లబ్‌ పే ఆతీహైఁ దువాఁ…

”ఇస్కూల్‌ కో హమారే మియా అప్నే ఖుద్‌ కే తనఖాసే కిత్నే మరమ్మతా కర్వాయే పూరీ దునియాకో మాలూమ్‌. అరె సుమైరా బేటీ కీ షాదీ కే లియే బ్యాంక్‌ మే రఖ్ఖే సో సాట్‌ హజార్‌ రూపయ్యా నికాల్కో ఇస్కూల్‌ కె లియే ప్రొజెక్టర్‌ ఖరీదే. ఉస్కె బాద్‌ హీ ఇస్కూల్‌ మే బచ్చొన్కా హాజరీ బడ్‌గయా. అయిసే ముద్రిస్‌ (టీచర్‌) కో సస్పెండ్‌ కర్తయిన్‌? ఏ కిత్నా నా ఇంసాఫీ హై. కుచ్‌ భీ న ఖారై, నా పీఁ రై. రోజ్‌ ఇస్కూల్‌ కె పాస్‌ జాకో దూర్‌ సే దేక్కే ఆఁతే హైఁ,” హఫీజ్‌ ఆలీ భార్య నుస్రత్‌ బేగం దుఃఖంతో కదిలిపోతూ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ అన్నది. (నా షోహార్‌ స్కూల్‌ కోసం తన స్వంత డబ్బు పెట్టి ఎన్నో మరమ్మత్తులు చేయించడం ఈ లోకమంతా చూసింది. నా బేటీ సుమైరా నిఖా కోసం బ్యాంకులో వేసిన డబ్బులు కూడా తీసేసి స్కూల్‌ పిల్లల కోసం ప్రొజెక్టర్‌ కొన్నారు. అది కొన్నాకే పిల్లల హాజరి పెరిగింది. తిండి తిప్పలు అన్నీ మానేసి రోజూ స్కూల్‌ దాకా పోయి దూరం నించి పిల్లలను చూసి వస్తున్నారు. ఇటువంటి మంచి ముద్రిస్‌ని సస్పెండ్‌ చేస్తారా?).

”ఇంత మంచి హెడ్‌ మాస్టర్‌ వీళ్లకు ఎక్కడ దొరకాలీ, పాఠాలు ఎగ్గొట్టినందుకు కాదు, లంచాలు తీసుకున్నందుకు కాదు, పిల్లలను గొడ్డును బాదినందుకు కాదు ప్రార్థనా గీతం పాడించినందుకు సస్పెండ్‌ చేస్తారా? శరం కీ బాత్‌ హై ఏ తో (సిగ్గు పడాల్సిన విషయం ఇది) నా కొడుకు సల్మాన్‌ అయితే స్కూల్‌కి పోవడమే మానేశాడు హఫీజ్‌ ముద్రిస్‌ ఉంటేనే పోతా అంటున్నాడు. ఏడవకు నువ్వూరుకో నుస్రత్‌ పక్కింటి అమీనా బేగం తల పట్టుకొంటు అంది. చుట్టూ పిల్లలు కళ్ళ నీళ్లతో చూస్తున్నారు.

”ఆప్‌ చుప్‌ బైటియే బేగమ్‌… రో మత్‌… బచ్చే హైరాన్‌ హోరైఁ దేఖ్ఖియే… ముఝె కుచ్‌ నహీ హోగా ఆప్‌ కీ కసమ్‌… చుప్‌ హో జాయియే…” (నాకేమీ కాదు మీరు ఏడవకండి… పిల్లలు హైరాన అవుతున్నారు చూడండి…) అంటూ హఫీజ్‌ ఆలీ తన బేగంను ఓదారుస్తున్నాడు.

”పిల్లలూ మీరంతా స్కూలుకెళ్ళాలి. ఇలా ఎగ్గొట్టకూడదు. మీకు నాకంటే మంచి హెడ్మాస్టరు వస్తాడు. మీ గురించి చాలా జాగ్రత్తలు తీస్కుంటూ ప్రేమగా చూస్కుంటాడు. నా మాట వినండి లెండి” అంటూ హాఫీజ్‌ ఆలీ కళ్ళు తుడుచుకుంటూ తనూ లేచాడు.

”మీరు కూడా రండి ముద్రిస్‌…” మూడవ తరగతి చదువుతున్న అర్బాజ్‌ తన చేతులతో హఫీజ్‌ ఆలీ చేయి పట్టి లాగాడు. ”అలాగే అర్బాజ్‌ బాబా… పద నేను వస్తాను” అన్నాడు హఫీజ్‌ ఆలీ… ”వహ్‌ శక్తి హమే దో దయానిధీ గానా భీ హమ్‌ నహీఁ గాయేంగే ముద్రిస్‌…” తొమ్మిదో తరగతి చదువుతున్న ఆదిల్‌ కోపంగా అంటుంటే ”అలా అనద్దు ఆదిల్‌… పదండి స్కూల్‌కెళ్దాం” అంటూ హఫీజ్‌ పిల్లలందరితో స్కూల్‌ వైపు నడిచాడు.

*** ***

”అమ్మా… అంటూ పిలిచాడు కోదండ్రామ్‌ ”ఏంట్రా” అంటూ పలికింది కృష్ణాదేవి పెనం మీద రొట్టె కాలుస్తూ ”నేను మా హెడ్మాస్టరు వచ్చే వరకూ బడికి పోను” అన్నాడు పదో తరగతి చదువుతున్న కోదండ్రామ్‌.

”తప్పు అలా అనకూడదు. కొత్త హెడ్మాస్టర్‌ వచ్చారు. త్వరగా తిను” అంటూ కంచంలో రొట్టె కూర పెట్టి ఇచ్చింది. ”నాకొద్దు నేను తినను” అంటూ లేచి పోయాడు. కోదండ్రామ్‌. అప్పటికే ఆదిల్‌ బయట ఎదురుచూస్తున్నాడు ఇద్దరూ బడివైపు కాకుండా ఇంకెటో నడిచారు.

*** ***

”పొద్దున్నా ఏం తినలేదు కొంచెం తిను కోదండ్‌” కృష్ణాదేవి బ్రతిమలాడింది. ఎప్పటిలాగే వద్దన్నాడు కోదండ్‌. తండ్రి సురేంద్ర తల పట్టుకు కూచున్నాడు. కోదండ్‌ మౌనంగా డాబా పైకెక్కాడు. హఫీజ్‌ టీచరు లేని స్కూలుకు వెళ్ళలేక పిచ్చోడిలాగా రోడ్ల మీద తిరుగుతున్నాడు దోస్తులతో. అతనే కాదు దాదాపు తొంభై శాతం మంది పిల్లలు స్కూలుకు వెళ్ళడం మానేసారు.

