వారు మన ఆందోళనే కాదు, మన భరోసా కూడా

ఇద్దరు కవులు మృత్యువుకు అభిముఖంగా నడుస్తూ జీవితం గురించి సంభాషిస్తున్నారు. సూర్యుడూ, వెన్నెలా చొరబడని ఉక్కుగోడల మధ్య కవిసమయాల్లో స్వేచ్చను ఆలపిస్తున్నారు. ఆ ఇద్దరు తెలుగు కవులు మరాఠా కారాగారంలో దేశరంగస్థలంపై కొత్త కాస్ట్యూమ్స్ తో పునరావిష్కృతమవుతున్న పీష్వాల చరిత్రను వ్యాఖ్యానిస్తున్నారు. అణ్వాయుధాలు, అపరిమిత బలగాలుగల రాజ్యంతో వేళ్ళు కూడా ముడవలేని స్థిలో ఒకరు, ముదిమి వయసులో ఒకరు యుద్ధం చేస్తున్నారని విని ప్రపంచం విస్తుపోయి చూస్తున్నది. అవును, సాయిబాబా, వరవరరావు గురించే నేనంటున్నది. ఇద్దరూ మాహారాష్ట్రలోని వేర్వేరు జైళ్లలో బందీలై ఉన్నారు. ఇద్దరూ కలిసి సాహసోపేతమైన కవి సమయాలను ఆవిష్కరిస్తున్నారు. సాయిబాబాకు తనను బంధించిన అండా సెల్ ఒక పునరావిష్కరణ. ఆయన యోధుడైన కవిగా రూపొందారు. వివి అంటాడు –

“అండం నుంచి వచ్చిన ఆకారాన్ని
మళ్లీ అండంలోకి దూర్చేది రాజ్యం
నువు బద్దలు కొట్టుకుని వచ్చిన
అండంలోకి మళ్లీ భద్రంగా
‘ జనని గర్భంలో
ఆకారం లేకుండా నిద్రిస్తున్న
అహంకారం ‘
అస్తిత్వమై వ్యక్తిత్వమై
చైతన్యమై
విస్తరించే వేళ
నిన్ను బయటి జైలు నుంచి
అండా సెల్ లోకి తోస్తుంది .. “

జనని గర్భంలో రూపొందిన అస్తిత్వం వ్యక్తిత్వమై, చైతన్యమై విస్తరించేవేళ ‘అండా’ సెల్ లోకి రాజ్యం తోసేస్తే భౌతిక చలనం కవిత్వమై, ధిక్కారమై రూపాంతరం చెంది జైలు గోడలు దాటి ప్రపంచాన్ని పలకరిస్తుంది. సాయిబాబా ఇంగ్లీషులో రాస్తున్న తెలుగు కవి. జైలు ఆయన మాతృభాషను నిషేధించింది. పోలీసు వాళ్ళకు అర్థం కాని భాషలో సహచరితో కూడా మాట్లాడకూడదట, రాయకూడదట. సాంకేతిక విషయాలట్లా ఉంచితే నిజంగా రాజ్యానికి వీళ్ళ భాష అర్థమయ్యేది కాదు. ‘క్రూరత్వంలో కొత్త పద్ధతులెలా కనిపెట్టాలా’ అని ఆలోచిస్తున్న వాళ్లకు వీళ్ళ మానవీయ తపన అర్థం కాదు. న్యాయపరిభాషలో కూడా నేరపరిభాష తప్ప ఇంకోటి తెలీని వాళ్ళు. ఆయన కవిత్వాన్ని తెలుగులో ప్రచురించాలని విరసం అనుకున్నప్పుడు ఆయన నేరుగా తెలుగులో రాసి ఉంటే ఎలా ఉండేదో అనుకున్నాం. ఆయన తెలుగులో రాయాలని, మాట్లాడాలని ఎంత తపన పడుతున్నాడో తర్వాత వసంతక్క చెప్పింది. నేనేమీ పరాయి దేశంలో లేను కదా.. నేను నా భాషలో ఎందుకు మాట్లాడకూడదు అని ఇంగ్లీషులో రాసిన ఉత్తరాన్ని తను నాకు పంపించింది.

