విత్తనాలు

ముందు నువ్వు
ఈ నేలను అర్థం చేసుకోవాలి
ఈ చరిత్రను అర్థం చేసుకోవాలి.

నీవు మదురోను
అర్థం చేసుకోవాలంటే
బంధించిన తీరును
అర్థం చేసుకోవాలంటే
అంతకుముందు
సద్దాంను అర్థం చేసుకోవాలి
అంత మొందించిన తీరును
అర్థం చేసుకోవాలి
వాళ్ళ కాళ్ళ కిందనేలను
నేలలోపారుతున్న
సహజ సంపదను
అర్థం చేసుకోవాలి
పెట్రోల్ మీద కన్నేసిన
డేగ కన్నును తెలుసుకోవాలి
కన్నుల్లో దాగివున్న
కరుకు కత్తుల కాఠిన్యాన్ని తెలుసుకోవాలి

నువ్వు ఆలెండీని
అర్థం చేసుకోవాలంటే
బంధించిన తీరును
అర్థం చేసుకోవాలనుకుంటే
అంతకుముందు
వియత్నాంను అర్థం చేసుకోవాలి
నిర్బంధ రీతుల్ని, క్రూర శక్తుల్ని అర్థం చేసుకోవాలి

నువ్వు అమెరికాని
అర్థం చేసుకోవాలనుకుంటే
అంతకుముందు
రెడ్ ఇండియన్లను
అర్థం చేసుకోవాలి
వాళ్ల సమాధుల మీద
అమెరికన్లు
పునాదులు ఎట్లా లేపారో
అర్థం చేసుకోవాలి

సామ్రాజ్యవాదానికి విత్తనాలు
ఎప్పుడు, ఎవరు, ఎక్కడ చల్లారో
దోహద పడ్డ శక్తులేవో
తెగిపడ్డ తలలేవో
మూగబోయిన గొంతులేవో
తల్లుల గర్భశోకమెంతో
తెలుసుకోవాలి
నువ్వు
ఈ భూమిని తెలుసుకోవాలి
ఈ చరిత్రను తెలుసుకోవాలి

జననం: మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల. విశ్రాంత ఆంగ్లోపన్యాసకుడు. కవితా సంకలనాలు: పాట సంద్రమై(2008), కాలిబాట(2014), నదిలాంటి మనిషి(2018). కథా సంకలనాలు: అమ్మను చూడాలె(2006), ఆఖరి కుందేలు(2011), దోసెడు పల్లీలు(2017). నాటకం: నేను గౌరీ(2017).

Leave a Reply