”లబ్‌ పే ఆతీ హైఁ దుఁవా బన్‌ కే తమన్నా మేరే” మొహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన పాట ఉర్దూ పుస్తకంలో చూసి భావం నచ్చి తనూ ఆదిల్‌, ఆతిఫ్‌, హుస్సేన్‌, రవి, మురళీ, సతీష్‌, బ్రిజేష్‌, నవనీత్‌ వెళ్ళి హెడ్మాస్టరుని అడిగాం. ”ఈ పాట ఈ రోజు ఉదయపు ప్రార్థనలో పాడతాం” అంటే అనే ఆయన ఒప్పుకున్నారు.

”వహ్‌ శక్తి హమే దో దయానిధీ ఈ పాట కూడా ఎప్పటిలాగే పాడాలి రోజు విడిచి రోజు పాడండి” అన్నారు. ”అది కూడా సిలబస్‌లో ఉంది కదా” అన్నారు. మహేందర్‌ మాత్రం ‘దయానిధీ’ పాట మాత్రమే ప్రభాత్‌ ప్రార్థనలో పాడాలి, అది ఇక్బాల్‌ పాట ఒద్దంటాడు.

ఆ రోజు ఉదయపు ప్రార్థనలో ఆ పాట పాడుతున్నప్పుడే అక్కడి లోకల్‌ వీహెచ్‌పీ లీడర్‌ మహేందర్‌ వచ్చాడు. తమ నోట ఆ ప్రార్థన విని అగ్గిలా దహించుకుపోయాడు ”ఆపండి, ఆపండి” అని రంకెలు వేసాడు. హెడ్మాస్టరు హఫీజ్‌ ఆలీపైన ”మదర్శా ప్రార్థనలు పాడిస్తావా హిందూ పిల్లలతో?” అని మీద మీదకి పోయాడు. తమతో సహా పిల్లలందరూ హెడ్మాస్టరు పైకి అతను రాకుండా అడ్డంగా కమ్ముకున్నారు. ఆయన హెడ్మాస్టరు మొఖం మీదకు తన కాషాయ కండువా విసిరికొట్టి వెళ్ళిపోయాడు.

”ఇది ఐక్యతా గానం ఇందులో మత భావన ఎక్కడుందీ? కాకపోతే మొహమ్మద్‌ ఇక్బాల్‌ పాట ఇది 1902లో దేశ విభజనకు ముందే రాసాడు. మా పిల్లలు అందరూ వహ్‌ శక్తి దో హమే దయానిధీ ప్రార్థనా గీతం కూడా పాడతారు సాబ్‌” అని హెడ్మాస్టర్‌ ఎంత చెప్పినా వింటేనా?

మరునాడే హెడ్మాస్టర్‌కి సస్పెన్షన్‌ ఆర్డర్‌ వచ్చింది.

ఏముంది ఆ పాటలో?

ఈ దేశాన్ని రక్షించే శక్తి ఇమ్మనీ

ముసలీ వాళ్ళనీ – బీదలను ఆదరించే

హృదయాన్నిమ్మని ప్రార్థించే మాటలు తప్ప?

ఎంత బాగా చూస్కునే వాడని హెడ్మాస్టరు తమని? చిన్నప్పట్నించీ చూస్తున్నాడు తను… పాతగా అయి పోయి పెచ్చులూడి బూజుపట్టిన స్కూలు తన స్వంత డబ్బులతో మరమ్మత్తు చేయించారు. మంచి శుభ్రమైన బట్టలు వేస్కోవాలని చెప్పేవారు. చెదిరిన జుట్టుని గడ్డం పట్టుకొని సరిగ్గా దువ్వేవారు ఎంతో ప్రేమగా. నాన్నగారు కూడా ఎప్పుడూ అలా దువ్వరు. పిల్లల్ని ఆకలితో మాడనిచ్చేవారు కాదు. ఎన్ని సార్లడిగినా తిరిగి, తిరిగి పాఠాలు అర్థం అయ్యేంత వరకూ చెప్పేవారు. పిల్లలెవరికైనా బాగోపోతే ఇళ్ళకొచ్చి మరీ చూసి తల్లిదండ్రులకి డబ్బులు చేతిలో పెట్టేవారు. కట్టలేని పిల్లల ఫీసులు కట్టడమే కాదు, పుస్తకాలు కొనిపెట్టేవారు. తనకలా చాలాసార్లు ఫీసు కట్టారు.

”బాగా చదవాలి బేటా” అనేవారు తల నిమురుతూ.. అలాంటి దేవుడు లాంటి హెడ్మాస్టరును సస్పెండ్‌ చేస్తారా? అసలా విహెచ్‌పీ మహేందర్‌ అంటేనే మంచి పేరు లేదెక్కడా అక్కడంతా… తనకైతే అస్సలు ఇష్టం లేదు. ఎప్పుడూ జర్దా నములుతూ మందిరమని లేదు, మస్జిద్‌ అనీ లేదు, తుపుక్కున ఉమ్మేస్తాడు వాళ్ళది పాల వ్యాపారం, ఆవులున్నాయి. తాము మహేందర్‌ కొట్టంలోనే పాలు కొంటాము.

ముస్లిమ్స్‌ దగ్గరా, ఎస్సీల దగ్గరా ఆవుల్ని వాళ్ళు చంపుతున్నారని దాడి చేసి కొట్టి, తన కొట్టంలో కట్టేసి, పాల వ్యాపారం చేస్తుంటాడు. వాటిని అమ్ముకుంటారు. జునైద్‌ వాళ్ళ నాన్న మంచి పాలిచ్చే మూడు ఆవుల్ని ఎత్తుకెళ్ళిపోయాడు, చంపేస్తున్నారని బుకాయించి, జునైద్‌ వాళ్ళ నాన్నను కొట్టి మరీ. జునైద్‌ వాళ్ళ నాన్న హోటల్లకు పాలూ, పెరుగూ సప్లై చేస్తాడు. ఇప్పుడు వాళ్ల ఆధారమంతా పోయింది. ఎంత ఏడ్చారో ఇంటిల్లి పాదీ.

