విశాలమవుతున్న రైతు ఉద్యమం

అధికార మార్పిడి జరిగి ఏడు దశాబ్దాలు దాటినా నేటికీ, దేశ జనాభాలో అత్యధికంగా ఉన్న రైతాంగ దుస్థితి మాత్రం మారలేదు. దేశానికి వెన్నెముకగా చెప్పబడే రైతు దశాబ్దాలుగా ఉరికొయ్యలకు వేలాడుతూనే ఉన్నాడు. పెట్టుబడి అనుకూల పాలక విధానాల ఫలితంగా రోజు రోజుకూ వ్యవసాయం భారంగా మారుతోంది. ఇలాంటి స్థితిలో రైతును పెనం మీది నుంచి పొయ్యిలో పడేసింది కేంద్రం ప్రభుత్వం. కేంద్రం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు వ్యవసాయ రంగాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టనున్నాయి.

కార్పోరేట్ ప్రయోజనాల కోసం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్, హర్యానా రైతాంగం ఏడాది క్రితం ప్రారంభించిన ఉద్యమం కొత్త చరిత్రను లిఖిస్తోంది. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిషన్‌ ప్రతిపాధించిన కనీస మద్దతు ధర, పెట్టుబడిపై యాభై శాతం లాభం అంశాలను రైతాంగం ఇవ్వాళ ప్రధాన డిమాండ్ గా వినిపిస్తోంది. మొదటి సారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ముందు రైతులకు పెట్టుబడిపై యాభై శాతం లాభం చేకూర్చుతామని హామీ ఇచ్చింది. కానీ బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టిన తరువాత కనీస మద్దతు ధర కూడా కాగితాలకే పరిమితమైంది.

రైతులకు పెట్టిన పెట్టుబడి రాకపోగా, కనీస మద్దతు ధర కూడా లభించకపోవడం, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు తగ్గడం, ఉన్న కేంద్రాల్లో కొనుగోళ్లు జరగకపోవడం లాంటి అధనపు సమస్యలు వ్యవసాయాన్ని భారంగా మార్చాయి. ఇలాంటి తరుణంలో ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నూతన వ్యవసాయ చట్టాలు, రైతాంగాన్ని సొంత భూముల్లోనే కూలీలుగా మార్చేందుకు దారులువేయనున్నాయి.

ఓవైపు దేశమంతా కోవిడ్ మహమ్మారితో పోరాడుతున్న కాలంలో ప్రభుత్వం నూతన వ్యవసాయ చట్టాల ఆర్డినెన్స్ లను తీసుకువచ్చింది. ఆర్డినెన్స్ లు చేసిన 2020 జూన్ నాటికి ముందు దేశంలో లాక్ డౌన్ కొనసాగుతోంది. ఈ వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు మేలు జరుగుతుందని పాలకులు పదే పదే నమ్మించేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ తెరవెనక జరుగుతున్న కుట్రను మాత్రం వెల్లడించం లేదు. చట్టాలు చేయడానికి చాలా ముందే అదానీ గ్రూపుకు చెందిన అదానీ అగ్రి లాజిస్టిక్స్‌ లిమిటెడ్‌ కు వ్యవసాయ ఉత్పత్తులను నిల్వ చేసుకునేందుకు 75,000 టన్నుల సామర్థ్యం గల గోదాముల నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అదానీ గ్రూప్ హర్యానాలో గోదాముల నిర్మాణం చేపట్టింది. నూతన చట్టాల అమలుతో ఉనికిలో రానున్న కాంట్రాంక్ట్ ఫార్మింగ్ వల్ల వ్యవసాయ భూములు, పంటలు కార్పోరేట్ల కంబంధ హస్తాల్లోకి చేరనున్నాయి.

భూములన్నీ, పంటలన్నీ కార్పొరేట్ల వశం చేసే ఈ చట్టాల వల్ల నష్టపోయేది రైతు మాత్రమే కాదు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలపై ఈ ప్రభావం ఉండనుంది. ఆహార భద్రత కరువై, కార్పోరేట్లు చెప్పిన ధరలకు వ్యవసాయ ఉత్పత్తులను కొనుగోలు చేయాల్సిన దుస్థితి దేశ ప్రజలకు దాపురిస్తుంది. ఈ ప్రమాదాన్ని గుర్తించిన పంజాబ్, హర్యానా రైతాంగం వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఉద్యమాన్ని తీవ్రం చేశారు.

