ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్

ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు.
ఒక స్త్రీగా నాకు ఒక దేశం అవసరమే లేదు.
ఒక స్త్రీగా… నేను ఉండే స్థలమే దేశం… ప్రపంచం…

గ్రంథాలయాలను మూసేసుకో నీ ఇంటి తలుపులను బిగించుకో అయితే నీకు ఒక విషయం తెలియదు అదేంటంటే… నా మనసంతా నిండి పోయిన స్వేచ్ఛకు తలుపులు… గొళ్ళెం… తాళం… వేయగలవా చెప్పు?

– వర్జీనియా వూల్ఫ్

ఈ రెండు చిన్న కవితలు వర్జీనియా వూల్ఫ్ స్వతంత్ర భావాల వ్యక్తిత్వాన్ని తెలియ చెప్తున్నాయి. జీవితమంతా తను నమ్మిన విశ్వాసాలు, విప్లవాత్మకమైన, స్వేచ్ఛాపూరితమైన ఆలోచనల ఆచరణతో గడిపిన రచయిత్రి వర్జీనియా. వీటి వలన జీవిత పర్వంతమూ విపరీతమైన మానసిక ఒత్తిడి కృంగుబాటుదనం అనుభవించినా తన ఆలోచనలను రాస్తూనే పోయింది. లైంగికతకి, లైంగిక విషయాలకు సంబంధించిన ఆమె నిర్భయమైన రచనలు కూడా సెన్సార్ షిప్‌కి – తీవ్రమైన విమర్శకు, ఆంక్షలకు లోనయినాయి. వర్జీనియా వ్యక్తిత్వాన్ని, రచనలను అర్థం చేస్కోవాలంటే ఆమె జీవితాన్ని చదవాల్సిందే.

ఈమె పూర్తి పేరు ఆడెలీన్ వర్జీనియా వూల్ఫ్ స్టీఫెన్. 20య్యవ శతాబ్దపు ఆధునిక ఆంగ్ల రచయిత్రి, నవలాకారిణి, విమర్శకురాలు వ్యాసకర్త. 1882 జనవరి 25న లండన్ లోని సౌత్ కెన్‌సింగ్‌టన్‌లో ఒక ధనిక కుటుంబంలో జన్మించింది. 28 మార్చ్ 1941లో మరణించింది.

వర్జీనియా తండ్రి లెస్లీ స్టీఫెన్, తల్లి జూలియా ప్రిన్ సెప్ జాక్సన్. తల్లి మొదటి భర్తనీ, తండ్రి మొదటి భార్య చనిపోయాక పెళ్ళి చేస్కున్నారు. ఇలాంటి కుటుంబాన్ని బ్లెండెడ్ ఫామిలీ అంటారు. వర్జీనియా వీళ్ళకు ఏడవ సంతానం. మగపిల్లలందరూ కాలేజీకి వెళ్ళి చదువుకుంటే, ఆడపిల్లలు మాత్రం ఇంగ్లీష్ క్లాసిక్స్, విక్టోరియన్ సాహిత్యాన్ని ఇంట్లోనే హెూమ్ ట్యూటర్ ద్వారా చదివారు. కుటుంబం తరచూ వెళ్ళే వేసవి విడిది కాలంలో సెయింట్ ఐవికి వెళ్ళేవాళ్లు, అక్కడ వర్జీనియా తొలిసారిగా గోద్రేవీ లైట్ హౌస్‌ని చూసింది. ఆ లైట్ హౌస్ ప్రభావం బాల్య జీవితాన్ని గాఢంగా ప్రభావితం చెయ్యడమే కాదు, ఆమె పెద్దై రచయిత్రిగా మారాక 1927లో ‘టు ద లైట్ హౌస్’ అనే నవల రాయడానికి ప్రేరణ కలిగించింది. 1897 నుంచి 1901 వరకు కింగ్స్ కాలేజీ లండన్‌లో వర్జీనియా క్లాసిక్స్, చరిత్ర పాఠ్యంశాలు చదివింది. ఇక్కడే ఆమె స్త్రీల విద్య కోసం ఉద్యమించిన స్త్రీలతోనే కాదు మహిళా ఉద్యమాలతో పరిచయాలు ఏర్పడ్డాయి. వాళ్ళ ప్రభావానికి వర్జీనియా లోనవడమే కాదు కేంబ్రిడ్జిలో చదువుకునే అన్నలు, తన తండ్రి గ్రంథాలయానికి తరచూ వెళ్ళడం ప్రపంచ సాహితాన్ని చదవడం కూడా ఆమెలో స్త్రీల, మానవ హక్కుల పట్ల ఆసక్తిని పెంచాయి.

వర్జీనియా బాల్య జీవితంలో 1985లో ఆమె తల్లి హఠాన్మారణం తీరని వ్యధని మిగిల్చింది. దాంతో పాటు రెండేళ్ళ తర్వాత ఆమె చెల్లెలు, తల్లిలాంటి స్టెల్లా డగ్ వర్త్ మరణం కూడా ఆమెను కృంగదీసాయి.

తండ్రి ప్రోత్సాహంతో వర్జీనియా 1900 నించే అంటే పద్దెనిమిదేళ్ళ నించే రాయడం మొదలు పెట్టింది. కానీ 1904లో వర్జీనియా తండ్రి కూడా మరణించడంతో తీవ్రమైన మానసిక అగాధానికి లోనైంది వర్జీనియా. తండ్రి మరణం తర్వాత వర్జీనియా కుటుంబం కెన్ సింగ్ టన్ నుంచి బ్లూమ్స్ బరీకి మారింది. అక్కడ కుటుంబం అంతా ఆధ్యాత్మిక జీవన సరళిని అనుసరించారు. ఇక్కడ వర్జీనియా అన్నలు, తమ మేధావి స్నేహితులతో కలిసి కళలు – సాహిత్యాలకు సంబంధించి బ్లూమ్స్ బరీ గ్రూప్‌ని ఏర్పాటు చేస్కున్నారు.

వర్జీనియా వూల్ఫ్ తండ్రి లెస్లీ స్టీఫెన్ (1832-1904) రచయిత, చరిత్రకారుడు, వ్యాసకర్త, జీవిత చరిత్రలు రాసే రచయిత, పర్వతారోహకుడు. కలోనియల్ ఆఫీసులో అండర్ సెక్రెటరీగా పని స్టీఫెన్ తండ్రి సర్ జేమ్స్ అలాగే మరొక ఉద్యోగి, అయిన విలియం విల్ బెర్ ఫోర్స్‌తో కలిసి 1833లో ‘స్లేవరీ అబాలిషన్ బిల్’ (బానిసత్వ రద్దు బిల్) జారీ చేయించడంలో ప్రముఖ పాత్ర వహించాడు. అలాగే కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో ఆధునిక చరిత్ర ప్రొఫెసర్‌గా పని చేశాడు సర్ జేమ్స్. వర్జీనియా తండ్రి లెస్లీ స్టీఫెన్ ఇంట్లో అందరూ కూడా రచయితలు, న్యాయవాదులు విద్యావంతులు, మేధావులు, చిత్రకారులు ఉండడం, ఒక మేధోశిష్ట జనులతో నిండి ఉంటూ ఆ ప్రభావం లెస్లీ స్టీఫెన్, మీద సహజంగానే ఆయన బిడ్డ వర్జీనియా వూల్ఫ్ మీదా పడింది. స్టీఫెన్‌కి విలియం మేక్ పీస్ థాకరేతో వివాహం అయ్యి లారా అనే బిడ్డ పుట్టింది. కానీ ఆమె మళ్ళీ ప్రసవ సమయంలో 1875లో మరణించింది. లారా మానసిక వికలాంగురాలు. ఇక వర్జీనియా తల్లి జూలియా జాక్సన్. (1846-1895) జూలియా 1845లో బ్రిటిష్ ఇండియాలో బెంగాల్ రాష్ట్రంలోని కలకతా నగరంలో జాక్సన్, మారియాకి రెండు ఆంగ్లో ఇండియన్ కుటుంబాల నుంచి జన్మించింది. జూలియా తండ్రి జాన్ జాక్సన్ ఎస్ఆర్ సిఎస్ డాక్టర్ జార్జి జాక్సన్‌కి మూడవ సంతానం. అంటే వర్జీనియా వూల్ఫ్ తాతగారు.

జార్జి జాక్సన్ జనరల్ ఫిషియన్‌గా ఈస్ట్ ఇండియా కంపెనీలో 25 సంవత్సరాలు బెంగాల్ మెడికల్ సర్వీస్‌లో ఉన్నారు. కలకత్తా మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్‌గా పని చేసారు. బెంగాలీ సమాజంలో ఈ పాటిల్ కుటుంబంలోని స్త్రీ పురుషులు అందానికే, బెంగాలీ సమాజంలో ఉన్నత వర్గ సమాజానికి చెందిన వారుగా ప్రసిద్ధి చెందినవారు. జూలియా చెల్లెలు జూలియా మారెంట్ కేమరాన్ సుప్రసిద్ధ ఫోటోగ్రాఫర్. జూలియా తన తల్లికి చెల్లెలు సారాతో ఎక్కువ కాలం గడిపింది. సారా ఆమె భర్త హెన్రీ ధాబీ తమ లిటిల్ హాలెండ్ హౌస్‌లో ఎన్నో కళాత్మక సాహిత్య కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కాలంలోనే జూలియాకి ప్రి – రాఫియాలైట్ చిత్రకారులతో పరిచయం కలిగింది. అందులో ప్రఖ్యాత చిత్రకారుడైన ఎడ్వర్డ్ – బర్నెజోన్స్‌కి జూలియా మాడల్‌గా కూడా పని చేసింది. జాక్సన్స్ అంతా కూడా మంచి విద్యావంతులు, కళాకారులు సాహిత్యకారులకు చెందిన మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాళ్ళు. 1867లో జూలియా జాక్సన్‌కీ, బారిస్టర్ హర్బర్ట్ డక్ వర్త్‌కీ వివాహం అయిన తర్వాత ముగ్గురు పిల్లలు పుట్టాక హర్బర్ట్ మరణంతో జూలియా వంటరి అయ్యింది. దానితో తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనై తర్వాత కోలుకొని నర్స్‌గా, సంఘ సేవకురాలిగా మారిపోయింది. జూలియాకి, స్టీఫెన్ చనిపోయిన భార్య మిన్నీ పెద్ద చెల్లెలి ద్వారా స్టీఫెన్ పరిచయం అవుతాడు. దేవుడు, దైవత్వం, మతం అతీంద్రియ శక్తుల మీద నమ్మకం లేని స్టీఫెన్ విప్లవాత్మకమైన హేతువాద రచనల పట్ల జూలియా ఆకర్షితురాలు అవుతుంది. మిన్ని చనిపోయిన రాత్రి కూడా జూలియా స్టీఫెన్‌కి సహాయంగా అతనితో ఇతర బంధువులతో ఉండిపోవడమే కాదు అతని బిడ్డ లారాకి తోడుగా తన ముగ్గురు పిల్లలు ఉంటారన్న భావనతో స్టీఫెన్‌కి తన ఇంటి హైడ్ పార్క్ గేట్ దగ్గరగా ఇల్లు తీస్కోని సహాయపడుతుంది. జూలియా జాక్సన్, లెస్లీ స్టీఫెన్ ఇద్దరూ తమ సహచురులు కోల్పోయిన దుఃఖంలో ఒకరికొకరు అండగా ఉంటారు. ఆ క్రమంలో వారి మధ్య స్నేహం, ప్రేమ చిగురిస్తాయి. 1877లో స్టీఫెన్, పెళ్ళి చేస్కుందామని జూలియాను అర్థిస్తాడు. కానీ జూలియా మొదట తిరస్కరిస్తుంది.

కానీ తర్వాత ఒప్పుకుంటుంది. వీరి వివాహం మార్చి 28 – 1878లో అవుతుంది. స్టీఫెన్, ఆయన మొదటి భార్య కూతురు లారా జూలియా ఇంటికి వచ్చి ఉండిపోతారు. 1904 దాకా వాళ్ళు మరణించే దాకా కలిసి జీవిస్తారు. పెళ్ళినాటికి జూలియాకి 32, స్టీఫెన్‌కి 48 ఏళ్ళు. వర్జీనియా వూల్ఫ్ 1882 జనవరి 25న నవంబర్ 22 హైడ్ పార్క్ గేట్ ఇంట్లో జన్మించింది. వర్జీనియా తన ఆత్మకథలో తాను ఐశ్వర్యవంతుల కుటుంబంలో జన్మించక పోయినా మంచి స్థితప్రజ్ఞులైన తల్లిదండ్రులకు జన్మించానని చెప్పుకుంటుంది. 19వ శతాబ్దాన్ని అత్యంత పారదర్శక సంబంధాలున్న కుటుంబంలో సాహిత్యం, లేఖా సాహిత్యం, కళలు, న్యాయపరమైన జ్ఞానం వర్థిల్లే కుటుంబంలో జన్మించానని గర్వంగా రాస్కుంటుంది. జూలియా మొదటి భర్త పిల్లలు ముగ్గురు – స్టీఫెన్ మొదటి భార్య బిడ్డ లారా తర్వాత జూలియా – స్టీఫెన్‌కి పుట్టిన తను, వెనీసా, ధాబీ, ఏడ్రియన్ల మధ్య మంచి సంబంధాలుండేనని రాస్కుంటుంది.

