ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్ – 2

రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్
ఇది రెండు వ్యాసాల సంకలనం. మొదటి సారిగా 1929 సెప్టెంబర్‌లో ప్రచురించబడింది. ఈ రెండు వ్యాసాలు కూడా వర్జీనియా వూల్ఫ్ 1928లో మ్యాన్‌హామ్ కాలేజీ, గిర్టన్ కాలేజీలలో, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఇచ్చిన ఉపన్యాసాల సారాంశం. ఇవి చాలా ముఖ్యమైన ఫెమినిస్ట్ రచన. దీనిలో స్త్రీలకి సాహిత్యంలో ఉన్న స్థానం గురించి చర్చించింది. పురుషాధిక్య సాహిత్య సమాజంలో రచయిత్రులకు, కవయిత్రులకు పురుష రచయితలు ఎలా గుర్తింపు లేకుండా చేస్తారో, స్త్రీల రచనలను ఎలా కించపరుస్తారో, ఎలా రాయమని నిర్దేశిస్తారో, వాటినెట్లా రచయిత్రులు అధిగమించాలో తన ఉపన్యాసాలలో చెబుతుంది వర్జీనియా వూల్ఫ్. వుమెన్ అండ్ ఫిక్షన్ మీద మాట్లాడమని ఆహ్వానిస్తుంది యూనివర్సిటీ యాజమాన్యం.

గిర్టన్ కాలేజీకి తన ప్రియురాలు వీటాసా విల్లే వెస్ట్ తో కలిసి వెళ్తుంది. లెస్బియనిజం గురించి చాలా స్వేచ్ఛగా విద్యార్థినుల ముందు చర్చిస్తుంది కూడా. స్త్రీ విద్యా, ఆస్తి హక్కుల గురించి చర్చిస్తుంది. స్త్రీలు విద్యనుంచి ఎలా దూరం కాబడ్డారో కూడా మాట్లాడుతుంది. ఉపన్యాసమంతా కూడా సమాజంలో స్త్రీల స్థానం ఎందుకింత తక్కువ స్థాయిలో ఉంది? Why is like that? అనే ప్రశ్నలు చాలా సార్లు వస్తాయి.

ఉపన్యాస ప్రారంభ వాక్యమే ఇలా ఉంటుంది. “కానీ, మీరనవచ్చు మేం మిమ్మల్ని వుమెన్ ఫిక్షన్ రైటింగ్ మీద మాట్లాడమంటే… మీరెందుకు ‘ఏ రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్’ గురించి మాట్లాడుతున్నారు. స్త్రీల సాహిత్యానికి వాళ్ళకి స్వంత గది, ఆర్థిక స్వాతంత్ర్యం కలిగి ఉండడానికేం సంబంధం అని మీరు నన్ను నిలదీయవచ్చు.”
ఈ ఉపన్యాసాల్లో వర్జీనియా వూల్ఫ్ స్త్రీ పురుషుల మధ్య ఉన్న తేడాలను స్త్రీల మానసిక, శారీరక బలాల మీద, బలహీనతల మీదా పురుషులు చేసే కుత్సిత వెటకార వ్యాఖ్యలను, నిర్వచనాలను ప్రశ్నిస్తారు. స్త్రీలు పురుషుల కంటే శారీరకంగా బలవంతులు కాకపోయినా మేధోపరంగా సమానులే అంటారు. పురుషులు వైన్, స్త్రీలు నీళ్ళూ ఎందుకు తాగాలి? స్త్రీలు నవలలు మాత్రమే ఎందుకు రాయాలి? సృజనాత్మకమైన సాహితీ ప్రక్రియ అయిన కవిత్వం ఎందుకు రాయకూడదు? ఎందుకు పురుష జాతి ఇంత తొందరగా అభివృద్ధి చెందింది. స్త్రీలెందుకు వెనకబడి ఉన్నారు అంటూ ప్రశ్నలు సంధిస్తుంది. ఇవే ప్రశ్నలు ‘ఓర్లాండో’ నవలలో కూడా వేస్తుంది వర్జీనియా. పేదరికం, విద్య లేకపోవడం అలాగే స్త్రీలు గృహిణిలుగా ఇంటి పట్టునే ఉండిపోవాలన్న పితృస్వామ్య సమాజపు డిమాండ్ కూడా స్త్రీలు విద్యాధికులుగా రచయిత్రులుగా ఎదగకపోవడానికి కారణం. అయితే వారి జీవితాలను గురించి ఈ సమాజం తెలుసుకునే అవకాశం చాలా తక్కువగా ఉండడం కూడా ఒక కారణమంటూనే, సాహిత్యంలో కూడా స్త్రీ పాత్రల చిత్రణ కేవలం పురుష రచయితల దృక్పథంతోనే ఉంటుంది అంటుంది రచయిత్రి. ఈ వ్యాసాలు బ్రిటిష్, ప్రపంచ ఫెమినిస్ట్ చరిత్రలో స్త్రీలు ధైర్యంగా కలం పట్టుకోవడానికి పురికొల్పింది.

స్త్రీలు, కాల్పనిక సాహిత్యం మీద మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి? స్త్రీలు ఏ విధమైన సాహిత్యం రాస్తారనా? లేదా ఏ రకమైన సాహిత్యాన్ని స్త్రీలు చదువుతారానా? అలాకాక, స్త్రీల గురించి ఎలాంటి సాహిత్యం రాయబడుతుందో దాని గురించి మాట్లాడాలా? ఉపయోగం ఉంటుందా? అని ఆమె ప్రశ్నలు వేస్తుంది. ఈ మూడు కలిపి మాట్లాడితే… ఎందుకంటే ఆ కాలంలో స్త్రీలు, కాల్పనిక సాహిత్యం రాయడం అనేది ఒక ఎప్పటికీ సాధ్యం కాని పని కాబట్టి.

కాబట్టి స్త్రీలు సాహిత్య సృజన చేసే సమయంలో లేదా విద్యాపరంగా, ఆర్థికంగా, సామాజికంగా, సృజనాత్మకంగా ఎదగాలని ప్రయత్నించినపుడు ఏం జరుగుతుంది ఈ పితృస్వామ్య వ్యవస్థలో. లేదా అన్ని విషయాలలో తన అభిప్రాయాలను చెబుతానంటుంది.

స్త్రీల కాల్పనిక సాహిత్యం మీద మాట్లాడ్డానికి తనకు మెటీరియల్ బయట ఎక్కడా దొరకలేదు. కాబట్టి తను ఇక్కడ ఉపన్యాసం ఇవ్వడానికి ముందు దీని గురించి తన మెదడును పదును పెట్టి ఊహాశక్తిని ఉపయోగించానని జెబుతూ.. దీన్నొక నవల రూపంలో తయారు చేయడం జరిగింది. ఆఖరికి ఈ ఉపన్యాసాల థీసీస్ ఏంటంటే :
‘కథలు రాయాలనుకునే రచయిత్రి తనకంటూ ఒక స్వంత గది, డబ్బూ ఉండి తీరాలి.” అయితే, ఇక్కడ చాలా మంది నించి తీవ్రమైన విమర్శ వచ్చింది. స్త్రీలు డబ్బు ఇల్లు లాంటి బాహ్య సౌకర్యాల మీద ఆశతో ఉండాలా అని. కానీ వర్జీనియా కొట్టి పడేసింది. ఆర్థిక స్వాతంత్ర్యం తనకంటూ ప్రత్యేకమైన గది లేకపోతే, స్త్రీలు పురుషుడికి పరాధీనులుగా మాత్రమే ఉంటూ రచనలు చేస్కోలేరు అని చెబుంది. “అయితే మీలా ఉన్నత, మధ్య తరగతి స్త్రీలు కాకుండా నల్లజాతికి చెందిన శ్రామిక స్త్రీల సంగతేంటి పని చేస్తే కానీ పూట గడవని స్త్రీలకు ప్రత్యేకమైన గదీ, డబ్బూ, పనిచేసే హెల్పర్లు మీకులాగా ఎక్కడ దొరుకుతారు? అని అప్పటి విమర్శకుడు విల్స్టన్ ప్రశ్నిస్తాడు.

“రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్”లో తన ఊహాశక్తితో, ఒక దృశ్యాత్మక ప్రపంచంలోకి, ముగ్గురు మేరీలనబడే వ్యాఖ్యాతలతో తన కథ, నవల, ఉపన్యాసాలు కలగలిసిన ఒక కొత్త థీమ్ లోకి పాఠకులను తీస్కెళుతుంది వర్జీనియా వూల్ఫ్.

నేరేటర్ తోనే మాట్లాడిస్తుంది. ఆరు ఛాప్టర్స్ గా విడదీసి వ్యాఖ్యాతతో చెప్పిస్తుంది. తన పరిశీనలను, అధ్యయనాలను, ఊహాలను, సంఘర్షణలు, ప్రశ్నలను, కోపాలను, పరిష్కారాలను అన్నింటిని ఒక్కో ఛాప్టర్ లో ఒక్కో దృశ్యం, ఒక్కో ఆవిష్కారం, ప్రశ్నలు, సవాళ్ళు, ఆగ్రహ ప్రకటనలు, తీర్మానాలతో సహా అన్నీ ఉంటాయి. వర్జీనియా మెదడు, మనసు, ఆలోచనలలోకి నేరేటర్ ప్రవేశించి వర్జీనియా పరిశీలనలలోకి వచ్చిన వాటిని వ్యాఖ్యానిస్తూంటుంది.

ఈ సాహితీ ప్రక్రియ అప్పట్లో చాలా కొత్తది. ఆరు ఛాప్టర్లు వర్సగా ఇలా ఉంటాయి.

ఛాప్టర్ 1
వర్జీనియా వూల్ఫ్, ఒక ఊహాత్మక స్థలంలోకి చేరుకుంటుంది. ఎవరూ వెళ్ళని స్థలంలోకి. వెళ్ళాక ఆక్స్ బ్రిడ్జ్ యూనివర్సిటీ కనిపిస్తుంది. నది ఒడ్డున ఉంటుంది. ఆక్స్ బ్రిడ్జ్ అంటే ఆక్స్ ఫర్డ్ కేంబ్రిడ్జి యూనివర్సిటీల కలయిక. ఏ యూనివర్సిటీల్లో అయితే మగపిల్లలకు తప తనకూ తనలాంటి ఆడపిల్లలకూ ఉన్నత విద్య చదవడానికి అవకాశాలు కలిపించబడలేదో ఆ యూనివర్సిటీలన్న మాట. ఆ యూనివర్సిటీలు వర్జీనియాకు ఒక అబ్సెషలాగా ఒక ఆలాపన, తీరని స్వప్నంలాగా ఉండిపోయాయి. అందుకనే తన ఊహాత్మక దృశ్యంలో ఆ యూనివర్సిటీలు దర్శిస్తుంది. యూనివర్సిటీల పేర్లను కలిపి ఆ బ్రిడ్జ్ అని నామకరణం చేస్కుంటుంది. అది ఆకుపచ్చని నదీ తీరంలో ఉంటుంది. అక్కడ కూర్చుని వుమెన్ అండ్ ఫిక్షన్ అని తనకు ఇచ్చిన టాపిక్ గురించి ఆలోచిస్తూంటుంది. అద్భుతమైన ఆలోచన వస్తూంటాయి. ఇంతలో అక్కడికి బీడిల్ అనే వ్యక్తి వచ్చి ఆమెని డిస్టర్బ్ చేస్తారు. “మేడమ్ మీరెందుకిక్కడ ఉన్నారు. స్త్రీలకు ఇలా స్వేచ్ఛగా గడ్డిమీద నడవడానికి, ఇలా కూర్చోవడానికి అనుమతి లేదు. అనుమతి లేని ప్రదేశంలోకి, స్త్రీలకి నిషిద్ధమైన స్థలంలోకి వచ్చారు. ‘Stress passeses will be prosecuted”. మిమ్మల్ని ఇలా చేసినందుకు మీమీద నేరాభియోగం చేసి కోర్టులో ప్రశ్నించవచ్చు, వెళ్లిపోండిక్కడ్నించి” అంటాడు. దిగ్బమ చెందిన వర్జీనియా వూల్ఫ్ కు అప్పటి దాకా వచ్చిన అద్భుతమైన ఆలోచన కూడా నదిలో చేపపిల్ల జారినట్లు జారిపోతుంది ఎక్కడికో. ఇక అక్కడ్నించి బాధపడి అక్కడ్నించి వెళ్ళిపోతున్న వర్జీనియా వూల్స్ కి ఒక అందమైన లైబ్రరీ కనపడుతుంది. అది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి అనుబంధంగా ఉంటుంది. వర్జీనియా వూల్ఫ్ ఆశగా లైబ్రరీలోకి వెళ్ళబోతుంది. ఇంతలో అక్కడికి ఒకాయన వచ్చి “మీకు ఇందులో ప్రవేశం లేదు మేడం. మీరు లోపలికి వెళ్ళాలంటే, ఇందులో అంటే ఆ బ్రిడ్జి యూనివర్సిటీలో చదువుతున్న ఎవరితో అయినా కలిసి వెళ్ళాల్సి ఉంటుంది లేదా మీరెవరో, ఎవరికి సంబంధించిన వారో తెలిపే ఒక లెటర్ అన్నా తేవాల్సి ఉంటుంది” అంటూ ఆపేస్తాడు. ఆక్స్ బ్రిడ్జి మెన్స్ యూనివర్సిటీ మాత్రమే. వెంఠనే వర్జీనియా వూల్ఫ్ నిరాశతో వెనక్కి తిరుగుతుంది.