”ఎందుకమ్మా అట్లా జునైద్‌ వాళ్ళ ఆవుల్ని ఎత్తుకెళ్ళిపోయారూ?” అని తన అమ్మ అడిగితే… ”వాళ్ళు చంపేస్తారటరా… ఆవుని తల్లి, దేవతా అని కూడా చూడకుండా” అంది అమ్మ. ”ఎవరు చెప్పారే అమ్మా వాళ్ళు చంపేస్తారని నువ్వు చూసావా” తనడిగితే, అమ్మ సాలోచనగా కనుబొమలు లేపుతూ ”లేదురా… మహేందరూ… ఆ రామాలయం పూజారి లేడూ శంకర్‌నాథ్‌… ఆయన చెప్పారు” అంది అమ్మ. ”ఆవు తల్లి, దేవత ఎలా అయ్యింది అమ్మా… అది కుందేలు కాకిలాగా జంతువు కదా…” అన్నాడు తను. ”ఉష్ష్‌… ఊరుకో కోదండ్రాం ఆవునట్లా అనకూడదు పాపం తగులుతుంది” అంది అమ్మ అటూ ఇటూ చూస్తూ… నాన్నమ్మ వింటుందేమోనన్న భయంతో.

కానీ ఒక రోజు తనూ అమ్మా పాలకోసం మహేందర్‌ ఇంటికెళ్తే, బ్రష్షు పళ్ళ మధ్య పెట్టి నములుతూ, తుపుక్కునా ఉమ్ముతూ, ఆవు పాలివ్వటం లేదని కర్రతో తెగబాదుతున్నాడు. ఆవు కళ్ళల్లోంచి నీళ్ళు కారుతున్నాయి. గాయాల నించి రక్తం వస్తోంది. అయ్యో అలా కొడితే పాలిస్తుందా… అసలు అంత ఎలా బక్క చిక్కిందీ? మేత సరిగ్గా ఇస్తున్నావా లేదా? ఆ జునైద్‌ దగ్గరున్నప్పుడెంత ముద్దుగా ఆరోగ్యంగా ఉండేవీ? ఏం పెట్టే వాడో కనుక్కో… ముందా కొట్టటం ఆపు” అని అరిచి మహేందర్‌ చేతిలో కర్ర తీసి దూరానికి విసిరేసింది.

ఆవు రక్తం చూసి ఏడుస్తున్న తనని పట్టుకుని వచ్చేసింది. ”అమ్మా జునైద్‌ ఆవులు తిరిగి ఇవ్వడా మహేందర్‌?” తనడిగాడు… ఏమో వెధవ… ఏం ఇస్తాడూ కొట్టి చంపుతున్నాడు… చస్తే కబేళాకు ఇచ్చేస్తాడు ఏం చేస్తాడు? అంది అమ్మ. వాడి దగ్గర పాలు కొనద్దు అని తను గొడవ చేసి మాన్పించాడు. అమ్మ కూడ తొందరగానే ఒప్పుకుంది మానడానికి… అలాంటి మహేందర్‌ తమ హెడ్మాస్టర్‌ని సస్పెండ్‌ చేయిస్తాడా? కోదండ్రామ్‌కు కోసం ఎక్కువ అవసాగింది.

తన చేతిలో ఉన్న పుస్తకాన్ని ప్రేమగా నిమిరి గుండెలకు హత్తుకున్నాడు. హెడ్మాస్టరు ఇప్పిచ్చిందే ఆ పుస్తకం. రేపు మళ్ళీ ముదర్రిస్‌ ఇంటికి వెళ్ళాలి ముదర్రిస్‌ అన్న పిల్లలు సోహైల్‌, ఆఫ్‌తాబ్‌, రాషిద్‌, నూర్‌ వచ్చారు శెలవులకి ఆగ్రా నుంచి వెళ్లి కలవాలి. వాళ్ళు తనకు మంచి స్నేహితులు.

*** ***

”కరాగ్రే వసతీ లక్ష్మీ హాఁ రోజూ ఉదయపు ప్రార్థనల్లో గాయత్రీ మంత్రాలు సంస్కృత శ్లోకాలు, హనుమాన్‌ చాలీసా, రామనామ జపం చేయాల్సిందే,” సోహైల్‌ అంటున్నాడు. ”ఇదిగో ఈ అరచేతిలో ఇక్కడ లక్ష్మీ, ఇక్కడ దుర్గా ఇక్కడ సరస్వతీ, గోవిందుడూ, గోమాతా ఉంటాయి” అంటూ తన అరచేతిని చూపిస్తున్నాడు ఆఫ్‌తాబ్‌. రషీద్‌ పద్మాసనం వేసి ”ఇది ప్రాణామాయ, యోగా” అంటూ గాలి పీల్చి వదులుతున్నాడు.

”రోజూ నా కొడుకులు మక్కా వైపు తిరిగి నమాజ్‌ చేయరు. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, గోవు పటాల వైపు తిరిగి ప్రార్థన చేస్తారు” కళ్ళ నీళ్ళు కక్కుకుంటూ అంటోంది సోహైల్‌ అమ్మీ రుక్సానా.

”నేను హిందువునా, ముస్లిమనా?” అర్థమే కాదు. నాకు ఏ మతాల మీద నమ్మకం లేదు కానీ స్కూల్లో మాత్రం బలవంతంగా కంప్యూటర్‌పైన ”శ్రీరాముడు నా స్నేహితుడు” అని వందసార్లు టైప్‌ చేయిస్తారు. ”నేను ఈ దేశానికి చెందిన వాడిని కాదా? రోజూ ఉదయపు ప్రార్థనలో హనుమాన్‌ చాలీసా, గాయత్రీ మంత్రాలు హిందూ శ్లోకాలు చదివి నా దేశభక్తిని నిరూపించుకోవాలా?” షోహైల్‌ అంటున్నాడు ముఖం ఎర్రబడుతుందే…

”అసలు సరస్వతీ విద్య మందిర్‌లో చదివించడం ఎందుకు? మళ్ళీ బాధపడడం ఎందుకు?” పక్కింటి పెద్ద మనిషి ఉస్మాన్‌ ఖాన్‌ అంటుంటే… ”మదర్శాలలో సరైన చదువు లేదు. కాన్వెంటుల్లో చదివించే శక్తి లేదు. సరస్వతీ విద్యా మందిర్‌లలో ఫీసులు తగ్గిస్తాం మా స్కూల్లో చేరండి అని అంటే అందరిలాగే మేమూ అటే వెళ్ళాం. అయినా చెప్పుల ఫాక్టరీలో పని చేసే బీదవాళ్ళం. మాకిదే చాతనవును. మంచి సర్కారు బడి కూడా లేదు మా దగ్గర” అన్నాడు సోహైల్‌ అబ్బా నవాజ్‌. వింటున్న కోదండ్రామ్‌ ఆశ్చర్యపోయాడు. ”ఏదీ కరాగ్రే వసతే లక్ష్మి” శ్లోకం చదువు అన్నాడు సోహైల్‌ను.

