వలస కార్మికుల దుఃఖ కావ్యం ఆదేశ్ రవి “పిల్ల జెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో…”

మానవాళి మహా సంక్షోభంలో కూరుకుపోయిన వేళ, కాలం ఒక అద్భుతమైన పాటను రాసుకుంది. ప్రపంచమంతా కరోనా వైరస్ కట్టడికి లాక్ డౌన్లోకి వెళ్లిపోయింది. తాళాలు వేసుకోవడానికి ఇండ్లు కూడా లేని నిరుపేద బతుకులు ఏమిచేస్తాయి? కన్నతల్లిని, ఉన్న ఊరిని విడిచి కడుపు నింపుకోడానికి వేళ మైళ్లు దాటివచ్చిన వలస జీవులది దిక్కుతోచని పరిస్థితి. ఊరిలో ముసలి తల్లిదండ్రులు, పసిబిడ్డలు ఎట్లా ఉన్నారోననే ఆరాటం వారిని తమ ఊరి దిక్కుగా సాగిపోయేలా చేసింది. కన్నీళ్లు మూటగట్టుకుని కట్టుబట్టలతో ఎర్రటి ఎండల్లో చెప్పుల్లేని కాళ్లతో సాగిన వారి ప్రయాణం చూసి కవి గుండెల్లో ఒక విషాద గీతం పురుడు పోసుకుంది. అదే “పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో…” అంటూ వేదన నింపుకున్న ఆదేశ్ రవి జీర స్వరం కోట్లాది హృదయాల్ని కదిలించింది. మనిషి రక్త నాళాల్లోకి పాట ప్రవహించిన క్షణమది.

పూవు పుట్టగానే పరిమళిస్తుందో లేదో తెలియదుగాని ఈ పాట పుట్టిన క్షణం నుంచి మనిషితనాన్ని మేల్కొల్పింది. కవిత్వం మీద విశ్వాసం కలిగించిన గొప్ప సందర్భం ఇది. దీనికి కారకుడైన వాగ్గేయకారుడు ఆదేశ్ రవి. ఒక సామాన్య మధ్యతరగతి బతుకు వెతలను చదివిన ఆర్ధ్రజీవి. మంచిర్యాల బొగ్గు గనుల మట్టిపొరల కింద దొరికిన కొత్త వజ్ర౦. విద్యార్థి దశనుంచే ఆధునిక సాహిత్య అధ్యయన శీలి. సామాజిక, తాత్విక శాస్త్రాల లోతుల్లోకి వెళ్ళిన చింతనాపరుడు. సినిమా రంగంలో సౌండ్ ఇంజనీరుగా పనిచేస్తూ ఎవరూ వినలేని వలస బతుకు రోదనని ఈ పాటలో నిక్షిప్త౦ జేసాడు. ఆ పాట పాదాలలోకి వెళ్ళి మరోసారి క్షాళితమవుదాం రండి!

“పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో…
నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో”

ఈ పాట రాయడానికి ముందుగా కవికి ఎటువంటి ఇతివృత్త ప్రణాళిక, నిర్మాణ వ్యూహాలు ఏమిలేవు. కళ్ళ ముందు కదలాడుతూ కదిలిపోయే రంగుల టీవి వలస కార్మికుల దృశ్యాలను చూపుతుంది. ఆ దృశ్యాల వెనకవున్న చీకటిని చూసిన ఆదేశ్ లో అంతర్మథనం మొదలైంది. దక్షిణాది నుంచి ఉత్తరాదికి, ఉత్తరాది నుంచి దక్షిణానికి వేలాది మంది వలస జీవులు నడిచివెళ్తున్నారు. బతుకు బరువై, భారమైన అడుగులతో మైళ్ళకు మైళ్ళు నడిచి వెళ్తున్న వారి బాధలను చూసాక ఆ వేదనలోంచి, సంఘర్షణలోంచి ఈ పాట ఉబికి వచ్చింది. శోకం నుంచి శ్లోకం పుట్టిందని విన్నవారమే కాని ఇప్పుడు మాత్రం అటువంటి శ్లోక ఆవిర్భావాన్ని చూసిన శోకతరం మనది.

