రేప్ పోయెమ్

రేప్ అయ్యాక ఎలా ఉంటుందో మీకు చెప్పాలి..!
రేప్ కాబడ్డానికి… సిమెంట్ మెట్ల మీద నుంచి పడిపోవడానికి పెద్ద తేడా ఏమీ లేదు.
కాకపోతే… దేహం లోపలి కనిపించని గాయాలు రక్తాన్ని స్రవిస్తూ ఉంటాయి.
రేప్ కాబడ్డానికి… నీ మీద నుంచి ఒక ట్రక్ పోవడానికి తేడా లేదు…
కాకపోతే రేప్ తరువాత ఆ రేపిస్ట్ అడుగుతాడు చూడండి. “నాతో పాటు నువ్వు కూడా ఆనందించావా”? అని, అది రేప్ కంటే ఘోరం కదూ…?

రేప్ కాబడ్డానికి… పాముకాటుకు తేడా లేదు.
కానీ రేప్ జరిగాక వాళ్ళు అంటారు …”నీ స్కర్ట్ అంత చిన్నగా ఉండడం వల్లే కదా వాడు రెచ్చిపోయాడు మరి”? …
“అయినా ఇంత అర్థ రాత్రి రోడ్ల మీదేం చేస్తున్నావు” అని…
ఆ మాటలెట్లా భరించాలి?

రేప్ కాబడ్డానికి… కారు అద్దం బద్దలై నీ తలకి గాయం అవడానికి తేడా ఏముందని?
అయినా నీకు కార్లంటే భయం ఉండదు.
కానీ ఈ భూగోళం మీద సగానికి సగంగా ఉన్న మానవజాతిని చూస్తే మాత్రం నీకు నిలువెల్లా వణికి పోయేంత భయం!
ఇదెంత విచిత్రమో చూసావా…
ఈ రేపిస్ట్ ఉన్నాడు చూసారూ… నీ బాయ్ ఫ్రెండ్ తమ్ముడో… అన్నో అయి వుంటాడు
ఏ సినిమా థియేటర్‌లోనో నీ పక్కనే కూర్చుని నింపాదిగా పాప్ కార్న్ నములుతూ ఉంటాడు.
ఇతగాడిని మనం ఒక మామూలు మగాడులే, ఏం చేయడు అని అనుకుంటామా…
నిమ్మళంగా ఉంటామా…
కానీ నీ పక్కనే ఉన్న అతని ఊహల్లో మాత్రం…
చెత్త కుప్పలో లుకలుకలాడిపోతూ ఉబ్బిపోయే లార్వా పురుగుల్లా రహస్యంగా రేప్ ఒక రూపం తీసుకుంటూ ఉంటుంది.

రేప్ భయం ఎప్పుడూ మంచులాంటి శీతలత్వంతో స్త్రీల వెన్నుని జర జరమని వణికిస్తునే ఉంటుంది.
ఆ భయం… ఆకలి గొన్న నోటితో ఆ పురుషుడు నా వైపుకి పాక్కుంటూ వస్తూంటే…
దట్టమైన పైన్ చెట్ల గుండా ఇసుక దారులలో ఒంటరిగా షికారుకు వెళ్లనివ్వదు.
నున్నటి కాలి బాట వెంబడి హాయిగా నడవనివ్వదు.

చూడు… ఒకటి చెప్తా జాగ్రత్తగా విను!
నువ్వు మాత్రం చేతిలో గొంతు కోసే రేజర్ లేకుండా…
తలుపు తట్టిన శబ్దం విని ఎప్పుడూ తలుపు తెరవకేం.
మరి ఎన్ని భయాలనుకున్నావు…?
నిగూడమైన… రహస్యమైన చీకటి స్థలాలను చూస్తే చాలు భయం…
కారు వెనక సీటు… పాడుబడిన ఖాళీ ఇల్లు…
బెదిరిస్తున్నట్లుండి పాముబుస లాంటి తాళపు గుత్తి చప్పుడు అన్నా భయం…
తన ప్యాంటుకి కత్తి లాంటి జేబు పెట్టుకుని నవ్వుతున్న మగాణ్ణి చూస్తే భయం…
కోపంతో ముభావంగా ఉంటూ…
మూసిన పిడికిలి నిండా స్త్రీ పట్ల ద్వేషాన్ని నింపుకున్న పురుషుడ్ని చూస్తే భయం…
ఆశ్చర్యం… ఈ మా భయాలన్నీ చూస్తూ కూడా…
ఈ రేపిస్ట్‌కి తన దేహం గాయం చేసే ఒక సుత్తిలా… దహించివేసే మంటలను పుట్టించే బర్నర్ లాగా…
ప్రమాదకరమైన మెషిన్ గన్‌లాగా అసలు అనిపించదా…?
మరి మన స్త్రీలకి అలానే అనిపిస్తుంది కదా?
అతను అలా ఎప్పుడూ అనుకోడా…?
ఇదంతా అతను తన స్వంత దేహాన్నీ… తననూ… అసహ్యించు కోవడానికి…
తన దేహం నుంచి వేలాడే మెత్తని… వదులైన కండరాన్ని ఏవగించుకోవడానికి పనికి రాదా…?
అలా ఎందుకు అనుకోడు…?
కామంతో స్త్రీని గాయపరిచే తన దేహాన్నెలా ప్రేమించుకో గలడసలు?