1891 ఫిబ్రవరిలో తన సోదరి వెనీసాతో కల్సి వర్జీనియా ‘హైడ్ పార్క్ గేట్ న్యూస్’ పత్రిక మొదలు పెట్టింది. అది ఒక కుటుంబ పత్రిక. అందులో తమ స్టీఫెన్స్ కుటుంబంలో జరిగిన జరిగే అన్ని సంఘటనలను రికార్డ్ చేయడం చేసింది. అట్లనే అప్పట్లో చాలా పాపులర్ మేగజైన్ టిట్ – బిట్స్ లో మాడలింగ్ చేసేది కూడా. మొదట్లో వర్జీనియా కంటే చాలా పెద్దదైన వెనీసా, తోబీ వ్యాసాలు మాత్రమే అచ్చయ్యేవి. కానీ తర్వాత వర్జీనియా కూడా అక్క వెనీసా సంపాదకత్వంలో రాయడం మొదలు పెట్టింది. అది చూసి తల్లి జూలియా జాక్సన్ వర్జీనియా తెలివికి మురిసిపోయేది.

1895లో తల్లి చనిపోయే దాకా వర్జీనియా హైడ్ పార్క్ గేట్ న్యూస్ పత్రికను నడిపింది. పత్రికలో వర్జీనియా చెల్లెళ్ళు ఫోటోలను సమకూర్చేవారు. మెల్లగా వర్జీనియాలో సాహితీ పిపాస, రాయాలన్న కోరిక మొదలయ్యింది. 1897లో వర్జీనియా తన బాల్య జీవితంలోని గొప్ప ఆనందకరమైన రోజుల్ని తన తొట్ట తొలి డైరీలో, నోట్ బుక్‌లో రికార్డు చేయడమే కాదు వాటిని పన్నెండు సంవత్సరాలు భద్రపరిచింది.

బాల్యంలో వర్జీనియా మీద ఇంట్లో సాహిత్యకారుడైన తండ్రి ప్రభావం చాలా ఉండింది. లెస్లీ స్టీఫెన్ పత్రికా సంపాదకుడు విమర్శకుడు, జీవిత చరిత్ర వ్యాఖ్యాతగా సుప్రసిద్ధుడవడంతో పాటు భారతదేశంలో జన్మించి లండన్‌లో పెరిగిన ఇంగ్లీష్ నవలాకారుడు, రచయిత, ఇలస్ర్టేటర్, రచనల రచయిత ప్రపంచ ఖ్యాతి పొందిన వానిటీ ఫెయిర్, లక్ ఆఫ్ బేరీ తిండన్ నవలా రచయిత విలియం మేక్ పీస్ థాకరేతో స్టీఫెన్‌కి స్నేహ సంబంధాలు ఉండేవి. వీరి ఇల్లు ఎప్పుడు హెన్రీ జేమ్స్, జార్జి హెన్రీలూయిస్, ఆల్ ఫ్రెడ్ లార్జ్ టెన్నిసన్, థామస్ హార్డీ, ఎడ్వర్డ్ బర్నె-జోన్స్ అలాగే వర్జీనియాకు గాడ్ ఫాదర్ జేమ్స్ రస్సె‌ల్ లోవెల్ లాంటి సాహితీకారులలో, వాళ్ళ సాహితి పఠనం చర్చలతో నిండుగా ఉండేది. వర్జీనియా వూల్ఫ్ ఈ రకంగా విక్టోరియన్ సాహిత్య సమాజంలో పెరిగింది. చాలా చిన్న వయసులోనే వర్జీనియా ఏదైనా చదవాలని ప్రయత్నించేది.

కానీ తల్లిదండ్రులు ఇద్దర్కీ ఆడపిల్లలు బయటికెళ్ళి చదవడం ఇష్టం ఉండేది కాదు. కానీ స్త్రీలు ఇళ్ళల్లో ఉండి రాస్కోవడం పట్ల ఇద్దర్కీ అభ్యంతరం లేదు. కాబట్టి వర్జీనియా రచనలను బాగా ప్రోత్సహించే వాళ్ళు. తన ఆత్మ కథా వ్యాసాల్లో చాలా చిన్నప్పట్నించే ‘సుగంధ పుష్పాలను పూచే ముళ్ళ పొదలాగా డ్రాయింగ్ రూంలో ధగధగా మెరిసిపోయే సోఫాలో కూర్చుని రాస్తూ ఉండేదాన్ని భోజనానికి కూడా లేవకుండా మిగతా వాళ్ళు తింటూ ఉంటే’ అని రాస్కుంది వర్జీనియా.

ఐదేళ్ళు వచ్చేప్పటికి వర్జీనియా ఉత్తరాలు రాయడం నేర్చుకుంది. అంతేకాదు రోజూ రాత్రి నిద్రపోయే ముందు తండ్రి స్టీఫెన్‌కు కథ చెప్పేది. తర్వాత అక్క అన్నలతో కల్సి తమ తోటలో భూతప్రేతాలు తిరుగుతున్న కథలు సీరియల్స్ గా చెప్పుకుంటూ రాసేవాళ్ళు. పుస్తకాల మీది ప్రేమ. ఆసక్తి ఆమెకీ ఆమె తండ్రి స్టీఫెన్‌కి మధ్య బలమైన బంధాన్ని ఏర్పర్చింది. ఆమె పదవ పుట్టిన రోజుకి తండ్రి నుంచి ఆమెకి ఒక ఇంక్ స్టాండ్, బ్లాటర్, డ్రాయింగ్ బుక్, ఒక బాక్స్ నిండా రాస్కోవడానికి కావల్సిన సరంజామా కాగితాలు, స్కేలు, పెన్నులు, పెన్సిళ్ళు, రబ్బరు లాంటివి కానుకగా అందాయి.

తర్వాత వర్జీనియా మీద ఆమె తల్లి జూలియా జాక్సన్ హఠాన్మరణం తీవ్రమైన ప్రభావాన్ని చూపించింది. వర్జీనియాకి 13 సంవత్సరాల వయసపుడు జూలియా ఇఫ్లూన్‌యంజా బారిన పడి 1895 మే ఐదున మరణించింది. వర్జీనియాకి ఇది చాలా పెద్ద దెబ్బ. ఆమె డిప్రెషన్‌లోకి వెళ్ళిపోయింది. చాలాసార్లు నర్వస్ బ్రేక్ డౌన్‌కి గురి అయ్యింది. అక్క వెనీసా ఆమె మానసిక ఆరోగ్యం కుదుటపడడానికి సపర్యలు చేసింది. అన్న జార్జి డక్ వర్త్ కూడా ఆడపిల్లలను సంరక్షించే బాధ్యత తీస్కున్నాడు. ఆ క్రమంలో ఆడపిల్లల మీద నిర్బంధం కూడా అమలయ్యిందని వర్జీనియా ఆత్మకథలో రాస్కున్నారు. ఇంట్లో మగవాళ్ళకి వెనీసా, వర్జీనియా వూల్ఫ్ నించి సాంప్రదాయక నమూనాల్లో ఒదిగే స్త్రీల వ్యక్తిత్వాలు కావాలి. దాని గురించి వర్జీనియా ఇలా రాస్కుంటుంది.

“ఆ రోజుల్లో సమాజంలో ఒక సంతృప్తికరమైన పోటీతో పాటు… హృదయం లేని కరకు పోటీ ఉండేది. సమాజం స్త్రీలకు హృదయం లేని ఒక యంత్రంలా ఉండేది. దాని క్రూరమైన కోరలను ఒక అమ్మాయి ఎదుర్కోవడానికి ఏ అవకాశమూ ఉండేది కాదు. ఏ కోరికలు ఆకాంక్షలూ ఉండకూడదు. కూర్చొని బొమ్మలేసుకోమంటే వేస్కోవాలి… రాస్కోమంటే రాస్కోవాలి. ఇవి రెండే సీరియస్ గా తీస్కోవాలి. ఇవీ వాళ్ళిచ్చే అవకాశాలు మా స్త్రీలకు, ఈ ఊపిరాడని ఉక్కిరి బిక్కిరితనాన్ని భరించలేక విక్టోరియన్ సాంప్రదాయికమైన… వెలుతురు తక్కువగా ఉండే తన ఇంటి బేస్మెంట్‌లో ఉన్న డ్రాయింగ్ రూమ్ నించి ‘రూమ్ ఆఫ్ వన్స్ ఓన్’లోకి వర్జీనియా వూల్ఫ్ తన కలలు సాకారం చేస్కోడానికి పరిగెత్తి పరిగెత్తి చేరుకొని ఉంటుంది.

అలాగే తాను రాసిన ‘టు ది లైట్‌హౌస్’లో విక్టోరియన్ మదర్ బాధ్యతలను నెరవేర్చే మిసెస్ రామ్సే అనే తల్లి పాత్రతో, ‘అవివాహిత భర్త, ఇల్లు, పిల్లలు అనే గొప్ప జీవితాన్ని కోల్పోతుంది’ అని రాసిన వాక్యం గురించి వర్జీనియా వూల్ఫ్ మళ్ళీ ఆత్మ విమర్శ చేస్కుంటుంది.

తర్వాత తల్లి మరణించిన తర్వాత తోడు ఉండిన పిన్ని స్టెల్లా 1887లో దీర్ఘవ్యాధితో మరణించడం వర్జీనియాని మళ్ళీ ఒంటరితనంలోకి వేధిస్తుంది. మళ్ళీ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతుంది. దెబ్బ మీద దెబ్బలాగా 1904లో వర్జీనియా తండ్రి వెస్లీ స్టీఫెన్ 1904 ఫిబ్రవరిలో సర్జరీ నించి పూర్తిగా కోలుకోక ముందే మరణిస్తాడు.
వర్సగా తల్లి, తన తండ్రి మరణం ఆమెను పూర్తిగా కుంగదీసాయి. ఆమె పలుసార్లు నర్వస్ బ్రేక్ డౌన్ కి లోనవుతుంది. అటువంటి విధంగా గడిచిన తన ఒంటరి విషాదకరమైన బాల్య జీవితపు గ్నాపకాలను వర్జీనియా వూల్ఫ్ ఇంకా రెక్కలు మడుచుకుని ఉండగానే… సీతాకోక చిలుకగా మారకముందే చితికిపోయిన ప్యూపాదశగా తన మనోస్థితిని గురించి రాస్తుంది. సీతాకోక చిలుకకీ, తన జీవితంలోని విషాదానికీ మధ్య ఉన్న సంబంధాన్ని ఒక మెటఫర్‌గా ‘బ్రోకెన్ క్రిసాలిస్’ అనే పదాన్ని అనేక సార్లు తన రచనల్లో వాడింది.

ఆమె చదువు కూడా ఆ రోజుల్లో జెండర్ వివక్ష పునాదిగా నిర్ణయించబడ్డ పరిధిలోనే కొనసాగింది. దీన్ని ఆమె వ్యక్తిగత జీవితంలో, రచనల్లోనూ ఖండించింది. ఎగువ మధ్య తరగతి అబ్బాయిలు ఉదా: స్టీఫెన్స్ ప్రైవేట్ స్కూళ్ళు, బోర్డింగ్ స్కూళ్ళు, యూనివర్శిటీలకు స్వేచ్ఛగా ఏ నియంత్రణలూ లేకుండా చదువుకునే వాళ్ళు. అమ్మాయిలు ఒకవేళ సంపన్నులైతే ఇళ్ళ దగ్గరే ట్యూటర్స్, గవర్నెన్స్‌లతో చెప్పించుకునే వాళ్ళు అదీ తల్లిదండ్రులు అనుమతిస్తే. ఈ తాహతు కూడా లేకపోతే తల్లిదండ్రులే పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు.
వర్జీనియా వూల్ఫ్‌కి తల్లిదండ్రులే వంతుల వారీగా చదువు చెప్పారు.

విక్టోరియన్ తరహా సాంప్రదాయకమైన డ్రాయింగ్ రూం వెనకాల ఉండే గదిలో చదువూ, పెయింటింగ్ లో ఆడపిల్లలకు విద్యాబోధన నడిచేది. తల్లి జూలియా బాక్సన్ పిల్లలకు లాటిన్, ఫ్రెంచ్, చరిత్ర బోధిస్తే, తండ్రి వెస్లీ స్టీఫెన్ గణితం నేర్పించాడు. అలాగే పియానో కూడా నేర్పించాడు. ఆ సమయంలో స్టీఫెన్ పెద్ద లైబ్రరీలో వర్జీనియాకి ప్రవేశం దొరికింది. వర్జీనియా చాలా పుస్తకాలు చదివింది.