గత సంవత్సరం నవంబర్ లో ఛలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంయుక్త కిసాన్ మోర్చ ఆధ్వర్యంలో లక్షలాది రైతులు దేశ రాజధానికి చేరుకున్నారు. వారిని ఢిల్లీ సరిహద్దుల్లోనే అడ్డుకున్న పోలీసులు రైతులపై విచక్షణా రహిత దాడికి పాల్పడ్డారు. అయినా వెను దిరగకుండా లక్షలాది మంది రైతులు ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించారు.
300 రోజులకు పైగా ఢిల్లీ సరిహద్దుల్లోనే బైఠాయించిన భారతదేశ రైతాంగం ప్రపంచ దృష్టిని ఆకర్షించారు. అంతర్జాతీయంగా రైతాంగ ఉద్యమానికి విస్తృత మద్దతు లభిస్తోంది. ఈ నేపథ్యంలో రైతాంగ ఉద్యమాన్ని అణచివేసేందుకు నీతిమాలిన నిందారోపణలనూ ప్రయోగిస్తోంది ప్రభుత్వం. రైతుల్లో ఖలిస్తాన్‌ ఉగ్రవాదులు, మావోయిస్టు అనుకూలురున్నారనడంతో పాటు, చైనా, పాకిస్తాన్‌ దేశాలు రైతు ఉద్యమం వెనుకున్నాయనే దాకా కేంద్ర పెద్దలు దిగజారిన వ్యాఖ్యలు చేశారు.

కుట్రలన్నిటినీ ఎదిరిస్తూ మొక్కవోని దీక్షతో పోరాడుతున్న రైతాంగంపై అక్రమ కేసులు బనాయించింది ప్రభుత్వం. తాజాగా అధికార పక్షం అహసనం హత్యలకు బరితెగించేవరకు వెళ్లింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతాంగంపై కారును తోలి నలుగురు రైతులను హత్య చేశాడు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రా. పాలకులు కార్పోరేట్ ప్రయోజనాల కోసం ఎంతటి దారుణాలకైనా ఒడిగడతారనడానికి ఇది ఒక ఉదాహరణ. నిజానికి భౌతిక దాడులు, హత్యలకు ముందు దశలో పాలకులు రైతు ఉద్యమంపై తీవ్రమైన విమర్శలు గుప్పించారు. అసత్య ప్రచారం గావించారు. ఇది కేవలం ఒక రాష్ట్రానికి మాత్రమే చెందిన ఉద్యమమన్నారు. బీజేపీ పెయిడ్ ఆర్టిస్ట్ లు కొందరు ఏకంగా రైతులను డబ్బులు తీసుకొని ఉద్యమం చేస్తున్నారని అవమానించారు. వీటన్నిటినీ ఎదిరించి నిలబడ్డది రైతాంగ ఉద్యమం. పాలక కుట్రలను ఓడించడంలో భిన్న సమూహాలతో రైతాంగం ఏకమై పోరాడుతోంది. ఈ ఉద్యమంలో కర్షకులతో అన్ని వర్గాలకు చెందిన ప్రజలూ భాగమవుతన్నారు.

మహిళల పాత్ర…

ప్రస్తుత రైతు ఉద్యమంలో మహిళల పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వ్యవసాయం అంటేనే మహిళ భాగస్వామ్యం లేకుండా సాగేది కాదు. వ్యవసాయంపై ఆధారపడే రైతులు ఆందోళన చేస్తున్నప్పుడు అందులో మహిళల పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఏ చారిత్రిక పోరాటంమైనా మహిళ భాగస్వామ్యం లేకుండా విజయవంతం కాలేదు. 1928 రైతు ఉద్యమంలోనైనా, భారత స్వాతంత్య్ర పోరాటంలో నైనా మహిళలు చెప్పుకోదగిన పాత్ర పోషించారు.