అక్కడ్నించి వెను తిరిగిన వర్జీనియాకి దార్లో చర్చిలాంటి ప్రదేశ ఆవరణలో వినిపిస్తున్న సంగీతం ఆకర్షిస్తుంది. అటువైపుగా వెళ్ళబోయి ఆగిపోతుంది. మళ్ళీ అది కూడా స్త్రీలకు నిషిద్ధ స్థలం అయితే ఎట్లా అని, దాన్ని దాటి ముందుకు నడుస్తుంది. అక్కడ కొద్దిగా ముందు మధ్యాహ్నపు భోజనపు ఏర్పాట్లు జరుగుతుంటాయి. అక్కడికెళ్ళి కూర్చుని భోజనం చేస్తుంటుంది. అక్కడ వంట పదార్థాలు చాలా ఖరీదైనవి, భిన్నమైనవి చాలా రుచికరంగా ఉండడం గమనిస్తుంది.

ఆమె మనసులో తను మళ్ళీ మాట్లాడాల్సిన స్త్రీలు, కాల్పనిక సాహిత్యం అనే అంశం గురించి ఆలోచనలు వస్తుంటాయి. మధన పడూ ఉంటుంది. ఇంతలో అక్కడికి ఒక తోక లేని పిల్లి వస్తుంది (A cat without tail). అంతే ఆమె సృజనాత్మక ఆలోచనలు తెగిపోతాయి, కత్తిరించిన పిల్లి తోకలాగా. ఆమెకొచ్చిన ఆలోచనల్లో ఇంతకుముందు ఆమె మహిళా కాలేజీకి వెళ్ళిన విషయం ముందుకు వస్తుంది అది ఫెర్న్ హామ్ మహిళా కాలేజీ. అక్కడ కూడా ఆమె భోజనం చేస్తుంది కానీ భోజనం బాగుండదు. పేద భోజనంలా ఉంటుంది. గొడ్డు మాంసం, ప్రూన్ పళ్ళు ఇస్తారు. స్త్రీల కాలేజీ కదా… తినేది స్త్రీలు కదా. స్త్రీలకు అంత మంచి పురుషులకు వడ్డించే పుష్టికరమైన భోజనం ఎందుకు? ఇక్కడేమో ఈ ఆక్స్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో పురుషులను పురుషో పేతరమైన భోజనం చూసి, స్త్రీ పురుషుల భోజనాలలో కూడా వ్యత్యాసం చూసి ఆమె ఖిన్నురాలవుతుంది. స్త్రీలకు ఇంత పౌష్టిక విలువలు లేని ఆహారం పెడితే వారి మెదడు ఎలా పని చేస్తుంది? దీపాల్లా వెలిగే సృజనాత్మక ఆలోచనలు కథలు, పద్యాలు, కవితలు, గ్నాపకశక్తి ఏకాగ్రత ఎలా వస్తాయి. ఆమెలో ఆత్మ విశ్వాసం ఎలా వృద్ధి చెందుతుంది? చౌకైన గొడ్డు మాంసం, ఏ పౌష్ఠిక విలువలు లేని ప్రూన్స్ పళ్ళు తినే స్త్రీల వెన్నముకలో లేదా మెదడులో మేధస్సు అనే కాంతి వెలుగుతుందా? అని ప్రశ్నించుకుంటుంది. “The lamp in the spine does not light on beef & prunes” అంటూ మహిళా కాలేజీలో ఉండే అసౌకర్యాలకు, యూనివర్సీటీల్లో సౌకర్యాల లేమి పురుషులకు ఉండే సర్వ సౌకర్యాలను అవకాశాలను పోల్చుకుని బాధపడుతుంది. తర్వాత అక్కడ్నించి తన స్నేహితురాలు మేరీ షెల్టన్ గదికి వెళ్ళిపోతుంది. మొత్తానికి ఈ డిస్టర్బెన్స్, అవరోధాలు వలన స్త్రీలు, కాల్పనిక సాహిత్యం మీద తను రాయాలనుకున్న ఉపన్యాసం రాయలేకపోతుంది. సాహిత్యమే కాదు ఇతర ఏ రంగాల్లోనైనా సరే రాణించాలనుకునే స్త్రీలకి పితృస్వామ్య వ్యవస్థ అడుగడుగునా అవరోధాలు సృష్టిస్తూ ఉంటుందనీ, దానిని అధిగమించాలీ అంటే స్త్రీలకు తమకంటూ ఒక గదినో, ఇంటి నో, ఏకాంతాన్నో లేదా ఇంట్లో అన్ని పనులు చేసి పెట్టే సహాయకులను సమకూర్చుకోవడానికి ఆర్థిక, స్వాతంత్ర్యం అత్యంత ముఖ్యమనీ వర్జీనియా వూల్ఫ్ ఖచ్చితంగా నమ్ముతుంది, చెబుతుంది కూడా.

ఛాప్టర్ 2
తన ఊహా ప్రపంచంలో వర్జీనియా వూల్ఫ్ లండన్ నగరంలో ఉందిప్పుడు. ఇక్కడ ఆమెలో రకరకాల ప్రశ్నలు వస్తుంటాయి. ఆక్స్ బ్రిడ్జ్ యూనివర్సిటీలో నడవనీయ లేదు, కూర్చోనివ్వలేదు, లైబ్రరీలో ప్రవేశించనివ్వలేదు, ఫెర్నహామ్ స్త్రీల కాలేజీలో చౌక భోజనం, ఆక్స్ బ్రిడ్జి పురుషులకు పుష్టికరమైన భోజనం… ఇంత తేడా ఎందుకు? స్త్రీలు నీళ్ళు, పురుషులు వైన్ ఎందుకు తాగాలి? పురుష జాతి మాత్రమే ఎందుకు అభివృద్ధి చెందుతున్నది? స్త్రీలు ఎందుకింత వెనకబడి ఉన్నారు? అని మధనపడుతుంటుంది. అక్కడ తనని ఆక్స్ బ్రిడ్జి యూనివర్సిటీకి వెళ్ళనివ్వనందుకు లండన్లో బ్రిటిష్ లైబ్రరీకి వెళ్తుంది. అక్కడ కాటలాగ్ చూస్తుంది. అందులో ‘డబ్ల్యూ’ అనే లిస్టింగ్ చూస్తుంది అంటే స్త్రీల పుస్తకాల లిస్ట్ అన్న మాట. చాలా పుస్తకాలుంటాయి అందులో… మెంటల్, మోరల్, ఫిసికల్, స్టెంత్ ఆఫ్ వుమెన్ అని ఉండి, ఇన్ఫిరియారిటీ అంటే నూన్యత అంటే తక్కువ కాటగిరీలోకి చెందిన పుస్తకాలు కిందికి చేర్చబడి ఉంటాయి. ప్రతీదాంట్లో స్త్రీలు మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా, బలహీనులు అని స్పష్టంగా రాసి ఉంటుంది. అలా రాసే ప్రతీ మగ రచయితా కూడా ఆడవాళ్ళపై కోపంతో రాడా అనిపించేట్లున్నాయి.

ఇక్కడ నారేటర్ ‘ఎం’ అంటే మెన్ లిస్టింగ్ కేటగిరీ చూస్తోంది. అందులో ఎక్కడా మెన్ పుస్తకాలు బలహీన కేటగిరీలుగా విభజించి లేవు. అంటే దానర్థం పురుషులు మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా బలహీనులు కాక బలవంతులని చెప్పడమే. వర్జీనియా వూల్ఫ్ కి మండిపోతుంది. ఆలోచనలు మళ్ళీ ఒక్కసారిగా చెదిరిపోతాయి. బ్రిటిష్ లైబ్రరిలో ఆమెను బిల్ కట్టమంటారు. బిల్లు కట్టడమంటే ఆర్థికానికి, ఆర్థిక స్వాతంత్ర్యానికి, ఆస్తి హక్కుకి సంబంధించిన విషయం . వర్జీనియా వూల్ఫ్ కి తన, ఆంటీ మేరీబెటన్ గుర్తుకు వస్తుంది. వారసత్వంగా సంవత్సరానికి 500ల పౌండ్లు మాత్రం వస్తాయి. ఆస్తి మొత్తం రాదు. అది అంతా ఆ కుటుంబాలకు చెందిన పురుషులకు పోతుంది. కుటుంబంలో ఉండే స్త్రీలు ఇళ్లలో చేసే, బయట శ్రామిక స్త్రీలు చేసే పనులకు విలువా, డబ్బు ఇవ్వరు. కానీ, పురుషులు బయట చేసే పనులకు అధిక విలువ కట్టి డబ్బులిస్తారు. అయితే ఆంటీకి వచ్చే డబ్బువలన తను ఇలా ఆలోచించగలుగుతోంది. లేకపోతే ఇళ్ళల్లో విలువ గౌరవం లేని పనులు చేస్కుంటూ బతకాల్సివస్తుంది. అట్లానే మహిళలకు ఓటు హక్కు 30 ఏళ్ళకి ఇవ్వడం కూడా అన్యాయంగా భావిస్తుంది వర్జీనియా. లింగ వివక్ష లేకుండా స్త్రీ, పురుషుల శ్రమకు సమాన విలువ ఉండాలని ఆమె కోరుకుంటుంది. లైబ్రరీలో వర్జీనియాకి ఏ రకమైన స్త్రీలు రాసిన పుస్తకాలు దొరకవు. పురుషులు అహంకారంతో, స్త్రీలను కించపరుస్తూ రాసిన పుస్తకాలే కనపడతాయి. లైబ్రరీలో కూడా ఆమె వుమెన్ అండ్ ఫిక్షన్ అని తాను మాట్లాడిన అంశం మీద దృష్టి పెట్టలేక బయటకు వస్తుంది.

