ఉపాధ్యాయుల బాధ్యతను హృద్యంగా చిత్రించిన ‘లా లింగ్వా దె లాస్ మారిపోసాస్’

సినిమా అంటే ఆనందం కాదు, సినిమా అంటే ఆలోచన కూడా. మనిషి మేధను పదును పెట్టడానికి మనకి తెలినీ ఎన్నో మానవీయ కోణాలను సమాజాన్ని చూసే దృష్టి ని, మనలోని అవగాహన పటిమను నిరంతరం పదును పెట్టూకోవడానికి సహాయపడే ఆలోచనలను అందించే శక్తి సినిమాకు ఉంది. సినిమానే కాదు ఎటువంటి కళాత్మక ప్రక్రియ అయినా చేయవలసింది అదే. ఆ అంచనాలకు అందనిది ఏదీ పూర్తిగా కళ అనిపించుకోదు. సినిమాను అంత సీరియస్ గా తీసుకునే ప్రజలు ఉన్నారా అంటే. అలాంటి వారిని తయారు చేసుకోవలసిన బాధ్యత కూడా సినిమా అనే కళకు ఉంది. అయన్ రాండ్ చెప్పినట్లు the society gets what it deserves. మనం ఎటువంటి స్థాయికి అర్హులమో అదే మనకు దొరుకుతుంది. మన అర్హతలను పెంచుకోవడం వలనే ఉత్తమ జీవన శైలిని మనం ఆపాదించుకోగలుగుతాం.

అందుకే ఉన్నతమైన మానవ జీవితానికి, ఆలోచనకు చేరువ చేసే సినిమాలని ఎన్నుకుని చూడడం నాకు అలవాటు. అలా నా వద్దకు చేరిన సినిమా స్పానిష్ భాషలో వచ్చిన “లా లింగ్వా దె లాస్ మారిపొసాస్” దీనికి ఆంగ్లంలో THE TONGUE OF THE BUTTERFLIES అని అర్ధం. సినిమా కూడా ఆంగ్లంలో BUTTERFLY’S TONGUE అనే పేరుతోనే దొరుకుతుంది. ఇది 1999 లో వచ్చిన సినిమా.

మాన్చో అనే ఒక చిన్న పిల్లవాని చుట్టూ తిరిగే కథ ఇది. మొదటి సారి పాఠశాల్లోకి ప్రవేశించాక ఆ వాతావరణానికి అలవాటు పడడానికి కొంత కష్టపడతాడు మాంచో. అతనికి పాఠాలు చెప్పే టిచర్ వయసులో చాలా పెద్దవాడు. కాని పిల్లల మనసు తెలుసుకున్న వ్యక్తి. పిల్లల మనసుకు దగ్గరగా వెళ్ళి చదువు చెప్పడానికి ప్రపంచాన్ని వారు చూసే దృష్టితో నే తానూ చూస్తూ ప్రపంచాన్ని, మన చుట్టూ ఉన్న మనుష్యుల స్వభావాలని, వాటిని ఎదుర్కుంటూ జీవించవలసిన విధానాన్ని పిల్లలకు బోధించడానికి చాలా తాపత్రయపడే వ్యక్తి అతను. తన చూట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులో జీవాల్ని ఆసక్తి తో చూస్తూ గమనించమని అతను పిల్లలను ప్రోత్సహిస్తూ ఉంటాడు. అద్భుతమైన కల్పనా శక్తి కల పిలవాడు మాన్చో. ప్రతి దాన్ని నిశితంగా గమనించడం, ఇతరులు చెప్పింది కాక స్వయంగా అనుభవించి నేర్చుకోవాలనే తపన ఆ పిల్లవాని సొంతం. అతనిలో ఈ విశేషాన్ని గమనిస్తాడు అతని టీచర్. తన చూట్టూ ఉన్న ప్రకృతిని, జీవ రాశులను గమనిస్తూ మనుష్యులను అర్ధం చేసుకోవడానికి అతని అవగాహన శక్తిని పెంచుకోవడానికి సహయపడాతాడు అతను. ఇలా పిల్లలతో గడుపుతూనే అతను రిటైర్ అవుతాడు.