మహిళలు కేవలం వ్యవసాయం, ఇంటి పనులు, పిల్లల సంరక్షణకు మాత్రమే పరిమితం అయిపోలేదు. అందుకే.. ప్రస్తుత రైతు ఉద్యమంలోనూ వాళ్లు క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లోనే కాదు పంజాబు, హర్యానా రాష్ట్రల్లో ప్రధాన ఉద్యమాన్ని అనుసంధానం చేస్తూ క్షేత్ర స్థాయిలో ఉద్యమ చైతన్యాన్ని సజీవంగా ఉంచడంలో కీలక భూమిక పోషిస్తున్నారు. నెలల తరబడి రైతులు ఆందోళనల్లో పాల్గొంటున్నప్పటికీ పంజాబు, హర్యానా రాష్ట్రాల్లో సాగుకు ఎలాంటి ఆటంకం కలగలేదు. పురుషులు, పిల్లలు ఉద్యమంలో పాల్గొంటుంటే కుటుంబంతో పాటు వ్యవసాయాన్నీ మహిళలే చూసుకుంటున్నారు. విత్తనాలు వేయడం మొదలు పంటను తీసే వరకూ అన్ని పనులూ మహిళలే నిర్వహిస్తున్నారు. ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతు, కూలీలు లంగర్ల నిర్వహణ మొదలు ఉద్యమానికి అనుబంధంగా ఉన్న అన్ని రంగాల్లోనూ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ సరిహద్దుల్లో ఏర్పాటు చేసుకున్న ఉద్యమ శిబిరాల్లో మహిళలే స్వయంగా లైబ్రరీలు, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు. నిత్యం ప్రజలను చైతన్యం చేస్తూ సాంస్కృతిక కళారూపాలను ప్రదర్శిస్తున్నారు. చివరకు రిపబ్లిక్ డే నాటి ట్రాక్టర్ పెరేడ్ లోనూ వందలాది మంది మహిళా రైతులు స్వయంగా ట్రాక్టర్లు నడుపుతూ ఉద్యమంలో భాగమయ్యారు.

కానీ, ప్రస్తుత ఉద్యమంలో మహిళల పాత్రను దేశ అత్యున్నత న్యాయస్థానం సైతం గుర్తించడంలో విఫలమైంది. 2021 జనవరి 12 న నూతన వ్యవసాయ చట్టం అమలుపై తాత్కాలిక స్టే విధిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బాబ్డే ‘మహిళలు, వృద్దులను నిరసన జరుగుతున్న ప్రదేశంలో ఎందుకు ఉంచార’ని ప్రశ్నించారు. వారిని తక్షణమే వారి ఇళ్లకు పంపించేయాలని ఆదేశదించారు. దీనికి సమాధానంగా డిసెంబర్ 18న మహిళా కిసాన్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించి ఉద్యమంలో వారి పాత్ర ఎంత కీలకమైందో చాటి చెప్పారు.

న్యాయమూర్తి వ్యాఖ్యలకు సమాధానమిస్తూ ‘వ్యవసాయంలో మహిళల పాత్ర సామాన్యమైనది కాదు, సాగురంగంతో మహిళలను విడదీసి చూడలేం. అటువంటి వ్యవసాయ రంగాన్ని నల్లచట్టాల బారి నుంచి కాపాడుకోవటానికి ప్రస్తుతం జరుగుతున్న మహా ఉద్యమంలో మహిళలు సహజంగానే పాల్గొంటారు. ఇది మహిళల ఉద్యమం కూడా. మహిళల పాత్రను కించపరిచేలా వ్యాఖ్యానించడం సముచితం కాదు. దీనిని మేం తీవ్రంగా ఖండిస్తున్నాం’ అంటూ ప్రకటించారు.