ఉన్న ఊరిలో ఉపాధి కరువై పని వెతుక్కుంటూ తమది కాని రాష్ట్రంలో, భాషరాని ప్రా౦తంలోకి వలసవచ్చిన వారి బతుకు ప్రతిక్షణం పోరాటమే. తనకు వచ్చిన కూలి డబ్బులను ఊళ్ళోవున్న కుటుంబ సభ్యులకు పంపుతూ అర్ధాకలితో నెట్టుకొస్తున్న వారికి లాక్ డౌన్ వల్ల వచ్చిన కష్టాలు వైరస్ కన్నా భయంకరమైనవి. కళ్లెదుట కనబడని వలసెల్లిన కొడుకుని తలచుకుంటున్న ఆ ముసలి తల్లి బతుకు దెరువు బాధ. దూరంగావున్న తన పిల్లలు ఎలా వున్నారనే ఆలోచనల మధ్య సాగుతున్న ఈ ప్రయాణాన్ని కవి వర్ణించిన తీరు గుండెల్ని పిండేస్తుంది.

“పూట పూట చేసుకొని బతికేటోల్లం…
పూట గడవ ఇంత దూరం ఒచ్చినోల్లం…”
ఇది ఆదేశ్ రవి రాసిన పాట కాదు. వలస కార్మికులంతా కలిసి కవిని ఆవహించి రాసుకున్న ఆత్మకథాత్మక గీతంగా భావించాలి. కవి ఆ గుంపులో ఒకడిగా మారిపోయి కలిసి పాడుకున్న గీతంగా ప్రతి పాదం ధ్వనిస్తుంది. ప్రతి పూట కొత్త ఊపిరిని ఊదుకుంటూ పొట్ట నింపుకొనే ప్రాణాలు ఈ రోజు ఎంతదూరమైన నడిచి వెళ్లాల్సిరావడం మహా విషాదం.

“దేశమేమో గొప్పదాయె…
మా బతుకులేమో చిన్నవాయే
మాయదారి రోగమొచ్చి…
మా బతుకు మీద మన్నువోసే”
అందరికి అర్థమయ్యే సహజమైన సరళ భాషలోని కవితా వాక్యాలకు వివరణ అవసరం లేదు. కాని ఆ వాక్యాలు వెనకవున్న దుస్థితికి కారణాలు తెలుసుకోవడం, వాటిని నివారించడం మాత్రం అసాధ్యం. ఈ పాట అందరికి అర్థమవుతూనే అనేక సంఖ్యలో పదునైన ప్రశ్నల్ని ఎక్కుపెడుతుంది. పాటలోని ప్రతిమాట లోతైన ఆలోచనలకు పురికొల్పుతుంది. నిద్రలేని రాత్రుల్ని పుట్టిస్తుంది. ఘనమైన చరిత్ర, సాంస్కృతిక వైభవం, బుద్ధి జీవుల చైతన్యం, కళ్ళు చెదిరే అభివృద్ధి మధ్య వాటి సృష్టికి మూలకారులైన బతుకులు చిన్నబోయి ఉండటమనే చేదు నిజం ఉక్కిరి బిక్కిరి చేస్తుంది. వేల కోట్ల రుణాలని మాఫీ చేసిన గొప్ప వ్యవస్థ, వలస ప్రాణాలకు ఒక వాహనమైనా అందించిందా? అనే సందేహం పోటెత్తుతుంది. ఎటువంటి ప్రళయం వచ్చినా ధనవంతులెప్పుడూ గ్రీన్ జోన్ లోనే ఉంటారు. ఏ చిన్న ప్రమాదమైనా రెడ్ జోన్ లోకి వెళ్ళేది వలస జీవులే కదా. రోగం రాకముందే బతుకులోకి చావు పిలుపు రావడం ఎంత భయానకం?

“పేద రోగం కంటే పెద్ద రోగముందా,
అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా
కష్టకాలం ఇంటికాడా ఉంట సారు
కలిసి మెలిసి కలోగంజో తాగేటోల్ల౦”