ఆ తెలుగు కవి ఇంగ్లీషు కవిత్వాన్ని తెలుగులోకి అనువదించడం బహుశా సాహిత్య చరిత్రలో ఒక వింతగా మిగిలిపోతుంది. ఆయన కవితల్నిట్లా అచ్చువేయాలని ప్రతిపాదించి, సేకరించడం మొదలు పెట్టి అరెస్టయిపోయారు వివి. పూణే కోర్టులో కలిసినప్పుడు పుస్తకం చూశానని, అద్భుతంగా వచ్చిందని మెచ్చుకున్నారు. సాయిబాబా పరిస్థితి నాకు పూర్తిగా అర్థమవుతోంది. తెలుగులో ఉత్తరాలు కూడా రాయనీకి లేదు. తెలుగు పుస్తకాలు చదవను కూడా అనుమతించరు అన్నారు. నా దగ్గరున్న తెలుగు పుస్తకం చేతుల్లోకి తీసుకొని అట్టమీద నిమిరి పేజీలు తిరగేసి ఇచ్చేసారు. మా పరిస్థితే ఇట్ల ఉంటే ఆదివాసుల పరిస్థితి ఆలోచించు అన్నాడు. ఏడాదిన్నర అయింది. ఆయనను, ఆయన భాషను కూడా బంధీ చేసి. ఎరవాడ బందిఖానాలో కటిక నేల మీద కూర్చొని తను పేరుస్తున్న అక్షరాల స్వేచ్చను ఊహిస్తూ ఉండి ఉంటాడు. అటునుండి బొంబాయి తలోజా జైలుకి మార్చాక ఎలా ఉన్నారో ఊహకు కూడా అందడం లేదు. వారం రోజుల ఆందోళన వివి కవి సమయాల్ని మరింత రగిలిస్తున్నదైతే నిజం.
దక్షిణాఫ్రికా కవి, విమోచనోద్యమ నాయకుడు బెంజిమిన్ మొలైసీ కోసం వివి రాసినట్లు

“అకాల ధర్మం
కాలమేఘం కంఠాన్ని నొక్కితే
నెత్తురూ కారదు కన్నీరూ రాలదు
మెరుపు పిడుగై
చినుకు ఉప్పెనయి
కన్నతల్లి కళ్ళు తుడుచుకొని
కటకటాల బయటికి
కవి సందేశం పాడుతూనే వస్తుంది”

వివి కవిసందేశం ఆయన ఎరవాడ జైల్లో ఉన్నప్పుడు సాయిబాబా వినిపించాడు. సరిగ్గా గత ఏడాది మేలో వరవరరావు కోసం సాయిబాబా రాసిన కవిత్వానికిది తెలుగు అనువాదం. అనువాద సమస్యలేమైనా ఉండొచ్చు గాని వివి కోసం రాసిన కవితల్లో ఇది శిఖరాయమానం. బహుశా ఏ కవి గురించైనా ఇలా రాయడం సాధ్యం కాదు. కవి వ్యక్తిత్వం వల్ల కూడా ఈ మాట చెప్పొచ్చు. ఇక్కడ వివి వ్యక్తిత్వమే కాదు. సాయిబాబా వ్యక్తిత్వం కూడా కలగలిసి ఉంటుంది. చరిత్ర పరిణామంలో మానవ ప్రయత్నం పట్ల ఉన్న విశ్వాసం ఈ కవిత్వానికున్న శక్తి. సృజనకారుడైన కవి, ఒక కొత్త మానవ సమాజ సృజన చేస్తున్న విప్లవం పెనవేసుకుపోయి కనిపిస్తాయి. ఇది వివి వ్యక్తిత్వానికి, కవిత్వానికి ఉన్న ప్రత్యేకత. ఈ ప్రత్యేకత ఎక్కడ గుర్తించాలో ఆక్కడ గుర్తించాడు సాయి.

