ప్రేమా, ఆవేదనల భాషే కవిత్వం: రేష్మా రమేష్

రేష్మా రమేష్ బెంగుళూరుకు చెందిన ద్విభాషా కవయిత్రి. ఆంగ్ల మరియు కన్నడభాషల్లో విరివిగా కవితలు రాసే ఈమె అంతర్జాతీయంగా బహుళప్రచారం పొందారు. నిజానికి ఈమెకు భారతదేశంలో కంటే విదేశాల్లోనే ఎక్కువ అభిమానులున్నారు. ఈమె కవితలు నేపాలీ, ఇటాలియన్, రష్యన్, బెలారస్, మంగోలియన్, తెలుగు,బెంగాలీ, హిందీ లాంటి దేశీయ మరియు అంతర్జాతీయ భాషల్లోకి అనువదింపబడ్డాయి.

టర్కీలోని ఇస్తాంబుల్ లో నిర్వహించిన ఒలింపస్ సాంస్కృతిక మరియు సాహితీ సదస్సులోనూ, మంగోలియాలో యునెస్కో నిర్వహించిన 37వ అంతర్జాతీయ సాహితీ సమ్మేళనంలోనూ మరియు పలు జాతీయ, అంతర్జాతీయ సాహితీ కార్యక్రమాల్లో తన కవిత్వాన్ని వినిపించి మనదేశ ఖ్యాతిని ఇనుమడింపచేశారు.

టర్కీలోని అతిపురాతన నగరమైన అంటాల్యాలో ఈమె కవిత ఒకటి ఒక రాతిపై చెక్కబడి శాశ్వతంగా ప్రతిష్టింపచేయడమైనది.

ఈమె కవిత్వం చదివేముందు వారితో జరిపిన సంభాషణని చూద్దాం.

***

ప్రశ్న: కవిత్వం మీకేమిటి ?

రేష్మా: కవిత్వం నా గుండె గొంతుక. కాలానుగుణంగా సహజంగా భోరున కురిసే వాన. దానిపై నాకు అధికారంలేదు. చిన్నప్పట్నుంచీ నా చుట్టుపక్కలున్న ప్రపంచాన్ని చూడటం నిశితంగా పరిశీలంచటం ఆ అనుభూతి నాలో ఏవేవో ప్రకంపనల్లాంటివి సృష్టించటం జరుగుతూ ఉంటుంది. ఒక్కోసారి అవి నాలో కవిత్వాన్ని పుట్టించే ఆలోచనలని రేకెత్తిస్తాయి. ఒక్కోసారి ఏమీ ఉండదు. నా చుట్టుపక్కలనున్న భౌతిక ప్రపంచంతో నాకు సంబంధం పోయినప్పుడల్లా కవిత్వమే నా ప్రపంచం అవుతుంది.

ప్రశ్న : కవిత్వం మిమ్మల్ని ప్రభావితం చేసిందా లేక మీరు కవిత్వాన్ని ప్రభావితం చేసారా?

రేష్మా: నిస్సందేహంగా కవిత్వమే నన్ను ప్రభావితం చేస్తుంటుంది. నాకు ఆవల నాకు అతీతంగా మరో లోకం ఉందని అదిమాత్రమే శాశ్వతమనీ చెప్తూంటుంది. వివిధ భాషల, సంస్కృతుల కవుల కవిత్వం చదవుతున్నప్పుడు ఒక్కవిషయం సుస్పష్టం — ప్రేమా, ఆవేదనల భాష ఒక్కటే. అదే కవిత్వం.

ఒక్కోసారి నా కవిత్వాన్ని నేనే ప్రభావితం చేస్తున్నానని అనిపిస్తుంది ఎందుకంటే కవిత్వానికి ఎంతో ప్రధానమైన సూక్ష్మ సౌందర్య విషయాలను నాదైన శైలిలో రాస్తున్నందుకు.

ప్రశ్న : సమాజానికి కవిత్వం అవసరమా?