తండ్రి గ్రంథాలయమే వర్జీనియాకి పాఠశాలగా మారి విస్తృతమైన సాహిత్యాన్ని తద్వారా ప్రపంచాన్ని అర్థం చేయించింది. బహుశ కేంబ్రిడ్జ్ లాంటి పెద్ద యూనివర్సిటీల్లో కూడా ఇంత విస్తృతమైన అధ్యయనం చేసే అవకాశం దొరికి ఉండదు. 15 సంవత్సరాల చిన్న పిల్ల అంత పెద్ద గ్రంథాలను చదువుతుంటే తల్లిదండ్రులు ఆశ్చర్యపోయేవారు. ‘కానీ మా నాన్న నన్ను అనుమతించారు. చాలా మంచి పుస్తకాలను ఆయన నాకు పరిచయం చేసి చదవమనేవారు. నీ ఇష్టం వచ్చిన పుస్తకాలు చదువు అలాగే నా పుస్తకాలు కూడా అనేవారు’ అని రాస్కుంది, వర్జీనియా తన అత్మకథా రచనలో.

15-19 సంవత్సరాల మధ్య వర్జీనియా వూల్ఫ్ తను ఎన్నుకున్న ఉన్నత విద్యను అభ్యసించగలిగింది. కింగ్స్ కాలేజ్ లండన్‌లో లేడీస్ డిపార్ట్‌మెంట్‌లో ఇంగ్లీష్ చరిత్రను ఎన్నుకుంది. గ్రీక్, లాటిన్, జెర్మన్ భాషలతో పాటుగా. గ్రీకు భాషను ఆమె క్లాసికల్ లిటరేచర్ ప్రొఫెసర్ జార్జ్ వింటర్ వార్ దగ్గర అభ్యసించింది. జానెట్ కేస్ అనే గ్రీక్ భాష ప్రొఫెసర్ వర్జీనియా వూల్ఫ్‌కి స్త్రీల హక్కుల ఉద్యమాన్ని పరిచయం చేసింది. ఆమె చనిపోయాక సంతాప సందేశాల్ని 1937లో వర్జీనియా వూల్ఫే “ఆన్ నాట్ నోయింగ్ గ్రీక్”గా రాసింది. అదే సమయంలో కింగ్ కాలేజీలో ఆమెకు ఎంతో మంది మహిళా సంఘ సంస్కర్తలు, ఉద్యమకారిణిలు పరిచయం అయ్యారు. వీరంతా స్త్రీల ఉన్నత విద్యాహక్కుల సాధన కోసం పని చేసిన వాళ్ళు. అందులో లేడీస్ డిపార్ట్ మెంట్ ప్రిన్సిపాల్ లిలియన్‌ ఫెయిల్ ఫుల్, క్లారా పాటర్ ముఖ్యులు. వర్జీనియాతో పాటు వెనీసా కూడా కింగ్స్ కాలేజీలో చదువుకున్నది. కానీ ఇద్దరూ కేంబ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్ళలేక పోయారు. కానీ వాళ్ళ అన్నలు యూనివర్సిటీ కబుర్లు చెబుతుంటే ఆసక్తిగా వినేవాళ్ళు. వర్జీనియా అన్న తోబి ట్రివిట్ యూనివర్సిటీలో చేరి అక్కడ క్లీవ్ బెల్, లియోనార్డ్ వూల్ఫ్, సిడ్నీ టర్నర్లలో పరిచయం, స్నేహం చేస్కోవడమే కాదు, వాళ్ళతో కలిసి 1904లో ‘మిడ్ నైట్ సొసైటీ’ అనే సాహిత్య అధ్యయన గ్రూప్‌ని మొదలు పెడతాడు. ఈ గ్రూప్ సాహిత్య చర్చల్లో వర్జీనియా పాల్గొనేది. వర్జీనియాపై తల్లి జూలియా ప్రభావం. వర్జీనియాకి తల్లి జూలియా జాక్సన్ ఒక తీరని తపనగా మిగిలిపోయింది. తన అనేకమైన రచనల్లో కవితల్లో, డైరీలో తల్లి గురించి రాస్కుంది. ‘గత కాలాల్లోకి వెళ్ళాలంటే అమ్మల ద్వారా మాత్రమే వెళ్ళగలం’ అని రాస్కుంది. తన ఉత్తరాలు : ఆత్మకథ రచనల్లో 22 హైడ్ పార్క్ గేట్‌లో స్కేచ్ ఆఫ్ ది పాన్‌లో ఆమె తన గ్నాపకాలను ‘ఐ సీ హర్…’ నేను ఆమెను చూస్తున్నాను అని మొదలు పెట్టేది. ఆఖరికి ‘టు ది లైట్ హౌస్’లో నవలలో గృహిణి మిసెస్. రామ్సే పాత్రలో కూడా తల తల్లినే చూస్తుంది. లేదా తన తల్లి పాత్రనే రామ్సే పాత్రలో నింపింది. 13 సంవత్సరాల బాల్య జీవితంలో తనకు ప్రపంచ భాషలు – చరిత్ర నేర్పిన తల్లిగా, తనలోని సృజనాత్మకతను, సంఘ సేవనూ ఏ మాత్రమూ కించపరచుకోకుండా గర్వపడుతూనే తన భర్త అయిన స్టీఫెన్ రచనలను ప్రోత్సహించి భర్తకు అవసరాలు అన్ని పూర్తి చేసేది. ఇంట్లో బయటా తీరిక లేకుండా ఉంటూ తన తల్లిదండ్రుల్ని కూడా చూస్కుంది. తల్లి పట్ల వర్జీనియాకు అలవిమాలిన అభిమానం ఉండేది. తన తల్లి చేసే నిస్వార్థపూరితమైన సమాజ సేవ పట్ల వర్జీనియాకు గొప్ప ఆరాధన ఉండేది. 15 ఏళ్ళు తల్లికంటే పెద్ద అయిన తండ్రి తన భార్య మీద పసిపిల్లాడిలా ఆధారపడడం వర్జీనియాకు ఆశ్చర్యం కలిగించేది. ముఖ్యంగా స్టీఫెన్ డిప్రెషన్‌కు జూలియా ఒక మందులా పని చేసేది. వర్జీనియాకు తన తండ్రి స్టీఫెన్ పట్ల వాత్సల్యం ప్రేమలతో పాటు సాహిత్యం సంబంధం అమితంగా ఉండేది.

అదే సమయంలో తండ్రిలోని ఖాఠిన్యాన్ని, తెంపరితనాన్ని, కోపాన్ని పిల్లలు భరించేవారు. వర్జీనియా వూల్ఫ్ తన వ్యాసాల్లో తండ్రిని ‘ది టైరంట్ ఫాదర్’ అని రాసేది (క్రూరమైన తండ్రి) ఆమె తండ్రి విషయంలో ఒక అభిప్రాయానికి రావడానికి సందిగ్ధపడేది. తల్లి, తండ్రిలో ఆమెకి ఇష్టమైంది తన తల్లి జూలియా జాక్సన్. అయితే తండ్రి పరిచయం చేసిన సాహిత్యం వల్ల ఆమెకి తండ్రి పట్ల ప్రేమ, గౌరవం ఉండేవి. వర్జీనియా వూల్ఫ్ పద్ధనిమిదవ పుట్టిన రోజుకి స్టీఫెన్ ఒక బంగారు ఉంగరం కానుకగా ఇస్తాడు. దాంతో తన తండ్రి సాహితీ వారసురాలిగా తనను తాను దర్శించుకుని భావోద్వేగానికి లోనవుతుంది వర్జీనియా వూల్ఫ్. తండ్రి పట్ల ఆరాధన పెరిగిందని రాస్కుంటుంది. అదే క్రమంలో అతన్ని ఒక క్రూరమైన తండ్రిగానూ విముఖత పెంచుకుంటుంది వెనీసాలాగా. తండ్రి పట్ల ప్రేమా, ద్వేషం అనే ద్విసంవేగ మానసిక స్థితిలో ఉండేది వర్జీనియా వూల్ఫ్.

వర్జీనియా రచనల్లో స్త్రీ పురుష లైంగిక సంబంధాలు ఇద్దరి స్త్రీల మధ్య ప్రేమా శారీరక సంబంధాలు, ఆమె నిజ జీవితంలో భర్తతో సంబంధంలో ఉంటూనే తన దగ్గరి స్నేహితురాలుతో లైంగిక సంబంధం నెరపడం, ఈ ధ్వంధ్వ మానసిక ధోరణితో తీవ్రమైన పశ్చాత్తాపానికి, డిప్రెషన్‌కి గురవడం గమనిస్తాం. అయితే వర్జీనియా వ్యక్తిత్వంలో ఈ భిన్నమైన లైంగిక ధోరణులు ఉన్నట్లుండి వచ్చాయా అంటే కాదు. ఆమె బాల్య జీవితంలో తల్లిని, పిన్నిని, కోల్పోయిన ఒంటరితనంలో డిప్రెషన్ కు గురి అయిన వర్జీనియా వూల్ఫ్ మీద పలుమార్లు లైంగిక అత్యాచారం అంటే ‘సెక్సువల్ అబ్యూస్’ జరిగింది. ఇదే ఆమె మానసిక ఆరోగ్యాన్ని దారుణంగా దెబ్బ తీసింది. లైంగిక అంశాల పట్ల, లైంగిక ధోరణి పట్ల ఒక దిగ్ర్భాంతిని, భయాన్ని అయోమయాన్ని కలిగించి ఆమె వివాహానంతర లైంగిక సంబంధాల్లో, మనో లైంగిక సమస్యగా పొడచూపింది. బాల్య జీవితంలో 22 హైడ్ పార్క్ గేట్ ఇంట్లో ఈ అరాచకాలన్నీ వర్జీనియాపై ఆ ఇంటి ఇతర ఆడపిల్లలపైన జరిగాయి.

తనకు ఆరు సంవత్సరాలు ఉన్నప్పుడు తన సవతి సోదరుడు గెరాల్డ్ డక్ వర్త్ అంటే, తన తల్లి మొదటి భర్త సంతానం తనపైన లైంగిక అత్యాచారాన్ని చేసాడని వర్జీనియా తన ఆత్మకథ రచనలో రాస్కుంటుంది. ఇది ఆమెలో జీవితాంతం సెక్స్ పట్ల భయాన్ని స్త్రీలపై లైంగిక అత్యాచారాన్ని చేసే అధికారం ఉన్న పురుషాధిక్యతను విపరీతంగా ద్వేషించేటట్లు చేసింది. అదే సమయంలో తనకు అధికారం, జులం చెలాయించి అందని ప్రేమగా మిగిలిపోయిన తన తల్లి జూలియా జాక్సన్, పిన్ని స్టెల్లా పట్ల అమితమైన ఆరాధనను పెంచుతాయి. వర్జీనియా అక్క చెల్లెళ్లందర్ని, డక్ వర్త్ బ్రదర్స్ లైంగికంగా వేధించారు. వీరిలో వాళ్ళ కజిన్ జేమ్స్ కెన్నిత్ స్టీఫెన్ కూడా వర్జీనియా వూల్ఫ్ మీద లైంగిక వేధింపులకు పాల్పడతాడు. మానసిక అంగ వైకల్యం ఉన్న లెస్లీ స్టీఫెన్ మొదటి భార్య కూతురు లారాని కూడా వాళ్ళు వదిలి పెట్టకపోవడం వర్జీనియాని మరింత కృంగదీసింది. వర్జీనియా రచనలను గమనించినపుడు ఆమె రచనలో వర్జీనియా తన అంతర్గత ఘర్షణను తన బాల్య జీవితంలో తన మీద తన అక్కల మీద జరిగిన లైంగిక అత్యాచారాల తర్వాతి మానసిక గాయాల్ని, దిగ్ర్భాంతిని రచించడంలో వైరుధ్యాలను గమనించినా, ఆమె జీవితంలో ఈ లైంగిక అత్యాచారాలు ఆమె పైన జరిగినవన్న బలమైన సాక్షాలున్నాయని ఆమె రచనలను జీవితాన్ని పరిశీలించిన రచయిత, సమీక్షకుడు ‘లీ’ విశ్లేషిస్తాడు.

1907లో ఫిట్ జోవియాలో వర్జీనియా వూల్ఫ్ తమ్ముడు ఏడ్రియన్‌తో కలిసి ‘థర్స్ డే క్లబ్’ ఏర్పాటు చేసుకున్నారు. ఇదే మెల్లగా ‘ప్లే రీడింగ్ సోసైటీ’గా మారింది. ఇక్కడ అభ్యుదయ భావాలున్న రచయితలు, మేధావులు కలిసి చర్చా కార్యక్రమాలు నిర్వహించుకునే వాళ్ళు 1910లో వెనీసా, అందరికీ లైంగిక స్వేచ్ఛని, ఆలోచనలని వెలువరించే హక్కులు కావాలన్న నినాదంతో లిబరేషన్ సొసైటీగా మారింది. లైంగిక స్వేచ్ఛ, లైంగికత అంశాల మీద విస్తృతంగా అదే సమయంలో చర్చలు జరిగేది.

1912లో వర్జీనియా వూల్ఫ్ తన సోదరుడి స్నేహితుడు, పత్రికా సంపాదకుడు వామపక్ష మొదట్లో భావాలున్న రచయిత అయిన లియోనార్డ్ వూల్ఫ్‌ని వివాహం చేస్కుంది. వర్జీనియా వివాహానికి వ్యతిరేకత చూపించినా లియోనార్డ్ వూల్ఫ్ పట్టువదలకుండా ప్రయత్నించి ఆమెని ఒప్పించడంలో సఫలం అయ్యాడు. 1914లో ఇద్దరూ కల్సి పబ్లిషింగ్ హౌస్ హెూగార్త్ ప్రెస్ స్థాపించి, వర్జీనియా మొదటి నవల ‘ది వాయేజ్ అవుట్’ని ప్రచురించారు.

