వర్తమాన రాజకీయార్థిక చరిత్రకు వ్యాఖ్యానాలు- హరగోపాల్ ముందుమాటలు

ఆచార్య జి. హరగోపాల్ అంటే ప్రజారాజకీయ తత్వవేత్త,  ప్రజాఉద్యమాల స్వరం అని అందరికీ తెలుసు. కాకతీయవిశ్వవిద్యాలయం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యాపకుడిగా, విద్యార్థులతో స్నేహసంబంధాల సంభాషణల కొత్తకాలానికి ప్రతినిధిగా ఆయన  నాకు ఎమ్మె పూర్తయ్యేటప్పటికే తెలుసు. ఆయన దగ్గర చదువుకొన్న  శోభ నాకు సహాధ్యాపకురాలు. మంచి మిత్రురాలు. అప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ లో తెలుగు సెకండ్ లాంగ్వేజ్ గా చదివే విద్యార్థులకు వాసిరెడ్డి సీతాదేవి నవల రాబందులు- రామచిలుకలు నవల పాఠ్య గ్రంధంగా ఉండేది.  ఆ నవల  ఇతివృత్తం లోని పంచాయతీ రాజ్య వ్యవస్థ గురించి శోభతో కలిసి చర్చించే క్రమంలో ఆమె నవల చదవటం, మా ఇద్దరి ఆలోచనలు, సంభాషణలు ఆ నవలపై విశ్లేషణ వ్యాసం రూపం తీసుకొనటం జరిగింది. ఆ వ్యాసం వ్రాతప్రతిని చదివి అవసరమైన అధ్యయనం, అచ్చు వెయ్యమని ప్రోత్సహించిన వారిలో  హరగోపాల్ గారు ముఖ్యులు. సాహిత్యానికి సామాజిక శాస్త్రాలకు హద్దులు చెరిగిపోతూ  కొత్త అధ్యయన పద్ధతులు కళ్ళముందు ఆవిష్కృతం అవుతుంటే ఆ మార్గంలో ముందుకు సాగటానికి  మమ్మల్నందరిని ప్రోత్సహించిన హరగోపాల్ గారు సాహిత్యవిద్యార్ధిని అయిన నాకు కూడా మార్గదర్శకులే అయ్యారు.   2012 లో నేను, తోట జ్యోతిరాణి కలిసి ‘మహిళాసాధికారత – సవాళ్లు’  అనే శీర్షికతో  సామాజిక పరిశీలనలతో, సాహిత్య విశ్లేషణలతో కూడిన వ్యాసాల సంకలనం ప్రచురించినప్పుడు ఆయన దానికి ‘సమాజ సాహిత్య సమ్మిళితం’ అనే శీర్షికతో ముందుమాట వ్రాసారు.   

హరగోపాల్ ఇలా మా పుస్తకానికి కాదు, అనేక పుస్తకాలకు ముందుమాటలు వ్రాసారు. అలా  1983 నుండి 2023 వరకు నలభై ఏళ్ళ కాలం మీద వేరువేరు పుస్తకాలకు ఆయన వ్రాసిన42  ముందుమాటల సంకలనం  ‘సందర్భం – సవాళ్లు’. తెలుగులో ఆయన వ్యాసాల సంపుటాలు ఇప్పటికి ఆరు.అవి: స్వేఛ్ఛారావం(2015),ప్రజాస్వామ్యవిద్య కోసం మరో పోరాటం(?)  స్వేఛ్చకోసం (2018) పరిమళించిన మానవత్వం(2019)సందర్భం- సవాళ్లు(2023) మార్పుకోసం(2023). హరగోపాల్ యూనివర్సిటీ ఫ్రొఫెసర్ గా,  మేధావిగా, రాజకీయ విశ్లేషకుడుగా, ప్రజాస్వామిక విలువల ప్రచారకుడుగా  విస్తృతంగా పర్యటించి అనేక వేదికలమీద  సామాజిక రాజకీయ ఆర్ధిక సాంస్కృతిక విధానాలను,సందర్భాలను విశ్లేషిస్తూ చేసిన ప్రసంగాలు, పత్రికలకు వ్రాసిన వ్యాసాలు అసంఖ్యాకం.పౌర ప్రజాస్వామిక హక్కుల ఉద్యమాన్ని, విద్యా పరిరక్షణ ఉద్యమాన్ని   అంటి పెట్టుకొని తిరుగుతూ చేసిన ఉపన్యాసాలు, వ్రాసిన వ్యాసాలు  అనేకం. ఆ సమస్తం  ఈ  ఆరు పుస్తకాలలోకి చేరిందని చెప్పలేం.  కానీ ఇవి సామాజిక చింతనకు, మార్పును గురించిన ఆలోచనలకు బుద్ధిజీవిగా  ఆయన చేసిన దోహదాన్ని అంచనావేయటానికి  ఉపకరించే తగినంత సమాచారం అని మాత్రం చెప్పవచ్చు. వీటిలో  “సందర్భం సవాళ్లు” ఆయన వేరువేరు పుస్తకాలకు వ్రాసిన ముందుమాటల సంపుటి.ఇది ఆధారంగా హరగోపాల్ గారి సాహిత్య సామాజిక దృక్పథాన్ని నిరూపించటం,సమాజాన్ని,సాహిత్యాన్ని అధ్యయనం చేయాటానికి ఆయన అందించిన సూత్రాలను నిర్ధారించి చూపటం ప్రస్తుత లక్ష్యం.   

1

‘ముందుమాట’ అనేది ఒక ప్రత్యేక రచనా ప్రక్రియ. వ్యాసం లో ఒక విభాగం.  కవిత్వం, కథ, నవల, నాటకం, వ్యాసం  వంటి  రచనాప్రక్రియల వలె సర్వస్వతంత్రం కాదు.   ఏదో ఒక  ప్రక్రియకు సంబంధించిన ఏ ఒక్కరి రచననో, లేదా  కొందరి రచనలతో వేసిన సంకలనాన్నో పరిచయం చేస్తూ చేసే రచన ముందుమాట. రచయిత లేదా సంపాదకులు ఆ పుస్తకం గురించి ఒక అభిప్రాయాన్ని ఎవరిదగ్గర నుండి అయినా కోరి తెప్పించుకొని పుస్తకంతో పాటు, పుస్తకంలోనే అసలు పాఠ్యము కంటే ముందు ప్రచురించేది ముందుమాట. ముందుమాట ఎవరిని కోరతారు? ఎవరు ఆ పుస్తకంలోని కీలకాంశం గుర్తించి పాఠకుల అధ్యయనానికి మార్గ సూచనం చేయగల సమర్థులు అనిపిస్తుందో వారిని కోరతారు. ఇలా కోరినప్పుడు రచయితను నొప్పిస్తామేమో అన్న మొహమాటం తో వ్రాసే వాళ్ళ ముందుమాటలలో వస్తుగత దృష్టి లోపించి కేవలం ప్రశంస ప్రధానం అయ్యే ప్రమాదం ఉంది. దానిని అధిగమించ గలిగినప్పుడు ఆ ముందుమాటలు ప్రత్యేక రచనలోని  వస్తుశిల్ప దృక్పథాలను అర్ధం చేసుకోవలసిన రీతి గురించి ఆలోచనలకు ప్రేరకం అవుతాయి. ఆ ప్రత్యేక పుస్తకాన్ని అర్ధం చేసుకొనటానికి ఉపకరించటంతో పాటు అలాంటి పుస్తకాల అధ్యయనానికి కావలసినసూత్రాలను కూడా అవి అందించేవిగా ఉంటాయి. అందువల్ల వాటికి సాహిత్య విమర్శ స్థాయి, విలువ లభిస్తాయి. ముందుమాటలు ఆయా పుస్తకాలు వచ్చిన చారిత్రక సందర్భాన్ని, రాజకీయార్థిక భూమికను వ్యాఖ్యానించేవిగా కూడా ఉంటాయి. ఆ రకంగా పరిశోధనకు అవసరమైన సమాచారాన్ని, చూపును ఇయ్యగల వనరులలో ‘ముందుమాట’ లకు ప్రాధాన్యత ఉంది.  

విశ్వవిద్యాలయ సాహిత్య అధ్యాపకురాలిగా ఎంఫిల్, పిహెచ్ డి విద్యార్థులకు పరిశోధనా పద్ధతులను పాఠంగా చెప్పేటప్పుడు ఒక రచయిత మీద గానీ, రచన మీద గానీ పరిశోధనకు పూనుకొన్నప్పుడు, ఆ రచయిత రచనలకు, లేదా ప్రత్యేక రచనకు  ఇతరులు వ్రాసిన ముందుమాటలు రచయితను లేదా రచనను అర్ధం చేసుకొనటానికి ఎలా ఉపయోగించుకోవచ్చో ,  సాహిత్య సేకరణ ఆకరంగా, పరిశోధనకు దిక్సూచిగా ముందుమాటలకు ఉన్న శక్తి ఏమిటో ఉదాహారణలతో వివరించి చెప్పిన అనుభవం నాది. ఇప్పుడు  హరగోపాల్ గారి ‘సందర్భం- సవాళ్లు’ లోని  ముందుమాటలు చదివితే అవి  అలా తరగతి బోధనకు అన్వయించి చెప్పటానికి వీలైన సారవంతమైన రచనలు అనిపించింది. 

 1983 నుండి 2023 జనవరి వరకు మూడు దశాబ్దాల కాలం మీద వ్రాసిన ముందుమాటలలో లభించిన నలభై రెండింటితో అదే సంవత్సరం ఫిబ్రవరిలో  పాలమూరు అధ్యయనవేదిక  ఈ పుస్తకం ప్రచురించింది. ప్రచురణకర్తల పక్షాన ఎం. రాఘవాచారి “ సున్నితమైన సంభాషణ -సూటి ప్రశ్నలు అనే శీర్షికతో ముందుమాట వ్రాసారు. పాలకవర్గ రాజకీయాలను, వారి అభివృద్ధినమూనాను ఎదిరించే దృఢత్వాన్ని , ఆయా రచనల ప్రాధాన్యతను  స్థలకాల పరిమితిలో , విస్తృతిలో చర్చిస్తూ రచయితలను ప్రోత్సహిస్తూనే  అధిగమించవలసిన లోపాలను మృదువుగా ఎత్తి చూపే సున్నితత్వాన్ని ఏక కాలంలో ఈ ముందుమాటలు ప్రదర్శిస్తాయని అంటారాయన. 