మాంచో తండ్రి ఒక రిపబ్లికన్. అతనికి తన ఐడియాలజీ పట్ల చాలా నమ్మకం. తల్లి కుటుంబం కోసం ఆలోచించే ఒక సాధారణ మహిళ. దేవుడన్నా, చర్చ్ అన్నా చాలా నమ్మకం. స్పేయిన్ లో రాజకీయ పరిస్థితులు తారుమారయి నేష్నలిస్ట్లు రిపబ్లికన్లను ఓడించి అధికారంలోకి వస్తారు. ఎందరో రిపబ్లికన్లను అరెస్టు చేస్తారు. వారి చేతిలో శిక్షలు తప్పించుకోవడానికి చాలా మంది రిపబ్లికన్లు తమ పార్టి కార్డులు కాల్చేసి తామూ నేష్నలిస్ట్లమే అని ప్రకటించుకుంటారు. అలా చేయకపోతే భయంకర శిక్షలు అనుభవించవలసి వస్తుందని, మరణ శిక్షలు తప్పవని భయపడి, తమ క్షేమం కోసం, కుటుంబాల కోసం చాలా మంది తమ సిద్దాంతాలను, నమ్మకాలను దాచిపెట్టుకుని నేష్నలిస్టుల గుంపులో చేరిపోయి రాజీ పడిపోతారు.

రాజకీయ పరిస్థితులకు భయపడి మాంచో తల్లి కూడా పార్టి కార్డులు కాల్చేసి భర్తకు సంబంధించిన రిపబ్లికన్ పార్టికి ఆనవాలు ఇంట్లో లేకుండా జాగ్రత్త పడుతుంది. మాంచో తండ్రి తాను కూడా నేష్నలిస్టునే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తాడు. ఈ పని భయం తో చేస్తున్నా అతనికి ఆనందం ఇవ్వదు. ఓడిపోయిన భావన జీవితంలోని సారం అంతా ఎవరో తోడిసినట్లు, తాను మనిషిగా చనిపోయినట్లు ఎంతో భాధను అతను అనుభవిస్తాడు.

కొందరు రిపబ్లికన్లు రాజీ పడరు. తమ భద్రతకు భయపడి తమ ఆదర్శాలను, నమ్మకాలను వదులుకోవాలనుకోరు. అలాంటి వారిని అరెస్టు చేస్తుంది ప్రభుత్వం. అలా అరెస్టు అయిన వారిని నగరంలో అందరి ముందు హాజరు పరిచి, అవమానించి వారిపై రాళ్ళు రువ్విస్తుంది సైన్యం. అలా రాళ్ళు రువ్విన వారందరూ నేషనలిస్టులని, దేశభక్తులని వారి వాదన. రిపబ్లికన్లమని అరెస్టయిన వారి స్నేహితులు, బంధువులు, వారితో కలిసి పని చేసిన వారు, తమ సిద్దాంతాల కోసం చాలా త్యాగాలు చేసిన వారు. దేశాన్ని ప్రేమించిన వారు. కాని ఇప్పుడు వారిని గౌరవించిన వారు అందరూ ప్రభుత్వ నియంతృత్వానికి భయపడి, తాము గౌరవించిన వ్యక్తుల మీద, తలవంచని వారి ఆత్మస్త్యైర్యం మీద రాళ్ళు రువ్వి తమ దేశ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తారు.