ఆ తర్వాత హోగార్త్ ప్రెస్ నించే వర్జీనియా రచనలు ప్రచురించబడినాయి. వర్జీనియా వూల్ఫ్ విస్తృతంగా రచనలు చేసింది. నవలలు, వ్యాసాలు, కథలు, నాటికలు, గల్పికలు, కోట్స్ రాసింది. స్త్రీ స్వేచ్ఛ, విద్య, ఫెమినిసమ్, స్త్రీల హక్కుల గురించి అనేక వేదికల మీద, యూనివర్సిటీల్లో ఉపన్యాసాలు ఇచ్చింది. వర్జీనియా వూల్ఫ్ వివాదాస్పదమైన విప్లవాత్మకమైన రచనలు, వ్యాఖ్యానాల మీద అనేక పరిశోధనా పత్రాలు వచ్చాయి. ఆమె భిన్నమైన లైంగిక ధోరణి మీద మనస్తత్వ వేత్తలు, రచయితలు, విమర్శకులు వ్యాఖ్యానించారు, విస్తృతంగా రాసారు.

వర్జీనియా వూల్ఫ్ రచనలు దాదాపు 50 ప్రపంచ భాషలో అనువదించబడ్డాయి. బాల్య, యౌవన, ప్రౌఢ దశల్లో విపరీతమైన మానసిక వత్తిడి డిప్రెషన్‌లో ఉంటూనే ఆమె అద్భుతమైన రచనలు చేసింది. మరణించే దాకా దాదాపు మూడు సార్లు ఆత్మహత్యా ప్రయత్నాలు చేసింది. ఆఖరికి ఆఖరి నవల ‘బిట్వీన్ ది ఆక్ట్’ కూడా డిప్రెషన్‌లో రాసింది.

ఆ నవల ముద్రించక మునుపే ఆమె తన 59దవ ఏట ఆత్మహత్య చేస్కుంది. వర్జీనియా వూల్ఫ్ జీవితంలో వ్యక్తిత్వంలో చాలా వైరుధ్యాలు, ఘర్షణా ఉన్నాయి. ముఖ్యంగా ఆమె లియోనార్డ్ వూల్ఫ్‌తో వివాహం అయింతర్వాత తన స్నేహితురాలైన రచయిత్రి, వర్జీనియా కంటే 10 సంవత్సరాలు చిన్నదైన ‘విటా స్టాక్ విల్లే, వెస్ట్’తో ప్రేమ, ఆకర్షణలో పడుతుంది. లైంగిక సంబంధాల్లోకి వెళ్ళిపోతుంది. ఇద్దరూ పురుషుల్నే వివాహం చేస్కున్నా కానీ ఒకరితో, ఒక గాఢమైన ప్రేమలో పడతారు. చాలా ప్రేమ, మోహం, ఆరాధన ఆర్దతతో కూడిన ప్రేమ లేఖలు పుంఖానుపుంఖాలుగా రాసుకుంటారు. ఈ ఉత్తరాలు అద్భుతమైన లేఖా సాహిత్యం 1928లో ఓర్లాండో నవలగా మారుతుంది.

ఓర్లాండో నవలతో వర్జీనియా సినిమాగా కూడా వచ్చింది. నటి ఎలిజెబెత్ డెబికి వర్జీనియా వూల్ఫ్‌గా, గెమ్మా అటన్, సాక్ విల్లేవెస్ట్‌గా నటిస్తే చెన్యా బటన్ దర్శకుడిగా పని చేశాడు. ఈ సినిమాని లండన్‌లో అప్పటి బీహెమియన్ ఉన్నత వంశస్థుల నేపథ్యంగా తీసారు.

ఆ సమయంలో బ్రిటిష్ సొసైటీ చాలా సాంప్రదాయకంగా ఉండేది. యు.కె.లో మేల్ హోమోసెక్సువాలిటీ నేరంగా పరిగణించబడేది. స్టాక్ విల్లే భర్త కూడా హోమో సెక్సువల్‌. వర్జీనియా కంటే ముందే స్టాక్ విల్లే తన ప్రియురాలు వయెలెట్ ట్రిఫుసి తో యూరోప్ పారిపోయి రెండు సంవత్సరాలు సహజీవనం చేసింది.

వర్జీనియా, స్టాక్ విల్లే తమ మధ్య ఉన్న లైంగిక సంబంధాన్ని రహస్యంగా దాచలేదు. లెస్బియనిజం లేదా ఇద్దరు స్త్రీల మధ్య లైంగిక సంబంధాన్ని 1921లో కొంత మంది న్యాయవాదులు నేరంగా భావిస్తూ ‘సెక్సువల్ యాక్ట్ ఆఫ్ గ్రాస్ ఇన్ డిసెన్సీ’ చట్టం తీసుకు వచ్చారు కానీ అదెపుడు ఆమోదించబడలేదు. అలా నిర్బధంగా చట్టం తెస్తే స్త్రీలు హోమో సెక్సువాలిటీ వైపు మరింతగా ఆకర్షించబడతారని అప్పటి రాజకీయ నాయకులు భయపడ్డారు.

మొదట్లో సాక్‌విల్లే వీటాకు శారీరకంగా దగ్గర కావడానికి వర్జీనియా సందేహిస్తుంది. ఎందుకంటే ఆమె బాల్యంలో ఆమె సెక్సువల్ అబ్యూస్‌‌కి గురి అయ్యింది కాబట్టి అని విశ్లేషకులు అంటారు. అదే సమయంలో ఇటు వీటాకి, అటు భర్త లియోనార్డ్‌ల మధ్య నలిగిపోయి ఘర్షణ పడుతుంది. వర్జీనియా లియోనార్డో భార్యకి – వీటాతో ఉన్న సంబంధాన్ని ఆమోదిస్తాడు. అయినా వర్జీనియా అపరాధ భావనతో నలిగిపోతుంది. మానసిక కుంగుబాటుతో, బైపోలార్ డిప్రెషన్‌తో బాధపడ్తుంది.

చాలాసార్లు మానసిక చికిత్సాలయంలో చేరుతుంది. ఆత్మహత్యలకు ప్రయత్నిస్తుంది. చివరికి 1941లో తన ఇంటి సమీపంలోని నదిలో మునిగి చనిపోతుంది. ఆమె మానసిక ఒత్తిడికి పై కారణాలతో పాటు మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, మానవ విషాదం, యుద్ధాల్లో ధ్వంసమైన తనకెంతో ప్రేమాస్పదమైన చిన్ననాటి ఇల్లు కూడా ఉన్నాయి.

వర్జీనియా వూల్ఫ్‌ – సాహిత్యం
నవలలు:
ది వా యేజ్ అవుట్ (1915)
నైట్ అండ్ డే (1919)
జాకబ్స్ రూమ్ (1922)
మిసెస్ డల్లోవే (1925)
టు ది లైట్ హౌస్ (1927)
ఓర్లాండో(1928)
ది వేవ్స్ (1931)
ది ఇయర్స్ (1937)
బిట్వీన్ ది యాక్ట్ (1941)

కథానికల సేకరణలు
మండే ఆర్ ట్యూస్డే (1921)
ఎ హాంటెడ్ హౌస్ అండ్ అదర్ షార్ట్ స్టోరీస్ (1944)
మిసెస్ డల్లోవేస్ పార్టీ (1973)
ది కంప్లీట్ షార్టర్ ఫిక్షన్ (1985)

జీవిత చరిత్రలు
వర్జీనియా వూల్ఫ్ ప్రచురించిన మూడు పుస్తకాలకు “ఎ బయోగ్రఫీ” అనే ఉపశీర్షిక పెట్టింది: Orlando: A Biography (1928, సాధారణ పాత్రలతో కూడిన నవల, విటా శాక్వి ల్లె-వెస్ట్ జీవితంతో ప్రభావితమైంది)

ఫ్లష్: A Biography (1933)
“చైతన్య స్రవంతి” శైలిలో కాల్పనిక సాహిత్య ప్లష్, పరిధిలో వచ్చేలా రాస్తుంది. కుక్క యజమాని కథను చెబుతున్న అర్థంలో 2005లో పర్సెఫోన్ బుక్స్ వారిచే పునర్ముద్రణ అయింది.

Roger Fry: A Biography (1940, సాధారణంగా కాల్పనికేతరంగా పాత్రీకరించబడింది, అయితే, “వూల్ఫ్ యొక్క నవలా రచనా కౌశలాలు జీవిత చరిత్రకారిణిగా ఆమె ప్రతిభకు వ్యతిరేకంగా పని చేశాయి. ఆమె అనుభావనాత్మక పరిశీలనలు అనేక రకాల వాస్తవాలను యుద్ధం చేసే ఏకకాలిక అవసరంతో అననుకూలంగా పెనుగులాడాయి, ఘర్షణ పడింది. ఈ జీవిత చరిత్ర సరిగా చర్చించక పోవడం వలన మానసిక వ్యధకు గురి అయ్యింది.

కాల్పనికేతర పుస్తకాలు
మోడరన్ ఫిక్షన్ (1919)
ది కామన్ రీడర్ (1925)
ఎ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్ (1929)
ఆన్ బీయింగ్ ఇల్ (1930)
ది లండన్ సీన్ (1931)
ది కామన్ రీడర్: సెకండ్ సీరీస్ (1932)
త్రీ గినియాస్ (1938)
ది డెత్ ఆఫ్ ది మోత్ అండ్ అదర్ ఎస్సేస్ (1942)
ది మూమెంట్ అండ్ అదర్ ఎస్సేస్ (1947)
ది కెప్టెన్స్ డెత్ బెడ్ అండ్ అదర్ ఎస్సేస్ (1950)
గ్రానైట్ అండ్ రెయిన్ బో (1958)
బుక్స్ అండ్ పోర్టయిట్స్ (1978)
విమెన్ అండ్ రైటింగ్ (1979)

సంకలిత వ్యాసాలు (నాలుగు సంపుటాలు)
జెస్సో, ఫ్రెష్‌ వాటర్, ఏ కామెడీ

ఆటోబయోగ్రాఫికల్ రైటింగ్స్ అండ్ డైరీస్
ఏ వైటర్స్ డైరీ (1953)
ఎక్స్ ట్రాక్స్ట్ ఫ్రమ్ ది కంప్లీట్ డైరీ : మూమెంట్స్ ఆఫ్ బీయింగ్ (1976)
ఏ మూమెంట్స్ లైబర్టీ: ది షార్టర్ డైరీ (1990)
ది డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ (ఫైవ్ వాల్యూమ్స్) – డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ ఫ్రమ్ 1915 to 1941

ప్యాసనేట్ అప్రెంటీస్: ది ఎర్లీ జర్నల్స్ 1897-1909 (1990)
ట్రావెల్స్ విత్ వర్జీనియా వూల్ఫ్ (1993)
గ్రీక్ ట్రావెల్ డైరీ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్, ఎడిటెడ్ బై జాన్ మోరిస్ . ది ప్లాట్‌ఫాం ఆఫ్ టైమ్: మెమొరీస్ ఆఫ్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, ఎక్స్పోండెడ్ ఎడిషన్, ఎడిటెడ్ బై ఎస్. పీ. రోసెన్బాఅమ్ (లండన్, హెస్పె౦స్, 2008)

లేఖలు
కాంగినియల్ స్పిరిట్స్: ది సెలెక్టెడ్ లెటర్స్ (1993)
ది లెటర్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ 1888-1941 (సిక్స్ వాల్యూమ్స్, 1975-1980)
పేపర్స్: ది ఇల్లస్ట్రేటెడ్ లెటర్స్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్ (1991)

ముందుమాటలు
సెలక్షన్స్ ఆటోబయోగ్రాఫికల్ అండ్ ఇమాజినేటివ్ ఫ్రమ్ ది వర్క్స్ ఆఫ్ జార్జ్ గిస్సింగ్ ఎడ్. ఆల్ఫ్రెడ్ సీ. గిస్సింగ్, విత్ యాన్ ఇంట్రడక్షన్ బై వర్జీనియా వూల్ఫ్ (లండన్ అండ్ న్యూయార్క్, 1929)

జీవిత చరిత్రలు
వర్జీనియా వూల్ఫ్ బై నిగెల్ నికల్సన్. న్యూయార్… పెంగ్విన్ గూప్. 2000

ఆంథాలజీస్ విత్ షార్ట్ స్టోరీస్ ఆఫ్ వర్జీనియా వూల్ఫ్
స్టోరీస్ – స్ర్టేంజ్ ఆ సినిస్టర్
విట్చర్ బ్రూ
ద మమ్మోత్ బుక్ ఆఫ్ హాంటడ్ హౌసం స్టోన్స్

కథానికలు
లాప్పిన్ ఆలాప్పినోవా
ఏ హాంటెడ్ హౌస్

వర్జీనియా వుల్ఫ్ మీద పరిశోధనాత్మక పుస్తకాలు
వర్జీనియా వూల్ఫ్ – వినిఫ్రెడ్ హాటిల్‌బై
వూల్ఫ్ టు ద లైట్ హౌస్ – స్టీవ్ డేవీస్
డైలీ మాడర్నిసమ్ – ఎలిజిబెత్ పాడ్‌నీక్స్

వర్జీనియా వూల్ఫ్ అభిమాన రచనలు
ద నావల్ ఆఫీసర్ (1829) బై ఫ్రెడెరిక్ మారియట్‌
చార్లెట్ బ్రాంట్ – విల్లెట్టె 1853
ది ఆర్డియల్ ఆఫ్ రిచర్డ్ ఫివెరెల్ (1859) – జార్జి మెరిడిత్

సినిమాలుగా వచ్చిన వర్జీనియా వుల్ఫ్ రచనలు

  1. ఓర్లాండో – 1992
  2. ‘ది హావర్స్’ – మిసెస్ హాల్లోవే.