 ఈ ముందుమాటలలో 33 తెలుగు పుస్తకాలకు వ్రాసినవి అయితే మిగిలిన తొమ్మిది ఇంగ్లిష్ పుస్తకాలకు వ్రాసినవి.ఇవి కాక మరొక నాలుగు తెలుగు ముందుమాటలు ప్రస్తుతానికి లభిస్తున్నాయి. వాటితో కలుపుకొంటే ముందుమాటలు తెలుగులో వున్నవి 37, ఇంగ్లీషువి 9. మొత్తం 46. ముప్ఫయి ఏడు తెలుగు వ్యాసాలలో ఇరవైరెండు భిన్న రాజకీయార్థిక సమస్యలపై వచ్చిన పుస్తకాల ముందుమాటలు కాగా పదిహేను సాహిత్య కళారచనలకు వ్రాసినవి. 1983 నాటి తొలి రచన సాహిత్యానికి, అందులోనూ ప్రజావాగ్గేయకారులు తండ్రీకొడుకులు   సుద్దాల హన్మంతు ప్రారంభిం చగా సుద్దాల అశోక్ తేజ పూర్తి చేసి ప్రచురించిన  యక్షగానానికి వ్రాసినది కావటం విశేషం.  ఇంగ్లీషు ముందుమాటలలో  ఒకటి తప్ప మిగిలినవన్నీ దేశీయ రాజకీయ విధాన సమస్యా సంబంధులే. మరొక విశేషం  మొత్తం వ్యాసాలలో 20 పాలమూరు సమస్యలకు,సాహిత్యానికి సంబంధించినవి కావటం. హరగోపాల్ మహబూబ్ నగర్ జిల్లాకు చెందినవాడు కావటమే అందుకు కారణం అనుకొనటం సులభం. అంతమాత్రమేనా అంటే కాదు. తాను దేశం పట్టని మేధావిగా ఎదిగినా ప్రాంతీయ ప్రజా సంబంధాలను తాజాగా, దృఢంగా ఉంచుకొనటం,ప్రాంతీయ సామాజిక వైరుధ్యాలను అంతర్జాతీయ జాతీయ రాజకీయార్థిక పరిణామాల సంబంధంలో  అధ్యయనం చేయటం ఒక  పద్ధతి గా అభివృద్ధి చేసుకొనటం ఆయన ప్రత్యేకతలు. ఆ ప్రత్యేకత నుండే ఈ ముందుమాటలకు ఒక శాస్త్రీయమైన మెథడాలజీ సమకూరింది. 

ముందుమాట వ్రాయటం  అంటే ఒక  పుస్తకం  చదివి అందులో   ఏముందో చెప్పటం కాదు. అందులోని  విషయాన్ని  దేశీయ రాజకీయార్థిక పరిణామాల గతితార్కిక చారిత్రక  సందర్భం నుండి అధ్యయనం చేసే పద్ధతి వైపు పాఠకులను చైతన్యవంతులను చేయటం, వర్తమాన సందర్భంలో  లో దాని అవసరం ఏమిటో సూచించటం హరగోపాల్ గారి ముందుమాటల మౌలిక లక్షణం.  దేన్నైనా తక్షణ సందర్భం నుండి చూడటం, చారిత్రక నేపథ్యం నుండి చూడటం అనే రెండు పద్ధతులు ఉంటాయని, రెండవ పద్ధతిని ఇంకా అలవరచుకొన వలసే ఉన్నదని ‘స్వేఛ్ఛారావం’ పుస్తకం ముందు మాటలో ఆయన వ్రాసిన వాక్యం పుస్తకాలకు ముందుమాటలు వ్రాసే వాళ్లకు ఒక హెచ్చరిక. 

హరగోపాల్ గారి ముందుమాటలలో రాజకీయార్థిక పరిమాణాల చరిత్ర చర్చ ఆయా పుస్తకాలలోని వస్తువును బట్టి మూడు స్థాయిలలో  ఉంటుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుండి వర్తమాన కార్పొరేట్ ఫాసిజం వరకు దాదాపు తొంభై ఏళ్ళ దేశీయ రాజకీయార్థిక పరిణామాలలో భిన్న ఘట్టాల స్వభావాన్ని నిరూపిస్తూ ఆ వెలుగులో ఆ ప్రత్యేక రచనను అధ్యయనం చేయాలని సూచించటం ఒక రకం.  తెలంగాణ చరిత్రను , రాజకీయార్థిక పరిణామాలను వివరిస్తూ ఆ వెలుగులో ఆ ప్రత్యేక గ్రంథాన్ని పరిశీలించే మార్గాలు సూచించటం మరొక రకం. ఇంకా సూక్ష్మ స్థాయిలో పాలమూరు చరిత్ర  పరిణామాల సంబంధంలో ఒక పుస్తకాన్ని అధ్యయనం చేయవలసిన పద్ధతుల గురించి ప్రేరణ ఇయ్యటం.  

2

 హరగోపాల్ స్వీయ రచనలు మూడింటికి  వ్రాసుకొన్న ముందుమాటలు, కశ్మీర్ లో నిషిద్ధరాత్రి, ఆవాజ్, విషవలయంలో ప్రభుత్వ రంగ సంస్థలు వంటి పుస్తకాలకు వ్రాసిన ముందుమాటలు విస్తృత ప్రాతిపదిక మీద    భూస్వామ్య వర్గ ప్రయోజనాలకు ఇచ్చిన ప్రాధాన్యత దృష్ట్యా స్వాతంత్య్ర ఉద్యమంలో ఏర్పడిన పరిమితులను,  జరిగిన రాజీలను ప్రస్తావిస్తూ  1947 తరువాత క్రమంగా  గాంధీ, నెహ్రు, అంబేద్కర్ ఆశయాలను వదిలేసుకొంటూ పోయిన ప్రభుత్వ రాజకీయార్థిక విధానాలను, సంక్షేమం నుండి అభివృద్ధికి సాగిన ప్రస్థానంలో మరీ ముఖ్యంగా హరిత విప్లవం వలన ఉత్పత్తిరంగంలో విస్తరించిన ప్రజావ్యతిరేక ధోరణి ప్రభావాలను చర్చిస్తాయి.  పేదరికాన్ని సంబోధించి పనిచేసే వైఖరి కనుమరుగై ప్రభుత్వాలు అభివృద్ధి లక్ష్యంగా కొత్తమార్గం పట్టటం,1980 తరువాత పెట్టుబడి సామ్రాజ్యవాద శక్తులతో రాజీపడి ఆర్ధిక వ్యవస్థలో దళారీ పాత్రకు దిగజారడం మొదలైనవన్నీ అవసరాన్ని బట్టి విమర్శకు లోనవుతాయి.  

రచయితలు తమ రచనలకు తాము వ్రాసుకొనే  ముందు మాటలు ఆయా రచనలకు ప్రేరకమైన సామాజిక సాహిత్య సందర్భాలను, రచన ఉద్దేశాలను తెలియచేసేవిగా ఉంటాయి. హరగోపాల్  2011 నుండి 2015 వరకు క్రమం తప్పకుండా వరుసగా వ్రాస్తూ వచ్చిన పత్రికా  వ్యాసాల సంపుటి  స్వేచ్ఛారావం. స్వేచ్ఛారావం అనే కాలమ్ లో వ్రాసినవి ఆ పేరుతోనే పుస్తకం అయింది. దీనికి హరగోపాల్ వ్రాసుకొన్న ముందుమాట ‘మారుతూ వచ్చిన సందర్భం’. ఇందులో ఆయన నాలుగేళ్ల కాలంలో దేశ రాజకీయాలలో, రాష్ట్ర రాజకీయాలలో వచ్చిన పరిణామాలను స్పృశించే ఆ వ్యాసాలను గత ఆరు దశాబ్దాల దేశ చరిత్ర కోణం నుండి అర్ధం చేసుకోవాలన్న ప్రతిపాదన ప్రారంభంలోనే చేశారు. ఉత్పత్తివిధానంపై డిడి కోశాంబీ చేసిన సూత్రీకరణల వెలుగులో తన అవగాహన రూపొందిందని స్పష్టంగానే చెప్పారు. మతద్వేష రాజకీయాలు, సామ్రాజ్యవాద దోపిడీ తీవ్ర స్థాయికి చేరుకొంటున్న సందర్భం నుండి, ప్రభావం నుండి స్వేచ్ఛరావం వ్యాసాలు వచ్చాయని పేర్కొన్నారు. 

వృద్ధిరేటు, అభివృద్ధి అనే చర్చలో అట్టడుగు మనుషులు ఉన్నారా? ఉదాత్త విలువలు ఉన్నాయా? ప్రజాస్వామిక మానవీయ విలువలు ఉన్నాయా? సాంస్కృతిక రంగంలో మత ద్వేష రాజకీయాలకు, సామ్రాజ్యవాద దోపిడీకి ఉన్న సంబంధం ఏమిటి? వంటి ప్రశ్నల సందర్భం నుండి వ్యాసాలను చదవాలన్న సూచన కూడా ఇచ్చారు. సామాజిక సంక్లిష్టతలు బహువర్గ సమాజ లక్షణమన్న రచయిత అవగాహన ఇందులో స్పష్టం. విప్లవోద్యమం, విప్లవరాజకీయాలు గిరిజన ప్రాంతాలలో విస్తృతమవుతున్నట్లు గిరిజనేతర ప్రాంతాలలో లేకపోవటానికి బహువర్గ సమాజనిర్మాణం కారణమని హరగోపాల్ భావిస్తారు. ఒకవర్గాన్ని సమీకరించే క్రమంలో మరొకవర్గం జారిపోవటం, ఒకవర్గం బలంగా మార్పును కోరుకొంటే పాలకవర్గాలు మరొక వర్గాన్ని దానికి వ్యతిరేకంగా నిలబెట్టగలగటం  మొదలైన వైరుధ్యాల నేపథ్యంలో సామాజిక సమస్యలను, సవాళ్ళను విశ్లేషించాలి అంటారాయన.ఈ సైద్దాంతిక చిత్రాన్ని తెలంగాణ రాజకీయాల విశ్లేషణకు ఉపయోగించాలి అని సూచించారు. అస్తిత్వం  అసమానతలను అంతగా పట్టించుకోదు. తెలంగాణ ఉద్యమంలో అస్తిత్వం భౌగోళిక తెలంగాణవైపు నడిపిస్తే అసమానతలు సమాంతర ఉద్యమాలకు దారితీసాయి అన్నది ఆయన పరిశీలన. అసమానతల లోని అస్తిత్వాలను, అస్తిత్వాలలోని అసమానతలను చర్చించటం అవసరమని హరగోపాల్ అభిప్రాయం. పాలనలో భూస్వామ్య సంస్కృతి, ప్రజలలో ప్రజాస్వామిక ఆకాంక్ష సంఘర్షిస్తున్న సందర్భం నుండి రూపొందే ప్రజాఉద్యమాల మీద ఆయన చూపు. అందువల్లనే ఏమి ఆలోచించినా, ఏమి వ్రాసినా ఎటువంటి సమాజాన్ని కోరుకొంటున్నాం,మనం ఎక్కడ ఉండదలచుకొన్నాం, ఎటువైపు నిలబడ దలచుకొన్నాం  అన్నది ఆయనకు ప్రాధాన్య అంశం అవుతుంది. 