ఛాప్టర్ 3
ఇక్కడ వర్జీనియా వూల్ఫ్ స్త్రీలకి ప్రశాంతంగా రచనలు చేస్కోవడానికి ఒక స్వంత గది, ఆర్థిక స్వాతంత్ర్యం ఉండాలి అని తను చేసిన ప్రతిపాదనని అందరూ ముఖ్యంగా పురుషులు ఎందుకు విమర్శిస్తారు అని ఆగ్రహం చెందుతుంది. తన ప్రతిపాదన, స్త్రీకి ఒక గది, డబ్బు, ఆమె ప్రశాంతంగా రాస్కోడానికి కావాలి. అందరూ విమర్శిస్తారు ఎందుకు? స్త్రీకి ఏవి కావాలో ఛాప్టర్ 1, ఛాప్టర్ 2లో చెబుతుంది. స్త్రీని కాబట్టి ఆక్స్ బ్రిడ్జి యూనివర్సిటీలోకి రానివ్వరు. బ్రిటిష్ లైబ్రరీలోని మగవాళ్ళ పుస్తకాలు స్త్రీ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ రాసిన వాటిని రిఫరెన్స్ కి తీస్కోలేను. అయితే, ఎలిజబెత్ ఎరాలో ఇంగ్లీష్ స్త్రీలు బాగా అభివృద్ధి చెందారు. సాహిత్యం కూడా బాగా అభివృద్ధి చెందింది. అక్కడికి వెళ్ళిపోదాం, ఉమెన్ బ్రాంచ్ లో స్త్రీల సాహిత్యాన్ని చూద్దాం అని వర్జీనియా ఊహల్లో అక్కడికెళ్ళిపోయి చూస్తే, స్త్రీల సాహిత్యాన్ని డామినేట్ చేస్తూ షేక్స్ పియర్ కనిపిస్తాడు. ఆయన పుస్తకాలు, కథా వస్తువులు అందులో ఆమెకు నచ్చదు. ఆయన కాలంలో స్త్రీలు రచయిత్రులుగా ఎందుకు ఎదగలేదని ఆలోచిస్తుంది. అప్పుడు పుట్టిన పాత్ర పేరు జుడిత్. ఆమె ఎవరంటే వర్జీనియా మెదడులో పుట్టిన ఊహాత్మక పాత్ర. జుడిత్ ని షేక్స్ పియర్ చెల్లెలుగా చేస్తుంది. ఆమె చాలా మేధావి. రచయిత్రి రచనలు చేసేది. ఆడది రాసే రచనలను సమాజం అంగీకరించదు కాబట్టి రచనలను దాచి పెట్టేది భయంతో. తండ్రి పెళ్ళి చేస్కోమంటే నిరాకరిస్తుంది. దాంతో ఆమెని తండ్రి దారుణంగా కొడతాడు. జుడిత్ రచనలో తన సృజనాత్మకతను, సామర్థ్యాన్ని పెళ్ళి ద్వారా నశింప చేస్కోకూడదు అని నిర్ణయించుకుని ఇంట్లోంచి పారిపోయి, నాటకాల కంపెనీలో పనికి కుదురుకుంటుంది. నాటక రంగంలో వృద్ధి చెందాలనుకున్న సమయానికి ఒక నటుడితో ప్రేమలో పడుంది. గర్భవతి అవుతుంది. ఆ నటుడు పెళ్ళి నిరాకరిస్తే సమాజం అవమానిస్తుందేమో అని భయపడి ఆత్మహత్య చేస్కుంటుంది. ఎలిజిబిత్ దశకంలో కూడా ఒక గొప్ప రచయిత్రి, మేధావి అయిన స్త్రీకి ఒక అస్థిత్వం లేదు. పైకి రానివ్వరు పురుష సమాజం అని వర్జీనియా నిర్ణయానికి వస్తుంది. పురుష షేక్స్ పియర్ కి, స్త్రీ అయిన జుడిత్ షేక్స్ పియర్ కు సమాజంలో లింగ ఆధారిత వివక్షను ఎత్తి చూపుతుంది. దానికోసమే జుడిత్ ను సృష్టిస్తుంది. వర్జీనియా స్త్రీలు ఎవరు కూడా ఎలిజిబెతెన్ ఎరా వరకు ఎదగలేదు అని చెప్పడం వర్జీనియా వూల్ఫ్ లక్ష్యం.

ఛాప్టర్ 4
ఎలిజిబితెన్ కాలం దాటాక స్త్రీలు కేవలం నవలాకారిణులుగా మాత్రమే ఎందుకు ఎదిగారు. కవయిత్రులుగా కవిత్వం ఎందుకు రాయలేదు. కవితా ప్రక్రియ చాలా క్లిష్టమైంది. ఎక్కడ ఆపాలో, ఎక్కడ ఏ వాక్యం పద నిర్మాణం తెగొట్టాలో, ఎలాంటి కవిత్వ శైలిని ఎంచుకోవాలో లాంటి క్లిష్టమైన సృజనాత్మకమైన ప్రక్రియ కాబట్టి అని ఆలోచిస్తుంది వర్జీనియా.

ఇక్కడ వర్జీనియా దృష్టిలోకి వచ్చిన విషయాలు ఎంటంటే, ఎలాంటి సమూహానికి, వర్గానికి చెందిన స్త్రీలు నవలాకారిణిలుగా మారారు అంటే ఎక్కువగా కులీన వంశానికి అంటే ధనవంతులైన అరిస్టోక్రాట్ కుటుంబాల స్త్రీలు ఎవరికైతే ఎక్కువ సమయం, తీరిక డబ్బు, పరిచారికలు, వంట వాళ్ళు లాంటి సౌకర్యాలుంటాయో వాళ్ళ నుంచి చాలా నవలలు వచ్చాయి. వీళ్ళకి విశాలమైన ఇళ్ళు, ప్రత్యేకమైన గదులుంటాయి కాబట్టి కులాసాగా రాస్కున్నారు.

పైగా నవలా రచనకు శిక్షణ అవసరం లేదని వర్జీనియా భావన. అట్లానే 186వ శతాబ్దంలోకి వర్జీనియా వూల్ఫ్ చూసినప్పుడు లేడీ విన్ చెల్సా కవిత్వం కనపడుంది. అట్లాగే మారెంట్ ఆఫ్ న్యూ కేసిల్ కూడా కవిత్వం కనపడుంది. ఈమెకి పిల్లలు లేరు కనుక తీరికతో రాస్కుంటుంది. – తర్వాత ‘ద లెటర్స్ ఆఫ్ థోరోతీ ఓస్బోర్న్’ నుంచి తొలి తరం కవయిత్రుల శకం మొదలయ్యింది. వీరంతా బీదరికం లేని డబ్బున్న కాలక్షేప కవయిత్రులు.

తర్వాత ఆప్రా బెన్ అనే కవయిత్రి కవిత్వంతో 18 శకపు మహిళా కవయిత్రుల ప్రాముఖ్యం పెరుగుతుండడం గమనిస్తుంది వర్జీనియా. ఇదొక టర్నింగ్ పాయింట్. ఈమెకి ఇతర కవయిత్రులకీ తేడా ఉంది. ఆప్రాబెన్ అనే కవయిత్రి మధ్య తరగతి స్త్రీ. తన రచనల ద్వారానే ఆమె డబ్బు సంపాదించి జీవిక సాగిస్తుంది. అట్లానే ఆప్రాబెన్ కృషి వలన జెన్ ఆస్టిన్, జార్జి ఇలియట్ లాంటి కవులు వెలుగులోకి వచ్చారు. ఆ ఘనత ఆప్రాబెన్ కి దక్కుతుంది. ఆప్రాబెన్ గురించి వర్జీనియా ఇలా ఊహిస్తూ రాస్కుంటుంది. “అప్పటి కవయిత్రులు, రచయిత్రులు అంతా కూడా ఆప్రాబెన్ సమాధి మీద పూలు చల్లాలి గౌరవంతో, కృతజ్ఞతతో ఎందుకంటే ఆమె కవిత్వంలో అంత కృషి చేయడమే కాదు తాను అనుకున్నది, అని స్వేచ్ఛగా చెప్పటానికి, రాయడానికి ఎప్పుడూ కూడా సంకోచించలేదు కవయిత్రి.” జేమ్ ఆస్టిన్ తను రాసే కవిత్వపు కాగితాలను దాచి పెట్టేది. ఎవరైనా వస్తే ఎందుకంటే ఆమెకు ప్రత్యేకమైన గది లేదు. ఎంతో మంది కలిసి గదిలో ఒకతిగ ఉండేది.

సంపన్న స్త్రీలైన నవలాకారిణులు చాలా సులభమైన నవలా ప్రక్రియను ఎన్నుకున్నారు, కాబట్టి. సృజనాత్మకమైన కవిత్వం రాయాలంటే, కవిత్వం రాయడం క్లిష్టం కాబట్టి ప్రాస, భాష మీద పట్టు ఉండాలి. విషయం అర్థం చేస్కొనే మేధోశక్తి ఉండాలి. అది మెల్లగా 18 శతాబ్దంలో జెమ్స్ ఆస్టిన్, ఆప్రాచెన్లు సాధించారు. అప్పటి దాకా కవిత్వ సామ్రాజ్యం పురుషులదే. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళే మేధావులని, సృజనకారులని ప్రకటించుకున్నారు కాబట్టి. అదే, రచనా శక్తి ఉన్న స్త్రీలకి కనుక శిక్షణ ఉంటే, వీళ్ళు కూడా కవయిత్రులుగా మారేవారేమో అని ఆలోచిస్తుంది వర్జీనియా. జేమ్స్ ఆస్టిన్, ఎమిలీ బ్రాంచ్ ఇద్దరూ చాలా గొప్పగా, స్వేచ్ఛగా వాస్తవాలను కవిత్వీకరించారు.

పాఠకులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎలిజెబెతెన్ ఎరాలో వర్జీనియా వూల్ఫ్ రాసిన ఈ మేధోవంతురాళ్ళైన కవయిత్రులు వాస్తవ పాత్రలు కాదు వర్జీనియా వూల్ఫ్ ఊహాజనిత పాత్రలు మాత్రమే సుమా!

ఛాప్టర్ 5
అయితే ఇపుడు ఊహాజనిత రచయితల మీద కాకుండా వర్జీనియా ఈ ఛాప్టర్ లో జీవించి ఉన్న రచయితల పుస్తకాల మీద దృష్టి పెట్టింది. ఛాప్టర్ – 4 వరకు గత కాలంలోని రచయితలు, కవయిత్రుల గురించి రాస్తుంది. ఇక్కడ ‘లైఫ్ అడ్వంచర్ బై మేరీ కార్మిచెల్’ అనే నవల గురించి ప్రస్తావిస్తుంది. ఇక్కడ కూడా ఈమె ఊహల్లోంచి పుట్టింది. ఇందులో ఆమె పురుష వ్యతిరేకత చూపించదు. అలాగే తన జీవితంలోని విషాదాన్ని తప్పు పట్టదు లేదా వాపోదు. పురుషుల్ని టార్గెట్ చేయదు. స్థితప్రజ్ఞతలో పాజిటివ్ మైండ్ తో రాస్తుంది. ఒకరి మీద ద్వేషంతో, పగతో, భయంతో రాయదు. ఇలా ఇంకో రాబోయే 100 ఏళ్ళల్లో… సంవత్సరానికి 500 పౌండ్ల ఆర్థిక స్వాతంత్ర్యంతో, తనకంటూ ఒక ప్రత్యేకమైన గదితో, మేరీ కార్మిచెల్ లాంటి కవయిత్రులు ఖచ్చితంగా గొప్ప కవయిత్రులుగా మారతారు అని వర్జీనియా వూల్ఫ్ వ్యాఖ్యానిస్తుంది.