వర్జీనియా వూల్ఫ్ రాసిన కథలు (1917-1930)

  1. ఏ హాంటెడ్ హౌస్
  2. సింపీల్ మెలడీ
  3. ఏ సమ్మింగం అప్
  4. ఏన్ అన్‌రిజన్ నావల్
  5. ఏన్‌సెస్టర్స్
  6. హేపీనెస్
  7. ఇన్ ద ఆర్‌కార్డ్
  8. క్యూ గార్డెన్స్
  9. మూమెంట్స్ ఆఫ్ బీయింగ్
  10. మండే ఆర్ ట్సూస్‌ డే
  11. ఫిల్లీస్ అండ్ రోసామాండ్
  12. సాలిడ్ ఆబ్జెక్ట్స్
  13. సింపతీ
  14. ద ఈవనింగ్ పార్టీ
  15. ద ఇంట్రడక్షన్
  16. ద లేడీ ఇన్ ద లుకింగ్ గ్లాస్
  17. ద లెజసీ
  18. ద మాన్ హూ లవ్డ్ హిస్ కైండ్
  19. ద మార్క్ ఆన్ ద వాల్
  20. ద మిస్టీరియస్ కేస్ ఆఫ్ మిస్టర్ వి
  21. ద న్యూ డ్రెస్
  22. ద షూటింగ్ పార్టీ
  23. ద స్ర్టింగ్ క్వార్టెట్
  24. ద సింబల్
  25. ద వాటరింగ్ ప్లేస్
  26. టు గెదర్ ఆ అపార్ట్

వర్జీనియా వూల్ఫ్ శైలి
పంతొమ్మిదవ శతాబ్దం సాహిత్య ప్రపంచంలో రచనా శైలిలో స్వగతాన్ని అంటే తనలో తాను సంభాషించే పద్ధతిలో రచన చేసే శైలిని, చైతన్య స్రవంతి పద్ధతిని ప్రవేశపెట్టిన మొట్టమొదటి బ్రిటిష్ రచయిత్రిగా వర్జీనియా వూల్ఫ్‌కి పేరుంది. వర్జీనియాకి ఈ రెండు రకాల రచనాశైలుల పట్ల ప్రత్యేకమైన ఆశక్తి ఉంది. కాబట్టి ఆమె తన చాలా రచనల్లో అది నవలైనా, కథైనా ఆఖరికి వ్యాసం, కవితల్లో అయినా ఈ రెండు రచనా ధోరణులను ఎక్కువగా వాడింది. శైలీ, నిర్మాణాల్లో విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసింది.

స్వగతం – ఇంటీరియర్ మోనోలాగ్
స్వగతాత్మకమైన శైలిని ఎక్కువగా అంతర్-బహిర్ సంఘర్షణలు, వైరుధ్యాలు రాసే క్రమంలో వాడింది. ఈ టెక్నిక్ పాఠకుడ్ని పాత్ర యొక్క బహిర్ రూపంను దాటి ఆ పాత్ర అంతర్లోకాలకు లేదా పాత్ర మనసు లోపలికి తీసుకువెళ్తుంది.

ఈ ఇంటీరియర్ మోనోలాగ్ రచనాశైలితో పాత్ర మనసులోని సంఘర్షణకు, అంతర్గత సంభాషణలకు పాఠకున్ని సాక్షిగా తీసుకువెళ్లడమే కాదు కథను, పాత్రను కూడా ఎట్లా మలచుకోవచ్చో, పాఠకుడికి అర్థం చేయిస్తుంది వర్జీనియా వూల్ఫ్. అప్పటి కాలంలో ఈ రకమైన శైలిని ఏ రచయితా వాడలేదు. వారంతా పాత్రల మధ్య అంత:సంబంధాలను బాహ్య ప్రేరకాల సహాయంతో మలిచే ప్రయత్నం చేసేవారు వారి రచనల్లో అదే వారి శైలిగా ఉండింది. ఈ శైలిని కూడా పాత్రలు కంట్రోల్ తప్పకుండా ఇంటీరియర్ మోనోలాగ్ టెక్నిక్‌ని నేరుగా కాకుండా అన్యాపదేశంగా వాడేది వర్జీనియా వూల్ఫ్. ఈ అద్భుతమైన విప్లవాత్మకమైన, నూతనమైన, సృజనాత్మకమైన శైలిని ఎక్కువగా వాడిన నవల మిసెస్. డాలోవే. ఇందులో ఇంటీరియర్ మోనోలాగ్ శైలికి ఉదాహరణ: “అయితే ఆమె వదిలివేయబడింది. నిన్ను చంపుకో. నిన్ను నువ్వు చంపుకో, నీ కోసం కానీ అతనెందుకు వాళ్ళకోసం తనను తాను చంపుకోవాలి? ఆహారం రుచిగా ఉంది. సూర్యుడు వేడిగా ఉన్నాడు. ఇక తనను తాను చంపుకోవడం ఉన్నదే? ఎవరైనా ఎందుకలా చేయాలి? కత్తితో… అసహ్యంగా… రక్తం వరదలు పారుతుండగా లేదా గేస్ పైప్లో గాస్ పీల్చేసుకునో ఎందుకు చావాలి అసలు? అతను చాలా నీరసంగా ఉన్నాడు; అతికష్టం మీద తన చేతిని లేపగలుగుతున్నాడు. దాని మీదనించి అతనిప్పుడు ఒంటరిగా ఉన్నాడు. అంతే నా నింద మోపబడి, తిరస్కరించబడి, వదిలివేయబడి ఉన్నాడు. నిజమే చనిపోయే ముందు మనుషుు ఒంటరిగానే కదా ఉండేది? అయినా ఆ ఒంటరితనంతోనే వింత విలాసం ఉందనీ? గొప్ప గౌరవంతో కూడిన ఏకాంతం… స్వేచ్ఛ… వీటి విలువ ఎవరికి తెలుస్తుందనీ?”

స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ – చైతన్య స్రవంతి శైలి
ఒక రకంగా వర్జీనియా వూల్ఫ్, స్ర్టీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ రచనా శైలికి మార్గదర్శకురాలు లేదా లండన్‌లోనే ఆద్యురాలు. ఈ చైతన్యస్రవంతి శైలి.. ఇంటీరియర్ మోనోలాగ్ శైలిలో ఒక పాయగా చెప్పవచ్చు. ఎందుకంటే ఈ చైతన్య స్రవంతి శైలి పాత్ర మనసులో నించి ప్రారంభమవుతుంది. కానీ ఇది కథ లేదా పాత్ర చిత్రణలో ముఖ్య భాగాన్ని ఆక్రమిస్తుంది. ఒక పొందిక లేని మానవుని ఆలోచనల పదాల, దృశ్యాల ప్రవాహమే ఈ చైతన్యస్రవంతి శైలిలో ఉండే ప్రత్యేకత. ఇవి పాఠకుడి అంతఃచేతనంలోని ఆలోచనలతో పాటుగా, అచేతన మనసులోని ఆలోచనలను కూడా ప్రభావితం చేస్తాయి. అచేతనంలోని అణిచివేయబడిన సభ్యత అసభ్యత సెన్సార్డ్, పాశవిక, శైశవ, ఆలోచనలు కూడా చైతన్య మనసులోకి వస్తూ, పోతూ ఉంటాయి. ఈ చైతన్య స్రవంతి శైలి పాత్ర చుట్టూ ఉండే భౌతిక ప్రపంచం లేదా కథలో ఇతర పాత్రలలో కాకుండా పాత్ర యొక్క మానసిక స్థితులమీద, భావోద్వేగాల మీద ఫోకస్ చేస్తుంది.

వర్జీనియా వూల్ఫ్ చైతన్య స్రవంతి శైలిని “టు ద లైట్ హౌస్‌” నవలలో ఇలా ఉపయోగించింది.
“మగ దుప్పలు మెల్లిగా నిఘాఢంగా మాయమైనట్లు, భోజనం ముగియగానే డైనింగ్ టేబుల్ మీద నుంచి మిసెస్ రామ్సే ఎనిమిది మంది కొడుకులు – కూతుళ్ళు బెడ్రూంల వైపుకి తరమబడతారు. ఎంత వేగంగా కదలిపోతారండి” ఏది మాట్లాడాలన్నా, వినాలన్నా, చెప్పాలన్నా వారికా ఇంట్లో వారికంటే ఒక ప్రత్యేకమైన గది లేదు మరి, టాన్స్‌లేస్ టై, సంస్కరణ బిల్లు పాసం చేయడం, సముద్రపు పక్షులు, సీతాకోక చిలుకలు, జనం, మనుషులు, సూర్యుడు తన ఎండను వాళ్ల గదులవతలి అరలలో ఒంపుతున్నపుడు, అర్రల చెక్కపలకలు ఒక దాన్నించి ఒకటి తెరుచుకుంటూ ఇంకొపక్క అదే వాలీ ఆఫ్ ద గ్రిసన్స్‌లో చనిపోయిన నాన్న కోసం ఒక చిన్న స్విస్ అమ్మాయి (స్విట్జరంలాండ్) నిశ్శబ్దంగా ఏడుస్తూంటుంది. రెక్కలు టపటపలాడించే గబ్బిలాలు, పుల్లలున్న టోపీ, ఇంక్ పాట్లు, వీపు మీద పెంకులన్న రెక్కల పురుగులు, చిన్ని చిన్న పిట్టల తలకాయ పుర్రెలు, రాతి శిలల మీద చారలు చారలుగా పాకిన ఆకాసం సముద్రపు నాచు ఉప్పు, నాచు కలగల్సిన వాసనతో ఇసుక టవల్స్‌తో కూడా నిండిపోయాక ఇసుకతో నిండిన పొడిదనంతో…

వర్జీనియా వూల్ఫ్ శైలి
కల్పనా సాహిత్య రచయిత్రిగా వర్జీనియా ప్రత్యేకతను సంతరించుకుంది. ఇంగ్లీష్ భాషకు గొప్ప పట్టు ఉండటమే కాదు విప్లవాత్మకమైన ప్రయోగాలు చేసింది. ఇంగ్లీష్ భాషలో ముఖ్యమైన ఆత్మాశ్రయ నవలా రచయిత్రిగా వూల్ఫ్‌ని పేర్కొంటారు. ఆమె ప్రతి కథా, నవలా శైలీ, నిర్మాణం, భాషలలో ఏదో ఒక ప్రత్యేకతతో ఉండేవి.
వర్ణనాత్మాక శైలి, సంఘటనలతో రచనను ఉక్కిరి బిక్కిరి చేయకపోవడం, కథను అత్యంత సాధారణత్వంతో నడపడం, అలంకారాల ఆడంబరాలకు పోకపోవడం ఉండేవి. అయితే కొన్నిసార్లు వర్జీనియా వూల్ఫ్‌ వ్యక్తిత్వం పూర్తిగా పాత్రలతో నిండిపోయి పాత్రలకు స్వీయ వ్యక్తిత్వం లేకుండా పోయేది.

వర్జీనియా వూల్ఫ్ కథా – నవలా వస్తువులు
వర్జీనియా వూల్ఫ్ చాలా సంచలనాత్మకమైన వస్తువులతో నవలలు, కథలు రాసారు. ఆమె కథా వస్తువులు ముఖ్యంగా చెదరగొట్టబడిన బాల్యగ్నాపకాలు, గాయాలు ఒత్తిడి, ఒంటరితనం, అమ్మ ప్రేమ, తండ్రి ఖాఠిన్యం, బాల్యంలో జరిగిన ఇన్‌సెస్ట్ లైంగిక అత్యాచారం, స్ర్తీల ఆస్తి హక్కులు, విద్య, సమానత్వం, భిన్నమైన లైంగిక ధోరణులు లెస్బియినిసం, జీవిత చరిత్రలు, స్నేహం, ప్రేమ, బైసెక్సువాలిటీ, ఇంగ్లీష్ మేధావివర్గంలోని ఎగువ ఉన్నత తరగతి సంకుచిత ప్రపంచాన్ని గురించి రాసింది. హిట్లర్ ఫాసిజం, ప్రపంచ యుద్ధం ముందు, యుద్ధం తర్వాతి వాతావరణం, మధ్య తరగతి సాంప్రదాయ స్ర్తీల జీవనశైలి, వారి జీవితాల్లో పురుషాధిక్యత, మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాలు, యుద్ధాల్లో చిధ్రమైన మానవ జీవితాలు, మానసిక రుగ్మతలు, ఆత్మహత్యలు, పురుషుల రచనల్లో స్ర్తీల పాత్ర తక్కువ చేసి చూపించడాలు మీద విమర్శనాత్మకమైన వ్యాసాలు, కథలు.

