రివాజు కథల్లో సామాజిక స్పృహ (తెలంగాణ కథ-2018)

తెలంగాణ కథ అంటే ఒకప్పుడు పోరాట కథలు, ఉద్యమ కథలుగానే అభిప్రాయముండేది. దాదాపు 1990 తర్వాత అనేక మంది బహుజనులు రచయితలు గా ఎదిగిన తర్వాత సమాజంలోని విభిన్న కోణాల్లో సామాజిక అంశాలను స్పృశిస్తూ కథలను రాయడం మొదలుపెట్టారు. ఇది రెండు పార్శ్వాలు గా జరిగిందని చెప్పవచ్చు. ఒకటి రచయిత స్వానుభవంలోంచి సామాజిక కోణం లో రాసిన కథలు. రెండు సమాజంలోని విభిన్న పార్శ్వాలను పరిశీలనాత్మకంగా పరిశీలించి సామాజిక స్పృహతో రాసిన కథలు. ఈ రెండు రకాలుగా వెలువడిన కథలు భూత భవిష్యత్ వర్తమాన కాలాలలోని విభిన్న సామాజిక రీతుల్ని నిక్షిప్తం చేశాయనే చెప్పవచ్చు. ఈ కథలన్నీ సామాజిక ప్రయోజనం కోసం రాయబడినవే. ఇటువంటి దృక్పథంతోనే తెలంగాణ సమాజపు కష్టాలను, కన్నీళ్లను, సమస్యలను, సామాజిక అంశాలను విభిన్న సంఘర్షణలను వస్తువుగా చేసుకొని, మొత్తంగా తెలంగాణ సమాజపు యొక్క ముఖచిత్రాన్ని తెలియజేసే విధంగా, ఆణి ముత్యాల్లాంటి పదమూడు కథలను సేకరించి రివాజు( తెలంగాణ కథ 2018 )పేరుతో సింగిడి తెలంగాణ రచయితల సంఘం ప్రచురించింది. దీనికి సంపాదకులుగా సంగిశెట్టి శ్రీనివాస్ గారు, డాక్టర్ వెల్దండి శ్రీధర్ గారు వ్యవహరించారు. ఇందులోని కథలను రచించిన రచయితలు ఆధునిక సామాజిక పోకడలను గమనిస్తూ, పరిశీలనాత్మకంగా తమ కథల్లో సృష్టించినారు. రచయితలు స్వీకరించిన వస్తువు సమాజంలోని వాస్తవిక సంఘటనల కు అద్దం పడుతుంది. ఆ సంఘటనల భావావేశానికి పాత్రలను సృష్టించి తాము చెప్పదలుచుకున్న కథా శిల్పాన్ని చక్కగా సృష్టించారు. ఒక్కొక్క కథ ఒక్కో సామాజిక కోణం లోని భావజాలాన్ని తెలియజేస్తుంది.