ఛాప్టర్ 6
లండన్లో దృశ్యం. ఒక మగ వ్యక్తి, ఒక స్త్రీని కా తీస్కెళుతుంటాడు. ఇక్కడొక థియరీ ప్రతిపాదిస్తుంది వర్జీనియా ‘మైంలో స్త్రీ, పురుషులిద్దరూ కూడా సమానమైన మనుషులుగా ఎందుకు ఉండకూడదు? ఇంగ్లీషులో ఇలా రాస్తుంది.
“Theory of unification of sexes. Coleridge – “Theory of Androgynous mind” అంటే స్త్రీ పురుషులిద్దరూ మనుషులే. ఇద్దరూ ఒకే మైండ్ సెట్ తో ఎందుకు ఉండకూడదు?

ఇంకో జాతికి చెందిన మనిషికై సానుభూతి ఉండదు. అంటే స్త్రీ బలహీనురాలు అన్న సానుభూతి, చులకన పురుషుడికి ఉండకూడదు. ఇద్దర్నీ ఒకే రకంగా పరిగణించాలి. జెండర్ బేస్డ్ గుర్తింపు, గౌరవాలు, సౌకర్యాలు ఉండకూడదు. సెక్స్ కాన్షియతో స్త్రీ పురుషుల బాధ్యతలు, విధులు నిర్ధారించకూడదు.

మిస్టర్ ఎ ఒక నవల రాస్తాడు. నేను మహిళను అన్న స్పృహ బాగా పెరిగిపోవడం వలన… వాళ్ళు కూడా మేం పురుషులం… అన్న స్పృహ పెరిగిపోతుంది కాబట్టి వాళ్ళు డిమాండు చేస్తుంటారు అని రాస్తాడు. ఈ ఊహాత్మక నవల గురించి చెప్తూ వర్జీనియా వూల్ఫ్ ఏం చెబుతుందంటే, మేధోపరమైన స్వేచ్చ,
బాహ్య సౌకర్యాల మీదే (అంటే భౌతిక విషయాల మీదే) ఆధారపడుంది. అలాగే కవిత్వం కూడా మేధోపరమైన స్వేచ్చలోంచే పుడుతుంది. ఇక్కడ మేధోపరమైన స్వేచ్ఛ అంటే, మేధస్సు ఏ ఆటంకాలు, నిర్బంధాలు అసౌకర్యాలు, లేమి తనాలు లేకుండా ఉన్నప్పుడే దిగులు లేకుండా, సంకెళ్ళు లేకుండా ఉంటుంది అని అర్థం వర్జీనియా దృష్టిలో. స్త్రీలకు మరి ఆ మేధో స్వేచ్ఛ ఉండే వాతావరణం ఉందా? ఉండి తీరాలంటుంది. 200 ఏళ్ళ నుంచే, దాదాపు సృష్టి ఆదిగా స్త్రీ ఎప్పుడూ పేదరాలే ఎప్పటికీ. ఆమెకు డబ్బు, రాస్కోడానికి ఒక స్థలం, గది ఎన్నటికీ ఏర్పడలేదు కాబట్టి స్త్రీకి కవిత్వం రాసే అవకాశమే రాలేదు.

ఆర్థిక స్వాతంత్ర్యం సృజనాత్మక రచనకు చాలా ముఖ్యం. అది స్త్రీలకు లేదు. వంటింటికి, గృహ బానిసత్వానికి బలై పతనమయ్యే స్త్రీలకు ఆర్థిక పరాధీనతకు గురై స్వంత ఇంట్లో కూడా గదిలేని స్త్రీలు, మంచి ఆహారం, శారీరక విశ్రాంతి, ఏకాంతం, ఏకాగ్రత లేని స్త్రీలు కవిత్వం నవల లాంటి సృజనాత్మకమైన సాహిత్యాన్ని ఎలా సృష్టించగలరు? స్త్రీల నుంచి ఇదంతా లాక్కునేది పురుషులు కాదా? కవిత్వమెలా, నవల ఎలా రాయగలరు? అందుకే నేను, స్త్రీకి ఆర్థిక స్వాతంత్ర్యం, తనకంటూ రాస్కోడానికి ఒక స్వంత గదీ ఉండడం మీద అంతగా ప్రత్యేకించి చెబుతున్నా” అని తన ఊహాత్మక ప్రయాణంలోంచి బయటకు వస్తుంది వర్జీనియా. ఈ ఆరు ఛాప్టర్లలో స్త్రీలు ప్రవేశించాలనుకున్న ప్రతీ స్థలంలో లైబ్రరీ, విశ్వవిద్యాలయం, పార్కులు, భోజనశాలలు, రచనారంగం… ఎక్కడైనా నిర్భయంగా పురుష స్వామ్యం వలన, పరాధీనులు కావడం వలన అణిచి వేయబడుతున్నారు. కాబట్టి ఆర్థిక స్వాతంత్ర్యం ఒక్కటే స్త్రీలకు స్వేచ్ఛని ప్రసాదించి, మంచి గొప్ప సృజనకారులైన రచయిత్రులుగా గుర్తింపునిస్తుంది అని చెప్తుంది వర్జీనియా వూల్ఫ్.

మిసెస్ డాలోవ్
వర్జీనియా వూల్ఫ్ రాసిన ఈ నవల ‘ది హావర్స్’ అనే సినిమాగా వచ్చింది. ఈ నవల చైతన్య స్రవంతి శైలిలో కొనసాగుతుంది. నవలంతా డాలోవే ఇంట్లో ఒక సాయంత్రం చేయాల్సిన పార్టీ గురించిన ప్రయత్నాలు అదే సమయంలో మిసెస్ డాలోవే మనసులో గతం వర్తమాన కాలాల మధ్య చెలరేగుతూ అల్లకల్లోల పరుస్తున్న ఆలోచనలతో పాటు మొదటి ప్రపంచ యుద్ధంలో సైనికుడిగా పాల్గొని… తన స్నేహితుడై ఇవాన్ ని కోల్పోయిన కవి, రచయిత సెప్టిమస్ మానసిక వైకల్యపు సంఘటనలు సమాంతరంగా ఒకదానితో ఒకటి సంబంధం లేకపోయినా నడుస్తూంటాయి. ఇదంతా జరిగిన కాలం 1923 జూన్ నెలలో.

మిసెస్ డాలోవే సాయంత్రపు పార్టీకి పూలకోసం బయటకు రావడంతో నవల మొదలవుతుంది. ఆమెకు భర్త రిచర్డ్‌, కూతురు ఎలిజిబెత్ ఉంటారు. పార్టీకి అతిథులు వచ్చి ఉంటారు. కూతురు ఎలిబెత్‌ను ఆమె ట్యూటర్ డోరిన్ కిల్మన్ తన నుంచి వేరు చేయాలని చూస్తుంది అని అనుకుంటూంటుంది. ఆమెను ఒక రాక్షసిలా ఊహించుకుంటుంది. ఎందుకంటే కిల్మన్ చాలా ఆధునాతన స్త్రీ ఆమెపట్ల యుక్త వయస్సులో ఉండే ఎలిజెబెత్ ఆకర్షించబడుతూ ఉంటుంది. అదే సమయంలో సాంప్రదాయ గృహిణి అయిన క్లారిసా డాలోవే అంటే కిల్మన్‌కి చిన్న చూపు ఉంటుంది.

డాలోవే పార్టీ ఏర్పాట్లు చేస్తున్నప్పటికీ ఆమె మనసు గతంలోకి మళ్ళీ వర్తమానంలోకి ప్రయాణం చేస్తూ ఉంటుంది. 30 ఏళ్ళ క్రితం తనను గాఢంగా ప్రేమించిన పీటర్ వాల్ట్ కాదని రిచర్డ్ డాలోవేని పెళ్ళాడి ఆదర్శవంతమైన గృహిణిగా మారిపోవడం గురించి ఆలోచనలు కమ్ముకుంటాయి. అదే సమయంలో తన యవ్వన కాలంలో కొద్దిగా తిరుగుబోతుగా పిలవబడే సాల్ సెల్టన్ అనే యువతి ప్రేమలో పడడాన్ని, ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉంటూ గొప్ప ఆకర్షణలో ఒకరినొకరు ముద్దాడడాన్ని గుర్తుకు తెచ్చుకొంటుంది. ఆ పార్టీకి పీటర్ వాల్ట్ కూడా వస్తాడు. అతిధులైన లేడీ బ్రూటన్‌తో భర్త రిచర్డ్ లంచ్‌కి వెళతాడు. లేడీ బ్రూటన్ తనను లంచ్‌కు పిలవలేదని ఆమె మీద నిరశనగా ఉండే అధికారం తనకుందని భావిస్తుంది క్లారిసా వాళ్ళ కోసం మరికొంత మంది అతిధుల కోసం క్లారిసా డాలోవే ఎదురుచూస్తూ పార్టీ ఏర్పాట్లు చేస్కుంటూ ఉంటుంది. ఇదే సమయంలో క్లారిసాడాలోవే కథకు సమాంతరంగా సెప్టెమస్ – లుక్రోజ్ కథ నడుస్తూ ఉంటుంది. రెండూ ఒక దానిలో ఒకటి సంబంధంలో ఉండవు. సెప్టిమస్ ఒక కవి, రచయిత.

సెప్టెమస్ మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న సైనికుడు. యుద్ధలో రక్తపాతం, మరణాలు, హింస, బాంబుల మోత, స్త్రీల పైన, జరిగిన లైంగిక అత్యాచారాలు అన్నింటికి మించి యుద్ధంలో చనిపోయిన తన మిత్రుడు ఇవాన్ మరణం వలన అతను డిప్రెషన్‌కి, ఒక రకమైన చిత్ర చాంచల్యానికి లోనవుతూ ఉంటాడు. జీవితంలో ఇంకేమీ లేదనీ, జీవితం చాలా చిన్నదని అనడంతో పాటు చనిపోయిన ఇవాన్‌తో సంభాషిస్తూ ఉంటాడు. తనకేవో శబ్దాలు, మాటలూ వినిపిస్తున్నాయని ఆందోళన పడ్తూంటాడు. సెప్టెమస్ భార్య లుక్రెజ్ అతని కోసం అంబులెన్స్ డా. సర్ విలయం సైకియాట్రిస్ట్ అపాయింట్‌మెంట్ తీస్కొంటుంది అంబులెన్స్ డాక్టరు చెప్పినట్లు మెంటల్ అసైలమ్‌లో చేర్పించాలనుకుని సెప్టిమస్‌ను తీస్కుని ఇంటి బయట పార్కులో ఎదురు చూస్తూంటుంది.

ఇక్కడ క్లారిసా ఇంట్లో పీటర్ వాల్ట్ కలుస్తాడు. రిచర్డ్‌తో ఆనందంగా ఉన్నావా? అని అడుగుతాడు. ఆదర్శవంతమైన గృహిణిగా మారే అన్ని లక్షణాలు నీలో ఉన్నాయని ఆనాడే చెప్పానంటాడు. ఆమెని కోల్పోయిన బాధ అతని మొఖంలో కన్పిస్తూంటుంది. ఇద్దరూ సంభాషించుకుంటారు. గతంలోంచి వర్తమానంలోకి… వర్తమానం నుంచి గతంలోకి వారి మాటలు దొర్లుతుంటాయి. పీటర్ వాల్ట్ దిగులుగా క్లారిసాడాలోవే ఇంట్లోంచి పార్కులోకి నడుస్తాడు. అక్కడ సెప్టెమస్‌కి లుక్రెజ్‌కి మధ్య ఆత్మహత్యకి సంబంధించిన సంభాషణలు, వాదనలు నడుస్తూ ఉన్నప్పటికీ, వాళ్ళిద్దరి జంట చూడ్డానికి బాగుందనుకుంటాడు పీటర్ వాల్ట్.”