కరాగ్రే వసతే లక్ష్మీ
కరమధ్యే సరస్వతీ
కరమూలే తూ గోవింద్‌
ప్రభాతే కరదర్శనమ్‌

సోహైల్‌ చదువుతూ పోయినాడు.

వీళ్ళ స్కూల్స్‌లో వీళ్ళతో హిందూ సంస్కృత శ్లోకాలు చదివిస్తారు. అదే తమ స్కూల్లో ఇక్బాల్‌ కవి రాసిన పాట పాడితే హెడ్మాస్టరును సస్పెండ్‌ చేస్తారా… కోదండ్రామ్‌కు రక్తం మరిగినంత పనైంది. ”నేను హనుమాన్‌ చాలీసా కూడా చదవగలను చదవనా?” ఆఫ్‌తాబ్‌ అంటున్నాడు. రుక్సానా ఖంగారు ”నైఁ దీదీ… స్కూల్లో ఈ సంస్కృత పద్యాలు చదివినా సాయంత్రం మభ్‌తబాకి ఖురాన్‌ చదవడం కోసం పంపిస్తాం” అంది గబగబా…

”స్కూల్లో ఘోష్‌ (ఎద్దు మాంసం) తినద్దంటారు. ఇంట్లో అమ్మీ, బావాకు చెప్పమంటారు. లంచ్‌ ముందు ‘భోజన మంత్రం’ చదివిస్తారు. ఏ మతాన్ని నమ్మాలి? అర్థం కావడం లేదు” మళ్ళీ షోహైలే అంటున్నారు. ”చాలా ఒత్తిడి అయోమయం అనిపిస్తుంది. చదువుకు తక్కువ, ఇవన్నీ ఎక్కువ… భారత దేశం హిందువులదే అనమంటారు. అందరి రక్తంలో ఒకే మతం, ఒకే సంస్కృతి ప్రవహిస్తుంది. మేం హిందువులం అని వందసార్లు కంపోజిషన్‌ రాయమంటారు. వాళ్ళ మోరల్‌ సైన్స్‌ టెక్ట్స్‌తో అంతా ఇదే.

బడికి వెళ్ళేది ఇందుకా? వాళ్ళు హిందువులు కారని ఎవరన్నారు? మనమంతా ఈ దేశ వాసులమే కదా… స్కూలు కెళ్ళాలంటే భయం వేస్తుంది. ఈ పెదాలు వాళ్ళ కోసం శ్లోకాలు చదివినా హృదయం మాత్రం ఖాళీగా ఉంటుంది. అక్కడేం లేదు కూడా… బడే అబ్బా… వాళ్ళు మేం ఇంజనీర్లం, డాక్టర్లం, అస్ట్రోనాట్‌లు కావాలా వద్దా చెప్పరు, మా లక్ష్యం దేశ భక్తులం కావటం మాత్రమే అని చెప్తారు. మా ప్రశ్నా పత్రాల్లో మనందరి తల్లి అయిన జంతువు ఎవరూ, సీతా మాత ఆదర్శ స్త్రీ అవునా కాదా… ఇవే ఉంటాయి. ఆవు కంపోజిషన్‌, శ్రీరాముడి కంపోజిషన్‌ రాయాలి.” పదవ తరగతిలో ఉన్న సోహైల్‌ విషణ్ణ వదనంతో అంటుంటే… కోదండ్రాం కదిలిపోయాడు.

”సోహైల్‌ రేపు మేం ఏం చేస్తున్నామో తెలుసా ఇలా రా” అంటూ తన వైపు ఒంగిన సోహైల్‌ చెవిలో రహస్యంగా ఏదో చెప్పారు. ”రావాలి, మీరందరూ రావాలి” అంటూ ”కల్‌ మీలేంగే దోస్త్‌” అంటూ సోహైల్‌ను ఆలింగనం చేస్కున్నారు. ”బడే అమ్మీ, హమ్‌సే భాయీ బుల్‌వాతే హైఁ క్యోఁ బడే అమ్మీ” (పెద్దమ్మా మా అమ్మాయిలతో మగపిల్లలందర్నీ అన్నా, చెల్లి అని పిలిపిస్తారు ఎందుకు పెద్దమ్మా?) అంటూ గెంతులు వేస్తూ నుశ్రత్‌ను అడుగుతూన్నది రెండో తరగతిలో ఉన్న నూర్‌… మళ్ళీ తనే… ”హమ్‌ సబ్‌ కీ మాతా గోమాతా హైఁ క్యాఁ… హమ్‌ జానవరోఁకో పైదా హుయే క్యాఁ? ఛీఁ – నైతో… మైఁ అమ్మీ కో పైదా హుయీ…” అంటూ ముఖం చిరాగ్గా పెట్టింది (మనందరి తల్లి గోమాతనా? మనం అందరం జంతువులకి పుట్టామా, ఛీ, కాదు. నేను మా అమ్మీకి పుట్టాను).

ఇదంతా చూస్తున్న హఫీజ్‌ ఆలీ ముదర్రిస్‌ తల పట్టుకుని ‘చలో బాతాఁ బంద్‌ కరో ఖానా ఖాయేంగే ఉఠో సబ్‌’ అన్నాడు. (మాటలు మానేసి అన్నం తిందాం అంతా లేవండి) మనసులో ఆందోళనను అణుచుకుంటూ. ”మన అందరి తల్లి గోమాతా హై” అంటూ కిల కిలా నవ్వింది నూర్‌.