ప్రముఖ రచయిత ప్రొఫెసర్ రామా చంద్రమౌళి గారు రచించిన ‘ఒక నది రెండు తీరాలు’ కథ తెలంగాణలోని 1948 కాలం నాటి పరిస్థితులను తెలియజేస్తుంది.నిజాం కాలంలో పరిగి తాలూకా పిల్లాయపల్లి గ్రామం ప్రక్క ఊరు చింతల గూడెంలో ఆంధ్ర మహాసభ, సంగం పేరుతో తెలంగాణలో వ్యవస్థీకృతమైన వ్యవస్థను, కమ్యూనిస్టులను నిశ్శేషం చేయాలని జనరల్ చౌదరి నాయకత్వంలో దొరలు, దేశ్ముఖులు, రజాకార్లు ఊరూరు తిరిగి ఆ పేరుతో తిరిగే వారిని అత్యంత పాశవికంగా చంపుతూ ఉంటారు. చింతల గూడెం లో కూడా రైతులను బంధించి, అందులో మల్లయ్య అనే వ్యక్తిని అత్యంత క్రూరంగా కొట్టడమే కాక సూదితో తన నోటిని కుడతారు. తన భార్య రాజవ్వ కాల్మొక్తా నా మొగుడు చచ్చి పోతాడంటూ వేడుకున్నా వినక ఆమెను కూడా బూతులు తిడుతూ, ఒక పలక మీద రేపు నా చావుకు ఒక కట్టె ఇవ్వండి అని రాసి, లేవలేని, నడువలేని స్థితిలో ఉన్న మల్లయ్య మెడలో వేస్తారు. ఏడడుగులు నడిచిన తన భర్త చితికి కావాల్సిన కట్టెల కోసం ఇంటింటికి మల్లయ్యను లాక్కుంటూ వెళ్లి, నా మొగుని చావుకు ఒక కట్టె ఇవ్వండయ్యా అంటూ, కట్టెలు సేకరించి చావడి కాడ ఆ కట్టెలు పేరుస్తుంది. మరుసటి రోజు నేలమీద సొమ్మసిల్లి పడిపోయిన మల్లయ్యను రజాకార్లు తుపాకీతో కాల్చి కంఠంలో ప్రాణం ఉండగానే ఆ కట్టెలమీద వేసి దహనం చేస్తారు. ఇక్కడి వరకు రచయిత కథలో వాస్తవిక సంఘటనను చిత్రించి ఆ తర్వాత కొనసాగింపుగా రాజవ్వ కొడుకు శివయ్య, అతని భార్య నీలా మనవరాలు రేవతి, కుల వృత్తిని చేసుకుంటూ ఉంటారు. రాజవ్వ మనవరాలితో తాత సజీవదహనం గురించి చెప్పుతూ దుఃఖించేది. ఆ సంఘటన విన్న రేవతి ఎవరూ సాధించనది చేయాలనే సంకల్పంతో సమాజం గర్వించదగ్గ ప్రయోజకురాలు అవుతుంది. ఇందులో రచయిత నిజాం పరిపాలన కాలంలోని రజాకార్లు చేసే క్రూరమైన దాష్టీకాలను చూపుతూ, తన కళ్ళ ముందే భర్త నరకయాతన అనుభవించి రజాకార్ల తుపాకీ తూటాలకు బలి కావడం వంటి చీకటి రోజుల నుండి నేటి ఆధునిక సామాజిక పరిస్థితులను అధిగమించి, ఇప్పటి కొత్తతరం కొత్త ప్రపంచం వైపు అడుగులు వేసి, జీవితాన్ని ఎలా గెల్చుకుంటుందో వంటి సామాజిక అంశాలను రచయిత అద్భుతంగా చిత్రించడం కనిపిస్తుంది. తన నానమ్మ బాధను మనుమరాలు తీర్చే లేకపోయినా, తను సాధించిన ప్రయోజనం నానమ్మకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. జీవితం అనే ఒక నది రెండు తీరాలను ఒరుసుకుంటూ, ఎట్లా కొత్త ప్రపంచంలోకి ప్రయాణిస్తుందోననే విషయాన్ని రచయిత ఒక నది రెండు తీరాలు గా కథ ద్వారా తీర్చిదిద్దడం చూడవచ్చు.

మరొక కథ పెద్దింటి అశోక్ కుమార్ గారు రచించిన ‘స్కావెంజర్’ కథ. ఈ కథలో బ్రాహ్మణ కులానికి చెందిన దత్తయ్య మనుమడు ప్రదీప్. దళితుడైన బూదయ్య మనుమడు రవిచంద్ర. వీరిద్దరూ కలిసి చదువుకున్న మిత్రులు. ప్రదీప్ చదువులో రవిచంద్ర కంటే ప్రతిభావంతుడు. అయితే కాలేజీలో కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టుకు ఇద్దరూ అప్లై చేయగా, రిజర్వేషన్ పరంగా ఈ పోస్టు రవిచంద్రకు దక్కే అవకాశం వస్తుంది. దీంతో ప్రతిభకు కాకుండా కులానికే పట్టం కడుతున్నారని ప్రదీప్ రవిచంద్ర తో వాదిస్తాడు. ఒకరోజు రవిచంద్ర తన ఇంటికి ప్రదీప్ ను అతని తాతని పిలిచి గౌరవంగా చూసుకొంటాడు. అదే ప్రదీప్ రవిచంద్రను అతని తాతను ఇంటికి పిలిచి అగ్రవర్ణం ఆధిపత్య చూపించటం జరుగుతుంది. ఇందులోని సంఘటనలు సమాజంలో జరిగే వాస్తవిక దృశ్యాలు. ఇందులో రచయిత అగ్రవర్ణం లోని ప్రతిభావంతులు రిజర్వేషన్ కారణంగా నష్టపోతున్న సంఘర్షణను చిత్రిస్తూనే, రిజర్వేషన్ అనుభవిస్తున్న వారికి సామాజిక హోదాను కలిగిస్తుందని రిజర్వేషన్లు కల్పిస్తే, సమాజంలో వారి స్థాయిని అగ్రవర్ణం వెక్కిరిస్తుందనే విషయాన్ని స్పష్టంగా చెప్తాడు. అంతేకాకుండా రిజర్వేషన్ అనుభవిస్తున్న వ్యక్తులు సమాజంలో కొందరు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతూ భయాన్ని సృష్టిస్తున్న తీరును కూడా చిత్రించాడు. రిజర్వేషన్స్ ఒక తరానికో, రెండో తరానికో పరిమితమయితే బాగుండు అనుకునే భావజాలాన్ని, సమాజంలో రిజర్వేషన్ కారణంగా ఆర్థిక హోదా కలుగుతుందే తప్ప, సామాజిక హోదా పెరుగుతలేదనే భావజాలం బలంగా కనిపిస్తుంది. ఇందుకు దళితుడైన రవిచంద్ర, బ్రాహ్మణ యువకుడైన ప్రదీప్ తో “నువ్వు పేదవాడివే ఒప్పుకుంట కానీ నీ పేదరికం నిన్ను ఏ గుడిలో కైనా రాకుండా నిలిపిందా, ఎవరి ఇంట్లోకి అయినా రాకుండా ఆపిందా, జనంలో మర్యాదని తక్కువ చేసిందా, అవమానానికి గురి చేసిందా, అత్యాచారాలకు కారణమయిందా, వెలివేతకు గురయిందా, రోడ్లు ఊడిపించిందా, ప్రాణాలతో తగలబెట్టి చంపిందా, మరి నాకు కులం ఇప్పటికి కారణమైతుందిరా, ఈ దేశంలో సగం గుళ్లకు, సగం ఇళ్లకు, మెట్లు తుడవడానికి తప్ప ఎక్కడానికి అర్హత లేదు మాకు, చివరకు కొన్ని ఉద్యోగాలు దళితులే చేయాలని నిర్ణయించింది ఈ సమాజం. మాకు సామాజిక గౌరవం దక్కినప్పుడే ఈ రిజర్వేషన్ తొలగాలని” నొక్కి వక్కాణిస్తాడు. ఇట్లా సమాజంలో నిమ్న జాతులు నేటి ఆధునిక కాలంలోకూడా అనుభవిస్తున్న వాస్తవిక దృశ్యాలను రచయిత గొప్పగా కథలో ఆవిష్కరించడం విశేషం.