పీపుల్స్ ఆర్కైవ్స్ ఆఫ్ రూరల్ ఇండియా (పీఏఆర్ఐ) అనే సంస్థ నివేదిక ప్రకారం దేశంలోని మహిళా శ్రామికశక్తిలో మూడింట రెండొంతుల మంది వ్యవసాయరంగంలోనే రైతులుగానో, రైతు కూలీలుగానో పని చేస్తున్నారు. ప్రస్తుత రైతు ఉద్యమంలో మహిళలు పెద్ద సంఖ్యలో ఎందుకు పాల్గొంటున్నారనే దానికి ఈ గణాంకాలే స్పష్టమైన సమాధానం ఇస్తున్నాయి. రైతు ఉద్యమంలో పాల్గొంటున్న మహిళా రైతులు కేవలం సాగు చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు. ప్రస్తుత పురుషస్వామ్య సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న వివక్షపైన తీవ్రంగా చర్చలు జరుపుతున్నారు.

రైతు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న పంజాబ్ మరియు హర్యానా రాష్ట్రాల్లో మహిళల సామాజిక స్థితి పితృస్వామ్య భావజాలాన్ని పునికిపుచ్చుకున్న భూస్వామ్య వ్యవస్థ ద్వారా నిర్వహించబడుతోంది. దేశంలో స్త్రీ పురుష నిష్పత్తి విషయంలో అత్యంత వెనుకబడిన రాష్ర్టాలుగా పంజాబ్, హర్యానా రాష్ట్రాలుగా ఉండడం గమనార్హం. ఇలాంటి ప్రాంతం నుంచి వచ్చిన మహిళలు కేవలం ఆందోళనలలో పాల్గొనడమే కాకుండా వ్యవసాయ పనులు నిర్వహించడంతో పాటు ఇంటి నిర్వహణ బాధ్యతలు చూసుకుంటున్నారు. ఉద్యమం నిరాటంకంగా కొనసాగడానికి సహకరిస్తూ ఆందోళనల్లో పాల్గొంటున్న వారికి అవసరమయ్యే రోజువారి సామగ్రిని సమకూర్చుతున్నారు. నిజానికి గ్రామల్లో ఉన్న మహిళలు కుటుంబాలను, వ్యవసాయాన్ని నిర్వహించడంలో బాధ్యత పడకపోయి ఉంటే ప్రస్తుత రైతు ఉద్యమం ఇంత సుదీర్ఘసమయం కొనసాగడం సాధ్యమయ్యేది కాదు.

మహిళలపై చట్టాల ప్రభావం

పురుషాధిక్య అర్థ భూస్వామ్య వ్యవస్థలో స్త్రీ పురుషులకు గృహ వనరుల మీద సమాన అధికారాలు వర్తించడం లేదు. ఆర్థిక సమస్యలు తీవ్రతరం అయినప్పుడు ఈ అసమానతలు మరింత స్పష్టంగా వ్యక్తం అవుతుంటాయి. పంజాబ్ వ్యవసాయ కూలీలలో 35 శాతం దళితులే ఉండగా అందులో మెజారిటీ కూలీలు మహిళలే. కొత్త చట్టాల వల్ల రైతుల కన్నా ఎక్కువ నష్టపోయేది మహిళా కూలీలే. కార్పోరేట్ సంస్థలను వ్యవసాయరంగంలోకి అనుమతించడం వల్ల మహిళా కూలీలు, రైతులు దోపిడీకి గురవుతారు. 2019 జాతీయ నేర నమోదు బ్యూరో సమాచారం ప్రకారం దేశంలో జరిగిన ఆత్మహత్యల్లో డెబ్బై అయిదు శాతం వ్యవసాయ రంగంలో నమోదయ్యాయి. పదిహేడు రాష్ట్రాల్లో రైతుల కన్నా వ్యవసాయకూలీలే ఎక్కువగా మరణించారు. మరో ఆందోళనకరమైన విషయం ఏమిటంటే 1995 – 2020 మధ్య దేశంలో 29,64,380 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ఇది అధికారిక సమాచారం మాత్రమే. అనధికారికంగా ఇంతకు మంచి ఎక్కువే ఆత్మహత్యలు జరిగి ఉండవచ్చు.

