వాచ్ మేన్ కూతురు

ఆ పిల్ల అందాన్నిచూసి భయపడ్డాను

తోటలో ఉంటే తూనీగ

కోటలో ఉంటే యువరాణీ

వాచ్ మేన్ సింహాద్రి కూతురై

మా అపార్ట్ మెంట్ కారిడార్ లో చీపురైంది

ఒక రోజు

రత్నదీప్ లో సేల్స్ గాళ్ గా మారింది

నడక మారింది..పెదాల రంగు మారింది

చూపుల్లో హంగు మారింది

చెవులకు ఇయర్ ఫోను తీగలల్లుకున్నాయి

ఆమె ఆత్మ గుర్రం మీద స్మార్ట్ ఫోన్ స్వారీ-

మరో రోజు రోడ్డు మీద కనపడింది

సెల్ ఫోను అద్దంలో మొహం చూసుకుంది

ముంగురులు సవరిస్తూ మురిసిపోతోంది

ఆమె కన్నుల్లో గాలికి ఊగుతూ

ఎవడో కుర్రాడి కోర మీసం-

మైకంలో తూలిపోతోంది తాను

ఖాయంగా ప్రేమలో పడింది

ఇంకో రోజు నా వెనకేదో గుప్పుమంది

అత్తరు పూసుకున్న మెరుపులా ఆ పిల్ల-

ఆమె పళ్ళ మధ్య సంధ్యాకాశంలా కిళ్ళీ రంగు

తుళ్ళిపడ్డాను..

ఆమె నడిచిన దారి నిండా

చితికిన కలల మరకలు-

దారి తప్పిందా..?

తప్పేదో ఒప్పేదో

ఏది తనకు నప్పేదో చెప్పేదెవరు?

ఒక ఆదివారం పూట

నా చేతిలో సెల్ వింతగా శబ్దించింది

చూస్తే

ఒక సౌందర్య కెరటం.

డూ యూ వాంట్ మీ..?

ప్రశ్నలా వంపు తిరిగిన ఆ అమ్మాయి-

ఉలిక్కిపడ్డాను

కంపించిన కలల్లోంచి వాస్తవంలోకి ఊడిపడ్డాను

చదువుకుంటే అధికారిణి

కత్తి పడితే ఝాన్సీ రాణి

నగరం నాగస్వరానికి

సగం తెగిన యవ్వన సర్పమైంది

నాగరికుల జనానాలో

ధ్వంసమైన స్వప్నమైంది

సింహాద్రితో మీ అమ్మాయి జాగ్రత్త అన్నాను

ఊళ్ళో ఒంటరిగా ఉండలేదుకదయ్యా అన్నాడు

నగరం ఒంటరిగా ఉంచదు కదయ్యా అన్నాను

కళ్ళు దించుకున్నాడు

నేల మీద అతని రూపంలో కొన్ని నీటి బొట్లు-

రాత్రి నా కలలో

వేయి రంగుల కాంతి జల్లే దీపస్తంభానికి ఆనుకుని

అందమైన అస్థిపంజరం కన్ను గీటింది

పుట్టిన ఊరు నిడమర్రు, పశ్చిమ గోదావరి జిల్లా. ఎంఏ(తెలుగు), ఎంఏ(ఇంగ్లిష్), శ్రీపొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి పీహెచ్ డీ చేశారు. ఐదేళ్లు ప్రింట్, పదేళ్లు ఎలక్ట్రానిక్ మీడియాలో పనిచేశారు. రచనలు: 1. కలనేత(1999), 2. మాట్లాడుకోవాలి(2007), 3. నాన్న చెట్టు(2010), 4. పూలండోయ్ పూలు(2014), 5. చేనుగట్టు పియానో(2016), 6. దేశం లేని ప్రజలు(2018), 7. మిత్రుడొచ్చిన వేళ(2019), ప్రసాదమూర్తి కవిత్వం(2019) కవితా సంకలనాలు. సగం పిట్ట(2019) కథా సంపుటి ప్రచురించారు. ప్రస్తుతం ఫ్రీలాన్స్ జర్నలిస్టుగా పనిచేస్తున్నారు.

5 thoughts on “వాచ్ మేన్ కూతురు

Leave a Reply