వివి రాత ద్వారానో, మాట ద్వారానో విన్న సంగతి ఒకటి ఎప్పుడూ నాకు మెదులుతూ ఉంటుంది. “స్పార్టకస్, సోక్రెటిస్, గెలీలియో కాలం నుండి ఏ తరానికైనా సత్యాన్వేషణ, కనుగొన్న సత్యాన్ని చెప్పి అందుకొరకు జీవితమంతా నిలవడాన్ని మించిన కర్తవ్యమేముంటుంది.” మనం విజయం ఎప్పుడు సాధిస్తామన్నది ముఖ్యం కాదు. ఇప్పుడు మనం ఎక్కడ, ఏ పక్షాన నిలుస్తామన్నదే ముఖ్యం. విజ్ఞాన శాస్త్ర చరిత్రలో త్యాగాలు, బలిదానాల గురించి చదివినప్పటికంటే విప్లవం గురించి తెలుసుకుంటున్నప్పుడే మానవ చరిత్ర పురోగమనం పట్ల, మార్పు పట్ల, మనిషే చేయగల అద్భుతాల పట్ల నాకు నమ్మకం బలపడింది. ఇప్పుడిక్కడ సాయి అతని సహచరులు, వివి, భీమా కోరేగాం సహనిందితులు, పేర్లు కూడా తెలియని ఆదివాసులు శూన్యం ఆవహించినట్లు, ఘనీభవించినట్లు ఉన్న వర్తమానంలో భవిష్యత్తు పట్ల విశ్వాసంతో చరిత్ర గతికి తమ ఊపిరులే ఇంధనంగా ధారపోస్తున్నారు.

చరిత్ర పునరావృతమావుతున్నట్లు పీష్వా ప్రేతాత్మలు పైకి లేస్తే భీమా కోరేగాం చరిత్రను మండిస్తుంది అంటాడు సాయి. ఇక దుస్సాహసిక కవి (వివి) ఉరికంబం వద్దకు పోయి దాని వైశాల్యం కొలుస్తాడంటాడు. నేరమయ వ్యవస్థలో నేరం-శిక్ష సంగతులేమిటితో మృత్యువు అంచుకు స్వయంగా పోయి విడమరుస్తాడు. ఆయన స్వరంలో సామూహం పలుకుతుంది. ఆయన కవిత్వానికి రెక్కల విత్తులుంటాయి. అవి ఎంతదూరమైనా ప్రయాణించి చెమ్మగిల్లిన భూమి ఉపరితలాన్ని కావలించుకుంటాయి. కవిత్వం మళ్ళీ మళ్ళీ పుడుతుంది. అందుకే ఇప్పుడు వివి, సాయి ఇంకా అటువంటివారు మన ఆందోళనే కాదు, వారి జెండా అందుకుంటే మన భరోసా కూడా.

సముద్రమే అతని స్వరం

-జి.ఎన్.సాయిబాబా
(అనువాదం: పి.వరలక్ష్మి)

దుస్సాహసిక కవి
ఉరికంబం వైశాల్యం కొలుస్తూ
ముందుకూ వెనక్కూ నడుస్తుంటాడు
యాభై ఏండ్ల క్రితం ఫైజ్ చేసినట్లు

భీమా కోరేగాం చరిత్రను మండిస్తుంది
నిశ్శబ్ద లోకం
విస్ఫోటనం చెంది ముక్కలవుతుంది

పూనా ఒకప్పుడు చిత్పావనుల రాజధాని
వారి ఆఖరి కోట బురుజు మరోసారి
తన వికారమైన కోరలు చాస్తుంది
పీష్వా ప్రేతాత్మలు కొరడాలు ఝులిపిస్తాయి
నానా ఆదేశిస్తాడు
కొత్వాల్ ఘాసీరాం ఎర్రగా కాలిన ఇనుప గుండ్లతో
ప్రజలను బంధిస్తాడు
అపవిత్రుల మెడకు ఉమ్మికుండ వేలాడదీస్తారు

ఇక్కడ, ఒకప్పుడు మహాత్ముడు
మామిడి మొక్క నాటాడు
ఒక శాంతి యుద్ధంలో అంబేద్కర్ ను
రాజీవైపు నెట్టాడు

చెట్టు మీది తిన్నెపై
ప్రతిరోజూ దీపం వెలుగుతుంది
యాత్రీకులు వచ్చి మౌనంగా
నమస్కరించి పోతుంటారు
ఉరికంబం గోడలపై ఊగుతున్న
కొమ్మల నీడలను
ఆ ఎనభై ఏండ్ల కవి తదేకంగా చూస్తుంటాడు

ఎత్తైన రాతిగోడల వెలుపల
క్రూర భీభత్స చార ఒకటి విచ్చుకుంటుంది
ఎరవాడ మళ్ళీ పైకి లేస్తుంది