‘స్వేచ్ఛకోసం’ 2018 లో ప్రచురించబడిన హరగోపాల్ గారి మరొక  వ్యాస సంపుటి. దీనికి ఆయన వ్రాసుకొన్న ముందుమాట ‘మారుతున్న నేపథ్యం.’ఇవి కూడా  భిన్న సంఘటనలకు, సందర్భాలకు స్పందించి వ్రాసినవే అయినా అన్నిటి అంతస్సూత్రం మనుషులు స్వేచ్ఛగా జీవించే ప్రపంచం కావాలనే బలమైన ఆకాంక్ష అని ఆయనే చెప్పుకొన్నారు. ఈ ముందుమాటలో ‘స్వేఛ్చ’ అనే భావనను భిన్నకోణాలనుండి చర్చకు పెట్టారు. మేధో ప్రపంచంలో స్వేఛ్చ అంటే మనిషి ఆలోచనలమీద, సృజన మీద, మేధస్సు మీద పరిమితులు, నిర్బంధం లేని స్థితి. మార్కెట్ ప్రపంచంలో స్వేఛ్చ అంటే ఏ నిబంధనలూ లేకుండా అపరిమిత లాభాలు కూడ బెట్టుకొనే అవకాశం. ఈ రెంటికీ మధ్య ఉండే వైరుధ్యం, ఈ రెంటికీ రాజ్యంతో ఉండే వైరుధ్యం గురించి ప్రశ్నలు లేవనెత్తటమే కాక ఈ ముందుమాటలో పెట్టుబడి నిర్ణయాత్మక పాత్ర వహించే సమాజంలో శ్రామికులు  స్వేఛ్చకు, సంపన్నులు మానవత్వానికి పరాయీకరింపబదినప్పుడు స్వేఛ్ఛాయుత ప్రపంచం అనేది అసలు సాధ్యమేనా అన్న ప్రశ్నవేసి పాఠకులను ఆలోచించమంటారు.  అయితే తాము పోగొట్టుకొన్న స్వేచ్చకోరకు మనుషుల ఆరాటం  వర్గాల మధ్య జరిగే నిరంతర సంఘర్షణ  సారమని , సత్యమని సూచిస్తారు. 

ఈ సందర్భంలో ఆయన భారత  రాజ్యాంగం గురించి కూడా ప్రస్తావించారు. అందులో  స్వేఛ్చకు గౌరవప్రద స్థానం కల్పించబడినప్పటికీ సామాజిక వైరుధ్యాలు అందుకు ప్రతిబంధకం అయ్యాయని చెప్తూ నిజానికి రాజ్యం సామాజిక మార్పుకు ఒక సాధనంగా పని చేయాలని రాజ్యాం గంలో ఉన్నా అది ఎలా సాధించాలి అన్న దానిలో స్పష్టత లేకపోవటం వల్లనే ఆదేశిక సూత్రాలు అనుభవానికి రాకుండా పోయాయి అంటారు. రాజ్యాంగం కల్పించిన పరిమితమయిన స్వేఛ్చ  కూడా ఈ డెబ్బై ఏళ్ళ ప్రభుత్వ రాజకీయార్థిక  విధానాలవల్ల మరింత కుంచించుకు పోతున్నదని చెప్పారు హరగోపాల్. ముంచుకొస్తున్న ఫాసిస్ట్ ధోరణులు కూడా దానికి తోడవుతున్నాయి అన్న అవగాహన ఆయనది. అయితే ఈ వ్యతిరేక పరిస్థితులలో కూడా  ఆదివాసీలు, దళితులు, మహిళలు, విద్యార్థులు  చేస్తున్న ప్రతిఘటన పోరాటాలు స్వేఛ్ఛాయుత సమాజం గురించిన ఆశను , విశ్వాసాన్ని ఇస్తున్నాయని అంటారాయన. 

పరిమళించిన మానవత్వం అనే స్వీయ రచనకు హరగోపాల్ గారు వ్రాసుకొన్న ముందుమాట శీర్షిక ‘కృతజ్ఞత’ సామాజిక ప్రజా ఉద్యమాలలో తనకు సన్నిహితంగా ఉంటూ మరణించిన వాళ్ళ గురించి వ్యక్తిగత అనుభవ కోణంనుండి వ్రాసిన వ్యాసాల సంపుటి ఇది. అర్ధవంతంగా జీవించటమా?   సౌఖ్యంగా  జీవించటమా అన్న ప్రశ్నతో ఒక చర్చను ప్రారంభిస్తుంది ఈ ముందుమాట. సౌఖ్యంగా జీవించటం అంటే బాగా సంపాదించటం, సకల సౌకర్యాలు ఏర్పాటు చేసుకొనటం. ఆనందించటం. ఇది పూర్తిగా వ్యక్తిగతమైనది. ఇందుకు కుటుంబం నుండి రాజ్యం వరకు అన్ని వ్యవస్థల ఆమోదం ఉంటుంది. అర్ధవంతంగా జీవించటం అంటే స్వార్ధాన్ని విడిచి అందరి కోసం ఆలోచించటం. ఉమ్మడి ప్రయోజనాలు లక్ష్యంగా ఉన్నత ఆశయాలతో  సామాజిక ఉద్యమాలతో మమేకం కావటం. అధికారానికి, ఆధిపత్యానికి  తలఒగ్గక  ప్రతిఘటన పోరాటాలలో భాగం కావటం. రాజ్య నిర్బంధాలు, నిషేధాల మధ్య జీవించటం, మరణించటం. సౌఖ్యంగా జీవించటం అనేది వ్యక్తుల చైతన్యాన్ని నిర్దేశిస్తున్న కాలంలో ఇలా అర్ధవంతంగా జీవించే వాళ్ళు అల్ప సంఖ్యాకులే అయినా  సమాజం మరింత దిగజారకుండా ఎత్తి పట్టిన వాళ్ళు వాళ్ళే  కనుక మనం వాళ్ళ పట్ల కృతజ్ఞులమై ఉండాల న్నది హరగోపాల్ గారి ఆంతర్యం. 

                                               3

రాజకీయార్థిక సమస్యలపై ఇంగ్లిష్ లో వచ్చిన సిద్దాంతగ్రంథాలకు, విశ్లేషణా రచనలకు హరగోపాల్ ముందుమాటలు 1984 నుండే మొదలయ్యాయి. 1988 లో ప్రచురించబడిన బాలగోపాల్ వ్యాసాల సంపుటి AGRARIAN CLASSES AND CONFLICTS కి వ్రాసిన ముందుమాట చెప్పుకోతగినది. 1983-1987 మధ్యకాలంలో economic and political weekly లో ప్రచురించ బడిన ఆ వ్యాసాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరివర్తనలో సున్నితమైన దశలను చూపాయని, సమాజంలో నిర్లక్ష్యం చేయబడిన అణచి వేయబడిన వర్గాల ప్రజాస్వామిక హక్కుల పట్ల అక్కర వీటిలో కీలకం అని హరగోపాల్ అభిప్రాయపడ్డారు. ఈ వ్యాసాలలో బాలగోపాల్  ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ   ‘అభివృద్ధి’  క్రమం సృష్టించిన వ్యవసాయ కూలీల సమస్యను, ఆదివాసీల సమస్యను చర్చిస్తూ ఈ వాస్తవమే విప్లవోద్యమ అవసరాన్ని ముందుకుతెచ్చిందని నిరూపించారని చెప్పటానికి హరగోపాల్ అనేక అధ్యయనాలను, గణాంకాలను ఉదహరిస్తూ వాదించిన  తీరు ఈ ముందుమాటకు  ఒక స్వతంత్ర  వ్యాస ప్రతిపత్తిని సమకూర్చింది. 1850 నుండి 1977 వరకు ఒక వ్యవసాయంలో  అభివృద్ధి , మరొక వైపు వ్యవసాయకూలీల పరిస్థితిలో ఏమాత్రం మెరుగుదల లేకపోవటం సమాంతరంగా సాగిన విషాద చరిత్రను, అలాగే వ్యవసాయక సమాజంలో భాగంగా బ్రిటిష్ వలసపాలన కాలం నుండి 1980 వరకు ఎన్ని అటవీ చట్టాల ద్వారా, ఎన్నిఆర్ధిక  విధానాల ద్వారా  ఆదివాసీ జీవితం ఏ దశకు నెట్టబడిందో దానిని రేఖా చిత్రంగా చూపిస్తూ ఆ నేపథ్యంలో బాలగోపాల్ వ్యాసాలను చూడాలంటారు.బాలగోపాల్ పుస్తకంలోని రెండవ భాగం  వ్యవసాయరంగపు ఈ అభివృద్ధి సృష్టిం చిన సంపద నుండి రూపొందిన కొత్తవర్గాలకు  రాజ్యాధికారంతో ఏర్పడిన సంబంధం గురించి చర్చించాయని చెబుతూ   మొత్తంమీద ఆంధ్రసమాజపు ఆర్ధిక పునాది సెమీఫ్యూడల్ సంబం ధాలలో, దళారీ ప్రభుత్వ పెట్టుబడి లో ఉందని  చెప్పటం ఈ వ్యాసాల అంతర్గత సూత్రం. అసహ్యకరమైన వాస్తవాలను చర్చించటమే కాక ఉన్నత మానవీయ విలువల మీద నిర్మించబడవలసిన నూతన సమాజాన్ని గురించిన తాత్విక దృక్పథం ఈ వ్యాసాల లో వెలుగు అని హరగోపాల్ అంటారు. 

ఇలా దేశీయ రాజకీయార్థిక పరిణామాలకు వ్యాఖ్యానంగా వచ్చిన పుస్తకాలలో    కశ్మీర్ వాసి, జర్నలిస్ట్  అయిన బషారత్ పీర్ రచన  ‘కశ్మీర్ లో నిషిద్ధరాత్రి’ ఒకటి. తెలుగు అనువాదం యార్లగడ్డ నిర్మల.  ప్రజలను ప్రజాస్వామ్య కళ్ళ  నుండి, ప్రజాస్వామ్యాన్ని ప్రజల కళ్ళ నుండి చూడవచ్చు అన్న ప్రతిపాదనతో ఈ ముందుమాట ప్రారంభించారు హరగోపాల్.  ఈ పుస్తకం  కాశ్మీర్ ప్రజల హృదయవేదనని, ఒక రాజ్య పరుషత్వాన్ని, అమానుషత్వాన్ని, అహంకారాన్ని ప్రజల కోణం నుండి పట్టగలిగిన అరుదైన రచన అని పేర్కొన్నారు. రాజ్యాంగంలో కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తికి హామీ ఇస్తున్న ఆర్టికల్ 370 ని రద్దు చేయాలని నరేంద్ర మోడీ ప్రచారం ప్రారంభించిన రోజుల్లో వచ్చిన పుస్తకం (2014) ఇది. నరేంద్ర మోడీ ప్రధాన మంత్రి అయితే రద్దు చేయవచ్చు అని హరగోపాల్ ఆ ముందుమాట ప్రారంభంలో ఏమి చెప్పారో అది 2019 ఆగష్టు 5 నాటికి నిజమైంది. భారతదేశంలో ఫాసిజం వ్యక్తి పూజతో ప్రారంభమై విద్వేష రాజకీయ పునాదుల మీద నిర్మించబడుతున్న తీరును కూడా ఆయన ఆ ముందుమాటలో ప్రస్తావించారు. బిజెపి అధ్యక్షుడు రాజనాథ్ సింగ్  మోడీని రాముడితో పోల్చిన అంశాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. రామజన్మభూమి వివాదంలో బిజెపికి సానుకూలంగా సుప్రీం కోర్ట్ తీర్పు వెలువడింది కూడా 2019 లోనే ( నవంబర్ 9). సంప్రదాయ రాముడిని ఆధునిక అభివృద్ధిని కలపి తయారుచేసిన కాషాయ విషం జాతిలోకి ఎక్కించే పని మొదలైనదని హరగోపాల్ ఆ ముందు మాటలో గుర్తించిన ప్రమాదం ఈ నాటికి ఎంత తీవ్రస్థాయికి చేరిందో అనుభవిస్తూనే ఉన్నాం. దేశభక్తిని హిందూ మత విశ్వాసంతో ముడిపెట్టి అన్య మతస్థులను దేశభక్తి  లేనివాళ్లుగా తేల్చివేయటం, మతవిద్వేషాలను వ్యతిరేకించే స్వమతస్థులను దేశభక్తుల జాబితా నుండి మినహాయించటం జరుగుతున్న జాతీయవాద నేపథ్యం నుండి కశ్మీర్ సమస్యను చూడాలంటారు హరగోపాల్. భారతదేశంలో  జాతిరాజ్యభావన, సాంస్కృతిక వనరుల మీద ఆధారపడి అభివృద్ధి చెందటం వలన  మతప్రాధాన్యత పెరిగిన నేపథ్యంనుండి కశ్మీర్ ప్రజల దుస్థితిని అర్ధం చేసుకోవాలని అంటారాయన. కశ్మీర్ విషయంలో స్వతంత్ర ప్రతిపత్తిని అంగీకరించటం నుండి కశ్మీర్ సమస్య పరిష్కారానికి 1950 నాటికే సైన్యాన్ని పంపిన చరిత్ర పరిణామాలను ప్రస్తావిస్తూ వాటి సంబంధంలో “కశ్మీర్ లో నిషిద్ధరాత్రి” పుస్తకాన్ని అధ్యయనం చెయ్యాలని సూచించారు  హరగోపాల్.