పంజాబ్ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రంగంపై వచ్చే ఆదాయంలో అరవై నాలుగు శాతం రుణాల చెల్లింపులకు ఖర్చవుతోంది. పదమూడు శాతం మంది రైతులపై వారి రెండు సంవత్సరాల ఆదాయం కంటే ఎక్కువే అప్పులున్నాయి. వ్యవసాయ రంగంపట్ల పాలకులు అవలంభిస్తున్న నిర్లక్ష్యం మూలంగా రోజురోజుకూ ఆధాయం తగ్గుతోంది. ఈ ప్రభావం మహిళల జీవితాలపై అత్యధికంగా కనిపిస్తోంది. మరోవైపు ఆదాయం తగ్గుదలకు రుణభారం పెరిగుదలకు కారణమవుతోంది. రుణ భారం అనేది భారతదేశంలో రైతుల ఆత్మహత్యలకు ప్రధానమైన కారణంగా ఉంటోంది. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలలోని మహిళలు మరింత సులువుగా పేదరికంలోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. పితృస్వామ్య వారసత్వ సమాజంలో భూ యాజమాన్య హక్కులకు వారు దూరమైపోతున్నారు.
భూ యాజమాన్య హక్కులు లేకపోవడం, లింగ అసమానత మూలంగా ఇప్పటికే తీవ్ర దోపిడీకిగురవుతున్న మహిళా రైతులు, కూలీలు నూతన చట్టాలు వల్ల మరింత దోపిడీకి గురయ్యే ప్రమాదం ఉంది. కొత్త చట్టాల్లో పంటకు తగిన ధర కల్పించే విషయంలో ఎలాంటి రక్షణ విధానం లేకపోవడంతో వ్యవసాయరంగంలో లింగ అసమానతలు మరింత పెరిగే అవకాశం ఉంది. పురుషుల తో పోలిస్తే మహిళలు అధిక ధర కోసం దూర ప్రాంతాలకు ధాన్యాన్ని తరలించి విక్రయించడంలో సమస్యలు ఎదుర్కొంటారు. ఇంటి నిర్వహణ బాధ్యతలు మహిళలకు అడ్డంకిగా ఉంటాయి.

నూతన చట్టాల వల్ల జరుగబోయే నష్టాన్ని ముందే గుర్తించిన మహిళా రైతులు వాటి రద్దు కోసం జరిగే పోరాటంలో తామూ నిలబడాలనుకున్నారు. వాళ్లు కేవలం చట్టాలకు వ్యతిరేకంగా మాత్రమే కాదు వ్యవసాయరంగంలో లింగ అసమానత లకు వ్యతిరేకంగా కూడా పోరాడుతున్నారు. సమాజంలో రైతు అంటే కేవలం పురుషుడు మాత్రమే అనే తప్పుడు అభిప్రాయం ఉంది. ఈ తప్పుడు అభిప్రాయాన్ని ఇప్పటికైనా సరిచేసుకోవల్సిన అవసరం ఉంది. వ్యవసాయ రంగంలో పురుషుల శ్రమనే కాదు, మహిళ శ్రమను కూడా గుర్తించాలి. వనరులపై స్త్రీలకూ హక్కుల కల్పించాలి. ఆ దిశగా సాగే పోరాటాల్లో భాగంగానే ప్రస్తుత పోరాటాన్నీ చూస్తున్నారు మహిళా రైతు కూలీలు. తాజాగా పంజాబ్ లో వేలాది మంది దళిత మహిళలు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. మొత్తంగా వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న ఉద్యమంలో క్రమంగా సమాజంలో అట్టడుగు సమూహాలన్నీ భాగమవుతున్నాయి.

ఈ పోరాటం విజయం సాధిస్తుందని, అంతిమంగా సమాజంలో మహిళలకు సమాన హక్కులు లభిస్తాయని విశ్వసిస్తున్నారు. అప్పటి వరకు మార్పుకోసం సాగే అన్ని పోరాటాల్లోనూ తమ వంతు పాత్ర ఉంటుందని బలంగా ప్రకటిస్తున్నారు.

2017 లో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి న్యాయశాస్త్రంలో పట్టా అందుకున్నారు. ప్రస్తుతం న్యాయవాదిగా పని చేస్తున్నారు.

Leave a Reply