రేష్మా: అవును. సమాజానికి కవిత్వం చాలా అవసరం. కవిత్వం కానీ సాహిత్యంలోని ఏ ప్రక్రియ ఐనా సమాజరుగ్మతలకు ప్రత్యక్షంగా పరిష్కారం ఇవ్వలేకపోవచ్చు. కాని పితృస్వామ్య వ్యవస్థ, జాతి కుల వివక్ష, బలహీన బడుగు వర్గాల తరతరాల పోరాటాలు లాంటి సమస్యలని పర్ష్కరించే వాతావరణం కల్పిస్తుంది. కవిత్వం అడ్డంకులను, అవరోధాలను, వివక్షలను తొలగించి ప్రజలను ఏకంచేస్తుంది. కవిత్వం గాయాలకు లేపనం ఇచ్చి మాన్పుతుంది. అంతకంటే ఈ రోజుల్లో ప్రజలకు కవిత్వం నుంచి ఏం కావాలి?

ప్రశ్న: కవిత్వాన్ని మీరెలా ఆస్వాదిస్తారు?

రేష్మా: కవిత్వానికి పెద్ద కోర్కెలేమీ లేవు. ఏదో ఓ మూల కూర్చుని పెన్నూ కాగితం ఉంటే చాలు. నావరకూ కవిత్వం పేరుతో వివిధ దేశాలకు ప్రయాణించటం, రకరకాల సంస్కృతుల ప్రజలను కలవటం నేను ప్రోగుచేసుకున్న మైలురాళ్ళు. నాకు చాలా ఆనందాన్నిచ్చిన విషయాల్లో అది చాలా ముఖ్యమైనది.

***

The Small Hands of Shivakshi
(Original Poem by Dr Reshma Ramesh)

They say that even birds that do not fly have wings
And Jasmines open like umbrellas in the rain
In such a world in all its fairness tiny hands of sivakasi
shining in silver like jari on Amma’s pattu sari
rolling, rubbing, dipping aluminum onto paper
Sulphur filled nostrils, mercury parched scalp
Are building a legacy of blushing cheeks and gun powder
Rotting like a bad fruit in dark windowless factories
The small hands of Sivakasi are busy at work
Tying and untying bijlis of hope,
But these things happen every other day
Somewhere in the corner we know that they exist
And there are people who for money
scald children with all their consciousness
And yet we drive to the open ground on Diwali
And buy boxes of fire crackers, especially for our
children so that back home together all of us can
Burn these small hands of sivakasi until the sky lights up
and the earth below is filled with ashes and they
the small hands of sivakasi are buried with their mouth open

చిన్ని చేతుల శివకాశి
(స్వేచ్ఛానువాదం – శ్రీనివాస్ వాసుదేవ్)

ఎగరలేని పక్షులక్కూడా రెక్కలుంటాయంటారు
వర్షంలో నాజూకు మల్లెలు కూడా తమ రెమ్మల్ని గొడుగుల్లా విప్పుకుంటాయి
అమ్మ పట్టుచీరపై వెండిజరీలా మెరవాల్సిన శివకాశి చిన్నిచేతులు మాత్రం
ప్రాణాంతక విషపదార్ధాలతో మెరుపులు మెరిసే
దీపావళి టపాసులనే తమ చేతులతో చుడుతున్నాయి
విషప్రద అల్యూమినాని కాగితానికద్దుతున్న ఆ చిట్టిచిట్టి చేతులు
సల్ఫర్ నిండిన ముక్కుపుటాలు, పాదరసం పులుముకున్న మాడుమీద చర్మంతో
కిటికీల్లేని కర్మాగారాల్లో కుళ్ళిపోయిన పళ్ళలా
నిరంతరం పనిచేస్తూనే ఉన్నాయి టపాసుల ఫ్యాక్టరీల్లో బందీలై…
ఆ చిన్నిచిన్ని చేతులెప్పుడూ పనిచేస్తూనే ఉంటాయి
రంగురంగుల టపాసుల్లో ఆశ అనే భవిష్యత్తుని వెతుకుతూనే ఉంటారు
ఒక్కోసారి —
వారిచేతులే కాదు జీవితాలు బొబ్బర్లెక్కుతూనే ఉంటాయి
ఇదొక నిత్యకృత్య అకృత్యం
ఐనా మనమంతా—
ఆ చిట్టిచిట్టి చేతులని కాల్చికదూ ఆకాశాన్ని వెలిగిస్తాం
భూమంతా టపాసుల బూడితతో నిండేవరకూ
డబ్బాలడబ్బాల టపాకాయలను మన పిల్లలచేత కాలిపిస్తూనే ఉంటాం
టపాకాయల బూడిదక్రింద ఆ చిన్ని చేతులు సమాధి కాబడ్డాయేమో
వారింకా ఆశతో నోరుతెరిచే ఉన్నారు
అక్కడ శివకాశీలో మందుగుండు పేలుడులో చేతులుకాలిన పిల్లలు
ఇక్కడ అవే టపాసులతో ప్రపంచాన్ని కాలుస్తున్న పిల్లలు