ఇక్కడ రిచర్డ్ డాలోవే తన భార్యకి పార్టీ సందర్భంలో ఐలవ్ యూ అని చెప్పి తన ప్రేమను వ్యక్తపరచాలనుకుంటాడు. పెళ్ళి ముప్ఫై ఏళ్లనించి ఇదే ప్రయత్నంలో ఉన్నా, బిజీగా ఉండడం వలన చెప్పలేకపోతుంటాడు. లేడీ బ్రూటన్ పార్టీకి వస్తుంది. ఇంకా రావాల్సిన అతిధులు కోసం ఎదురు చూస్తూంటారు.

మరోపక్క డాక్టరు రావడం ఆలస్యమవుతుంటుంది. సెప్టెమస్ – లూక్రెజ్ తమ అపార్ట్‌మెంట్‌కి వెళ్ళిపోతారు. సెప్టెమస్ తనను మెంటల్ ఎసైలమ్‌లో చేర్చడాన్ని తీవ్రంగా నిరశిస్తుంటాడు. కానీ ఈ లోపల అంబులెన్స్ రావడం, అందులోంచి నర్సులు పైకి వచ్చి సెప్టెమస్‌ను పట్టుకునే ప్రయత్నం జరుగుతుంది. ఇష్టం లేని సెప్టెమస్ వారికి అందకుండా భవంతి పై నుంచి కిందికి దుంకి ఆత్మహత్య చేస్కుంటాడు. క్రిందపడ్డ సెప్టెమస్ రక్త దేహాన్ని చూసి పీటర్ వాల్ట్ దిగ్ర్భాంతి చెందుతాడు.

ఇక్కడ క్లారిసా ఇంట్లో విందు జరుగుతూ ఉంటుంది. ఆమె ఆలోచనలూ అల్లిబిల్లిగా పీటర్ వాల్ట్… తన ప్రియురాలు సాలీ స్టెరాన్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఈ లోపల డా|| సర్ విలియమ్ ఆయన భార్య లేడీ బ్రాడ్ షా వస్తారు. “క్షమించాలి… డాక్టరు గారి పేషంట్ ఒకాయన (సెప్టెమస్) ఆత్మహత్య చేస్కోవడం వలన అక్కడికి వెళ్ళాల్సి రావడం వలన విందుకు రావడం ఆలశ్యమయ్యింది అని లేడీ బ్రాడ్ షా అంటుంది. అవును అతను భవనం మీద నుంచి దుంకి ఆత్మహత్య చేస్కున్నాడని డా|| సర్ విలియం అంటాడు. ‘దుంకి’ అన్న పదం మిసెస్ డాలోవేని ఆకర్షిస్తుంది. మనుషులు ఎందుకు దుంకుతారు అని ఒక తాత్విక ఆలోచనల్లోకి వెళ్ళిపోతుంది. మనసంతా దిగులు, దుఃఖం కమ్ముకుంటుంటే… జీవితంలో దుఃఖం అనేది ఒక్క మరణం విషయంలోనేనా అని ఆమె ఆలోచిస్తుంది. బహుశా తన జీవితంలోని సంఘటనలు ఆమెకి గెంతుల లాగా అన్పిస్తాయి కాబోలు.

ఈ నవల అంతా కూడా చైతన్య స్రవంతి శైలిలో పాత్రల అంతర్గత సంఘటనల మధ్య వైవిధ్యాల మధ్య, ఘర్షణ, ప్రేమ, మోసం, నిరాశని కోల్పోయినతనం, శూన్యం, ప్రేమరాహిత్యం తిరస్కారాలు కన్పిస్తాయి.

నవలలో, మొదటి ప్రపంచయుద్ధానంతర మానవ విషాదాన్ని చూపించే ప్రయత్నం చేసింది వర్జీనియా వూల్ఫ్. మానవ హననంతో పాటు మిగిలి ఉన్న మనుషుల జీవితాల్లోని విధ్వంసాన్ని… మనుషులు ‘పారానాయియా’ లాంటి మానసిక రుగ్మతలకు లోనవడాన్ని చిత్రించింది. యుద్ధానంతరం స్నేహితుడు ఇవాన్ మరణంతో, యుద్ధంలో జరిగిన రక్తపాతం, హింసలు చూసిన తర్వాత సున్నిత మనస్కుడైన కవి, రచయిత సెప్టిమసం తనలో తాను మాట్లాడుకోవడం, ఇవాన్ కన్పిస్తున్నాడని, వినిపిస్తున్నాడనీ భ్రమలకు అంటే డెల్యూషన్స్కి, ఇల్యూషన్స్కీ లోనవడం లాంటి పారా నాయియా అనే మానసిక రుగ్మతకు లోనవుతాడు. ఇలా చాలా మంది యుద్ధానంతరం ఈ స్థితిలోకి వెళ్ళారు. వెళ్తారు కూడా దీన్ని ‘పోస్ట్ ట్రామాటిక్ స్ర్టెస్ డిసార్డర్’ అని కూడా అంటారు. వర్జీనియా వూల్ఫ్ తన సాహిత్యాన్నంతా రెండు ప్రపంచ యుద్ధాల కాలాల మధ్య రాసింది. యుద్ధం మూలంగా తను కోల్పోయిన తన బాల్య గ్నాపకాల సంపదల్లో ఒకటైన ఇంటిని ఆమె ఎప్పటికీ మరవలేదు. ఆ బాధ ఆమెను చాలా కాలం వెంటాడింది.

ఇక క్లారిసాడాలోవేకి ఆమె యవ్వన కాలపు ప్రియురాలు సాల్‌హిల్ట్‌కి మధ్య సంబంధాన్ని, అంటే ఇద్దరి స్త్రీల మధ్య ఆకర్షణ, లైంగిక సంబంధాన్ని గురించి రాస్తుంది. వర్జీనియా వూల్ఫ్‌కి లెస్బియనిజం, బై సెక్సువాలిటి లాంటి భిన్న లైంగిక ధోరణుల పట్ల పెద్ద అభ్యంతరం ఉండదు. ఆమె తన నిజ జీవితంలో కూడా తోటి రచయిత్రి సాక్ విల్లే వెస్ట్‌తో గాఢమైన ప్రేమలో లైంగిక సంబంధంలో కొనసాగుతుంది. భిన్నమైన మానవ లైంగిక వైరుధ్యాలను సమాజం సహజంగా తీస్కోని గౌరవించాలని వర్జీనియా వూల్ఫ్ ఆకాంక్ష. ఇదే విషయాన్ని బైసెక్సువాలిటీని ట్రాన్స్‌వెస్టిసమ్‌ను వస్తువుగా తీస్కుని ఓర్లాండో నవల రాస్తుంది.

క్లారిసా డాలోవే మనసులోని గతానికి వర్తమానానికి మధ్యన జరిగిన యుద్ధం… సెప్టెమిస్‌ను, ఇవాన్‌ను భౌతికంగా చంపేసిన యుద్ధం, ఈ రెండు యుద్ధాలకి మధ్య సంబంధాన్ని డా|| సర్ విలియం అనే సన్నన్ని దారపు పోగుతో అల్లే ప్రయత్నం చేస్తుంది రచయిత్రి.

వర్జీనియా వూల్ఫ్ యూదు వ్యతిరేకత – ఆత్మవిమర్శ
వర్జీనియ వూల్ఫ్ – హిట్లర్ ఫాసిస్టు వ్యతిరేకత

వర్జీనియా వూల్ఫ్ 1912లో రచయిత, పత్రిక ఎడిటర్, పబ్లిషర్ అయిన లియోనార్డ్ వూల్ఫ్‌ని వివాహమాడింది. అతడి సామాజిక స్థాయి గొప్పగా లేనప్పటికీ వివాహం చేస్కుంది. వర్జీనియా తన నిశ్చితార్ధ సమయంలో లియోనార్డ్‌ని “నయా పైసా కూడా లేని యూదుడి”గా వర్ణించింది. వర్జీనియా యూదు వ్యతిరేక భావాలను కలిగి ఉండడాన్ని అప్పటి సాహితీ ప్రపంచం విమర్శించింది. తన రచనలలో ఆమె తరచుగా మూసపోసిన రీతిలో యూదు పాత్రలను ప్రస్తావించి సాధారణీకరించేది. యూదు పాత్రలను శారీరకంగా నిరాశక్తకరమైన వారుగా, మురికివారుగా వర్ణించింది అన్న ప్రాతిపదికన వర్జీనియా వూల్ఫ్‌ని యూదు వ్యతిరేకిగా ముద్ర వేసారు. 1920, 1930ల మధ్య కాలంలో తీవ్రమైన యూదు వ్యతిరేక భావాలు వర్జీనియా వూల్ఫ్‌ని ప్రభావితం చేసి ఉండవచ్చు. ఆమె తన డైరీలో ఇలా రాస్కుంది. “నేను యూదు కంఠస్వరాన్ని ఇష్టపడను, యూదు నవ్వును కూడా ఇష్టపడను” అని. అయితే వర్జీనియా వూల్ఫ్ తర్వాత ఆత్మవిమర్శ చేస్కుంది. 1930లో వర్జీనియా స్వరకర్త ఎథిల్ స్మిత్‌కి పశ్చాత్తాపంతో కూడిన ఒక లేఖ రాసింది. అందులో వర్జీనియా వూల్ఫ్ తన సహచరుడు లియోనార్డ్ వూల్ఫ్ యూదుతనాన్ని ప్రశంసిస్తూ అతని పట్ల తను ప్రేమ పూర్వకమైన సానుకూల ధోరణిని ప్రదర్శించింది. “ఒక యూదుడైన పెళ్ళాడడాన్ని నేనెలా ద్వేషించాను? నేనెంత గర్విష్టిని లియోనార్డ్ ఎంతో జీవశక్తి కల నుంచి మనిషి” అని. అలాగే ఎథిల్ స్మిత్‌కు రాసిన మరొక లేఖలో వర్జీనియా క్రైస్తవ తత్వాన్ని పూర్తిగా తోసి పుచ్చింది. పాపభీతి కలిగిన “ఆత్మస్తుతిపరత్వం” ఈ మతంలో ఉందని చెబుతూ ఇలా ప్రకటించింది. యూదుడైన భర్త మరింత ఎక్కువ మానవ ప్రేమని కలిగి ఉన్నాడని అదే మత శక్తి కంటే ఎక్కువైంది” అంటుంది.

వర్జీనియా వూల్ఫ్, ఆమె భర్త లియోనార్డ్ వూల్ఫ్ 1930ల నాటి నాజీ ఫాసింజను ద్వేషించారు. అందరిలాగా దాని పట్ల భయం పెంచుకున్నారు. అయినప్పటికీ తాము ఇద్దరూ హిట్లర్ బ్లాక్ లిస్ట్‌లో ఉన్నామన్న విషయం తెలిసి కూడా వారిద్దరూ యూదు వ్యతిరేకతను నిరశించారు. 1938లో వర్జీనియా రాసిన “ది గినియాస్” నవల ఫాసిజం పట్ల తీవ్ర నిరసనను తెలుపుతుంది.