ఏ దినపత్రిక తిరగేసినా, దారిద్య్రరేఖకు దిగువనున్న వారిని ఏవిధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని ఆర్ధికవేత్తల విశ్లేషణలు కన్పిస్తుంటాయి. వాటికి నోబెల్ ప్రైజులు కూడా వస్తుంటాయి. కానీ దారిద్య్రరేఖ మరింత స్పష్టంగా విస్తరిస్తూనే ఉంటుంది. నాయకుల నాలుకలన్నీ పేదరిక నిర్మూలనం గురించే జపిస్తుంటాయి. పేదలు మాత్రం రెట్టింపవుతూనే వుంటారు. మామూలు రోగం వచ్చినా సరైన వైద్య౦ చేయించుకోలేని పేద బతుకులు. అందుకే పేదరికాన్ని మించిన పెద్దరోగం పేదవాడికి ఏముందనే నగ్నసత్యాన్ని కవి ఎంతో శక్తివంతంగా చెప్పాడు. వైద్యం వ్యాపార వ్యవస్థగా మారిన లోకంలో రోగం రాకపోడమే పేదవాడికి దక్కే సంపదగా, అదృష్టంగా భావిస్తున్నాడు. ఈ విపత్కర కాలంలో తమ వాళ్ళతో కలసి ఉండాలనుకోవడం సహజమైన ఆకాంక్ష. తను పుట్టిన ఊరితో పెనవేసుకున్న జ్ఞాపకాల బంధం, గాలికి ఎగిరిపోయే గుడిసైనా సరే ఆ ఇంటితో ఉండే రక్తబంధం, దొరికే మనశ్శాంతి కోసం నెత్తురోడుతున్న పాదాలతో ఇంటివైపు మరలాడు. కలిసిమెలిసి పంచుకునే ఆ కన్నీళ్ళతోటి కడుపు నింపుకుంటామనే ధైర్యం ఆ వలస వీరుడిది. అయినవాళ్లు కళ్ళ ముందు౦టే అదే కొండంత అండ అనే మనిషి ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నాడు కవి.

“పిల్లగాన్లు కన్నులల్ల…
విడవకుండా మెదులవట్టె
ఇంటిదాని దుఃఖమేమో
ఆగకుండా తరుమవట్టె…
ఏమి జేతు జేతు ….”
మనిషికి కుటుంబంతో ఉండే గాఢమైన అనుబంధాన్ని ఇంత దు:ఖతీవ్రతతో వర్ణించిన సందర్భం లేదేమో. ఎవరి బాగుకోసం ఇంతదూరం వచ్చి కండలు కరిగిస్తూ, నెత్తురు ఆవిరయ్యేలా పనిచేస్తున్న ఈ వలస కార్మికుడు ఈ విపత్తువేళ భార్యాపిల్లలను చూడాలనుకుంటున్నాడు. వారికి అండగా నిలవాలనుకుంటున్నాడు. తన కళ్లల్లో పిల్లలు మెదలబట్టే, భార్య కళ్ళలో ఎడబాటు దు:ఖ౦ తగులుతుంటే తనను తాను తరుముకుంటూ, ఈడ్చుకుంటూ వెళ్లవలసిన ఆతృత, అనివార్యత అతడిది. బాధను పంటి బిగువున భరిస్తూ సడలని సంకల్పం చరిత్రలో ఎవరిదైన ఉందంటే అది ఈ వలస యోధుడిదే!

“బస్సులొద్దు, బండ్లు వద్దు
అయ్యా సారూ…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు
నడిసి నేను పోతసారు” అంటూ చరిత్ర చూడని మహాప్రస్థానానికి తొలి అడుగు వేస్తాడు.

గ్రహంతర యానం కోసం పురోగమిస్తున్న దేశం మనది. అదే నేల మీద మనుషులు గమ్య స్థానాలవైపుగా వేల మైళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న దుస్థితి. అభివృద్ధిని కొత్తగా నిర్వచించుకోవాల్సిన పరిస్థితి. మానవత్వపు చిరునామాను వెతకవల్సిన అగత్యం ఏర్పడింది. అయినా సరే ఆ అతిథి కార్మికుడు ఆగ్రహించట్లేదు. ‘అయ్యా సారు’ అని విన్నపాలు చేసుకుంటున్నాడు. మర్యాదగా బతిమాలుకుంటున్నాడు. ‘ఇడిసి పెడితే నడసిపోతా’ అని ప్రాధేయపడుతున్నాడు. ఇదిగో ఈ భావమే, ఈ స్వరమే, ప్రజలు కరిగి నీరై ప్రవహించేలా చేసింది. వ్యవస్థలు విఫలమైన చోట వ్యక్తులు వ్యవస్థలుగా మారారు. జాతీయ రహదారుల వెంట అన్నం పోట్లాలుగా, అరికాళ్ళకు చెప్పులుగా, గొంతెండిన వారికి నీటి చుక్కలుగా నిలబడ్డారు. కనికరం లేని రాజ్యం కాలయాపన కమిటీలతో కునుకుతీసింది. వైరస్ సృష్టించిన విధ్వంసం కన్న వ్యవస్థ చేసిన ఆలస్యం పెద్దముప్పులో ముంచేసింది. ఓట్ల బ్యాంకులు కాని వలస కార్మికులు రైలు పట్టాల మీద శాశ్వతంగా సేదతీరాల్సి వచ్చింది.