*** ***

ఆ రోజు సంభాషణతో నిద్రపట్టని నవాజ్‌ కళ్ళ ముందు ఒక్కసారిగా తన పిల్లలే కాదు… ఆ సరస్వతీ విద్యా మందిర్‌ స్కూల్లో చదివే పిల్లలంతా కనపడ్డారు. నవాజ్‌ మొఖం చిన్నబోయింది. ఆగ్రాలో యమునా తీరంలో బీద హిందూ – ముస్లిం కుటుంబాలు మేస్త్రీలు, కార్మికులు, టెయిలర్లు, చిన్న చిన్న ఉద్యోగస్తులు, రోడ్లూడిచే వాళ్లు, చెప్పుల ఫ్యాక్టరీలో పని చేసేవాళ్లు, కరెంటు పని చేసేవాళ్లు, హోటళ్లలో, కప్పులు కడిగేవాళ్ళు నవాజ్‌్‌ కళ్ళముందు బీదరికంలో చిరిగిపోయి మాసికలు పట్టిన బట్టలతో ఆ మురికి వీధుల్లో లుకలుకలాడుతూ కనపడ్డారు.

వాళ్ళ పిల్లలంతా, ఎక్కువగా తమ ముస్లిమ్స్‌ పిల్లలు ఆ సరస్వతీ విద్యామందిర్లలో చదువుతారు. అక్కడి మదర్శాలనుంచీ పక్కనే ఉన్న ముస్లిమ్‌ స్కూలు నించీ… పిల్లలంతా సరస్వతీ స్కూల్సుకి వెళ్ళసాగారు. తన పిల్లలు సోహైల్‌, ఆఫ్‌తాబ్‌, రాషిద్‌, నూర్‌లను కూడా అందులో వెయ్యమని రోజూ ఆ స్కూలు నించి ముసర్రిద్‌లు వచ్చి ”మంచి చదువు, తక్కువ ఫీజు ఇంగ్లీష్‌ అర్థం కాకపోతే… హిందీలో కావలిస్తే ఉర్దూలోనైనా చెబుతాం” అంటూ ఒత్తిడి తెచ్చేవాళ్ళు.

పిల్లలు కూడా ”అబ్బా దాఖిల్‌ కర్‌దో నా… మదర్శాలో కంప్యూటర్‌ చదువుండదు వీళ్ళైతే చెప్తారు” అంటూ గొడవ చెయ్యసాగారు. పక్కింటి జఖీర్‌ ఖాన్‌ కూడా తన నలుగురు పిల్లలను అందులో వేసేసాడు. ”కంప్యూటర్‌ పడాతై” అనుకుంటూ పిల్లల ఆశ పెరిగి పోయింది. ఒక పక్క ముస్లిమ్‌లను శత్రువులుగా చూస్తున్నారు. మరో పక్క, వాళ్ళ బళ్ళల్లోకి ముస్లిం పిల్లలను చేర్చుకోవడానికి తహతహలాడుతూ ఉన్నారు.

”ఇస్కా మత్‌లబ్‌ క్యాహై… జఖీర్‌ భాయీ” అని అడిగాడు నవాజ్‌ ఆందోళనగా. ”జాదా సోచోఁ నక్కో ఆంగ్రేజీ, కంప్యూటర్‌ పడాతే హైఁ బస్‌… అరే మియాఁ బచ్చోఁ కో క్యాఁ కర్తై… ఇస్కూల్‌ మేఁ గాఁయ్‌ నహీ పాల్తే హైనా మార్నేకో? పడ్‌కే ఆ జాఁతే హైఁ బస్‌ దాఖిల్‌కర్‌దే మియాఁ” అన్నాడు జాఖీర్‌ తన భుజం మీద చెయ్యి వేస్తూ… తానేదో పిల్లల రక్షణకు భరోసా ఇస్తున్నట్లుగా (ఎక్కువ ఆలోచించకు, ఇంగ్లీషూ, కంప్యూటర్‌ చదివిస్తారు అంతే. అరే మీయాఁ పిల్లల్నేం చేస్తారు స్కూల్లో పిల్లలేమైనా ఆవుల్ని తోలతారా… వాళ్ళు కొట్టటానికీ? చదువుకుని వచ్చేస్తారు అంతే, చేర్పించేయ్‌ మియాఁ) పిల్లల్నేం చేస్తారా… మొన్న పద్దెనిమిదేళ్ళ కరీంను ఆవుల్ని కొనుక్కొస్తూంటే, కబేళాకు తీస్కెళ్తున్నాడని కొట్టి కొట్టి ఒళ్ళంతా రక్తాలు కారేలా చేసి రోడ్డు మీద పడేసి ఆవుల్ని ఎత్తుకుపోలేదూ… కరీం కోలుకోడానికి మూన్నెల్లు పట్టింది.

కాలు మీద ఇనుపరాడ్లతో కొట్టారేమో కాలు విరిగిపోయింది. ఇప్పటికీ కుంటుతూనే ఉన్నాడు. కుంటి కాలుతో తిరేగే కరీంలో తన కొడుకులు కనిపిస్తున్నారు. వెంఠనే తన ఇంట్లో ఉన్న పాలిచ్చే రెండు ఆవులను అమ్మేసాడు. తను అమ్మే దాకా రుక్సానా ఏడుస్తూనే ఉంది. ”మేరే బచ్చోఁకో భీ మార్తే హైఁ ఓ లోగ్‌” (నా పిల్లల్ని కూడా చంపేస్తారు వాళ్ళు) అని… పోనీ… వాళ్ళ బడి సరస్వతీ విద్యామందిర్‌లో వేస్తే అన్నా పిల్లలు భద్రంగా ఉంటారేమో… అన్పించింది. ఆ రోజు తన నలుగురు పిల్లలనూ సరస్వతీ విద్యా మందిర్‌ దగ్గరికి బయలుదేర దీసాడు. పిల్లలు ”నయా స్కూల్‌… నయా స్కూల్‌” (కొత్త స్కూలు) అని సంతోషంగా, ఉన్న బట్టల్లోనే, ఉతికిన బట్టలు వేస్కున్నారు. ”అమ్మీ నయేఁ ఇస్కూల్‌ మేఁ క్యాఁ పడాతే? పదేళ్ళ నూర్‌ సంబరంగా అడుగుతోంది తల్లి రుక్సానాని. (అమ్మీ కొత్త ఇస్కూల్లో ఏం చదివిస్తారు?) ”కంప్యూటర్‌ పడాతే బేటీ” అంది మురిపెంగా రుక్సానా (కంప్యూటర్‌ చదివిస్తారు తల్లీ) వెంటనే నూర్‌ సంతోషంగా గెంతులేసింది.