సైనికులు అరెస్టు చేసిన వారిలో మాంచో తన టిచర్ ని కూడా చూస్తాడు. జనం అంతా నినాదాలు ఇస్తూ వారిని దేశ ద్రోహులని అరుస్తూ వారి పై రాళ్ళు రువ్వుతూ తమ దేశ భక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తుండడం కూడ గమనిస్తాడు. తన టీచర్ గొప్పతనం, తనతో అతని అనుబంధం, తనను కళ్ళు తెరుచుకుని ప్రపంచాన్ని చూడమని అతను నేర్పించిన విద్య అన్నీ అతనికి గుర్తుకు వస్తాయి. రాళ్ళు రువ్వుతున్న దేశభక్తులకీ, రాళ్ళు రువ్వుంచుకుంటున్న దేశద్రోహులుగా ముద్ర పడిన ఆ ఖైదీల మధ్య వ్యక్తిత్వాల తేడా అతని చిన్ని మనసు గ్రహిస్తుంది. రాళ్ళు రువ్వుతున్న వారిలో అతని తల్లీ తండ్రి కూడా ఉంటారు. అందరినీ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు మాంచో. తన మార్గాన్ని నిర్దేశించుకోవలసిన సమయం, అవసరం అతనికి ఆ చిన్నతనంలోనే వస్తుంది.

అతని తల్లి అతని చేతికి కూడా రాళ్ళని ఇచ్చి అవి విసరమని అతన్ని బలవంత పెడుతుంది. చిన్నవాడిగా తల్లిని ఎదిరించలేడు. మనసు చెబుతున్న దాన్ని కాదనలేడు. ఒక ఎనిమిది సంవత్సరాల పిల్లవాడిలో ఆ ద్వైద్వి భావాన్ని చూపించే సన్నివేశం అద్భుతంగా ఉంటుంది. తల్లి కోరినట్లు వారిపై రాళ్ళు విసురుతున్నప్పుడు ఎవరికీ అర్ధం కాని పని ఒకటి అతను చేస్తాడు. ప్రభుత్వం తరుపున నినాదాలకు బదులుగా తన టీచర్ తనకు చెప్పిన పాఠాలను పెద్దగా అరుచుకూంటూ పైకి చెప్పడం మొదలెడతాడు. చేతులు రాళ్ళు విసురుతున్నా అతని నోరు టిచర్ చెప్పిన పాఠాలను గుర్తు చేస్తూ ఉంటుంది. గుంపులో సైనికులు ఇది చిన్న పిల్లవాని చర్యగా అనుకుని అతన్ని వదిలేస్తారు. కాని ఆ పిల్లవాన్ని సరిగ్గా అర్ధం చేసుకున్న ఆ టిచర్ ముఖంలో విజయరేఖ ఒక కనీ కనిపించని చిరునవ్వు రూపంలో కనిపిస్తుంది. రాళ్ళు విసురుతున్న ఆ బాలుని మనసులో తను వేసిన వ్యక్తిత్వం అనే బీజం అంకురించిందని, అది మొలకెత్తుతుందని, ఆలోచిస్తుందని, పెరిగి పెద్దదవుతుందని, నియంతృత్వానికి విరుద్దంగా ఒక ఆశయంగా పని చేస్తుందనే భరోసాను ఆ చిన్న పిల్లవాని చర్య ఆ టీచర్లో కలిగిస్తుంది.

ఈ రోజు తనకు అనుకూలంగా లేక పోవడం వలన తాను నిస్సహాయుడి నయ్యానని ఒక రోజు తనలోని అగ్ని పెరిగి పెద్దదయ్యి తనను శక్తిమంతుడిగా తీర్చిదిద్దినప్పుడు తన ప్రతి చర్య మరోలా ఉంటుందని, దేశ పరిస్థితి పట్ల ఆశ చంపుకోనక్కర్లేదని మంచో ఖైదీగా మరణానికి దగ్గరవుతున్న తన టిచర్ కు ఇచ్చిన గురు దక్షిణ అద్భుతంగా ఉంటుంది. ఎన్ని రకాలుగా అధికారం తన బలంతో ఆలోచనలను చిదిమివేయాలని ప్రయత్నించినా నిజాన్ని బలహీన పరిచినా ఆ అధికారానికి ఎదురొడ్డే వ్యక్తిత్వాలను ఆలోచన అనే అంకురం తో తయారు చేయగలిగే ఉపాధ్యాయుల బాధ్యతను చాలా హృద్యంగా చిత్రించిన చిత్రం ఇది. అప్పటి దాకా పిచ్చివాడుగా కనిపించిన ఆ పిల్లల టీచర్ ఎంతటి బాధ్యతాయుతమైన పని చేసారో అర్ధం అయ్యి ఒక తెలియని ఆనందం కలుగుతుంది.