చాలా పాపులర్ అయిన వర్జీనియా వూల్ఫ్

  1. మిసెస్ డాలోవే
  2. ఓర్లాండో – జీవిత చరిత్ర
  3. టు ద లైట్ హౌస్
  4. ఏ రూమ్ ఆఫ్ వన్స్ ఓన్
  5. ద వేవ్స్
  6. ద వాయేజ్ అవుట్
  7. ప్లష్

ఇవన్నీ కూడా రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలంలో రాసినవే. లండన్ లిటరరీ సొసైటీలో ముఖ్యమైన సభ్యురాలిగా బ్లూమ్స్ బరీ గ్రూపులో ఉంటూ సాహిత్య మేధో చర్చల్లో పాల్గొనేది వర్జీనియా వూల్ఫ్.

వర్జీనియా వూల్ఫ్ నవలల్లో అత్యంత ప్రాముఖ్యాన్ని పొందినని, అప్పటి విక్టోరియన్, నిరంకుశ రాచరిక సమాజాన్ని కలవరపరచిన కొన్ని నవలలను గురించి పరిచయం చేస్కుందాం.

ఓర్లాండో – ఏ బయోగ్రఫీ
ఓర్లాండోని ఒక జీవిత చరిత్రగా రచయిత్రి రాస్తుంది. కానీ ఇదొక నవలగా మాత్రమే ఎక్కువ ప్రాముఖ్యతను సంపాదించుకుంది. అప్పటి సాహిత్య సమాజంలో ‘ఓర్లాండో’ ఒక గొప్ప సంచలనాత్మకమైన వస్తు, శైలీ విన్యాసంతో కూడిన ఒక నిర్భయ సాహసోపేతమైన ప్రయోగం. చైతన్య స్రవంతి శైలీ విన్యాసంలో వడివడిగా పాఠకుణ్ణి ఉరుకులు పెట్టి చదివించిన నవల. ఒక రకంగా వర్జీనియా వూల్ఫ్ ఈ నవలలో తన ఆత్మకథాంశాలను నిజ జీవితంలో తనకు అందకుండా పోయిన తన ప్రియురాలు స్టాక్ విల్లే వెస్ట్ తన ప్రణయ జీవితాన్ని అన్యాప దేశంగా చిత్రించే ప్రయత్నం చేసింది. యుగాల ప్రయాణం, ప్రయత్నం తర్వాత రూపాలు, జాతి మార్చుకున్న తర్వాత ఇద్దరు ప్రేమికురాళ్ళెన ఇద్దరు స్త్రీలు ఆఖరికి కలుసుకుంటారు. ఆ అనంతమైన దశాబ్దాల, వందల సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఎదురైన ఆశ నిరాశలు, ఎదురు దెబ్బలు వైఫల్యాలు, సంతోషాలు, ఘర్షణ కన్నీళ్ళు అద్భుతంగా చైతన్యం స్రవంతి శైలిలో రాస్తూ పోయింది రచయిత్రి. తన నిజ జీవితంలోని ప్రియురాలితో తనకున్న తెంచుకోలేని ప్రేమానుబంధాన్ని, అనుభవిస్తున్న వియోగాన్ని, కలిసేందుకు చేసుకున్న విఫల ప్రయత్నాల్ని ఈ నవలలో కవితాత్మకంగా రాస్తుంది. ఇంగ్లీష్‌లో వచ్చిన తొలి ట్రాన్స్ జెండర్ నవల ఓర్లాండో. ఇందులో పురుషుడు స్త్రీగా మారి, స్త్రీగా జీవితాన్ని అనుభవించడం. స్త్రీగా ఉంటూనే పురుష రూపంలో తిరగడం, ఒకేసారి స్త్రీ పురుష వ్యక్తిత్వాలతో మెలగడం అనే కీలకమైన సంక్లిష్టమైన వస్తువు చుట్టూ నవల తిరుగుతుంది.

కథా నాయకుడు ఓర్లాండో కులీన వంశానికి చెందిన ధనికుడు. ‘నోల్’లో 365 గదులు కల భవంతిలో నివశిస్తూంటాడు. తనకు వారసత్వంగా రావల్సిన ఆస్థిపైన, ఇంటి పైన ఓర్లాండోకి చాలా మమకారం ఉంటుంది. వర్జీనియా వూల్ఫ్ ఈ పాత్రని తన ప్రియురాలు స్టాక్ విల్లే వెస్టను దృష్టిలో పెట్టుకుని రాస్తుంది. స్టాక్ విల్లేకి కూడా వారసత్వపు ఆస్థి, ఇల్లూ రావల్సింది కాకుండా పోవడం వలన చాలా మనస్థాపానికి గురి అవుతుంది. తను స్త్రీ అవడం మూలంగా తనకు ఆస్థిలో హక్కులేకుండా పోయిందని స్టాక్ విల్లే భావిస్తుంది వర్జీనియా కూడా అంతే. వర్జీనియా ఈ నవల రాసే సమయంలో ఇంగ్లాండ్ సమాజంలో పురుషులకు చాలా సౌకర్యాలు వెసులుబాట్లు, హక్కులు ఉంటాయి. మగపిల్లలు అందర్కీ ఆర్థిక వెసులుబాటుని బట్టి స్థానిక బడుల నుంచి మాంటిస్సోరీలకు, కాలేజీల నుంచి యూనివర్సిటీలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అదే అమ్మాయిలు ఇళ్ళల్లోనే ఆర్థిక వెసులుబాటుని బట్టి హోమ్ ట్యూటర్స్‌తో గ్రీక్, లాటిన్, ఫ్రెంచి భాషలు, చరిత్రా లాంటివి చిత్రలేఖనం, సంగీతం, సాహిత్యం లాంటివి చదువుకోవాలి. ట్యూటర్స్‌ని పెట్టే వీలు లేక పోతే తల్లిదండ్రులే చెప్తారు. వర్జీనియా అసలు చిన్నప్పుడు బడికే వెళ్ళదు. ఆమె అక్క వెనీసా కూడా. తల్లిదండ్రులే వాళ్ళకి ఇళ్ళలో పాఠాలు చెప్పేవాళ్లు. తండ్రి తన లైబ్రరీలోకి అనుమతించేవాడు.

తండ్రి కనీసం తను నడిపే పత్రిక బాధ్యతల్లోకి కూడా ఆడపిల్లలని తొంగి చూడనివ్వని పితృస్వామ్య భావజాలం ఉన్న మనిషి. అదే వర్జీనియా అన్నదమ్ములంతా మాంటిస్సోరీల నించి కేంబ్రిడ్జ్, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీల దాకా ప్రయాణం చేసారు. యూనివర్సిటీ కబుర్లు ఆ మగపిల్లలు వైనవైనాలుగా చెబుతుంటే దిగ్ర్భమతోటి వింటుండే వాళ్ళు అక్కచెల్లెళ్లు. అలాగే ఆడవాళ్ళకి 30 ఏళ్ళోచ్చినా ఓటు హక్కు రాలేదు. మగపిల్లలకు 18 సంవత్సరాలకే ఓటు హక్కుంది. 1918లో పీపుల్స్ యాక్ట్ ద్వారా స్త్రీలకు ఓటు హక్కు వచ్చింది. ఎంత ఆశ్చర్యం అంటే స్త్రీలంతా ఆర్థిక సాయం చేసే, స్త్రీల ఆధ్వర్యంలో నడిచే కేంబ్రిడ్జి యూనివర్సిటీ కూడా స్త్రీ విద్యకు ముఖ్యం డిగ్రీ దాకా చదవడాన్ని ఒప్పుకున్న స్త్రీలకు డిగ్రీ ఇవ్వదు.

కాని దాని బదులు టుటరింగ్ అని సర్టిఫికెట్ ఇస్తుందట. అదే మగపిల్లలకు బిఎ (టుట్) అని విద్యా అర్హత పత్రం ఇస్తుందట. వర్జీనియా రచనలు చేస్తున్న సమయంలో అప్పటి సమాజంలో స్త్రీ పురుషులకు సామాజిక, ఆర్థిక విద్యాపరమైన తేడాలు జెండర్ పరంగా ఉండడాన్ని గమనిస్తుంది. తీవ్రంగా నిరాశకు గురి అవుతుంది. వ్యక్తిగతంగా తన కుటుంబంలో తండ్రి అన్నదమ్ముల పెత్తనాలు, మగపిల్లలకు ప్రత్యేక అధికారాలిచ్చి శ్రద్ధతో పెంచడం, ఆడపిల్లల చదువు నిర్లక్ష్యం చేయడం చూసి ఓర్లాండో నవలలో ఈ సంఘర్షణాత్మకమైన భావ పరంపరను ప్రతిఫలింప చేస్తుంది.

ఓర్లాండో ఈ నవలలో స్త్రీ గా మారిన తర్వాత తన ఆస్థిని సంపాదించుకోవడం కోసం వందల సంవత్సరాలు ప్రయత్నం చేస్తాడు. ఆ కాలమంతా పితృస్వామ్యంతో ఘర్షణ పడతాడు. స్త్రీగా మారి తను పొందలేనివి పొందాలనుకుంటాడు. ఈ రకమైన (మెటామార్ఫాసిస్) రూపాంతరణ, జెండర్ స్విచ్చింగా ప్లాట్స్, క్రాస్ డ్రెస్సింగ్ వస్తువులతో చాలా సాహిత్యం వచ్చింది. అరేబియన్ నైట్స్ కథల్లో ఇది గమనిస్తాము. అలాగే మనుషులు తమకు కావాల్సిన ప్రయోజనాలు పొందడం కోసం పాములుగా, పక్షులుగా మారడం కూడా చాలా పురాణ కథల్లో చదివాం.

ఓర్లాండో ఒక కవి, రచయిత. అయితే… అప్పుడక్కడ అతన్ని అప్పటి ఒక ప్రముఖ కవి గ్రీన్ వలన మనస్తాపానికి లోనవుతాడో చూపిస్తూనే, ఓర్లాండో స్త్రీగా మారినాక కూడా రచనలు కొనసాగిస్తున్న క్రమంలో, అప్పటి మహా మేధో రచయితలు లేడీ ఓర్లాండో సాహిత్యాన్ని, పద్యాలను ఎలా హేళన చేస్తారో, సరిదిద్దే, సెన్సార్ చేసే ప్రయత్నం చేస్తారో రచయిత్రిగా లేడీ ఓర్లాండో ఎంత వివక్షకు గురి అవుతుందో చెప్తుంది వర్జీనియా.

సమాజంలో స్త్రీలు ఎందుకు ఇంత చిన్న చూపు చూడబడతారు. పురుష జాతి అభివృద్ధిలో ఉంటే స్త్రీ జాతి ఎందుకు వెనకబడి బలహీనంగా ఉంది. పురుషులు దర్జాగా వైన్ తాగుతుంటే స్త్రీలు నీళ్ళు మాత్రమే ఎందుకు తాగాలి? రచయిత్రులు ఎందుకు నవలలు మాత్రమే రాస్కోవాలి? మేధోవంతమైన సృజనాత్మకమైన కవిత్వం స్త్రీలెందుకు రాయకూడదు. పురుషులు మాత్రమే ఎందుకు కవిత్వం రాయాలి? ఎవరైనా సృజనాత్మక రచనలు చేయడానికి కావల్సిన ప్రమాణాలు ఏమిటి? ఈ ప్రశ్నలు వర్జీనియాని వేధించాయి. ఆమె యూనివర్సిటీలో లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళినపుడు అక్కడ విద్యార్థినిలకు ‘భయపడకండి మీకు తోచింది నిర్భయంగా రాయండి. సృజనాత్మకత పురుషుల స్వంత ఆస్తి కాదు’ అని పై ప్రశ్నలు వేస్తూనే ప్రోత్సహిస్తుంది. ఈ ప్రశ్నలనే ‘ది విమెన్ మస్ట్ హేవ్ ఓన్ రూం’లో అడుగుతుంది. ఓర్లాండో నవలలో కూడా ఈ వివక్షనే ఆమె ప్రశ్నిస్తుంది. రచయిత్రులు సృజనాత్మక రచనలు చేయడానికి కావల్సిన కండిషన్స్, కావల్సినంత డబ్బు, ఆమె ప్రశాంతంగా కూర్చుని రాస్కోవడానికి ఆమెకు మాత్రమే చెందిన ఒక గది ఉండి తీరాలి. స్ర్తీలకు ఆర్థిక స్వాతంత్ర్యం ఉంటే స్త్రీ, పురుష వివక్ష అంతగా ఉండదు అని చెప్పింది. అయితే వర్జీనియా వూల్ఫ్ రాసిన ‘ఓర్లాండో’ రచనను జీర్ణించుకోలేని సాహితీ ప్రపంచం ఈ నవలను ఆమె రాసిన మిసెస్. డాలోవే, టు ద లైట్ హైస్ తర్వాతి స్థానం ఇచ్చారు. ఎందుకంటే ఓర్లాండో నవలా వస్తువు అప్పటి సమాజపు లైంగిక రాజకీయాలు, లైంగికత శాస్త్రం అంశాల కంటే కూడా చాలా ముందుకు దాటి వెళ్ళిపోయింది.