భారతదేశంలో కశ్మీర్ వలెనె  దేశ సైన్యమే  దేశ ప్రజల  మీద దాడి చేసే మరొక యుద్ధభూమి బస్తర్.బస్తర్ లోని విలువైన ఖనిజ సంపదను కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు కట్టబెట్టటానికి భారతప్రభుత్వం అక్కడి ఆదివాసీల మీద చేస్తున్నయుద్ధం అది. అదే   ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో సోషియాలజీ ప్రొఫెసర్ గా ఉన్న  నందిని సుందర్ కు  పరిశోధనాంశం అయింది. The Burning Forest: India’s War In Bastar  దాని ఫలితంగా వచ్చిన పుస్తకమే. దానికి రివేరా చేసిన  తెలుగు అనువాదం ‘రగులుతున్న అడవి’ (2019) కి హరగోపాల్ ‘యుద్ధభూమిలో నిలబడి పరిశోధన’ అనే శీర్షికతో ముందుమాట వ్రాసారు. అందులో ఆయన పరిశోధనా ప్రక్రియకు సంబంధించిన మౌలికమైన ప్రశ్నలను చర్చించారు. నందినీ సుందర్ బస్తర్ సామాజిక సంఘర్షణలు, పరిణామాలపై పరిశోధన చేయటమే కాక సల్వాజుడుం వలన ఆదివాసీల హక్కులకు కలుగుతున్న ఆపదకు నొచ్చుకొని న్యాయపరమైన పోరాటంలోకి కూడా దిగింది. పరిశోధన జ్ఞాన విషయం  అయితే   జ్ఞానానికి అంతిమ లక్ష్యం ఆచరణ అవుతుందని ఆచరణ నుండే జ్ఞానం నిగ్గుతేలుతుందని అంటారు హరగోపాల్. ఈ సందర్బంలోనే  నిష్పక్షపాతం, పక్షపాతం అనే భావనల  కోణం నుండి పరిశోధన స్వభావాన్ని వివరించారు. వ్యక్తుల ప్రాపంచిక దృక్పథంతో, భావజాలంతో ప్రభావితం కాని పరిశోధన నిష్పక్షపాత పరిశోధన. అది అభిలషణీయం అనే వర్గం ఒకటి. పెట్టుబడి, శ్రమ అని రెండుగా విడిపోయిన ఉత్పత్తి విధానాల సంబంధాల వ్యవస్థలో సామాజిక శాస్త్రవేత్తలు ఆ రెండింటిలో  ఏదో ఒక దాని వైపు నిలబడటం అనివార్యమని అందువలన నిష్పక్షపాత పరిశోధన అనేది అసలు సాధ్యమే కాదని అనే  వర్గం మరొకటి. అయితే పెట్టుబడివైపు నిలబడ్డవాళ్ల పరిశోధనలు నిష్పక్షపాత పరిశోధనలుగా ప్రచారం చేయబడుతూ వ్యవస్థలో యథాతథస్థితికి తోడ్పడుతుంటాయని, శ్రమ వైపు నిలబడ్డ వాళ్ళ పరిశోధనలు పక్షపాత పరిశోధనలుగా తక్కువ చేయబడుతుంటాయని నిష్పక్షపాత, పక్షపాత పరిశోధనల మాయను విప్పి చెప్పారు హరగోపాల్. పరిశోధన  ఆచరణగా ఉన్నత స్థాయిని అందుకొనటం  సమాజంలో మౌలిక మైన మార్పును ఆశించి జరుగుతుందని ఆ రకంగా నందినీ సుందర్ పరిశోధన, ఆచరణ సామాజిక శాస్త్ర రంగంలో ఒక ఆదర్శ నమూనా అవుతుందని ఆయన భావించారు.  

నందినీ సుందర్ పరిశోధనాంశం అయిన బస్తర్ ఆదివాసీ సమస్యలకు, సంక్షోభాలకు, పోరాట కారణాలను భారతరాజకీయార్ధిక విధానాల సంబంధంలో అర్ధం చేసుకొనటానికి అవసరమైన  సమాచారం కూడా ఈ ముందు మాటలో ఉంది. నెహ్రు ప్రభుత్వం ప్రవేశపెట్టిన మిశ్రమ ఆర్ధిక వ్యవస్థ దగ్గర మొదలై 1980 లలో అంతర్జాతీయ ద్రవ్య సంస్థల పెత్తనాల కింద అభివృద్ధి కోసం కొనసాగుతున్న పరుగులు, పోటీలు గిరిజన జీవిత విధ్వంస కారకాలు కావటాన్ని సూచిస్తూ అభివృద్ధి ఎవరి కొరకు? అభివృద్ధిలో ఎవరు భాగస్వాములు? వృద్ధిరేటు పెరుగుదల కు అభివృద్ధి నమూనా బలిపీఠం మీద బలయ్యే జీవితాలు ఎవరివి ? వంటి కీలకమైన ప్రశ్నలను పాఠకుల ముందుకు తెచ్చారు హరగోపాల్.  కార్పొరేట్ ఫాసిజం సాధించే అభివృద్ధి ఆదివాసీ విధ్వంసానికి, విస్థాపనకు కారణం అవుతుంటే ఆదివాసీ పోరాటాలు అనివార్యం అవుతూనే  ఉంటాయని  మావోయిస్టులో, మానవ హక్కుల సంఘాలో వాళ్ళ పక్షాన నిలబడటం కూడా అంతే సహజంగా జరుగుతుందని ఈ ముందు మాటలో హరగోపాల్ సూచించారు. 

కమ్ముకొస్తున్న మతోన్మాదం గురించి పి. వరలక్ష్మి  వ్రాసిన వ్యాస సంపుటికి వ్రాసిన ముందుమాట(2017) లో హరగోపాల్  సమాజంలోని భిన్న వైరుధ్యాలను, భిన్న స్థాయిల చైతన్యాన్ని  ‘విప్లవం- ప్రతీఘాత విప్లవం’ అన్న అంబేద్కర్  సూత్రీకరణ వెలుగులో విశ్లేషించాలంటారు.

 డి. నరసింహారెడ్డి పుస్తకం ‘ఆర్ధిక మాంద్యం- విధాన వికృతి’ కి వ్రాసిన ముందుమాట(2019) లో కూడా హరగోపాల్ అభివృద్ధి నమూనాలు సృష్టించే సామాజిక అగాధాలనే గురి చూసారు. ఆర్ధిక శాస్త్రవేత్తలను కేవలం సంపద పెరుగుదలనే అభివృద్ధిగా భావించేవాళ్లు, మనిషిని ప్రమాణంగా పెట్టుకొని సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతూ వుండే ఒక సంతోషకరమైన సమాజ నిర్మాణాన్ని కోరుకొనేవాళ్ళు అని రెండు రకాలుగా వర్గీకరించి  నరసింహారెడ్డి రెండవరకానికి చెందినవారని ఇలాంటివారికి వృద్ధికంటే పంపిణి, సామాజిక న్యాయం, సమానత్వభావనలు ముఖ్యం అని చెప్తారు హరగోపాల్. 

జాతీయవిద్యావిధానం 2020 ను విశ్లేషిస్తూ ఆంద్రప్రదేశ్ తెలంగాణ విద్యాపరిరక్షణ కమిటీలు సంయుక్తంగా ప్రచురించిన వ్యాస సంపుటికి విద్య భవిష్యత్తు ఏమిటి? అనే శీర్షికతో వ్రాసిన ముందుమాటలోనూ హరగోపాల్ సుదీర్ఘ  ఉత్పత్తి శక్తుల,ఉత్పత్తి సంబంధాల పరిణామక్రమ  చరిత్ర సంబంధం నుండే విద్య గురించి మాట్లాడతారు. విద్యను జ్ఞానంలో భాగంగా చూస్తారు అయన. జ్ఞానమంటే మానవులు ప్రకృతిలోని ఉత్పత్తి శక్తులను తమ అదుపులోకి తీసుకొనటమే అన్న మార్క్సియన్ దృష్టి కోణంతో ఆచరణ జ్ఞానంగా మారుతుందని అది ఆచరణను మరింత ఉన్నతదశకు తీసుకుపోతుంటుందని విశ్వసిస్తారు. అయితే ఆ క్రమంలో అభివృద్ధి చెందిన వైరుధ్యాలు ఆచరణతో సంబంధం లేని అమూర్త జ్ఞానాన్నే అంతిమ జ్ఞానం గా చేసి దానికి కొందరినే అర్హులుగా ప్రతిపాదించి చాలామందిని దూరం చేసిన వర్గ చరిత్ర లో విద్య ఏ స్వరూపాన్ని, ఏ స్వభావాన్ని సంతరించుకొన్నదో సుదీర్ఘంగా చర్చించారు. జాతీయోద్యమ కాలంలోనూ, రాజ్యంగ రచనాకాలంలోనూ స్వతంత్ర భారతదేశంలో ప్రజలకు అందియ్యవలసిన విద్యగురించిన కలలు 1980 తరువాత పెట్టుబడుల ప్రపంచంలో విద్యకూడా ప్రయివేటీకరణకు గురవుతున్న క్రమంలో కల్లలు కావటాన్ని గురించి ఈ ముందుమాట వివరిస్తుంది.  విద్య అమ్మకపు సరుకైన తరువాత జ్ణానరంగంలోనూ వ్యాపార వినియోగ దారీ సంబంధాలే  ప్రధానమవుతున్న వర్తమాన విషాదాన్ని ఈ ముందుమాట ప్రతిఫలిస్తుంది. ఈ నేపథ్యంలో జాతీయ విద్యావిధానం 2020 నిచ్చెనమెట్ల సమాజాన్ని బలపరిచేదిగా ఉందంటారు హరగోపాల్. అందరికీ సమాన విద్యను వాగ్దానం చేయకపోవటంలో ఫాసిస్టు రాష్ట్ర నిర్మాణ భావజాలం పనిచేసిందని, ప్రత్యేకించి సోషలిజం, సెక్యులరిజం పట్ల వ్యతిరేకత దీని తత్వమని ఆయన స్పష్టం చేశారు. 

