రావిశాస్త్రి శతజయంతి సభలో దివికుమార్ ప్రసంగం

రావిశాస్త్రి మొదట్నుంచి మార్క్సిస్టు కాదు. పుట్టుకతో ఎవరూ మార్క్సిస్టు కాలేరు కదా. ఒక పరిణామ క్రమంలో ఆ మార్పు సంభవించింది.

తన 13 వ ఏట నుంచి ఆయన రచనలు సాగిస్తున్నారు. 1935 నుంచి కూడా ఆయన రచనలు చేస్తున్నా, 1953లో రావిశాస్త్రి గారు అల్పజీవి నవల రాసిన దగ్గర్నుంచి సామాజిక చింతనతో కూడిన సాహిత్య సృష్టి చేశారు. న్యాయవ్యవస్థ పోలీసు వ్యవస్థ ప్రజలను కాపాడుతుందని మొదట్లో రావిశాస్త్రి గారు కూడా బలంగా నమ్మారు. ఇదంతా కొద్దిమంది సంపన్న వర్గాల్ని, ఆధిపత్య శక్తులను, పెత్తందారి వర్గాలను కాపాడే వ్యవస్థ అని ఒక ఖచ్చితమైన అభిప్రాయానికి వచ్చిన తర్వాత, న్యాయవ్యవస్థ మీద ఆయనంత ఎక్కువగా శతఘ్నుల్ని పేల్చినవారు మరొక రచయిత లేరు.

రావిశాస్త్రి గారు చెప్పినట్లు పేద ప్రజలను, అలగా జనాన్ని కాపాడలేని రాజ్యాంగాన్ని మనం కాపాడుకోవాలి అని చెప్తున్న మన మిత్రులను ఒకటి అడుగుతాను. న్యాయవ్యవస్థ రాజ్యాంగంలో భాగమా? కాదా? అట్లానే పోలీసు వ్యవస్థ లేకుండా న్యాయ వ్యవస్థ లేదు కదా! సివిల్ కేసులో తప్పితే మిగతా వాటిల్లో పోలీస్ స్టేషన్లో నమోదయిన తర్వాతే న్యాయస్థానానికి వెళ్ళేది. ఎఫ్. ఐ. ఆర్. రాసిన తర్వాత న్యాయ ప్రక్రియ మొదలవుతుంది, కాబట్టి పోలీస్ వ్యవస్థ కూడా ఈ న్యాయ ప్రక్రియలో భాగం. ఇంతకూ ఈ పోలీసు, న్యాయ వ్యవస్థలను ఎవరు ఎప్పుడు ఏర్పాటు చేశారు? ఎవరి కోసం ఏర్పాటు చేశారనే లోతుల్లోకి వెళ్ళి చారిత్రక దృష్టికోణంలో ఆలోచించకుండా, వ్యవస్తలన్నీ పవిత్రమైనవని, పోలీస్ వ్యవస్థ సాధారణ ప్రజలను రక్షించేందుకే ఉన్నదని అనుకోవటం భ్రమ.

ఈస్ట్ ఇండియా కంపెనీ వారి విద్యావ్యవస్థలో ప్రముఖడైన బ్రిటిష్ అధికారి లార్డ్ మెకాలేనే న్యాయవ్యవస్థ రూపకల్పనలో కూడ ముఖ్యమైన పాత్ర వహించారు. ఇప్పుడు అమలులో ఉన్న అత్యధిక చట్టాలు బ్రిటిష్ కాలంలో ఏర్పడినవే. అందువల్లనే crpc లోని 144వ సెక్షన్ పాకిస్తాన్లో కూడా ఉంటుంది. ఈ యంత్రాంగం అంతా బ్రిటిష్ వారు పెట్టిన భిక్ష. అప్పటి నుంచి ఇప్పటి ఆజాదీ కా అమృత మహోత్సవం వరకు, పాలకులు వాటిని కాపాడుకుంటూ వస్తున్నారు . జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో ఐ.సి.ఎస్. (ఇండియన్ సివిల్ సర్వీస్) అనే బ్యూరోక్రసీ వ్యవస్థ గురించి ఇలా రాశారు. “ఐ.సి.ఎస్. నిరంకుశ అధికార వ్యవస్థను రద్దు చేసుకోకుండా మనకు లభించేది స్వాతంత్రం అనటానికి వీలు లేదు.” అప్పటి ఐ.సి.యస్. నుండి పుట్టిన ఈనాటి అధికార వ్యవస్థ, ఎంతెంత పెరిగిపోయిందో చూడండి. దీని మూలాలు ఎక్కడ ఉన్నాయి? ఇదంతా కూడా బ్రిటిష్ వలస రాజ్యపు వారసత్వం కొనసాగింపు మాత్రమే! ఇలాంటి న్యాయవ్యవస్థ, పోలీసు వ్యవస్థ మీద రావి శాస్త్రి గారు శతఘ్నులే సంధించారు.