పూనా నిరంకుశత్వ నీడలు
దేశం రాతిగోడల పొడవుతా ప్రసరిస్తాయి

చరిత్ర పాదముద్రలలో
జ్ఞాపకాలు అనంతం

సోక్రెటిస్ కు గ్లాసెడు విషం ఇచ్చారు
గెలీలియో ఉరికంబం దాకా నడిచాడు
ఆకాశాలను పటం గీసినందుకు
భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతాడనే
భావనను ధిక్కరించినందుకు
హిక్మెత్ ను ఖైదు చేసారు
ఆయన కవిత్వాన్ని
టర్కిష్ సైనికులు బారకాసుల్లో
దిండ్ల కింద దాచిపెట్టుకొని చదివినందుకు
ఫైజ్ మరణదండననెదుర్కున్నాడు
మట్టి చేతుల విజయగీతికలు పాడినందుకు

బందీయైన న్యాయస్థానం గేటు గుండా
సంకెళ్ళ చేతులతో నడుస్తున్న కవిని
దిగ్భ్రమతో చూసిన పాత్రికేయుడు
గుండె పగిలి చెంపల మీద కన్నీరు
ధారకట్టగా ఏడ్చాడు
దశాబ్దాలు గడిచాయి
ఇప్పుడు మళ్ళీ
విషాద ప్రహసనంలా
చరిత్ర పునరావృతమవుతోంది

అతని కవిత్వం మట్టివాసన వేస్తుంది
అందులో సముద్రాలు పోటెత్తుతాయి
సుడులు తిరిగే తుఫాను
తూర్పు గాలులు గర్జిస్తాయి
ఉరిమే పడమటి ఋతుపవన గాలులు
కుండపోత వర్షాన్ని మోసుకొస్తాయి
అతని చురుకైన పదాల ద్వారా
సామూహిక స్వరం మాట్లాడుతుంది
అతని లాలిపాటలను పిల్లలకు వినిపిస్తారు
వారు ఉజ్వల భవిష్యత్తు కలల్లో తేలిపోతారు
అతని మాటలు మహాపర్వతాలలో
దట్టమైన అడవుల్లో
నేలమీది కఠిన శిలల్లో
ప్రతిధ్వనిస్తాయి
భూమి ప్రతిఘటన
పిల్ల కాలువల్లో చేరి
దక్కను పీఠభూమి ఎగుడుదిగుడు
రాతి పగుళ్ళ గుండా ప్రవహించి
మహానదులలో పోగవుతుంది

మూర్ఖుడా, అది కవిత్వం
అది కవితాద్భుతం
చరిత్ర ఇనుప పాదాలను కరగదీసి విరిచెయ్యడానికి
దానికి ఆయుధాలు అక్కర్లేదు

అతని కవిత్వానికి రెక్కల విత్తులున్నాయి
చల్లని ప్రేమ గాలిలో ప్రయాణించి
ప్రతి తీరానికీ తేలి వచ్చి
చెమ్మగిల్లిన భూమి ఉపరితలాన్ని కావలించుకుంటాయి
సముద్రం అతని స్వరం

(వరవరరావు కోసం)

సైన్స్ లో గ్రాడ్యుయేషన్ చేస్తూ సాహిత్యాన్ని, మార్క్సిజాన్ని అధ్యయనం చేస్తున్న క్రమంలో విరసంతో పరిచయం ఏర్పడింది. 2005 నుండి విరసం సభ్యురాలిని. ప్రస్తుతం అరుణతార వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నాను. నా రచనల్లో సామాజిక రాజకీయ పర్యావరణ సంబంధమైన వ్యాసాలే ఎక్కువ. సాహిత్య వ్యాసాలు, కొన్ని కథలు, చాలా తక్కువగా కవిత్వం రాశాను. కూడంకుళం అణువిద్యుత్ కు వ్యతిరేకంగా ప్రజాఉద్యమం జరిగుతున్నప్పుడు అక్కడి ప్రజలను జైల్లో కలిశాక రాసిన 'సముద్రంతో సంభాషణ' నా మొదటి పుస్తకం.

3 thoughts on “వారు మన ఆందోళనే కాదు, మన భరోసా కూడా

  1. సాయి కవిత మీ అనువాదం అద్భుతంగా ఉన్నాయి.

  2. చాలా బాగా రాశారు వరలక్ష్మి గారూ

Leave a Reply