అదే సమయంలో మరో ట్రాన్స్‌జెండర్ నవల “ది వెల్ ఆఫ్ లోన్లీనెస్” వచ్చింది. కానీ ఈ నవలను బాన్ చేసారు. కానీ వర్జీనియా వూల్ఫ్ ఓర్లాండో నవల ఈ సెన్సార్‌షిప్‌ని అధిగమించింది. పురుష రచయితల వ్యాఖ్యలు గుసగుసలకు వర్జీనియా లొంగిపోలేదు. ఎందుకంటే సెన్సార్ చేయలేని గొప్ప మేజిక్ రియలిజమ్, మాయా వాస్తవికతా పద్దతి వలన, గొప్ప శైలిలో రాయడం వలన మంచి ఆశక్తిని కలిగించింది. కథా నాయకుడు, కథా నాయికగా మారిపోతాడు. స్త్రీ పురుషులిద్దరినీ ప్రేమిస్తాడు. కరుడుగట్టిన పితృస్వామిక వ్యవస్థకు ఎదురీది పోరాడుతాడు. అప్పటి సమాజంలో అంటే 1500 నుంచి 1928 శతాబ్దాల కాలంలోని సేమ్ సెక్స్ స్త్రీల సమస్యలలో తను ఐడెంటిఫై అవుతూ ఆ పాత్రలలో ప్రతిబింబిస్తాడు. స్త్రీల వేషంలో… పొడుగాటి పాదాల దాకా ఉండే గౌనులో, పొడవాటి వెంట్రుకలతో, నగలతో అలంకరించుకొని స్త్రీలు ఎక్కువగా పాల్గొనే ‘ఓపెరా’లో పాల్గొంటాడు. పురుషుడి నుంచి స్త్రీగా మారి స్త్రీలాగా అనుభూతి చెందుతాడు. అలాగే పురుషుడిగా మారి పురుషుడిగా అనుభూతి చెందుతాడు. ‘ఓర్లాండో” సాంప్రదాయ సాహిత్య ప్రమాణాలను బద్దలు కొట్టింది. ఈ నవలా వస్తువు నేరుగా పితృస్వామ్య సమాజంలోని పురుషాహంకారంతో ఉండే నేరుగా విక్టోరియన్ సంతతికి చెందిన, పురుషాహంకారైన వర్జీనియా వూల్ఫ్ తండ్రి లెస్లీ స్టీఫెన్ కి తగులుతుంది. స్టీఫెన్ సంపాదకత్వంలో వచ్చే పత్రిక, ‘డిక్షనరీ ఆఫ్ నేషనల్ బయోగ్రఫీ’, తెల్లని జీవం సచ్చిన పురుష విజాతీయ ఎంటర్ ప్రైజెస్ లోకి స్త్రీలకి… ప్రవేశం లేదు. చరిత్రలోంచి స్త్రీల ప్రాతినిధ్యాన్ని తొలగించే పురుషాహంకార పురుషుల్లో తండ్రి స్టీఫెన్ ముందు ఉంటాడు. తనను ప్రేమగా చూస్కున్నా, తన లైబ్రరీలోకి అనుమతించినా, బాల్యం నుంచీ ఉన్నత విద్యకీ, స్వేచ్ఛాయుతమైన బాల్య యౌవ్వన జీవితాన్ని, ఆడపిల్లల నుంచి ఎలా గుంజుకున్నాడో తన జీవిత చరిత్రలో రాస్కుంది వర్జీనియా వూల్ఫ్. అందుకే తాను పొందలేని స్వేచ్ఛను తను సృష్టించిన ఓర్లాండోకి ఇచ్చి అతన్ని, లేడి ఓర్లాండోని ఖండాంతరాలు తిప్పుతుంది స్వేచ్ఛగా. దేశాలు తిరిగే సాహస కృత్యాలు చేసే విక్టోరియన్ కుటుంబంలో ఓర్లాండోను పుట్టిస్తుంది. తనలాగే కవిని, రచయితను చేస్తుంది. పురుషుడిగా అతని ఆశయాన్ని దెబ్బతీస్తుంది. అతని కవిత్వాన్ని మరొక పెద్ద కవితో ఎగతాళి చేయించి ఓర్లాండోని బాధిస్తుంది. తర్వాత గబుక్కున ఓర్లాండోని స్త్రీగా మార్చి పడేస్తుంది. స్త్రీగా తను స్టాక్ విల్లే వెస్ట్ పితృస్వామ్య సమాజంలో, ఎలాంటి పరాభవాలు, ఆశాభంగాలు అనుభవించాయో అవన్నీ లేడీ ఓర్లాండో అనుభవిస్తున్నట్లు రాస్తుంది. పురుషుడిగా ఉన్నప్పుడు చాలా సులభంగా ఆస్తి పత్రాలు చేజిక్కించుకున్న ఓర్లాండో స్త్రీగా మారినాక… స్త్రీ అవటం మూలంగా ఆమెకి ఆస్తిలో వాటా హక్కు ఉండదని లా సూట్ చేత చెప్పించింది. ఇప్పటి పితృస్వామిక వ్యవస్థలో ఉండే నియమ నిబంధనలను, లింగవివక్షను ఎత్తి చూపుతుంది. స్టాక్ విల్లే ఇదే స్థితిలో వారసత్వపు ఆస్తి, ఇల్లు దక్కక బాధపడ్తుంటుంది.

ఈ నవల అంతటా స్టాక్‌విల్లే వెస్ట్ ఒక అబ్‌సెషన్లో వర్జీనియా వూల్ఫ్‌ని వెంటాడుతుంది. అసలు స్టాక్‌విల్లే కోసమే వర్జీనీయా వూల్ఫ్ ఈ నవల రాస్తుంది. అందుకే ఆమె ‘ఓర్లాండో – ఎ బయోగ్రఫి’ అంటుంది. 20 మార్చి, 1928 ఓర్లాండో నవల పూర్తి చేసాక సేక్ విల్లే వెస్ట్‌కి ఒక లేఖ రాస్తుంది వర్జీనియా వూల్ఫ్ దాంట్లో. “శనివారం ఒంటిగంట కావడానికి ఇంకో ఐదు నిమిషాలుండగా, ఎవరైనా నీ మెడ ఎముక ఫెటిల్లున విరిగిపోయేటట్లుగా, వెనక నించి ఒక్కసారిగా తోసేసినట్లు నీకెప్పుడైనా అనిపించిందా… డియర్… నాకు లాగా” అంటూ రాస్తుంది.

అంతేకాదు ఓర్లాండో నవలని తనకు అత్యంత ప్రియమైన ప్రేయసి స్టాక్ విల్లేకి అంకితమిచ్చి, పబ్లిష్ అయిన తర్వాత మొదటి కాపీ కూడా ఆమెకే పంపిస్తుంది. వారి మూడు సంవత్సరాల ప్రేమ కథ ముగుస్తుంది. కానీ జీవితాంతపు స్నేహం కొనసాగుతుంది. వియోగాన్ని భరించలేక ఇద్దరూ డిప్రెషన్‌లోకి వెళ్ళిపోతారు. ఓర్లాండో పాత్రకీ, సేక్ విల్లీకి చాలా పోలికలు కనపడతాయి. ఇద్దరూ లైంగికంగా ద్విసంవేగ లేదా సందిగ్ధ స్థితి కలిగిన వ్యక్తులుగా ఉంటారు. అంటే ‘సెక్సువల్లీ అంబీజియస్ ఫిగర్స్’ అన్న మాట. అలాగే ఇద్దరూ కూడా తమ ‘ట్రాన్స్ వెస్టిసమ్’ లక్షణాలను ఏ సంకోచాలకు లోను కాకుండా బహిరంగంగానే వ్యక్త పరుస్తుంటారు. ఇద్దరికీ అందమైన పొడవైన కాళ్ళు ఉంటాయి. క్వీన్ ఎలిజబెత్ ఓర్లాండోని కలిసిన తర్వాత అతని కాళ్ళు చాలా అందంగా ఉన్యాని మెచ్చుకుంటుంది. వర్జీనియా వూల్ఫ్‌కి కూడా స్టాక్ విల్లా అందమైన కాళ్ల మీద మోహం ఉంటుంది. స్టేక్ విల్లా పురుష దుస్తులు ధరిస్తూంటుంది.

ఓర్లాండో స్టాక్ విల్లా ఇద్దరూ జంతువుల, ప్రకృతి ప్రేమికులు.
వంశ పారంపర్యంగా వచ్చే ఆస్థి మీద మమకారం దాన్ని కాపాడుకోవాలన్న తాపత్రయం ఇద్దరిలోనూ ఉంటుంది.

ఇక కథలోకి వస్తే… 1600 శతాబ్దంలో ఒక విక్టోరియన్ ధనిక సాహస కృత్యాలు (అడ్వంచరస్) చేసే కుటుంబంలో పుట్టిన ఓర్లాండో, క్వీన్ ఎలిజబెత్ ద్వారా తన వారసత్వపు ఆస్తినీ, ఆమె ప్రేమనీ పొందుతాడు. ఓర్లాండో కవి, రచయిత. కవిత్వం రాస్తుంటాడు. ఎలిజబెత్‌కి తోడుగా ఆమె ఆస్థానంలో ఉంటాడు. వృద్ధురాలైన ఎలిజబెత్ రాణి లోలోపల ఓర్లాండో మీద మోహాన్ని, ప్రేమని పెంచుకుంటుంది. ఓర్లాండో మరో స్త్రీని ముద్దు పెట్టుకోవడం చూసి అసూయ కోపాలతో రగిలిపోతుంది.

తర్వాత ఓర్లాండో రష్యన్ రాజకుమారి ‘సాషా’తో గాఢమైన ప్రేమలో పడతాడు. ఇద్దరూ కలిసి పారిపోయి బతుకుదాం అనుకుంటారు. కానీ సాషా చివరి నిమిషంలో అతన్ని విడిచి వెళ్ళిపోతుంది. వాగ్దాన భంగం చేస్తుంది. ఎంతో మంది స్త్రీలతో లైంగిక సంబంధంలో ఉన్నప్పటికీ ఓర్లాండో సాషాని గాఢంగా ప్రేమించి వివాహం చేస్కోవాలని అనుకుంటాడు. అతని హృదయం బద్దలవుతుంది. గాఢంగా వారం రోజులు బాధ భరించలేక నిద్రపోతాడు. 1603లో నిద్ర పోయి లేవకుండా, 1650లో నిద్రనించి లేచాక అతను సాహిత్యం మీద దృష్టి మరులుస్తాడు. తానొక కవినన్న గ్నాపకం చేస్కుంటాడు. ‘ది ఓక్ ట్రీ’ అనే దీర్ఘ కవిత రాస్తాడు. అయితే క్వీన్ ఎలిజబెత్ కాలం ముగిసి జేమ్స్-1 రాచరికం విషయం వస్తుంది. ఎలిజబెత్ రాణి ఓర్లాండోకి అతని ఆస్తి పత్రాలు ఇస్తూ “ఈ లోకంలోంచి, ఎప్పటికీ మాయం అయి పోకు… వృద్ధుడిగా మారిపోకు… ‘నిత్యం యవ్వనవంతుడిగానే ఉండాలి’ అని చెప్పిన మాటలే ఓర్లాండోని వెంటాడుతాయి. తన రాజ గృహంలో ఉంటూ కవిత్వం రాస్తూంటాడు. అప్పటి కాలపు ప్రఖ్యాత కవి గ్రీన్‌తో పరిచయం, స్నేహం అవుతాయి. అతన్ని ఇంటికి పిలిచి విందు ఇస్తాడు. తన ‘ది ఓక్ ట్రీ’ కవిత ఇస్తాడు.. అతను దాన్ని ప్రచురిస్తానని అంటాడు కానీ డబ్బు ఇవ్వాలంటాడు. తర్వాత అతను ఓర్లాండోని రాజగృహంలో ఒంటరిగా ఉంటూ, అతను పిచ్చి కవితలు రాయడాన్ని పరిహసిస్తూ ఒక వ్యాసం రాస్తాడు.

దానితో ఓర్లాండో తీవ్రమైన మనస్తాపానికి లోనవుతాడు. తన కవిత్వాన్ని కాల్చేస్తాడు. ఇక అక్కడ్నించి వెళ్ళిపోతాడు. 1700 శతాబ్దిలో సెంట్రల్ ఏసియన్ కంట్రీకి కాన్‌స్టాంటి నోపుల్‌కి రాయబారిగా నియోగించబడతాడు. ఖాన్ రాజగృహంలో ఉంటుంటాడు. యుద్ధం వస్తుంది ఖాన్ యుద్ధంలో పాల్గొనమని ఒత్తిడి చేస్తాడు. కానీ ఓర్లాండో యుద్ధ రంగంలో నించి వెళ్ళిపోతాడు. ఓర్లాండో కవి అనడం వలన సున్నితమైన మనస్కుడిగా యుద్ధానికి, హింసకీ వ్యతిరేకంగా ఉంటాడు. కళ్ళముందు ఖాన్ శత్రువుని చంపేస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి అతన్ని ముట్టుకుంటాడు దుఃఖంతో..