సరే.. ఇదంతా… ఈ ప్రశ్నలు… భయాలూ అన్నీ…
నువ్వు అసహ్యించుకునే దాన్ని నీలోలోంచి తీసివేయడానికి కాదూ…
నీ శరీరానికి పరాయిదైన వాడి మాంసపు ముద్ద అంటే ఉన్న భయాన్ని…
నీలోంచి ఆవేశంతో తోడి పడేయాలనిపిస్తుంది కదూ?
సహజ స్పందనలన్నీ నశించిపోయి… ఒట్టి కదలికలున్న ఈ కవచం లాంటి దేహంతోనే…
ఎవరో పూనినట్లే ఆ రేపిస్టుని శిక్షించాలని ఉంది కదూ?

మూర్ఖుడా…
అసలు స్త్రీ ఎప్పుడూ నిన్ను ప్రేమించడానికి…
నీతో ప్రేమించడానికి, జీవితానందాన్ని అనుభవించడానికి..
నీకు పంచడానికి సిద్ధంగా ఉంటుంది కదా…?
తన లేతదైన శరీరంతో పాటు కొన్ని ఇష్టాలు…
ఆశలతో సజీవంగా ఉండే ఆమెను హత్య చేయడమే కదా…
రేప్ చేయడమంటే?
అందుకే…
కత్తి లాంటి జేబు పెట్టుకుని మామూలుగా ఏమీ ఎరుగనట్లే నవ్వుతున్న మగవాణ్ణి చూస్తే…
అందుకే అంత భయం మరి.!
రేప్ చేయబడ్డానికి…

స్వేచ్ఛానువాదం : గీతాంజలి

డా. భారతి : Psychotherapist & marital counselor. కలం పేరు గీతాంజలి. పుట్టిన స్థలం హైద్రాబాద్. ర‌చ‌న‌లు: 'ఆమె అడవిని జయించింది', 'పాదముద్రలు'. లక్ష్మి (నవలిక). 'బచ్ఛేదాని' (కథా సంకలనం). 'ప‌హెచాన్‌' (ముస్లిం స్త్రీల ప్రత్యేక కథా సంకలనం), 'పాలమూరు వలస బతుకు చిత్రాలు' (కథా సంకలనం), 'హస్బెండ్ స్టిచ్' (స్త్రీల విషాద లైంగిక గాథలు) 'అరణ్య స్వప్నం' (కవితా సంకలనం) సెప్టెంబర్ 2019 లో విడుదల అవుతుంది.

అమెరికాకి చెందిన ప్రగతిశీల హక్కుల కార్యకర్త, రచయిత్రి.   ఫెమినిస్ట్ రచనలు విస్తృతంగా చేశారు. 31మార్చ్ 1936 లో డెట్రాయిట్ లో జన్మించారు. నానమ్మ చెప్పే కథలూ.. అమ్మకున్న విస్తృతమైన సాహిత్య పఠనానుభవం..మార్జి పైర్సీ లో సాహిత్య సృజన పట్ల ఆసక్తిని కలిగించాయి. యూనివర్సిటీ ఆఫ్ మిచిగాన్,నార్త్ వెస్ట్రన్ యూనివర్సిటీల్లో B.A., M.A. చదివారు.1976 లో స్త్రీవాద ఉద్యమాలు ఉధృతంగా మొదలైన రోజుల్లో స్త్రీల.. హక్కుల సంఘాలు నడిపించిన స్త్రీల పై హింసకు వ్యతిరేకంగా జరిగిన ప్రదర్శనల కు సంఘీభావంగా రాసిన కవిత ఈ రేప్ పోయెమ్. రేప్ బాధితురాళ్ల అంతర బాహ్యఘర్షణలను అత్యంత ఆర్ద్రంగా.. వాస్తవిక మెటఫర్ లను ఉపయోగించి రాసారు. రచనలు: ఉమెన్ ఆన్ ద ఎడ్జ్ ఆఫ్ టైం., హి, షి& ఇట్, గాన్ టు సొల్జేర్స్. తన సాహిత్య అభిరుచిని గౌరవించని మొదటి భర్తకి విడాకులు ఇచ్చింది. తరువాత హక్కుల ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. ఆర్థర్ సి క్లార్క్ అవార్డ్, బ్రాడ్లీ అవార్డ్,బ్రిట్-హా-డోరోధ్ అవార్డ్,లాంటి చాలా అవార్డులు అందుకున్నారు.

One thought on “రేప్ పోయెమ్

Leave a Reply