు! దేశ జెండాని సహితం ఆక్రమించారని బలాన్ని అంచనా వేశారు!

పిడికెడు విత్తులు విసిరి బస్తా భుజానికి యెత్తుకోవడం చూసి కళ్ళు పులుముకున్నారు! వీళ్ళ దమ్మూ ధైర్యం తమ అదుపులో వుండాలని అప్పుడే వారి విధేయత సానుకూలత సాధ్యమవుతుందన్న సంకేతాల్ని పంపారు!

మన్నులోంచి అన్నం తీసే మహిమలు చూశారు! అన్నం తిన్న వేగులు  అసిద్దం తిన్న వాళ్ళకోసం పనిచేయడం తమ వృత్తి ధర్మమని సరిపెట్టుకున్నారు!

తిన్న యింటి వాసాలు లెక్కపెట్టారు! ఇంటి వాసాలు ఆయుధాలుగా తోచాయి! పార, కొడవలి, బొరిగె, గునపం… సమస్తం ఆయుధాలుగా సాయుధులుగా పేర్కొని నివేదికలు పంపించారు!

ఎద్దుతో పొద్దుతో మాట్లాడడమూ గమనించారు! రహస్య భాషల సంకేతాలు తెలుసని కూడా గుట్టుగా గూఢచారులు సమాచారం చేరవేశారు!

మట్టిని నాగళ్ళతో దున్నుతుంటే పెళ్ళగిస్తున్నది భూమినో తమ అధికారాన్నో వొక పట్టాన అంతుపట్టలేదు!

విత్తులు చూస్తే కత్తుల్లా కనిపించాయి!

‘అసాధ్యులు… గోతుల్లోకి దిగేలా లేరు’

తేలిపోయింది!

‘యవ్వారం… యాపారం సాగేలా లేదు’ 

తేటతెల్లమయిపోయింది!

గోతుల్లో దిగకుండా రోడ్డెక్కారు! రాజధాని పట్టారు! వేలూ లక్షలు! అన్ని దారులూ యిరుకయిపోయాయి!

సింహాసనం మీద కూర్చున్నవాళ్ళకి వూపిరి సలపలేదు!

అప్పటికీ నడిచిపోతున్న వాళ్ళ కాలికింద మట్టిని తీసి పరిశోధనలకు పంపుతూనే వున్నారు!

మరోపక్క రక్షక భటుల్ని మందలకి మందలు దించారు!

ఇనుప కంచెల్ని అన్ని తోవల వెంట పరిచారు! అడ్డంకి పెట్టారు! సిమెంటు దిమ్మలు పాతారు! వాహనాల్ని దింపారు! యంత్రాంగాన్ని దింపారు! మంత్రాంగం చేశారు!

తూటాలూ తుపాకులూ మరఫిరంగులూ ఆకాశ విన్యాసాలూ సముద్ర నౌకాయానాలూ ఆయుధ ప్రదర్శనలూ కవాతులూ గాల్లోకి కాల్పులూ విద్యలన్నీ వెదచల్లారు!

‘ప్రకృతితో మెలగడం తెలిసిన వాళ్ళం… ప్రభుత్వంతో ప్రవరించడం తెలీదా?’ అన్నట్టు బుద్ధిగా లక్ష్యం దిశగా పడ్డవి అడుగులో పిడుగులో తెలీలేదు!

లాఠీలు నెత్తురు చూశాయి!

తుపాకులు గాల్లో పేలి భయపెట్టాయి!

భాష్ప వాయువులు పొగమంచులా ఆవరించాయి!

చిన్నా పెద్దా ముసలీ ముతకా ఆడా మగా తేడా లేదని రుజువయిపోయింది!

మూడు పక్షాలుగా ముగియని యుద్ధం! ఏడాదిన్నర వాయిదా యెత్తుగడకు లొంగలేదు! వొంగలేదు! వెనుదిరగలేదు!