‘అమ్మకంలో ప్రభుత్వరంగం’ అనే పుస్తకానికి ( రచయిత – ఎం. శ్రీనివాస్) ‘విషవలయంలో ప్రభుత్వ రంగ సంస్థలు, అనే శీర్షికతో  వ్రాసిన ముందుమాట(2022)లో కూడా నెహ్రు మిశ్రమ ఆర్ధికవిధానం నుండి ప్రవేటీకరణ వైపు సాగిన ప్రభుత్వ ఆర్ధిక విధానపు చట్రం ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనమైనవిగా, అసమర్ధమైనవిగా ఒక క్రమ పద్ధతిలో ప్రచారం చేస్తూ ‘అభివృద్ధి’ లక్ష్యంగా వాటిని ప్రయివేటు పరం చేసినా తప్పులేదనే అభిప్రాయాన్ని వ్యాప్తిలోకి తెచ్చి , దానిని ప్రజాభిప్రాయంగా మలిచిన క్రమం గురించి ప్రస్తావించి ఆ నేపథ్యంలో ఆ పుస్తకంలోని వ్యాసాలను చదవాలని సూచించారు హరగోపాల్.  

ఈ విధంగా విషయం  కాశ్మీర్ అయినా, బస్తర్ అయినా,  ఆర్ధిక వ్యవస్థలైనా, విద్య అయినా, మతం అయినా అన్నింటినీ  సామాజిక ఉత్పత్తి సంబంధాల పరిణామ ప్రభావాలతో   అనుసంధించి అధ్యయనం చేయటం, అర్ధం చేసుకొనటం, జాతీయవాద సామ్రాజ్యవాద  రాజకీయాల మాయను గుర్తెరుగుతూ సమాజంలో మంచికి జరగవలసిన మార్పు కోసం కొనసాగవలసిన ప్రజాఉద్యమాల అవసరాన్ని నొక్కి చెప్పటం  హరగోపాల్  ముందుమాటల లక్షణం. 

  వర్గవైరుధ్యాల వల్ల ఏర్పడి నానాటికీ  తీవ్రమవుతున్న అసమానతలను రద్దు చేసే దిశగా  జరగవలసిన విముక్తి పోరాటాలవైపు ఉంటుంది హరగోపాల్  చూపు. అందుకనే పెట్టుబడిని ప్రతిఘటించే, సామ్రాజ్యవాదాన్ని ధిక్కరించే ఉద్యమాలపట్ల ఆయనకు గౌరవం. ఆదివాసీలు తప్ప మిగతా ఏ వర్గాలు, ఆ ఉద్యమంలో అంత పెద్ద ఎత్తున భాగస్వాములు కాలేకపోతున్నారన్నది  ఆయన పరిశీలన.అయినా  అస్తిత్వ ఉద్యమాల పట్ల ఆయనకు సానుభూతి. అవి కూడా ఏదో ఒక స్థాయిలో అసమానతలను ప్రశ్నించినవే కావటం అందుకు కారణం. అందులోనూ ప్రాంతీయ అసమానతలకు వ్యతిరేకంగా వలస ఆధిపత్యాన్ని ధిక్కరించిన తెలంగాణా ఉద్యమం ఆయనకు ప్రియమైనది. అయితే మొత్తంగా తెలంగాణ సమస్యకు సంబంధించి వచ్చిన పుస్తకాలలో  అల్లం నారాయణ వ్యాసాల సంపుటి ప్రాణహితకు వ్రాసిన ముందుమాట(2012) తప్ప మరొకటి లేదు. ఆ సంపుటిలో  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమం పట్ల నిబద్ధత ప్రధానస్రవంతి ప్రవాహం అంటూ నారాయణ తెలంగాణా ఉద్యమాన్ని భిన్నకోణాలనుండి విశ్లేషించిన వ్యాసాలను,సింగరేణి ఓపెన్ కాస్ట్ విధ్వంసాన్ని, రైతుల ఆత్మహత్యలను గురించి ఆవేదనను తెలంగాణ రాజకీయ నాయకుల  అవినీతి అవకాశవాదాల పట్ల అసహనాన్ని ప్రకటించిన  వ్యాసాల ప్రత్యేకతలను వివరిస్తూనే    పాలమూరు జిల్లా నీటి సమస్యపై,  కరువు సమస్యపై నారాయణ వ్రాసిన వ్యాసాలను ప్రత్యేకం ప్రస్తావించటం గమనించవచ్చు.తెలంగాణ సమస్యను మరింత సూక్షస్థాయిలో అర్ధం చేసుకొనటానికి, వివరించటానికి  పాలమూరు సందర్భాన్ని హరగోపాల్  బాగా వాడుకున్నారు .  

 ప్రపంచవ్యాపిత ఉత్పత్తి నమూనా దేశాలమధ్య అసమానతలను సృష్టిస్తుంది.  అభివృద్ధి చెందిన దేశాలు, మూడవ ప్రపంచదేశాలు అన్న విభజన అలా వచ్చిందే.  అలాగే ఒక దేశంలో అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెంది ఉండవు. వనరుల లేమి, అంతకన్నా ఉన్న వాటిని సక్రమంగా వినియోగంలోకి వచ్చేట్లు నిర్వహించకపోవడం,  విధానాలను రూపొందించకపోవటం, అమలుచేయకపోవటం మొదలైనవి దేశంలోనే రాష్ట్రాలమధ్య, రాష్ట్రంలోని జిల్లాలమధ్య అసమ అభివృద్ధికి కారణమవుతాయి. ఆ రకంగా ఆంధ్రరాష్ట్రంలొ తెలంగాణ వెనకబడిన ప్రాంతం  అయితే  వెనకబడ్డ తెలంగాణాలో మరింతవెనకబడిన జిల్లా పాలమూరు. కరువుకు, భిన్నప్రాంతాలకు బతుకుతెరువులకై వలసపోయే కూలీలకు అది ప్రసిద్ధి. ఆ సమస్యలకు ఒక పరిష్కారం వెతికే క్రమంలో 1995 లో అక్కడ కరువు వ్యతిరేక పోరాటకమిటీ ఏర్పడి పనిచేయటం మొదలుపెట్టింది. 1997 తరువాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో కీలక సమస్యలైన నీళ్లు, నిధులు,నియామకాలు అన్న మూడంశాలలో నీళ్లు పాలమూరు ప్రధాన సమస్య. నియామకాలు కూడా ఒక అంశమే. ఈ సమస్యల మీద స్థానిక ప్రజల ఆకాంక్షలు, ఆరాటాలు, ప్రతిఘటనల చరిత్ర రచనలు అనేకం వచ్చాయి. ఈ నేపథ్యంలో  పాలమూరు సామాజిక ఆర్ధిక రాజకీయ సమస్యలకు సంబంధించిన పుస్తకాలకు హరగోపాల్ గారు వ్రాసిన ముందుమాటలు ప్రత్యేకం పరిశీలించదగినవి.  

పాలమూరు కరువు వ్యతిరేక పోరాటకమిటీ రైతు సేవాసమితి , రాయలసీమ ప్రజా సమితి, ఆంధ్రప్రదేశ్ రైతుకూలీపోరాటసమితి తో కలిసి  తెలంగాణ రాయలసీమలలో  కరువు మీద పనిచేసింది. కరువు కాలపు ప్రజల ఆవేదన, ఆక్రందన , ఆగ్రహం వ్యక్తమైన పత్రికారచనలను, వార్తలను సేకరించి ప్రచురించిన(2000) పుస్తకం ‘కరువుదారిలో’. ఈ పుస్తకంలో బాధలు, సమస్యలు, ప్రజల డిమాండ్లు, ప్రభుత్వ స్పందనాపద్ధతి, ప్రజాఉద్యమాలు అనే నాలుగు అంశాలు ఉన్నాయని వాటిని వివరించారు హరగోపాల్. చెరువుల మరమ్మత్తు, విత్తనాల సరఫరా, పంట రుణాలు, రుణ మాఫీలు మొదలైన డిమాండ్లతో ప్రజాఉద్యమాలు నిర్మించబడుతుండగా ఆయా సమస్యలను  పరిష్కరించే దిశగా అడుగు కడపకపోగా  ప్రభుత్వాలు ఆ ఉద్యమాలే శాంతి భద్రతలకు భంగకరమంటూ అణచివేత చర్యలకు దిగటం ఎలా జరిగిందో ఈ పత్రికారచనలు దృశ్యమానం చేస్తాయని అంటారు హరగోపాల్. 

1995 లో ఏర్పడిన పాలమూరు కరువు వ్యతిరేక పోరాట కమిటీ ఉద్యమ చరిత్రను చెప్పే కరపత్రాల సంపుటి ‘గొంతెత్తిన పాలమూరు’(2010)..ఉపాధ్యాయులు, న్యాయవాదులు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, రైతులు పాతికముప్ఫయి మంది కలిసి పదిహేనేళ్ల కాలంలో కరువుకు వ్యతిరేకంగా  గ్రామాలకు వెళ్లి సభలు పెట్టి సమస్యలు చర్చించి, నిర్దిష్ట డిమాండ్లతో ధర్నాలు చేయటానికి ప్రజలను సమీకరించిన ఉద్యమ సందర్భాన్ని, పరిణామక్రమాన్ని అర్ధం చేసుకొనటానికి ఉపయోగపడే కరపత్ర సంపుటి ఇది అంటారు హరగోపాల్. దీనిని ఒక సామాజిక ప్రయోగంగా భావించారాయన. ఈ ప్రయోగం లో ఒక సామాజిక శాస్త్రవేత్తగా తాను కూడా భాగమే. పాలమూరు జిల్లా అంటే మొదటి సమస్య  వలస. బతుకు తెరువు మార్గాలు లేక పొట్టకూటికోసం కూలిపనులు వెతుక్కొంటూ దేశాలు పట్టిపోవటం.జిల్లాలో సగం జనాభా పరిస్థితి ఇది. స్వస్థలాలలో  వదిలివెళ్లిన కుటుంబాల దిక్కులేనితనం,  వెళ్లినచోట పనిపరిస్థితులు, దోపిడీ, హింస  వలస కూలీల వ్యక్తిగత, కుటుంబ జీవితాల విధ్వంసానికి కారణం అవుతుంటే ఆ సందర్భం నుండి పనిచేయాటానికి ముందుకువచ్చిన సమూహం ఇది. 