1936 లోని స్పెయిన్ రాజకీయ సంక్షోభం నేపద్యంలో వచ్చిన సినిమా ఇది. టీచర్ డాన్ గ్రెగోరియో పాత్ర చాలా రోజుల వరకు వెంటాడుతుంది. హోసే లూయిస్ క్యుయెర్దా దీని దర్శకులు. ఈ సినిమాలో రాజకీయ పరిణామాలే కాకుండా ప్రపంచంలో ఎన్నో విషయాలను ఆసక్తి తో పరిశీలించే బాల్యం కనిపిస్తుంది. ఆడ మగ సంబంధాలను గమనిస్తూ వాటిని అర్ధం చేసుకోవడానికే కష్టపడే ఒక చిన్న బాబు అవస్త చూస్తాం. సీతాకోక చిలుకల నాలుకలు వెనుక వింతలను బోధిస్తూ ఆ టీచర్ చెప్పిన పాఠంను, నేర్పించిన కొత్త పదాలను తన నాలుకతో పలికిస్తూ చివరకు ఆ టీచర్ ను గెలిపించిన ఆ చిన్న బాలుని నటన ఆకట్టుకుంటుంది. అలాంటి సీతాకోక చిలుకలను తయారు చేయగలిగితే దేశ భవిష్యత్తు పట్ల బాధ పడవలసిన అవసరం లేదనే సందేశంతో సినిమాను దర్శకుడు మలచిన విధానం వలన ఈ సినిమా నేను మెచ్చిన గొప్ప సినిమాలో ఒకటిగా నాతో ఉండిపోయింది.

పుట్టిన ఊరు సికింద్రాబాద్. రచయిత్రి, అధ్యాపకురాలు. హిందీ సాహిత్యంలో పీహెచ్డీ చేశారు. ఆసక్తి: పుస్తకాలు, సినిమాలు. తార్నాకలోని Spreading light అనే బుక్ క్లబ్ లో ఎనిమిదేళ్లుగా  ప్రతి శనివారం పుస్తక పరిచయాలు నిర్వహిస్తున్నారు. ఫేస్‌బుక్‌లో 'నచ్చిన పుస్తకం', 'నచ్చిన సినిమా' గ్రూపుల్లో 1000 పుస్తకాలు, 1500 పైగా సినిమాలను పరిచయం చేశారు. రైల్వే జూనియర్ కాలేజీ(తార్నాక)లో హిందీ లెక్చరర్ గా పనిచేస్తున్నారు.

 

 

 

One thought on “ఉపాధ్యాయుల బాధ్యతను హృద్యంగా చిత్రించిన ‘లా లింగ్వా దె లాస్ మారిపోసాస్’

  1. జ్యోతి ! చాలా మంచి పరిచయం. మంచి సినీమా. మీరు చెప్పినట్లు సినీమా అంటే ఆలోచన‌ ,మనిషి మెదడును పదునుపెట్టేంందుకు సహాయపడేది సినీమా. చాలా మంచి పీఠికరాశారు. సమాజాన్ని ప్రతిబింబించేది సినీమా. నేడు సినీమాను ప్రతిబింబిస్తోందో తెలియటంలేదు.

Leave a Reply