ఖాన్ ‘శత్రువు చనిపోతే బాధపడద్దు’ అంటూ ఓర్లాండో చేతికి తుపాకీ ఇస్తాడు. కానీ ఓర్లాండో దుఃఖంతో అక్కడ్నిండి పారిపోయే ప్రయత్నంలో స్పృహ తప్పుతాడు. అలానే నిద్రలోకి వెళ్ళిపోతాడు. మెలకువ వచ్చి చూస్కుంటే తనను తాను స్త్రీగా మారిపోవడాన్ని గమనిస్తాడు. అద్దంలో తన నగ్న దేహాన్ని దిగ్ర్భాంతిగా చూస్తాడు.

‘సేమ్ పర్సన్ – డిఫరెన్స్ సెక్స్, నో ఛేంజ్ ఎట్ ఆల్’ అనుకుంటాడు. (అదే వ్యక్తి కానీ – లింగం వేరు. ఏ మార్పు లేదు) ఇక్కడ్నించే లేడీ ఓర్లాండో పాత్రలో వర్జీనియా వూల్ఫ్ అద్భుతాలు చేస్తుంటుంది. 1750లో లేడీ ఓర్లాండో ఇంగ్లాండ్‌కి తిరిగొచ్చి అక్కడి ప్రఖ్యాత సాహిత్యకారులను కలుస్తుంది. కవిత్వం రాయడం చేస్తుంటుంది. అలెగ్జాండర్, పోప్, ఇతర ప్రఖ్యాత సాహిత్యకారులతో కూర్చుని సాహిత్య చర్చల్లో పాల్గొంటుంటూ ఉంటుంది.

వాళ్లంతా లేడీ ఓర్లాండో కవిత్వాన్ని ఒక అధికార భావనతో విమర్శిస్తూ… హేళన చేస్తూ తమ ప్రమాణాలకు అనుగుణంగా రాయమనో లేక కవిత్వం, పద్యం కాకుండా ఇతర వచన సాహిత్యా ప్రక్రియల్లోకి వెళ్ళమనో సలహాలిస్తూ ఉంటారు. వాటిని అన్నింటినీ లేడీ ఓర్లాండో భరిస్తూ, ప్రశ్నిస్తూ, ఘర్షణ పడుతూ ఉంటుంది. స్త్రీలు సాహిత్య సృజన చేయడానికి ప్రమాణాలు ఏంటి అని మధన పడూ ఉంటుంది. తను స్త్రీ కాబట్టి తన సాహిత్యం, తనూ నిరాదరణకు గురి అవుతున్నది అని గ్రహిస్తుంది. లింగ వివక్షను ఖండిస్తుంది. తనను ప్రేమించిన ఆర్చిడ్యూక్ హేరీ ప్రేమని, పెళ్ళి ప్రతిపాదనని తిరస్కరిస్తుంది. అదే సమయంలో స్త్రీగా మారిన ఓర్లాండోకి స్త్రీ అవడం మూలంగా వారసత్వపు ఆస్తి రాదని న్యాయవాదులు చెప్తారు. తనకు రావాల్సిన అస్తిని సంపాదించడానికి లేడీ ఓర్లాండో వందల సంవత్సరాలు పురుషానుకూల చట్టాలతో, పితృస్వామ్యంతో ఘర్షణ పడుతూనే పోరాడుతుంది. ఒకసారి పురుష వేషధారణలో, మరోసారి స్త్రీ వేషధారణలోకి మారుతూ తీవ్రమైన ఘర్షణ పడుంది. అలా 1800 శతాబ్దంలోకి వస్తుంది.

1800 శతాబ్దంలో వందల సంవత్సరాల తర్వాత, లేడీ ఓర్లాండో అమెరికా సాహసయాత్రికుడైన నిత్య సంచారి షెల్ మెరైన్‌ని ప్రేమిస్తుంది. షెల్‌కి తను పురుషుడి నుంచి స్త్రీగా మారినట్లు చెప్తుంది. ఒక్క షెల్ దగ్గరే కాదు, స్త్రీగా మారాక తన మునుపటి పురుష అస్తిత్వాన్ని దాచి పెట్టదు. అందరికీ చెబుతుంది. అందరికీ ఈ విషయం తెలుసు. అంగీకరిస్తారు కూడా. స్త్రీగా దేహం మారుతుంది.

కానీ ముఖ కవళికలు పురుష ఓర్లాండోవే ఉంటాయి. అయితే ఇక్కడ వర్జీనియా ఒక అద్భుతం చేస్తుంది. మాయా వాస్తవికతను అంటే మేజిక్ రియలిజాన్ని ఇక్కడ మరింతగా ప్రయోగిస్తుంది. తన ప్రియురాలు స్టాక్ విల్లేని కలవాలన్న తన చిరకాల వాంఛని ఇక్కడ తీర్చుకుంటుంది. షెల్ కూడా లేడీ ఓర్లాండోకు నిజం చెబుతాడు. తను పూర్తిగా పురుషుడు కాదనీ తాను స్త్రీ నుంచి పురుషుడిగా మారానని చెబుతాడు.
అంటే ఇక్కడ వర్జీనియా వూల్ఫ్ స్త్రీలైన తనూ, స్టాక్ విల్లే వెస్ట్ ఇద్దరూ కలవాలని గాఢంగా కోరుకొంటుంది. అందుకే లేడీ ఓర్లాండో, షెల్‌లను ప్రేమ, పెళ్ళి ద్వారా కలుపుతుంది. ఇద్దరూ ప్రేమించుకుని, వివాహం చేస్కుంటారు. ఓర్లాండో గర్భవతి అవుతుంది. కూతురు పుడుతుంది. కానీ షెల్ ‘సాహస యాత్రికుడు, సంచారి’ కావడం వలన, పైగా తన ఆస్తి వ్యవహారాలు తేల్చుకోవల్సి ఉండడం వలన అతను వెళ్ళిపోతాడు.

కూతురు పుట్టాక లేడీ ఓర్లాండో 1900 శతాబ్దంలో అదీ వర్జీనియా వూల్ఫ్ ఈ నవల రాసేప్పటి 1928 కాలంలోకి వచ్చేస్తుంది. శతాబ్దాలుగా స్త్రీగా జీవించిన తన మీద జరిగిన వివక్షలను, అత్యాచార అణచివేతలను రాస్తుంది. ‘ఎప్పుడూ దుఃఖం, విషాదాలతో ఎందుకు ముగిస్తావు, హేపీ ఎండింగ్ అంటే సుఖాంతంగా ఎందుకు రాయవు అట్లా రాస్తేనే అచ్చు వేస్తాను’ అంటాడు ఎడిటర్. వర్జీనియా అసలు ఒప్పుకోదు. నవ్వుతూనే తనే ఆ పత్రికకి ఆ కథలను అచ్చుకు ఇవ్వననీ, కథా వస్తువు మార్చననీ చెబుతుంది. తన బిడ్డని తీస్కుని ఝామ్మని ఆత్మవిశ్వాసంతో బండిమీద వెళ్ళిపోతుంది.

మామూలుగా అయితే స్త్రీకైనా, పురుషుడికైనా ఒక దేశానికే పౌరసత్వం ఉంటుంది కానీ స్త్రీగా, పురుషుడిగా ప్రపంచం అంతా తిరిగి రావడానికి ఓండో నవల పాఠకులకు ఒక వీసాలాగా పనికి వస్తుంది. స్త్రీ అయినా పురుషుడైనా… మానవ జాతిలో ఒకరుగానే గుర్తింపబడాలి, గౌరవించబడాలి అనే సందేశాన్ని ఓర్లాండో ద్వారా వర్జీనియా వూల్ఫ్ ఈ అనంతమైన, మార్మికమైన జెండర్ ప్రయాణంలో మనకి అందజేస్తుంది. ఇక్కడ చాలా ప్రశ్నలు వస్తాయి.

వర్జీనియా వూల్ఫ్ స్త్రీని అణిచివేసే పురుషుణ్ణి స్త్రీగా మార్చి సమాన అణిచివేతలు, అప్పటి యూరోపియనం ఫ్యూడల్ సమాజంలో దుఃఖాలు, బాధలు పురుష ఓర్లాండోకి కలగచేయాలని అనుకుని ఉంటుందా? లేక చాలా వాటిని వదిలేసిందా? పితృస్వామ్య వ్యవస్థలో స్త్రీలు అనుభవించే అణిచివేతలు, ఆమె తన ఇంట్లోనే తన తండ్రి కోపాల్ని, అహాల్ని భరించి సేవలు చేసిన తన తల్లిలో చూస్తుంది. చదువుకున్న జూలియా జాక్సన్ సంఘ సేవకురాలు అయి ఉండి కూడా ఇంటా బయటా పని వత్తిడితో సతమతమవుతూ భర్త లెస్లీ స్టీఫెన్ ను ఎంతో అణకువతో చూస్కోవడం, అతనికి అతని సాహితీ, జర్నలిస్టు స్నేహితులకి అన్నీ ఓపికతో సమకూర్చడం చూస్తుంది. పైగా తండ్రి ఆడపిల్లలు పెద్దగా చదవాల్సిన అవసరమే లేదు. స్కూలుకు, యూనివర్సిటీలకు వెళ్ళాల్సిన పని లేదు అని ఆడపిల్లలకు ఇంట్లోనే శిక్షణ ఇప్పిస్తాడు. అదే కొడుకులకు యూనివర్సిటీల్లో ఉన్నత విద్య కోసం పంపిస్తారు. ఇవన్ని చూస్తుంది వర్జీనియా. అలాగే తన మీద, అక్క వెనీసా మీద సవతి అన్నలు లైంగిక అత్యాచారాలు చేయడాన్ని అసహ్యించుకుంటుంది. దాదాపు నర్వస్ బ్రేక్ డవున్‌కి గురి అవుతుంది. అయినా ఆమె ఓర్లాండోతో స్త్రీల పాత్రలకు, అదీ లేడీ ఓర్లాండో జీవితంలో గృహహింస, భౌతిక హింస, లైంగిక అత్యాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నట్లు లేక బాధపడున్నట్లు చూపియ్యదు. కనీసం ఘర్షణ అయినా చూపియ్యదు. కేవలం రచయిత్రిగా పురుష రచయితల అణిచివేతను, హేళనలను అలాగే స్త్రీ అవడం మూలంగా తనకు దక్కని వారసత్వపు ఆస్తి దక్కకపోవడం మూలంగా పడే బాధను, ఘర్షణ పోరాటాలను, స్త్రీలకు కావల్సిన విద్యా హక్కును గురించి మాత్రమే రాస్తుంది.

మరీ ముఖ్యంగా స్త్రీగా మారాక ఆమె దేహంలో వచ్చిన మార్పులు, నెలసరి సమస్యలు, కనీసం గర్భం ధరించాక వచ్చే మార్పులు, ప్రసవపు నొప్పులు వాటి తీవ్రతా, బాధా లాంటి శరీర ధర్మాలకు సంబంధించిన అంశాల పట్ల కూడా ఏ వ్యాఖ్యానాలు ఉండవు. ఇది ఆమె పరిమితా? అర్థం కాదు. కేవలం లెస్బియినిజం, ఇద్దరి స్త్రీల మధ్య ఆకర్షణ ప్రేమ లైంగిక సంబంధాలు, బైసెక్సువాలిటీ.

మొత్తానికి ఈ నవలలో వర్జీనియా వూల్ఫ్ తీస్కున్న అంశాలు.
లెస్బియనిసమ్ ఇద్దరి స్త్రీల మధ్య ఆకర్షణ, ప్రేమ, లైంగిక సంబంధాలు చర్చ, దాదాపు ప్రతి నవలలో ఉంటుంది.
టాన్స్ వెస్టిజం, ఒకే సమయంలో స్త్రీగా, పురుషుడిగా ప్రవర్తించడం అంటే ట్రాన్స్‌జెండ్‌గా ప్రవర్తించడం.
ఫెమినిజం, స్త్రీలకు విద్యా, ఆస్తి హక్కులు.
స్త్రీలు స్వేచ్ఛగా తాము అనుకున్న భావాలను వ్యక్తపరుస్తూ రాసే భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ.
మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల తర్వాత మానవ జీవితాల్లోని విషాదం.
స్త్రీల రచనల మీద పురుష రచయితలు చేసే ఆధిపత్యం, సెన్సార్ షిప్ తిరస్కరణ.
ఈ ఓర్లాండో నవల, ప్రమాదకరం కాని, భిన్నమైన మానవ లైంగిక ధోరణుల పట్ల సమాజం గౌరవాన్ని కలిగి ఉండాలని, విలువ ఇవ్వాలన్న సందేశాన్ని చాలా బలంగా ఇస్తుంది.
ఓర్లాండో నవలను వీటాశాక్ విల్లె కుమారుడైన నిగెల్ నిగల్సన్ సాహిత్యంలో అతిసుదీర్ఘమైన ఆకర్షణీయమైన ప్రేమలేఖగా వర్ణించాడు.

(ఇంకా వుంది…)

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply