రాయబడని కావ్యం

రాస్తూ రాస్తుండగానే నా
కావ్యం అపహరణకు గురయ్యింది
అలుక్కపోయిన అక్షరాలు
కనిపించకుండా ఎలబారిపోయాయి…

చేతి వ్రేళ్ళ నడుమ కలం
ఎందుకో గింజుకుంటూంది
రాయబడని కావ్యం నేనూ
ఒక్కటిగా దుఃఖంలో…

సిరాలేని ఖాళీ కలంలో
డొల్ల డొల్లగా భావగీతం
కాగితపు పడవలా తేలిపోతూ
రాస్తుండగానే మునిగిపోయిన కావ్యం..

ఈదురుగాలి కలాన్ని ఈడ్చుకుపోయింది
ఇక చాల్లేని ఎవరో బెదిరించినట్లు
ధారలైన కన్నీరు గడ్డకట్టింది
నిర్జీవిగా నీటతేలుతూ నా కవితా పక్షి!

గాయపర్చిన ఈ గాయాన్నే
మళ్ళీ మళ్ళీ కుళ్ళబొడుస్తూ
పుట్టకముందే నా కవితను
కానరాకుండా కబళిస్తుంటే..

రక్తపుటేరై పారుతూ నేను..!
రక్తపుష్పమై తేలుతూ కావ్యం..!

పుట్టింది వ‌రంగ‌ల్ జిల్లా హ‌న్మ‌కొండ‌. క‌వి, ర‌చ‌యిత‌. విద్యాభ్యాసం వ‌రంగ‌ల్‌లో. బాల్యం నుంచే సాహిత్య‌- ఉద్య‌మాల ఆస‌క్తితో నాటి 'జై తెలంగాణ' ఉద్య‌మం మొద‌లు, మొన్న‌టి ప్ర‌త్యేక తెలంగాణ ఉద్య‌మం వ‌ర‌కు వివిధ సాహిత్య, ప్ర‌జా సంఘాలు, ప్ర‌జాస్వామిక‌ ఉద్య‌మాల‌తో మ‌మేక‌మ‌వుతున్నారు. 12 స్వీయ ర‌చ‌న‌ల గ్రంథాలు, 18 కు పైగా వివిధ సంక‌ల‌నాల‌కు సంపాద‌క‌త్వం వ‌హించారు. 'రుద్రమ ప్రచురణలు' 2012 నుండి నిర్వహిస్తున్నారు. గత దశాబ్ద కాలంగా 'ప్ర‌జాస్వామిక ర‌చ‌యిత్రుల వేదిక' లో వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

One thought on “రాయబడని కావ్యం

  1. పుట్టక ముందే నా కవిత ను కానరాకుండా కబళిస్తుంటే

Leave a Reply