వర్జీనియా రచనల పట్ల విమర్శ
వర్జీనియా విమర్శనాత్మకమైన నవలలు, వ్యాసాలతో ప్రజల మేధావిగా గుర్తింపు పొందింది. ఇరవయ్యో శతాబ్దపు అతి గొప్ప కల్పనా సాహిత్య నవలా రచయితలలో ఒకరిగా ప్రశంసలు అందుకుంది. ఇంగ్లీష్ భాషను సృజనాత్మకమైన నూతన ప్రయోగాలతో కొత్త పుంతలు తొక్కించిన మహా ఆవిష్కర్తగా వూల్ఫ్ గుర్తించబడింది. వూల్ఫ్ తన రచనలలో చైతన్యస్రవంతి శైలితో ప్రయోగాలు చేసి పాత్రల అంతర్గత మానసిక భావోద్వేగ ప్రేరణలను చిత్రిస్తూ తన ప్రత్యేకతను నిలుపుకుంది. మొదటి, రెండవ ప్రపంచ యుద్ధాల మధ్య కాలాల్లో వూల్ఫ్ విపరీతంగా రచనలు చేసినా తర్వాత ఆమె కీర్తి తగ్గుతూ వచ్చింది. కానీ 1970లలో స్త్రీవాద విమర్శనా ధోరణులలో వూల్ఫ్ పేరు ప్రఖ్యాతులు పునరుద్ధరించబడ్డాయి. దీనితోపాటు ఆమె రచనలు చాలా విమర్శలను ఎదుర్కొన్నాయి. ఇంగ్లీష్ మేధావి వర్గంలోని ఎగువ ఉన్నత తరగతి సంకుచిత ప్రపంచాన్ని, అందులోని కుళ్ళు కుతంత్రాలను రాజకీయాలను ఎత్తి చూపిస్తూ రచించినందుకు వర్జీనియా వూల్ఫ్ మీద తీవ్రమైన విమర్శలు వచ్చాయి. ఆమె రచనలో సార్వత్రికత, గాఢత లేదని కొంత మంది విమర్శకుల భావన. 1920ల కాలం నాటి సౌహిత్య సౌందర్య శాస్త్ర లక్షణాలు ఈమె రచనల్లో లోపించాయని అంటారు.

సాధారణ పాఠకుడికి భావోద్వేగం కలిగించి, నైతికత వైపు నడిపించే అంశాలు ఈమె రచనల్లో లేవని, సాధారణ మధ్య, దిగువ తరగతులకి, శ్రామిక వర్గ ప్రజలకు ప్రేరణ ఇచ్చే భావజాలం ఈమె రచనల్లో కొరవడింది అని విమర్శకులు భావించారు. ఆమె స్వయంగా ఒక యూదుడ్ని వెళ్ళి చేస్కున్నా కానీ ఆమెలో యూదు వ్యతిరేక భావాలు, ద్వేషం ఉన్నాయని ఆమెను వాళ్ళు విమర్శించారు. తన రచనల్లోని యూదు పాత్రలను తెలివి లేని వారుగా మురికివారుగా వర్ణించేదన్న ఆగ్రహాన్ని వ్యక్తపరిచారు విమర్శకులు.

వర్జీనియా ఇతర రచనలు ‘టు ద లైట్ హౌస్’ 1927
ఈ నవలలో పది సంవత్సరాల రెండు రోజులలో ముగుస్తుంది. ఈ నవల ఇతివృత్తం రామ్సే కుటుంబం ఒక లైట్ హౌస్‌ను సందర్శించడంలో పాల్గొనడం, ఆ కుటుంబ సభ్యులపై దాని ప్రభావం, ప్రతిఫలనాలు ముడిపడిన కుటుంబ వత్తిళ్ళ చుట్టూ తిరుగుతుంది. ఈ నవల ప్రధాన ధీంలలో ఒకటి పెయింటర్ లిలీ బ్రిస్కో సృజనాత్మక ప్రక్రియలో ఉన్న ఘర్షణను చిత్రించడం జరుగుతుంది. లైట్ హౌస్ చూడాలన్న కొడుకు కోరికను పదేళ్ళ తర్వాత, భార్య చనిపోయిన తర్వాత తరచూ వేసవి కాలపు విడిదిగా వెళ్ళే లైట్ హౌస్‌కి తీస్కెళతాడు రామ్సే. భార్య జ్ఞాపకాలు అతన్ని వేధిస్తాయి. దేశంలో యుద్ధం జరిగిన ప్రాంతాలలో వెనుక దేశంలో నివశిస్తున్న ప్రజలు వూల్ఫ్ నవలతో బాగా కనెక్ట్ అవుతారు. అప్పటి వర్తమాన కాల గమనాన్ని ఈ నవల చిత్రిక పట్టింది. మహిళల సృజనాత్మకతను, భావోద్వేగాలను పురుషులు ఎలా దోచుకుంటారో లేదా క్షీణింపచేస్తారో, అదే సమయంలో వ్యక్తిత్వాలు నిలుపుకునే ఘర్షణలో స్త్రీలు ఎంత మానసిక ఒత్తిడికి లోనవుతారో ఈ నవలలో వర్జీనియా వూల్ఫ్ రాసింది. ‘టు ద లైట్ హౌస్’ సినిమాగా కూడా వచ్చింది.

ది వేవ్స్ – 1931
ఇది ఆరుగురు స్నేహితుల బృందాన్ని వారి మధ్య ఘర్షణలను, భిన్నమైన ఆలోచనలను వైరుధ్యాలను చిత్రించింది. వీటి ప్రతిఫలనాలు వారి అంతర్గత ఆత్మాశ్రయ లేదా స్వగతాల రూపంలో ఉన్నప్పటికీ పద్యాత్మక రాగయుక్తంగా ఉంటూనే వచనంలో ఉంటాయి. ‘ది వేవ్స్’ అంటే ఒక ఇతివృత్త ప్రాధాన్యత కలిగిన నవలగా ఉంటూనే వచన పద్యాల్ని పోలి ఉంటుంది. ఒక వేవ్స్ అంటే అలల్లాగా, తరంగాల్లాగా వస్తువు నవలా వాతావరణాన్ని ఆవరిస్తుంది.

ఫ్లష్ నవల
1933లో ఇది ఆత్మాశ్రయ పద్ధతిలో రాసిన నవల. అలాగే కాల్పనిక సాహిత్య లక్షణాలు కూడా ఉన్నాయి. ఈ నవల ఒక కుక్క దృక్కోణంలో రాయబడింది. ఒక రకంగా ప్రయోగాత్మక రచన. జంతువుల ఆలోచనల్లో నించి ప్రకృతి, సమాజం, మానవ జీవితం, మనుషుల ఆలోచనలు, నిర్ణయాలు సాహిత్యంలో రాసే పద్ధతి చాలా పాతది. రుడాల్ఫ్ బిసైర్ రాసిన నాటకం “ద బారెట్స్ ఆఫ్ విమ్ పోల్ స్ట్రీట్” ప్రేరణతో వర్జీనియా ‘ఫ్లష్’ నవల రాసింది.

త్రీ గినియాస్ – నవల
1938లో వచ్చింది. యూరోప్‌లో యుద్ధకాలంలో పెచ్చరిల్లిన ఫాసిజం మీద వర్జీనియా వూల్ఫ్ రాసింది. ఇది నవల, వ్యాసం లక్షణాలు రెండూ కలిగింది. దీనిలో యుద్ధ వ్యతిరేక సమాజం కావాలి. అలాగే యుద్ధాలు ఎలా నివారించబడాలి?

ప్రభుత్వం స్త్రీలు చదువుకోవడానికి కావల్సిన కాలేజీలు కట్టటడానికి నిధులు ఎందుకు ఇవ్వదు? ఈ ఫండ్ అంతా కూడా కుటుంబాల్లో పురుషులు మాత్రమే చదువుకోవడానికి వినియోగించబడడం, అలాగే స్త్రీలు పురుషులు చేసే వృత్తుల్లో ఎందుకు నియోగించబడరు? అనే విషయాలు, స్త్రీల కోసం స్కాలర్ షిప్స్ ఇవ్వడం గురించి చర్చించింది వర్జీనియా.

ఇదంతా కూడా కొన్ని ఉత్తరాల రూపంలో కొన్ని ప్రశ్నల రూపంలో మరికొన్ని వ్యాసాలు, సంభాషణల రూపంలో కొనసాగుతుంది. రాజకీయమైన అంశాలు ఒక చర్చారూపంలో కూడా రాస్తుంది. చారిత్రక సందర్భం అయిన యుద్ధ సమయంలో స్త్రీ జీవితాల్లో వచ్చిన మార్పులను ఫెమినిజం దృక్కోణం నుంచి విశ్లేషిస్తుంది. వర్జీనియా వూల్ఫ్ ఆమె భర్త లియోనార్డ్ ఇద్దరూ నాజీ జర్మనీ, ఫాసిస్ట్ ఇటలీ రెండూ సందర్శించి అక్కడ యుద్ధం మిగిల్చిన విధ్వంసాన్ని చూస్తారు. చలించిపోతారు.

ఫాసిస్టు భావజాలం వూల్ఫ్ దృష్టిలో అహింసకీ, ఫెమినిజానికి మానవీయ విలువలకీ చాలా అమర్యాదకరమైంది. ఉదాహరణకు నాజీ ఫిలాసఫీలో స్త్రీలను, పబ్లిక్ లైఫ్ నుంచి అంటే స్త్రీలు విద్యావంతులై, ఆర్థిక స్వతంత్రులై బహిరంగ వృత్తిపరమైన జీవనం గడపడం నించి తొలగించమని చెప్తుంది. వర్జీనియా త్రీ గినియాస్ నవలలో ఈ విషయాన్ని తీవ్రంగా విమర్శిస్తుంది.

యుద్ధకాలపు, యుద్ధానంతర మానవ జీవన విధ్వంసాన్ని, మారిన రాజకీయార్థిక పరిణాలను స్రీల జీవితాల్లో యుద్ధం నింపిన క్రూరమైన లైంగిక హింసారూపాలను, ఆకలి, దారిద్ర్యాలను, ధ్వంసమైన ప్రజల ధనాన్ని, శ్రమ దోపిడీని క్షేత్ర పర్యటన చేసి రాసిన రచయిత్రి బహుశ వర్జీనియా వూల్ఫ్ మొదటిది కావచ్చు.

బిట్వీన్ ది యాక్ట్
ఇది వర్జీనియా వూల్ఫ్ చివరి నవల. బిట్వీన్ ది యాక్ట్స్ నవల 1941 సంవత్సరంలో రాయబడింది. కళ, లైంగిక అనిశ్చితి, జీవితం వస్తువుపై విశ్లేషణాత్మకమైన భావాలు, వృద్ధాప్యం చేసే విచిత్రాలపై తిరిగి యౌవనకాల చిత్రణ, చారిత్రక కాలం అన్నీ కూడా ఏక కాలంలో చిత్రీకరించడం ఈ నవల ప్రత్యేకత. ఈ నవల అంతా కూడా ప్రతీకాత్మక వర్ణనలలో కూడి ఉంటుంది. తీరని కోరికలు, అందని ప్రేమలు, లాలస ఊహల్లో జీవితం, వాస్తవిక జీవితం కలిగించే దుఃఖం, దిగ్ర్బాంతుల నడుమ జరిగే ఘర్షణ గొప్పగా రాస్తుంది రచయిత్రి. ఈ నవల అంతా కూడా పాత్రల అంతర్గత భావోద్వేగాల ప్రకటనల ఆత్మాశ్రయ, భావ కవితా ధోరణిలో రాస్తుంది రచయిత్రి. తన జీవితపు చివరి దశల్లో బహుశ మరణానికి ముందు వర్జీనియా వూల్ఫ్ మళ్ళీ భయంకరమైన మానసిక రుగ్మతకు లోనయిన దశలో కూడా ఈ విషయాల మీద దృష్టి పెట్టి రాసింది ఇది.