తన ముగ్గురు పిల్లల్ని తీసుకుని తమ మురికి వాడలోనే మదర్సా గోడను ఆనుకునే ఉన్న సరస్వతీ విద్యా మందిర్‌లోకి అడుగుపెట్టాడు తను భయం భయంగా.. భయమెందుకు వాళ్ళే వెంటబడి పిలిచారుగా అని తనకు తాను ధడా ధడా కొట్టుకునే గుండె పైన అర చేత్తో రుద్దుకుంటూ ‘యా అల్లాఁ’ అనుకుంటూ తడబడే పాదాలను స్కూలు లోపలికి పెట్టి ఒక్కసారిగా నిర్ఘాంత పోయాడు. అది స్కూలులాగా ఉందా…

నిజానికి సరస్వతీ విద్యామందిర్‌ స్కూలు గోడ ముఘల్‌ కాలంలో కట్టిన ఇత్మద్‌ – ఉద్‌ – దౌలా అంటే బచ్చా తాజ్‌ మహల్‌ స్థూపానికి ఆనుకొని ఏంటీ? ఆ మహల్‌ గోడకీ అంటుకునే, ఆ గోడనే ఆనుకునే ఉంది సరస్వతీ విద్యామందిర్‌. బచ్చా తాజ్‌మహల్‌ స్థూపం ఒకటి స్కూలు కంటే ఎత్తుగా పైకి లేచి ఉంటుంది. దాని మీద దుర్గా దేవిది అతి పెద్ద చిత్రపటం అంటించి ఉంది.

కింద స్కూలు గోడల మీద కాషాయి రంగు పెయింట్‌ వేసి ఉంది. ఆ గోడల మీద కోపంగా చూస్తూ చేతికి పెద్ద పొడవైన కత్తితో యుద్ధానికి, ఎవరినో చంపెయ్యడానికి పోతున్నట్లున్న శ్రీరాముడు, క్రూరంగా చూస్తూన్న హనుమంతుడు, సరస్వతీ, గోవిందుడు, ఆవుల చిత్రపటాలున్నాయి. అది స్కూలులాగా ఉందా అసలు, గుడిలా ఉంది కానీ? కనీసం దేశ జాతీయ జెండా లేదు. అంతెత్తున పెద్ద కాషాయి జెండా గాలికి టపటపామని కొట్టుకుంటూ ఊగుతున్నది.

తనను చూడగానే తనను గుర్తుపట్టిన స్కూలు కార్యకర్త భువన్‌ పరిగెత్తుకుంటూ వచ్చాడు… రండి రండి అంటూ ప్రిన్సిపాల్‌ కమ్‌రాలోకి తీస్కెళ్ళాడు. లోపల వివేకానందుడు, ఎవరో సర్కార్‌ అని రాసి ఉన్న ఫోటోలున్నాయి. ప్రిన్సిపాల్‌ నుదుట మీద ఇంత పెద్ద కాషాయ రంగు బొట్టుంది.

”భువన్‌ మీ గురించి చెప్పాడు” అంటూ తన పిల్లల వైపు మెరుస్తున్న కళ్ళతో చూస్తూ తాపీగా తల ఊపుతూ ”ఊఁ మీ పిల్లల్ని మంచి దేశభక్తులుగా తీర్చిదిద్దుతాం. మేం చెప్పినట్లు వింటూ, నేర్చుకుంటే చాలు మీ పిల్లలు దేశంలో సురక్షితంగా ఉంటారు… వెళ్ళండి దాఖలు చేయించండి” అన్నాడు భువన్‌ వైపు తిరిగి చెయ్యి తలుపు వైపు చూపిస్తూ… అక్కడ కొద్దిమంది పిల్లలు తెల్ల చొక్కా, గోధుమ రంగు నిక్కర్‌ నుదిటిపై ఎర్ర కుంకుమ బొట్టుతో భక్తిగా చేతులు కట్టుకుని ఉన్నారు. ఏదో బోధన వింటూ ఆగినట్లున్నాయి వాళ్ళ చూపులు.

*** ***

దేశభక్తులుగా తీర్చిదిద్దటం ఏమిటీ… పెద్దోడు ఇంజనీరుగా, చిన్నోడు డాక్టరుగా నూర్‌ అయితే రాకెట్‌లో ఆకాశానికి ఎగిరే చదువు చదువుతానంటుంది… వీళ్ళేమిటీ, ఇప్పుడు దేశభక్తులుగా లేమా తాము. ఈ చిన్న పిల్లలూ? అవమానంగా అనిపించింది తనకు. అవమానాన్ని గుక్కిళ్ళుగా మింగుతూ తను అయోమయంగా భువన్‌ని అనుసరించాడు.

అప్పటికే భువన్‌ పిల్లల్ని కంప్యూటర్‌ ల్యాబ్‌లోకి తీస్కెళ్ళాడు. పిల్లలు మెరుస్తున్న కళ్ళతో విభ్రమంగా చూస్తున్నారు. నూర్‌ అయితే గెంతులేస్తున్నది. ఇంతలో స్కూలు గంట మోగింది… పిల్లలంతా గ్రౌండ్‌లో జమయ్యారు. ”ప్రభాత్‌ ప్రార్థన జరుగుతుంది రండి” అంటూ భువన్‌ తామందిరినీ గ్రౌండ్‌లోకి తీస్కెళ్లారు.

జఖీర్‌ కొడుకులు కాదూ… మునవ్వర్‌, అఫ్స్‌ర్‌ ఇద్దరూ గొంతెత్తి ముందు వరుసలో పిల్లలందరికీ అభిముఖంగా నిలబడి గాయత్రీ మంత్రం చదువుతున్నారు. తర్వాత హనుమాన్‌ చాలీసా చదివారు చివర్లో వందేమాతరం చదివి… ‘గర్వ్‌ సే కహోఁ హిందూ హై హమ్‌’ అని నినాదాలు ఇచ్చారు (నేను హిందువునని గర్వంగా చెప్పు) జావేద్‌ వీరావేశంతో ఢోలక్‌… వాయిస్తున్నాడు.

తనకు రోమాలు నిక్కబొడుచుకున్నాయి.

”అబ్బా ఫీజ్‌ భర్‌దో… దేర్‌ మత్‌ కరోఁ…”

సోహైల్‌ తనను కుదుపుతో అంటుంటే, ఈ లోకంలోకి వచ్చాడు తను.

*** ***

”స్కూల్లో రామ మందిరం ఉంది. ముస్లిమ్‌నని నన్ను చెప్పులు విడిచి కాళ్ళూ చేతులూ కడుక్కుంటేనే రానిస్తారు. హిందూ పిల్లలు అయితే అట్లానే వెళ్లిపోతారు.