డా. ముదిగంటి సుజాత రెడ్డి గారు రచించిన ‘నాటు వడ్డ వరి మొక్కలు’ కథలో దొర రాజేశ్వర్ రావు మూడు తరాలుగా తమ వంశంలో మగ సంతానం కలుగకపోవటంతో, వంశపారంపర్యంగా వారి ముత్తాతకు నిజాం మహబూబ్ అలీ పాషా ఇచ్చిన వెయ్యి ఎకరాల భూమిని ఒక్కడే అనుభవిస్తూ, దొరగా చలామణి అవుతూ, దొరసాని సూర్యమ్మతో దర్జాగా గడిని ఏలుతూ ఉంటాడు. అయితే నక్సలైట్లు బెదిరించడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పట్నం వస్తాడు. పట్నంలో వారికి తెలిసిన దొరవారి సహాయంతో పిండి వంటల వ్యాపారం మొదలుపెట్టి కచ్చరం బండ్లో తిరిగే దొర కారులో తిరిగే స్థాయికి ఎదుగుతాడు. తన ముగ్గురు కొడుకులను ఉన్నత చదువులు చదివించి ప్రయోజకులను చేసి, వ్యాపారాలు చేసే స్థాయికి తెస్తాడు. ఇది సామాజికంగా కనిపించే సంఘటన. తెలంగాణలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో వారికి భయపడి పారిపోయిన దొరల స్థితిని తెలియజేస్తుంది. కానీ పట్టణంలో దొరలు ఎలా బతుకుతారో అనుకున్న పాలేర్లు, విస్మయం చెందే రీతిలో దొరలు సమాజంలో వినూత్న సంపాదనా మార్గాలను తమ సహచర దొరల ద్వారా తెలుసుకొని, గ్రామాల్లోని దొరల స్థితి కంటే భిన్నంగా దర్జాగా స్థిరపడి బతకడం దొర ఎక్కడున్నా దొర అనే భావన కలిగిస్తుంది.