తీవ్రమైన ఒత్తిడి, ఆవేదనల మధ్య వ్రాసిన నవల ఇది నవలంతా కూడా పద్య శైలిలో కొనసాగుతూ చిక్కని అనుభూతి భావలను కూడా వెలువరిస్తుంది. ఇందులో ఒక్కసారి వర్షంలా ముప్పిరిగొనే భావాలను సరళమైన శైలిలో చెప్తుంది. ఈ నవలలో వర్జీనియా వూల్ఫ్ సైద్ధాంతిక హేతువాదం వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.

ఈ నవల అంతా కూడా రెండవ ప్రపంచ యుద్ధం ముందు ఇంగ్లాండ్ లో ఒక గ్రామంలో జరుగుతుంది. ప్రతీ సంవత్సరాంతం జరిగే ఒక సాంస్కృతిక ఉత్సవ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఈ ఉత్సవంలో గ్రామస్థులంతా పాల్గొంటారు. అక్కడ బార్తాలోమేవ్ ఆలీవర్ అనే భార్య చనిపోయి ఒంటరిగా ఉంటున్న ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ కుటుంబంలోని సభ్యుల ఆశా నిరాశలు, ఘర్షణలను చిత్రించే ప్రయత్నం చేస్తుంటుంది రచయిత్రి. ఆలివర్ చెల్లెలు లూసీ కొద్దిగా కోప లక్షణమున్న మనిషి. ఆమె కూడా అదే ఇంట్లో ఉంటుంది. అన్న ఆలీవరం కుటుంబాన్ని చక్కదిద్దుతూ, పెత్తనం చేస్తూంటుంది. ఆలివర్ కొడుకు గైల్స్ లండన్‌లో ఉద్యోగం చేస్తున్నా కానీ సంతృప్తి ఉండదు. ఎప్పుడూ అశాంతిగా ఒత్తిడి అనుభవిస్తున్నట్లుగా ఉంటుంటాడు. గైల్స్ భార్య, ఇసా తన ఇద్దరి పిల్లలతో ఉంటుంది కానీ, ఆమెకి క్రమంగా భర్త పట్ల ఇష్టం తగ్గిపోతుంది. ఇసాకి తన ఇంటి పక్కనే ఉన్న అందమైన రైతు హెయిన్స్ పట్ల ఆకర్షణ కలుగుతుంది కానీ అది చూపుల వరకు మాత్రమే ఉంటుంది. ఆ ఉత్సవానికి మిసెస్ యాన్ రెసా, ఆమె స్నేహితురాలు విలియం డాడ్జ్ వస్తారు. ఉత్సవ కథ, పాటలు అన్నీ కూడా మిస్ లాట్రోతో రాయబడ్డాయి. లూసీ ఉత్సవ సంబంధాలకు కావల్సిన అలంకరణ దగ్గర్నించి విందు భోజనం ఏర్పాట్లు చేస్తుంటుంది. ఉత్సవానికి వచ్చిన మిసెస్ మాన్రీసా వృద్దుడైన బార్డోలోమావ్ తోటి అదే సమయంలో అతని కొడుకు గైల్స్‌నీ ఆకర్షించే ప్రయత్నాలు చేస్తుంటుంది. ఆమెతో పాటు వచ్చిన విలియం డాడ్జ్ హోమో సెక్సువల్‌గా బయటపడతాడు. గైల్స్ కూడా భార్య కళ్ళు కప్పి అదే ఊర్లో మరో స్త్రీతో లైంగిక సంబంధంలోకి వెళతాడు. విజయోత్సపు సంరంభం అంతా మూడు భాగాలుగా ఉంటుంది. చిన్నపిల్లవాడితో నాంది పలికించాక శృంగార రసోద్వేగంలో కూడిన సంభాషణలో షేక్స్‌పియర్ సీన్ మొదలవుతుంది.

రెండవ దృశ్యం అంతా హాస్యంతో నిండిన పారెడీగా కొనసాగుతుంది. మూడవ భాగంలో హైడ్ పార్క్‌లో టాఫిక్‌ను కంట్రోలు చేస్తున్న దృశ్యాలతో కూడిన విక్టోరియా వంశస్థుల విజయపు దృశ్యం ఉంటుంది. చివరి అంకం ‘మనం’ అనే పేరుతో మొదలై, ఉన్నట్లుండి నాటక రచయిత్రి మిసెస్ లాత్రోబ్ వీక్షకుల మీదికి అద్దాల్ని ప్రతిబింబిస్తుంది. అద్దాల్లో తమ ప్రతిబింబాల్ని చూస్కుని వీక్షకులు ఉలిక్కిపడతారు, దిగ్ర్భమ చెందుతారు. ఇదొక మనోవిశ్లేషణాత్మకమైన దృశ్యం లేదా ఘటన. నాటకంలోంచి, నాటకం చూస్తున్న మనుషుల మనసుల్లోని చీకటితో ఉన్న, రహస్యమైన లోతుల్ని తట్టి లేపే సంఘటన.

నవల ముగింపులో… ఆందోళన, ఆతృతతో కూడిన ఊహించని మలుపులతో మగ నక్కకు, ఆడ నక్కకు మధ్య ఆగ్రహంతో కూడిన వాదోపవాదాలతో ముగుస్తుంది. గ్రామీణ ఉత్సవ నేపథ్యంలో ఈ నవలలో వివాహేతర సంబంధాలు, ఆకర్షణలు ప్రేమలు, హోమో సెక్సువాలిటీ లాంటి అంశాలను చర్చించింది రచయిత్రి. ఇదే వర్జీనియా వూల్ఫ్ చివరి నవల. ఈ నవల రాసాక వర్జీనియా వూల్ఫ్ ఆత్మహత్య చేస్కుంది. ఈ నవల ఆమె మరణాంతరం ప్రచురించబడింది.

వర్జీనియా వూల్ఫ్ మానసిక అనారోగ్యం కారణాలు
బాల్యంలో తల్లిని, తర్వాత…పెంచిన పిన్నిని కోల్పోవడం, తర్వాత తండ్రి మరణం వర్జీనియా వూల్ఫ్‌ని మానసికంగా క్రుంగ దీశాయి. తల్లిదండ్రుల మరణం తర్వాత ఆమె నెర్వస్ బ్రేక్డౌన్‌కి గురి అయ్యి మానసిక చికిస్తాలయంలో చేరవల్సి వచ్చింది.

దీంతో పాటుగా ఇంట్లో జెండర్ వివక్ష .మగపిల్లలకు పూర్తి స్వేచ్చనివ్వడం ఆడపిల్లలను కట్టడి చేయడం వర్జీనియా వూల్ఫ్‌ని తీవ్రమైన మానసిక వత్తిడికి గురి చేసింది. తండ్రి ఎంత రచయిత, పత్రికా సంపాదకుడు అయినప్పటికీ ఆడపిల్లల విషయంలో ఫ్యూడల్ భావజాలం తోనే ఉండే వాడు.

తల్లి జూలియా స్వయానా ఆర్టిస్ట్, సంఘసేవకురాలైనప్పటికీ భర్త లెస్లీ మాటని జవదాటక పోయేది. మగపిల్లలు మంచి కాన్వెంట్ స్కూళ్ళల్లో, కాలేజ్, కేంబ్రిడ్జి, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ లలో చదువుతుంటే, అడపిల్లలమైన తాము ఇంట్లో తల్లిదండ్రుల ఆధ్వర్యంలో చదవడం వర్జీనియా భరించలేకపోయింది. చిన్నప్పట్నుంచే మానసిక వత్తిడికి లోనయ్యింది.

తర్వాత బాల్యంలో అమెపైన, అక్కపైన, మానసిక వికలాంగురాలైన ఇంకో అక్క లారా పైన సవతి అన్నలు లైంగిక వేధింపులు, అత్యాచారాలు చేయడం …వల్ల ఆమె మరింతగా మానసిక వత్తిడికి, ఫోబిక్ న్యూరోసిస్‌కి, పానిక్ అటాక్స్‌కి గురి అయింది.

ఈ లైంగిక వేధింపులు ఆమె మొత్తం వ్యక్తిత్వ వికాసం మీద తీవ్ర ప్రభావాన్ని చూపించాయి. పురుషులమీద ద్వేషం, అప్పటినించే మొదలయ్యింది అనుకోవచ్చు. అదే సమయంలో తండ్రి కఠినత్వం, నియంతృత్వ ధోరణి కూడా కారణం. బలహీనమైన దేహం ఉన్న స్ర్తీల మీద, తమ దేహం బలంతో, పురుషాహంకారంతో లైంగిక దాడులు చేసే పురుషుల మీద విముఖత పెరిగింది.

అందుకే ఆమె తోటి రచయిత్రి సాక్ విల్లే వెస్ట్ ప్రేమలో పడింది. లైంగిక సంబంధం పెట్టుకుంది. ఆ క్రమంలో వర్జీనియా వూల్ఫ్ చాలా మానసిక వత్తిడికి లోనయ్యింది. భర్తతో సంబంధాల్లో ఉంటూనే ఆమె సాక్ వీల్లే వెస్ట్తో ప్రేమ వ్యవహారంలో ఉండడాన్ని రహస్యంగా ఏమీ ఉంచకపోయినా…. తనకంటే పదిహేను సంవత్సరాలు చిన్నది అయిన సాక్ విల్లేతో సంబంధంలోకి వెళ్లేముందు ఆమె తీవ్ర ఘర్షణకు లోనయ్యింది. ఎందుకంటే, చిన్నదైన తనమీద బాల్యంలో జరిగిన సెక్సువల్ అబ్యూస్ గుర్తుకొచ్చి తనని ప్రేమించి.. ఆ ప్రేమని వ్యక్తపరిచిన సాక్ విల్లే ని వర్జీనియా త్వరగా ఒప్పుకోలేదు. ఆమెలో మానసిక వత్తిడిని పెంచిన అనేక విషయాల్లో ఇది కూడా ఒకటి. తర్వాత తన రచనల మీద పురుష సాహితీ ప్రపంచం విధించిన ఆంక్షలు కూడా ఆమెను బాగా డిస్టర్బ్ చేసాయి. ఓర్లాండోలో ఇదంతా ఆమె రాసింది కూడా. ముఖ్యంగా హోమిసెక్సువాలిటీ, బైసెక్సువాలిటీ, లెస్బియనిసం… లాంటి సంచలనాత్మకమైన నిషేధించబడిన మాట్లాడడానికి కూడా సాహసించని లైంగిక ధోరణులను ఆమె రచనల్లో ప్రస్తావించడమే కాదు, తన జీవితంలో ఆచరించడం అంటే ఉన్నది ఉన్నట్లుగా అంగీకరించడం… సమాజంలో భిన్న లైంగిక ధోరణులు ఉన్న వ్యక్తుల స్వేచ్ఛను గౌరవించడం అనే ప్రతిపాదనలతో ఆమె రచనలు ఉండడం అప్పటి పురుషాధిపత్య సాహిత్యరంగంలో ప్రకంపనలు సృష్టించాయి.. ఆమెపై దాడులకు పురి కొలిపాయి. అంతే కాదు ఆమె ఫెమినిసాన్ని చాలా గొప్పగా తన ప్రతి రచనలో ప్రతిఫలింప చేసింది. స్త్రీల విద్యా, ఆస్తి హక్కులు, స్వేచ్ఛగా రచనలు చేసే హక్కులు గురించి రాసింది. పురుషుల రచనల్లో స్త్రీలను తక్కువ చేసి చూపించడాన్ని ప్రశ్నిస్తూనే ఉంది. ఈ ప్రయాణమంతా కూడా ఆమెలో బాల్యం నుంచే ఉన్న మానసిక గాయాల్ని మరింతగా ఎక్కువ చేశాయి. పైగా మూడు సంవత్సరాల సహజీవనం తర్వాత సాక్ విల్లే వెస్ట్ తో విడిపోవడం ఆమెను మరింత క్రుంగ దీసింది. యుద్ధం తర్వాతి మానవ జీవితాల్లో ప్రవేశించిన విధ్వంసం, తాను కోల్పోయిన ఇల్లు… తాను రాసిన రోజర్ ప్రై బయోగ్రఫీకి మంచి పేరు రాకపోవడం ఇవన్నీ ఆమెను 59 ఏళ్ల వయసప్పుడు కూడా వేదనకు, వత్తిడికి గురిచేసాయి. మానసిక చికిత్స తీసుకున్న తర్వాత బిట్వీన్ ద యాక్ట్స్ నవల రాసింది. తర్వాత మళ్ళీ నెర్వస్ బ్రేక్డౌన్‌కి గురి అయింది. ఆ మానసిక స్థితిలో ఆత్మహత్య చేసుకుంది. భిన్నమైన, వివాదస్పదమైన లైంగిక ధోరణులకు సంబంధించిన సాహిత్య వస్తువులను ఎంచుకుని నిర్భయంగా రాస్తున్నప్పటికీ, సమాజం, కుటుంబం అంగీకరిస్తుందో లేదో అన్న భయాందోళనలకు, తద్వారా మానసిక ఒత్తిడి, తీవ్రమైన విమర్శ ఎదుర్కొంటున్న సమయంలో పశ్చాత్తాపానికీ, నిర్భయత్వానికీ మధ్యలోని ద్విసంవేగ మానసిక స్థితికీ, ఘర్షణ తర్వాత కృంగుబాటు తనానికీ, ప్రతిఫలం వచ్చే ఆత్మహత్యకి సంబంధించిన ఆలోచనలకు లోనవడం వర్జీనియా వూల్ఫ్ లాంటి రచయిత్రుల జీవితాల్లో కనిపిస్తుంది.