ఈ ముందు మాటలో హరగోపాల్ వలస సమస్యను పాలమూరు భౌగోళిక రాజకీయార్థిక చరిత్ర సంబంధంలో వివరించే పని చేశారు. పాలమూరు జిల్లా చారిత్రకంగా వందల సంవత్సరాలుగా సంస్థానాధీశుల పాలనలో ఉంటూ భూస్వామ్య సంబంధాలను, సంస్కృతిని పెంచిపోషించటం, స్వాతంత్య్ర ఉద్యమ ప్రభావం కానీ , తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట ప్రభావం కానీ బలంగా లేకపోవటం,  వలస పాలనా కాలం నుండి అభివృద్ధి మార్గంలో మహబూబ్ నగర్ ను కలపకపోవటం ఉత్పత్తిశక్తుల అభివృద్ధికి అవరోధం అయిందన్నది హరాగోపాల్ ఆరోపణ. అంతకంటే ముఖ్యమైనది  నీళ్ల సమస్య. జీవనది  కృష్ణ మూడువందల కిలోమీటర్లు ప్రవహిస్తున్నా, తుంగభద్రనీళ్ళు  అందుబాటులో ఉన్నా 70 శతం వరకు వ్యవసాయ భూమి ఉన్నా, కష్టించే మనుషులు ఉన్నా వలసలు, అందుకు మూలమైన కరువు ఉందంటే అది మానవ వైఫల్యమే అంటారు హరగోపాల్. మహబూబ్ నగర్ జిల్లా కు సాగునీరు కోసం కృష్ణానది మీద కట్టిన జూరాల ప్రాజెక్ట్ 1995 లో పూర్తయినప్పటికి దాదాపు 12 టీఎంసీ నీటి సామర్ధ్యం 7టిఎంసి సామర్ధ్యానికి కుదించబడటం, కృష్ణానది నుండి 220 టిఎంసి నీళ్ల కేటాయింపు ఆచరణకు నోచుకోకపోవడం మహబూబ్ నగర్ వ్యవసాయాభివృద్ధికి అవరోధం అయ్యాయని ఆయన అభిప్రాయం. 

ఈ ముందుమాటలో  మరొక ఆసక్తికరమైన పరిశీలన ఉంది. కరువు దానితో ముడిపడిన వలసలను ప్రధాన సవాళ్లుగా స్వీకరించి ప్రారంభించిన ఉద్యమం క్షేత్రపర్యటనలలో ప్రజల అనుభవాలు, అవసరాలు తెలిసే కొద్దీ  దానితో ముడిపడిన అనేకానేక ఇతర సమస్యలను కలుపుకొంటూ విస్తరించటం ఎంత అనివార్యంగా జరిగిందో చెప్తారు హరగోపాల్. కరువు, వలసలు దగ్గర పని మొదలు పెడితే కుటుంబాల అరకొర ఆదాయాలు, అప్పులు , ఆకలిచావులు, ఆరోగ్యం, విద్య, స్త్రీలపై అత్యాచారాలు, హింస,హత్యలు, దళిత సమస్య, కాంట్రాక్టర్ల దురాగతాలు, ఇసుక తరలింపు, తాగునీరు, సాగునీరు, నదీజలాలలో వాటా, పెండింగ్ ప్రాజెక్టులు, పార్లమెంటరీ రాజకీయాలు మొదలైన వ్యక్తిగత వ్యవస్థాగత సవాళ్ళను సంబోధించవలసి వచ్చిందని ఆ రకంగా ప్రజలే ఉద్యమ  కార్యక్షేత్ర నిర్ధారకులు అయ్యారని అంటారు ఆయన. 

ఉద్యమం ఒక సృజనాత్మక కార్యాచరణ కనుక అది అవసరాన్ని, ప్రయోజనాలను బట్టి భిన్న రూపాలలో సాగుతుంటుంది. గ్రామాలకు వెళ్లి సమస్యలు చర్చించటం, సభలునిర్వహించటం, సమస్యల పరిష్కారానికి రాజకీయనాయకుల మీద, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవటం, వలస చావులు, ఆకలి చావులు, ఆత్మహత్యలు సంభవించినప్పుడు నిజనిర్ధారణ కమిటీలు వేసుకొని వెళ్లి స్థానికులను కలిసి నమాట్లాడి వాస్తవాలను తెలుసుకొని నివేదికలు తయారుచేయటం, ప్రెస్ సమావేశాలు పెట్టి వాటిని విడుదల చేయటం , ఇతర ప్రజా సంఘాలను కలుపుకొని పనిచేయటం, , ఆయా సమస్యల మీద కవులను కళాకారులను కదిలించి ఏకవేదిక మీదికి తీసుకొనిరావటం మొదలైన రూపాలలో సాగిన ఉద్యమ చరిత్రను ఈ కరపత్రాలు నమోదుచేశాయని హరగోపాల్ వివరించారు. పాలమూరు సమస్యను తెలంగాణలో ఇతర ప్రాంతాలవారికి బలంగా వినిపించటంలో,  తెలంగాణ ఉద్యమంలో పాలమూరు సమస్యను అనివార్యమైన అతిసహజమైన అంశంగా ప్రస్తావించే స్పృహను పెంచటంలో కరువు వ్యతిరేక కమిటీ విజయం సాధించిందని హరగోపాల్ అంటారు. 

కరువు వ్యతిరేక కమిటీ నిర్మాణ నిర్వహణాలలో చురుకైన పాత్ర వహించిన ఎం. రాఘవాచారి వ్రాసిన మూడు పుస్తకాలకు హరగోపాల్ వ్రాసిన ముందుమాటలు ప్రధానంగా పాలమూరు సమస్యలను తడిమేవే. ‘మాకూ కలలున్నాయి’(2011) పుస్తకంలో నీళ్ల గురించి, నీళ్ల దోపిడీ గురించి దొంగతనాన్ని గురించి, నీళ్ల లేమి వల్ల ప్రజలకు కలిగే నొప్పి గురించిన వ్యాసాలు ఉన్నాయని  చెప్పారు  హరగోపాల్. విశాలాంధ్ర ఏర్పాటు సందర్భంగా కృష్ణానది నుండి మహబూబ్ నగర్ జిల్లాకు 220 టిఎంసిల నీళ్లు ఇయ్యాలని పుచ్చలపల్లి సుందరయ్య చేసిన ప్రతిపాదన ఆచరణలో అబద్ధం కావటం పట్ల ఆగ్రహం ఈ రచనలలో కనబడుతుందని అందువలన  ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో అభివృద్ధి గురించి, న్యాయాన్ని గురించి ప్రత్యామ్నాయాన్ని గురించి బలమైన ఆలోచనలు ఉండాలన్న ఆకాంక్ష వీటిల్లో వ్యక్తం అయిందని హరగోపాల్ గమనించి చెప్పారు. క్షేత్రస్థాయి ఉద్యమ కార్యకర్తగా రాఘవాచారి రచనలకు ఉండే ప్రాధాన్యతను ప్రస్తావిస్తూనే క్షేత్రస్థాయి అనుభవాలనుండి వచ్చే జ్ఞానాన్ని సైద్ధాంతిక స్థాయికి తీసుకువెళ్లే మేధో శ్రమ అవసరాన్ని గుర్తు చేస్తుంది ఈ ముందుమాట. 

కృష్ణానది నీళ్ల లో మహబూబ్ నగర్ జిల్లాకు రావలసిన వాటాను కేటాయించటంపట్ల పాలకవర్గాల వైఖరి కలిగించిన ఆవేదన నుండి  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మహబూబ్ నగర్ జిల్లా నీటివనరుల గురించి నిజమైన లెక్కలతో, వివరాలతో  రాఘవాచారి రూపొందించిన  నివేదిక ‘కృష్ణా నది నీళ్లు – మహబూబ్ నగర్ విషాదగాధ’ (2016)  దీనికి వ్రాసిన ముందుమాటలో హరగోపాల్ నీళ్ల పంపకానికి ప్రమాణాలు –  న్యాయభావన , సామాజికంగా, ఆర్ధికంగా అంతకుమించి రాజకీయంగా వెనుకబడిన ప్రజలపట్ల ప్రత్యేక శ్రద్ధ  అని నొక్కి చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో నీళ్ల విషయంలో తెలంగాణాకు జరిగిన అన్యాయం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఒక బలమైన కారణం. నీటి వనరులు విరివిగా ఉపయోగంలో ఉన్న ప్రాంతవాసుల చేతిలో అధికారం ఉన్న వర్గం హరితవిప్లవంలో విప్లవాన్ని చూడగలిగారు కానీ బావుల మీద, కుంటల మీద, చెరువులమీద ఆధారపడి వ్యవసాయం చేసే ప్రజల గురించి ఆలోచించలేకపోవటమే పాలమూరును కరువు జిల్లాగా మార్చింది అంటారు హరగోపాల్. ఆ రకంగా ఆయన ప్రాంతీయ వెనుకబాటు తనానికి జాతీయ ఆర్ధిక విధానాలకు వుండే గతితార్కిక సంబంధాన్ని సూచించారు. 

ప్రజాఉద్యమాలకైనా , ప్రజల పక్షాన వెలువడే ఇలాంటి నివేదికలకైనా అంతిమ ప్రయోజనం ప్రజల ఆకాంక్షలమేరకు ప్రభుత్వవిధానాలు రూపొందటం అని హరగోపాల్ నమ్ముతారు. అందుకే  విధాన నిర్ణేతల కొరకు ఈ నివేదిక అని ముందుమాటలో చెప్పారు కూడా. అయితే తరచు  ప్రజల ఆకాంక్షల మేరకు విధాన నిర్ణయాలు జరగకపోవటమే కాక ఆ ప్రజాస్వామిక ఆకాంక్షలు పాలకుల శాంతికి భగ్నం కలిగిస్తున్నాయి అన్న నెపంతో అణచివేతకు, విస్మరణకు గురికావటం అసలు వాస్తవం. దాని గురించిన ఎరుక కూడా ఆయన ముందుమాటలలో కనబడుతుంది.  రాఘవాచారి గారి మరొక పుస్తకం ‘ప్రశ్నలు అలాగే ఉన్నాయి’ (2018) కి వ్రాసిన ముందుమాటలో హరగోపాల్ కరువు వ్యతిరేక కమిటీ మీద నిర్బంధం, పోలీసుల, గుండాల బెదిరింపుల గురించి ప్రస్తావిస్తూ ఫలితంగా కరువు వ్యతిరేక పోరాట కమిటీ పాలమూరు అధ్యయనవేదికగా పేరు మార్చుకొని పనిచేయవలసివచ్చింది అని చెప్పిన విషయం గమనించవచ్చు. 