రజిత కొమ్ము గారు రచించిన ‘ఫెర్టిలిటీ’ కథలో దివ్య ఆమె భర్త అరుణ్ ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు. దివ్య కు మాతృత్వం విలువ గురించి బాగా తెలుసు. ఈ విషయంలో స్త్రీలే కాకుండా మూగజీవులు కూడా ఎంత కష్టపడాల్సి వస్తుందో డాక్టర్ గా ఆమెకు బాగా తెలుసు. దివ్య పెళ్లి అయిన ఏడేళ్ల తర్వాత గర్భం ధరిస్తుంది. ఒకరోజు కడుపునొప్పి రావడంతో హాస్పిటల్ కి వెళ్తుంది. అక్కడ ఒక గిరిజన స్త్రీ అప్పుడే పుట్టిన తన పసికందును అమ్మడం కనిపిస్తుంది. ఆమె గుండె అవిసిపోతుంది. ఇలా ఎందుకని అక్కడ ఉండే సిస్టర్ ని ఆరాతీయగా డబ్బున్న కుటుంబం, మేనరికం పెళ్లిళ్లు మాత్రమే చేసుకునే కుటుంబం, తమకు ఏమైనా లోపాలు ఉన్న పిల్లలు పుడితే ఎలా? అని, ఈ రకంగా పిల్లల్ని కొంటారని తెలుసుకొని బాధపడుతుంది. ఈ కథలో రచయిత్రి గిరిజన స్త్రీలు తమ కన్న పేగును పట్టణాల్లో ఏ రకంగా అమ్ముకుంటున్నారో వారి దుస్థితిని చూపుతుంది. ఇటువంటి సంఘటనలు సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న వాస్తవాలే. కథలో రచయిత్రి ఈ సమస్యను చొప్పియ్యడం విశేషంగా చెప్పుకోవచ్చు.

మరొక కథ డాక్టర్ పసునూరి రవీందర్ గారు రాసిన ‘రాచపుండు’. ఇందులో శాంతమ్మ కొడుకు బాలరాజు తన ఇంటి దుఃఖాన్ని కాదు, అందరి దుఃఖాన్ని తీరాలనే టోడు. మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు మనకు దక్కాలి అంటూ ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో పిడికిలి బిగించి దగాకోరు నేతలు ఉద్యమాన్ని అమ్ముకోజూస్తున్నరని, తనను తాను పెట్రోల్ పోసుకొని ఆహుతయ్యాడు. ప్రత్యేక రాష్ట్రం కోసం తన కొడుకు బలిదానం విని తల్లి ఆవేదన కళ్ళనీళ్ళు తెప్పిస్తుంది. తల్లి శాంతమ్మ కు బాలరాజు కలలో కనిపించి తాను కలలుకన్న రాష్ట్రం వచ్చిందని ఓదార్చే వాడు. కానీ బాలరాజు తమ్ముడు రమేష్ అన్న త్యాగం చేయడానికి అర్థం లేదని తల్లితో చెప్పుతూ ప్రభుత్వం ఇస్తానన్న భూమి, ఉద్యోగం కోసం తిరుగుతూ విసుగు చెందుతాడు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్న తర్వాత కూడా నియామకాలు లేక ఇబ్బంది పడుతుంటాడు. శాంతమ్మ తమ్ముడు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బాలరాజును అడగాలని నిర్ణయించుకొంటుంది. బాలరాజు కలలోకిరాగా తెలంగాణకు నా కన్న బిడ్డ ను దానమిచ్చిన బిడ్డ, ‘మీరంతా కన్న కలలు నిజమైనాయ బిడ్డ’ అంటూ అడుగుతుంది. తల్లి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పలేక బాల్రాజు నిష్క్రమిస్తాడు. నీళ్లు నిధులు నియామకాలు అంటూ పదమూడు వందలమంది బలిదానాలు చేయగా సాధించుకున్న తెలంగాణలో ఆ బలిదానాలు ఆశించిన లక్ష్యం నెరవేరక మరొక ఉద్యమానికి నాంది పలికే దశకు బీజం తెలంగాణ సమాజంలో పడుతున్నదని, రచయిత సమాజంలోని మార్పులను, సంఘటనలను, సంఘర్షణలను వెతలను గుర్తించి రాసినట్లుగా కనిపిస్తుంది.

రచయిత చందు తులసి రచించిన మరొక కథ ‘నీళ్ళ బిందె’. ఇందులో సైది సూర్యాపేట తండా కు చెందినది. పట్టణంలో ఉంటున్న మేఘాకు ఇచ్చి పెళ్లి చేస్తే సుఖపడుతుందనుకొని పెళ్లి చేసి పంపిస్తారు తల్లిదండ్రులు. కానీ అక్కడ వారు అనుకున్న సుఖం కంటే కష్టాలే ఎక్కువ పడుతుంది. అమాయకంగా రెండు బిందెల నీళ్ల కోసం ప్రతి రోజు ఇంటింటికి తిరుగుతూ బాధలు అనుభవిస్తూ చివరకు ఒకరోజు నీళ్ల కోసం వెళ్లినప్పుడు, ఒకడు ఆమెను బలాత్కారం చేయబోతాడు. అది ఎవరికీ చెప్పుకోలేక ,ఇటు మద్యానికి బానిసైన భర్త తీరును భరిస్తూ దిగమింగుతూ, ప్రతిరోజు యుద్ధం చేస్తూ ఉంటుంది. సామాజికంగా సమాజంలో జరుగుతున్న సంఘటనలే. గిరిజన తండా నుండి వలస పోయిన బతుకుల కష్టాలను, అమాయకపు గిరిజన స్త్రీలను కాటేసే విష నాగుల క్రూరత్వంలో బతుకుతున్న జీవితాన్ని చిత్రించారు రచయిత.

మేడి చైతన్య రచించిన ‘సాయిబొళ్ల పిల్ల’ కథలో నిరుపేద అయిన సాయిబు గోరికి ముగ్గురు పిల్లలు. అందులో చిన్నమ్మాయికి రెండో పెళ్లి సంబంధం వాడికిచ్చి పెళ్లి చేద్దామని అనుకున్న తరుణంలో అదే గూడెం లో ఉంటున్న సూదరోడు హనుమంతుకు, అంతకు ముందే పిన్నం పరిచయం ఉండటంతో తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటాడు. ఇక మత పెద్దలు సూదరోడితో లేచి పోయిందని, సాయిబ్ గోరిని ఆ గ్రామం నుండి వెలి వేస్తారు. పెళ్లి చేసుకుని సుఖంగా ఉండాలనుకున్న పిన్నం అంతకంటే ఎక్కువ కష్టపడుతుంది. ఇంట్లో ఆమె పై అత్త అరాచకం, హనుమంతు ఆమెను పట్టించుకోకపోవడం నరకం అనుభవిస్తూ ఉంటుంది. ఇందులో రచయిత కులాంతర, మతాంతర పెళ్లిళ్లు చేసుకుంటే కలిగే మానసిక సంఘర్షణను చిత్రించడం కనిపిస్తుంది. సమాజంలో మార్పు రానంతవరకు వరకు పిన్నం లాంటి అభాగ్యుల జీవితాలు ఎలా ఉంటాయో ఈ కథలో చూడవచ్చు.

ఇట్లా రివాజు కథల సంపుటిలోని మిగతా కథలైన కొట్ట రామకృష్ణారెడ్డి గారు రచించిన యాత్ర, డాక్టర్ వంశీధర్ రెడ్డి గారు రచించిన అవుటర్ రింగ్ రోడ్డు, పూడూరి రాజిరెడ్డి గారు రచించిన రెండో భాగం, కటుకోఝ్వుల మనోహరా చారి గారు రచించిన దూర తీరాలు, వి. మల్లికార్జున గారు రచించిన అర్బనూరు, కథలన్నింటిలో స్పృశించిన వస్తువు రచయితలు సామాజిక స్పృహతో తెలంగాణ సమాజంలోని విభిన్న పార్శ్వాల సామాజిక సంఘర్షణలను, వాస్తవిక కోణంతో స్వీకరించి కథారూపంలో ఆవిష్కరించి చూపినారు. రివాజు కథల్లోని సామాజిక జీవన చిత్రణ ఎక్కడో ఒక దగ్గర సమాజంలో జరుగుతున్న సామాజిక అంశాలే. వాటిని కథా సాహిత్యంలో పొందుపరచడం వల్ల సమాజానికి ఒక ప్రయోజనకరమైన చైతన్యాన్ని కలిగించినట్లు అవుతుంది. ఇందులోని కథలన్నీ సమాజం చుట్టూ, వ్యక్తుల చుట్టూ, వివిధ రకాల భావ సంఘర్షణల చుట్టూ అల్లుకున్నవే. వీటన్నింటిని రచయితలు తమ రచనానైపుణ్యంతో సామాజిక ప్రయోజనాన్ని ఆశించి, సామాజిక దృక్పథంతో రచించడం విశేషంగా చెప్పుకోవచ్చు.

పుట్టింది వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండల కేంద్రం. పద్మశాలి ఆశ్రిత కులాల సాహిత్యం పై కాకతీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో పరిశోధన చేసి, సిద్ధాంత గ్రంథాన్ని ప్రచురించాడు. తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞాన పీఠం వరంగల్లు కేంద్రంలో ప్రాజెక్ట్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తూ, పీఠం ప్రచురించిన పరిశోధనాత్మక గ్రంధాల్లో సహ సంపాదకులుగా, సంపాదక మండలి సభ్యులుగా వ్యవహరించాడు. జానపద గిరిజన విజ్ఞాన అధ్యయనంపై పలు పత్రికల్లో వ్యాసాలు రాశాడు.

Leave a Reply