వరిదంటు మొకం

వరిదంటు మొకం
గుండె తడి స్పర్శకై తపిస్తున్న వరిదంటు మొకం
వుండే తొలిగిన బతుక్కి బండి గురిజె ఆకు పసరు

ఎండిన తుమ్మ కంపల పిట్లగూట్లె ఆకలి సలపరింతలు
కాలం తొడిమె తెగి నేలరాలే అనిమేష సూపులు

ఎన్నెన్ని ఉలిదెబ్బలు భరిస్తే
నిలువెత్తు నిలిసే సజీవ శిల్పం బతుకు

మెదడు సానపెట్టుకున్న అక్షరంబుల పొది
కాలం రెక్కల కింద కలం నూరి
కుట్రలను సేదించుకొని
జీవించడం ఇప్పుడు కొత్త యుద్ధ కళ

అవమానాల సుడిగుండాలను దాటడం
నేడు అత్యంత అవసరమైన అభ్యసన జల

నెమలి కన్నులంత విచ్చుకున్న
ఈత కమ్మల గుడిసె నుండి
నేనిప్పుడు నా రెండు రెక్కల మీద
వసంతాలు మోసుకొస్తున్న
పంచవర్ణాల సీతాకోక చిలుకను

దుక్క శకలాలన్నీ పక్కకు తొలుగుతూ
సీకట్లను సీల్చుకొని
వెలుగును వెదజల్లుతున్న పొద్దుపొడుపును.

జననం: ఆరెపల్లి, కోహెడ మండలం, సిద్ధిపేట జిల్లా. కవి, రచయిత, ప్రభుత్వ ఉపాధ్యాయుడు(హిందీ పండిట్ గ్రేడ్- 2). కవితా సంపుటాలు: ఎగిలివారంగ(2008), పో ఇగ పొత్తు కల్వదు(2010), దండెడ(2011), మిగ్గు(2016). నవల: లంద(2019). 'ఎగిలివారంగ' కవిత్వం తెలంగాణ, నాగార్జున విశ్వవిద్యాలయాల్లో పీజీ విద్యార్థులకు పాఠ్యాంశంగా ఉంది. 'తెలుగు, హిందీ దళిత కవిత్వంలో వ్యక్తీకరణ-శిల్పం' అనే అంశంపై తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేస్తున్నారు.

Leave a Reply