”దీప్‌ జ్యోతి మంత్రం, గాయత్రీ మంత్రం నాకు నోరు తిరగటం లేదు. నేను పోను” అని నూర్‌ ఒకటే ఏడుపు.

”ఢోలక్‌, తబ్‌లా, డ్రమ్ములు వాయించడం నేర్పిస్తున్నారు. నాకు స్పోర్ట్స్‌లో ట్రైనింగ్‌ కావాలని ఉందన్నా వినటం లేదు యోగా ప్రాణామాయా చేయిస్తున్నారు అని మమ్మల్ని కాన్వెంట్‌ స్కూళ్లో వెయ్యి అబ్బా మదర్శా వద్దు, సరస్వతీ విద్యామందిర్‌ వద్దు” అంటూ ఆఫ్‌తాబ్‌ విసుక్కుంటాడు.

”వెళ్ళిన రెండో రోజే బీఫ్‌ తినకూడదు అంటూ మా లంచ్‌ బాక్స్‌లు చెక్‌ చేస్తున్నారు అబ్బా” అప్పటి దాకా లావా మింగుతున్నట్లున్న పెద్దోడు సోహైల్‌.

ఆ రాత్రి నిద్ర పట్టలేదు పిల్లల హోంవర్క్‌ పుస్తకాలు చెక్‌ చేస్తే కళ్ళు తిరిగాయి.

కూతురు నూర్‌ పుస్తకంలో ఆదర్శ స్త్రీ సీతామాత ”ప్రతి బాలుడు నాకు అన్న అవుతాడు” వందసార్ల కంపోజిషన్‌ ఆఫ్‌తాబ్‌ పుస్తకంలో శ్రీరాముడు నాకు మంచి స్నేహితుడు వందసార్లు కంపోసిషన్‌ ఇంకా చాలా సంస్కృత శ్లోకాలున్నాయి. ఏం చెయ్యాలి?

నవాజ్‌కి ఇదంతా గుర్తుకొస్తున్నది. ఏం చెయ్యాలీ… తనకు చెప్పుల ఫ్యాక్టరీలో పని చేస్తే వచ్చే జీతం ఈ పిల్లల్ని ఇంగ్లీష్‌ కాన్వెంటులో వెయ్యటానికి కాదు కదా గల్లీలోని ముస్లిమ్‌లు నడిపే స్కూల్లో వెయ్యడానికి కూడా సరిపోదు.

‘కరాగ్రే వసతే లక్ష్మీ’… నవాబ్‌ ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు… ఆఫ్‌తాబ్‌ నిద్రలో శ్లోకం కలవరిస్తున్నాడు… నవాబ్‌ కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నవాజ్‌కి సోహైల్‌ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. ”అబ్బా న హమ్‌ హిందూ బనేంగే, న ముసల్మాన్‌. హమ్‌ ఇన్సాన్‌ హైఁ… హమే ఇంజినీర్‌ బన్‌నా హై… ముస్లిం ఇస్కూల్‌ మేఁ వాపస్‌ దాఖిల్‌ కర్‌దో… హమే మాత్స్‌, ఫిసిక్స్‌ పడ్‌నా హైఁ, మదర్శా నక్కో, సరస్వతీ విద్యామందిర్‌ నక్కో… అల్లాకే బారే మే ఘర్‌ మేఁ పడ్‌ లేంగే… హమ్‌ మెహ్‌నత్‌ కర్కే పడ్‌ లేంగే… ఏ సబ్‌ హమే బర్దాష్ నహీ హోతా హైఁ” కళ్ళ నీళ్ళతో ‘శ్రీరాముడు నా స్నేహితుడు’ కంపోసిషన్‌ చూపిస్తూ సోహైల్‌ అంటున్నాడు. (అబ్బా మేం హిందువులుగా లేదా ముసల్మాన్లుగా తయారవము. మేం మనుషులుగా తయారవుతాము. నేను ఇంజనీర్‌నీ కావాలి. ముస్లిం స్కూల్లో మమ్మల్ని తిరిగి చేర్పించెయ్యి. మాత్స్‌, ఫిసిక్స్‌ చదవాలి నేను. మదర్శా వద్దు, సరస్వతీ విద్యామందిర్‌ వద్దు. అల్లా గురించి కావలిస్తే ఇంట్లో చదువుకుంటాం. స్కూలు చదువు కష్టపడి ఏదైనా బయట పని చేసుకుంటూ చదువుకుంటాం. ఇదంతా నాతో భరించశక్యం కావటం లేదు.)

ఎంత వేదన, ఒత్తిడి భరిస్తున్నారు పిల్లలు? వెంటనే ఆ పాత ముస్లిం స్కూల్లోనే వేస్తాను తిరిగి. కావలిస్తే సోహైల్‌ను ఏ టైలర్‌ షాపులోనో సాయంత్రం పూట పనికి కుదిర్చి ఆ డబ్బుతో ఇంగ్లీషు ట్యూషన్‌ పెట్టిస్తే సరిపోతుంది అనుకున్నాడు నవాజ్‌. నవాజ్‌ మీద ఆకాశంలోని ఇంటి పైకప్పు చూరులోంచి దూరిన వెన్నల పరుచుకుంది. నవాజ్‌ పెదాలపై చిరునవ్వు వచ్చి చేరింది. పక్కనే నిద్రపోతున్న కొడుకులను సంతృప్తిగా చూస్కున్నాడు నవాజ్‌. ప్రశాంతంగా నిద్రపోయాడు నవాజ్‌ ఆ రాత్రి.

కోదండ్‌రామ్‌, నరేష్‌, సనత్‌, బ్రిజేష్‌. కాశ్యప్‌, అర్షద్‌, అజీజ్‌, ఆఫ్‌తాబ్‌, జునైద్‌, జావేద్‌, సురేందర్‌, లక్ష్మి, సుజన. ఇంకా చాలా మంది పిల్లలు స్కూలు ముందు ధర్నా చేస్తూ నినాదాలు ఇస్తున్నారు.

దేశ్‌కి రక్షా కౌన్‌ కరేగా…
హమ్‌ కరేంగే… హమ్‌ కరేంగే…
కైసే కరేంగే… కైసే కరేంగే
తన్‌సే కరేంగే… మన్‌సే కరేంగే…

నినాదాలు ఇస్తూ…

అందరికంటే అర్దగా ఉన్న కోదండ్‌…

పెద్దగా ఉన్న కోదండ్రామ్‌, ఆదిల్‌ మాట్లాడదామని లేచారు.

”మా ముదర్రిస్‌ లేని లోటు ఎవరూ పూడ్చలేరు. మాకు మా హెడ్మాస్టర్‌ కావాలి. ఈ స్కూలు ఆయనే మంచిగా చేసారు. మా ముదర్రిస్‌తో మహేందర్‌ చేసింది చాలా తప్పు, అన్యాయం. ఆయన తిరిగొస్తేనే మేం స్కూల్‌కి వస్తాం లేకపోతే లేదు సిలబస్‌లో ఉన్న పాటే మేం భావం నచ్చి పాడాం. పాత స్కూలును హెడ్మాస్టరు తన స్వంత ఖర్చుతో బాగు చేసి మేం ఎంతో చదువుకునేలా చేసారు. ఆయిన పాడమనలేదు. మేమే ఇక్బాల్‌ కవి పాట నచ్చి పాడాం. కోదండ్రామ్‌ ఆగాడు. వెంటనే ఆదిల్‌ అందుకొని ”ఉర్దూ సిలబస్‌లో ఇక్బాల్‌ దేశభక్తి పాట ఐక్యమత్యాన్ని సూచిస్తుంది. అలాగే హమ్‌ కో వహ్‌ శక్తి దే దయానిధీ పాటా సిలబస్‌లో ఉంది. ఈ పాటని సిలబస్‌లో పెట్టిందీ ప్రభుత్వమే మరి ప్రభుత్వాన్ని సస్పెండ్‌ చేస్తారా చెప్పండి” ఆదిల్‌ ప్రశ్నకు. ”చెయ్యాలి, చెయ్యాలి… సర్కారుని సస్పెండ్‌ చేయాలి” అని పిల్లలంతా అరిచారు. ”సోహైల్‌ ఏదీ లేచి ‘కర్రాగ్రే వసతే లక్ష్మీ శ్లోకం’ మీ స్కూల్లో రోజూ మీతో చదివించేది చదువు” అన్నాడు, కోదండ్రామ్‌.

షొహైల్‌ అప్పటి దాకా ధర్నా చేస్తున్న పిల్లల గుంపు బయట నిల్చున్నవాడు కాస్తా ధైర్యంగా ముందుకొచ్చి కర్రాగ్రే వసతి లక్ష్మి శ్లోకం చదివి ముందు వరుసలో కూర్చున్నాడు. వెంటనే రాషీద్‌, ఆఫ్‌తాబ్‌, నూర్‌ కూడా సోహైల్‌ పక్కన కూర్చున్నారు. ”అరే మరి సరస్వతీ స్కూల్లో చదవమని ఎవడడిగాడు పోయి మదర్శాలో చేరండి… బత్తమ్మీజ్‌ బచ్చే… ఫీజు తక్కువని ఎగబడి ఎగబడి చేరడం కాదు” దూరం నించి మహేందర్‌ ముఠాలోని గూండాలాంటి వాడు అర్చాడు…

”ఏ ప్రార్థన అయితే ఏం… ఎవరు పాడితేనేం? దేశం గురించి అయితేనేం… మానవత్వం గురించి అయితేనేం… ఉదయపు ప్రార్థన ఆ రోజుని మనం ధైర్యంగా, ప్రశాంతంగా ఎదుర్కొనే శక్తిని ఇస్తుంది అంతే కానీ మత ప్రార్థన కిందికి దీన్ని తేకండి మా హెడ్మాస్టరు ఏనాడూ మమ్మల్ని మత ప్రార్థన చేయమని అడగలేదు. అంతెందుకు ఇదే ఇక్బాల్‌ కవి ”సాఁరే జఁహాసే అచ్చా హిందూసితా హమారా” రాసారు… అది తెలుసా మీకు? కోదండ్రామ్‌ ఆవేశంగా అన్నాడు.

”అరే హెడ్మాస్టర్‌ లేడని నా కొడుకు నాలుగు రోజులైంది అన్నం తిని. సస్పెన్షన్‌ ఎత్తెయ్యండి, పిల్లలకు హిందూ – ముస్లిం తేడా లేదు. ముదర్రిస్‌ చాలా మంచోడు” అని భోరున ఏడ్చింది కోదండ్‌ రామ్‌ తల్లి, కృష్ణాదేవి.

కోదండ్రామ్‌ మాట్లాడుతూనే ఉన్నాడు. అంతా కల్సి మళ్ళీ నినాదాల ఎత్తుకున్నారు.

లేతగా ఉన్న పిల్లల గొంతు మారుమ్రోగుతున్నది అక్కడ…

”మా హెడ్మాస్టర్‌ మాకు కావాలి…” అంటూ మూడవ తరగతి సురేందర్‌ ఇచ్చిన నినాదాన్ని మళ్ళీ పిల్లలు అందుకున్నారు.

ఇంకో పక్క ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బురానాథ్‌ ”మా హిందూ కవి తులసీ దాస్‌ ఏనాడూ ముఘల్‌ రాజు అక్బర్‌ను తన రాజుగా ఒప్పుకోలేదు. తిరస్కరించాడు. అక్బర్‌ కాళ్ళ మీద తులసీ దాస్‌ పడనే లేదు. ఇదే నిజం” అంటూ మైకు ముందు గొంతు చించుకుంటున్నాడు.

*** ***

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

2 thoughts on “లబ్‌ పే ఆతీహైఁ దువాఁ…

  1. నేటి దేశపరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపించారు. అద్భుతమైన కథనంతో చదివించేలా రాసారు. చాలా బాగుంది.

  2. Thanks wahed garu….Bharatha దేశంలో ముస్లిమ్స్ రెండు మతాల మధ్య,మెజారిటీ మత ఆధిపత్యం ,హింసా క్రౌర్యాలలో ఎంత నలిగి పోతున్నారో….అల్లా అని నోరారా దువా చేయలేని భయంకర పరిస్థితులు….గుండెల్లో మస్జీద్ మక్కాల ను మూసేసుకొని..పెదవులతో sushkanga ,భయాందోళనలు,బెదిరింపుల మధ్య, రామనామ జపాలు, హనుమాన్ చాలీసాలు చదవాల్సిన స్థితి లోకి నెట్టబడడం…ఈ దేశ లౌకిక శక్తులకు బలమైన సవాలుగా మారింది.హిందూత్వ వాదులు సాంస్కృతికంగా ప్రజల్లోకి చొచ్చుకు పోయినట్లు గా లౌకిక ,మేధో శక్తులు వెళ్లలేక పోవడమే హిందుత్వ బలం…

Leave a Reply