కవిత్వంలో పునరుక్తిదోషం ఉండకూడదంటారు. కాని కొన్ని సంధార్భాల్లో పునరుక్తికి ఎంత శక్తి ఉందో మరోసారి ఈ పాట నిరూపిస్తుంది. ఈ పాటలో చరణాల చివర వచ్చే “ఏమి బతుకు ఏమి బతుకు”/”చెడ్డబతుకూ చెడ్డబతుకూ”/”ఏమిజేతు ఏమిజేతూ”/ అనే పునరావృత పదాలు వలస కార్మికుడి జీవన వేదనను క్షణక్షణం గుర్తుచేస్తూ శ్రోతల గుండెబరువును అంతకంతకు పెంచుకుంటూపోతుంది. ఒక్కసారిగా మనసంతా బాధల మబ్బులు ముసురుకుని దు:ఖపువాన కురుస్తుంది. ఒక్కో పదం కన్నీళ్లల్లో నానిపోయి గుండె గొంతుకగా మారి పాడినప్పుడే అలాంటి అనుభవం కలుగుతుంది. నిన్నటి భారతకావ్య౦ పద్దెనిమిది పర్వాలయితే ఈ వలస భారత కావ్యం పద్దెనిమిది వాక్యాలే. ప్రముఖ సాహితీవేత్తలందరూ ప్రశంసి౦చిన ఈ పాటలో ఎన్నో ప్రత్యేకతలు దాగివున్నాయి. ఏ హంగులూ ఆర్భాటాలు లేకుండా ఒక శ్రమజీవి ఎంత నిరలంకారంగా వుంటాడో ఈ పాటకూడ అంత సహజ గుణాన్ని నింపుకుంది. పేదవాడికి ఏ నేపథ్యం లేనట్టే ఈ పాటకు ఏ నేపథ్య సంగీతమూ లేదు. జీరగా వినిపించే జీవుని వేదనాస్వరమే అసలు నేపథ్యం. గాయపడ్డ గుండే ప్రధాన వాయిద్య౦. కవి అన్నట్లు ‘దు:ఖం గొంతులో పలికినట్లు ఏ వాయిద్యంలోనూ పలకదు.’ శ్రమకారుల దు:ఖపు వలపోతను వినిపిస్తూ మానవీయ భావనలకు కొత్త పాఠాలను బోధించింది. ఏ వలస కార్మికుడు కనిపించినా ఈ పాటే గుర్తుకు వచ్చి మనం ఏదో తప్పు చేశామన్న నైతిక వత్తిడిని కలిగిస్తుంది. కరోనా విపత్తు కాలంలో ఇదొక చారిత్రక స్మృతి గీతమేకాదు, వలస కార్మిక లోకంలో తడి ఆరని జాతీయ గీతం!

పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో
– ఆదేశ్ రవి

పిల్ల జెల్లా ఇంటికాడ ఎట్ల ఉండ్రో…
నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
పూట పూట చేసుకొని బతికేటోల్లం…
పూట గడవ ఇంత దూరం ఒచ్చినోల్లం…

దేశమేమో గొప్పదాయె… మా బతుకులేమో చిన్నవాయే
మాయదారి రోగమొచ్చి… మా బతుకు మీద మన్నువోసే…

ఏమి బతుకూ… ఏమి బతుకూ… చెడ్డ బతుకు
చెడ్డ బతుకు… చెడ్డ బతుకు…

పేద రోగం కంటే పెద్ద రోగముందా… అయిన వాళ్ళ కంటే పెద్ద అండ ఉందా…
కష్ట కాలం ఇంటి కాడా ఉంట సారు… కలిసిమెలిసి కలోగంజో తాగెటోల్లం…

