రోడ్లు వడ్లు

రోడ్ల మీద ఆరబోసిన వడ్లు
పల్లెంల మెరిసే అన్నం మెతుకులు

నల్లటి రహదారులకు అటూ ఇటు
పరచుకున్న పసుపు వర్ణపు దినుసులు
లోకుల ఆకలి తీర్చే వంటల పంటలు

ఖరీఫ్ కాలంలో ఊరూరి దారులన్నీ
వరి ధాన్యపు సుందర దృశ్యాలు

రోడ్లంటే ర్యాలీల్లో నడిచిన పాదాల అచ్చులు
రోడ్లంటే మర్లబడ్డ గడ్డపారలు
రోడ్లు ఇయ్యర మయ్యర కొట్లాడిన గొంతుకలు
పల్లె రహదారులన్నీ పరితపించే ఆకలి మంటలు

ఇది అన్నం పూర్వ స్వరూపం
బాటలోనే గిట్ల వడ్లు ఎండ పోస్తం
వంటలు వండి పంక్తి భోజనాలూ పెట్టినం
రహదారి మీదనే రాజ్యం తల దింప్పిచ్చినం
రోడ్లు అనేకానేక సాంస్కృతిక వేదికలు

కాలం నవ్వు మొఖమై వెలుగుతంది
నీళ్లునిండి అలుగులు దునుకుతున్న ధ్వని
సందు లేకుండా పండిన వరి పైర్లు
పల్లె పల్లెనా కల్లాల కళాత్మకత

వానాకాలం పంటలప్పుడు
రోడ్లకు వడ్ల సెలవులు ఇయ్యాలె
దారులన్నీ ధాన్యంతో నిండిపోవాలె

పుట్టింది పోతారం, హుస్నాబాద్ మండ‌లం, సిద్ధిపేట జిల్లా. క‌వి, ర‌చ‌యిత‌. పంచాయ‌తీరాజ్ శాఖ‌లో సీనియ‌ర్ స‌హాయ‌కుడు. ర‌చ‌న‌లు తొవ్వ‌, న‌డ‌క‌, మంక‌మ్మ‌తోట లేబ‌ర్ అడ్డా, వ‌రి గొలుసులు, బువ్వ‌కుండ‌(దీర్ఘ‌క‌విత‌)లాంటి క‌వితా సంక‌ల‌నాలు ప్ర‌చురించారు. వివిధ పుస్త‌కాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు.

Leave a Reply