హరగోపాల్ హక్కుల ఉద్యమంలో పనిచేయటమే కాదు ఒక విద్యావేత్తగా తనకు లభించిన అవకాశాల నుండి  మానవహక్కుల చరిత్రను, తత్వాన్ని ప్రత్యేక బోధనాంశంగా రూపొందించ గలిగారు. అనేక ప్రతిష్టాత్మక సామాజికశాస్త్ర సంస్థలలో మానవహక్కులకు సంబంధించి విస్తరణోపన్యాసాలు విస్తృతంగా చేశారు. ఈ నేపథ్యం నుండి  బాల జంగయ్య గారి  దళితులు – మానవహక్కులు పుస్తకానికి హరగోపాల్ వ్రాసిన ముందుమాటను చూడాలి.13 వ శతాబ్ది నుండి మానవహక్కుల భావన అభివృద్ధి చెందుతూ భూస్వామ్యానికి , వలసపాలనకు వ్యతిరేకంగా వచ్చిన ప్రజా  ఉద్యమాల నుండి  సుసంపన్నమవుతూ నాజిజం, ఫాసిజం వంటి వికృతులకు విరుగుడుగా ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఒడంబడికగా సార్వజనీన మానవహక్కుల ప్రకటన జరిగే  వరకు సాగిన ప్రస్థానాన్ని సూక్ష్మంగా చెప్పి 1948 లో మానవహక్కుల కోసం నిలబడ్డ భారతదేశం 1993 వియన్నా సమావేశం నాటికి అంతర్జాతీయ వేదిక మీద అభివృద్ధిచెందుతున్న భారతదేశం లాంటి దేశాలమీద మానవహక్కులు రుద్దవద్దని చెప్పే స్థితికి దిగజారిన వాస్తవాన్ని గుర్తు చేశారు  హరగోపాల్. ఈ నేపథ్యంలో  90 వ దశకం నుండి పెరిగిపోయిన హక్కుల ఉల్లంఘనలో  భాగంగా  దళితులవిషయంలో ఇది మరింత తీవ్రం కావటాన్ని సూచించారు. రాజ్యాంగం అమలులోకి వచ్చిన కొద్దికాలానికే మొదలైన దళితుల హక్కుల ఉల్లంఘనను నియంత్రించటానికి సివిల్ రైట్స్ పరిరక్షణ చట్టం(1955), దళిత ఆదివాసీల పై దాడుల నిరోధక చట్టం (1989) వంటివి వచ్చినా పరిస్థితి ఏమీ మారలేదని ఉమ్మడి పాలమూరుజిల్లా స్థాయిలో బాలాజంగయ్య చేసిన సూక్ష్మ అధ్యయనం వల్ల నిరూపితం అయిందని అంటారు హరగోపాల్. 1995- 2005 మధ్యకాలంలో బాలాజంగయ్య పాలమూరు జిల్లాలలో దళితుల మీద జరిగిన అకృత్యాలను వాటి పరిణామాలను, బాధితులకు జరిగిన న్యాయం మొదలైన కోణాలనుండి  పరిశీలిస్తూ  వ్రాసిన ఈ నివేదికను అంతర్జాతీయ మానవహక్కుల ఉద్యమ చరిత్ర, జాతీయ స్థాయి పరిణామాల తో కలిపి విలువకడుతూ వ్రాసిన ఈ ముందుమాట ప్రాంతీయత, జాతీయత, అంతర్జాతీయత ఈ మూడింటి మధ్య జరిగే నిత్య సంభాషణ తత్వం తెలిసిన హరగోపాల్ గారి దృక్పథానికి అద్దం  పడుతుంది.   

సామాజిక శాస్త్రవేత్త అయిన హరగోపాల్ సాహిత్యంలో తనకు ఎక్కువ ప్రవేశం లేదంటారు. అయినా అరుంధతీరాయ్, చలం, భాషాసింగ్ , అల్లం నారాయణ మొదలైనవారి సాహిత్యం గురించి వ్యాసాలు వ్రాసారు. ఉద్యమ శక్తులే తనతో అలా వ్రాయించాయి అనగల  వినయం ఆయనది.  ‘సందర్భం- సవాళ్లు’  పుస్తకంలో సాహిత్య రచనలకు ఆయన వ్రాసిన ముందుమాటలు కూడా అలా ఉద్యమ అవసరాలుగా వచ్చినవే అనుకోవచ్చు.  కరువు పోరు పాటలు(1997)పాలమూరు గోస(2004) పాలమూరు జలగోస(2018)పాలమూరు తెలంగానం(2018)పాలమూరు రైతుగోస(2018) మొదలైన ఐదుసంకలనాలు పాలమూరు కరువు వ్యతిరేక కమిటీ లేదా పాలమూరు అధ్యయన వేదిక తీసుకొన్న కార్యక్రమాలలో భాగంగా వచ్చినవే. ఆ వేదికల బాధ్యుడుగా హరగోపాల్ ఆ ముందుమాటలు వ్రాసారు.  ప్రాంతీయ సాహిత్యాన్ని ఆ ప్రాంతపు నిర్దిష్ట  రాజకీయార్థిక సంబంధాలనుండి అధ్యయనం చేయాలన్న హరగోపాల్ దృక్పథం పాలమూరు సాహిత్యానికి వ్రాసిన ఈ ముందుమాటలలో స్పష్టంగా కనబడుతుంది. పేదరికం గురించిన చర్చ ప్రభుత్వ ఎజండా నుండి మాయం అయి పాలమూరు వలసకూలీలు, పేదరైతులు, నిరుద్యోగ యువత ఎవరికీ పట్టనివి అయిన సందర్భం నుండి ఏరంచు వూరు ఎడారిగా ఎందుకు మారింది? రైతు కూలీగా ఎందుకు మారుతున్నాడు? అప్పులెందుకు? వలసలెందుకు?  కష్టపడే ప్రజలకు కరువు కాటకాలెందుకు? అనే ప్రశ్నలే పాటలు అయినాయని కరువు పోరుపాటల పుస్తకానికి వ్రాసిన ముందుమాటలో పేర్కొన్నారు హరగోపాల్. పాట  ప్రజల చైతన్యం లో పుట్టి  ఆ చైతన్యాన్ని పెంచుతుంది అని సూత్రీకరించారు ఈ ముందు మాటలో.  

‘పాలమూరు గోస’ కవితా సంకలనానికి వ్రాసిన ముందుమాటలో ఆ సంకలనంలోని కవితల ప్రధాన వస్తువు కరువు, వలసలు, ఆకలిచావులు, ఆత్మహత్యలు అని చెప్తూ ఆవేదన అన్నిటిలో సమానమే అయినా పరిష్కారాలు చైతన్యస్థాయిని బట్టి భిన్నంగా ఉంటాయని చెప్పారు. ఉత్పత్తికారకాల ధరలు పెరిగి ఉత్పత్తికి ధర రాకపోతే ఆ అగాధాన్ని పూడ్చటం ఎలా అన్న మౌలికమైన ఆర్ధిక ప్రశ్న నుండి ఈ కవిత్వం వచ్చిందని చెప్పటం ద్వారా దానిని  ఉత్పత్తిసంబంధాలలో మార్పులతో కలిపి అర్ధం చేసుకోవాలని చెప్పినట్లయింది.   కవిత్వంలో ఎమోషన్ కు ఉన్న ప్రాధాన్యతను గుర్తించి చెప్పి  ఆ ఎమోషన్ ద్వారా వ్యక్తీకరింపడే అంశం పాఠకులను కవి అనుభవపు దారులగుండా నడిపిస్తుందని అంటారు హరగోపాల్. అదే సమయంలో ప్రక్రియగా కవిత్వానికి ఉండే పరిమితి దృష్ట్యా రాజకీయార్థిక నేపథ్యం, చారిత్రక పరిణామం, కార్యకరక సంబంధాలను సమగ్రంగా ఆవిష్కరించగలిగిన శక్తి  అందులో అనుమానాస్పదమే అని భావిస్తారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కూడా నీటి ప్రాజెక్టులు పూర్తిగా అందుబాటులోకి రాకపోవటం, 2015 లో ప్రారంభమైన పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ తరువాత ప్రారంభమైన    కాళేశ్వరం ప్రాజెక్ట్ ప్రధానమై మిగిలినవి వెనకబట్టటం పాలమూరు ప్రజలను నిరాశకు గురిచేసింది. పాలమూరు రాజకీయ నాయకత్వం ఆ విషయాలకు ప్రాతినిధ్యం వహించవలసింది పోయి పాలమూరు నీటి సమస్య పరిష్కారం అయిపోయినట్లుగా జల ఉత్సవాలను జరుపుతూ కవి సమ్మేళనాలను నిర్వహిస్తుంటే కవులు వాస్తవాలను, ప్రజల వేదనను విస్మరించి ఊహాప్రపంచంలో విహరిస్తూ కవితాగానం చేస్తుంటే దానికి సమాధానంగా పాలమూరు అధ్యయనవేదిక నిర్వహించిన కవిసమ్మేళనం లో కవులు చదివిన కవితల సంకలనం ‘పాలమూరు జలగోస’ పాలమూరు ప్రజల అనుభవాలు జల ఉత్సవాలు చేసుకోగలిగిన స్థితిలో లేవు. వాళ్ళ వేదన కవితా  వస్తువు కావలసి ఉండగా కవులు పాలకులు కట్టమన్న కవిత్వం కట్టటం పట్ల ధర్మాగ్రహంతో ప్రజాపక్షం వహించిన కవులు వ్రాసిన కవిత్వం ఇది అని ఆ సంకలనం ప్రత్యేకతను పేర్కొన్నారు హరగోపాల్. ఆగ్రహం, ఆవేదన నిండిన ఈ కవితలు వ్యవస్థలోపలి మార్పుకు, ఆంతకు మించి వ్యవస్థమార్పుకు జరుగుతున్న ఘర్షణను సూచిస్తున్నాయంటారు. 

2009 లోనే తెలంగాణ ఆకాంక్షను వస్తువుగా చేసి నిర్వహించబడిన కవి సమ్మేళనం కవితలు తెలంగాణ వచ్చాక నాలుగేళ్లకు పుస్తకంగా ముద్రించబడింది. దీనికి వ్రాసిన ముందుమాట ‘మానవీయ తెలంగాణ ఆకాంక్ష’. ఉమ్మడి పాలమూరు జిల్లా దుఃఖం , ప్రజల సమస్యలు, రాజ్యహింస మొదలైనవి కవితా వస్తువు అయినాయని చెప్తూనే కవుల ఆగ్రహంలో స్పష్టత కనిపించదని అన్నారు హరగోపాల్. 2018 లోనే పాలమూరు రైతుగోస అనే కవితా  సంకలనం వచ్చింది. దీనికి వ్రాసిన ముందుమాటలో హరగోపాల్ భౌగోళిక భారతదేశ సాధన తప్ప ప్రజాస్వామ్యం ఊసులేని  స్వాతంత్య్ర ఉద్యమం దగ్గర ప్రారంభించి నెహ్రు అభివృద్ధి నమూనా , మహలనొబీస్ ట్రికిల్ డౌన్ నమూనా( పైన అభివృద్ధి జరిగితే అది కిందికి ప్రవహిస్తుందని చెప్పే సిద్దాంతం)  1960 లనాటికి  ఆహారధాన్యాల కొరత , సహాయంపేరుతో అమెరికా భారతదేశ వ్యవసాయవిధానాన్ని నిర్ణయిస్తూ హరితవిప్లవాన్ని తక్షణ పరిష్కారంగా సూచించటం, పెట్టుబడి ప్రాధాన్యత పెరిగి రైతు తన వ్యవసాయం మీద, తనజీవితం మీద తాను అధికారం కోల్పోవటం మొదలైన క్రమాన్ని వివరిస్తూ ఆ నేపథ్యంలో రైతుగోస కవితలను చూడాలంటారు. రైతు ఆత్మహత్యలు, అప్పులు, మార్కెట్ మాయాజాలం వర్షాభావం,  నీళ్ళలేమి, షావుకార్ల దౌర్జన్యం బ్యాంకుల నిరాసక్తత మొదలైన సమస్యలు కవితావస్తువులు అయినాయని భౌగోళిక తెలంగాణ ప్రజాస్వామికీకరణ కవుల ఆశగా, ఆశయంగా వ్యక్తం అయినాయని చెప్పారు. కొత్తరాష్ట్ర ఆవిర్భావాన్ని గురించిన ప్రస్తావన, ఆనందం ఈ కవితలలో కనబడదు అని కూడా ఆయన గుర్తించారు. 