పిల్లగాన్లు కన్నులల్ల… విడవకుండా మెదులవట్టె…
ఇంటిదాని దుఃఖమెమో… ఆగకుండా తరుమవట్టె…
ఏమి జేతు… ఏమి జేతు ..ఏమి జేతు

బస్సులొద్దు, బండ్లు వద్దు… అయ్య సారూ…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
బస్సులొద్దు, బండ్లు వద్దు… అయ్యా సారూ…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…

ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
ఇంటికాడ పిల్ల జెల్లా ఎట్ల ఉండ్రో… నా ముసలి తల్లి ఏమివెట్టి సాదుతుందో
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…
ఇడిసి పెడితే నడిసి నేను పోతసారు…

జ‌న‌నం: న‌ల్ల‌గొండ‌. 'ఆధునిక క‌విత్వంలో అస్తిత్వ వేద‌న‌', 'అంతర్ముఖీన క‌విత్వం' అనే అంశాల‌పై ఎం.ఫిల్‌, పీహెచ్‌డీ ప‌రిశోధ‌న చేశారు. ప్రాథ‌మిక త‌ర‌గ‌తి నుండి డిగ్రీ స్థాయి తెలుగు పాఠ్య పుస్త‌కాల రూప‌క‌ల్ప‌న‌లో కీల‌క‌మైన స‌భ్యుడిగా, ర‌చ‌యిత‌గా, సంపాద‌కుడిగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అనేక కవితలు, సమీక్షలు, ముందుమాటలు, పరిశోధనా వ్యాసాలు రాశారు. పలు పురస్కరాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ తెలుగు శాఖలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. 'జీవ‌న లిపి'(క‌విత్వం), 'స‌మ‌న్వ‌య‌'(సాహిత్య వ్యాసాలు) ర‌చ‌న‌ల‌తో పాటు వివిధ గ్రంథాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

12 thoughts on “వలస కార్మికుల దుఃఖ కావ్యం ఆదేశ్ రవి “పిల్ల జెల్లా ఇంటికాడా ఎట్ల ఉండ్రో…”

  1. చెడ్డ బతుకుల దైన్యం పై విశ్లేషణ బాగా కదిలించింది. రఘు గారికి అభినందనలు.

  2. గొప్పగా విశ్లేషణ చేసి..హృదయం లోకి తీసుకుని రాసిన వ్యాసం.కవితో తాదాత్మత చెంది రాసేవేదైనా ఇలాగే వుంటాయి.రఘు గారికి అభినందనలు..

  3. హృదయంతో విశ్లేషించారు సార్ .పదాల వెనుక ఉన్న దుఃఖాన్ని మా ముందు పరిచారు.వలస కార్మీకుల కష్టాలకు ప్రభుత్వం ఏ విధంగా స్పందించిందో అద్భుతంగ చెప్పారు.పాటలోని సరళతను,పునరావృతి పదాల గురించి చెప్పిన మాటలు బాగా నచ్చాయి సార్

  4. హృదయాన్ని కదిలించే పాట పై సహృదయంతో చేసిన మీ విమర్శ చాలా బాగుంది సార్.
    నిన్నటి భారతకావ్య౦ పద్దెనిమిది పర్వాలయితే ఈ వలస భారత కావ్యం పద్దెనిమిది వాక్యాలే.👌🏻

  5. కష్టజీవి కి ఇరువైపుల వున్నవాడు కవి అని నిరూపించారు సోదరా

  6. గుడ్ మార్నింగ్ సర్ చాలా అద్భుతంగా రాసారు. అదేశ్ రవి రాసిన వాక్యాలకు మీరూ సాహిత్యాన్ని జోడించిన తీరు బాగుంది. ఈ పాట విన్నప్పుడు కళ్ళు చెమ్మగిల్లాయి కానీ “వేల కోట్లు రుణాలను మాఫీ చేసిన గొప్ప వ్యవస్థ వలస వలస ప్రాణాలకు ఒక వాహనమైన అందించిందా” ఈ వాక్యాల దగ్గర మీ వివరణాత్మకత చూసాక కన్నీటి పర్యంత మయ్యాను. 👏👏👏ధన్యవాదాలు సర్