‘లేదు… లేదు… వీళ్ళ వెనుక పాకిస్తాన్ వుంది!’

పంటచేను నవ్వింది!

‘లేదు… లేదు… వీళ్ళ వెనుక చైనా వుంది!’

పైరుకంకి నవ్వింది!

‘ఇదంతా ఖలిస్తాన్ వుద్యమ కుట్ర’

పాలపిట్ట నవ్వింది!

‘ఐఎస్ఐ హస్తం దాగివుంది’

పూల చెట్టు వూగింది!

‘ఉగ్రవాదులు’

గాలి గలగలమని నవ్వింది!

దేశ జెండా యెగిరింది!

పక్కనే జెండాలోంచి జారిన పత్రహరితం రెపరెపలాడింది!

తల మీద తలపాగా దేశ భవిష్యత్తులా కుదురుగా కూర్చొని వుంది!

ఆరాలు… నేరాలు… హెచ్చరికలు… ఆరోపణలు… శిక్షలు… కుట్రలు… కుతంత్రాలు… యుద్ధాలు… వొకటేమిటి అన్నీ తినే అన్నం మెతుకు మీద చూపున్న వాళ్ళకి అగుపిస్తూనే వున్నాయి!

గోసి జెండానే!

గొంగడీ జెండానే!

దండం పెట్టి మంత్రదండం మడిచి పెట్టుకోక తప్పదని అర్థమయ్యింది! గోతులు తవ్వడానికి లేదని, తవ్విన గోతులు పూడ్చి పెట్టాల్సిందేనని బోధపడిపోయింది!

పూడ్చిన మట్టిలోంచి లేచిన మొలక అచ్చం మనిషిలానే రెండు చేతులూ పిడికిళ్ళు బిగించినట్టు పచ్చగా నిలబడింది!!

పుట్టింది శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ. నివాసం హైదరాబాద్. చదివింది ఎం.ఏ తెలుగు, ఎం.ఏ పాలిటిక్స్. వృత్తి -ప్రవృత్తి రచనే. నాలుగు వందల కథలు, వంద జానపద కథలు, పాతిక వరకూ పిల్లల కథలు రాశారు. కథా సంపుటాలు: రెక్కల గూడు, పిండొడిం, దేవుళ్ళూ దెయ్యాలూ మనుషులూ, మట్టితీగలు, హింసపాదు, రణస్థలి. జానపద కథా సంపుటాలు: అమ్మ చెప్పిన కథలు, అమ్మ చెప్పిన కయిత్వం, అనగనగనగా, పిత్తపరిగి కత, అనగా వినగా చెప్పగా, ఊకొడదాం. అల్లిబిల్లి కథలు పిల్లల కథా సంపుటం. ఒక్కో కథా ఒక్కో పుస్తకంగా వచ్చిన మరో పన్నెండు పుస్తకాలూ- ఇంకా జాతీయాల మీద వచ్చిన పురాణ పద బంధాలు, పిల్లల సమస్యల మీద వచ్చిన ఈ పెద్దాళ్ళున్నారే వంటి పుస్తకంతో ఇరవైయ్యేడు వచ్చాయి. కొన్ని కథలు హిందీ, అస్సామీ, బెంగాలీ, కన్నడ భాషల్లోకి అనువాదమయ్యాయి.

బాసలో ‘కతలు కతలు’, మాతృకలో ‘కతలు వెతలు’, సారంగలో ‘మహారాజశ్రీ’ ‘కరోనా కహానీలు’, విరసం డాట్ ఆర్గ్ లో ‘మెయిల్ బాక్స్’ ‘బుర్ర తిరుగుడు కథలు’, మనంలో ‘వాట్సప్ కథలు’, రస్తాలో ‘ఈ పెద్దాళ్ళున్నారే’ కాలమ్స్ కు తోడుగా ‘కాదేదీ కథకనర్హం’ కొలిమి కోసం ప్రత్యేకం.

Leave a Reply