ఆ రకంగా ఇవి ప్రజావ్యతిరేక వ్యవస్థలుగా గుర్తించాల్సిన అవసరం ఉంది. ఈ ప్రజా వ్యతిరేక వ్యవస్థల ద్వారా పరిపాలించే పాలకులు ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా నిలబెడతారు? నిజం చెప్పాలంటే ఈ పాలకుల కొరకే వారు ఏర్పరచుకున్న వ్యవస్థలు ఉన్నాయి కానీ ప్రజల కొరకు కాదు! ఈ విషయాన్నే రావి శాస్త్రి గారు తమ రచనల ద్వారా చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయాన్ని “నిజం” నాటకం ద్వారా కూడా తెలియజేశారు.

అత్తిలి కృష్ణారావు, ఎ.ఆర్. కృష్ణ, చాట్ల శ్రీరాములు లాంటి ప్రముఖ నటులు ప్రయోక్తలు ఈ ‘నిజం’ నాటకాన్ని ప్రదర్శించారు. ఈ నాటకంలో వ్యవస్థ మౌలిక తత్వాన్ని రావి శాస్త్రి గారు విస్పష్టంగా దృశ్యమానం చేశారు. సాధారణంగా నాటకంలో కోర్టు సీన్లు నడపడం, మెప్పించడం కష్టం, ప్రేక్షకులను కూర్చోబెట్టడం కూడా కష్టమే అయినా కూడా ఆరు అంకాలలో రెండు పూర్తి అంకాలు ప్రత్యేకంగా కోర్టు దృశ్యాలతోనే ఉన్నాయి. అందులో ప్రాసిక్యూషన్ లాయరుగా రావిశాస్త్రి గారే నటించేవారు అని చెప్పారు. ఆయన మంచి నటుడు కూడాను.

ఇవన్నీ చెప్తుంటే ఒక చిన్న జ్ఞాపకాన్ని మీ దృష్టికి తీసుకు రావాలనిపిస్తోంది. అది నేను రావిశాస్త్రి గారిని మొదటిసారిగా చూసిన సందర్భం. అది 1970 వ సంవత్సరం అక్టోబర్ నెల. అప్పుడు నేను కాకినాడలో ఉన్నాను. ఖమ్మంలో విప్లవ రచయితల సంఘం (విరసం) మొదటి మహాసభలు జరుగుతున్నాయి. ఆ సభల కొరకు నేను కాకినాడ నుండి బయలుదేరాను. అప్పుడు కాకినాడ , విశాఖపట్టణాల నుండి హైదరాబాదుకి నేరుగా రైలు ప్రయాణాలు లేక పోవడం చేత బెజవాడలో దిగి మరొక బండి కొరకు ఎదురు చూసి, కొత్తగా ప్రారంభమైన గోల్కొండ ఎక్స్ ప్రెస్ రైలు బండిలో ప్రయాణం చేశాం. బెజవాడలో కలిసిన కొంతమంది మిత్రులతో ప్రయాణం మొదలు పెట్టాం. సీట్లు దొరకక పోవడం చేత నిలబడే మాట్లాడుకుంటూ ప్రయాణం చేస్తున్నాం. మా పక్కనే ఒకాయన నిలబడి ఉన్నాడు. మేము మొదట ఆయన్ని గమనించలేదు. ఇంతలో బక్కపల్చటి పెద్దాయన వచ్చి “శాస్త్రిగారు ఏంటిది కూర్చోకుండా, ఎంతసేపు నిలబడతారు” అని స్నేహపూర్వకంగా హెచ్చరించాడు. బెజవాడలో రైలు ఎక్కిన వార్డులో మాతో పాటు సివి గారు కూడా ఉన్నారు. ఆయన రావిశాస్త్రి గారిని గుర్తు పట్టి “రావిశాస్త్రి గారా?”అని అడిగారు. వారిద్దరూ అప్పటికే ‘జనశక్తి’ పత్రికలో రాస్తూ ఉన్నారు. అయితే అదే మొదటి ప్రత్యక్ష పరిచయం.

విరసం మొదటి మహాసభలో రెండవ రోజు ఒక చర్చ జరిగింది. ఆ చర్చలో రావిశాస్త్రి గారు లాయర్ తరహా వాదన ఒకటి చేశారు. ఆనాటి చర్చకు తార్కికమైన జవాబు రావిశాస్త్రి గారు చెప్పారు. ఆ చర్చ ఏమిటంటే విప్లవ రచయితలు ప్రజల యొక్క ఏ తరహా పోరాటాలను బలపరచాలి? సాధారణ ఉద్యమాలను అన్నిటినీ బలపరచాలా? సాయుధ పోరాటాలను బలపరచాలా? తిరుగుబాట్లను బలపరచాలా? దీర్ఘకాలిక సాయుధ పోరాటాలను బలపరచాలా? ఇలా… దీర్ఘకాలిక సాయుధ పోరాటాలను మాత్రమే బలపరచాలని ఒక వాదన ముందుకు వచ్చింది. ఆ చర్చలో కొడవటిగంటి కుటుంబరావు గారు మాట్లాడారు, కె.వి. రమణారెడ్డి గారు మాట్లాడారు. రావి శాస్త్రి గారు కూడా మాట్లాడారు. రావి శాస్త్రి గారు ఏం మాట్లాడారు అనేది ప్రస్తుత విషయం.

ఆయన ముందుగా పాత సంఘటన ఒకటి చెప్పారు. ఒక ఆల్ ఇండియా కాంగ్రెస్ సమావేశంలో, ఖాళీగా ఉన్న సమయంలో, పిచ్చాపాటి మాట్లాడుకుంటూ గాంధీ గారు ఒక మాట అన్నారట. “అంతటి శ్రీ మహావిష్ణువు, సర్వశక్తి సంపన్నుడైన వాడు హిరణ్యకశిపున్ని ఘోరంగా, హింసాత్మకంగా అంత రక్తపాతం తోటి చంపుతాడా? సమస్త శక్తులను తనలో కలిగి ఉన్నవాడు మామూలుగా చంపవచ్చు కదా?” అని! అప్పుడు వెంటనే దుగ్గిరాల గోపాలకృష్ణయ్య గారు “మరి వాడు కోరిన కోరికలు ఎట్లా ఉన్నాయి?” అని అన్నారట. హిరణ్య కశిపుని కోరికలు ఎట్లా ఉన్నాయి – మనిషి చంపలేడు, మృగము చంపలేదు, పగలు చంపకూడదు, రాత్రి మరణం.. రాదు, ఆయుధముతో చంపలేరు. ఇట్లాంటి వరాలు హిరణ్యకశిపుడు పొందాడు. దాంతోటి ఆ నరసింహస్వామి పగలు రాత్రి కాకుండా సంధ్యాసమయంలో కూర్చుని అటు నరుడు కాకుండా మృగమూ కాకుండా, నరుడు – సింహం కలగలిపి, ప్రత్యేక ఆయుధాలు లేకుండా గోళ్లతో రక్కి, చంపేశాడని కథ. దీనిని రావి శాస్త్రి గారు ఎలా మలిచారంటే… వాడు అంటే శత్రువు ఎట్లా వస్తాడో, ఏ రకమైన పద్ధతిలో దాడి చేస్తాడో దాన్నిబట్టి మన పోరాట రూపం ఉండాలి. మన మీద అణచివేత ప్రదర్శించేవాడు, దుర్మార్గాలను సాగించేవాడు, ఏ రూపంలో వస్తాడో దాన్నిబట్టి మన పోరాటం నిర్ణయం అవుతుంది తప్ప ముందుగానే మనం ఒక నిర్ణయానికి రావటానికి వీల్లేదు అని రావిశాస్త్రి గారు యుక్తి జవాబు ఇచ్చారు. ఒక అరుదైన సంఘటన, యుక్తాయుక్త విచక్షణతో కూడిన మాట కనుక మీ దృష్టికి తెచ్చాను.