విశాఖలో పుట్టి అక్కడే డాక్టరేట్ వరకూ చదివి ఆపై విదేశాల్లో వివిధ యూనివర్శిటీల్లో పనిచేసి ఇప్పుడు బెంగ్లూరు లో స్థిరపడి ఇక్కడ ఫ్రీలాన్సర్ గా పనిచేస్తున్నారు. రోజంతా పాఠం చెప్పటం... రాత్రైతే ఏదో రాసుకోవటం లాంటివి చేస్తుంటానంటారు. కవిత్వం అంటే ఇష్టం. కవిత్వం గురించిన చర్చలు కూడా ఇష్టమే.

7 thoughts on “ప్రేమా, ఆవేదనల భాషే కవిత్వం: రేష్మా రమేష్

 1. చాలా బావుంది

 2. డా.రేష్మా రమేష్ గారిని చదువుతుంటే
  హైవే మీద ఆధునిక హంగులన్నీ ఉన్న హైస్పీడు కారులో పోతూ
  మనస్సుని పైరగాలికి ఊగే పచ్చగడ్డి మీద పరిచిన ఫీల్
  అంతర్లీనంగా ఎగిసిపడుతుంది. శ్రీనివాస వాసుదేవ్ గారి గురించీ మనకి తెలియనిదేముందీ.. వేణువుకి వాయిలీనం నేర్పించగల నేర్పరి..
  చక్కని కవయిత్రి పరిచయమూ..
  స్వేచ్ఛానుసరణానూ..
  అభినందనలు రేష్మారమేష్ గారికి
  ధన్యవాదనమస్సులు శ్రీనివాస వాసుదేవ్ గారికి⚘⚘
  ..సీరామ్

  1. మీ రచనలు చదివిస్తాయి. మీ స్పందనలు ఆలోచింపజేసి మరింత రాయిస్తాయి జాగ్రత్తగా. మీరు మంచి పాఠకుడు, గొప్ప రచయిత. మీ ఈ స్పందన మాకు ఒక ఓషధి. నెనర్లు రమేష్ గారూ!

 3. రేష్మా రమేష్ గారి ని పరిచయం చేస్తూ , వారి కవితల్ని పరిచయం చేయటమే కాక స్వేచ్ఛానువాదం చేసి అందించిన కవి శ్రీనివాస్ వాసుదేవ్గాగారు కవిత్వప్రపంచంలో పాఠకలోకానికి చిరపరిచితులే. కవయిత్రికి, వాసుదేవ్ గారికీ అభినందనలు 🙏🏻🙏🏻

 4. రేష్మ రమేష్ గారి గొప్ప పరిచయం…ఆమె ఇంటర్వ్యూ లో ఆమె అంతరాత్మ ను వెలికి తీశారు.. అనువాదం/అనుసృజన అద్భుతంగా ఉంది…కుడొస్

Leave a Reply