  7. వలస జీవుల వ్యతలకు సారథ్యం వహించి దేశానికి వాస్తవ జీవితాలను చూపిస్తూ అందరి కళ్ళలో నీళ్ళు తిప్పించిన ఈ జాతీయగీతి వెనుక కష్టాలు అందరి ముందుకదిలినట్టైనాయి. భారత ఆర్థిక, రాజకీయ, సాంకేతిక అభివృద్ధి కోణాల్లో చేసిన విశ్లేషణ జాతీయాభివృద్ధిని అందులోని లోపాలను కళ్ళముందు ఉంచుతున్నది . పేదవాడు పేడవాడుగా, ధనవంతుడు ధనవంతుడుగా మారుతున్న ఈ వ్యవస్థలో ప్రజాధనం ప్రయోజనాల ప్రయాణం, దాని లబ్ది ఎవరికి దక్కుతుందో స్పష్టమవుతుంది. చెడ్డబతుకుల్ని బాగుచేసుకోవడం కోసం భాషరాని రాష్టాలకొచ్చిన వారి కష్టాలు వైరస్ కంటే ప్రమాదకరమైనవి అన్న మీ మాటల కింద ఎందరో కష్టజీవుల కన్నీళ్లు దర్శనమిస్తున్నాయి. అభాగ్యజీవుల విసిరివేయబడ్డ బతుకు భారం కనిపిస్తోంది.
    సాధించిన ప్రగతిని చూసి గుండెలు గుద్దుకునే నేతల మోతల కింద ఉన్న చీకటి కనిపిస్తుంది.
    ఆదేశ్ రవిని ఆవహించి రాసుకున్న వలస జీవుల వ్యధార్థ గీతిలో
    నేటి భారతం ఆవిష్కృతమైంది సర్.
    🙏

  8. దేశప్రజలందరి మనసులని కరిగించిన ఆదేశ్ రవి గారి వలసజీవుల కన్నీటిపాటలోని 18 వాక్యాలను మహాభారతంలోని పదునెనిమిది పర్వాలుగా పోల్చి, నగరాలు, నాగరికతలు నిర్మించిన శ్రమజీవుల కన్నీటికి ఉండే సాంద్రతను అద్భుతమైన పాటగా దృశ్యీకరించిన వైనాన్ని కవి అంతర్దృష్టిని ఒడిసిపట్టి ఆ పాట మూలాల్ని వెంటాడి కన్నీటిపాటతో దేశాన్నంతా కదలించిన ఒక దుఃఖ కావ్యాన్ని వలసజీవుల జాతీయగీతంగా వర్ణిస్తూ, వ్యవస్థలోని డొల్లతనాన్ని కూడా బయటపెట్టి, తనదైన శైలిలో అద్భుతంగా విశ్లేషించిన డా. రఘు గారికి నమోవాకాలు🙏

  9. డాక్టర్ బాణాల శ్రీనివాస్రావు says:

    మామూలుగా ఏ విమర్శకుడైనా, విశ్లేషకుడైనా ఆర్థం కానీ సాంద్రత నిండిన కవిత్వవాక్యాల్లోని లేక వాటి వెనుక ఉన్న తాత్విక దొరణుల్ని విశ్లేషిస్తాడు. ఆదేశ్ రవి రాసిపాడిన ఈ దుఖః గీతం వలసబతుకుల్ని స్పష్టంగా బొమ్మకడుతుంది.అందరికి అర్థం అయిన గీతాన్ని కూడా తనదైన శైలిలో వివరించి విశ్లేషిండం రఘు విమర్శనా పటిమకు నిలువెత్తు నిదర్శనం. అందుకు రఘుకు మనస్ఫూర్తిగా అభినందనలు.
    ——- డాక్టర్. బాణాల

  10. ఆదేశ్ రవి పాట వలస కార్మికుల కన్నీటి కావ్యాన్ని లిఖిస్తే, సద్విమర్శకులుగా మీరు కవి ఆత్మను పట్టుకొని వాక్యాల వెనుక ఉన్నటువంటి ఆర్ద్రతను చక్కగా విశ్లేషించారు సర్

  11. ఆచార్య పింగళి లక్ష్మీ కాంతం గారు “భాగోగులను ఇంకోకరు వివేచించి తెలుపుట విమర్శ” నిర్వచిస్తే మీరు విశ్లేషణ చేసి చూపించారు. సార్

  12. చాలా అబ్దుతంగా రాశారు సర్ పాఠకున్న పని తనాన్ని

Leave a Reply