మిగిలిన మరొక నాలుగు ముందుమాటలు కథా సంపుటాలకు వ్రాసినవి. ఆ సంపుటాల రచయితలు నలుగురిలో ఉదయమిత్ర, ఇక్బల్, కె. నాగేశ్వరాచారి ఈ ముగ్గురూ పాలమూరు రచయితలు కాగా గీతాంజలి ఉత్తరతెలంగాణకు చెందిన రచయిత్రి. అయితే ఆమె కథలు మాత్రం  పాలమూరు వలసబతుకు చిత్రాలే. చాలా సందర్భాలలో సామాజిక విశ్లేషణ చేసే సామాజిక శాస్త్రవేత్తల కంటే జీవితాన్ని చలనంలో పట్టుకొనే రచయితలు  చాలా  ముందు ఉంటారని హరగోపాల్ అభిప్రాయం.  ‘అమ్మను జూడాలే’ కథల పుస్తకానికి  వ్రాసిన ముందు మాట(2006)లో ఉదయమిత్ర కథలు అందుకు సజీవ సాక్ష్యాలు అంటారు. భూస్వామ్య సంబంధాలు, అమానుషీకరించబడుతున్న మానవ సంబంధాలు మారాలన్న ఆకాంక్షను, మారటానికి సంసిద్ధం అవుతున్న ఒక సామాజిక రాజకీయ దశను ఆయన కథలు చిత్రించాయని  చెప్పారు. 

ఇక్బల్ కథల సంపుటి కఫన్ కు వ్రాసిన ముందుమాట(2011)లో హరగోపాల్ సాహిత్య ప్రక్రియల స్వభావాన్ని చర్చించారు. కవిత్వం ఆవేశం నుండి, ఆవేదన నుండి వస్తుండగా కథ సంఘటన నుండి, అనుభవం నుండి వస్తుందని, నవల సంక్లిష్టమైన సామాజిక సంబంధాలను వివరించటానికి అవసరమవుతుందని,  పాట సమాజంలో చైతన్యాన్ని ప్రత్యక్షంగా ప్రభావితం చెయ్యాలనే తపన నుండి పుడుతుందని అభిప్రాయపడ్డారు. హృదయం కదిలితే కవిత్వం, ఆవేశం వస్తే పాట, ఈ జీవితాలు ఇలా ఎందుకున్నాయి అన్న ఆలోచనవస్తే కథ పుడతాయని సూత్రీకరించారు. సామ్రాజ్యవాద ప్రేరేపిత అభివృద్ధి నమూనాను అమలుచేస్తున్న దేశీయపాలన ఈకథలకు రాజకీయార్థిక నేపథ్యం అనిపేర్కొన్నారు. ఈ అభివృద్ధి నమూనావలన విధ్వంసమైన ప్రజాజీవిత చిత్రీకరణ ఈ కథలలో ప్రధానమని చెప్పారు. 

పాలమూరు వలసజీవితం వస్తువుగా వచ్చిన  గీతాంజలి కథల సంపుటికి వ్రాసిన ముందుమాటలో (2015) కూడా సామాజికశాస్త్రాలకు సాహిత్యానికి ఉండే సంబంధ భేదాల గురించి చర్చించారు హరగోపాల్. సామాజిక శాస్త్రాలలో చేసే విశ్లేషణలో సంఖ్యలు ఉంటాయి. కొంతవరకు కార్యకారణ సంబంధాల అన్వేషణ ఉంటుంది కానీ చాలావరకు అందులో మనిషి,జీవితం, సామాజిక సంబంధాలు ,సుఖదుఃఖాలు, వేదన, విధ్వంసం, కన్నీళ్లు కనిపించవు అంటారు. అయితే సంక్షోభానికి కారణాలను సాహిత్యం అంత స్పష్టంగా , సూటిగా పట్టుకోలేకపోవచ్చు అని భావిస్తారు.  సాహిత్యమూ, సామాజిక శాస్త్రాలు రెండూ సామాజిక ప్రక్రియకు సంబంధించిన జ్ఞానమే అయినా అవి మనిషిని రెండు పార్శ్వలనుండి చూస్తాయని గీతాంజలి కథలలో సామాజిక సాహిత్య కోణాలు రెండూ మిళితం అయ్యాయని పేర్కొన్నారు. 

హరగోపాల్ సాహిత్యరచనలకు వ్రాసిన ముందుమాటలు సాధారణంగా ఆ రచన వచ్చిన సందర్భాన్ని, ఆ రచనను అర్ధం చేసుకొనటానికి అవసరమైన సామాజిక చలన చైతన్యాలను చర్చించేవిగా ఉంటాయి. ప్రత్యేకంగా ఒక కవితనో, కథనో ప్రస్తావిస్తూ వివరించటం చాలా తక్కువ. అందుకు మినహాయింపు కె. నాగేశ్వరాచారి కథల సంపుటి ‘గద్వల్జాతర’ (2020) కు వ్రాసిన ముందుమాట. ఇందులో ఆయన సమాపుటిలోని ప్రతి కథను ప్రస్తావిస్తూ  1950లలో రాజోలిబండ నీటిపథకం అమలు తరువాత వ్రాయబడిన కథలు అని వాటిని ఒక ప్రత్యేక స్థానిక రాజకీయార్థిక సందర్భంలో స్థాపించి అధ్యయనానికి మార్గం సూచించారు.  నీళ్లు ప్రజల జీవితాలపై , వాళ్ళ సామాజిక సంబంధాలపై వేసే ప్రభావాన్ని బలంగా చెప్పిన కథలుగా వాటిని పేర్కొన్నారు. రాజోలిబండ డైవెర్షన్ స్కీమ్ (ఆర్ డి ఎస్) తుంగభద్ర నదిమీద రాయచూర్ లో నిర్మించబడిన వ్యవసాయ ప్రాజెక్ట్. తెలంగాణలో గద్వాల, ఆంధ్రప్రదేశ్ లో కర్నూల్, కర్ణాటక లో రాయచూర్ ప్రాంతాలకు కాలువల ద్వారా  సాగునీటిని సరఫరా చేసే అంతర్ రాష్ట్ర జల వారధి ఇది.  1958లో పూర్తయింది. ఎడమ కాలువ ద్వారా గద్వాల తాలూకాలో  8 గ్రామాలకు, మహబూబ్ నగర్ జిల్లా ఆలంపూర్ తాలూకాలో 67 గ్రామాలకు సాగునీరు ఇయ్యటం దీని లక్ష్యం. బచావత్ ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం మహబూబ్ నగర్ జిల్లాకు 17.1 టి ఎం సి ఎఫ్ టి నీరు కేటాయించబడగా అందులో 15. 9 సీఎఫ్ టి నీళ్లు మహబూబ్ నగర్ కోసమే ఉద్దేశించబడ్డాయి. అయితే అందులో వాళ్లకు ఎప్పుడూ 8 నుండి 10 టి ఎం సి ఎఫ్ టి ని మించి నీళ్లు లభించలేదు. నీళ్లు అభివృద్ధికి చిహ్నం అన్న మాట నిజమే. నీళ్లకోసం పాలమూరు ఆరాటమూ నిజమే.  కానీ ఆ  అభివృద్ధి నీడలలో కనబడకుండా పోయిన వాళ్ళ గురించిన ఆవేదన కూడా పాలమూరు వాస్తవం.  నాగేశ్వరరావు కథలు ఆ కోణం నుండి వచ్చాయని  హరగోపాల్ తనముందుమాటలో పేర్కొన్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ లో నీళ్లు వచ్చాక స్వయంపోషక వ్యవసాయం మార్కెట్ ఆధారితం కావటం విత్తనాలు, విద్యుత్, ఎరువులు అన్నీ కొనుక్కోవలసినవే కావటం వల్ల గ్రామీణ వ్యవసాయకుటుంబాలలో సృష్టించిన సంక్షోభం వలసల కొనసాగింపుకే దారితీసిందని చంద్రమ్మ వంటి కథలు నిరూపిస్తాయని అంటారు హరగోపాల్. అలాగే ఆర్ డి ఎస్ వల్ల లబ్ధిపొందటానికి  ఆంధ్రప్రాంతపు ధనికరైతులు పాలమూరు గ్రామాలలోకి ప్రవేశించి వూళ్ళో ప్రాబల్యం గల వర్గాలతో కలిసి భూమిని అమ్మకపు సరుకుగా మార్చిన చారిత్రక  విషాదవాస్తవాన్ని పట్టుకొన్న కథలు 18 వ కాలువ, నెనరు  మొదలైనవి అని చెప్తూ హరగోపాల్ అభివృద్ధిలో అంతర్గత వైరుధ్యాలవైపు పాఠకుల చూపు తిప్పటం  నాగేశ్వరాచారి కథల ప్రత్యేకత అని నిర్ధారించారు.  

 జాతీయ చరిత్ర లోపలి వలయం  తెలంగాణ చరిత్ర అయితే దానికి అంతర్వలయం పాలమూరు చరిత్ర. ఆ రకంగా ఆమూడూ పరస్పరసంబంధ ప్రభావితాలు. మోత్తంగా హరగోపాల్  ముందుమాటలు  రాజకీయార్థిక దృక్పథం నుండి వ్రాసినవి అన్నది స్పష్టం.  ఆ రకంగా సమాజాన్ని, సమకాలీన సందర్భాలను ఉత్పత్తి సంబంధాల కోణం నుండి, చారిత్రక గతిశీల పరిణామాల నుండి  పరిశీలించటం అనే సూత్రం ఆయన ముందుమాటల  అంతస్సూత్రం.

కేతవరపు కాత్యాయని. తెలుగులో ఎమ్మే పిహెచ్ డి. కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పూర్వ ఆచార్యులు. అప్పుడప్పుడు కవిత్వం, కథలు రాస్తున్నా ప్రధానంగా సాహిత్య విమర్శకురాలు. ప్రక్రియలలో వచ్చిన ప్రాచీన ఆధునిక సాహిత్య రచనలపైన, ప్రత్యేకించి స్త్రీల సాహిత్యం పైన  కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో ప్రచురించిన సాహిత్య విమర్శ వ్యాసాలు 300 కి పైగా ఉన్నాయి. 25 పుస్తకాలు ప్రచురించారు. 28  పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. మార్క్సిజం, స్త్రీవాదం ఆలోచనకు వెలుగునిచ్చి హృదయానికి దగ్గరైన సిద్థాంతాలు. అనేక సామాజిక సంచలనాల ఉద్వేగ వాతావరణంలో సాహిత్య సామాజిక పరిశోధనలకైనా, ఆచరణ కైనా ఎప్పుడూ ప్రజాపక్షపాత నిబద్ధతే నమ్మిన విలువ. 1980లలో స్త్రీ జనాభ్యుదయ అధ్యయన సంస్థ వ్యవస్థాపక సభ్యరాలై  స్త్రీల సమస్యలపై సామాజిక, సాహిత్య రంగాలలో పనిచేసారు. పుస్తకాలు ప్రచురించారు. దానికి కొనసాగింపుగా 2010లో  ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక ఏర్పాటులో చురుకైన పాత్ర పోషించారు. స్త్రీల సాహిత్యచరిత్ర రచన, తెలంగాణ సాహిత్య సమీక్ష తన ఆకాంక్షలు.

Leave a Reply