వర్జీనియా వూల్ఫ్ గొప్ప, అద్భుతమైన వ్యక్తిత్వం, అంత మానసిక అనారోగ్యంతో కూడా రచనలు చేసే సామాజిక బాధ్యత, నిబద్ధతను మరవకుండా.. నిరంతరం రచనలు చెయ్యడం. రచనే శ్వాసగా జీవించడం, నిర్భయంగా తాను నమ్మిన విశ్వాసాలను, విలువలను బహిరంగంగా తన రచనలలో ప్రచారం చేయడం ఆమె ఎప్పుడూ మానలేదు. ఇదంతా కూడా ఆమె భావజాలం పట్ల, విప్లవాత్మకమైన లైంగిక ఆలోచనలు, ఆచరణల పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉన్నప్పటికీ, సాటి రచయితలు ఆమెను గౌరవించేలా, ఆదర్శంగా తీసుకునేలా చేసాయి. ముఖ్యంగా “రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్” రచయిత్రి కావాలనుకునే ప్రతీ స్త్రీ చదివి తీరాల్సిందే…

వర్జీనియా వూల్ఫ్ ఆత్మహత్య
వర్జీనియా వూల్ఫ్ చివరి నవల ‘బిట్వీన్ ది యాక్ట్’ రాసిన తర్వాత వూల్ఫ్ మళ్ళీ తీవ్రమైన నర్వెస్ బ్రేక్‌డౌన్‌కీ, మానసిక విభ్రాంతికి అంటే డిప్రెషన్‌కి లోనయినది. రెండవ ప్రపంచ యుద్ధారంభ కాలంలో ‘ది బ్లిట్జ్’ సందర్భంగా లండన్‌లో ఉన్న ఆమె ఇల్లు ధ్వంసం అవుతుంది. తన ఇంటి మీది మమకారం వల్ల ఆమె ఇల్లు కూలిపోవడాన్ని భరించలేకపోయింది. కృంగిపోయింది. తర్వాత తన దివంగత స్నేహితురాలు రోజుర్ ఫ్రై జీవిత చరిత్రను వర్జీనియా వూల్ఫ్ రాసింది. దానికి తగినంత స్పందన రాలేదు. పైగా తన ప్రియమైన సహచరి స్టాక్ విల్లేవెస్ట్ దూరమయ్యింది. ఈ కారణాల వలన తీవ్రమైన కృంగుబాటుతో, జీవితేచ్ఛ నశించి, మరణేచ్ఛ వెంటాడగా ఇక ఆమె మానసిక స్థితి బాగా క్షీణించింది. వర్జీనియా ఏ పనీ చేయలేని స్థితికి చేరుకున్నది. ఆమె చావు నించి తప్పించుకోవద్దు అనే రీతిలో 1941 మార్చి 28న తన ఓవర్ కోట్ జేబులలో రాళ్ళు నింపుకుని తన ఇంటికి దగ్గరగా ఉండే నదిలోకి నడిచి వెళ్ళి నీటిలో మునిగిపోయింది. వూల్ఫ్ అస్థి పంజరం 1941 ఏప్రిల్ వరకూ దొరకలేదు. ఆమె భర్త లియోనార్డ్ వూల్ఫ్ ఆమె అస్తికలను ససెక్స్ లోని వారి ఇల్లు రాడ్ మిల్ లో మాం హౌస్ ఉద్యానవనంలో ఎల్మ్ చెట్టు కింద సమాధి చేసారు.

వర్జీనియా ఆత్మహత్య ముందు తన భర్తకు రాసిన లేఖ
“ఈ సారి నేను ఖచ్చితంగా పూర్తిగా పిచ్చిదాన్ని అయిపోతాను అనిపిస్తుంది. మళ్ళీ మనం ఆ పాత దుర్భరమైన రోజుల్లోకి తిరిగి పోలేమనిపిస్తుంది. ఆ బాధ మళ్ళీ భరించలేమేమో? పైగా ఈసారి నేను ఎట్టి పరిస్థితిలోనూ తిరిగి కోలుకోలేను. నాకు ఏవో శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. దేనిమీదా ఏకాగ్రత చూపించలేకపోతున్నాను. అందువలన నాకేది మంచిదో అది నేను చేయబోతున్నాను. నువ్వు నాకు నీకు చాతనైనంత ఆనందాన్ని ఇచ్చావు. ప్రతీసారి నాకు తోడుగా ఉన్నావు. ఇద్దరు మనుషుల మధ్యలోకి, ఇంత భయంకరమైన వ్యాధి వచ్చినపుడు ఇంత బాధ లేకుండా ఎవరూ ఉండలేరు. నాకిక ఈ స్థితిలో పోరాటం చేసే శక్తి లేదు. నీ జీవితాన్ని నాశనం చేస్తున్నానని తెలుసు.

కానీ నేను లేకుండా కూడా నువ్వు పని చేసుకోగలవు. అది నీకు ముందు, అర్థం అవుతుంది. చూడు, ఈ లేఖ కూడా నేను రాయలేకపోతున్నాను. చదవలేక పోతున్నా కూడా. నీ జీవితంలో నీకు నేను ఎంతో ఆనందాన్నివ్వాల్సి ఉంది. అంతగా ఋణపడి ఉన్నాను. నాతో చాలా ఓపికగా, ఎంతో సహృదయంతో ఇన్నేళ్ళూ మెలిగావు. ఇది అందరికీ తెలుసు. నన్ను ఎవరైనా రక్షించారంటే అది నువ్యూ, నువ్వు మాత్రమే అయ్యి ఉంటావు. నీవు నాలో నిండిన నీ మంచితనం తప్ప, నాలో ఉన్నదంతా మాయమయిపోయింది. ఇక నీ జీవితం మరింతగా పాడు చేయదల్చుకోలేదు. మనం ఇద్దరం ఉన్నంత సంతోషంగా ఇంకెవరూ ఉండి ఉండరు.”

మొత్తానికి వర్జీనియా వూల్ఫ్ అర్థాంతరంగా ఆత్మహత్య చేస్కొని చనిపోయింది. బ్రతికి ఉంటే ఇంకెన్ని విప్లవాత్మక రచనలు చేసేదో… స్త్రీలకు సంబంధించిన సమస్త పితృస్వామ్య సంకెళ్ళను ఛేదించుకుంటూ… సవాలు చేస్తూ తాను నమ్మిన విశ్వాసాలతో జీవించింది. అవే విలువలను సాహితీకరించింది. ముఖ్యంగా స్త్రీలను సృజనాత్మక రచయిత్రులుగా కాకుండా చేసే పురుష స్వామ్య ఆంక్షలను కుట్రలను ప్రశ్నిస్తూ, ఆ విషవలయం నుంచి బయటకు వచ్చి సాహిత్య సృజన చేయమని పిలుపునిచ్చింది. తన వ్యక్తిగత జీవితంలో తన భర్తతో లైంగిక జీవనం కొనసాగిస్తూనే తోటి రచయిత్రి, ఉద్యానవన శిల్పి అయిన స్టాక్ విల్లే వెస్ట్‌తో ప్రేమ, లైంగిక సంబంధాన్ని కొనసాగించడంలో అంటే ద్విసంపర్కిగా (బై సెక్సువల్ గా) జీవించడంలో దాన్ని వెరపు లేకుండా బహిరంగపర్చడంలో ఏ మాత్రమూ సంశయించలేదు. సమాజంలో భిన్న లైంగిక ప్రవృత్తి కల మనుషులు ఉంటారని అది సహజమని భిన్న లైంగికతతో ఉండే వారిని గౌరవించాలనీ తన ప్రతీ రచన ద్వారా చెబుతుంది. దాదాపు తన అన్ని రచనల్లో బై సెక్సువాలిటీ, ట్రాన్స్ జెండర్, హోమో సెక్సువాలిటీ లాంటి అంశాలను ఖచ్చితంగా ఆమె చర్చించింది. ‘ఓర్లాండో’ నవలను తన ప్రియురాలు స్టాక్ విల్లే వెస్ట్ కి అంకితం ఇవ్వడమే కాదు ఆ నవల నిండా పురుషుడు నించి స్త్రీగా, స్త్రీ నుంచి పురుషుడిగా మారుతూ భిన్న లైంగిక ప్రవృత్తులలో ఉన్న మానసిక వైరుధ్యాలను, ఘర్షణలను అద్భుతంగా విశ్లేషించింది.

ఇంకొన్నేళ్ళు వర్జీనియా వూల్ఫ్ జీవించి ఉంటే బహుశ మానవ లైంగికతకు సంబంధించిన భిన్నమైన ధోరణులపై అనేక నవలలు, కథలు, వ్యాసాలు రాసి ఉండేదేమో? అలానే ఫెమినిసాన్ని చాలా గొప్పగా ఆవిష్కరించేదేమో? గొప్ప దిఖ్కార స్వరం వర్జీనియా వూల్ఫ్ ఆనాటి ఫ్యూడల్ సమాజంలో గొప్ప విప్లవాత్మకమైన ధిక్కార స్వరం వర్జీనియా వూల్ఫ్.

ఆమె మొత్తం వ్యక్తిత్వం ఆమె తాను రాసుకున్న చిన్న కవితలో ప్రతిఫలిస్తుంది.
ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు.
ఒక స్త్రీగా నాకు ఒక దేశం అవసరమే లేదు.
ఒక స్త్రీగా…
నేను ఉండే స్థలమే దేశం… ప్రపంచం!
అని ఆత్మ గౌరవంతో తన ఉనికిని, అస్తిత్వాన్ని ప్రకటిస్తుంది వర్జీనియా వూల్ఫ్.

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

Leave a Reply