ఆయన కథలు, నవలలు, నాటకాలు, వ్యాసాలు కూడా చాలా రాశారు. ఆయన షష్టిపూర్తి సందర్భంగా సరిగ్గా 40 ఏళ్ల క్రితం ఒక పుస్తకం తీసుకొచ్చారు. ఆ పుస్తకం పేరు జూలై 30. ఆ సంవత్సరం 1982 అంటే అప్పటికి ఆయనకు 60 ఏళ్ళు దాటింది. ఆ పుస్తకానికి రావిశాస్త్రీయం అని పేరు పెట్టారు. అది ఆయన వ్యాసాల సంకలనం కూడా!! ఆ సంకలనాలపై ప్రజాసాహితిలో ఆ సంవత్సరమే ఒక సమీక్ష కూడా వచ్చింది.

ఆయన రచనల పరిణామం చూసుకుంటే చాలామంది ఏమంటున్నారంటే “అరసం ఎక్కడ ఆగిపోయిందో రావిశాస్త్రి అక్కడ మొదలుపెట్టాడు” అని. దాన్ని మరింత స్పష్టం చేసుకోవడం అవసరం అని నా అభిప్రాయం. 1953 కే అరసం చురుకుగా ఉన్న రోజుల్లోనే అల్పజీవి రాశారాయన. అయినా ఆగిపోవడం అంటే ఏమిటి? అభ్యుదయ రచయితల సంఘం (అరసం) ఆగిపోవటం అంటే ఏమిటి? ఏ విధంగా అట్లా అనగలుగుతాం? ఆ కాలంలో సాహిత్యం రాలేదా? నవలలు రాలేదా? కొడవటిగంటి కుటుంబరావు గారి కథలు రాలేదా? పుస్తకాలు రాలేదా? విశాలాంధ్రలో రాస్తూనే ఉన్నారు కదా? సివి రాస్తూనే ఉన్నాడు కదా? అంటే అరసం రచయితల సాహిత్యం ఆగలేదు. అభ్యుదయ పత్రిక ఆగింది. అరసం సంస్థాగతంగా చేస్తున్న నిర్మాణాత్మక కృషి ఆగిపోయింది అని అర్థం చేసుకోవాలి. అభ్యుదయ రచయితలు ఆగిపోలేదు. తమ సాహిత్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తమ రచనలను సాగిస్తూనే ఉన్నారు. అభ్యుదయ దృక్పథం అనేది సామాజిక సంఘర్షణలో భాగంగా అభివృద్ధి చెందుతూనే ఉంది. అందులో భాగంగా మనం రావిశాస్త్రి గారిని చూడాలి.

1960 దశకంలోకి వచ్చేటప్పటికి సరిగ్గా అప్పటికి ఆయనకి 40 ఏళ్ళ వయస్సు. ఆయన సామాజిక దృక్పథం కూడా పరిపక్వతకు, పరిణతకు వచ్చింది. ఆయన విరాట్ స్వరూపం అప్పటినుంచి చూస్తాం. నిజం నాటకం 1961లో రాసింది. ఇంకో రెండు నాటకాలు కూడా ఉన్నాయి. తిరస్క్రుతి, విషాదం. ఇవి కాకుండా ఆయన అంతకు ముందు రాసిన కథలు, తర్వాత రాసిన కథలు కూడా జాగ్రత్తగా గమనించాలి. నిశిత పరిశీలన ఉండటం వేరు, ఒక దృక్పథాన్ని ప్రదర్శించడం వేరు. తర్వాత కాలంలో ఒక దృక్పధాన్ని ప్రదర్శించే కథలు రాయడం పెరుగుతూ వచ్చింది.

ఇప్పుడు ఆజాదీకా అమృత మహోత్సవం అంటున్నారు. అయితే స్వాతంత్రం వచ్చేనాటికి ఆయన వయస్సు సరిగ్గా పాతికేళ్ల వయసు. చాలామంది వలె కాంగ్రెస్ పాలకుల పట్ల గాని, గాంధీయిజం పట్ల మీద గాని ఆయనకు వెర్రి ఆకర్షణ కలగ లేదు. కానీ ప్రత్యామ్నాయ ఉద్యమాలు, వామపక్ష భావాలవైపు ఆకర్షితులయ్యారు. మార్క్సిస్ట్ సిద్ధాంత పరిజ్ఞానం, అధ్యయనం ప్రత్యేకంగా ఆయన చేయలేదు. ఆ మాట ఆయనే స్వయంగా చెప్పాడు. “మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలు చదివి రాయలేదు నేను. స్థూలంగా తెలుసు నాకు. సాహిత్యం ద్వారానే, సమాజాన్ని అధ్యయనం చేయడం ద్వారానే నేను మార్క్సిస్టు సిద్ధాంతం గురించి తెలుసుకున్నాను” అని ఆయనే తెలియజేశారు.

ఆయన పరిణామ క్రమంలో ఈ దశలన్నీ మనం జాగ్రత్తగా గమనించాలి. నక్సల్ బరీ పోరాటం, శ్రీకాకుళం పోరాటం వచ్చిన తర్వాత ఆయన కచ్చితంగా అటువైపు మొగ్గు తీసుకున్నాడు. విప్లవం వైపు ఆయన మొగ్గు చూపించారు. పిపీలికము లాంటి కథల చదివితే మనకు బోధపడుతుంది. నిజం చెప్పాలంటే ప్రపంచ సాహిత్యంలోనే నిలబడగలిగే గొప్ప కథ పిపీలకం. అందులో చాలా తాత్విక చర్చ చేస్తాడు ఆయన. జీవాత్మ, పరమాత్మ తాత్విక చర్చ చేస్తాడు. సమాజంలోని ఉన్నవాడు, లేనివాడు చర్చ చేస్తాడు. పెద్ద కులాలు, చిన్న కులాలు గురించి చర్చ చేస్తాడు. ఉన్నవాడి అహంకారం ఎట్లా ఉంటుందో చూపిస్తాడు. చివరికి
“బలవంతుడ నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుటమేలా,
బలవంతమైన సర్పము
చలిచీమల చేత జిక్కి చావదె సుమతీ! ” అని చిన్నప్పుడు మనము సుమతి శతకంలో చదువుకున్న దాన్ని ఆయన పిపీలికంలో చూపెట్టారు. పీపీలకం అంటే చిట్టి చీమ. ఆ పిపీలకం నాటిక రూపంలో వచ్చింది. సినిమా రూపంలోకి వెళ్లింది.

స్థూలంగా ఆయన సాహిత్య దృక్పథంలో వర్గతత్వం ఉంది. మనం ప్రధానంగా చెప్పవలసింది కలిగిన వాడికి – లేని వాడికి మధ్య ఉండే వర్గ వైరుధ్యం ఎలా ఉంటుంది ఎంత తీవ్రంగా ఉంటుంది అనే విషయం. ఒక కథ రాయమని విశాఖపట్నం వాళ్లు అడిగారట. అదేమిటంటే… ఒక అమ్మాయిని ధనవంతుడు ప్రేమిస్తాడు. పేదవాడు కూడా ప్రేమిస్తాడు. అలాంటి సందర్భం ఎట్లా ఉంటుంది? కలకంఠి అనే కథను చదివితే అర్థమవుతుంది. వాళ్లు ఇచ్చిన ఒక సందర్భానికి రావి శాస్త్రి గారు రాసినదే ఈ కథ.

చాలామంది సర్వసాధారణంగా ఇలా అనుకుంటూ ఉంటారు. “ఛీఛీ ఇంతకంటే దారుణం మరొకటి ఉండదు. మొత్తం నాశనం చేసి పారేస్తున్నారు. పరిస్థితులు చాలా అసహ్యంగా ఉన్నాయి. ఏదో అంతానికే వచ్చింది. యుగాంతంలో ఉన్నాము మనం.” అని అనుకునే వారిని చాలామందిని చూస్తుంటాం. ఆయన ముందు అలాంటి భావం కలిగించినప్పుడు ఆయన ఒక కథ రాశాడు. మహాభారత కాలం నాటి ఏవో రెండు పాత్రల నడుమ చర్చ, బుద్ధుడు కాలం నాటి రెండు పాత్రలు… వాటి నడుమ చర్చ, బ్రిటిష్ కాలం నాటి ఇంకేదో పాత్రల చర్చ, వర్తమానంలోని మరో చర్చ; “వీళ్లు ఇట్లా మాట్లాడుకుంటూనే ఉన్నారు ప్రపంచం సాగుతూనే ఉంది” అని యుగాంతం అనే కథను ముగిస్తారు . ప్రపంచం ఎక్కడా ఆగలేదు సాగుతూనే ఉందని రాశారు. ప్రతి కథలోనూ ఇలా ఏదో మనకు కనపడని సందేశం, చురుక్కుమనిపించే ముక్తాయింపు అలా ఏదో ఒకటి ఉంటుంది. మనం మామూలుగా చదువుకుంటూ వెళతాం. చివరికి వచ్చేసరికి ఒక మెరుపు లాంటి ఆలోచన మనకు ఇస్తాడు ఆయన. పాఠకుడిని విపరీతంగా ఆలోచింపజేసే, స్పందింపజేసే, ఆవేశపరిచే, ఆచరణకు దారి తీసే అసమాన సాహిత్యాన్ని సృష్టించిన మహా రచయిత రావిశాస్త్రి!

1971 నేను ఒంగోలులో ఉంటున్నాను. ఉపాధ్యాయులు, ఉద్యోగస్తులు 56 రోజుల సమ్మె చేశారు. అప్పుడు రావిశాస్త్రి గారి ‘వేతన శర్మ’ అనే కథ వచ్చింది. ఈ కథ సమ్మె జరిగే 44 వ రోజున వచ్చింది. నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని అయినప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమావేశాలకు వెళుతుండేవాడిని. ఆ వేతనశర్మ కథ అప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది. కాస్త ఆలస్యంగా అయినా ఆ కథపై నేను విమర్శనాత్మకంగా రాశాను. సమ్మె భవిష్యత్తుపై ఉద్యోగ ఉపాధ్యాయులు చాలా ఆందోళనలో ఉన్న సమయంలో అట్లా రాయకూడదు కదా అని నేను అభిప్రాయపడ్డాను. ఉద్యమ సమయంలో ఉద్యమంలో ఉన్న వాళ్లను ఎద్దేవా చేస్తూ రాయటం సరియైనది కాదని, అది ఉద్యమ దృష్టి లేకపోవటం అవుతుందని, ఉద్యమానికి ఊతం ఇచ్చేటట్లు ఉండాలే తప్ప ఉద్యమకారుల పట్ల ప్రజలలో లేక పాఠకులలో ఆ సమయంలో తేలిక భావం కలిగించకూడదు అని నా భావన. “పిడికెడు పిడికెడు జీతాలు అడుగుతారు, మీకు, ప్రభుత్వం ఇచ్చే చిటికెడు వాటికి లొంగిపోతారు” అని ఆ కథలో రాశారు. ఇంకో సమయంలో అలాంటివి రాయచ్చునేమో గానీ ఆ సందర్భంలో, ముఖ్యంగా సమ్మె ఉధృతంగా జరుగుతున్నప్పుడు రాయకూడదు. పోలీస్ కాల్పుల్లో ఆ రోజుల్లోనే ఇద్దరు తిరుపతిలో చనిపోయారు. ఉద్యమ దృష్టి తగినంతగా లేకపోవడం వల్లే అలా జరిగి ఉంటుంది. మామూలుగా రచయితలకు భావోద్వేగాలు ఉన్నంతగా ఉద్యమ దృష్టి పెద్దగా ఉండదు.

ఏది ఏమైనా మొత్తంగా చూసినప్పుడు ఆయన సృజించిన సాహిత్యం చాలా గొప్పది. రాజు మహిషి, రత్తాలు రాంబాబు అనే రెండు నవలలు వచ్చాయి. అవి అసంపూర్ణ నవలలు. వాటిని పూర్తి చెయ్యను అని కూడా ఆయన చెప్పేశారు. ఆయన ఇంకో ప్రసిద్ధ నవల అల్పజీవి. తెలుగు సాహిత్యంలో అల్పజీవి నవల కంటే ముందు అలాంటి నవలలు రెండు ప్రసిద్ధి చెందినవి ఉన్నాయి. బుచ్చిబాబు గారి “చివరకు మిగిలేది”, త్రిపురనేని గోపీచంద్ రాసిన”అసమర్థుని జీవయాత్ర”. ఈ మూడు నవలలను పోల్చి చూసే వాళ్ళు ఉన్నారు. దేని ప్రత్యేకతలు, దేని విశిష్టతలు వాటికి ఉన్నాయి. రావి శాస్త్రి గారు 1953 , ఆ కాలం నాటి మధ్యతరగతి మనుషుల అల్పత్వం ఎలా ఉంటుంది? పిరికితనం ఎలా ఉంటుంది? అనేది రాశారు. అక్కడ నుంచి ‘మరిడీ మహాలక్ష్మి’ దాకా వెళ్లారు. ఆ నవల ఒక్కదానికే మూడు పేర్లు ఉన్నాయి “గోవులొస్తున్నాయి జాగ్రత్త, మరిడి మహాలక్ష్మి కథ అనే గుర్రపు కళ్ళెం”. ఈ పేర్లు ఎందుకు వచ్చాయంటే శ్రీశ్రీ ఋక్కులు అనే ఒక కవిత రాశాడు. అగ్గిపుల్ల , కుక్కపిల్ల, సబ్బు బిళ్ళ; హీనంగా చూడకుదేన్నీ, రొట్టె ముక్క, అరటితొక్క, బల్లచెక్క; తలుపు గొళ్ళెం, హారతి పళ్ళెం, గుర్రపు కళ్ళెం… కాదేది కవిత కనర్హం అంటూ!! పై వాటిలో మొదటి ఎనిమిదింటి శీర్షికలతో రావిశాస్త్రి కథలు రాశాడు. చివరి దాన్ని గురించి నవల రాశాడు. అదే గోవులొస్తున్నాయి జాగ్రత్త. దాన్ని చదివితే ఆ నవల మనల్ని కలచివేస్తుంది, చాలా తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. ఆవేశపరుస్తుంది. నిజానికి ఆయన కధలన్నీ అట్లానే ఉంటాయి.

చాలామంది విమర్శకులు ఏమంటున్నారంటే ఆయన కథలలో శిల్పం బాగుంటుంది వస్తువు కంటే అని! కానీ అందులో మనం జాగ్రత్తగా గమనిస్తే వస్తువుని మనకి బలంగా మనసుకు హత్తుకునేటట్లు చేయడానికి ఆయన తన అద్భుతమైన శిల్ప చాతుర్యాన్ని ప్రదర్శించారు. ఆయన “ఇల్లు” నవల చైనా, రష్యా భాషల్లోకి అనువాదం అయిందని అంటున్నారు. అట్లా ఇతర దేశీయ ప్రపంచ భాషల్లోకి కూడా ఈయన సాహిత్యం వెళ్ళగలిగితే ప్రపంచంలో గొప్ప కథకులలో, గొప్ప రచయితలలో ఒకడుగా నిలవగలిగినంతటి వాడు రాచకొండ విశ్వనాథ శాస్త్రి గారు అని తెలియజేస్తూ, వారి శతజయంతి సందర్భంగా వారికి నివాళి అర్పిస్తూ, వారి సాహిత్యాన్ని కొత్త తరాలకు అందించవలసిన కర్తవ్యం మన మీద ఉందని గుర్తు చేస్తూ సెలవు తీసుకుంటాను.

Leave a Reply